రాజ ప్రముఖులు,

గౌరవ ప్రధానమంత్రి గారూ,

ఇరు దేశాల వ్యాపార వర్గాల ప్రముఖులారా,

నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన రంగ ప్రముఖులతో చర్చించే అవకాశం ఈ రోజు మనకు లభించింది. ఇంత ఘనంగా ఈ సదస్సును నిర్వహించిన నార్వే ప్రధానమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.

 

ఇది ఏ సాధ్యసాధ్యాలపైనో ఆధారపడిన భాగస్వామ్యం కాదు. ఇదిప్పటికే నిరూపితమైనది. ఆహారం, ఇంధనం, ఎరువుల భద్రత అంతర్జాతీయ సవాళ్లుగా మారిన నేటి కాలంలో.. వాటిని పరిష్కరించే దిశగా భారత్, నార్వే కలిసి పనిచేస్తున్నాయి. భారత ఆహార రంగంలో ఓర్క్లా సంస్థ పెట్టుబడులు కావచ్చు, భారత్‌కు ఈక్వినార్ సంస్థ అందిస్తున్న ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా కావచ్చు, లేదా భారత ఎరువుల రంగానికి యారా ఇంటర్నేషనల్ సహకారం కావచ్చు – ఈ ఉమ్మడి భాగస్వామ్యాలన్నీ మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

ఇక్కడున్నవారిలో చాలామంది, కొందరు సీఈవోలు కూడా భారత్‌లో నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్, ఇతర పెట్టుబడిదారుల సదస్సుల్లో ఎప్పటికప్పుడు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటుండడం సంతోషదాయకం. ఇప్పుడు, మనం ఈ భాగస్వామ్యాన్ని మరింత ఆత్మీయంగా మలచుకుని, ఇది సరికొత్త శిఖరాలను చేరేలా చూడాలి.

ఇప్పుడు ఒక్కో అడుగు ముందుకు వేయడం సరిపోదు. మనం మన వేగాన్ని పెంచుకోవాలి. మన లక్ష్యాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకోవాలి.

 

మిత్రులారా,

మీ అందరికీ భారత్‌తో అనుబంధం ఉంది. అలాగే భారత్ గురించి మీరిక్కడ విశేషంగా చర్చించారు – వీటన్నింటినీ బట్టి చూస్తే, దీనికన్నా ఉత్తమమైన సమయం మరొకటి లేదని నేను భావిస్తున్నాను. సరైన సమయంలో, సరైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒక గొప్ప మార్పును తీసుకురాగలిగే అద్భుతమైన తరుణమిదే.

 

2025 అక్టోబరులో ఐరోపా స్వేచ్ఛావాణిజ్య సంఘంతో వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (టీఈపీఏ) మేం అమలు చేశాం. మన మధ్య ఉన్న ప్రతిభ, సాంకేతికత, పరస్పర విశ్వాసానికి సంబంధించిన విశిష్టమైన ఒప్పందమిది.

ఈ ఒప్పందం ద్వారా వచ్చే పదిహేను సంవత్సరాలలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, పది లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ఈఎఫ్‌టీఏ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యం. కచ్చితంగా చేరుకోగల లక్ష్యం కూడా. భారత్‌లో మీ పెట్టుబడులను స్పష్టమైన ఫలితాలుగా మలచి చూపగలమని నమ్మకంతో భరోసా ఇస్తున్నాం. ఇందుకు నాదీ పూచీ.

మిత్రులారా,

ప్రత్యేకంగా మీకు ప్రయోజనకరంగా ఉండే రెండు రంగాల గురించి నేనిక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. భారత్‌లో మధ్యతరగతి వేగంగా విస్తరిస్తుండడంతో పోషకాహారం, ఆరోగ్య రక్షణ రంగాల్లో డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను అందుకోవడంలో నార్వే ఆహార, మత్స్య, ఆరోగ్య రక్షణ కంపెనీలు బలమైన భాగస్వాములుగా నిలవగలవు.

అదేవిధంగా శుద్ధ ఇంధన రంగంలో భారత్ లక్ష్యాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. 2030 నాటికి 500 గిగావాట్ల శుద్ధ ఇంధనాన్ని, 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాలను మేం నిర్దేశించుకున్నాం. శుద్ధ ఇంధన రంగంలో పెట్టుబడి కూడా నార్వేజియన్ వెల్త్ ఫండ్‌కు ఒక ప్రాధాన్యాంశం కాగలదు. భారత శుద్ధ ఇంధన భవితలో కీలక భాగస్వామిగా నిలవాల్సిందిగా నార్వేకు ఆహ్వానం పలుకుతున్నాను.

 

మిత్రులారా,

‘సంస్కరణ, ఆచరణ, పరివర్తన’ మంత్రప్రదంగా భారత్ పురోగమిస్తోంది. ఒకసారి తిరిగి చూసుకుంటే.. గత పన్నెండేళ్లలో భారత ఆర్థిక రూపురేఖల్లో వచ్చిన విప్లవాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

నిబంధనల అవరోధాలను ఎప్పటికప్పుడు తగ్గిస్తున్నాం. వాణిజ్య సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం అత్యంత క్రియాశీల చర్యలు తీసుకుంటోంది.

పన్ను విధానం, కార్మిక చట్టాలు, పరిపాలన వంటి అంశాల్లో ఇటీవలే తదుపరి తరం సంస్కరణలను మేం ప్రవేశపెట్టాం. భారత్‌లో తయారీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నేడు అత్యుత్తమ అవకాశాలను దేశం అందిస్తోందని నేను నమ్మకంగా చెప్పగలను. పలు కీలక రంగాల్లో ప్రోత్సాహకాలను కూడా భారత్ అందిస్తోంది.

మన నౌకా నిర్మాణ రంగం దీనికి ఒక అద్భుత ఉదాహరణ. దీన్ని వ్యూహాత్మక ఉత్పాదక రంగంగా అభివృద్ధి చేయడానికి మేం వేగంగా కృషి చేస్తున్నాం. నౌకా నిర్మాణ కేంద్రాలను నిర్మిస్తూ, ఆ రంగం అభివృద్ధి కోసం ఒక సంపూర్ణమైన వ్యవస్థను సృష్టిస్తున్నాం.

నౌకా నిర్మాణంతోపాటు.. నిర్వహణ రిపేర్ల వ్యవస్థ, పర్యావరణ హిత షిప్పింగ్, నౌకా వాణిజ్య సేవల్లో కూడా అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తోంది.

 

నేడు నార్వే నౌకల్లో దాదాపు 10 శాతం భారత్‌లో తయారవుతున్నాయి. వచ్చ అయిదేళ్లలో దీన్ని 25 శాతానికి పెంచగలమా? ఇదేమంత కష్టమైన పని కాదనే నేననుకుంటున్నాను. మనమిప్పటికే ఆ వేగాన్ని సాధించాం. ఉన్నత ఆశయాలు తోడుగా భారీ ముందడుగు మనం వేయాలిప్పుడు.

భారత విధానపరమైన స్థిరత్వాన్నీ, ప్రోత్సాహకాలనూ సద్వినియోగం చేసుకుంటూ, ఈ రంగంలో ప్రధాన భాగస్వాములుగా నిలవాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను.

మిత్రులారా,

భారత్, నార్వే సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి నేడు మేం తీసుకెళ్లాం. కీలక ఖనిజాలు, ఏఐ, సైబర్ సాంకేతికతలు, అంతరిక్షం, రక్షణ వంటి రంగాల్లో నార్వే కంపెనీలు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా పూర్తి సహకారాన్ని పొందుతాయి. ఈ రంగాలన్నింటిలో ఆవిష్కరణలకూ, ఉత్పాదకతకూ పునాదిగా భారత్‌ను నిలపాలని కోరుతూ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

 మిత్రులారా,

భారత్ - నార్వే సంబంధాలను ప్రయోగశాలల మధ్య, విశ్వవిద్యాలయాల మధ్య, శాస్త్రవేత్తల మధ్య భాగస్వామ్యాలుగా నేడు మలచుకుంటున్నాం. భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), అంకుర సంస్థల నిధులు, నార్వే పరిశోధన సంస్థల నడుమ పరస్పర సహకారం బలోపేతమవుతోంది. ఇరు దేశాల పరిశోధన, అంకుర సంస్థల వ్యవస్థలను ఇది అనుసంధానిస్తుంది.

 

మిత్రులారా,

ఒక కేంద్రీకృత విధానంలో మీ అవసరాలకు తగ్గ రీతిలో.. ఒక ప్రత్యేక వాణిజ్య సౌలభ్య విభాగాన్ని ఇన్వెస్ట్ ఇండియాలో మేం ప్రారంభించాం. భారత్‌లో మీ పెట్టుబడి ప్రస్థానాన్ని ఈ విభాగం మరింత సులభతరంగా, వేగవంతంగా, సమర్థంగా మారుస్తుంది.

ఈ ప్రత్యేక యంత్రాంగం విశేషమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని కూడా ఇది మీకు సులభతరం చేస్తుంది. నిర్ణయ ప్రక్రియలలో సర్దుబాట్లు లేదా సహకారం అవసరమైన సమయాల్లో, ఆ అంశాలను కూడా అత్యంత వేగంగా పరిష్కరించవచ్చు. అందుకోసమే మేం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశాం.

రండి, భారత్‌లో మీ పరిధినీ, ఆశయాలనూ రెండింటినీ విస్తరించుకోండి... ఇప్పుడే మీ అందరికీ నేనిచ్చే ముఖ్యమైన సందేశమిదే. మీ అందరినీ సాదరంగా భారత్ కు ఆహ్వానిస్తున్నాను.

ఈ అనుభవాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. నేను కూడా నా తరపున భరోసానూ, విశ్వాసాన్నీ మీకు అందించాను. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదే.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth