ప్రపంచ అంతరిక్ష-విమానయాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్
ఉడాన్ పథకం విజయం భారత పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయం
ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థల పెట్టుబడులకు అద్భుత అవకాశాలను భారత్ అందిస్తోంది: ప్రధానమంత్రి

విమానయాన రంగంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీమ్).. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్) ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులను స్వాగతించారు. నాలుగు దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించడంలోని ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కాలంలో భారత్‌లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, నేటి భారత్ ఎప్పుడూ లేనంత విశ్వాసంతో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వైమానిక రంగంలో భారత పాత్రను ప్రస్తావిస్తూ, విస్తారమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా విధానపరమైన నాయకత్వం, ఆవిష్కరణలు, సమగ్ర అభివృద్ధికి చిహ్నంగా భారత్ నిలిచిందన్నారు. "నేడు, అంతరిక్ష-విమానయాన రంగాల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో పౌర విమానయాన రంగం సాధించిన చారిత్రాత్మక పురోగతిని ప్రపంచమంతా చూస్తోందన్నారు.

 

ఈ సదస్సు, చర్చలు కేవలం విమానయాన రంగానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇవి ప్రపంచ సహకారం, వాతావరణ ఒప్పందాలు, సమాన వృద్ధిని ముందుకు తీసుకెళ్లే వేదికగా పనిచేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సులో జరిగే చర్చలు ప్రపంచ విమానయాన రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయన్నారు. తద్వారా ఈ రంగంలో గల అపారమైన అవకాశాలను అందుబాటులోకి తేవడంతో పాటు, దాని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు ఆకాంక్షలు.. సంప్రదాయిక ప్రయాణాలకు మించి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని పేర్కొన్న ప్రధానమంత్రి, విస్తారమైన దూరాలను, ఖండాంతర ప్రయాణాలను కేవలం కొద్ది గంటల్లోనే పూర్తి చేయగల మానవాళి సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి వేగంగా పురోగమిస్తున్న తరుణంలో.. సుదూరంలోని ప్రదేశాలు సైతం మన గమ్యస్థానంగా మారుతున్నాయని తెలిపారు.

ప్రయాణం ఇకపై భూమిమీద గల నగరాలకు మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేసిన శ్రీ నరేంద్ర మోదీ.. అంతరిక్ష విమానాలు, గ్రహాంతర ప్రయాణాలను వాణిజ్యీకరించాలనే ఆకాంక్షలు పెరుగుతున్న క్రమంలో, వాటిని పౌర విమానయాన రంగంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి పరిణామాలకు సమయం పడుతుందనీ, పరివర్తన,  ఆవిష్కరణల కేంద్రంగా విమానయాన రంగ భవిష్యత్తును అవి నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనికోసం భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. భారత విమానయాన రంగానికి మూడు మూలాధారాలను ప్రధానమంత్రి వివరించారు. మొదటిది, విస్తారమైన మార్కెట్.. కేవలం వినియోగదారుల సమాహారం మాత్రమే కాకుండా భారత ఆకాంక్షాత్మక సమాజ ప్రతిబింబం. రెండోది, బలమైన యువత, ప్రతిభావంతుల సమూహం.. ఇక్కడ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, శుద్ధ ఇంధన రంగాల్లో పురోగతికి యువ ఆవిష్కర్తలు మార్గదర్శకులుగా ఉన్నారు. మూడోది, స్వేచ్ఛాయుత, సహకారాత్మక పరిపాలన వ్యవస్థలు.. పారిశ్రామిక వృద్ధికి వీలు కల్పిస్తాయి. ఈ బలాలతో, భారత్ తన విమానయాన రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

గత కొన్నేళ్లలో పౌర విమానయాన రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన పరివర్తనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. "ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించింది" అని ఆయన తెలిపారు. ఉడాన్ పథకం సాధించిన విజయాన్ని వివరిస్తూ, భారత పౌర విమానయాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఆ పథకాన్ని అభివర్ణించారు. ఈ పథకం ద్వారా 15 మిలియన్లకు పైగా ప్రయాణికులు సరసమైన విమాన ప్రయాణ ప్రయోజనం పొందారన్నారు. ఈ పథకం కారణంగా చాలా మంది పౌరులు తొలిసారి విమాన ప్రయాణం చేయగలిగారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత విమానయాన సంస్థలు రెండంకెల వృద్ధిని సాధిస్తూనే ఉన్నాయనీ, ఏటా 240 మిలియన్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల మొత్తం జనాభాను అధిగమించిందని ప్రధానమంత్రి వివరించారు. 2030 నాటికి ఈ సంఖ్య 500 మిలియన్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. దేశంలో ఏటా 3.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతోందని, ఈ దశాబ్దం చివరి నాటికి ఈ పరిమాణం 10 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరగనుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదని, అపారమైన భారత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే భవిష్యత్ ప్రణాళికల రూపకల్పన కోసం భారత్ కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచ స్థాయి విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారత్ గణనీయంగా పెట్టుబడులు పెడుతోందని తెలిపిన ప్రధానమంత్రి, 2014లో దేశంలో 74 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సాగుతుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 162కి పెరిగిందని పేర్కొన్నారు. భారత విమానయాన సంస్థలు 2 వేలకు పైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని, ఇది ఈ రంగంలో వేగవంతమైన వృద్ధిని సూచిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత విమానయాన రంగం అత్యున్నత స్థాయికి చేరే మార్గంలో కీలకమైన టేకాఫ్ దశలో ఉందనీ, ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. ఈ పరివర్తన భౌగోళిక సరిహద్దులను అధిగమించడమే కాకుండా.. ఈ రంగాన్ని సుస్థిరత, పర్యావరణహితమైన రవాణా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానంగా అందుబాటు ఉండడం దిశగా ముందుకు నడిపిస్తోందని వివరించారు.

"భారత విమానాశ్రయాలు ఇప్పుడు సంవత్సరానికి 500 మిలియన్ల మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండి, సాంకేతికత ద్వారా వినియోగదారుల అనుభవంలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్న అతికొద్ది దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలుపుతున్నాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భద్రత, సామర్థ్యం, సుస్థిరతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సుస్థిరమైన విమాన ఇంధనాలు, పర్యావరణహితమైన సాంకేతికతల్లో పెట్టుబడులు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రయత్నాల దిశగా భారత పరివర్తనను ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పట్ల సమతుల్య విధానాన్ని బలోపేతం చేస్తూ, పురోగతి, పర్యావరణ భద్రత రెండింటికీ కట్టుబడి భారత్ ముందుకుసాగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

డిజిటల్ ఏవియేషన్ కోసం ఒక మార్గదర్శక ఉదాహరణగా నిలిచే డిజి యాత్ర యాప్ గురించి అంతర్జాతీయ అతిథులు అవగాహన కలిగి ఉండి, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ముఖ ధృవీకరణ సాంకేతికత సహాయంతో ప్రయాణికులు అవసరమైన పత్రాలు, గుర్తింపు రుజువులను చూపించే అవసరం లేకుండా విమానాశ్రయ ప్రవేశ ద్వారం నుంచి బోర్డింగ్ ద్వారాల వరకు సజావుగా ముందుకు సాగేందుకు డిజి యాత్ర యాప్ వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. అత్యంత ఎక్కువ జనాభాకు సేవలందించడంలో భారత ఆవిష్కరణలు, అనుభవం అనేక దేశాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. "దక్షిణార్ధ గోళంలోని దేశాల కోసం ప్రేరణాత్మక నమూనాగా పనిచేసే ఈ డిజి యాత్ర.. సురక్షితమైన, స్మార్ట్ పరిష్కారంగా నిలుస్తుంది" అని ఆయన తెలిపారు.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగానికి నిరంతర సంస్కరణలు కీలకమైన చోదక శక్తిగా ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దార్శనికతకు మద్దతునిచ్చే వ్యూహాత్మక చొరవలతో ప్రపంచ తయారీ కేంద్రంగా మారడం పట్ల భారత నిబద్ధతను ఆయన వివరించారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో మిషన్ మానుఫాక్చరింగ్ ప్రకటన ద్వారా పారిశ్రామిక వృద్ధిపై దృష్టిని భారత్ మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం పార్లమెంటు ఆమోదం పొందిన విమాన విడిభాగాల బిల్లులోని ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఇది భారత్‌లో కేప్‌టౌన్ ఒప్పందానికి చట్టపరమైన అధికారాలను కల్పించిందని తెలిపారు. ఈ చట్టం, ప్రపంచ విమాన లీజింగ్ కంపెనీలకు భారత్‌లో కొత్త అవకాశాలను అందించిందన్నారు. గిఫ్ట్ సిటీలో అందించే ప్రోత్సాహకాలను గురించి వివరించిన ఆయన, ఈ చర్యలు విమాన లీజింగ్‌ కోసం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్‌ను నిలిపాయని పేర్కొన్నారు.

 

"కొత్త ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రపంచ అత్యుత్తమ పద్ధతులకు అనుగుణంగా విమానయాన చట్టాలను రూపొందిస్తూ.. క్రమబద్ధీకరించిన నియంత్రణ వ్యవస్థ, అనుమతుల సౌలభ్యం, సరళీకృత పన్ను నిర్మాణాలకు భరోసానిస్తుంది. ఇది ప్రధాన అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గణనీయమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. విమానయాన రంగంలో వృద్ధి కొత్త విమానాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పైలట్లు, సిబ్బంది, ఇంజనీర్లు, గ్రౌండ్ స్టాఫ్ కోసం అపారమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) కేంద్రాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. విమాన నిర్వహణలో ప్రపంచ కేంద్రంగా మారే దిశగా భారత్ ప్రయత్నాలను వేగవంతం చేస్తోందని ఆయన తెలిపారు. 2014లో దేశంలో 96 ఎమ్ఆర్ఓ కేంద్రాలు ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 154కి పెరిగిందన్నారు. ఆటోమేటిక్ రూట్, జీఎస్‌టీ తగ్గింపు, పన్నుల హేతుబద్ధీకరణ చర్యలు భారత ఎమ్ఆర్ఓ రంగానికి కొత్త ఊపునిచ్చాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2030 నాటికి 4 బిలియన్ డాలర్ల విలువైన ఎమ్ఆర్ఓ హబ్‌ స్థాపించాలనే భారత లక్ష్యాన్ని వివరించిన ఆయన, ఇది దేశ విమానయాన రంగ అభివృద్ధి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

భారత్‌ను కేవలం విమానయాన మార్కెట్‌గా పరిగణించరాదన్న ప్రధానమంత్రి, వాల్యూ-చెయిన్ లీడర్‌గా చూడాలని స్పష్టం చేశారు. డిజైన్ నుంచి డెలివరీ వరకు ప్రపంచ విమానయాన సప్లయి చెయిన్‌లో భారత్ అంతర్భాగంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. భారత దిశ, వేగం సరైన మార్గంలో ఉన్నాయన్న ఆయన.. నిరంతర వేగవంతమైన దేశ పురోగతి పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ విమానయాన ఆవిష్కరణల్లో భారత నాయకత్వ దార్శనికతను బలోపేతం చేస్తూ, 'మేక్ ఇన్ ఇండియా' మాత్రమే కాకుండా 'డిజైన్ ఇన్ ఇండియా' స్ఫూర్తిగా పనిచేయాలని విమానయాన సంస్థలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.

భారత విమానయాన రంగం దాని సమ్మిళిత నమూనా ద్వారా బలోపేతం అయ్యిందన్న ప్రధానమంత్రి.. దేశంలో 15 శాతానికి పైగా పైలట్లు మహిళలేనని, ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ అన్నారు. క్యాబిన్ సిబ్బందిలో మహిళల ప్రపంచ సగటు 70 శాతం ఉండగా, భారత్‌లో ఇది 86 శాతంగా ఉందని తెలిపారు. దేశంలోని ఎమ్ఆర్ఓ రంగంలో మహిళా ఇంజనీర్ల సంఖ్య ప్రపంచ సగటును మించిపోయిందనీ, ఇది ఈ రంగంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యానికి నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

విమానయాన రంగ భవిష్యత్తులో డ్రోన్ సాంకేతికత అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక పురోగతితో పాటు ఆర్థిక-సామాజిక సమగ్రత కోసం భారత్ దీనిని చక్కగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి.. వ్యవసాయం, డెలివరీ సేవలు, విభిన్న రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారని ఆయన వివరించారు.

"విమానయాన భద్రతకు ఎల్లప్పుడూ భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఐసీఏఓ సూచించిన ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భారత్ తన నిబంధనల్లో మార్పులు చేసింది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతుల అమలు పట్ల భారత నిబద్ధతను ఇది మరింత బలపరిచిందన్నారు. ఐసీఏఓ ఇటీవల నిర్వహించిన భద్రతా ఆడిట్ సందర్భంగా, విమానయాన భద్రత బలోపేతం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిందని తెలిపారు. ఆసియా-పసిఫిక్ మంత్రులస్థాయి సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం.. ప్రపంచ విమానయాన నైపుణ్యాల పట్ల భారత నిబద్ధతను మరింత స్పష్టం చేసిందని ప్రధానమంత్రి వివరించారు.

 

భారత్ ఎప్పుడూ స్వేచ్ఛాయుత గగనతలం, గ్లోబల్ కనెక్టివిటీకి మద్దతునిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరింత అనుసంధానితమైన, అందుబాటులో ఉండే విమానయాన నెట్‌వర్క్ కోసం అనుకూలంగా వాదిస్తూ, చికాగో ఒప్పంద నియమాలను భారత్ ఆమోదిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో, సరసమైనదిగా, సురక్షితమైనదిగా ఉండేలా చేయడం కోసం సంబంధిత సంస్థలు, విభాగాలు కలిసి పనిచేయాలని శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. విమానయానాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయగల ఈ రంగం సామర్థ్యం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, సంబంధిత సంస్థలు, విభాగాలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్, ఐఏటీఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ శ్రీ పీటర్ ఎల్బర్స్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ విల్లీ వాల్ష్, ఇండిగో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ భాటియా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ నెల 1 నుంచి 3 వరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం.. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్) జరుగుతున్నాయి. భారత్‌లో చివరగా ఈ ఏజీఎమ్ 42 సంవత్సరాల క్రితం 1983లో నిర్వహించారు. ప్రపంచ విమానయాన రంగ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సహా 1,600 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయ్యారు.

 

విమానయాన రంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఈ వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వీటిలో విమానయాన రంగ ఆర్థిక వ్యవహారాలు, ఎయిర్ కనెక్టివిటీ, ఇంధన భద్రత, సుస్థిర విమాన ఇంధన ఉత్పత్తి, ఫైనాన్సింగ్ డీకార్బొనైజేషన్, ఆవిష్కరణలు మొదలైన ఇతర అంశాలు కూడా భాగంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన రంగ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు.. భారత విమానయాన రంగంలో చోటుచేసుకున్న అద్భుతమైన పరివర్తనను, దేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో దాని సహకారాన్ని గురించి ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi inspects indigenous defence systems at Surat facility, briefed about desi light tank Zorawar

Media Coverage

PM Modi inspects indigenous defence systems at Surat facility, briefed about desi light tank Zorawar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates people of Assam on commendable environmental feat
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today extended his heartiest congratulations to the people of Assam, especially the state’s Nari Shakti, for achieving a commendable feat in environmental conservation. The Prime Minister remarked that the state's Nari Shakti has taken a lead in this significant effort, which is aimed at building a sustainable planet.

The Prime Minister posted on X:

"Commendable feat. Congratulations to the people of Assam, especially the state’s Nari Shakti for taking the lead in this effort aimed at building a sustainable planet"