మాననీయ సభాపతి గారూ, దేశవాసుల తరఫున మరియు సభ తరఫున మీకు హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!
ఈ రోజు- ఆగస్టు 11వ తేదీ- చరిత్ర లోని ఒక ముఖ్యమైన సంఘటనను మనకు గుర్తుకు తెస్తుంది. ఈ రోజున 18 ఏళ్ళ యువకుడు ఖుదీరామ్ బోస్ ను ఉరి కంబమెక్కించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎలా పోరాటం జరిగిందో, ఎంత మంది బలిదానం చేశారో, దేశం పట్ల మనకు ఉన్న బాధ్యత ఎటువంటిదో కూడా ఈ సంఘటన తెలియజేస్తుంది.
మాననీయ శ్రీ వెంకయ్య నాయుడు స్వతంత్ర భారతావనిలో జన్మించి, దేశానికి మొట్ట మొదటి ఉప రాష్ట్రపతి అయ్యారన్న విషయాన్ని మనమంతా గమనించాలి. ఆయన ఈ సభ పరిసరాలలో ఎన్నో సంవత్సరాల పాటు గడిపినటువంటి, అలాగే సభ నిర్వహణ తాలూకు జటిలతలను గురించిన అవగాహన ఉన్నటువంటి ఒకే ఒక ఉప రాష్ట్రపతి కావచ్చని నేను అనుకుంటున్నాను. సభాసభ్యుల మొదలు సభా సంఘాలు, సభా ప్రక్రియల వరకు ప్రతి ఒక్కరితో, అలాగే ప్రతి విషయంతో పరిచయం ఉన్నటువంటి ఒక ఉప రాష్ట్రపతి దేశానికి దక్కారు.
ఆయన ప్రజా జీవనం జెపి ఉద్యమంతో మొదలైంది. ఆయన విద్యార్థిగా ఉన్న రోజులలో సుపరిపాలన కోసం జయప్రకాశ్ నారాయణ్ గారు ఒక దేశవ్యాప్త ఆందోళనకు నాయకత్వం వహించారు. ఇక ఆయన (శ్రీ వెంకయ్య నాయుడు) ఆంధ్ర ప్రదేశ్ లో ఒక విద్యార్థి నాయకుడుగా తనను తాను నిరూపించుకున్నారు. అప్పటి నుండి ఆయన తన వ్యక్తిత్వానికి మెరుగులు పెట్టుకోవడం ప్రారంభించారు. అది విధాన సభలో కానివ్వండి, లేదా రాజ్య సభలో కానివ్వండి.. ఆయన తన కార్య క్షేత్రాన్ని విస్తరింప చేసుకున్నారు. మరి ఈ రోజు మనమంతా ఆయనను ఎన్నుకొని, ఈ పదవి యొక్క బాధ్యతను ఆయనకు అప్పగించడం జరిగింది.
వెంకయ్య గారు ఒక రైతు బిడ్డ. ఆయనతో కలిసి ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన ప్రత్యేకాధికారం నాకు లభించింది. అది ఒక గ్రామం కోసం కానివ్వండి, పేదల కోసం లేదా వ్యవసాయదారుల కోసం కానివ్వండి.. ఈ అంశాలను ఆయన ఎల్లవేళలా ఎంతో దగ్గరి నుండి అధ్యయనం చేస్తూ ఇచ్చే సూచనలను, సలహాలను అందించే వారు. మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఆయన వ్యవహరించారు. అయితే, మంత్రివర్గం చర్చల సందర్భంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అంశాల కన్నా రైతుల గురించి మరియు పల్లె ప్రాంతాల సమస్యలను గురించే ఆయన ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు. దీనికి కారణం, బహుశా ఆయన కుటుంబ నేపథ్యం మరియు ఆయన యొక్క బాల్యం పల్లెలతో పెనవేసుకొని ఉండటం చేత ఈ విషయాలు ఆయన మనస్సుకు సన్నిహితంగా ఉండి ఉండవచ్చు.
వెంకయ్య గారు ఉప రాష్ట్రపతి కార్య భారాన్ని స్వీకరించినందువల్ల ఈ కార్యాలయాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేయడం ఇప్పుడు మన కర్తవ్యం. రాజకీయాల నుండి వేరు చేసి చూడవలసిన బాధ్యతలు కూడా ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా పరిణతి చెందినటువంటిది. భారతదేశ రాజ్యాంగం చాలా శక్తిమంతమైంది. మన మహనీయులు మనకు అందించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యం ఎటువంటిదంటే, ఈ రోజున భారతదేశంలో రాజ్యాంగ పదవులను అధిరోహించిన వారు గ్రామీణ ప్రాంతాలలో పుట్టిన వారు గాని, లేదా పేదరికం అనుభవించిన కుటుంబ నేపథ్యం కలిగిన వారు గాని అయి ఉన్నారు; అంతే తప్ప వారు ఏ సంపన్న కుటుంబం నుండో వచ్చిన వారు కాదు. అణకువ కలిగిన నేపథ్యం నుండి వచ్చిన వారు దేశంలో అత్యున్నత పదవులను మొట్టమొదటి సారిగా అలంకరించారన్న విషయమే భారతదేశ రాజ్యాంగం యొక్క గౌరవాన్ని చాటి చెబుతోంది. అంతేకాదు, భారతదేశ ప్రజాస్వామ్య పరిణతిని సూచిస్తోంది కూడా. ఇది 125 కోట్ల మంది భారత ప్రజలకు గర్వ కారణం. ఈ విధంగా జరగడం మన పూర్వులు మనకు సంక్రమింపజేసింది ఏదైతే ఉందో ఆ యొక్క పూర్వులను సమ్మానించుకొనే ఘటనగా నేను దీనిని ఎంచుతున్నాను. ఆ రాజ్యాంగ శిల్పులకు నేను మరొక్క మారు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను.
వెంకయ్య గారు ఒక మహనీయమైన వ్యక్తిత్వం మూర్తీభవించిన వారు. ఆడంబరం ఎరుగని వారు. గొప్ప ఉపన్యాస సామర్థ్యం కలిగిన వారు. ఆయన వ్యక్తిత్వం లోని ఈ సుసంపన్నత ఆయన యొక్క చర్చా ప్రావీణ్యాలు మనకు సుపరిచితమైనవే. అలాగే, కొన్ని సందర్భాలలో ఆయన తెలుగులో చేసే ప్రసంగాలు వింటూ ఉంటే ఆయన వాగ్ధార చాలా వేగంగా పరుగులిడుతున్నట్లుగా తోస్తుంది. అయితే, ఈ ప్రనికి ఆలోచనలలో స్పష్టతతో పాటు సభికులతో అనుసంధానం కాగల దక్షత.. ఈ రెండూ ఉండాలి. ఇది మాటలతో ఆడుకోవడం కాదు. మాటలతో గారడీ చేసినంత మాత్రాననే ఎవ్వరి హృదయాన్ని స్పర్శించలేరన్న సంగతి ఉపన్యాసాల లోకంతో సాన్నిహిత్యం ఉన్న వారికి బాగా ఎరుకే. అయితే, ఎవరైనా తన ఆలోచనలను ఒప్పించే విధంగా వ్యక్తపరిచినపుడు ఆ ఆలోచనలు ఒక దార్శనికత మీద మరియు నమ్మకాల మీద ఆధారపడి ఉన్నప్పుడు- ఇదిగో అలాంటప్పుడు- ఆ వ్యక్తి ప్రజల యొక్క హృదయాన్ని స్పర్శించగలుగుతాడు. మరి వెంకయ్య గారు ఈ విషయంలో ఎప్పటికీ కృతకృత్యులైనటువంటి వారే.
అంతే కాకుండా ఈ రోజున గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి విషయమై ప్రభుత్వానికి- అది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమైనా గాని లేదా నా ప్రభుత్వానికి గాని- విజ్ఞప్తి చేయని పార్లమెంట్ సభ్యుడు అంటూ లేరనేది కూడా వాస్తవం. అటువంటిదే ఒక డిమాండ్ వారి వారి ప్రాంతాలలో ‘‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’’ విషయంలోనూ వచ్చింది. ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’ అనే ఆలోచన మన ఉప రాష్ట్రపతి ఆదరణీయ వెంకయ్య గారి మనస్సులో నుండి వచ్చిందే కావడం మన అందరికీ గర్వకారణమైనటువంటి విషయం. ఎవరైనా.. పేదలు, రైతులు మరియు అణగారిన వర్గాల వారి పట్ల సహానుభూతిని కలిగివుండటంతో పాటు, వారిని వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి గట్టెక్కించాలని నిశ్చయించుకున్నప్పుడు మాత్రమే.. ఇది జరుగుతుంది.
ఈ రోజు వెంకయ్య గారు మన మధ్య ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. మనం ఈ సభలో సర్దుకు పోవడానికి కొంత కాలం పాటు కొద్దిగా ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు. ఎందుకంటే, న్యాయవాది సంఘం నుండి ఒక వకీలు న్యాయమూర్తి అయ్యారంటే, న్యాయవాదులు ఏ విధంగా విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారో అలాగన్న మాట; ఈ మధ్య కాలం వరకు కూడా సభలో మనతో ఆయన వాదించడం మరియు చర్చించడం చేసినందువల్ల ఈ విధమైన భావన చోటుచేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఇక ఆయన ఉపాధ్యక్షుడిగా వచ్చారు. కాబట్టి మనలో కొంత మంది, ప్రత్యేకించి ఈ సభ యొక్క సభ్యులు ఎవరైతే ఆయనతో ఒక మిత్రుడిగానూ మరియు ఒక సహచరునిగానూ అనేక సంవత్సరాల పాటు పని చేశారో వారు కొంత విచిత్రమైన టువంటి భావనకు లోనను కావొచ్చు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ అపూర్వమైన సంగతి ఏమిటంటే, మనం వ్యవస్థ లోపలే మనదైన శైలిని అలవరచుకొంటూ ఉంటాం.
ఆయన తరహా వ్యక్తి వ్యవస్థ లోపలి నుండే వచ్చారని మరియు చాలా సంవత్సరాల పాటు రాజ్య సభలో కొనసాగారని, కాబట్టి ఆయన ఈ సభకు సభాపతిగా మనకు ఒక దారిని చూపి సభలో మార్గదర్శకత్వం చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఒక సకారాత్మకమైన మార్పు త్వరలో వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ విషయంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి ఈ రోజున వెంకయ్య గారు ఈ గౌరవ ప్రదమైన పదవిని స్వీకరిస్తున్న తరుణంలో నేను ఈ కింది మాటలను ఉదాహరిస్తాను:
’अमल करो ऐसा अमन में,
अमल करो ऐसा अमन में,
जहां से गुजरे तुम्हारी नज़रें,
उधर से तुम्हें सलाम आए।’’
అలాగే, నేను ఈ కింద ప్రస్తావించిన మరికొన్ని మాటలను కూడా జత చేయాలనుకొంటున్నాను -
‘‘अमल करो ऐसा सदन में,
जहां से गुजरे तुम्हारी नज़रें,
उधर से तुम्हें सलाम आए।’’
అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు అనేకానేక ధన్యవాదాలు!


