రెండు నెలల్లో ఆరో వందే భారత్‌ రైలుకు జెండా ఊపిన ప్రధానమంత్రి;
“రాజస్థాన్‌కు ఇవాళ తొలి వందే భారత్‌ రైలు ఏర్పాటైంది.. ఇక అనుసంధానం మెరుగుపడి పర్యాటకం ఊపందుకుంటుంది”;
“వందే భారత్‌ రైలుతో ‘భారత్‌ ప్రధానం.. సదా ప్రథమం’ స్ఫూర్తి సాకారం”;
“ప్రగతి.. ఆధునికత.. సుస్థిరత.. స్వావలంబనకు ప్రతిరూపం వందేభారత్‌ రైలు”;
“రైల్వేల వంటి పౌరులకు ముఖ్యమైన.. ప్రాథమిక సౌకర్యం ఇన్నాళ్లూ రాజకీయాలకు బలికావడం దురదృష్టకరం”;
“రైల్వేబడ్జెట్‌లో రాజస్థాన్‌కు 2014లో ₹700 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది 14 రెట్లు పెరుగుదలతో ₹9500 కోట్లు కేటాయింపు”;
“భారత్‌ గౌరవ్‌ సర్క్యూట్‌ రైళ్లతో ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తి బలోపేతం”;
“రైల్వే వంటి అనుసంధాన మౌలిక సౌకర్యాలు బలపడితే దేశం కూడా బలోపేతం కాగలదు.. సామాన్య పౌరుడికి లబ్ధి-దేశంలోని మధ్యతరగతి.. నిరుపేదలకూ లబ్ధి”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌’ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శౌర్యప్రతాపాల పురిటిగడ్డ రాజస్థాన్‌కు తొలి వందే భారత్‌ రైలు రావడంపై రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇది జైపూర్‌-ఢిల్లీ నగరాల మధ్య ప్రయాణ సౌలభ్యం కల్పించడంతోపాటు తీర్థరాజ్‌ పుష్కర్‌, అజ్మీర్‌ షరీఫ్‌ వంటి భక్తివిశ్వాస నిలయాలను చేరువ చేస్తుందన్నారు. తద్వారా రాజస్థాన్‌లో పర్యాటక పరిశ్రమకు ఊపునిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత రైలుసహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రెండు నెలల వ్యవధిలో తాను 6వ వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై-షోలాపూర్‌, ముంబై-షిరిడి, రాణి కమలాపతి-హజ్రత్‌ నిజాముద్దీన్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, చెన్నై-కోయంబత్తూరు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లను ప్రారంభించానని గుర్తుచేశారు.

    సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌’ప్రెస్‌ రైళ్లు ప్రారంభమైన నాటినుంచీ ఇప్పటిదాకా దాదాపు 60 లక్షల మంది వీటిలో ప్రయాణించారని ప్రధానమంత్రి వెల్లడించారు. “వేగమే వందే భారత్‌ రైలు ప్రత్యేకత... దీనివల్ల ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతోంది” అన్నారు. ఒక అధ్యయనం ప్రకారం ఈ రైళ్లో ప్రయాణించిన అందరికీ ప్రతి ట్రిప్పులోనూ మొత్తంమీద 2500 గంటలు కలిసివచ్చినట్లు ప్రధాని ఉటంకించారు. తయారీ నైపుణ్యం, భద్రత, అదనపు వేగం,  అందమైన రూపం వగైరాలను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ను రూపుదిద్దినట్లు ఆయన వివరించారు. పౌరులు ఈ రైలును ఎంతో అభినందిస్తున్నారని, ఇది భారతదేశంలో రూపొందించబడిన తొలి సెమీ ఆటోమేటిక్ ఎక్స్‌’ప్రెస్ అని, ప్రపంచంలోని మొట్టమొదటి సమర్థ, పొందికైన రైళ్లలో ఒకటని ప్రధానమంత్రి వివరించారు. “స్వదేశీ భద్రత వ్యవస్థ ‘కవచ్‌’కు అనుగుణంగా తయారైన మొదటి రైలు వందే భారత్ ఎక్స్‌’ప్రెస్” అని శ్రీ మోదీ అన్నారు. అదనపు ఇంజన్ సాయం లేకుండా ఎత్తయిన సహ్యాద్రి కనుమలను అధిగమించిన తొలి రైలు కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఈ రైలు ‘భారత్‌ ప్రధాన.. సదా ప్రథమం’ స్ఫూర్తికి ప్రతిబింబమని పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ ప్రగతి, ఆధునికత, సుస్థిరత, స్వయం సమృద్ధికి ప్రతిరూపమని హర్షం వ్యక్తం చేశారు.

   రైల్వేలు వంటి పౌరులకు ముఖ్యమైన, ప్రాథమిక సౌకర్యం ఇన్నాళ్లూ రాజకీయాలకు బలికావడం దురదృష్టకరమని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినపుడు దేశానికి అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ వారసత్వంగా లభించిందని ఆయన గుర్తుచేశారు. కానీ, ఆ తర్వాతి కాలంలో ఈ రంగంలో ఆధునికీకరణ అవసరంపై రాజకీయ స్వార్థం ఆధిపత్యం చలాయించిందని చెప్పారు. ఆ మేరకు రైల్వే మంత్రిని ఎంపిక చేయడం, కొత్త రైళ్ల ప్రకటన సహా  చివరకు ఉద్యోగ నియామకాల్లోనూ రాజకీయం స్పష్టంగా కనిపించిందని గుర్తుచేశారు. రైల్వే ఉద్యోగాల సాకుతో భూసేకరణ జరిగిందని, అనేక మానవరహిత క్రాసింగ్‌లు చాలాకాలం కొనసాగాయని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల భద్రత, రైళ్ల పరిశుభ్రతకు ప్రాధాన్యం మరుగున పడిందని తెలిపారు. అయితే, 2014 తర్వాత ప్రజలు సంపూర్ణ ఆధిక్యంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంతో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. “రాజకీయ ఆదానప్రదాన ఒత్తిడి తొలగిపోవడంతో రైల్వే రంగం ఊపిరి పీల్చుకుని, కొత్త శిఖరాలకు దూసుకుపోయింది” అని ఆయన వ్యాఖ్యానించారు.

   ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌ను సరికొత్త అవకాశాల గడ్డగా మారుస్తున్నదని ప్రధాని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం కీలకంగాగల రాజస్థాన్ వంటి రాష్ట్రానికి అనుసంధానం చాలా ముఖ్యమని గుర్తుచేశారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌’ప్రెస్‌’వే పరిధిలోని ఢిల్లీ దౌసా లాల్సోట్ సెక్షన్ జాతికి అంకితం చేసిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. దీనివల్ల దౌసా, ఆల్వార్‌, భరత్‌పూర్‌, సవాయ్‌ మాధోపూర్‌, టోంక్‌, బుండీ, కోట జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే రాజస్థాన్‌ పరిధిలోని దేశ సరిహద్దు ప్రాంతాల్లో 1,400 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో 1,000 కిలోమీటర్లకుపైగా పొడవైన రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు.

   రాజస్థాన్‌లో అనుసంధానానికి తామిస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ- తరంగ హిల్‌ నుంచి అంబాజీ వరకూ రైలుమార్గం పనుల ప్రారంభం గురించి ప్రధాని గుర్తుచేశారు. దీనికోసం దాదాపు శతాబ్దంనుంచీ నెరవేరని ఆకాంక్ష నేడు సాకారం కానున్నదని చెప్పారు. మరోవైపు ఉదయ్‌పూర్‌-అహ్మదాబాద్‌ రైలుమార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చే పనులు ఇప్పటికే పూర్తికాగా,  దాదాపు 75 శాతం దాకా విద్యుదీకరణ కూడా చేసినట్లు తెలిపారు. రాజస్థాన్ రైల్వే బడ్జెట్‌  2014లో ₹700 కోట్లు కాగా, దాన్ని 14 రెట్లు పెంచి ఈ ఏడాది ₹9500 కోట్లు కేటాయించామని శ్రీ మోదీ గుర్తుచేశారు. రైలుమార్గాల డబ్లింగ్ వేగం కూడా రెట్టింపైందని, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌ వేగం పెరిగినందువల్ల దుంగర్‌పూర్, ఉదయ్‌పూర్, చితోడ్‌గఢ్, పాలి, సిరోహి వంటి గిరిజన ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇక ‘అమృత భారత్ రైల్వే యోజన’ కింద డజన్ల కొద్దీ స్టేషన్ల ఉన్నతీకరణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

   దేశంలో పర్యాటకులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ప్రభుత్వం వివిధ రకాల సర్క్యూట్ రైళ్లను కూడా నడుపుతున్నదని ప్రధాని గుర్తుచేశారు. ఈ మేరకు ‘భారత్ గౌరవ్’ సర్క్యూట్ రైళ్లను ఇప్పటిదాకా 70 ట్రిప్పులకు పైగా నడిపి, 15 వేల మందికిపైగా ప్రయాణికులకు పర్యటన అనుభవం కల్పించాయని ఉదాహరించారు. “అయోధ్య-కాశీ, దక్షిణ్‌ దర్శన్‌, ద్వారకా దర్శన్‌, సిక్కు పుణ్యక్షేత్రాలు వంటి అనేక ఆధ్యాత్మిక ప్రాంతాలకు భారత్ గౌరవ్ సర్క్యూట్ రైళ్లు నడపబడ్డాయి” అని ప్రధాని వివరించారు. వీటిపై ప్ర‌యాణికుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో అందుతున్న సానుకూల అభిప్రాయాలను ప్రస్తావిస్తూ- ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని ఈ రైళ్లు నిరంతరం బలోపేతం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

   క స్టేషన్-ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ- రాజస్థాన్‌ స్థానిక ఉత్పత్తులకు దేశవ్యాప్త ప్రాచుర్యం కల్పించడంలో భారతీయ రైల్వే కొన్నేళ్లుగా కృషి చేస్తున్నదని ప్రధాని అన్నారు. ఈ మేరకు జైపూర్ బొంతలు, సంగనేరి బ్లాక్ ప్రింట్ బెడ్ షీట్లు, గులాబీ ఉత్పత్తులు, ఇతర హస్తకళా వస్తువులను రైల్వేస్టేషన్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద 70 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని చిన్న రైతులు, హస్తకళాకారులు, చేతివృత్తులవారికి మార్కెట్‌ సౌలభ్యం దిశగా ఈ కొత్త మాధ్యమం కలసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. చివరగా- అభివృద్ధిలో ప్రతి ఒక్కరి  భాగస్వామ్యానికి ఇదో నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. “రైల్వే వంటి అనుసంధాన మౌలిక సౌకర్యాలు బలపడితే దేశం కూడా బలోపేతం అవుతుంది. సామాన్య పౌరుడికి ప్రయోజనం కలిగితే అది దేశంలోని మధ్య తరగతికి, నిరుపేదలకూ లబ్ధి చేకూరడమే కాగలదు” అని ఆయన స్పష్టం చేశారు. మొత్తంమీద రాజస్థాన్ అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఆధునిక వందే భారత్ రైలు ఓ కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

రాజస్థాన్‌లో ఇవాళ ప్రారంభమైన వందే భారత్‌ రైలు తొలి ప్రయాణం జైపూర్‌-ఢిల్లీ కంటోన్మెంట్‌ మధ్య సాగుతుంది. అయితే, 2023 ఏప్రిల్ 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే రైలు అల్వార్, గుర్‌గ్రామ్‌ స్టాపింగ్‌ స్టేషన్లుగా అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్‌ మార్గంలో నడుస్తుంది.

   ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ అజ్మీర్‌ నుంచి 5 గంటల 15 నిమిషాల్లో ఢిల్లీ చేరుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో వేగవంతమైన శతాబ్ది ఎక్స్‌’ప్రెస్ ప్రయాణ సమయం 6 గంటల 15 నిమిషాలు కాగా, దీనితో పోలిస్తే వందేభారత్‌ ప్రయాణికులకు ఓ గంట ఆదా అవుతుంది.

   అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్‌ మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌’ప్రెస్‌ ప్రపంచంలోనే ‘హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ప్రాంతం గుండా ప్రయాణించే తొలి సెమీ- హైస్పీడ్ రైలు కావడం విశేషం. ఈ రైలువల్ల రాజస్థాన్‌లోని పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గా తదితర ప్రసిద్ధ ప్రదేశాలు సహా ప్రధాన పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపడి, ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థికాభివృద్ధి ఊపందుకుంటుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Semicon India 2024: Top semiconductor CEOs laud India and PM Modi's leadership

Media Coverage

Semicon India 2024: Top semiconductor CEOs laud India and PM Modi's leadership
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 సెప్టెంబర్ 2024
September 12, 2024

Appreciation for the Modi Government’s Multi-Sectoral Reforms