రూ.13,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
పంచాయతీలను సాధికారత దిశగా నడిపించడానికి,
సాంకేతికత ద్వారా బలోపేతం చేయడానికి దశాబ్ద కాలంగా అనేక చర్యలు చేపడుతున్నాం: పీఎం
గడచిన పదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకొంది: పీఎం
గడచిన పదేళ్లు... భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిన దశాబ్దం: పీఎం
ఇప్పుడు మఖానా ప్రపంచానికి సూపర్ ఫుడ్ కావచ్చు.. కానీ మిథిల సంస్కృతిలో అది ఓ భాగం, సంక్షేమానికి ఆధారం: పీఎం

ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో కొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. వీటన్నింటి మొత్తం విలువ రూ.13,480 కోట్లు. పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించినవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన వారిని ప్రధాని కోరారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశమంతా మిథిల, బీహార్‌తో అనుసంధామైందని అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్, రైల్వేలు, వసతుల ప్రాజెక్టులను ప్రారంభించామని, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఇవి బీహార్లో నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని చెప్పారు. ప్రముఖ కవి రాంధారి సింగ్ దినకర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

మహాత్మాగాంధీ తన సత్యాగ్రహ మంత్రాన్ని విస్తరించిన నేలగా బీహార్‌ను శ్రీ మోదీ వర్ణించారు. గ్రామాలు దృఢంగా ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని మహాత్మాగాంధీ విశ్వసించే వారని తెలిపారు. ఇది పంచాయతీరాజ్ అనే భావనలో ఇమిడి ఉందని తెలిపారు. ‘‘గడచిన దశాబ్దంగా పంచాయతీలకు సాధికారత కల్పిచేందుకు నిరంతర చర్యలు చేపడుతున్నాం. పంచాయతీలను బలోపేతం చేయడంలో సాంకేతికత కీలకమైన పాత్ర పోషించింది. గత పదేళ్లలో 2 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యాయి’’ అని ప్రధాని వివరించారు. అలాగే గ్రామాల్లో 5.5 లక్షలకు పైగా పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంచాయతీలను డిజిటలీకరణ చేయడం ద్వారా జనన, మరణ ధ్రువపత్రాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలను సులభంగా పొందడం లాంటి అదనపు ప్రయోజనాలుంటాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన దశాబ్దాల అనంతరం దేశం కొత్త పార్లమెంట్ భవనం నిర్మించుకుందని, అలాగే దేశవ్యాప్తంగా 30,000 నూతన పంచాయతీ భవనాల నిర్మాణం జరిగిందని తెలిపారు. ‘‘గత దశాబ్దంలో పంచాయతీలకు రూ. 2 లక్షల కోట్లు నిధులు అందాయి. వాటిని గ్రామాభివృద్ధి కోసం వినియోగించారు’’ అని చెప్పారు.

 

గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో భూవివాదాలకు సంబంధించిన అంశాలు ఒకటి. ఒక భూమి నివాస సంబధమైనదా? వ్యవసాయ భూమి లేదా పంచాయతీ ఆధీనంలో ఉందా? ప్రభుత్వానిదా? అనే దానిపై తరచూ వివాదాలు నెలకొంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ చేపట్టామని, భూములకు సంబంధించి అనవసరమైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు దోహదపడిందని అన్నారు.

పంచాయతీలు సామాజిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని శ్రీమోదీ అన్నారు. పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన మొదటి రాష్ట్రం బీహారే అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడిన, దళితులు, మహాదళితులు, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు ప్రజా ప్రతినిధులుగా బీహార్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యమని, అసలైన సామాజిక భాగస్వామ్యమని వర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది భాగం పంచుకున్నప్పుడే అది బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇది అన్ని రాష్ట్రాలకు చెందిన మహిళలకు లబ్ధి చేకూరుతుందని, చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తుందని వివరించారు.

మహిళల ఆదాయాన్ని పెంపొందించేందుకు, వారికి నూతన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ మోదీ తెలిపారు. బీహార్లో అమలు చేస్తున్న ‘జీవికా దీదీ’ చూపిస్తున్న సానుకూల ప్రభావాన్ని వివరిస్తూ.. ఈ పథకం ఎంతో మంది మహిళల జీవితాలను మార్చిందని అన్నారు. బీహార్లోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు దాదాపుగా రూ.1,000 కోట్ల ఆర్థిక సాయం అందిందని వెల్లడించారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతను మెరుగుపరచి, దేశంలో 3 కోట్ల మంది లక్పతీదీదీలను తయారు చేయాలనే లక్ష్యానికి తోడ్పడుతుందని తెలిపారు. గడచిన దశాబ్దంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని ప్రధాని అన్నారు. గ్రామాల్లో పేదలకు ఇళ్లు, రోడ్లు, గ్యాస్ కనెక్షన్లు, కుళాయి కనెక్షన్లు, టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. దీనివల్ల గ్రామాలకు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని వెల్లడించారు. కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా కార్మికులు, రైతులు, వాహనాలు నడిపేవారు, దుకాణదారులకు లబ్ధి చేకూరిందని, వారికి నూతన ఆదాయ మార్గాలు అందాయని పేర్కొన్నారు. దీనివల్ల తరాల తరబడి అణచివేతకు గురైన సమూహాలకు ప్రధాన లబ్ధి చేకూరిందని తెలిపారు. దీనికి ఉదాహరణగా పీఎం ఆవాస యోజన పథకాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. దేశంలో ఏ కుటుంబం ఇల్లు లేకుండా ఉండకూడదని, అందరికీ తలదాచుకోవడానికి శాశ్వత నీడ అందించాలనే లక్ష్యంతో ఈ పథకం రూపొందింది. ఈ పథకం ద్వారా గడచిన దశాబ్ధంలో 4 కోట్ల శాశ్వత గృహాలను నిర్మించామని ఆయన వెల్లడించారు. బీహార్లోనే 57 లక్షల పేద కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, దళితులు, వెనుకబడిన, పాస్మాందా కుటుంబాల వంటి అత్యంత వెనుకబడిన సమాజాలకు ఈ గృహాలను అందించామన్నారు. రానున్న సంవత్సరాల్లో మరో 3 కోట్ల శాశ్వత గృహాలను పేదలకు అందిస్తామని శ్రీ మోదీ ప్రకటించారు. ఈ రోజు బీహార్ వ్యాప్తంగా 1.5 లక్షల కుటుంబాలు నూతన గృహాల్లోకి మారుతున్నాయనీ, దేశవ్యాప్తంగా 15 లక్షల పేద కుటుంబాలకు కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేశామనీ అన్నారు. వారిలో 3.5 లక్షల మంది లబ్ధిదారులు బీహార్‌కు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. 10 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల కోసం ఆర్థిక సాయం లభించిందని, దీనిలో బీహార్‌కు చెందిన 80,000 గ్రామీణ కుటుంబాలు, 1 లక్ష పట్టణ కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు.

 

‘‘గడచిన పదేళ్లు భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిన దశాబ్దం’’ అని ప్రధానమంత్రి వర్ణించారు. దేశంలో బలోపేతమైన ఆధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన భారత్‌కు పునాదిగా పనిచేస్తాయన్నారు. మొదటిసారి దేశంలో 12 కోట్ల గ్రామీణ కుటుంబాలు మంచి నీటి కుళాయి కనెక్షన్లు పొందాయన్నారు. అలాగే 2.5 కోట్ల కుంటుబాలకు విద్యుత్ సదుపాయం లభించిందని, గ్యాస్ పొయ్యి మీద వండుతామని ఎన్నడూ ఊహించని వారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారని అన్నారు. ‘‘లద్ధాఖ్, సియాచెన్ లాంటి సవాళ్లతో కూడిన, కనీస సౌకర్యాలు కనీస మౌలిక సదుపాయాలు అందించడం కూడా కష్టంగా ఉండే ప్రాంతాల్లో 4జీ, 5జీ మొబైల్ కనెక్షన్లు ఏర్పాటయ్యాయి. ఇది దేశ ప్రస్తుత ప్రాధాన్యాలను తెలియజేస్తుంది’’ అని అన్నారు. ఆరోగ్య రంగంలో సాధిస్తున్న పురోగతి గురించి మాట్లాడుతూ, ఎయిమ్స్ లాంటి సంస్థలు ఒకప్పుడు ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలకే పరిమితమై ఉండేవన్నారు. దర్భంగాలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశంలో గడచిన దశాబ్దంలో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయిందని చెబుతూ జాంజర్‌పూర్లో కొత్త మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేశామని, వాటిలో 10,000 కేంద్రాలు బీహార్లోనే ఉన్నాయని తెలిపారు. జనఔషధి కేంద్రాలు 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలను అందిస్తూ పేద, మధ్యతరగతి వారికి ఉపశమనాన్ని ఇస్తున్నాయని చెప్పారు. బీహార్లో ప్రస్తుతం 800కు పైగా జన ఔషధి కేంద్రాలున్నాయని, వాటి ద్వారా ప్రజలకు రూ.2,000 కోట్ల రూపాయల వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా బీహార్లోని లక్షలాది కుటుంబాలకు ఉచిత వైద్యం లభిస్తోందన్నారు. తద్వారా ఈ కుటుంబాలకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు.

‘‘రైలు మార్గాలు, రోడ్లు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ భారత్ తన సంధానాన్ని శరవేగంగా విస్తరిస్తోంద’’ని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. పాట్నాలో మెట్రో ప్రాజెక్టుల పనులు పురోగమిస్తున్నాయని తెలియజేస్తూ, దేశమంతటా రెండు డజన్లకు పైగా నగరాలు ప్రస్తుతం మెట్రో సౌకర్యాలతో ఉన్నాయన్నారు. పాట్నా, జయ్‌నగర్‌ల మధ్య ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ సర్వీసును మొదలుపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి పట్టే కాలాన్ని చెప్పుకోదగినంతగా తగ్గిస్తుందని, దీని వల్ల సమస్తిపుర్, దర్భాంగా, మధుబని, బెగుసరాయిలలో లక్షల మంది ప్రజలు లాభపడతారని ఆయన వివరించారు.
బీహార్‌లో అనేక కొత్త రైల్వే లైన్లను ప్రారంభించడంతోపాటు కొన్నింటి పనులను మొదలుపెట్టిన విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. సహార్సా, ముంబయిల మధ్య ఆధునిక అమృత్ భారత్ రైలు సర్వీసును ప్రారంభించిన సంగతిని చెబుతూ ఇది శ్రామిక కుటుంబాలకు ఎంతో ప్రయోజనకారి అవుతుందన్నారు. బీహార్‌లో మధుబని, ఝాంఝర్‌పుర్ సహా అనేక రైల్వే స్టేషన్లకు ప్రభుత్వం కొత్త రూపును కల్పిస్తోందన్నారు. దర్భాంగా విమానాశ్రయం ఏర్పాటు కావడంతో, మిథిలలోనూ బీహార్‌లోనూ విమానయాన సంధానం గణనీయంగా మెరుగుపడిందని, పాట్నా విమానాశ్రయ విస్తరణ పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ‘‘ఈ అభివృద్ధి ప్రాజెక్టులు బీహార్‌లో కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.
‘‘రైతులే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నారు... వెన్నెముక ఎంత బలంగా ఉంటే, గ్రామాలు అంత బలంగా ఉంటాయి... ఫలితంగా దేశం కూడా బలోపేతం అవుతుంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. మిథిల, కోసీ ప్రాంతాలకు వరదలు సదా సవాళ్లను రువ్వుతూ వస్తున్నాయని ఆయన ప్రస్తావిస్తూ, బీహార్‌లో వరదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రూ.11,000 కోట్లు ఖర్చు పెట్టనుందని తెలిపారు. ఈ డబ్బుతో బాగ్‌మతి, ధర్, బుధీ గండక్, కోసీ వంటి నదులపై ఆనకట్టలను నిర్మించవచ్చని, కాలవలను అభివృద్ధిపరిచి నదీజలాలను పంటకాల్వల్లోకి మళ్లించే ఏర్పాట్లు చేస్తారని వివరించారు. ‘‘ఈ కార్యక్రమం వరద సమస్యల్ని తగ్గించడమే కాకుండా ప్రతి రైతు పొలానికీ తగినంత సాగునీరు అందేట్లు చూడొచ్చు’’ అని చెప్పారు.

 

‘‘మిథిలలో పండుతున్న మఖానా ఇక మహా ఆహారంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మఖానాకు జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు)ను ఇచ్చారు... ఇది ఈ ప్రాంతంలో పండే పంట అని ఆధికారికంగా ధ్రువీకరించారని గుర్తు చేశారు. మఖానా పరిశోధన కేంద్రానికి జాతీయ హోదా ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. మఖానా బోర్డు ఏర్పాటు అంశాన్ని బడ్జెటులో పేర్కొన్న సంగతిని ప్రముఖంగా చెప్పారు. దీంతో మఖానా రైతుల దశ తిరుగుతుందన్న ఆశలున్నాయి. ఇప్పుడు బీహార్‌లో ఉత్పత్తి అయ్యే మఖానా ఒక ‘సూపర్‌ఫూడ్’గా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లో ఏర్పాటు చేయనున్న ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫూడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్’ ఆహార శుద్ధికి సంబంధించిన చిన్న వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయడంలో యువతకు దన్నుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. వ్యవసాయంతో పాటు చేపల పెంపకంలో బీహార్ నిరంతరం పురోగతిని సాధిస్తోందని కూడా ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను అందుకునే వీలుంది. ఇది  చేపల పెంపకం రంగంలో ఉన్న అసంఖ్యాక కుటుంబాలకు ప్రయోజనాలను కలిగిస్తుందన్నారు. పీఎం మత్స్య సంపద యోజనలో భాగంగా, బీహార్‌లో వందల కోట్ల రూపాయల ఖర్చుతో అనేక ప్రాజెక్టులను అమలుచేస్తున్నట్లు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపిన ఘటనపై శ్రీ మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. యావత్తు దేశ ప్రజలు చింతిస్తున్నారని, శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలకు తోడుగా ఉంటామంటూ వారంతా వెన్నంటి నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. గాయపడి వైద్య చికిత్సను పొందుతున్న వారు త్వరగా కోలుకొనేటట్లు చూడడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధాని హామీనిచ్చారు. అనేక కుటుంబాలకు తీరని నష్టం కలిగింది. కొందరికి వారి బిడ్డలు విగతజీవులయ్యారు. కొందరికి వారి సోదరులు దూరమైపోయారు. మరి కొందరికి జీవన భాగస్వాములు నేలకొరిగారు. బాధితులు భిన్న భాషల వాళ్లు... వారి ప్రాంతాలు వేర్వేరు... కొంతమంది బెంగాలీ మాట్లాడితే, కొందరు కన్నడం, ఇంకొందరు మరాఠీ, ఇంకా... ఒడియా, గుజరాతీ భాష మాట్లాడే వాళ్లు. కొందరు బీహార్‌కు చెందిన వాళ్లు ఉన్నారు అని ఆయన వివరించారు. కార్గిల్ నుంచి కన్యకుమారి వరకు చూస్తే, ఈ దాడి తరువాత పెల్లుబుకుతున్న మనోవేదన, ఘోర అన్యాయం జరిగిందంటూ వెల్లువెత్తుతున్న భావన.. వీటిని దేశం నలుమూలల నివసిస్తున్న ప్రజలు తరతమ భేదాలు లేకుండా వ్యక్తం చేస్తున్నారని శ్రీ మోదీ చెబుతూ... ఈ దాడి సాధారణ పర్యాటకుల మీద మాత్రమే జరిగిన దాడి కాదు... ఇది భారతదేశం ఆత్మపై సిగ్గుమాలిన దౌర్జన్యానికి తెగబడడమని వ్యాఖ్యానించారు. ‘‘ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులు, దీనికి కుట్ర చేసిన వారు సహా, ఊహకయినా అందనంత శిక్షను ఎదుర్కొంటారు’’ అని ఆయన సందిగ్ధానికి ఎంతమాత్రం తావివ్వక సూటిగా ప్రకటించారు. ఇంకా మిగిలి ఉన్న ఉగ్ర స్థావరాలను నాశనం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టీకరించారు. ‘‘140 కోట్ల మంది భారతీయుల ఇచ్ఛాశక్తి ఇక భయాన్ని వ్యాప్తి చేసే వారి వెన్ను విరిచేస్తుంది’’ అని తేల్చి చెప్పారు.    
 

ప్రతి ఉగ్రవాదిని, వారికి కొమ్ము కాసే వారిని భారత్ ఆరా తీసి, వారి కదలికలను పసిగట్టి, శిక్షిస్తుంది...ఈ భూమిలో ఏ మూలన దాక్కొని ఉన్నా సరే- వారిని వెంటాడి వేటాడుతుందని ప్రధాని బీహార్ నేల మీద నుంచి ప్రకటించారు. ‘‘భారత్ ఉత్సాహాన్ని ఉగ్రవాదం ఎప్పటికీ చిన్నభిన్నం చేయజాలదు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. న్యాయం చేసే వరకూ సకల ప్రయత్నాలూ జరుగుతాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ సంకల్పాన్ని తీసుకోవడంలో పూర్తి దేశం దృఢ నిశ్చయంతో ఉంది’’ అని ఆయన ప్రధానంగా చెప్పారు. మానవజాతి పట్ల నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఘడియల్లో భారత్ వెన్నంటి నిలబడ్డారని కూడా ఆయన అన్నారు. భారత్‌కు మద్దతిచ్చిన ప్రజలకు, వివిధ దేశాల నాయకులకు ఆయన కృతజ్ఞత‌లు తెలిపారు.
‘‘అభివృద్ధి జోరందుకోవాలంటే శాంతి, భద్రతల పరిరక్షణ అత్యంత ఆవశ్యకం’’ అని శ్రీ మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందాలంటే బీహార్ అభివృద్ధి పథంలో పయనించడం ఎంతో అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్‌లో అభివృద్ధికి పూచీపడేందుకు, ప్రగతి ఫలాలను రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం వారికీ, ప్రతి ఒక్క ప్రాంతానికీ అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నందుకు ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞత‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నరు శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్, కేంద్ర మంత్రులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ జీతన్ రామ్ మాంఝీ, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ రామ్ నాథ్ ఠాకుర్, డాక్టర్ రాజ్ భూషణ్ చౌధరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్‌లోని మధుబనిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఉత్తమ పనితీరును కనబరచిన పంచాయతీలను గుర్తించడమే కాక వాటికి ప్రోత్సాహకాన్ని అందించడంలో భాగంగా జాతీయ పంచాయతీ పురస్కారాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రదానం చేశారు.
 

సుమారు రూ.340 కోట్ల ఖర్చుతో బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా హథువా‌లో ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంటు, రైళ్లలో నుంచి సరుకును దింపుకొనే సదుపాయం నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది సరఫరా వ్యవస్థను సువ్యవస్థితం చేయడంలో సహాయకారిగా ఉండడంతోపాటు ఎల్‌పీజీని పెద్ద ఎత్తున రవాణా చేసే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచనుంది.
ఈ ప్రాంతంలో విద్యుత్తు సంబంధిత మౌలిక సదుపాయాలను పెంచడం కోసం రూ.1,170 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రీవ్యాంప్‌డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీంలో భాగంగా బీహార్‌లో విద్యుత్తు రంగంలో రూ.5,030 కోట్లకు పైగా వ్యయంతో పూర్తి చేసిన అనేక ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు.
దేశంలో రైలు సేవల సదుపాయాన్ని పెంపొందించాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి సహార్సా, ముంబయిల మధ్య ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ను, జయ్‌నగర్, పట్నాల మధ్య ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. వీటికి అదనంగా పిప్రా, సహార్సాల మధ్య, ఇంకా సహార్సా, సమస్తిపుర్ ల మధ్య తిరిగే రైళ్లను ప్రధాని ప్రారంభించారు. ఆయన  సుపౌల్ పిప్రా రైల్ లైనును, హసన్‌పుర్ బిథాన్ రైల్ లైనును, ఛప్రా, బగహాలలో రెండు దారుల రైల్ ఓవర్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించారు. ఖగరియా-అలౌలీ రైల్ లైనును దేశ ప్రజలకు ప్రధాని అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టులు సంధానాన్ని మెరుగుపరచడంతో పాటుఈ ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడనున్నాయి.
 

కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో భాగంగా దాదాపు రూ.930 కోట్ల విలువైన ప్రయోజనాలను ప్రధాని 2 లక్షలకు పైచిలుకు స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేశారు. ఈ ప్రయోజనాలు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ ఉపాధుల మిషన్ (డీఏవై- ఎన్ఆర్ఎల్ఎం)లో ఒక భాగంగా లెక్కకు వస్తాయి.
పీఎంఏవై-గ్రామీణ్ పథకంలో 15 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ప్రధాని మంజూరు లేఖలను అందజేశారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పీఎంఏవై-జీ లబ్ధిదారులకు కిస్తీలను కూడా ఆయన విడుదల చేశారు. బీహార్‌లో ఒక లక్ష పీఎంఏవై-గ్రామీణ్ ఇళ్లతో పాటు 54,000 పీఎంఏవై-యూ గృహాలకు సంబంధించి గృహప్రవేశాల ఘట్టానికి సూచికగా కొంతమంది లబ్ధిదారులకు ఇంటి తాళంచెవులను కూడా ప్రధాని అందించారు.‌

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India-New Zealand elevate ties to strategic partnership; Scripts 2030 roadmap, $20bn investment & Indo-Pacific security

Media Coverage

India-New Zealand elevate ties to strategic partnership; Scripts 2030 roadmap, $20bn investment & Indo-Pacific security
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of Father Amir of State of Qatar HH Sheikh Hamad bin Khalifa Al Thani
July 12, 2026

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of the Father Amir of the State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani.

The Prime Minister described him as a visionary leader who led Qatar to great levels of development and prosperity. Shri Modi also remembered him as a true friend whom he had the honour of meeting during his visit to Qatar in February 2024.

The Prime Minister conveyed his sincere condolences to the Amir of Qatar, HH Sheikh Tamim bin Hamad Al Thani, the entire royal family and the people of Qatar.

The Prime Minister wrote on X;

“We deeply mourn the passing of Father Amir of State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani. A visionary leader who led Qatar to great levels of development and prosperity, we remember him also as a true friend whom I had the honour of meeting during my last visit to Qatar in February 2024. I convey my sincere condolences to the Amir of Qatar, HH Sheikh Tamim bin Hamad Al Thani and the entire royal family and people of Qatar. May the departed soul rest in eternal peace.

@TamimBinHamad”