· “యావత్‌ ప్రపంచం నేడు భారత్‌ వైపు దృష్టి సారించింది”
· “భారత యువత వేగంగా నైపుణ్యం సాధిస్తూ ఆవిష్కరణలకు సారథ్యం వహిస్తోంది”
· “భారత విదేశాంగ విధానానికి ‘ఇండియా ఫస్ట్’ అన్నది నేటి తారకమంత్రం”
· “భారత్‌ నేడు ప్రపంచ క్రమంలో భాగస్వామి కావడమేగాక భవిష్యత్తుకు రూపమిచ్చేందుకు.. భద్రత కల్పించేందుకు దోహదపడుతోంది”
· “భారత్‌ ఏకస్వామ్యానికి బదులుగా మానవత్వానికి ప్రాధాన్యమిస్తోంది”
· “భారత్‌ ఇప్పుడు కలలగనే దేశం మాత్రమే కాదు... వాటిని సాకారం చేసుకోనూగలదు”

   భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.

 

   ఈ నేపథ్యంలో మొదట “యావత్ ప్రపంచం నేడు భారత్ వైపు దృష్టి సారించింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రజానీకం భారత్‌పై అమితాసక్తి చూపుతున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాగల మన దేశం, అటుపైన కేవలం 7-8 ఏళ్ల వ్యవధిలోనే 5వ స్థానానికి దూసుకెళ్లిందని గుర్తుచేశారు. గడచిన దశాబ్ద కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)ని రెట్టింపు చేసిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించిందని శ్రీ మోదీ ఉటంకించారు. తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్ల డాలర్ల విలువను జోడించిందని స్పష్టం చేశారు. ‘జిడిపి’ రెట్టింపు కావడమంటే గణాంకాలకు పరిమితం కాదని పేర్కొన్నారు. దేశంలో 25 కోట్ల మంది పేదరిక విముక్తులై ‘నవ్య మధ్యతరగతి’గా రూపొందడం దీని ప్రభావమేనని వివరించారు. ఇప్పుడు వీరంతా ఆర్థిక వ్యవస్థ ముందంజకు తోడ్పడటంతోపాటు దానికి మరింత ఉత్తేజం జోడిస్తున్నారని, తద్వారా తమ కలలు-ఆకాంక్షలతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారని ఆయన విశదీకరించారు. “భారత్‌ ఇప్పుడు పెద్దసంఖ్యలో యువ జనాభాగల ప్రపంచ దేశంగా పరిగణనలో ఉంది” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. మన దేశ యువతరం నైపుణ్య సముపార్జనలో దూసుకెళ్తూ ఆవిష్కరణలకు సారథ్యం వహిస్తున్నదని పేర్కొన్నారు. “భారత విదేశాంగ విధానానికి ‘ఇండియా ఫస్ట్’ అన్నది నేటి తారకమంత్రం” అని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకనాడు అన్ని దేశాలకూ సమాన దూరం సూత్రాన్ని అనుసరించిన భారత్‌  ప్రస్తుతం అందరికీ సమాన సామీప్యం పాటిస్తున్నదని చెప్పారు. ఈ మేరకు “సమాన సాన్నిహిత్యం” విధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. భారత్‌ అభిప్రాయాలు, ఆవిష్కరణలు, కృషి ఎంతో విలువైనవని మునుపెన్నడూ లేనివిధంగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తున్నదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచం ఇవాళ మనను ఆసక్తిగా గమనిస్తూ- “భారత్‌ ఈ క్షణాన ఏమి ఆలోచిస్తున్నదో” అవగతం చేసుకోవడంపై శ్రద్ధ చూపుతున్నదని ఆయన చెప్పారు.

   భారత్ నేడు ప్రపంచ క్రమంలో భాగస్వామి కావడమేగాక భవిష్యత్తుకు రూపమిచ్చేందుకు, భద్రత కల్పించడానికి దోహదం చేస్తున్నదని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయ భద్రత పరిరక్షణలో భారత్‌ కీలకపాత్ర... ప్రత్యేకించి కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో తేటతెల్లమైందని గుర్తుచేశారు. నలువైపులా వినిపిస్తున్న అనేకానేక సందేహాలకు అతీతంగా భారత్‌ తన సొంత టీకాలను రూపొంచడమే కాకుండా ప్రజలకు వేగంగా టీకాలు వేయించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా 150కిపైగా దేశాలకు అత్యవసర మందుల సరఫరా ద్వారా ప్రపంచ మానవాళి క్షేమంపై తన శ్రద్ధను చాటుకున్నదని చెప్పారు. ప్రపంచం సంక్షోభంలో పడిన ప్రతి సందర్భంలోనూ భారత్‌ అనుసరించిన సేవ, కరుణ వంటి విలువలు ప్రపంచమంతటా ప్రతిధ్వనించాయన్నారు. ఇవన్నీ దేశ సంస్కృతి-సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేశాయని స్పష్టం చేశారు.

   రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ పరిస్థితులను గుర్తుచేస్తూ- అనేక అంతర్జాతీయ సంస్థలపై కొన్ని దేశాల ఆధిపత్యం చలాయిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, భారత్‌ గుత్తాధిపత్యం కన్నా మానవత్వానికే సదా ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. తద్వారా సార్వజనీన, ఉమ్మడి ప్రపంచ క్రమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ దృక్కోణానికి అనుగుణంగా నేటి 21వ శతాబ్దంలో వివిధ అంతర్జాతీయ సంస్థలకు శ్రీకారం చుట్టడంలో నాయకత్వ పాత్ర పోషించడమేగాక సమష్టి సహకారం, పాత్ర పోషణకు భరోసా ఇస్తున్నదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలకు అపార నష్టం కలిగించే ప్రకృతి వైపరీత్యాల సమస్య పరిష్కారం లక్ష్యంగా ‘విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్‌ఐ) ఏర్పాటు చొరవ చూపిందన్నారు. విపత్తు సంసిద్ధత, పునరుత్థాన శక్తిని బలోపేతం చేయడంపై ప్రపంచ నిబద్ధతకు ‘సిడిఆర్‌ఐ’ ఒక నిదర్శనమని శ్రీ మోదీ చెప్పారు. ఈ క్రమంలో వంతెనలు, రోడ్లు-భవనాలు, విద్యుత్‌ గ్రిడ్‌లు తదితర విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడంలో భారత్‌ కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ ప్రపంచ మానవాళికి ఇవన్నీ రక్షణనివ్వగలవని స్పష్టం చేశారు.

 

   ముఖ్యంగా ఇంధన వనరులకు సంబంధించి, భవిష్యత్ సవాళ్ల పరిష్కారంలో ప్రపంచ సహకారం ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు. చిన్న దేశాలకూ సుస్థిర ఇంధన లభ్యతకు భరోసా ఇచ్చే విధంగా అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ) ఏర్పాటులో భారత్‌ చొరవను శ్రీ మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది వాతావరణంపై సానుకూల ప్రభావం చూపేది మాత్రమేగాక వర్ధమాన దేశాల ఇంధన అవసరాలనూ పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన వివరించారు. అందుకే 100కుపైగా దేశాలు ఈ కూటమిలో భాగస్వాములయ్యాయని ఆయన సగర్వంగా ప్రకటించారు. వాణిజ్య అసమతౌల్యం, రవాణా రంగాల్లో ప్రపంచ సవాళ్లను ప్రస్తావిస్తూ-  భారత-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ (ఐఎంఇసి) ఏర్పాటు సహా కొత్త భాగస్వామ్యాలకు శ్రీకారం చుట్టడంలో ప్రపంచానికి భారత్‌ అందిస్తున్న సహకారాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యాలను ఇది వాణిజ్యం-అనుసంధానం ద్వారా ఏకం చేస్తుందని, ఆర్థిక అవకాశాలను పెంచుతుందని, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు చూపుతుందని ఆయన విశదీకరించారు. అలాగే ప్రపంచ సరఫరా శ్రేణిని కూడా బలోపేతం చేస్తుందని చెప్పారు.

   అంతర్జాతీయ వ్యవస్థలను మరింత ప్రజాస్వామ్యయుతం, భాగస్వామ్య స్ఫోరకంగా మార్చడంలో భారత్‌ కృషిని ప్రధాని వివరించారు. ఈ మేరకు ఇదే భారత్ మండపంలో జి-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణ సందర్భంగా ఆఫ్రికా సమాఖ్యకు కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా చారిత్రక ముందడుగు వేశామని గుర్తుచేశారు. దీంతో భారత్‌ అధ్యక్షతన ఈ దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిందని చెప్పారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ ఆరోగ్యం సంస్థ “గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్”పై అంతర్జాతీయ చట్రం రూపకల్పన గురించి ప్రస్తావించారు. అంతేగాక వివిధ రంగాల్లో భారత్‌ పోషిస్తున్న గణనీయ పాత్రను ప్రస్తావిస్తూ, ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థలలో వర్ధమాన దేశాల స్వరం వినిపించేలా చేయడంలో భారత్‌ ముందుందని పేర్కొన్నారు. ఇవన్నీ సరికొత్త ప్రపంచ క్రమంలో భారత్‌ బలమైన ఉనికిని ప్రస్ఫుటం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. “ఇదంతా ఆరంభం మాత్రమే... ప్రపంచ వేదికలపై భారత్‌ సామర్థ్యం నేడు సమున్నత శిఖరాలకు చేరుతోంది” అని సగర్వంగా చాటారు.

   ప్రస్తుత 21వ శతాబ్దంలో నాలుగో వంతు (25 ఏళ్లు) గడిచిపోతున్న నేపథ్యంలో అందులో 11 సంవత్సరాలు తన ప్రభుత్వం దేశ సేవకు అంకితమైందని ప్రధాని పేర్కొన్నారు. “నేటి భారత్‌ ఆలోచనల”ను అర్థం చేసుకోవడంలో గతకాలపు సందేహాలు-సమాధానాలను తరచి చూడాల్సిన ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ స్పష్టం చేశారు. పరాధీనత నుంచి స్వావలంబన, ఆకాంక్షల నుంచి విజయాలతోపాటు నైరాశ్యం నుంచి ప్రగతి దిశగా పయనాన్ని ఆయన ప్రముఖంగా ఉటకించారు. దశాబ్దం కిందట గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్య నుంచి మహిళలకు పెద్దగా విముక్తి లభించలేదని, నేడు స్వచ్ఛ భారత్ మిషన్ దీర్ఘకాలిక పరిష్కారాన్నిచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇక 2013లో ఆరోగ్య సంరక్షణపై చర్చ ఖరీదైన చికిత్స విధానాల చుట్టూ తిరిగేదని పేర్కొంటూ- నేడు ఆయుష్మాన్ భారత్ ఓ సముచిత పరిష్కారం చూపిందని చెప్పారు. అలాగే ఒకనాడు పొగచూరిన వంటిళ్లలో మగ్గిన ఉన్న పేద మహిళలు ఇప్పుడు ఉజ్వల యోజన ద్వారా విముక్తం అయ్యాయని తెలిపారు. మరోవైపు 2013నాటికి బ్యాంకు ఖాతాల ప్రస్తావన వస్తే మహిళల నుంచి మౌనమై సమాధానంగా ఉండేదని గుర్తుచేశారు. కానీ, ఈ రోజున జన్‌ధన్‌ యోజన ఫలితంగా 30 కోట్ల మందికిపైగా మహిళలకు సొంత బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు. ఒకానొక కాలంలో తాగునీటి కోసం బావులు, చెరువులపై ఆధారపడాల్సిన దుస్థితిని ఇంటింటికీ కొళాయి నీరు (హర్ ఘర్ నల్ సే జల్) పథకం తొలగించిందని చెప్పారు. రూపాంతరీకరణ దశాబ్దానికి పరిమితం కాలేదని, జన జీవితాలనూ మార్చిందని ఆయన వివరించారు. అందుకే, భారత్‌ ప్రగతి నమూనాను ప్రపంచం గుర్తించి, ఆమోదిస్తున్నదని స్పష్టం చేశారు. ఆ మేరకు “భారత్‌ ఇప్పుడు కలలగనే దేశం మాత్రమే కాదు... వాటిని సాకారం చేసుకోనూగలదు” అని గర్వంగా చెప్పగలనన్నారు.

 

   ఒక దేశం తన పౌరుల సౌలభ్యాన్ని, సమయాన్ని విలువైనదిగా భావించినప్పుడు- దేశ గమనమే మారిపోతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇది నేటి భారత్‌ అనుభవ సారమని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో గణనీయ మార్పులను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. పాస్‌పోర్ట్ పొందడమంటే ఒకప్పుడ బ్రహ్మప్రళయంలా ఉండేదని గుర్తుచేశారు. విపరీత జాప్యంతో సమయం వృథా కావడం,  సంక్లిష్ట డాక్యుమెంట్ల ప్రక్రియ, పరిమిత సంఖ్యలో పాస్‌పోర్ట్ కేంద్రాలు వంటి సమస్యలు పీడిస్తూండేవని ఆయన పేర్కొన్నారు. చివరకు ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసుకోవడం కోసం చిన్న పట్టణాల ప్రజలు తరచూ రాత్రిపూట పట్టణాల్లో బస చేయాల్సిన దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడీ సమస్యేలవీ లేవని, పరిస్థితులు పూర్తిగా మారాయని చెబుతూ- దేశంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 77 నుంచి 550కి పెరిగిందని వివరించారు. అలాగే పాస్‌పోర్ట్ కోసం వేచి చూసే సమయం దాదాపు 50 రోజుల నుంచి కేవలం 5-6 రోజులకు తగ్గిపోయిందని చెప్పారు.

భారత్ లో బ్యాంకింగ్ మౌలిక వసతుల్లో చోటుచేసుకున్న మార్పుల గురించి ప్రస్తావిస్తూ, 50-60 సంవత్సరాల క్రితం అందరికీ బ్యాంకింగ్ సేవలు అందిస్తామనే వాగ్దానంతో బ్యాంకుల జాతీయకరణ చేసినప్పటికీ లక్షలాది గ్రామాల్లో ఇప్పటికీ ఆ సదుపాయాలు లభించలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రతి ఇంటికి చేరువైందని, ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు  కిలోమీటర్ల పరిధిలో  బ్యాంకింగ్ వెసులుబాటు ఉందని ప్రధాని తెలిపారు. ప్రభుత్వం బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసిందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయని, వాటి లాభాలు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఇప్పుడు బాధ్యులను చేస్తున్నారని  ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ. 22,000 కోట్లకు పైగా తిరిగి రాబట్టిందని, దానిని చట్టబద్ధంగా బాధితులకు తిరిగి చెల్లిస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు.

ప్రభుత్వ వ్యవస్థల్లో సమర్థత వల్లనే ప్రభావవంతమైన పరిపాలన సాధ్యమవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తక్కువ సమయంలో, తక్కువ వనరులతో ఎక్కువ సాధించటం, అనవసర ఖర్చులను నివారించడం ఎంతగానో అవసరమని ఆయన పేర్కొన్నారు. “రెడ్ టేప్” కంటే “రెడ్ కార్పెట్” కు ప్రాధాన్యత ఇవ్వడం అనేది దేశ వనరుల పట్ల గౌరవాన్ని చూపుతుందని తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ఇది తన ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా ఉందని ఆయన అన్నారు. 

గతంలో మంత్రిత్వ శాఖల్లో ఎక్కువ మందిని నియమించడం వల్ల అసమర్థత పెరిగేదని అంటూ, తమ ప్రభుత్వం  మొదటి పదవీకాలంలోనే రాజకీయ ఒత్తిళ్లకు లోబడకుండా, దేశ వనరులు,  అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి అనేక మంత్రిత్వ శాఖలను విలీనం చేసినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఉదాహరణగా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖలను విలీనం చేసి గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా ఏర్పాటుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ప్రవాసీ భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా విలీనం చేశామన్నారు. అలాగే, జల వనరులు, నదుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను తాగునీటి మంత్రిత్వ శాఖతో విలీనం చేసి జల్ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ ప్రాధాన్యతలు,  వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

 

నిబంధనలు, నియంత్రణలను సులభతరం చేసి తగ్గించేందుకు తమ ప్రభుత్వం చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. కాలపరిమితిని దాటి ఉపయోగం లేకుండా పోయిన సుమారు 1,500 పాత చట్టాలను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు. దాదాపు 40,000 షరతులను కూడా తొలగించినట్టు పేర్కొన్నారు.

ఈ చర్యలు రెండు ప్రధాన ఫలితాలను అందించాయని,  ఒకటి- ప్రజలకు వేధింపుల నుండి విముక్తి కలిగించడమే కాకుండా, రెండోది- ప్రభుత్వ యంత్రాంగంలో ఇంధన సంరక్షణకు  ఉపయోగకరంగా కూడా నిలిచాయని ప్రధాని తెలిపారు. జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా వచ్చిన మార్పును కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. 30కి పైగా పన్నులను ఒకే పన్నుగా ఏకీకృతం చేయడం వల్ల ప్రక్రియలు, డాక్యుమెంటేషన్ పరంగా భారీగా పొదుపు సాధించామని ఆయన తెలిపారు. 

గతంలో ప్రభుత్వ కొనుగోళ్లను ప్రభావితం చేసిన అసమర్థతలు, అవినీతిపై మీడియా తరచుగా నివేదించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఈఎమ్) ప్లాట్ ఫామ్ ను ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వ శాఖలు ఇప్పుడు తమ అవసరాలను ఈ వేదికపై జాబితా చేస్తాయని, విక్రేతలు బిడ్లు వేస్తారని, ఉత్తర్వులు పారదర్శకంగా ఖరారు అవుతాయని వివరించారు. ఈ చొరవ అవినీతిని గణనీయంగా తగ్గించి ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసిందని శ్రీ మోదీ తెలిపారు. భార త దేశ ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్-డిబిటి) విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. మూడు లక్షల కోట్లమందికి పైగా పైగా పన్ను చెల్లింపుదారుల సొమ్ము తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా డీబీటీ నిరోధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్న 10 కోట్లమందికి పైగా నకిలీ లబ్ధిదారులను అధికారిక రికార్డుల నుంచి తొలగించామని తెలిపారు.

ప్రతి పన్నుదారుని సహకారాన్ని నిజాయితీగా వినియోగించుకోవడంలోనూ, పన్ను చెల్లింపుదారులను గౌరవించడంలోనూ ప్రభుత్వ నిబద్ధతను తెలియచేస్తూ, పన్ను వ్యవస్థను పన్నుదారులకు మరింత అనుకూలంగా మార్చినట్టు ప్రధాని చెప్పారు. ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే ప్రక్రియ ఇప్పటివరకు కంటే  చాలా సులభమూ, వేగవంతమూ అయిందని  ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు  చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం లేకుండా ఆదాయపన్ను రిటర్న్  దాఖలు చేయడం కష్టమయ్యేదని, కానీ ఇవాళ వ్యక్తులు తక్కువ సమయంలో ఆన్లైన్‌లో ఐటిఆర్ దాఖలు చేయగలుగుతున్నారని, , అలాగే రిఫండ్లు దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే డబ్బు వారి ఖాతాల్లో జమ అవుతోందని చెప్పారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా పన్నుదారులు ఎదుర్కొనే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి సామర్థ్య ఆధారిత ప్రభుత్వ సంస్కరణలు ప్రపంచానికి ఒక కొత్త పరిపాలన నమూనాను అందించాయని ఆయన వ్యాఖ్యానించారు.

గత 10-11 సంవత్సరాల్లో ప్రతి రంగంలో భారతదేశం లో వచ్చిన మార్పును ప్రస్తావిస్తూ, ఇది ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు ఫలితమని ప్రధానమంత్రి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక దశాబ్దాల పాటు, విదేశీ వస్తువులను శ్రేష్ఠమైనవిగా భావించే మనస్తత్వం భారత్ లో పెంపొందిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్పత్తులను విక్రయించేటప్పుడు దుకాణదారులు కూడా తరచుగా "ఇది దిగుమతి వస్తువు” ప్రచారం చేసేవారని, అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారిందని, ఈ రోజు ప్రజలు "ఇది మేడ్ ఇన్ ఇండియా యేనా?" అని అడుగుతున్నారని ఆయన అన్నారు. 

 

తయారీ రంగంలో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతి గురించి మాట్లాడుతూ, ప దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ యంత్రాన్ని అభివృద్ధి చేయడంలో ఇటీవల సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ విజయం భారతదేశంలో రోగనిర్ధారణ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, ఇవి తయారీ రంగానికి కొత్త శక్తిని ఇచ్చాయని, ఒకప్పుడు ప్రపంచ దేశాలు భారత్ ను గ్లోబల్ మార్కెట్ గా చూశాయని, ఇప్పుడు దేశాన్ని ప్రధాన ఉత్పాదక కేంద్రంగా గుర్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పరిశ్రమ ప్రగతిని పేర్కొంటూ, 2014-15లో ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువ ఉన్న ఎగుమతులు దశాబ్ద కాలంలోనే ఇరవై బిలియన్ డాలర్లకు పెరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచ టెలికాం, నెట్ వర్కింగ్ పరిశ్రమలో భారత్ శక్తి కేంద్రంగా అవతరించిందని ఆయన అన్నారు. వాహన రంగం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, విడిభాగాలను ఎగుమతి చేయడంలో భారతదేశానికి పెరుగుతున్న ఖ్యాతి గురించి పేర్కొన్నారు. భారత్ గతంలో మోటారు సైకిళ్ల విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోగా, నేడు భారత్ లో తయారైన విడిభాగాలు యూఏఈ, జర్మనీ వంటి దేశాలకు చేరుతున్నాయని ఆయన తెలిపారు. సౌర ఇంధన రంగంలో సాధించిన విజయాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. సోలార్ సెల్స్, మాడ్యూల్స్ దిగుమతులు తగ్గాయని, ఎగుమతులు 23 రెట్లు పెరిగాయని చెప్పారు. గత దశాబ్ద కాలంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 21 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు. ఈ విజయాలు భారతదేశ ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ బలాన్ని,  వివిధ రంగాలలో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని ఆయన పేర్కొన్నారు.

టీవీ9 శిఖరాగ్ర సదస్సు ప్రాముఖ్యత, ఇందులో వివిధ అంశాలపై జరిగే సమగ్రమైన చర్చలు,  సమాలోచనల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. సదస్సు సందర్భంగా పంచుకున్న ఆలోచనలు, అభిప్రాయాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఆయన అన్నారు. గత శతాబ్దంలో భారతదేశం నూతనోత్తేజంతో స్వాతంత్ర్యం వైపు కొత్త ప్రయాణం ప్రారంభించిన కీలక ఘట్టాలను ఆయన గుర్తు చేశారు. 1947లో స్వాతంత్ర్యం సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ దశకంలో అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశ సప్నాన్ని నిజం చేయడం ఎంత ముఖ్యమో చెబుతూ, దీనిని సాధించడానికి సమిష్టి కృషి అవసరమని ఎర్రకోట నుంచి తాను ఇచ్చిన పిలుపును ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ సదస్సును ఏర్పాటు చేసినందుకు టీవీ9ని ప్రశంసిస్తూ, వారి సానుకూల చొరవను అభినందిస్తూ, సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మిషన్ మోడ్ లో 50 వేల మందికి పైగా యువతను వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి,  ఎంపిక చేసిన యువతకు శిక్షణ ఇచ్చిన టీవీ9 నెట్ వర్క్ యాజమాన్యాన్ని  ఆయన అభినందించారు. 2047 నాటికి వికసిత భారతదేశంలో యువత  ప్రధాన లబ్దిదారులు అవుతారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Diplomatic Advisor to President of France meets the Prime Minister
January 13, 2026

Diplomatic Advisor to President of France, Mr. Emmanuel Bonne met the Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

In a post on X, Shri Modi wrote:

“Delighted to meet Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron.

Reaffirmed the strong and trusted India–France Strategic Partnership, marked by close cooperation across multiple domains. Encouraging to see our collaboration expanding into innovation, technology and education, especially as we mark the India–France Year of Innovation. Also exchanged perspectives on key regional and global issues. Look forward to welcoming President Macron to India soon.

@EmmanuelMacron”