సైప్రస్ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్, భారత్ వాణిజ్య రంగ ప్రముఖులతో లిమాసోల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, రక్షణ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), నౌకావాణిజ్యం, షిప్పింగ్, సాంకేతికత, నవకల్పన, డిజిటల్ సాంకేతికలు, కృత్రిమ మేధ, ఐటీ సర్వీసులు, పర్యటన, రవాణావంటి భిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు.

గత 11 సంవత్సరాల్లో భారత్‌లో శరవేగంగా చోటుచేసుకొన్న ఆర్థిక మార్పును ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అమల్లోకి తెచ్చిన సంస్కరణలు, విధానాల్లో అనూహ్య మార్పులకు తావివ్వక పోతుండడం, నిలకడతనంతో కూడిన ప్రజాస్వామ్య ప్రక్రియ.. వీటితో పాటు ‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యం’లతో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా శరవేగంగా ముందుకు పోతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని ఆయన వివరించారు. నవకల్పన, డిజిటల్ విప్లవం, అంకుర సంస్థలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరీ అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు.. వీటి అన్నింటికీ పెద్దపీట వేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా కొన్ని సంవత్సరాల్లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అనువైన స్థితిలో ఉందని ఆయన తెలిపారు. పౌర విమానయానం, ఓడరేవులు, నౌకానిర్మాణం, డిజిటల్ మాధ్యమంలో చెల్లింపులు, పర్యావరణానికి హాని చేయని రీతిన అభివృద్ధి సాధన దిశలో పయనం.. వీటిలో భారత్ స్థిరంగా ముందుకు దూసుకుపోతోందని ఆయన వివరించారు. దీంతో భారత్‌తో చేయి కలపడానికి సైప్రస్ కంపెనీలకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు, అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ భారత్‌కున్న బలాలు అని ప్రధానమంత్రి చెబుతూ, ఇదే సందర్భంలో ఇండియా వృద్ధి గాథకు తోడ్పాటును అందిస్తున్న తయారీ, ఏఐ, క్వాంటమ్, కీలక ఖనిజాల రంగాల గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు.

భారత్‌కు ఒక ప్రధాన ఆర్థిక భాగస్వామి దేశంగా సైప్రస్ ఉందని, మరీ ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రంగంలో వెన్నుదన్నుగా నిలుస్తోందని ప్రధానమంత్రి చెబుతూ, భారతదేశ ఆర్థిక రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సైప్రస్ ఎంతో ఆసక్తిని కనబరుస్తుండటాన్ని ఆహ్వానించారు. ఆర్థిక సేవల రంగంలో వాణిజ్య అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని నేతలు ఇద్దరూ ప్రధానంగా ప్రస్తావిస్తూ, గుజరాత్‌లోని ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ ‘గిఫ్ట్ సిటీ’కి, సైప్రస్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదరడాన్ని స్వాగతించారు. రెండు దేశాల మధ్య సీమాంతర చెల్లింపుల కోసం యూపీఐని ప్రారంభించడానికి ఎన్ఐపీఎల్ (ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్), యూరోబ్యాంక్ సైప్రస్‌లు ఒక అవగాహనకు వచ్చాయి. ఇది పర్యాటకులకు, వాణిజ్య సంస్థలకు మేలు చేయనుంది. భారత్-గ్రీస్-సైప్రస్ (ఐజీసీ) బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ ప్రారంభం కావడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇది షిప్పింగ్, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానం, డిజిటల్ సర్వీసుల వంటి రంగాల్లో త్రైపాక్షిక సహకారం పెరిగేందుకు దోహదపడనుంది. అనేక భారతీయ కంపెనీలు సైప్రస్‌ను యూరప్‌నకు ఒక ప్రవేశద్వారంగా, ఐటీ సర్వీసులు, ఆర్థిక నిర్వహణ, పర్యటనలకు కూడలి (హబ్)గా భావిస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.

వచ్చే ఏడాదిలో ఈయూ కౌన్సిల్‌కు అధ్యక్ష బాధ్యతను స్వీకరించడానికి సైప్రస్ సన్నద్ధం అవుతున్న క్రమంలో, నేతలు ఇద్దరూ భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి తాము నిబద్ధులమంటూ పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ సంవత్సరం చివరికల్లా తుది రూపు సంతరించుకోగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కొలిక్కి వస్తే ఉభయ దేశాల వాణిజ్య, ఆర్థిక సహకారానికి పెద్ద ఊతం లభిస్తుంది. వాణిజ్య రౌండ్ టేబుల్ సమావేశం ఆచరణాత్మక సూచనలు-సలహాలను అందించిందనీ, ఇవి ఒక సువ్యవస్థిత ఆర్థిక రోడ్‌మ్యాప్‌నకు ఆధారంగా మారగలవనీ, దీంతో వాణిజ్యం, నవకల్పన, వ్యూహాత్మక రంగాల్లో దీర్ఘకాలిక సహకారం రూపుదాల్చనుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఆకాంక్షలు, భవిష్యత్తుపై దృష్టిని కేంద్రీకరించిన విధానాలతో భారత్, సైప్రస్‌లు హుషారైన, పరస్పరం ప్రయోజనకారి ఆర్థిక సహకార పూర్వక నవశకాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Boosting business linkages!
— Narendra Modi (@narendramodi) June 15, 2025
President Nikos Christodoulides and I interacted with leading CEOs in order to add vigour to commercial linkages between India and Cyprus. Sectors like innovation, energy, technology and more offer immense potential. I also talked about India’s… pic.twitter.com/hVcbloCMyP
Ενίσχυση των επιχειρηματικών δεσμών!
— Narendra Modi (@narendramodi) June 15, 2025
Ο Πρόεδρος Νίκος Χριστοδουλίδης και εγώ συναντηθήκαμε με κορυφαίους Διευθύνοντες Συμβούλους, με στόχο την ενίσχυση των εμπορικών δεσμών μεταξύ Ινδίας και Κύπρου. Τομείς όπως η καινοτομία, η ενέργεια, η τεχνολογία και άλλοι προσφέρουν… pic.twitter.com/GtrI1J40tm


