· సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక సహకారం చోదకాలుగా వికసిత భారత్‌కు బాటలు వేసేలా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్
· ప్రక్రియల సరళీకరణ, మెరుగైన వాణిజ్య సౌలభ్యం, నిర్వహణపరంగా సాంకేతికత ప్రాతిపదికను విస్తరించడం, సంస్థాగత బలోపేతంపై విస్తృత కృషి... నేటికీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకుపోతున్న దేశం
· గత దశాబ్ద కాలంగా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
· మౌలిక సదుపాయాలపై దశాబ్ద కాలంగా చెక్కుచెదరని నిబద్ధత
· రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, డిజిటల్ నెట్‌వర్కులు, విద్యుత్ వ్యవస్థల వంటి దృఢమైన మౌలిక సదుపాయాల ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్న చేతనాత్మక కృత నిశ్చయం మాది
· వీటి ద్వారా దశాబ్దాల పాటు లాభదాయకమైన ఫలితాలు.. అందుకే నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ మూలధన వ్యయం
· ప్రభుత్వం, పరిశ్రమలు, వైజ్ఞానిక సంస్థలు కలిసి ముందుకు సాగితేనే సంస్కరణలతో సత్ఫలితాలు... అప్పుడే క్షేత్రస్థాయి విజయాలుగా ప్రకటనలు సాకారమవుతాయి: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

‘వికసిత భారత్ దిశగా సాంకేతిక సంస్కరణలు, ఆర్థిక సహకారం’ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ నిర్వహించిన 2026-27 సిరీస్ మొదటి బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. దేశ బడ్జెట్ అంటే స్వల్పకాలిక వాణిజ్య పత్రం కాదని, అది విధానపరమైన ప్రణాళిక అని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారం చేసుకునే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మౌలిక సదుపాయాల విస్తరణ, రుణ లభ్యతను సులభతరం చేయడం, వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడం, పాలనలో మెరుగైన పారదర్శకత వంటి దృఢమైన ప్రామాణిక అంశాలే బడ్జెటు ప్రభావవంతంగా ఉండేలా నిర్దేశిస్తాయని.. సరికొత్త అవకాశాలను అందిస్తూ ఈ అంశాలే ప్రజా జీవనాన్ని సులభతరం చేస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఈ అంశాలపై బడ్జెటులో తీసుకున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థకు శాశ్వత బలాన్నిస్తాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశ నిర్మాణం నిరంతర ప్రక్రియ కాబట్టి, ఏ బడ్జెటునూ దానికదే ప్రత్యేకంగా భావించవద్దని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఒక విస్తృత లక్ష్యం దిశగా సాగే ప్రయాణంలో ప్రతి బడ్జెటూ ఒక మైలురాయి వంటిది. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాకారం చేసుకోవడమే ఆ మహత్తర లక్ష్యం. అందుకే ప్రతి సంస్కరణను, ప్రతి కేటాయింపును, ప్రతి మార్పును ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంతర్భాగంగానే చూడాలి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ వార్షిక బడ్జెట్ అనంతర వెబినార్‌లు ఎంతో ముఖ్యమైనవని ప్రధానమంత్రి చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రభావవంతమైన మేధోమథనంగా ఈ సమావేశాలు నిలుస్తాయని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. “భాగస్వాముల అనుభవమూ, ఆచరణాత్మక సవాళ్ల ఆధారంగా వారు చేసే సూచనలూ ఆర్థిక వ్యూహాలకు మరింతగా పదును పెట్టడంలో, సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడంలో నిశ్చయంగా దోహదం చేస్తాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో నిపుణులు, విద్యావేత్తలు, విశ్లేషకులు, విధాన నిర్ణేతలు అందరూ కలిసి సమాలోచనలు చేస్తేనే ప్రభుత్వ పథకాల అమలు మెరుగుపడుతుందని, ఆశించిన ఫలితాలు మరింత కచ్చితంగా వస్తాయని అన్నారు. ఈ వెబినార్ల ప్రధాన లక్ష్యం అదేనని ఆయన స్పష్టం చేశారు.

 

21వ శతాబ్దంలో నాలుగో వంతు కాలం గడిచిపోయిందని, పదవుల్లోనూ కీలక స్థానాల్లోనూ ఉన్నవారి జీవితాల్లో ఇది చాలా కీలకమైన కాలమని ప్రధానమంత్రి గమనించారు. అభివృద్ధి ప్రయాణంలో దేశం నేడు అత్యంత కీలక దశలో ఉందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు. సంక్షోభాలను అధిగమించి తిరిగి పుంజుకొనే శక్తిని గత దశాబ్ద కాలంగా భారత్ కూడగట్టుకొందన్నారు. ఈ పురోగతి ఏదో అనుకోకుండా జరిగిపోయింది కాదని, గట్టి నమ్మకంతో చేపట్టిన సంస్కరణల ఫలితమేనని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “ప్రభుత్వం ప్రక్రియలను సరళతరం చేసింది. జీవన సౌలభ్యాన్ని పెంచింది. పాలనలో సాంకేతికత ప్రాతిపదికను మరింతగా విస్తరించింది. అలాగే సంస్థాగత బలోపేతానికి కృషి చేశాం. నేటికీ దేశం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకుపోతోంది’’ అని శ్రీ మోదీ వివరించారు.

భారతదేశ ప్రస్తుత అభివృద్ధి దశలో.. విధానపరమైన సంకల్పం ఎంత ముఖ్యమైనదో, ఆ పథకాలను క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేయడం కూడా అంతే ఆవశ్యకమని అంతే అవసరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కేవలం ప్రకటనల ఆధారంగానే మాత్రమే సంస్కరణలను అంచనా వేయొద్దు.. క్షేత్రస్థాయిలో అవి ఏ మేరకు ప్రభావాన్ని చూపాయన్నదే విశ్లేషణకు ప్రాతిపదిక’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా ప్రభుత్వ సేవలను అందించడంలో జవాబుదారీతనాన్ని, వేగాన్ని, పారదర్శకతను పెంచాలని ఆయన కోరారు. అలాగే, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ద్వారా ఈ పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టంగా సూచించారు.

దీర్ఘకాలంలో లాభదాయకమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వ మూలధన వ్యయం గణనీయంగా పెరగడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘మూలధన కేటాయింపులు గత 11 ఏళ్లలో దాదాపు రూ. 2 లక్షల కోట్ల నుంచి ప్రస్తుత బడ్జెటులో రూ. 12 లక్షల కోట్లకు పెరిగాయి. మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునేలా.. ఈ భారీ పెట్టుబడి ప్రైవేటు రంగానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

 

పరిశ్రమలూ, ఆర్థిక సంస్థలూ నవోత్తేజంతో ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనలో మరింతగా భాగస్వామ్యం వహించాలనీ, నిధుల సేకరణ పద్ధతుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేయాలనీ, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలనీ పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియ, వాటి నాణ్యతను అంచనా వేసే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. వ్యయానికి తగిన ప్రయోజనాల విశ్లేషణ, భవిష్యత్ నిర్వహణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వృథాను, జాప్యాన్ని అరికట్టేందుకు అమిత ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

వ్యవస్థాగత ఆర్థిక ఏర్పాట్లను ప్రస్తావిస్తూ.. విదేశీ పెట్టుబడుల విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. తద్వారా పరిణామాలను అంచనా వేయగలిగేలా, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. బాండ్ మార్కెట్లను మరింత క్రియాశీలంగా మార్చడానికి.. బాండ్ల కొనుగోలు, అమ్మకాలను సరళీకృతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీర్ఘకాలిక వృద్ధికి దోహదకారులుగా ఈ సంస్కరణలను పేర్కొన్నారు. ‘‘నిలకడతో కూడిన విధానాలు ఉండాలి. నగదు లభ్యతను పెంచాలి. సంకటకరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొత్త ఆర్థిక సాధనాలను ప్రవేశపెట్టాలి. అప్పుడే అంతరాయం లేకుండా విదేశీ మూలధనాన్ని ఆకట్టుకోగలం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న అత్యుత్తమ విధానాల నుంచి నేర్చుకోవాలని, తద్వారా దేశంలోని బాండ్ మార్కెటునూ, విదేశీ పెట్టుబడుల వ్యవస్థను బలోపేతం చేయాలని శ్రీ మోదీ కోరారు.

విదేశీ మూలధనాన్ని అంతరాయం లేకుండా ఆకర్షించడానికి, దీర్ఘకాలిక ఆర్థిక వనరులను మెరుగుపరచుకోవడానికి విదేశీ పెట్టుబడుల విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. బాండ్ మార్కెట్లను మరింత క్రియాశీలం చేయడం, బాండ్ వర్తక ప్రక్రియను సులభతరం చేయడం, వ్యయానికి తగిన ప్రయోజనాల సునిశిత విశ్లేషణ - భవిష్యత్ నిర్వహణ వ్యయాన్ని పరిగణించడం ద్వారా ప్రాజెక్టుల ఆమోద పద్ధతులను బలోపేతం చేయడం వంటి అంశాలు ఈ వ్యూహంలో భాగంగా ఉన్నాయి. ‘‘పరిణామాలను అంచనా వేయగలిగేలా, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవస్థను తీర్చిదిద్దడంతోపాటు.. నష్టభయాన్ని సమర్థంగా నిర్వహించడం ఈ చర్యల లక్ష్యం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

విధానం ఏదైనా ఒక వ్యవస్థాగత ఏర్పాటును మాత్రమే చేయగలదని, భాగస్వాములందరి క్రియాశీల భాగస్వామ్యంపైనే దాని తుది విజయం ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కొత్త పెట్టుబడులు, ఆవిష్కరణలతో పరిశ్రమలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆచరణాత్మక పరిష్కారాలను సిద్ధం చేయడంలో, మార్కెటులో విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు సహకరించాలని ఆయన కోరారు. ‘‘ప్రభుత్వం, పరిశ్రమ, వైజ్ఞానిక భాగస్వాములు కలిసి సాగితేనే.. విజయవంతమైన ఫలితాలుగా సంస్కరణలు సాకారమవుతాయి. ఈ సమష్టి కృషితోనే.. బడ్జెట్ ప్రకటనలు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలనిస్తాయి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ప్రభుత్వం, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, విద్యావేత్తల మధ్య ఒక ఉమ్మడి లక్ష్యాన్ని నిర్దేశించేలా.. ‘సంస్కరణల భాగస్వామ్య ఒప్పందా’న్ని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి సూచించారు. బడ్జెట్ అంశాలపై చర్చించడం మాత్రమే కాదు.. బడ్జెట్ ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా, ఎంత సులభంగా అమలవుతున్నాయన్నదే ఇకపై బడ్జెట్ అనంతర వెబినార్ల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక సంస్థలు, మార్కెట్లు, పరిశ్రమలూ, నిపుణులు, ఆవిష్కర్తలందరూ ఈ బడ్జెట్ అందిస్తున్న సరికొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. వారి క్రియాశీల భాగస్వామ్యం వల్ల పథకాల అమలు మెరుగుపడుతుందని, వారి అభిప్రాయాలు, సహకారం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చెబుతూ.. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ వారిని ప్రోత్సహించారు. అభివృద్ధి చెందిన భారతదేశమనే స్వప్నం వీలైనంత త్వరగా సాకారమయ్యేలా మన భవితను తీర్చిదిద్దుకునేందుకు.. సంస్కరణలు, వికాసం దిశగా సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

 

జరగబోయే చర్చలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రక్రియల సరళీకరణపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బడ్జెటుకు మెరుగులు దిద్దడం కోసం.. దానికి ముందుగానే సంప్రదింపులు జరుగుతాయని.. అయితే బడ్జెట్ అనంతర వెబినార్లు మాత్రం బడ్జెటు నిర్ణయాలను అత్యంత వేగంగా, సులభమైన మార్గాల ద్వారా క్షేత్రస్థాయికి చేర్చడమే లక్ష్యంగా రూపొందాయని ఆయన పునరుద్ఘాటించారు. సమష్టి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని భాగస్వాములంతా చర్చిస్తే.. ఈ వెబ్‌నార్లు నిజంగా ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తాయని వ్యాఖ్యానిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Twelve years on, Jan Dhan Yojana stands as the world’s largest financial inclusion drive

Media Coverage

Twelve years on, Jan Dhan Yojana stands as the world’s largest financial inclusion drive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Mahatma Ayyankali on his birth anniversary
August 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, has paid homage to Mahatma Ayyankali on his birth anniversary, today. Shri Modi remembered Mahatma Ayyankali as a great pioneer of social justice, who dedicated his life to the empowerment and welfare of the marginalised. The Prime Minister highlighted his efforts to secure educational opportunities for the marginalised, improve the lives of agricultural workers and serve the poor.

The Prime Minister posted on X:

Paying homage to Mahatma Ayyankali on his birth anniversary!

He is remembered as a great pioneer of social justice. His efforts to secure educational opportunities for the marginalised, improve the lives of agricultural workers and serve the poor remain very inspiring. His life gives strength to all those working for social empowerment.