చైనా స్టేట్ కౌన్సిలర్, సరిహద్దు వివాదానికి సంబంధించి చైనా ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న శ్రీ యాంగ్ జీచి ప్రధాని శ్రీ నరేంద్రమోదీని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తమ దేశ అధ్యక్షులు శ్రీ గ్జి జిన్ పింగ్, ప్రధాని లి కెకియాంగ్ తరఫున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధానితో సమావేశానికి ముందుగా ఇండియా, చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్యన ఇరు దేశాల సరిహద్దుల విషయంలో చర్చలు జరిగాయి. వీటి సారాంశాన్ని శ్రీ యాంగ్ జీచి, శ్రీ అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంకోసం చేసిన తన గ్జియామిన్ సందర్శనను గుర్తు చేశారు. ఇండియా, చైనాల మధ్యన బలమైన సంబంధబాంధవ్యాలు చాలా ముఖ్యమని తద్వారా ఇరు దేశాల ప్రజలే కాకుండా ఆసియాతోపాటు, ప్రపంచానికి కూడా లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.


