గౌరవనీయ అధ్యక్షుల వారికీ,

ఇరు దేశాల విశిష్ట ప్రతినిధులకూ,

మీడియా మిత్రులకూ,

నమస్కారం!
కలిమెర!
సాదరంగా స్వాగతం పలికి, మంచి ఆతిథ్యమిచ్చిన గౌరవ అధ్యక్షుడికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్న సైప్రస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అధ్యక్షుడూ, ఇక్కడి ప్రజలూ చూపిన ఆప్యాయతానురాగాలు నిజంగా నా హృదయాన్ని తాకాయి.

ఇంతకుముందే సైప్రస్ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని నాకు అందించారు. నా ఒక్కడికే కాదు.. 140 కోట్ల భారతీయులకూ దక్కిన గౌరవమిది. భారత్, సైప్రస్ మధ్య చిరస్థాయిలో నిలవగల స్నేహానికి ఇది ప్రతీక. నాకందించిన ఈ గౌరవం పట్ల మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

సైప్రస్‌తో సంబంధాలకు మేం ఎనలేని ప్రాధాన్యమిస్తాం. ప్రజాస్వామ్యం, న్యాయబద్ధమైన పాలన వంటి విలువలపట్ల నిబద్ధతే మన భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తుంది. భారత్, సైప్రస్ మధ్య స్నేహం... పరిస్థితులు నిర్దేశించినదో లేదా సరిహద్దులకు పరిమితమైనదో కాదు.

అది ఎన్నోసార్లు కాల పరీక్షను తట్టుకుని నిలిచింది. అన్ని సమయాల్లోనూ సహకార స్ఫూర్తిని, గౌరవాన్ని, పరస్పర చేయూతను మనం నిలబెట్టుకున్నాం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పట్ల మనకు పరస్పరం గౌరవభావాలున్నాయి.

మిత్రులారా,
రెండు దశాబ్దాల తర్వాత సైప్రస్‌లో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఇది సువర్ణావకాశం. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపైనా గౌరవ అధ్యక్షుడు, నేను ఈరోజు విస్తృతంగా చర్చించాం.

సైప్రస్ ‘విజన్ 2035’కు, మా ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి అనేక సారూప్యతలు ఉన్నాయి. ఉమ్మడి భవితను తీర్చిదిద్దుకునే దిశగా మేం కలిసి పనిచేస్తాం. మా భాగస్వామ్యానికి వ్యూహాత్మక నిర్దేశం చేయడానికి, వచ్చే అయిదేళ్ల కోసం ఓ కచ్చితమైన ప్రణాళికను మేం రూపొందిస్తాం.

రక్షణ, భద్రత అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా.. రక్షణ పరిశ్రమపరంగా సహకారంపై ‘ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమం’ ప్రత్యేకంగా దృష్టిపెడుతుంది. సైబర్, సముద్ర భద్రతపై ప్రత్యేకంగా చర్చిస్తాం.

సీమాంతర ఉగ్రవాదంపై భారత పోరాటానికి నిరంతరం మద్దతిస్తున్న సైప్రస్‌కు కృతజ్ఞతలు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్‌ను అరికట్టడం కోసం సంబంధిత సంస్థల మధ్య వాస్తవిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.

నిన్న గౌరవ అధ్యక్షుడితో సమావేశమైన సమయంలో, మన ఆర్థిక సంబంధాలకు సంబంధించి వ్యాపారవేత్తల్లో గొప్ప ఉత్సాహం, సమన్వయం కనిపించాయి. ఇరుదేశాలకూ ప్రయోజనకరమైన భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరి నాటికి ఖరారు చేసేలా కృషి చేస్తున్నాం.

‘ఇండియా-సైప్రస్-గ్రీస్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్’ను కూడా ఈ ఏడాది ప్రారంభించాం. ఇలాంటి కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమిస్తాయి.

సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పు సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంపైనా సుదీర్ఘంగా చర్చించాం. యోగా, ఆయుర్వేదానికి సైప్రస్‌లో పెరుగుతున్న ప్రజాదరణ మాకు ప్రోత్సాహాన్నిస్తోంది.

సైప్రస్ భారతీయులకు ఇష్టమైన పర్యాటక ప్రాంతం కూడా. వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి నేరుగా విమాన ప్రయాణ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకూ కృషి చేస్తాం. మొబిలిటీ ఒప్పందం ఖరారును మరింత వేగవంతం చేయాలని నిశ్చయింకుకున్నాం.

మిత్రులారా,
యూరోపియన్ యూనియన్‌లో సైప్రస్ మాకు నమ్మకమైన భాగస్వామి. వచ్చే ఏడాది యూరోపియన్ యూనియన్ అధ్యక్ష స్థానాన్ని చేపట్టనున్న సైప్రస్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్ - ఈయూ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయన్న విశ్వాసం మాకుంది.

ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేలా సంస్కరణల ఆవశ్యకతపై ఉమ్మడి అభిప్రాయాలను ఇరుదేశాలు చర్చించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతిస్తున్న సైప్రస్‌కు కృతజ్ఞతలు.

పశ్చిమాసియా, ఐరోపాల్లో ఘర్షణలపై ఆందోళన వ్యక్తపరిచాం. ఈ ఘర్షణల ప్రతికూల ప్రభావం ఆయా ప్రాంతాలకే పరిమితం కాదు. ఇది యుద్ధాలకు సమయం కాదని మేం అంగీకరిస్తున్నాం.

చర్చలను, సుస్థిరత పునరుద్ధరించాలని మానవాళి కోరుకుంటోంది. మధ్యధరా ప్రాంతంతో అనుసంధానాన్ని పెంపొందించుకోవడంపైనా మేం చర్చించాం. భారత్ - మధ్యప్రాచ్యం – ఐరోపా ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సులకు బాటలు వేస్తుందన్న అంశంపై మేం ఏకీభవిస్తున్నాం.

 

గౌరవనీయ అధ్యక్షా,

భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వీలైనంత త్వరగా మిమ్మల్ని భారత్‌కు ఆహ్వానించే అవకాశం కోసం నేను ఎదురుచూస్తున్నాను.

మీ అద్భుతమైన ఆతిథ్యానికి, మీరు చూపిన గౌరవానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar

Media Coverage

India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology