షేర్ చేయండి
 
Comments

కొత్త అవకాశాల ఆరంభం మరియు మన యువకుల ఆకాంక్షల ఐక్యత మనలను కలుపుతుంది: ప్రధాని మోదీ

భారత స్వాతంత్ర్య పోరాట కథ ఆఫ్రికాకు బాగా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది: ప్రధాని మోదీ

భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం యొక్క నైతిక సూత్రాలు భారతదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం మరియు అవకాశాల కోసం విశ్వవ్యాప్త అన్వేషణకు స్పూర్తిగా నిలిచింది: ప్రధాని

ఆఫ్రికా యొక్క విమోచన ఉద్యమాలకు భారతదేశం యొక్క సూత్రీకరణ మద్దతు తరచూ మా దేశం యొక్క వాణిజ్యానికి ఖర్చు పెంచింది. ఇది ఆఫ్రికా స్వేచ్ఛతో పోలిస్తే ఏమీకాదు: ప్రధాని మోదీ

నేడు, భారతదేశం మరియు ఆఫ్రికా గొప్ప వాగ్దానం భవిష్యత్ ప్రవేశద్వారం వద్ద నిలబడిఉన్నాయి: ప్రధాని మోదీ

ఆఫ్రికా యొక్క భాగస్వామిగా భారతదేశం గర్వపడుతుంది. ఖండాందానికి మా నిబద్ధతకు ఉగాండా కేంద్రంగా ఉంది: ప్రధాని మోదీ

ఆఫ్రికాలో  డజను ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బృందాల్లో భారత శాంతిభద్రతల కృషి గురించి మేము గర్వపడుతున్నాం: ప్రధాని మోదీ

ప్రపంచంలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలలో, 163 మంది భారతీయులు అద్భుతమైన త్యాగం చేశారు. ఇది ఏ దేశానికైనా అత్యధిక సంఖ్య: ప్రధాని మోదీ

భారతదేశం మీ కోసం మరియు మీతో కలిసి పని చేస్తుంది. మా భాగస్వామ్యం ఆఫ్రికాలో సాధికారత సాధనాలను నిర్మిస్తుంది: ప్రధాని మోదీ

శ్రేష్ఠులైన అధ్య‌క్షులు శ్రీ యొవెరీ ముసెవెనీ,

శ్రేష్ఠులైన ఉపాధ్య‌క్షులు,

యుగాండా పార్ల‌మెంట్ యొక్క స్పీక‌ర్ రైట్ ఆనరబుల్ రెబెకా క‌డాగా గారు,

మాననీయ మంత్రివర్యులు,

గౌర‌వ‌నీయులైన పార్ల‌మెంట్ స‌భ్యులు,

ప్రముఖులు,

సోద‌రులు మరియు సోదరీమణులారా,

న‌మ‌స్కారం

బాలా ముసీజా

ఈ మహనీయమైన చ‌ట్ట‌ స‌భ‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించే ఆహ్వానాన్ని అందుకోవ‌డం నాకు ల‌భించిన అరుదైనటువంటి గౌర‌వంగా భావిస్తున్నాను. కొన్ని ఇత‌ర దేశాల చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ ప్ర‌సంగించే అవ‌కాశం నాకు ల‌భించింది; అయిన‌ప్ప‌టికీ, ఇది మాత్రం చాలా విశిష్ట‌మైంది. ఇటువంటి గౌర‌వం భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి కి ల‌భించ‌డం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల‌ మంది భార‌తీయుల‌కు ద‌క్కిన గొప్ప‌ స‌త్కారం. వారు అంద‌రి స్నేహ‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు, హృద‌య‌పూర్వ‌క ఆశీస్సుల‌ను ఈ చ‌ట్ట‌ స‌భ‌ కోసం.. యుగాండా ప్ర‌జ‌లు అంద‌రి కోసం నేను మోసుకొచ్చాను. గౌర‌వ‌నీయురాలైన మేడమ్ స్పీక‌ర్‌ గారూ, మీరు అధ్య‌క్ష స్థానంలో ఉండ‌డం నాకు మా లోక్‌ స‌భ‌ ను గుర్తుకు తెస్తోంది. అక్క‌డ కూడా స్పీక‌ర్‌ గా ఒక మ‌హిళ ఉండ‌డం ఇందుకు కార‌ణం. ఇక ఈ చ‌ట్ట‌ స‌భ‌ లో యువ స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌డం కూడా చూస్తున్నాను. ఇది ప్ర‌జాస్వామ్యానికి శుభ‌క‌రం. నేను యుగాండా కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ న‌న్ను మంత్ర‌ముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌంద‌ర్యానికి, గొప్ప స‌హ‌జ వ‌న‌రుల సంప‌ద‌ కు, సుసంప‌న్న వార‌స‌త్వానికి నిలయంగా ఉంది. ఇక్క‌డి న‌దులు, స‌ర‌స్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగ‌రక‌త‌ లను పెంచి పోషించాయి.

ఒక అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ ప్ర‌ధాన‌ మంత్రి గా మ‌రో సార్వ‌భౌమ దేశపు చ‌ట్ట‌ స‌భ‌ కు ఎన్నికైన స‌భ్యుల‌ను ఉద్దేశించి నేను ప్ర‌సంగిస్తున్న సంద‌ర్భంలో, మ‌న‌ల్ని ఈ ద‌శ‌ కు చేర్చిన చ‌రిత్ర నా మ‌ది లో మెద‌లుతోంది.

మ‌న పురాత‌న స‌ముద్ర సంబంధాలు, వ‌ల‌స‌ పాల‌న తాలూకు చీకటి యుగాలు, స్వాతంత్ర్యం కోసం మ‌నం జరిపినటువంటి పోరాటం యొక్క ఉమ్మడి చరిత, విభజిత ప్ర‌పంచం లో స్వ‌తంత్ర దేశాలు గా మ‌నం అనుస‌రించినటువంటి అనిశ్చిత మార్గాలు, కొత్త అవ‌కాశాల ఉషోద‌యం, మ‌న యువ జ‌నాభా ఆకాంక్ష‌ ల‌లో సారూప్యం వంటివన్నీ మ‌న‌ల‌ను సంధానిస్తున్నాయి.

మిస్టర్ ప్రెసిడెంట్,

యుగాండా ను, భార‌తదేశాన్ని ఒక స‌ర‌స‌న చేర్చ‌డం లో దోహ‌ద‌ప‌డిన అనేక అంశాల‌లో రెండు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ గ‌ల బంధం కూడా ఒకటి. దాదాపు ఓ శ‌తాబ్దానికి ముందు వీరోచిత కార్మికులు యుగాండా ను రైలుమార్గం ద్వారా హిందూ మ‌హాస‌ముద్ర తీరంతో సంధానించారు.

మీరంతా ఇవాళ ఇక్క‌డకు విచ్చేయ‌డం మ‌న ప్ర‌జ‌ల న‌డుమ‌న ఉన్నటువంటి మైత్రీ బంధానికి, సంఘీభావానికి నిద‌ర్శ‌నం.

మీరు మీ దేశానికే కాకుండా ఈ ప్రాంతం మొత్తానికీ శాంతి ని, సుస్థిర‌త‌ను స‌మ‌కూర్చారు. అలాగే అనేక స‌వాళ్ల మ‌ధ్య వృద్ధి బాట లోకి న‌డిపించారు. మ‌హిళ‌ల‌కు సాధికారిత క‌ల్ప‌న‌ ద్వారా మీ దేశాన్ని మీరు మ‌రింత సార్వ‌జ‌నీనం చేశారు.

మీ దార్శ‌నిక నాయ‌క‌త్వం భార‌త మూలాలు ఉన్న యుగాండా ప్ర‌జ‌లు త‌మను అక్కున చేర్చుకున్న నేల‌కు తిరిగివ‌చ్చే వీలు క‌ల్పించింది. అంతేకాకుండా త‌మ జీవిత పున‌రుద్ధ‌ర‌ణ‌తో పాటు తాము ఎంత‌గానో ప్రేమించే దేశ పున‌ర్నిర్మాణానికి శ్ర‌మించేలా చేసింది.

దీపావ‌ళి ఉత్సవం కోసం మీరు అధ్య‌క్ష భ‌వన ద్వారాలను తెర‌వ‌డం ద్వారా యుగాండా- భారతదేశం బంధాన్ని పెన‌వేసే అనేక తంతువుల‌ను మీరు వెలిగించారు.

వీటిలో ఒక‌టి అత్యంత ప‌విత్ర‌మైంది నైలు న‌దీ జ‌న్మ‌స్థాన‌మైన జింజా ప్రాంతం… మ‌హాత్మ గాంధీ చితాభస్మంలో కొంత‌భాగాన్ని ఇక్క‌డే నిమ‌జ్జ‌నం చేశారు.

ఆయ‌న తన జీవితంలోనూ.. ఆ త‌రువాత కూడా ఆఫ్రికాతో పాటు ఆఫ్రిక‌న్ లలో మ‌మేక‌ం అయ్యారు.

ఇప్పుడిక ప‌విత్ర జింజా ప్రాంతంలో ప్ర‌స్తుతం మ‌హాత్ముని విగ్ర‌హం ఉన్న‌చోటులో మేము గాంధీ వార‌స‌త్వ కేంద్రాన్ని నిర్మిస్తాము.

ఆ మ‌హ‌నీయుని 150వ జ‌యంతి ని నిర్వ‌హించుకోబోతున్న త‌రుణంలో ఆయ‌న‌కు ఇది ఒక గొప్ప నివాళి అవుతుంది. ఆయ‌న త‌న ఉద్య‌మానికి సంపూర్ణ రూపాన్ని ఇవ్వ‌డంలో ఆఫ్రికా పోషించిన‌ పాత్ర‌ స‌హా ఆఫ్రికా లోనూ న్యాయం కోరుతూ స్వ‌తంత్రేచ్ఛ ర‌గ‌ల‌డాన్ని, ఆయ‌న జీవితం-సందేశాల సార్వ‌త్రిక, అనంత విలువ‌ల‌ను ఈ కేంద్రం చాటిచెబుతుంది.

శ్రేష్ఠులారా,

భార‌త‌దేశ స్వాతంత్ర్య‌ సంగ్రామ చ‌రిత్ర కూడా ఆఫ్రికా తో స‌న్నిహితంగా ముడిప‌డి ఉంది. అది ఆఫ్రికాలో గాంధీ గారు 21 సంవత్సరాలు గడ‌ప‌డం, లేదా ఆయ‌న తొలి స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మాన్ని న‌డ‌ప‌డానికి మాత్ర‌మే ప‌రిమితం కాదు.

భార‌త‌దేశానికి సంబంధించి స్వ‌తంత్ర పోరాట సూత్రావళి, లేదా దాన్ని సాధించే శాంతియుత మార్గాలతో పాటు భార‌త స‌రిహ‌ద్దుల‌కు లేదా భార‌తీయుల భ‌విష్య‌త్తుకు మాత్ర‌మే ప‌రిమితమైంది కాదు.

అది ప్ర‌తి మాన‌వుడి స్వేచ్ఛ‌ కోసం, ప్ర‌తి మాన‌వుడి స‌మాన‌త్వం కోసం, ప్ర‌తి మాన‌వుడి ఆత్మ‌గౌర‌వం కోసం, ప్ర‌తి మాన‌వుడి అవ‌కాశాల కోసం వెల్లువెత్తిన విశ్వ‌వ్యాప్త ఆకాంక్ష‌కు అది ఒక ప్ర‌తిరూపం. ఆఫ్రికా క‌న్నా ఎక్కువ‌గా మ‌రే దేశానికీ ఇది వ‌ర్తించ‌దు.

మా స్వాతంత్ర్యానికి 20 సంవత్సరాల ముందు మా జాతీయోద్య‌మ నాయ‌కులు స్వ‌దేశ స్వేచ్ఛాకాంక్ష‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా… ప్ర‌త్యేకించి ఆఫ్రికా లో వ‌ల‌స‌ పాల‌న నిర్మూలన‌ తో ముడిపెట్టారు.

భార‌త‌దేశం స్వాతంత్ర్యం ముంగిట‌ నిలిచిన స‌మ‌యం లోనూ ఆఫ్రికా భ‌విష్య‌త్తు మా మ‌నోఫ‌ల‌కాల నుంచి చెదరిపోలేదు. ఆఫ్రికా దాస్య‌ శృంఖ‌లాలు తెగిప‌డ‌నంత‌ వ‌ర‌కు భార‌త‌దేశ స్వాతంత్ర్యం సంపూర్ణం కాబోద‌ని మ‌హాత్మ గాంధీ ప్ర‌గాఢంగా విశ్వ‌సించారు.

ఆయ‌న మాట‌లను స్వేచ్ఛా భారతావని మ‌రచిపోలేదు.

బాండుంగ్‌ లో ఆఫ్రికా-ఏశియా సంఘీభావానికి భార‌తదేశం కృషి చేసింది. ద‌క్షిణాఫ్రికా లో వ‌ర్ణ‌ వివ‌క్ష‌ ను మేము తీవ్రంగా వ్య‌తిరేకించాము. ప్రస్తుతం జింబాబ్వేగా వ్యవహారంలో ఉన్న ఇదివరకటి రొడీశియా స‌హా గినీ బసావూ, అంగోలా, ఇంకా న‌మీబియా ల‌లో మేము సాహ‌సోపేతంగా ముందుండి న‌డిచాము.

గాంధీ గారు చూపిన శాంతియుత పోరాట‌శీల‌త నెల్స‌న్ మండేలా గారు, డెస్మండ్ టూటూ గారు, అల్బ‌ర్ట్ లుత్ హులీ గారు, జూలియ‌స్ న్యెరెరె గారు, క్వామే ఎన్‌క్రూమాహ్ గారు వంటి వారికి ప్రేరణను ఇచ్చింది.

భార‌త‌దేశం, ఆఫ్రికా ల పురాత‌న విజ్ఞాన విజ‌యానికి, శాంతియుత పోరాటానికి గ‌ల అనంత‌ శ‌క్తికి చరిత్రే సాక్ష్యం. ఆఫ్రికా లో అత్యంత ముఖ్య‌మైన మార్పులో అధిక‌ శాతం గాంధీ గారి ప‌ద్ధ‌తుల‌ ద్వారానే సాధ్య‌ం అయ్యాయి.

మా దేశ వాణిజ్యం ప‌ణంగా ఆఫ్రికా విముక్తి పోరాటాల‌కు భార‌తదేశ సైద్ధాంతిక మ‌ద్ద‌తు ల‌భించింది. అయితే, ఆఫ్రికా కు స్వాతంత్ర్యంతో పోలిస్తే అదేమీ అంత గొప్ప విష‌యం కాదు.

శ్రేష్ఠులారా,

ఏడు ద‌శాబ్దాలుగా మ‌న ఆర్థిక‌, అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యాలను ఆర్థిక ప్రేర‌ణ‌ క‌న్నా నైతిక విలువ‌లు, భావోద్వేగ బంధాలు ఉత్తేజితం చేస్తున్నాయి. విప‌ణులు, వ‌న‌రులు అన్ని దేశాలకూ స‌ముచితంగా, స‌మానంగా అందుబాటులో ఉండాల‌ని మేము వాంఛిస్తున్నాము.

అంత‌ర్జాతీయ వాణిజ్య పునాది బ‌లోపేతానికి క‌ల‌సిక‌ట్టుగా పోరాడుతున్నాం. ద‌క్షిణార్థ గోళంలోని దేశాల మ‌ధ్య ఆర్థిక భాగ‌స్వామ్యాల్లో వైవిధ్యానికి మేం కృషిచేశాం.

మా వైద్యులు, ఉపాధ్యాయులు ఆఫ్రికా వెళ్లింది వృత్తిప‌ర‌మైన అవ‌కాశాల కోసం మాత్ర‌మే కాదు… స్వ‌తంత్ర దేశాలుగా మ‌న ఉమ్మ‌డి అభివృద్ధికి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ వెళ్లారు.

న్యూ ఢిల్లీ లో నిర్వ‌హించిన 2015 నాటి భార‌త‌- ఆఫ్రికా వేదిక మూడో శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా ‘‘వ‌ల‌స పాల‌న‌కు వ్య‌తిరేకంగా మ‌నం క‌ల‌సి పోరాడాం. అదేరీతిలో ప‌ర‌స్ప‌ర సౌభాగ్యం కోసం పాటుప‌డ‌దాం’’ అంటూ అధ్య‌క్షుడు శ్రీ ముసెవెనీ పిలుపు ఇవ్వ‌డాన్ని ఈ సంద‌ర్భంగా నేను ఉటంకిస్తున్నాను.

శ్రేష్ఠులారా,

ఆత్మవిశ్వాసం, భద్రత, యౌవనోత్సాహం, చురుకుదనంగల ప్రజలతో నిండిన భారత్-ఆఫ్రికా నేడు ఉజ్వల భవిష్యత్తు ముంగిట నిలిచి ఉన్నాయి.

ముందడుగు వేస్తున్న ఆఫ్రికాకు యుగాండాయే ఒక ఉదాహరణ.

పెరుగుతున్న లింగసంబంధమైన సమానత్వం, మెరుగవుతున్న విద్య- ఆరోగ్య ప్రమాణాలు, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు-అనుసంధానం తదితరాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఇప్పుడిది వాణిజ్య, పెట్టుబడుల వృద్ధికి నెలవైన ప్రాంతం. ఇక్కడ ఆవిష్కరణల వేగాన్ని కూడా మేం చూస్తున్నాము. మన మధ్య గాఢమైన స్నేహ బంధాలు ఉన్న దృష్ట్యా ఆఫ్రికా లో ప్రతి ఒక్కరి విజయంపై భార‌తదేశం లో మేము సైతం సంతోషిస్తున్నాము.

శ్రేష్ఠులారా,

ఆఫ్రికా తో భాగస్వామ్యం భారతదేశానికి గర్వకారణం.

ఈ ఖండం పట్ల మా కట్టుబాటుకు యుగాండాయే నిజమైన నిదర్శనం.

నిన్న, యుగాండా కు రెండు లైన్స్ ఆఫ్ క్రెడిట్ లను గురించి నేను ప్రకటించాను. ఇందులో మొదటిది.. విద్యుత్తు లైన్ లు వేయడానికి ఉద్దేశించిన 141 మిలియన్ అమెరికా డాలర్ల రుణం. రెండోది.. వ్యవసాయం, పాడి ఉత్పత్తుల వృద్ధికి ఉద్దేశించిన 64 మిలియన్ డాలర్ల రుణం.

అంతేకాకుండా ఎప్పటి లాగానే యుగాండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య-శిక్షణ, మౌలిక సదుపాయాలు, ఇంధనం, పాలనలో సామర్థ్య నిర్మాణం, రక్షణ రంగ శిక్షణ తదితర అంశాల్లో మా మద్దతు ను కొనసాగిస్తాము. ఇక ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ లో చేరాలని యుగాండా నిర్ణయించుకోవడం పై అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ కి నా అభినందనలు.

శ్రేష్ఠులారా,

యుగాండా తో స్నేహం తరహా లోనే విస్తృత ఆఫ్రికావ్యాప్తంగా మా భాగస్వామ్యాన్ని, సంబంధాలను మేం మరింత లోతుకు తీసుకుపోయాము.

గడచిన నాలుగు సంవత్సరాలలో మా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఆఫ్రికా లోని సుమారు 25కు పైగా దేశాలను సందర్శించారు. అలాగే మా మంత్రులు దాదాపు ఆఫ్రికా దేశాలన్నింటిలో పర్యటించారు.

మొత్తం 54 దేశాలతో కూడిన ఆఫ్రికా- భారత్ వేదిక శిఖరాగ్ర సమావేశాన్ని 40 మందికి పైగా దేశ- ప్రభుత్వాధినేతల హాజరు తో 2015 అక్టోబరు లో నిర్వహించే గౌరవం మాకు దక్కింది.

దీంతోపాటు ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అనేక మంది ఆఫ్రికా నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే అవకాశం మాకు లభించింది.

ఇవన్నీ కాకుండా గడచిన నాలుగు సంవత్సరాలలో ఆఫ్రికా నుంచి దాదాపు 32 మంది దేశ-ప్రభుత్వాధినేతలు భారతదేశాన్ని సందర్శించారు.

నిరుడు ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు ప్రప్రథమ సమావేశానికి ఆతిథ్యాన్ని ఇవ్వడం పై నా సొంత రాష్ట్రం గుజరాత్ గర్విస్తోంది.

ఇక ఆఫ్రికా ఖండం లో మేము మరో 18 కొత్త రాయబార కార్యాలయాలను ప్రారంభించబోతున్నాము.

శ్రేష్ఠులారా,

ప్రస్తుతం 11 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన 180 లైన్స్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఆఫ్రికా ఖండం లోని 40కి పైగా దేశాలతో మా ప్రగతి భాగస్వామ్యం కొనసాగుతోంది.

అలాగే ముందటి భారత-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 10 బిలియన్ యుఎస్ డాలర్ల మేర రాయితీ తో కూడిన లైన్స్ ఆఫ్ క్రెడిట్ అమలుతో పాటు 600 మిలియన్ యుఎస్ డాలర్ల ఉదార సాయం చేస్తామని వాగ్దానం చేశాము.

ప్రతి సంవత్సరం, విభిన్న విద్యా కార్యక్రమాల ద్వారా 8 వేల మందికి పైగా ఆఫ్రికా యువత కు శిక్షణ ను అందిస్తున్నాము.

ఎప్పటివలెనే మీ ప్రాథమ్యాలకు అనుగుణంగా మా కృషిని కొనసాగిస్తాము.

భారత కంపెనీలు ఆఫ్రికాలో 54 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి.

ఆఫ్రికా తో మా వాణిజ్యం నేడు 62 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా నమోదై, నిరుటితో పోలిస్తే 21 శాతం పెరిగింది.

ఆఫ్రికా నుంచి భారతదేశానికి ఎగుమతులూ పెరుగుతున్నాయి. ఇప్పుడిక డిజిటల్ ఆర్థికంలో వినూత్న ఆవిష్కరణల భాగస్వామ్యం మన ఆర్థిక బంధాలకు చోదకంగా నిలుస్తోంది.

ఆఫ్రికావ్యాప్త ఇ-నెట్ వర్క్ 48 ఆఫ్రికన్ దేశాలను పరస్పరంగానే గాక భారతదేశం తోనూ జోడిస్తోంది. ఆఫ్రికా లో డిజిటల్ ఆవిష్కరణకు అది వెన్నెముక కాగలదనడంలో సందేహం లేదు.

వివిధ తీరప్రాంత దేశాలతో గల మా భాగస్వామ్యం ఇప్పుడు సుస్థిర విధానంతో నీలి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను ఒడిసిపట్టుకోవాలని ఆకాంక్షిస్తోంది.

ఒకప్పుడు ఆఫ్రికా భవిష్యత్తుకు పెను ముప్పు గా పరిణమించిన వ్యాధుల పీడ ను భారత ఔషధాలు తొలగించాయి. అంతేకాకుండా విస్తృత ప్రజానీకానికి అందుబాటు ఆరోగ్య సంరక్షణ కు అవి భరోసా ఇస్తున్నాయి.

శ్రేష్ఠులారా,

సౌభాగ్యం కోసం కలసికట్టుగా కృషి చేస్తున్న మనం శాంతి కోసం సైతం ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాము.

ఇందులో భాగంగా భారత సైనికులు ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళ భాగస్వాములుగా ఆఫ్రికా బాలల శాంతియుత భవిత కు బాటలు పరుస్తున్నారు.

లోగడ 1960లో తొలి దళాన్ని కాంగో కు పంపిన నాటి నుంచి నేటి దాకా ఆఫ్రికా లోని సుమారు 12కు పైగా దళాల్లో భారత శాంతి సైనికులు అందిస్తున్న సేవలపై మేము ఎంతో గర్విస్తున్నాము.

ప్రపంచవ్యాప్తంగాగల ఐక్య రాజ్య సమితి పరిరక్షక దళాల్లో పనిచేస్తూ ఇప్పటి వరకూ 163 మంది భారత సైనికులు ప్రాణ త్యాగం చేశారు. ఏ దేశంతో పోల్చినా అసమాన త్యాగం చేసిన సైనికులలో భారతీయులే అధిక సంఖ్య లో ఉన్నారు. వీరిలో దాదాపు 70 మంది ఆఫ్రికా దేశాల్లోనే వీర మరణాన్ని పొందారు.

ఇక ఆఫ్రికా ఖండం లోని 5 శాంతి పరిరక్షక దళాల్లో 6 వేల మందికి పైగా భారత సైనికులు సేవలందిస్తున్నారు.

పూర్తిగా మహిళలతో కూడిన భారత పోలీసు దళం లైబీరియా లో ఐరాస దళం లో సేవలు అందించడం ద్వారా సరికొత్త మైలురాయిని నాటింది. ఉగ్రవాదంపై, సముద్ర దోపిడీలపై మన ఉమ్మడి పోరు ద్వారా సముద్రయాన భద్రత కు మనం కృషి చేస్తున్న నేపథ్యంలో ఆఫ్రికా దేశాలతో మా రక్షణ, భద్రతరంగ సహకారం పెరుగుతోంది.

శ్రేష్ఠులారా,

ఆఫ్రికా తో భారతదేశం బంధానికి మూలమైన పది సూత్రాలు ఇవే :

ఒకటి.. మా ప్రాథమ్యాలలో ఆఫ్రికాకు అగ్ర స్థానం. ఆఫ్రికా దేశాలతో మా సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతాము. అది మరింత సుస్థిరం, క్రమబద్ధంగా సాగుతుందన్నది ఇప్పటికే మేము స్పష్టంగా చూపాము.

రెండు.. మీ ప్రాథమ్యాలే మన ప్రగతి భాగస్వామ్యానికి చోదకాలు. మీ సామర్థ్యాన్ని వెలికితీసే విధంగా, మీ భవితకు అవరోధం కానటువంటి రీతిలో మీకు అనువైన షరతుల మేరకే అవి నడుస్తాయి. ఆఫ్రికన్ ల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మేము విశ్వసిస్తాము. సాధ్యమైనంత వరకు స్థానిక సామర్థ్య నిర్మాణం, వీలైనన్ని ఎక్కువ స్థానిక అవకాశాల సృష్టికి కృషి చేస్తాము.

మూడు.. భారతదేశంతో వాణిజ్యం మరింత సులభంగా, ఆకర్షణీయంగా ఉండేలా మా విపణుల ద్వారాలను మీ కోసం తెరుస్తాము. ఆఫ్రికా లో పెట్టుబడుల దిశగా మా పరిశ్రమలకు మద్దతు ఇస్తాము.

నాలుగు.. ఆఫ్రికా అభివృద్ధి, ప్రజాసేవల ప్రదానం మెరుగు, విద్యా-ఆరోగ్య విస్తరణ, డిజిటల్ చైతన్య వ్యాప్తి, ఆర్థిక సార్వజనీనత విస్తరణ, బలహీనులను ప్రధాన స్రవంతిలో చేర్చడం వంటి వాటి దిశగా డిజిటల్ విప్లవంలో భారతదేశం అనుభవాన్ని ప్రోది చేస్తాము. ఐక్యరాజ్య సమితి సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో మన భాగస్వామ్యం ముందుకు వెళ్లడమే గాక డిజిటల్ యుగం లో ఆఫ్రికా యువత స్థానం పొందగల సామర్థ్య కల్పనకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఐదు.. ప్రపంచం లోని సాగుభూమి లో 60 శాతం ఆఫ్రికా దేశాలకు సొంతం. కానీ, అంతర్జాతీయ ఉత్పాదకత లో మాత్రం ఆఫ్రికా వాటా 10 శాతమే. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయాభివృద్ధి కి మీతో కలసి కృషిచేస్తాము.

ఆరు.. జల వాయు పరివర్తన పరమైన సవాళ్లను మన భాగస్వామ్యం ఎదుర్కొంటుంది. సముచిత అంతర్జాతీయ వాతావరణ వ్యవస్థ కోసం ఆఫ్రికా తో కలసి పని చేస్తామని హామీ ఇస్తున్నాము. మన జీవ వైవిధ్య పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన, సమర్థమైన ఇంధన వనరుల స్వీకారానికీ ఇది దోహదపడుతుంది.

ఏడు… ఉగ్రవాదం, తీవ్రవాదాలను తిప్పికొట్టడానికి, సైబర్ రక్షణ-భద్రతలకు, శాంతి పరిరక్షణలో ఐరాస ముందడుగు వేయడంలో మన పరస్పర సహకారం, సామర్థ్యాలను బలోపేతం చేస్తాము.

ఎనిమిది.. అన్ని దేశాలకూ ప్రయోజనకరమైన రీతి లో సముద్రయాన స్వేచ్ఛ, భద్రత ల దిశగా ఆఫ్రికా దేశాలతో కలసి పనిచేస్తాము. ఆఫ్రికా తూర్పుతీరం సహా హిందూ మహాసముద్ర తూర్పు ప్రాంతం లో ప్రపంచం కోరుకుంటోంది సహకారాన్నే తప్ప స్పర్థ ను కాదు. అందుకే హిందూ మహాసముద్ర భద్రత పైన భారతదేశ దృష్టికోణం సహకారాత్మకం, సార్వజనీనంగానే గాక ఈ ప్రాంతం మొత్తానికీ భద్రత, ప్రగతిని ఆకాంక్షించేదిగా ఉంటుంది.

తొమ్మిది… ఇది ప్రత్యేకించి నాకెంతో ప్రధానమైన అంశం- ఆఫ్రికాలో అంతర్జాతీయ కార్యకలాపాలు పెరిగే క్రమంలో ఈ ఖండంలోని దేశాలు ప్రత్యర్థివర్గాల దురాశకు వేదికలుగా కాకుండా ఆఫ్రికా యువత ఆకాంక్షలను ప్రోదిచేసే దిశగా మనమంతా కలసి పనిచేయడం అవశ్యం.

పది.. వలస పాలనపై భారతదేశం, ఆఫ్రికా ఉమ్మడి పోరాటం చేసిన రీతి లోనే ప్రపంచ మానవాళి లో మూడో వంతు నివసిస్తున్న భారతదేశం, ఆఫ్రికా ల జన గళం, పాత్ర గల పారదర్శకమైన, ప్రాతినిధ్యయుతమైన, ప్రజాస్వామ్యయుతమైన అంతర్జాతీయ వ్యవస్థ కోసం కూడా కలసికట్టుగా కృషి చేద్దాము. ఆఫ్రికా కు సమాన స్థాయి లేనట్లయితే ప్రపంచ సంస్థలలో సంస్కరణలపై భారతదేశం ఆకాంక్షలకు సంపూర్ణత సిద్ధించదు. మా విదేశీ విధానంలో కీలకాంశం ఇదే.

శ్రేష్ఠులారా,

ఇది స్వేచ్ఛ, సమానత్వాలతో కలసికట్టుగా ఎదుగుతున్న దేశాలకు చెందిన శతాబ్దం కావాలంటే; మానవులందరి ముంగిట అవకాశ ఉషోదయం అయ్యే యుగం కావాలంటే; భూమాత కు ఇది మరింత ఆశావహ భవిష్యత్తు సమయం కావాలంటే.. ఈ అద్భుత ఆఫ్రికా ఖండం మిగిలిన ప్రపంచంతో అడుగు కలిపి కదలాలి. ఈ మార్గంలో భారతదేశం కూడా మీ కోసం.. మీతో పాటు నడుస్తుంది. మన భాగస్వామ్యం ఆఫ్రికాలో సాధికారిత ఉపకరణాలను రూపొందిస్తుంది. మీ ప్రయత్నాల్లో, సమానత్వ సూత్రం పై గౌరవం- పారదర్శకత తో మీకు సంఘీభావంగా నిలుస్తాము. మీ కోసం, మీతో కలసి మేము గళమెత్తుతాము.. భారతదేశం, ఆఫ్రికా ల జనాభాలో మూడింట రెండు వంతులు 35 ఏళ్ల లోపు యువతరమే. భవిష్యత్తు యువతరానిదే అయినప్పుడు స్వీయ నిర్మాణానికి, తీర్చిదిద్దుకోవడానికి తగిన ఈ శతాబ్దం కూడా మనదే అవుతుంది. ఈ దిశగా ‘అనాయే జితాహుది హుఫైదీ’ అంటే… ‘‘అదనపు కృషి చేసే వారికి తగిన ప్రతిఫలం లభిస్తుంద’’న్న యుగాండా నానుడి మనను నడిపించాలి. ఆ మేరకు ఆఫ్రికా కోసం భారతదేశం ఇప్పటికే అదనపు కృషి చేసింది.. ఆఫ్రికా ప్రయోజనాల కోసం సర్వదా కృషి చేస్తూనే ఉంటుంది.

మీకు ఇవే ధన్యవాదాలు. అనేకానేక ధన్యవాదాలు.

అసాంతే సానా

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
World TB Day: How India plans to achieve its target of eliminating TB by 2025

Media Coverage

World TB Day: How India plans to achieve its target of eliminating TB by 2025
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 మార్చి 2023
March 24, 2023
షేర్ చేయండి
 
Comments

Citizens Shower Their Love and Blessings on PM Modi During his Visit to Varanasi

Modi Government's Result-oriented Approach Fuelling India’s Growth Across Diverse Sectors