భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.

2026 మే 06న ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు తో లామ్‌కు రాష్ట్రపతి భవన్‌లో అధికారికంగా స్వాగతం పలికారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీ, ప్రధాన కార్యదర్శి- అధ్యక్షుడు తో లామ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరు నేతల సమక్షంలో ద్వైపాక్షిక దస్త్రాల మార్పిడి జరిగింది. అధ్యక్షుని గౌరవార్థం ప్రధానమంత్రి మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి- అధ్యక్షుడు తో లామ్ గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆమె కూడా ఆయన గౌరవార్థం రాత్రి సమయంలో విందును ఏర్పాటు చేశారు. ఆయన 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్'లో విధాన ప్రసంగం చేశారు. అలాగే 'వియత్నాం - ఇండియా ఇన్నోవేషన్ ఫోరమ్'ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యాపార వర్గాలతో చర్చలు చేపట్టడంతో పాటు 'వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్'లో ప్రసంగించడానికి ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు తో లామ్ ముంబయిని కూడా సందర్శించనున్నారు.

రాజకీయం

స్నేహపూర్వక, సౌహార్ద వాతావరణంలో ప్రధానమంత్రి మోదీ, ప్రధాన కార్యదర్శి- అధ్యక్షుడు తో లామ్ సమగ్ర చర్చలు జరిపారు. వారు ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను మార్చుకున్నారు. వియత్నాం అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి‌ తో లామ్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ.. ఆయన నాయకత్వంలో వియత్నాం తన అభివృద్ధి ఆకాంక్షల దిశగా స్థిరమైన పురోగతిని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అభివృద్ధి- అధిక ఆర్థిక వృద్ధిలో సాధించిన కీలక విజయాలు, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయటంతో పాటు గ్లోబల్ సౌత్ సహకారాన్ని ప్రోత్సహించడానికి భారత్ తీసుకున్న చర్యల విషయంలో ప్రధానమంత్రి మోదీని ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు తో లామ్ అభినందించారు. భారత్ - వియత్నాం సంబంధాలను మరింత బలోపేతం చేయడం వల్ల రెండు దేశాల ప్రజలకు పరస్పర ప్రయోజనాలు చేకూరుతాయని.. భారత్‌దేశ 'వికసిత్ భారత్ 2047', వియత్నాంకు సంబంధించిన 'విజన్ 2045' వంటి రెండు దేశాల జాతీయ లక్ష్యాలను సాధించడంలో ఇది అర్థవంతంగా దోహదపడుతుందని ఇరువురు నాయకులు ప్రధానంగా చెప్పారు.

ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో వస్తున్న పరివర్తనాత్మక మార్పులపై ఉమ్మడి అభిప్రాయాలను పంచుకుంటూ.. అనేక రంగాలలో పరస్పర నమ్మకం, గౌరవం, అవగాహన, ఉమ్మడి దృక్పథం, సమర్థవంతమైన సహకారం ఆధారంగా ఏర్పడిన సంబంధాల బలమైన పునాదిని గుర్తిస్తున్నట్లు ఇరువురు నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో అపారమైన సద్భావనను స్పష్టమైన ఫలితాలుగా మార్చే దిశగా 'ఉమ్మడి దృక్పథం, వ్యూహాత్మక సమన్వయం, సార్థక సహకారం' స్ఫూర్తితో ద్వైపాక్షిక సంబంధాలను 'మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లేందుకు వారు అంగీకరించారు.

2026 నాటికి భారత్ - వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయన్న ఇరువురు నాయకులు.. ఈ సందర్భాన్ని సముచిత రీతిలో జరుపుకోవడానికి అంగీకరించారు. గత దశాబ్దంలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన చెప్పుకోదగిన పురోగతిని స్వాగతిస్తూ భారత్- వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై 2024 ఆగస్టులో చేసిన ఉమ్మడి ప్రకటన.. 2020 నాటి భారతదేశ-వియత్నాం శాంతి, శ్రేయస్సు, ప్రజల కోసం ఉమ్మడి దృక్పథం.. రెండు దేశాల నాయకుల మధ్య జరిగిన సమావేశాల ఫలితంగా వెలువడిన నిర్ణయాలు సహా ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు, పర్యటనల్లో తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయటాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. నాయకత్వ స్థాయిలతో సహా అన్ని స్థాయిలలో క్రమమైన సంబంధాలను కొనసాగించడానికి నాయకులు అంగీకరించారు.

భారత పార్లమెంట్‌లో 'ఇండియా-వియత్నాం పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్' ఏర్పాటును ప్రస్తావించిన ఇరువురు నాయకులు.. ఇరు దేశాల చట్టసభల మధ్య సహకారాన్ని పెంపొందించడాన్ని స్వాగతించారు. అలాగే 'ఇంటర్-పార్లమెంటరీ యూనియన్', 'ఆసియాన్ ఇంటర్-పార్లమెంటరీ అసెంబ్లీ' వంటి బహుపాక్షిక వేదికల్లో ఇరుపక్షాల పార్లమెంటరీ ప్రతినిధుల బృందాల మధ్య సన్నిహిత సమన్వయం కొనసాగించేందుకు అంగీకరించారు.

సహకారానికి సంబంధించిన వివిధ రంగాల్లో ఇప్పటికే ఉన్న సంస్థాగత యంత్రాంగాల ద్వారా జరుగుతున్న క్రమబద్ధమైన చర్చలు, మార్పిడి కార్యక్రమాలు.. పరస్పర నమ్మకాన్ని మరింతగా పెంచాయని, పరస్పర అవగాహనను పెంపొందించాయని ఇరువురు నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంప్రదింపులు- వ్యూహాత్మక చర్చలతో పాటు ఆర్థిక, వాణిజ్య, శాస్త్రీయ సహకారంపై ఉమ్మడి కమిషన్ సమావేశాలు.. భారత్ - వియత్నాం సంబంధాలకు ప్రధాన స్తంభాలుగా కొనసాగించేందుకు వారు అంగీకరించారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఆరోగ్యం, ఐసీటీ, సైబర్, శాస్త్ర సాంకేతికత, అంతరిక్షం- అణుశక్తి వంటి రంగాల్లో ఈ యంత్రాంగాల కింద సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కూడా వారు అంగీకరించారు. వ్యూహాత్మక దౌత్య - రక్షణ చర్చల (2+2) ఏర్పాటు కోసం ఇరుపక్షాలు ఎదురుచూస్తున్నాయి.

2024 – 2028 కాలానికి భారత్, వియత్నాం మధ్య ఉన్న కార్యాచరణ ప్రణాళికతో పాటు ఈ ఉమ్మడి ప్రకటనకు సంబంధించిన సమర్థవంతమైన అమలును వేగవంతం చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు.

ఆర్థికం, వాణిజ్యం, పెట్టుబడులు

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు, వ్యాపారాల స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత 10 సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యంలో జరిగిన వృద్ధిని గుర్తించిన నాయకులు.. దీనిని మరింత సమతుల్యమైన, పరస్పర ప్రయోజనకరమైన రీతిలో పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా చెప్పారు. అంతేకాకుండా 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల కొత్త వాణిజ్య లక్ష్యాన్ని సాధించేందుకు అంగీకరించారు.

వ్యవసాయ ఉత్పత్తులతో సహా ఆయా దేశాల్లో మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. భారతీయ ద్రాక్ష, వియత్నాం డ్యూరియన్లకు మార్కెట్ యాక్సెస్ కల్పించే నిర్ణయాన్ని వారు స్వాగతించారు. అలాగే వేగవంతమైన ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి భారతీయ దానిమ్మ, వియత్నాం పొమెలోలకు మార్కెట్ యాక్సెస్‌ను వేగవంతం చేయడానికి వారు అంగీకరించారు.

పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సరఫరా గొలుసులను మెరుగుపరచడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. దేశ సరఫరా వనరులను వైవిధ్య పరచడానికి.. దేశీయ ఉత్పత్తి, ఎగుమతి అవసరాలను తీర్చడానికి భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే విషయంలో వియత్నాం నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రమాణాల అనుకూలత ధ్రువీకరణతో సహా రెండు దేశాల కంపెనీలకు వ్యాపార సౌలభ్యాన్ని సులభతరం చేయడానికి మరింత అనుకూలమైన నియంత్రణ వాతావరణం కోసం మార్గాలను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంస్థాగత యంత్రాంగాల కింద పరస్పర ఆందోళనలను పరిష్కరించేందుకు నిర్మాణాత్మక చర్చలను కొనసాగించటానికి ఉన్న ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా చెప్పారు.

ఆసియాన్-ఇండియా వస్తు వాణిజ్య ఒప్పందం (ఏఐటీఐజీఏ) విషయంలో ప్రస్తుతం కొనసాగుతున్న సమీక్షను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరువురు నాయకులు అంగీకరించారు. దీని ఫలితంగా ఏర్పడే ఒప్పందం పరస్పర ప్రయోజనకరంగా ఉండాలని, వాణిజ్యాన్ని సులభతరం చేయాలని, ప్రస్తుత ప్రపంచ వాణిజ్య పద్ధతులకు అనుగుణంగా ఉండాలని వారు ఏకీభవించారు.

భారత్- వియత్నాం ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి.. ముఖ్యంగా అధునాతన సాంకేతికత, రవాణా, తయారీ, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ వ్యవసాయం, ఎలక్ట్రిక్ వాహనాలు, సమాచార సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం- వ్యవసాయ-ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్, పర్యాటకం, ఆతిథ్యం వంటి రంగాలలో ఎక్కువ ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి నాయకులు అంగీకరించారు. అలాగే రెండు దేశాల అంకుర వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయటంతో పాటు ఆవిష్కరణ కేంద్రాల మధ్య సార్థక సహకారాన్ని ప్రోత్సహించాలని వారు అన్నారు. 

చమురు, సహజవాయువు అన్వేషణ రంగంలో భారత్, వియత్నాంల మధ్య దశాబ్దాల నాటి సంస్థాగత సంబంధాలను ప్రశంసించిన ఇరువురు నాయకులు.. ఈ రంగంలో పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు. వియత్నాం చట్టం, అంతర్జాతీయ చట్టానికి ముఖ్యంగా 1982 ‘యూఎన్‌సీఎల్ఓఎస్’కు అనుగుణంగా... భారతీయ కంపెనీలు పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్న కొత్త బావుల అభివృద్ధి వంటి వాటితో సహా అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను మరింతగా పెంచడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.

ఈ-కామర్స్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించిన ఇరు పక్షాలు.. వీటి వృద్ధికి మద్దతు ఇచ్చేలా నిబంధనలు, విధానాలను రూపొందించడంలో అనుభవాలను పంచుకోవడం ద్వారా ఈ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అంగీకరించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు ఈ-కామర్స్‌లో పాల్గొనేలా.. ప్రాంతీయ, ప్రపంచ విలువ గొలుసులలో లోతుగా, స్థిరంగా అనుసంధానమయ్యేందుకు వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలని వారు నిర్ణయించారు.

ఆరోగ్యం

ఆరోగ్య రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి నిబద్ధతతో ఉన్నట్లు ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ సాధించిన పురోగతిని గుర్తిస్తూ... పరస్పర అంగీకారం ప్రకారం వియత్నాం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల కోసం మందుల కొనుగోలు ప్రక్రియలో 2027 నుంచి భారతీయ కంపెనీలు పాల్గొనే అవకాశాలను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సాంకేతికతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంతో సహా ఆరోగ్య సంరక్షణ డిజిటల్ పరివర్తనలో సహకారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వారు తెలిపారు. 

రెండు దేశాల్లో సంప్రదాయ వైద్యానికి ఉన్న సుదీర్ఘ చరిత్ర, గొప్ప వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సన్నిహిత సంస్థాగత అనుసంధానాలను ప్రోత్సహిస్తూనే జ్ఞానం, పరిశోధన, ఉత్తమ పద్ధతుల మార్పిడిని పెంపొందించడానికి ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. సంప్రదాయ వైద్యంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోనే ప్రక్రియను పూర్తి చేసే విషయంలో పురోగతిని, వియత్నాంలో 'ఆయుర్వేద అకడమిక్ చైర్' ఏర్పాటుకు ప్రతిపాదించిన అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు.

రక్షణ, భద్రత

భారత్-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ, భద్రతా సహకారం ప్రధాన ఆధారమని ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలకు మార్గదర్శకంగా ఉన్న '2030 నాటికి ఇండియా-వియత్నాం రక్షణ భాగస్వామ్యం కోసం ఉమ్మడి దృక్పథ ప్రకటన' సమర్థవంతమైన అమలును వారు ప్రశంసించారు.

రక్షణ సహకారంలో సంప్రదాయ, వర్ధమాన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, సంప్రదింపులను పెంపొందించడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. వీటిలో రక్షణ విధాన చర్చలు, ఉమ్మడి విన్యాసాలు, సిబ్బంది చర్చలు, కొత్త రక్షణ సాంకేతికతలపై ఉమ్మడి పరిశోధన- సహోత్పత్తి, నావికాదళ నౌకలు- వైమానిక దళ విమానాలచే నౌకాశ్రయ సందర్శనలను పెంచడం, శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, సమాచార భాగస్వామ్యం, హైడ్రోగ్రఫీ, రక్షణ ప్రదర్శనలు, సామర్థ్య పెంపుదల, రక్షణ పారిశ్రామిక సహకారం, సముద్ర భద్రత, సముద్ర రక్షణ, పరస్పర ఆసక్తి- ప్రాధాన్యతల ఆధారంగా నిర్వహించే అన్వేషణ- రక్షణ కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ స్థిరత్వానికి దోహదపడతాయి. రెండు దేశాల మధ్య రక్షణ రంగ కొనుగోళ్లను పెంచాలని వారు నిర్ణయించారు.

వియత్నాం దేశానికి భారత్ ఇచ్చిన రక్షణ రంగ లైన్స్ ఆఫ్ క్రెడిట్ అమలులో స్థిరమైన పురోగతిని నాయకులు స్వాగతించారు. ఇవి వియత్నాం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడ్డాయి. 

మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్.. జలాంతర్గామి అన్వేషణ- రక్షణ మద్దతు, సహకారంపై అవగాహన ఒప్పందం.. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఉద్దేశపూర్వక లేఖతో సహా ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల అమలుపై నాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

వియత్నాం తీరంలో 2025 మే నెలలో రెండు నౌకాదళాలు నిర్వహించిన తొలి ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వేను ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. భవిష్యత్తులోనూ క్రమం తప్పకుండా ఇలాంటి సర్వేలను నిర్వహించేందుకు వారు అంగీకరించారు.

సామర్థ్య పెంపుదల కోసం న్హా ట్రాంగ్‌లోని టెలికమ్యూనికేషన్స్ యూనివర్సిటీ (టీసీయూ), నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ కాలేజీలలో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళ శిక్షణా బృందాల ద్వారా ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద వియత్నాం రక్షణ సిబ్బందికి భారత్‌ అందించిన శిక్షణను వియత్నాం అభినందించింది. న్హా ట్రాంగ్‌లోని టీసీయూలో ఆర్మీ సాఫ్ట్‌వేర్ పార్క్ ఏర్పాటుకు భారత్ అందించిన మద్దతును కూడా వియత్నాం ప్రశంసించింది. 2027 - 2030 కాలానికి ‘ఏడీఎంఎం-ప్లస్ ఈడబ్ల్యూజీ’కి (ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్-ప్లస్ ఎక్స్‌పర్ట్స్ వర్కింగ్ గ్రూప్) రెండు దేశాలు సహ-అధ్యక్షత వహించడాన్ని నాయకులు స్వాగతించారు.

భారత న్యాయ మంత్రిత్వ శాఖ, వియత్నాం న్యాయ మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా రెండు దేశాల మధ్య చట్టపరమైన, న్యాయపరమైన రంగాల్లో  సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.

భాగస్వామ్య లక్ష్యాలను సాధించేందుకు వియత్నాం ప్రజా భద్రత మంత్రిత్వ శాఖ, భారతదేశ జాతీయ భద్రతా మండలి కార్యాలయం మధ్య సహకారాన్ని మరింత దృఢంగా చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సమాచార భాగస్వామ్యం, సైబర్ భద్రత, ఉగ్రవాదాన్ని నిరోధించటం, హై-టెక్ నేరాలు, అంతర్జాతీయ నేరాలు, మనీలాండరింగ్, ఆన్‌లైన్ మోసాలను అణచివేయడం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించాలన్న అభిప్రాయంపై వారు ఏకీభవించారు. ఇండియా-వియత్నాం భద్రతా చర్చలతో సహా ఇప్పటికే ఉన్న సహకార యంత్రాంగాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు ప్రముఖంగా చెప్పాయి. 

'మొదటి ఇండియా - వియత్నాం సైబర్ విధాన చర్చలు' విజయవంతంగా నిర్వహించడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఈ సమావేశంలో సైబర్ విధానాల్లో ఇటీవలి పరిణామాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. దీనితో పాటు సైబర్ ముప్పు స్థాయిని సమీక్షించిన రెండు దేశాలు.. ద్వైపాక్షిక సహకార రంగాలను గుర్తించాయి. ఐసీటీ సమస్యలపై ఉమ్మడి సామర్థ్య పెంపుదల కార్యకలాపాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా ఇందులో చర్చించాయి.

భద్రతా రంగంలో అనుభవాలను పంచుకోవటాన్ని పెంపొందించుకోవడానికి, సహకారాన్ని విస్తరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇందులో చట్టాన్ని అమలు చేసే అధికారులకు శిక్షణ, సామర్థ్య పెంపుదలను ప్రోత్సహించడం.. వృత్తిపరమైన శిక్షణ, విదేశీ భాషా శిక్షణ, సైబర్ భద్రతా సంఘటనల స్పందన నైపుణ్యాలు, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం.. పరస్పర అంగీకారంతో ఇతర సహకార కార్యక్రమాలను చేపట్టడం వంటి అంశాలు ఉన్నాయి.

సముద్రయానం

భారత్, వియత్నాంలు సహస్రాబ్దాల నాటి సంబంధాలు కలిగిన సముద్రతీర దేశాలని గుర్తించిన ఇరువురు నాయకులు.. సహకారంలోని ప్రధాన స్తంభాలలో సముద్రయానం ఒకటని ప్రధానంగా చెప్పారు. ఇరుపక్షాల మధ్య సముద్రయాన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక సముద్రయాన భద్రతా చర్చలు.. పరస్పర నమ్మకాన్ని, సంబంధిత ఆందోళనలపై మెరుగైన అవగాహనను పెంపొందించాయని గుర్తిస్తున్నట్లు తెలిపారు. దీనిని క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా చెప్పారు. సముద్రయాన రంగ అవగాహనలో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్‌లోని గురుగ్రామ్‌లో ఉన్న ‘ఐఎఫ్‌సీ-ఐఓఆర్’లో (ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – హిందూ మహాసముద్ర ప్రాంతం) అంతర్జాతీయ అనుసంధాన అధికారిని నియమించాలన్న ఆహ్వానం విషయంలో భారత్‌కు వియత్నాం కృతజ్ఞతలు తెలిపింది. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమంలో (ఐపీఓఐ) వియత్నాం చేరడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఆ ఫ్రేమ్‌వర్క్ కింద మెరుగైన సహకారం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐపీఓఐ, ఏఓఐపీ (ఆసియాన్ అవుట్‌లుక్ ఆన్ ది ఇండో-పసిఫిక్) మధ్య మరింత సమన్వయాన్ని పెంపొందించటంతో పాటు ఆసియాన్-ఇండియా సముద్ర సహకార సంవత్సరం 2026లో  సహకారాన్ని ప్రోత్సహిస్తూ ఐపీఓఐ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో భారత్, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకోవటాన్ని  వియత్నాం కొనసాగిస్తుంది.

సముద్ర పరిశీలన ప్లాట్‌ఫా‌మ్‌లు, డేటా నిర్వహణ, సముద్ర అంచనాలు- సేవలు, సామర్థ్య పెంపుదల, సముద్ర శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలతో సహా సముద్ర శాస్త్రంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. పాంగేసియస్ బ్రీడింగ్- ఫార్మింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు భారత్‌లో భారత్‌లో నత్తలు లేదా ముత్యపు చిప్పలు పెంపకం- సేకరణను సులభతరం చేయడంలో వియత్నాంతో సహకారాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు.

కీలకమైన, వర్ధమాన సాంకేతికతలతో సహా శాస్త్ర సాంకేతికత

డిజిటల్ సాంకేతికతల ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఆర్థిక ఆవిష్కరణలు, డిజిటల్ చెల్లింపులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్, వియత్నాం స్టేట్ బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని స్వాగతించారు. రెండు వైపులా పర్యాటకం, వ్యాపారాన్ని సులభతరం చేసే క్యూఆర్ కోడ్ ఆధారిత రిటైల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ల అనుసంధానాన్ని ప్రోత్సహించేందుకు వారు అంగీకరించారు.

డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, 6జీ, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష - అణు సాంకేతికత, సముద్ర శాస్త్రాలు, జీవసాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలు వంటి కీలకమైన, వర్ధమాన సాంకేతిక రంగాలలో మరింత సహకారం, భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ఇరు పక్షాల నాయకులు అంగీకరించారు. ఈ సహకారం పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా ఉమ్మడి పరిశోధన, పరిశోధన- అభివృద్ధి కేంద్రాలు, ఉత్పత్తుల అభివృద్ధి వంటి ఆచరణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది.

ఆయా దేశాల వాతావరణ- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇంధన పరివర్తన ప్రాధాన్యతలను ఇరువురు నాయకులు గుర్తించారు. అలాగే స్వచ్ఛ, పునరుత్పాదక ఇంధనంతో పాటు వాతావరణ, విపత్తు-నిరోధక సాంకేతికతలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి వారు అంగీకరించారు. ఈ విషయంలో మిషన్ లైఫ్ (పర్యావరణం కోసం జీవనశైలి), అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) వంటి సంస్థల ప్రాముఖ్యతను వారు గుర్తించారు. అంతర్జాతీయ జీవఇంధన కూటమి‌లో (జీబీఏ) చేరడానికి వియత్నాం ఆసక్తి చూపటాన్ని భారత్ స్వాగతించింది. విపత్తు ప్రమాదాల తగ్గింపు, దృఢత్వంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో సీడీఆర్ఐ (కొయాలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు అంగీకరించారు. స్మార్ట్ వ్యవసాయం, సుస్థిర నీటి నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణలో డిజిటల్, అధునాతన సాంకేతికతలను వర్తింపజేయడంలో మరింత సహకారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వారు తెలిపారు. 

అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించే రంగంలో కొనసాగుతున్న సహకారంపై ఇరువురు నాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే అణుశక్తిపై జరిగిన 4వ ఇండియా-వియత్నాం సంయుక్త కమిటీ సమావేశం ఫలితంగా పెరిగిన సహకారం విషయంలో వివిధ మార్గాలపై అనుసరణను పెంచాలని వారు అంగీకరించారు. వియత్నాం అణు విద్యుత్ రంగంలో పాల్గొనాల్సిందిగా చేసిన ఆహ్వానాన్ని భారత్ అభినందించింది. కోబాల్ట్-60 సరఫరా చేసినందుకు భారత్‌కు వియత్నాం కృతజ్ఞతలు తెలిపింది. దీని విషయంలో వియత్నాం నిరంతర సరఫరా కోసం విధివిధానాలను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

వియత్నాంలో ఆసియాన్-ఇండియా ట్రాకింగ్, డేటా రిసెప్షన్ స్టేషన్, డేటా ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో సాధించిన పురోగతిని ఇరువురు నాయకులు గుర్తించారు. ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తవడానికి వీలుగా తన నుంచి మిగిలి ఉన్న ప్రక్రియలను వేగంగా పూర్తి చేసేందుకు వియత్నాం అంగీకరించింది.

అరుదైన ఖనిజాల రంగంలో పరస్పర సహకారం కోసం భారత ప్రభుత్వానికి చెందిన ఐఆర్ఈఎల్ (ఇండియా) లిమిటెడ్, వియత్నాం ప్రభుత్వానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ఆఫ్ రేడియోయాక్టివ్ అండ్ రేర్ ఎలిమెంట్స్ (వినటోమ్) మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. దీనిని త్వరగా, పూర్తిగా అమలు చేయాలని వారు ప్రముఖంగా చెప్పారు.

అభివృద్ధి భాగస్వామ్యం

మెకాంగ్-గంగా సహకార ఫ్రేమ్‌వర్క్ కింద క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్‌లు (క్యూఐపీలు), ఐటీఈసీ కార్యక్రమాలు, విద్యకు సంబంధించిన ఉపకారవేతనాల మద్దతుతో రెండు దేశాల మధ్య ఉన్న విస్తృత, ప్రభావవంతమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు ప్రశంసించారు. వియత్నాంలో ఉన్న 34 ప్రావిన్సులలోని 32 ప్రావిన్సులలో భారత్‌ మద్దతుతో అమలవుతోన్న 66 క్యూఐపీల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి చూపించిన క్షేత్ర స్థాయి సామాజిక-ఆర్థిక ప్రభావానికి గాను స్థానిక ప్రభుత్వాల, సంఘాల నుంచి ఇవి విస్తృత ప్రశంసలు అందుకున్నాయి.

ద్వైపాక్షిక అభివృద్ధి సహకారంలో భారతదేశానికి చెందిన ఐటీఈసీ కార్యక్రమం ఒక కీలకమైన స్తంభమని ఇరువురు నాయకులు చెప్పారు. వియత్నాం అధికారుల సామర్థ్య పెంపుదలకు ఐటీఈసీ కార్యక్రమం ద్వారా వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక శిక్షణ కోర్సులతో పాటు విద్యార్థులు, స్కాలర్ల కోసం ఐసీసీఆర్ ఉపకారవేతనాల ద్వారా భారత్‌ అందిస్తున్న బలమైన, నిరంతర మద్దతుకు వియత్నాం ప్రశంసలను తెలిపింది.

రెండు దేశాల విశ్వవిద్యాలయాలు, మేధో సంస్థలు, ఇతర సంస్థల మధ్య విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధనల మార్పిడిని ఇరువురు నాయకులు ప్రోత్సహించారు. భారత్‌లోని నలంద విశ్వవిద్యాలయం, వియత్నాంకు చెందిన హో చి మిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ పాలిటిక్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు.

సంస్కృతి, పర్యాటక సహకారం.. ప్రజల మధ్య సంబంధాలు

2025 మే-జూన్ నెలల మధ్య ప్రదర్శన కోసం వియత్నాంకు బుద్ధుని పవిత్ర అవశేషాలను పంపినందుకు భారతదేశానికి వియత్నాం కృతజ్ఞతలు తెలిపింది. పవిత్ర అవశేషాల పట్ల వియత్నాం ప్రజలు చూపిన అపారమైన స్పందన.. రెండు దేశాల మధ్య ఉన్న లోతైన నాగరికతా బంధాలు, భాగస్వామ్య ఆధ్యాత్మిక వారసత్వం, శాశ్వతమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తోందని నాయకులు అన్నారు. 

ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం కీలకమైన చోదకమని ఇరువురు నాయకులు అన్నారు. పర్యాటక రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం కుదరడాన్ని వారు స్వాగతించారు. సాంస్కృతిక, వారసత్వ, వైద్య- సంరక్షణ పర్యాటకంతో సహా ఇరువైపులా పర్యాటక రంగాన్ని సుస్థిర, సమ్మిళిత పద్ధతిలో వృద్ధి చేయాలని వారు నిర్ణయించారు. వియత్నాం పర్యాటకులు, యాత్రికులను భారతదేశంలోని బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను సందర్శించాల్సిందిగా ప్రధాన మంత్రి మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు పెరగడాన్ని స్వాగతిస్తూ... విమానయాన అనుసంధానాన్ని మరింత పెంచే అంశంపై చర్చించాలని ఆయా పౌర విమానయాన అధికారులను ప్రోత్సహిస్తున్నట్లు వారు తెలిపారు.

2026 - 2030 కాలానికి గాను 'సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం'పై సంతకం చేయడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత ప్రోత్సహించడానికి వారు  అంగీకరించారు.

రెండు దేశాల మధ్య ఉన్న లోతైన నాగరికతా బంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బౌద్ధ పండితులు, సన్యాసులు, యాత్రికులు, విద్యార్థుల రాకపోకలను మరింతగా ప్రోత్సహించాలని ఇరువురు నాయకులు పిలుపునిచ్చారు.

వియత్నాంలోని 'మై సన్' యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని పరిరక్షించడానికి భారత్‌ చూపిన నిబద్ధతను వియత్నాం అభినందించింది. అలాగే ఏ, హెచ్, కే బ్లాక్‌లలో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన పునరుద్ధరణ, పరిరక్షణ పనులను.. ఈ, ఎఫ్ బ్లాక్‌లలో కొనసాగుతున్న పనులను.. వియత్నాంలోని డాక్ లాక్ ప్రావిన్స్‌లో నహాన్ టవర్ ప్రాజెక్ట్‌ను వియత్నాం ప్రశంసించింది.

వియత్నాంలోని అనేక నగరాలు, ప్రావిన్సులలో 'అంతర్జాతీయ యోగ దినోత్సవం' ఏటా నిర్వహించడానికి వియత్నాం అందిస్తున్న మద్దతును భారత్ అభినందించింది. ఇరు దేశాల యోగ సంస్థల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి ఇద్దరు నాయకులు మద్దతు తెలిపారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని మరింత మెరుగుపరించేందుకు వారు అంగీకరించారు. ఇందులో భాగంగా డా నాంగ్ విశ్వవిద్యాలయం, యూనివర్శిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్‌లలో 'ఐసీసీఆర్ చైర్స్ ఆఫ్ ఇండియా స్టడీస్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముంబయి, హో చి మిన్ నగరాల మధ్య 'స్నేహం, సహకార స్థాపన'కు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదరడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇటువంటి సహకారం, అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వారు తెలిపారు. 

మానవ వనరుల చలనశీలత రంగంలో సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను ఇరుపక్షాలు ప్రముఖంగా పేర్కొన్నాయి. శ్రామిక మార్కెట్ చలనశీలతను సులభతరం చేయడంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను పరిష్కరించడానికి 'కాన్సులర్ డైలాగ్' ఏర్పాటు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.

ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం

మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులను గుర్తించిన ఇరువురు నాయకులు.. ఈ ప్రాంతంలో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, సహకారం, శ్రేయస్సు ఆధారంగా అంతర్జాతీయ సూత్రాలపై ఆధారపడిన అంతర్జాతీయ క్రమాన్ని ప్రోత్సహించడానికి భారత్, వియత్నాంల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక ఏకాభిప్రాయాన్ని ప్రధానంగా చెప్పారు. ప్రపంచ క్రమంలో 'గ్లోబల్ సౌత్' స్వరం, పాత్రను బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఐక్యరాజ్యసమితితో సహా వివిధ బహుపాక్షిక వేదికలపై సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. బహుపాక్షికత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో (యూఎన్ఎస్‌సీ) సహా అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలకు బలమైన మద్దతును ఇస్తున్నట్లు ఇరువురు నాయకులు పేర్కొన్నారు. తద్వారా అవి మరింత ప్రాతినిధ్యం వహించేలా, సమకాలీన వాస్తవ పరస్థితులను ప్రతిబింబించేలా చేయాలని వారు అన్నారు. సంస్కరించిన యూఎన్‌ఎస్‌సీలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి వియత్నాం అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

భారత 2026 బ్రిక్స్ అధ్యక్షతను వియత్నాం స్వాగతించింది. అదే సమయంలో బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా వియత్నాం పాత్రకు మద్దతు ఇచ్చే విషయంలో భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించింది.

భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీ, విజన్ మహాసాగర్, ఇండో-పసిఫిక్ విజన్‌లలో వియత్నాం ఒక కీలక భాగమని ఇరువురు నాయకులు అన్నారు. ఇది మెకాంగ్ ఉప-ప్రాంతం, ఆసియాన్, ఇండో-పసిఫిక్ ప్రాంతాలతో భారతదేశ సంబంధాలను ముందుకు తీసుకెళ్తుంది. స్వేచ్ఛాయుత, బహిరంగ, నిబంధనలతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తమ భాగస్వామ్య దృక్పథాన్ని ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు సంబంధించిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ నిర్మాణంలో ఆసియాన్ ఐక్యత, ఆసియాన్ కేంద్రీకృతానికి భారత్ అందిస్తోన్న స్థిరమైన మద్దతును వియత్నాం అభినందించింది. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు మద్దతు ఇచ్చాయి. ఇది సభ్య దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పరిపూర్ణం చేస్తుంది.

సుసంపన్నత, భద్రత మధ్య ఉన్న సంబంధాన్ని ప్రధానంగా చెబుతూ.. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వం, భద్రత, నావిగేషన్, విమానయాన స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలకు ముఖ్యంగా 1982 నాటి ఐక్యరాజ్యసమితి సముద్రపు చట్టాల సదస్సు (యూఎన్‌సీఎల్ఓఎస్) నిబంధనలకు అనుగుణంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని.. బలప్రయోగం లేదా బెదిరింపులకు పాల్పడొద్దని వారు పిలుపునిచ్చారు. వివాదాలు ఉన్న దేశాలు, ఇతర దేశాల కార్యకలాపాలలో సైనికీకరణను నివారించాలని.. సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఇరువురు నాయకులు ప్రముఖంగా చెప్పారు. సముద్రాలు, మహాసముద్రాలలోని అన్ని కార్యకలాపాలను నియంత్రించే సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ యూఎన్‌సీఎల్ఓఎస్ అని వారు స్పష్టం చేశారు. అలాగే దక్షిణ చైనా సముద్రంలో 'పార్టీల ప్రవర్తనపై ప్రకటన'ను (డీఓసీ) పూర్తిగా, సమర్థవంతంగా అమలు చేయాలని.. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభావవంతమైన 'ప్రవర్తనా నియమావళి'ని (సీఓసీ) వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు.

సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల, రూపాల ఉగ్రవాదాన్ని ఇరువురు నాయకులు ఏకగ్రీవంగా ఖండించారు. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని.. ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ద్వారా సమగ్ర, నిరంతర పద్ధతిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమష్టి అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిధుల నెట్‌వర్క్‌లు- సురక్షిత ప్రాంతాలను అడ్డుకోవాలని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయ వ్యవస్థ ముందుకు తీసుకురావాలని నాయకులు స్పష్టం చేశారు.

తనతో పాటు తన ప్రతినిధి బృందానికి అందించిన ఘన స్వాగతం, అద్భుతమైన ఏర్పాట్ల విషయంలో ప్రధాన మంత్రి మోదీకి జనరల్ సెక్రటరీ, అధ్యక్షుడు తో లామ్ కృతజ్ఞతలు తెలిపారు. వియత్నాంను సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UP's exports to BRICS nations, partners cross $5.36 billion in FY26: Govt

Media Coverage

UP's exports to BRICS nations, partners cross $5.36 billion in FY26: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister visits Skilling Centre in Pahadpur village, lauds focus on skill development
June 20, 2026

The Prime Minister, Shri Narendra Modi, visited a Skilling Centre in Pahadpur village.

The Prime Minister noted that President, Smt. Droupadi Murmu has focused on the skilling sector and added momentum to her village’s development journey.

Shri Modi said it is heartening to see the youth being equipped with skills that open new avenues of opportunity and self-reliance.

In a post on X, Shri Modi said;

“Visited a Skilling Centre in Pahadpur village. It is noteworthy how Rashtrapati Ji has focused on this sector and added momentum to her village’s development journey.

It is heartening to see our youth being equipped with skills that open new avenues of opportunity and self-reliance.

@rashtrapatibhvn”