కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను సజావుగా సమన్వయం చేయడం ద్వారా ముందుచూపుతో కూడిన పాలన అందించడం – సకాలంలో పనులను పూర్తి చేయడం లక్ష్యంగా ఏర్పాటైన ఐసీటీ ఆధారితమల్టీ-మోడల్ వేదిక ‘ప్రగతి’ 48వ సమావేశం ఈరోజు ఉదయం సౌత్ బ్లాకులో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
గనులు, రైల్వేలు, జలవనరుల శాఖలకు సంబంధించిన పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. కాలపరిమితులు, సంస్థల మధ్య సమన్వయం, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. ఆర్థికవృద్ధికీ, ప్రజా సంక్షేమానికీ కీలకమైన ఈ ప్రాజెక్టుల పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు.
ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల ఆర్థిక వ్యయం పెరగడం, పౌరులకు అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలు సకాలంలో లభించకపోవడం వంటి రెండు నష్టాలు ఉంటాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అవకాశాలను జీవితాలను మెరుగుపరిచేవిగా మార్చుకునేందుకు ఫలితాల ఆధారిత విధానాన్ని అవలంబించాలని కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులను ఆయన కోరారు.
ప్రధానమంత్రి-ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పీఎమ్-ఏబీహెచ్ఐఎమ్) గురించిన సమీక్ష సందర్భంగా..అన్ని రాష్ట్రాలు ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలనీ, ఆకాంక్షాత్మక జిల్లాలు, మారుమూల, గిరిజన, సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధానమంత్రి కోరారు. పేదలు, అణగారిన, వెనుకబడిన జనాభా కోసం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందరితో సమానంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతాల్లో కీలకమైన ఆరోగ్య సేవల్లో ఉన్న అంతరాలను తగ్గించడం కోసం అవసరమైన తక్షణ, నిరంతర ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాలు తమ ప్రాథమిక, తృతీయ, ప్రత్యేక ఆరోగ్య మౌలిక సదుపాయాలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో బలోపేతం చేసుకోవడానికి.. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను, సేవలను అందించడానికి పీఎమ్-ఏబీహెచ్ఐఎమ్ ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని పెంపొందించడంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన ఆదర్శప్రాయమైన పద్ధతులను ప్రధానమంత్రి సమీక్షించారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఆవిష్కరణలను ప్రోత్సహించే సామర్థ్యం గలవిగా ఈ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. వాటి విస్తృత ఔచిత్యాన్ని వివరిస్తూ..పూర్తి స్వదేశీ సామర్థ్యాలతో అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ విజయం రక్షణ రంగంలో భారత్ స్వయంసమృద్ధికి శక్తిమంతమైన నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఊతమివ్వడానికి రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రధానమంత్రి వివరించారు.
Chaired the 48th PRAGATI Session earlier this evening. Infrastructure was a key focus, with sectors like mines, railways and water resources being discussed. Reiterated the need for timely completion of projects. Also discussed aspects relating to Prime Minister-Ayushman Bharat…
— Narendra Modi (@narendramodi) June 25, 2025


