1.    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, దక్షిణ కొరియా (ఆర్‌ఓకే) అధ్యక్షులు గౌరవనీయ లీ ఈ మయంగ్‌ ఈ నెల 19 నుంచి 21 వరకు భారత్‌ పర్యటనకు వచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన తొలి విదేశీ సందర్శనలో భాగంగా భారత్‌ రావడం విశేషం. ఆయన వెంట కొరియా ప్రభుత్వ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రసిద్ధ కంపెనీల సీఈఓలు సహా ఒక ఉన్నత స్థాయి బృందం కూడా వచ్చింది.

2.   న్యూఢిల్లీలో వారిద్దరి మధ్య ఏప్రిల్ 20న సౌహార్ద వాతావరణంలో చర్చలు ఫలవంతంగా సాగాయి. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నడుమ రెండు దేశాల ప్రజల శాంతి, శ్రేయస్సు, ప్రగతి దిశగా భుజం కలిపి కృషి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాబోయే ఐదేళ్లలో (2026-2030) భారత్-దక్షిణ కొరియా ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేసే ‘సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక’ను ప్రకటించారు.

3.   ఆసియాలో బలమైన ప్రజాస్వామ్య దేశాలుగానే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్-దక్షిణ కొరియాల మధ్య, రెండు దేశాల ప్రజానీకం నడుమ అనాదిగా సౌహార్ద సంబంధాలున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై రెండు దేశాల వైఖరి దాదాపు ఒకేవిధంగా ఉంటుంది. భారత్‌ తన ‘తూర్పు కార్యాచరణ’ విధానంలో భాగంగా దక్షిణ కొరియాను అత్యంత కీలక భాగస్వామిగా గౌరవిస్తుంది. దక్షిణ కొరియా కూడా తన కొత్త దక్షిణ విదేశాంగ విధానంలో భారత్‌ను ఒక మూలస్తంభంగా పరిగణిస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ భాగస్వామ్యం కీలకమని రెండు దేశాలూ గుర్తించాయి.

ఉన్నత స్థాయి ఆదానప్రదానాల ద్వారా రాజకీయ పునాదుల బలోపేతం

4.   కెనడాలోని కననాస్కిస్‌లో 2025 జూన్ నాటి జి-7 శిఖరాగ్ర సమావేశం, జోహన్నెస్‌బర్గ్‌లో 2025 నవంబరు నాటి జి-20 శిఖరాగ్ర సదస్సుల సమయాన రెండు దేశాల మధ్య నెలకొన్న సానుకూల స్ఫూర్తిని నాయకులిద్దరూ స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య సామర్థ్య సంపూర్ణ సద్వినియోగానికి, ఈ బంధానికి నిరంతర భవిష్యత్‌ మార్గనిర్దేశానికి వీలుగా రెండు దేశాల్లో ఏదో ఒకదానిలో లేదా ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమం సందర్భంగానైనా ఏటా నాయకుల స్థాయి సమావేశాలు నిర్వహించాలని అధినేతలిద్దరూ నిర్ణయించుకున్నారు.

5.   ద్వైపాక్షిక సంబంధాలకు నవ్యోత్తేజమిచ్చే ఉన్నత స్థాయి సమావేశాలు తరచూ సాగడంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక రాజకీయ ఆదాప్రదానం, మంత్రుల స్థాయి చర్చలను మరింత పెంచడానికి వారిద్దరూ అంగీకరించారు. ఈ దిశగా విదేశాంగ మంత్రుల నేతృత్వంలోని భారత్-ఆర్ఓకే సంయుక్త కమిషన్, ఆర్థిక మంత్రుల సమావేశం, శాస్త్ర-సాంకేతిక మంత్రుల సంయుక్త కమిటీ సమావేశాలను ఈ ఏడాది నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొరియా యుద్ధంలో భారత్‌ పాలు పంచుకోవడానికి గుర్తుగా నిర్మిస్తున్న యుద్ధ స్మారక చిహ్నాన్ని సంయుక్తంగా ప్రారంభించేందుకు భారత రక్షణ మంత్రి 2026 మే నెలలో దక్షిణ కొరియాను సందర్శిస్తారు. మరోవైపు రెండు దేశాల పరిశ్రమల శాఖ మంత్రులతో ఒక కొత్త సంప్రదింపుల యంత్రాంగం కింద భారత్-దక్షిణ కొరియా పారిశ్రామిక సహకార కమిటీని ఏర్పాటు చేయడమేగాక ఈ ఏడాదిలోనే తొలి సమావేశం నిర్వహించేందుకు వారు నిర్ణయించుకున్నారు.

6.   ఈ ఏడాది జనవరిలో దక్షిణ కొరియా డిప్యూటీ స్పీకర్ భారత్‌లో పర్యటించడాన్ని గుర్తు చేసుకుంటూ, భారత పార్లమెంట్-దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీల స్పీకర్లు, సభ్యుల మధ్య క్రమబద్ధ ఆదానప్రదానానికి మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా భారత్-దక్షిణ కొరియా పార్లమెంటరీ మిత్రబృందాలను ఏర్పాటు చేయడంపై వారు హర్షం ప్రకటించారు.

7.   భారత్‌-దక్షిణ కొరియాల భావితరం మేధావుల మధ్య మరింత సాన్నిహిత్యం లక్ష్యంగా ఈ ఏడాది నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ప్రారంభించిన కార్యక్రమాలు, కార్యకలాపాలపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. తద్వారా యువ శాసనసభ్యులు, దౌత్యవేత్తలు, ప్రముఖులు, మీడియా, అధికారుల పరస్పర పర్యటనల ద్వారా అవగాహన  పెంచుకోవడంతోపాటు ఉమ్మడి సమస్యలు అవకాశాలపై సహకారానికి వీలుంటుంది.

8.   సమతుల ప్రాంతీయ వృద్ధి, చైతన్యం, పునరుజ్జీవన ప్రోత్సాహంతోపాటు రాష్ట్రాలు, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య ఆదానప్రదానాలు మరింత పెరగాలని నాయకులిద్దరూ ఆకాంక్షించారు. ఈ మేరకు బుసాన్-ముంబయి, ఇంచియాన్-కోల్‌కతా, ఉల్సాన్-చెన్నై సహా సోదర నగర, మిత్ర నగర సంబంధాలపైనా వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.

మరింత వ్యూహాత్మక విశ్వాసంతో అవగాహన విస్తరణ

9.   చట్టబద్ధ పాలన ప్రాతిపదికగా.. స్వేచ్ఛాయుత, సార్వత్రిక, శాంతియుత, సుసంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతంపై తమ దృక్కోణాల్లో సారూప్యంపై నాయకులిద్దరూ హర్షం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్’లో దక్షిణ కొరియా సభ్యత్వాన్ని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు.

10.     వ్యూహాత్మక, భద్రత సంబంధిత పరిణామాలపై ఉన్నతాధికారుల మధ్య క్రమబద్ధ సంప్రదింపుల ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి నాటి విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య చర్చల్లో భాగంగా భారత్-ఆర్‌ఓకే విదేశాంగ విధానం, భద్రతపై సమావేశాలు సాగాయి. అనంతరం పరస్పర అనుకూల సమయంలో రక్షణ పరిశ్రమ సహకారంపై సంయుక్త కమిటీ సమావేశాన్ని, రక్షణ-విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రుల స్థాయిలో తొలి 2+2 చర్చలను నిర్వహించాలని అప్పట్లో నిర్ణయించారు.

11.      పరస్పర వ్యూహాత్మక విశ్వాసం ప్రాతిపదికగా సరఫరా వ్యవస్థలలో పునరుత్థాన సామర్థ్యం పెంపు, మార్కెట్ వైవిధ్యీకరణకు ప్రోత్సాహం, అత్యాధునిక సాంకేతికతలలో సహకార విస్తృతి లక్ష్యంగా భారత్-ఆర్‌ఓకే ఆర్థిక భద్రత చర్చలు ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.

12.     సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని స్వరూప-స్వభావాల్లోని ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని నాయకులిద్దరూ నిర్ద్వంద్వంగా, తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాల నిర్మూలన, ఉగ్రవాదులకు నిధుల నిరోధం, అంతర్జాతీయ నేరాలతో వాటి బంధాలను విచ్ఛిన్నం చేయడం సహా సరిహద్దుల మీదుగా ముష్కరుల కదలికలను నిరోధంపై సహకార విస్తృతికి వారు అంగీకరించారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22 నాటి ఉగ్రవాదుల మారణకాండను ఉభయపక్షాలూ తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన వారిని, సూత్రధారులను, నిధులు సమకూర్చిన వారిని ఎటువంటి జాప్యం లేకుండా న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ఈ దాడి తమ నిర్వాకమేనని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించడాన్ని అధ్యక్షుడు మయాంగ్‌కు ప్రధానమంత్రి మోదీ వివరించగా, దీనిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పారిశ్రామిక చైతన్యంతో సంయుక్త సత్ఫలితాల సాధన

13.     భారత్-ఆర్ఓకే మధ్య పారిశ్రామిక సహకార కమిటీ ఏర్పాటుపై ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం-పెట్టుబడుల విస్తరణకు ఈ కమిటీ తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్, నౌకా నిర్మాణం, రసాయనాలు, సెమీకండక్టర్లు, టెలికాం, డిస్‌ప్లే, సెకండరీ బ్యాటరీల వంటి రంగాలపై ఇది దృష్టి సారిస్తుంది. అలాగే, వ్యూహాత్మక వనరులు, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థల బలోపేతానికి రెండు దేశాలూ సహకరించుకుంటాయి. గ్రీన్ హైడ్రోజన్-దాని ఉత్పాదకాల వాణిజ్యం, అణు విద్యుత్ ప్లాంట్లు, విదేశీ వనరుల అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి.

14.     ప్రసిద్ధ నౌకా నిర్మాణ, సముద్రయాన దేశమైన ఆర్ఓకేతో దీర్ఘకాలిక-వ్యూహాత్మక ద్వైపాక్షిక సహకారం దిశగా భారత ‘సముద్ర రంగ అమృత కాలం’ దృక్కోణం కొత్త అవకాశాలకు బాటలు వేసింది. ఈ మేరకు ఉభయపక్షాలు నౌకా నిర్మాణం, వాణిజ్యం, సముద్రయాన సదుపాయాలపై భాగస్వామ్యం దిశగా సమగ్ర చట్రాన్ని ఆమోదించడమే కాకుండా దాని సత్వర అమలును ఆకాంక్షించాయి. భారత్‌లో షిప్‌యార్డుల అభివృద్ధి, వ్యవస్థాపనకు తగిన కీలక మౌలిక సదుపాయాల కల్పన, రేవుల కార్యకలాపాలు, షిప్పింగ్-సముద్రయాన సదుపాయాలపై  భారత్‌-కొరియా వాణిజ్య సంస్థల మధ్య కుదిరిన, కార్యాచరణ ఖరారైన వివిధ ‘బి2బి’ ఒడంబడికలను నాయకులిద్దరూ స్వాగతిస్తూ, వాటికి చేయూతనిచ్చేందుకు అంగీకరించారు. సముద్ర పరిశ్రమకు మద్దతిచ్చే అనుబంధ పర్యావరణం వృద్ధికి దోహదపడే తొలి కార్యాలయం ‘కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్’ (KOMEA) ముంబయిలో తన కార్యాలయం ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

15.     ‘ఇండియా-ఆర్‌ఓకె బిజినెస్ ఫోరమ్‌’ సదస్సును నిన్న (2026 ఏప్రిల్ 20) విజయవంతంగా నిర్వహించడాన్ని నాయకులిద్దరూ ప్రశంసించారు. వ్యాపార సంబంధాల నిరంతర విస్తరణ, పారిశ్రామిక సహకార కమిటీ-దాని కార్యాచరణ బృందాల సమావేశాల సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక సంఘాల మధ్య క్రమబద్ధ సంప్రదింపులకు ఉభయపక్షాలు అంగీకరించాయి. అలాగే పెట్టుబడులు, ద్వైపాక్షిక వాణిజ్య సహకారంపై భారత్‌-కొరియా సంస్థల ప్రకటనలను వారు స్వాగతించారు.

16.     భారత, కొరియా కంపెనీల మార్కెట్లలో పరస్పర పెట్టుబడులను ప్రోత్సహిస్తూ సానుకూల వాణిజ్య వాతావరణాన్ని ఇనుమడింపజేయడంపై నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు.

17.     చిన్న-మధ్య తరహా పరిశ్రమల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం ఖరారును వారు స్వాగతించారు. రెండుదేశాల్లోని చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు భారత్-ఆర్ఓకే సహకార విస్తరణ మార్గాలను అన్వేషించాలని సంబంధిత మంత్రిత్వశాఖలు/విభాగాలను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా మార్కెట్లలో నిరంతర అన్వేషణ ద్వారా చిన్న-మధ్య తరహా వ్యాపారాలు ప్రయోజనం పొందే దిశగా వాటి అనుసంధానంపై అవగాహన ఒప్పందం నిర్దేశిత కార్యకలాపాలను చేపట్టాలని సూచించారు.

18.     ఉక్కు పరిశ్రమలో బలమైన వృద్ధిని సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌, కాలుష్య రహిత ఉక్కు తయారీలో సాంకేతికంగా అగ్రస్థానంలోగల ఆర్ఓకేల మధ్య సహకారం నేడెంతో కీలకం. ఉక్కు రంగంలో వాణిజ్య అవకాశాల పెంపు, ఆర్థిక సంబంధాల బలోపేతం, పరిశుభ్ర  ఇంధన పరివర్తనకు ప్రోత్సాహం తదితరాలపై దృష్టి సారిస్తూ భారత్-ఆర్ఓకే వార్షిక ఉక్కు రంగ  చర్చల ప్రారంభానికి వారిద్దరూ అంగీకరించారు. మరోవైపు ఒడిషాలో 6 ఎంఎంటి సమీకృత ఉక్కు తయారీ కర్మాగారం ఏర్పాటుపై ‘పోస్కో-జేఎస్‌డబ్ల్యూ మధ్య అవగాహన ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.

వాణిజ్య.. ఆర్థిక రంగాలు సహా ప్రగతి దృక్కోణంతో భాగస్వామ్యాలకు ఉత్తేజం

19.     భారత్-దక్షిణ కొరియా ద్వైపాక్షిక వాణిజ్య సామర్థ్య సంపూర్ణ సద్వినియోగం, డిజిటల్ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల మధ్య సహకారం, కాలుష్య రహిత ఆర్థిక వ్యవస్థ సహా కొత్త వాణిజ్య మార్గాల్లో పరస్పర ప్రయోజన ఆదానప్రదానాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ గుర్తించారు. ఈ మేరకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) ఉన్నతీకరణ దిశగా చర్చలను పునఃప్రారంభించి, వేగంగా ముగించాలనే నిర్ణయాన్ని స్వాగతించారు.

20.    ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ, నియంత్రణ ఆవిష్కరణలతో విజయవంతమైన భారత సాంకేతికార్థిక విప్లవం సరిహద్దుల మధ్య సహకారానికి అనేక అవకాశాలను సృష్టించింది. ఈ నేపథ్యంలో పరస్పర కార్యాచరణ మెరుగుదల, ఆర్థిక సంబంధాలతోపాటు ప్రజల మధ్య స్నేహం బలోపేతం, రెండు దేశాల డిజిటల్ చెల్లింపు వ్యవస్థల దశలవారీ ఏకీకరణ దిశగా ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’. ‘కొరియా ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అండ్ క్లియరింగ్స్ ఇన్‌స్టిట్యూట్’ల మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. సరిహద్దు ఆర్థిక ఉత్పత్తుల రూపకల్పన, పర్యవేక్షణపై సహకారం-సంప్రదింపుల నిమిత్తం భారత్‌లోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ, దక్షిణ కొరియా ఆర్థిక సేవల కమిషన్-ఆర్థిక పర్యవేక్షక సేవ సంస్థల మధ్య అవగాహన ఒప్పందంపైనా వారు హర్షం ప్రకటించారు.

21.     బ్యాంకింగ్, మూలధన మార్కెట్లు, సాంకేతికార్థిక రంగంలో సహకార రంగాల్లో విస్తృతి సహా రెండు దేశాల ఆర్థిక సంస్థల అధికారులు, సంస్థల భాగస్వామ్యంతో ‘ఆర్‌ఓకే-భారత్‌ ఆర్థిక సహకార వేదిక’ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.

22.    భారత్‌ ఆర్థికాభివృద్ధిలో దక్షిణ కొరియా ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు, తయారీ రంగం సహా వర్ధమాన ఆర్థిక మార్కెట్‌పై పెట్టుబడులను కేంద్రీకరిస్తున్నాయి. ఈ దిశగా భారత్‌లో కొరియా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలు విజయవంతంగా సాగడాన్ని ఇద్దరు నాయకులూ ప్రశంసించారు. మరోవైపు భారత్‌లో కార్యాలయం ఏర్పాటుకు కొరియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆసక్తి చూపడాన్ని వారు స్వాగతించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యాలయ ఏర్పాటుపై పరిశీలన కోసం రావాల్సిందిగా దక్షిణ కొరియా జాతీయ పింఛన్ల సంస్థను కూడా ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు.

23.    భారత్‌-దక్షిణ కొరియా ప్రగతి భాగస్వామ్యానికిగల అపార అవకాశాల దృష్ట్యా ‘కోయికా’ అమలు చేస్తున్న ప్రాజెక్టులు సహా దేశంలోగల నిపుణ పారిశ్రామిక మానవ వనరుల సామర్థ్య వికాస సంబంధిత అభివృద్ధి సహకార విస్తృతిపై సంయుక్త  కృషికి నాయకులిద్దరూ అంగీకరించారు. రెండు దేశాల మధ్య సమర్థ అభివృద్ధి సహకారానికి భరోసా ఇస్తూ కలిసి పనిచేయాలని ఉభయపక్షాలూ నిర్ణయించాయి.

వర్ధమాన పారిశ్రామిక భాగస్వామ్యాలతో వృద్ధిని భవిష్యత్‌ సంసిద్ధం చేయడం

24.    భారత్‌-కొరియా శక్తిమంతమైన పరస్పరపూరక డిజిటల్ సామర్థ్యాలుగల దేశాలు. కాబట్టి, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే పరిశ్రమలు, సాంకేతికతలకు అవి దోహదం చేయగలవు. ఈ నేపథ్యంలో ఏఐ, డేటా గవర్నెన్స్, డిజిటల్ వాణిజ్యంపై దృష్టి సారిస్తూ ‘భారత్-కొరియా డిజిటల్ బ్రిడ్జ్ ఫ్రేమ్‌వర్క్’ ప్రారంభాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. అలాగే, డిజిటల్ ఆవిష్కరణలు, సహకారానికి మద్దతులో సెమీకండక్టర్లు సహా చేయూతనిచ్చే సాంకేతికతల పాత్రను ప్రశంసించారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి గురించి దక్షిణ కొరియా అధ్యక్షుడికి ప్రధానమంత్రి మోదీ వివరించారు. ఈ పరిశ్రమకు ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహకాలతోపాటు విస్తరిస్తున్న మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కొరియా వాణిజ్య సంస్థలకు ఆహ్వానం పలికారు. సౌలభ్యం, సార్వజనీనత సహా ఆవిష్కరణలను ప్రోత్సహించే “అందరి కోసం ఏఐ”, “మానవ్” సూత్రాల స్ఫూర్తితో ఏఐ అభివృద్ధిపై తమ దార్శనికతలను వారు ప్రశంసించారు. పరిశోధనలు-ప్రతిభ పెంపుసహా ఏఐ రంగాలలో భారత్-కొరియా భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు.

25.    ‘రక్షణ పరిశ్రమ సహకారంలో మార్గదర్శక ప్రణాళిక-2020’పై కుదిరిన అవగాహన ఒప్పందాన్ని  పునరుద్ధరించడం ద్వారా ఈ రంగంలో భారత్-దక్షిణ కొరియా సహకారానిగల ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. రెండో విడత ఉత్పత్తి కొనసాగుతున్న కె9-వజ్ర హోవిట్జర్ల సంయుక్త భాగస్వామ్యం విజయవంతంగా కొనసాగడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంచలిత గగనతల రక్షణ ‘గన్-క్షిపణి’ వ్యవస్థల వంటి ఇతర భవిష్యత్ రక్షణ సాంకేతికతలు/వేదికలు సహా పరస్పర ఆసక్తిగల ఇతర రంగాల్లోనూ ఈ విధానం అనుసరణకు సాగుతున్న కృషిని వారు స్వాగతించారు.

26.    ఇరు దేశాల రక్షణ పరిశ్రమలలో ఆవిష్కరణలను గుర్తిస్తూ- వ్యాపారాలు, ఇంక్యుబేటర్లు, పెట్టుబడిదారులు, రక్షణ అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాల అనుసంధానం దిశగా ‘కొరియా-ఇండియా డిఫెన్స్ యాక్సిలరేటర్’ పేరిట ఆవిష్కరణల వేదిక ప్రారంభానికి నాయకులిద్దరూ నిర్ణయించారు.

27.    రెండు దేశాల్లోనూ అంతరిక్ష విజ్ఞానం ఆశావహ జాతీయ అభివృద్ధి రంగం కావడంవల్ల జాతీయ అంతరిక్ష సంస్థల స్థాయిలో సహకారానికిగల అవకాశాల అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ (కాసా)ల మధ్య సంయుక్త కార్యవర్గం ఏర్పాటుకు చేపట్టిన చర్యలను వారు స్వాగతించారు. దీంతోపాటు అంతరిక్ష రంగ అంకుర సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ ‘ఇన్‌-స్పేస్‌’ సహకారంతో ఏప్రిల్ 20న బెంగళూరులో ‘భారత్-ఆర్ఓకె అంతరిక్ష దినోత్సవం’  నిర్వహించడాన్ని ప్రశంసించారు. అలాగే, ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థల మధ్య పరస్పర సహకారానికి అవకాశాలను అన్వేషించాల్సిందిగా తమతమ అధికార యంత్రాంగాలను ఆదేశించారు.

భూమాత కోసం సమైక్య కృషి

28.    హైడ్రోకార్బన్లు, కీలక ఖనిజాల ప్రధాన దిగుమతిదారు దేశాలైన భారత్‌, దక్షిణ కొరియాలు  సమర్థ ఇంధన వినియోగం, ఖనిజాల వెలికితీత-శుద్ధి-పునరుపయోగం దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ గుర్తించారు. ప్రపంచ ఇంధన, వనరుల మార్కెట్‌లో ప్రస్తుత ఒడుదొడుకుల నేపథ్యంలో పర్యావరణపరంగా సుస్థిర విధానాల్లో ప్రత్యామ్నాయ ఇంధనాలు, పదార్థాల సంయుక్త అభివృద్ధికి చర్యలు నేపట్టాలని నిర్ణయించారు. కీలక ఖనిజాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి సురక్షిత, పటిష్ఠ ఆవిష్కరణాధారిత సరఫరా వ్యవస్థల రూపకల్పన ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. ఈ దిశగా కృత్రిమ మేధ వినియోగంతో కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ కోసం ఉభయ దేశాల భూగర్భ సర్వే సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని నిశ్చయించారు. అలాగే, కీలక ఖనిజాల విలువ వ్యవస్థలన్నిటా సహకారానికి అంగీకరించారు. వర్తుల ఆర్థిక కార్యక్రమాల్లో భాగంగా ఇ-వ్యర్థాలు, గనుల వ్యర్థాల వంటి అసంప్రదాయక వనరుల నుంచి కీలక ఖనిజాల వెలికితీతపైనా అంగీకారానికి వచ్చారు.

29.    పాక్స్ సిలికా కార్యక్రమంలో భారత్‌ భాగస్వామ్యంపై అధ్యక్షుడు రాష్ట్రపతి లీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే, వనరుల భౌగోళిక వ్యూహాత్మక నిమగ్నత వేదికకు అధ్యక్షతపై కొరియా నాయకత్వాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. మార్కెట్ స్థితిగతులు, వాణిజ్యపరమైన అంశాలకు అనుగుణంగా సరఫరాకు అంతరాయం లేదా మార్కెట్ అస్థిరత ఏర్పడే సందర్భాల్లో నాఫ్తా వంటి కీలక ముడి పదార్థాల భద్రతపై సహకార బలోపేతానికి కూడా వారు అంగీకరించారు. ఇందులో భాగంగా కీలక ముడి పదార్థాల ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణ అవకాశాలను ఉభయపక్షాలూ అన్వేషిస్తాయి.

30.    ఆర్థిక శ్రేయస్సు ప్రోత్సహించే సానుకూల-గతిశీల కార్యాచరణ ప్రణాళిక ద్వారా వాతావరణ మార్పులపై ప్రపంచ సమస్యల పరిష్కారంలోనూ రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 కింద అవగాహన ఒప్పందం కుదరడాన్ని వారిద్దరూ స్వాగతించారు. పెట్టుబడి ఆధారిత ఉపశమన ప్రాజెక్టుల దిశగా సహకార విధానానికి ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తుంది. తద్వారా రెండు దేశాల జాతీయ నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఇది తోడ్పడుతుంది. అంతేగాక వాతావరణ కార్యాచరణలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

31.     పర్యావరణ బాధ్యతగల దేశాలుగా వాతావరణ-పర్యావరణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం ద్వారా సంస్థాగత తోడ్పాటును సహకారాన్ని కొనసాగించాలని రెండు దేశాలూ  నిశ్చయించాయి. అంతర్జాతీయ సౌర కూటమిలో దక్షిణ కొరియా సభ్యత్వాన్ని, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్లో భారత్‌ సభ్యత్వం స్వీకరించడాన్ని వారు స్వాగతించారు. ఈ నేపథ్యంలో “గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, కోఅలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్”లలో భాగస్వామ్యంపై దక్షిణ కొరియాను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు.

32.    మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో భారత్‌-దక్షిణ కొరియాలకుగల విస్తృత ఆసక్తిని గుర్తిస్తూ- వాతావరణ మార్పు, ఆర్కిటిక్-సముద్ర రంగ  సహకారం సహా అంతర్జాతీయ అంశాలపై విదేశాంగ మంత్రిత్వశాఖల మధ్య చర్చల ప్రారంభం సహా సుస్థిరత రంగంలో సహకారంపై సంయుక్త ప్రకటన ఆమోదంపై వారు హర్షం ప్రకటించారు.

ప్రభావశీల సామర్థ్యం పెంపు

33.    భారత్‌-దక్షిణ కొరియా మధ్యగల సుసంపన్న, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ప్రాతిపదికన రెండు దేశాల్లోని సంస్థల మధ్య సాంస్కృతిక సంబంధాల పటిష్ఠానికి నాయకులిద్దరూ అంగీకరించారు. ఇందులో భాగంగా సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమాన్ని 2026-2030 వరకూ పొడిగించడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీన్ని సముచిత రీతిన అమలు చేసే ప్రణాళికల రూపకల్పన దిశగా సంబంధిత సంస్థలను ఆదేశించారు. మరోవైపు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా 2028-29ని భారత్‌-దక్షిణ కొరియా స్నేహ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించారు.

34.    సాంస్కృతిక-సృజనాధారిత పరిశ్రమలపై  అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి రంగాల్లో సహ-సృజన, శిక్షణపరమైన ఆదానప్రదానం,  సాంకేతిక పరిజ్ఞానాలను పంచుకోవడం సహా చలనచిత్ర రంగ సహకార విస్తృతికి ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

35.    దక్షిణ కొరియాలో ‘ఇండియా డే’, భారత్‌లో ‘కొరియా డే’ వేడుకల నిర్వహణ సహా పరస్పర సుసంపన్న వారసత్వం-ప్రభావశీల సామర్థ్యాల ప్రదర్శనపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు అంగీకారం తెలిపారు.

36.    రెండు దేశాల్లోని బౌద్ధ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ భారత్‌-దక్షిణ కొరియాల మధ్యగల చారిత్రక, నాగరికతా సంబంధాల విస్తృతిపై తమ లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ కొరియాకు 200 కళాఖండాలను భారత్‌ కానుకగా ఇవ్వడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక ఆదానప్రదానాన్ని ప్రోత్సహిస్తూ ‘గిమ్హే’ నగరం చేస్తున్న కృషిని స్వాగతించారు.

37.    ఉభయ దేశాల  మధ్య నిపుణులు, సిబ్బంది ఆదానప్రదానం సహా శిక్షణ, ప్రతిభా వికాసం, క్రీడా విజ్ఞాన కార్యక్రమాలు, విజ్ఞాన భాగస్వామ్యం సహా క్రీడారంగ అధికారులు, సంస్థల మధ్య సహకారం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంతోపాటు సౌలభ్య కల్పనలో సహకారంపై  అవగాహన ఒప్పందం కుదరడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.

ప్రజల మధ్య స్నేహసంబంధాలు

38.    ద్వైపాక్షిక భాగస్వామ్యంలో విద్యారంగ సహకారాన్ని మూలస్తంభంగా రూపొందించడంపై తమ నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. విస్తృత సమాచార, అధ్యాపక-విద్యార్థి ఆదానప్రదాన కార్యక్రమాలు... ప్రత్యేకించి కృత్రిమ మేధ, ‘స్టెమ్‌’ రంగాల్లో ఉమ్మడి విద్యా కార్యకలాపాల ద్వారా విశ్వవిద్యాలయాలు, మాధ్యమిక పాఠశాలల మధ్య సహకారాన్ని వారు స్వాగతించారు.

39.    భాషా-సాంస్కృతిక అవగాహన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ- విద్యా పాఠ్యప్రణాళిక, డిజిటల్ ఉపకరణాలు, ఉపాధ్యాయ శిక్షణ సంబంధిత సంస్థాగత చట్రాల ద్వారా భారత్‌లో కొరియన్ భాషా బోధన-అభ్యసన సహా దక్షిణ కొరియాలో భారతీయ భాషల.. ముఖ్యంగా హిందీ బోధన-అభ్యసనకు వారు అంగీకరించారు. భారత్‌లో ఈ ఏడాది జనవరిలోనే కొరియా తొలి విద్యాకేంద్రాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

40.    దక్షిణ కొరియాలోని ‘కేఎన్‌యూ10’ కన్సార్టియంలో పాల్గొంటున్న 23 భారత ‘ఐఐటీ’లు, 10 కొరియా జాతీయ విశ్వవిద్యాలయాల మధ్య ఉమ్మడి పరిశోధన, క్రెడిట్ బదిలీ, విద్యార్థుల ఆదానప్రదానం ద్వారా విద్యా సహకారం విస్తరణకు ఉభయపక్షాలూ అంగీకరించాయి.

41.     భారతీయ లబ్ధిదారుల కోసం గ్లోబల్ కొరియా స్కాలర్‌షిప్ ఏర్పాటు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అటల్ బిహారీ వాజ్‌పేయి జనరల్ స్కాలర్‌షిప్, కళలు-సంస్కృతికి సంబంధించి ‘ఐసీసీఆర్‌’ లతా మంగేష్కర్ స్కాలర్‌షిప్ పథకం, సంపూర్ణ ఆరోగ్యంపై ఆయుష్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా కొరియా లబ్ధిదారులకు స్కాలర్‌షిప్‌ల మంజూరును నాయకులిద్దరూ అభినందించారు. ద్వైపాక్షిక విద్యా సంబంధాల బలోపేతంలో భాగంగా తమతమ జాతీయ పథకాల పరస్పర స్కాలర్‌షిప్ స్లాట్లను పెంచడం ద్వారా ఈ కార్యక్రమాలను విస్తరించాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నారు.

42.    మానవ వనరుల రంగంలో భారత్‌-దక్షిణ కొరియా మధ్య బలమైన అనుబంధం ఉంది. ఈ మేరకు శాస్త్ర-సాంకేతిక ప్రతిభను పరస్పరం ఉపయోగించుకుంటూ సంబంధిత సంస్థలు, మానవ వనరుల మధ్య సంబంధాల బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించి తదుపరి సైన్స్ అండ్ టెక్నాలజీ జాయింట్ కమిటీ ద్వారా సంయుక్త పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే నిర్ణయాన్ని వారు స్వాగతించారు.

43.    ప్రజల మధ్య మరింత చురుకైన సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను మరింత సమర్థంగా అమలు చేసే మార్గాలను అన్వేషించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. ప్రజలు, వస్తువుల చురుకైన ఆదానప్రదానాన్ని ప్రోత్సహిస్తూ రెండు దేశాల మధ్య విమానయాన అనుసంధానం బలోపేతానికీ వారు అంగీకరించారు.

44.    రెండు దేశాల్లో నివసించే భారత్‌, కొరియా ప్రవాసులకు అందుతున్న సహాయసహకారాలను వారిద్దరూ ప్రశంసించారు. తమతమ దేశాల అభివృద్ధి కోసమే కాకుండా స్వీయ శ్రేయస్సుకు, చురుకైన సామాజిక భాగస్వామ్యానికి మద్దతుపై నాయకులిద్దరూ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ప్రపంచ శ్రేయస్సు దిశగా భాగస్వామ్యం

45.    ప్రపంచ అణు నిరాయుధీకరణ కృషిలో రెండు దేశాల సహకారాన్ని, నిబద్ధతను గుర్తిస్తూ, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అణు సరఫరాదారు దేశాల బృందంలో భారత్‌ సభ్యత్వం దిశగా సంయుక్త చర్యలకు కట్టుబాటును ఉభయ పక్షాలూ ప్రకటించాయి.

46.    ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రకంగా నియమాధారిత, సార్వత్రిక, నిష్పక్షపాత, సమాన, పారదర్శక, సమ్మిళిత, వివక్షారహిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ ఏర్పాటుపూ ఉభయ పక్షాలూ బలమైన నిబద్ధతను పునరుద్ఘాటించాయి. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ సహా ప్రపంచ వాణిజ్య సంస్థ పనితీరు బలోపేతం దిశగా నిర్మాణాత్మక కృషిలో పాలుపంచుకోవాల్సిన ఆవశ్యకతను వారు స్పష్టం చేశారు. దక్షిణ కొరియా 2028లో జి-20కి అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఆ వేదిక సహా బహుళపక్ష వేదికలలో సహకార భాగస్వామ్యానికి భారత్-దక్షిణ కొరియా అంగీకరించాయి.

47.    ‘ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒడంబడిక’ (అంక్లాస్‌)లో ప్రతిపాదించినట్లుగా అంతర్జాతీయ చట్ట నియమాల మేరకు నౌకాయాన, విమానయాన స్వేచ్ఛతోపాటు నిరాటంక, చట్టబద్ధ వాణిజ్యాన్ని గౌరవించడానికి కట్టుబడి ఉన్నామని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ‘అంక్లాస్‌’ సహా ప్రపంచవ్యాప్త గుర్తింపుగల అంతర్జాతీయ చట్టనిబంధనలకు అనుగుణంగా శాంతియుత మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలనూ వారు కోరారు.

48.    పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిస్థితులపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై గౌరవం సహా అంతర్జాతీయ శాంతిభద్రతల ప్రాథమిక సూత్రాలను గౌరవించాలని కోరారు. పౌరుల రక్షణతోపాటు నౌకాయాన స్వేచ్ఛకు ప్రాధాన్యం  ఇవ్వాలని అన్ని పక్షాలకూ విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతల ఉపశమనానికి, అంతర్లీన సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్యమార్గాలను అనుసరించాలని స్పష్టం చేశారు.

49.    కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ సహా శాశ్వత శాంతిపై తమ నిబద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు. రెండు కొరియాల మధ్య ఆదానప్రదానాల విస్తరణ, సంబంధాల సాధారణీకరణ, దశలవారీ అణు నిరాయుధీకరణ సాధన ద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతియుత సహజీవనం, ఉమ్మడి అభివృద్ధి సాధించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యం దిశగా ఉద్రిక్తతల తగ్గింపు, విశ్వాస కల్పన చర్యల ద్వారా కొరియాల మధ్య చర్చల పునఃప్రారంభంపై దక్షిణ కొరియా కృషికి మద్దతుపై భారత్‌ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఉగ్రవాదులకు, ప్రభుత్వేతర శక్తులకు సామూహిక విధ్వంసక ఆయుధాలు, ప్రయోగ వ్యవస్థల వ్యాప్తిని నిరోధించడంపైనా వారు ప్రతినబూనారు.

50.    ఐక్యరాజ్యసమితి చార్టర్‌ సహా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సముచిత, శాశ్వత శాంతికి కట్టుబడి ఉన్నామని వారిద్దరూ తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్‌లో శత్రుత్వం వీడాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు.

51.     ఐక్యరాజ్య సమితి భద్రత మండలిని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, జవాబుదారీగా, భాగస్వామ్య సహితంగానే కాకుండా నేటి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేదిగా రూపొందించాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణలు సహా దాని విస్తరణ కోసం సంయుక్తంగా కృషి చేయాలని ఉభయ పక్షాలు తీర్మానించాయి. అంతేకాకుండా భద్రత మండలిలో సంస్కరణలు సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా శ్రమించాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ అంగీకరించారు.

52.    ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత్-కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమగ్ర సమీక్షను నాయకులు స్వాగతించడంతోపాటు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం 2025 నాటికే దశాబ్దం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రగాఢ సహకార దశాబ్దానికి ఇదొక ప్రతీకగా నిలిచిందని, భవిష్యత్తులో దీన్ని మరింత పటిష్ఠం చేయడానికి ఇదే స్థాయిలో నిబద్ధత చూపుతామని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Tirupati Begins First Mango Pulp Exports To UK Under India-UK FTA

Media Coverage

Tirupati Begins First Mango Pulp Exports To UK Under India-UK FTA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses anguish over the loss of lives due to tunnel collapse in Namchi, Sikkim
July 21, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed anguish over the loss of lives due to the collapse of an under-construction tunnel in Namchi, Sikkim. He extended his deepest condolences to the bereaved families and prayed that those injured recover at the earliest.

The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Shri Modi stated that the injured would be given Rs. 50,000.

In a post on X, the Prime Minister shared:

"Anguished by the loss of lives due to the collapse of an under-construction tunnel in Namchi, Sikkim. I extend my deepest condolences to the bereaved families. I pray that those injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"