బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మంగళవారం (2025 జులై 8న) బ్రెజిల్‌కు ఆధికారిక పర్యటనకు విచ్చేశారు. ఇది దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి బ్రెజిల్ - ఇండియాల మధ్య మైత్రి, పరస్పర విశ్వాస భావనలను ప్రతిబింబిస్తోంది. ఈ స్నేహ బంధాన్ని 2006లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించారు.

నేతలు ఇద్దరూ ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ప్రపంచ అంశాలపై తమ తమ ఆలోచనలను తెలియజేసుకొన్నారు. భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలన్న తమ సంకల్పాన్ని వారు ఉభయులూ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యవహారాల్లో తమ రెండు దేశాలు వాటి నిర్దిష్ట భూమికలను కొనసాగిస్తూ, ఉమ్మడి విలువలను పరిరక్షిస్తూ, ఉన్నత లక్ష్యాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకొంటూనే తమ తమ దేశ ప్రజలకు శాంతి, సమృద్ధిలతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి కోసం కృషిచేయాలని కూడా నేతలు అనుకున్నారు.

భారత్, బ్రెజిల్‌ల మధ్య దృఢమైన ఆర్థిక, సాంకేతిక పూరకాలను ఆధారంగా చేసుకొని, రాబోయే పదేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను ఇప్పటి కంటే మరింత బలోపేతం చేసుకోవడానికి అయిదు ముఖ్య విషయాలు ఆలంబనగా ఉండే ఒక వ్యూహాత్మక మార్గసూచీని రూపొందించాలని నేతలు నిర్ణయించారు: ఆ అయిదు కీలకాంశాల్లో..  

1. రక్షణతో పాటు భద్రత,

2. ఆహారం, పోషణ సంబంధ సురక్ష,

3. కొత్త రకాల ఇంధనాల వినియోగం వైపు మళ్లడం, వాతావరణ మార్పు,

4. డిజిటల్ మార్పును పెద్ద ఎత్తున ఆవిష్కరించడంతో పాటు సరికొత్త టెక్నాలజీలను ప్రోత్సహించడం,

5. వ్యూహాత్మక రంగాల్లో పారిశ్రామిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడం..

పైన ప్రస్తావించిన అయిదు ముఖ్య అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్ఠపరుచుకొనే దిశగా కలిసి పనిచేయాల్సిందంటూ నేతలు తమ తమ సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. చోటు చేసుకొనే పురోగతిని గురించి బ్రెజిల్-భారత్ సంయుక్త సంఘానికి (బ్రెజిల్-ఇండియా జాయింట్ కమిషన్‌) దృష్టికి తీసుకురావాలని కూడా వారు ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించారు.

i) రక్షణతో పాటు భద్రత

భారత్, బ్రెజిల్‌ల మధ్య రక్షణ, భద్రత అంశాల్లో అభిప్రాయాలు కలివిడితనంతో  కూడుకొని ఉన్నాయని, వ్యూహాత్మక ఆలోచనలు పరస్పరం పూరకాలుగా ఉంటున్నాయని నేతలు గుర్తించారు. సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకోవడంతో పాటు ఉభయ పక్షాల రక్షణ రంగ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాలు చర్చలు నిర్వహిస్తుండడం సహా రక్షణ రంగ సహకారం అంతకంతకు విస్తరిస్తుండడాన్ని నేతలు స్వాగతించారు. వివిధ వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని గాఢతరం చేయగలిగిన ‘గోపనీయ సమాచార వినిమయం, పరస్పర పరిరక్షణకు సంబంధించిన ఒప్పందం’పై సంతకాలు పూర్తయినందుకు వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సైబర్ భద్రతతో ముడిపడ్డ అంశాల సమాచారాన్ని, అనుభవాలను, జాతీయ దృష్టికోణాలను వినిమయం చేసుకోవడం ద్వారా పరస్పర సహకారాన్ని మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడగల ఒక ‘ద్వైపాక్షిక సైబర్ భద్రత చర్చావేదిక’ను ఏర్పాటు చేయడాన్ని కూడా వారు స్వాగతించారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు, భారత ప్రజలకూ, భారత ప్రభుత్వానికీ సంతాపాన్నీ, సంఘీభావాన్నీ తెలియజేసినందుకు బ్రెజిల్‌కు ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాలతో పాటు ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ ఇద్దరు నేతలూ నిర్ద్వంద్వంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక ఐక్య అంతర్జాతీయ ప్రతిస్పందన వ్యక్తం కావాల్సిన తక్షణావసరం ఉందని ఇరు పక్షాలూ స్పష్టం చేశాయి. ఇలాంటి దుష్ట చేష్టలు ఏ విధంగానూ సమర్ధనీయం కావని తేల్చి చెప్పాయి. సీమాంతర వ్యవస్థీకృత నేరాలపైనా, ఉగ్రవాదంపైనా పోరాటం సాగించడంలో, వాటిని అడ్డుకోవడంలో ఒకరికొకరం సహకరించుకొందామంటూ తమ నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు.  ఈ సందర్భంగా , వారు అంతర్జాతీయ ఉగ్రవాదంపైనా,  సీమాంతర వ్యవస్థీకృత నేరాలపైనా పోరాడడంలో సహకారం అనే అంశంలో బ్రెజిల్-భారత్ ఒప్పంద పత్రంపై సంతకాలు పూర్తవడాన్ని వారు స్వాగతించారు. సైబర్‌ నేరాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించడాన్ని వారు ప్రశంసించారు. ఈ సంవత్సరంలోనే హనోయిలో దీనిపై సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, ఈ కార్యక్రమానికి మద్దతిస్తామని నేతలు ప్రతిజ్ఞ‌ చేశారు.

నేతలు 1267 యూఎన్ఎస్‌సీ ఆంక్షల సంఘం ప్రస్తావించిన లష్కర్-ఏ-తయ్యిబా (ఎల్ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జేఈఎమ్) వంటి సంస్థలు సహా ఐరాస నామనిర్దేశం చేసిన ఉగ్రవాద సంస్థలతో పాటు ఉగ్రవాదులందరిపైనా ఒక్కుమ్మడి చర్యలు తీసుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందించే వర్గాలు పన్నే పన్నాగాలను వమ్ము చేసే దిశగా చురుకైన చర్యలను తీసుకోవడాన్ని కొనసాగిద్దామనీ, ఎఫ్ఏటీఎఫ్, యూఎన్‌లకూ అండదండలను అందిద్దామంటూ నేతలు దృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

భారత్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలకు గాను ఇండియాను, ప్రధానమంత్రి శ్రీ మోదీనీ బ్రెజిల్ దేశాధ్యక్షుడు శ్రీ లూలా అభినందించారు. శాంతియుత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంతరిక్ష, నౌకావాణిజ్య, మహాసముద్ర సంబంధిత సహకారం సహా, వ్యూహాత్మక రంగాలన్నింటిలోనూ ఇప్పటికే కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని నేతలు అంగీకరించారు. ఇరు పక్షాలూ తమ తమ అంతరిక్ష సంస్థల మధ్య సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయా అనేది పరిశీలించడానికి అంగీకరించాయి. వీటిలో భాగంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), శిక్షణలు సహా కృత్రిమ ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగ నౌకలు, వాణిజ్యసరళి ప్రయోగాలు, నియంత్రణ కేంద్రాలు.. ఈ రంగాల్లో సరికొత్త అవకాశాలను అన్వేషించనున్నారు.

ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, బహుపక్షవాదాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్పష్టం చేశారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు చర్చలను పున:ప్రారంభించడంతో పాటుగా ఇతర యంత్రాంగాలను కూడా ఆశ్రయించాల్సిన తక్షణ ఆవశ్యకత ఉందని వారు చాటిచెప్పారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు పూచీపడటంలో దౌత్యమే అత్యంత అధిక సానుకూల ఫలితాలను ఇవ్వగలుగుతుందంటూ వారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అభివృద్ధి, భద్రత ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని వారు చెప్తూ, శాంతిసాధనకు ఇప్పటి కంటే ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలన్నారు. ఈ తరహా నిర్ణయాలే దీర్ఘకాలిక శాంతి పరిరక్షణకు అతి ముఖ్యమని స్పష్టంచేశారు.  

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంతో పాటు శాశ్వతేతర సభ్యత్వ కేటగిరీలు రెండిటినీ విస్తరించడం సహా సమగ్ర సంస్కరణలను తీసుకు రావాలన్న తమ నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు. దీనిలో భాగంగా లాటిన్ అమెరికా, కరీబియన్, ఆసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఇంతవరకు ప్రాతినిధ్యం లేని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విస్తరించే భద్రతా మండలిలో తమ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని తమ రెండు దేశాలూ పరస్పరం సమర్ధిస్తున్నాయని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. భద్రతామండలి సంస్కరణకు సంబంధించిన వ్యవహారాల్లో బ్రెజిల్, భారత్ సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయని నేతలు స్పష్టంచేశారు.  2028-29 మధ్య కాలానికి గాను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వతేతర స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికి బ్రెజిల్ మద్దతు ఇవ్వడాన్ని ఇండియా స్వాగతించింది.

నేతలు తమ దేశాలు వలసవాదంపై పైచేయిని సాధించడానికి, సార్వభౌమత్వాన్ని ధ్రువపరచుకోవడానికి చేసిన చరిత్రాత్మక పోరాటాన్ని గుర్తుచేసుకొన్నారు. అంతర్జాతీయ చట్ట పాలనలో భాగంగా ఒక నిష్పాక్షిక అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షల విషయంలో శ్రద్ధ చూపడానికి సమ్మతి తెలిపారు. 2025లో ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవ ఘట్టం జరగనుందని గుర్తుకు తెచ్చుకొని, వారు ప్రపంచ పరిపాలన సంస్థలను త్వరగా, సమగ్రంగా సంస్కరించాల్సి ఉందన్న వాదనను సమర్థించారు. ఆ సంస్థలు చేసే నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెంచే, సమకాలిక భౌగోళిక రాజకీయ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొనే విధంగా సంస్కరణలు చోటుచేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సామూహిక సవాళ్ల సంక్లిష్ఠతను చూస్తూ ఉంటే అంతే మహత్త్వాకాంక్షలతో కూడుకొన్న ప్రతిస్పందన అవసరమనిపిస్తోందని వారు అంగీకరిస్తూ, ఐరాస నియమావళిలోని 109వ ఆర్టికల్ స్ఫూర్తికి అనుగుణంగా ఒక సమీక్షాసమావేశాన్ని నిర్వహించడం సహా ఆ నియమావళిలో విస్తృత సంస్కరణలు తీసుకువస్తే బాగుంటుందన్నారు.

మధ్య ప్రాచ్యంలో భద్రత స్థితి ఇటీవల క్షీణించడంపై నేతలు ఆందోళనను వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో తలెత్తుతుండే అనేక సంఘర్షణలను పరిష్కరించాలి అంటే అందుకు చర్చలు, దౌత్యం.. ఇవి తప్ప మరో మార్గం లేదని వారు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా, మధ్య ప్రాచ్యంలో శాంతి, భద్రతలు దీర్ఘకాలం పాటు కొనసాగే దిశగా సంబంధిత పక్షాలన్నీ కృషి చేస్తాయన్న ఆశాభావాన్ని నేతలు ప్రకటించారు.

అవగాహనపూర్వక చర్చలను నిర్వహించడం ద్వారా రెండు వేర్వేరు , స్వతంత్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, దీంతో ఒక సార్వభౌమ, ఆచరణసాధ్య పాలస్తీనా ఆవిర్భవించేందుకు మార్గం సుగమం కావాలని నేతలు పేర్కొన్నారు. ఇలా ఏర్పడే పాలస్తీనా ఇజ్రాయిల్‌తో శాంతి, భద్రతలతో మనగలుగుతూ పక్క పక్కనే నెలకొనే రెండు దేశాలు సురక్షిత, పరస్పర గుర్తింపు ఉన్న సరిహద్దులను కలిగివుండే వీలు చిక్కాలని వారు ఆకాంక్షించారు. శాశ్వత శాంతికి పూచీ పడటానికి నిరంతర సంప్రదింపులు సాగించాలని తాము పిలుపునిస్తున్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ చిరస్థాయి శాంతి సాధన ప్రధానమైన కృషిలో బందీలందరి విడుదల, గాజాలో ఎక్కడికైనా సత్వర, సురక్షిత, నిరాటంక మానవ ప్రవేశ సౌలభ్యం భాగం అవ్వాలని కూడా వారు స్పష్టంచేశారు.    

యూఎన్ఆర్‌డబ్ల్యూఏ (యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్‌స్ ఏజెన్సీ ఫర్ పాలస్టైన్ రిఫ్యూజీస్ ఇన్ ద నార్త్ ఈస్ట్)కు తమ దృఢ మద్దతు కొనసాగుతుందని నేతలు పునరుద్ఘాటించారు. యూఎన్ఆర్‌డబ్ల్యూఏ తన కార్యకలాపాలను చేపడుతున్న ఐయిదు కార్యక్షేత్రాల్లోనూ పాలస్తీనా శరణార్థులకు కనీస సౌకర్యాలను అందించే విషయంలో యూఎన్‌జీఏ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) యూఎన్ఆర్‌డబ్ల్యూఏకు చేసిన సూచనలను, ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాల్సిన అవసరం ఉందని నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.

ఉక్రెయిన్ సంఘర్షణ గురించి నేతలు చర్చించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటున్నాయనీ, అభివృద్ధి బాటన సాగుతున్న దేశాలపైనా తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైరాలకు స్వస్తి పలికే దిశగా దౌత్య యత్నాలు సాగుతుండడాన్ని వారు స్వాగతించారు. ఈ సంఘర్షణకు ఒక శాంతియుత, శాశ్వత పరిష్కారం లభించే మార్గంలో ముందుకు సాగాల్సిందిగా సంబంధిత పక్షాలకు పిలుపునిచ్చారు.  ‌


 

(ii) ఆహారం – జాతీయ భద్రత

తమ దేశాలలో అభివృద్ధి విధానాలను కొనసాగిస్తూ.. అసమానతలను ఎదుర్కోవడం, సామాజిక సమ్మిళిత విధానాలను ప్రోత్సహించడంలో కృషిని కొనసాగిస్తామని నాయకులు పునరుద్ఘాటించారు. ఆహారం, ముఖ్యంగా పౌష్టికాహార భద్రతను పెంపొందించేందుకు అత్యవసర ప్రాతిపదికన గట్టి చర్యలు అవసరమని, అందు కోసం తగిన విధానాలు, కార్యక్రమాలను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉత్పాదకతను పెంచాలని, అందుకు సుస్థిర వ్యవసాయం, లాభదాయకంగా ఉండే రాబడి, రైతులకు ఆదాయపరంగా మద్దతు అవసరమవుతాయని అన్నారు. పేదరికం, ఆకలి, పౌష్టికాహార లోపంతో సత్యమతమయ్యేవారికి నాణ్యమైన విద్య , ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2030 నాటికి ప్రపంచంలో  ఆకలిని రూపుమాపాలన్న సంకల్పాన్ని గుర్తు చేసుకుని, 'గ్లోబల్ అలయన్స్ ఎగెనెస్ట్ హంగర్ అండ్ పావర్టీ' (ఆకలి, పేదరికం తొలగింపు కోసం పని చేసే ప్రపంచ వేదిక) పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. సమర్థవంతమైన ప్రభుత్వ విధానాలు, సామాజిక సాంకేతికతల ఆచరణ కోసం అవసరమైన వనరులు, సమాచార సేకరణలో ఈ అలయన్స్ కీలక పాత్ర పోషించగలదన్నారు.

ఆహార ఉత్పత్తిలో అగ్రగామి దేశాల నాయకులైన ఇరువురూ.. దృఢమైన, స్థిరమైన, లాభసాటిగా ఉండే వ్యవసాయ-ఆహార వ్యవస్థల కోసం న్యాయమైన, నిజాయితీతో కూడిన పద్దతులు ఎంతో అవసరమన్నారు. వ్యవసాయ మార్కెట్లు, వ్యవసాయ విధానాలు సాఫీగా పని చేయడంలో ప్రభుత్వ పర్యవేక్షణ కీలక పాత్ర పోషిస్తుందని.. ఆహార భద్రతలో ప్రభుత్వం నిర్వహించే సేకరణ, ఆహార నిల్వ చర్యలు ఎంతో ముఖ్యమైనవన్నారు. ఈ విధానాల వల్ల మొత్తం ఆహార పంపిణీ వ్యవస్థలోని రైతుల, కార్మికుల జీవనోపాధికి మద్దతు, రక్షణ లభిస్తుందని.. తద్వారా జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయుల్లో ఆహార భద్రత మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ద్వైపాక్షిక, బహు పాక్షిక సహకారం పెంపొందించుకునే అవకాశాలున్నాయని, దీనివల్ల సంబంధిత దేశాల్లో ఆహార, పౌష్టికాహార భద్రత పెంపొందటమే కాక, సుస్థిర వ్యవసాయ పద్దతుల కోసం అవసరమైన సాంకేతికత అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ - డబ్ల్యూటీఓ ఆదర్శాలకి అనుగుణంగా న్యాయమైన, నిజాయితీతో కూడిన, పారదర్శకమైన, నిష్పాక్షపాత, వివక్ష-రహిత, నిబంధనలకనుగుణమైన బహుపాక్షిక వాణిజ్య విధానాన్ని అన్ని దేశాలూ గౌరవించాలని అన్నారు. పర్యావరణ, భద్రతాపరమైన ఆందోళనలను సాకుగా చూపి వ్యవసాయ వాణిజ్యాన్ని ఏకపక్ష ఆంక్షలు, ఆత్మరక్షణాత్మక చర్యల ద్వారా అడ్డుకోరాదని విజ్ఞప్తి చేశారు.
పునరుత్పత్తి బయోటెక్నాలజీ పద్ధతుల వినియోగం, జంతువుల పోషణను మెరుగుపరచడం వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, జంతువుల్లో ఉత్తమ జాతులను అభివృద్ధి పరచటం సాధించవచ్చని, పరస్పర ఆసక్తి గల రంగాల్లో ఉమ్మడి పరిశోధన చేపట్టవచ్చని అన్నారు. ఈ రంగంలో సానుకూల ఫలితాలను సాధించేందుకు వివిధ దేశాల పరిశోధన, అభివృద్ధి సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు.

(iii) ఇంధన బదిలీ, వాతావరణ మార్పులు
బయోఎనర్జీ, బయోఫ్యూయల్స్ రంగంలో భారత్, బ్రెజిల్ ల మధ్య గల అద్భుతమైన సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ..  గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ వ్యవస్థాపక సభ్యులైన ఇరుదేశాలు తమ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నాయి. బహుళ మార్గాల ద్వారా పరిశుభ్రమైన, స్థిరమైన, న్యాయమైన, అందుబాటు ధరల్లో, సమ్మిళిత ఇంధన మార్పులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని నాయకులు అంగీకరించారు. అదే సమయంలో వివిధ రకాల తక్కువ-ఉద్గారాలను విడుదల చేసే ఇంధన వనరులను, పర్యావరణ అనుకూల ఇంధనాలు, సాంకేతికతలను అమలు చేయడానికి తటస్థ సాంకేతికత, సమగ్ర, సమ్మిళిత విధానాల ప్రాముఖ్యాన్ని ఇరు పక్షాలు ప్రస్తావించాయి.

ఈ సందర్భంలో, రవాణా రంగాన్ని ఉద్గార రహితంగా తయారు చేయడంలో, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో పర్యావరణ అనుకూల బయో ఇంధనాలు, ఫ్లెక్స్-ఫ్యూయల్ (ఇథనాల్ సహా మిశ్రమ ఇంధనాలపై నడిచే) వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం విమానయాన రంగం వెలువరించే ఉద్గారాలను తగ్గించేందుకు పర్యావరణ-హిత వైమానిక రంగ ఇంధనం-ఎస్ఏఎఫ్) ప్రధానమైన, ఆచరణీయ వనరుగా కనిపిస్తోందని, ఎస్ఏఎఫ్ ఇంధనం వాడకాన్ని, పంపిణీని విస్తృతపరచడంలో భారత్ -బ్రెజిల్ భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాప్-30 సమావేశాలకు సన్నాహకంగా ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫరెవర్ ఫండ్ (టీఎఫ్ఎఫ్ఎఫ్) ను ప్రారంభిస్తున్నందుకు బ్రెజిల్ ను అభినందించిన ప్రధానమంత్రి మోదీ, ఈ పథకం ప్రభావవంతంగా పని చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఉష్ణమండల అడవుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాలు మరింత ముమ్మరంగా జరిగేందుకు ఇరుదేశాలు మరిన్ని చర్చలు, ఉమ్మడి ప్రయత్నలు చేపపట్టడం అవసరమని నేతలిద్దరూ అభిప్రాయపడ్డారు. కాప్-30 ఆర్థిక మంత్రుల మండలి (కాప్-30 సర్కిల్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్) లో సభ్యత్వం కోసం బ్రెజిల్ ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, 'బాకూ టు బెలేం రోడ్ మ్యాప్ ఫర్ 1.3 ట్రిలియన్ యూఎస్డీ' లక్ష్యానికి భారత్ సహకరించగలదని హామీ ఇచ్చారు.
ప్రస్తుత కాలం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో విపరీత వాతావరణ మార్పులు ఒకటని..  సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యాల సాధన కోసం ముందస్తుగా  ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనివార్యమని నాయకులు అంగీకరించారు. ఈ విషయంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించి, మరింత క్రియాశీలకంగా పనిచేయాలని.. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశం (యూఎన్ఎఫ్సీసీసీ), క్యోటో ప్రోటోకాల్, పారిస్ ఒప్పందాల ప్రకారం వాతావరణ మార్పు నిర్వహణను బలోపేతం చేసే దిశగా సంభాషణ, సమన్వయాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేయాలని తీర్మానించారు. ప్రపంచ వాతావరణ సంక్షోభ తీవ్రత దృష్ట్యా.. న్యాయబద్ధమైన, అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైజ్ఞానిక అంశాలను దృష్టిలో ఉంచుకుని, సమావేశ లక్ష్యాన్ని అమలు చేస్తామని, పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించే దిశగా కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వాతావరణ మార్పుల కట్టడి చర్యల పట్ల వివిధ దేశాల స్పందనను పెంచాలని, అయితే ఇది దేశాల మధ్య అసమానతలను తగ్గించే రీతిలో ఉండాలని నిశ్చయించారు. ఇతర దేశాల్లో అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఐఎస్ఏ), సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) భాగస్వామ్యంతో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. ఇక, 2025 నవంబర్‌లో బెలెమ్‌లో జరగే యూఎన్ఎఫ్సీసీసీ  30వ సమావేశం (కాప్-30) లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడే బ్రెజిల్ కు మద్దతునిస్తామని భారత్ హామీ ఇచ్చింది.

భారత్-బ్రెజిల్ ఆర్థిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవలసిన అవసరం ఉందన్న నేతలు, సుస్థిర వృద్ధి, లోకల్ కరెన్సీ ఫైనాన్సింగ్, వాతావరణ పెట్టుబడులు, మూలధన మార్కెట్లు వంటి రంగాలకు పరస్పర సహకారాన్నివిస్తరించాలని అంగీకరించారు. సంబంధిత బహుపాక్షిక వేదికలు, జీ-20 ఫైనాన్స్ ట్రాక్, బ్రిక్స్, ఐబీఎస్ఏ, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పునరుద్ఘాటించారు. పరస్పర ఆసక్తి గల రంగాల్లో  క్రమం తప్పకుండా సంప్రదింపులను ఏర్పాటు చేసుకోవాలని, అందుకు తగిన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు.
అభివృద్ధి కోసం నిధులను బలోపేతం చేసే దిశగా ‘సెవిల్ ఒడంబడిక’ నిర్మాణాత్మక అడుగన్న నాయకులు, అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. బలమైన, స్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములు కాగలమని చెప్పారు. తక్కువ వడ్డీకి లభించే రుణ అవకాశాలను మెరుగుపరచాలని, ఆఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఓడీఏ)లో తగ్గుదల ధోరణులను నిలువరించి, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల గల ఓడీఏ నిబద్ధతను నెరవేర్చేలా ప్రోత్సహించాలని ఇరుదేశాలు అభిప్రాయపడ్డాయి.
2030 సుస్థిర అభివృద్ధి అజెండాను సమగ్రంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గాలను సమీకరించడం ద్వారా నాయకులు తమ నిబద్ధతను వెల్లడించారు. పర్యావరణ, ఆర్థిక, సామాజిక అనే సుస్థిరాభివృద్ధిలోని మూడు కోణాలను ప్రోత్సహించడంలో జీవ ఆర్థిక వ్యవస్థ, పునరుపయోగ ఆర్థిక వ్యవస్థలు సాధనాలు కాగలవని నేతలు అభిప్రాయపడ్డారు.  

(iv) డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతికతలు
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు సహా డిజిటల్ ఎజెండా తమ దేశాల ఆర్థికాభివృద్ధికి, డిజిటల్ పరివర్తనకు ఎంతో కీలకమైనవని గుర్తించడంతో, వినూత్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను (డిజిటల్ ప్రజా సదుపాయాలు) ఉపయోగించి పరస్పర సహకారంతో ప్రాజెక్టులను చేపట్టాలని నాయకులు నిర్ణయించారు. ఆయా రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోవాలని అంగీకరిస్తూ, ఈ దిశగా అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగడాన్ని రెండు దేశాలూ స్వాగతించాయి. ఈ ఒప్పందం ద్వారా సామర్థ్య వికాసం, ఉత్తమ చర్యల పరస్పర మార్పిడి, నూతన ప్రాజెక్టుల రూపకల్పన, సంస్థాగత సహకారం వంటి అంశాల్లో సంయుక్త కార్యక్రమాలను చేపట్టేందుకు మార్గం సంసిద్ధమవుతుంది. ఈ చర్యలు డిజిటల్ పరివర్తనకు దోహదపడటం సహా పౌరులకు నాణ్యమైన ప్రజాసేవలను అందించగలవని భావిస్తున్నారు.

డిజిటల్ పాలనకు సంబంధించిన బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని రెండు దేశాలూ వ్యక్తం చేశాయి. కృత్రిమ మేధస్సు అందించే అవకాశాలు, అందులోని ప్రమాదాల గురించి అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డాయి. 2026లో జరగబోయే ఏఐ శిఖరాగ్ర సదస్సుకు భారత్ నాయకత్వం వహించనుండటం పట్ల బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా దిసిల్వా అభినందనలు తెలిపారు.
ఉమ్మడి విలువలు, సామర్థ్యాల ఆధారంగా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ (ఎస్టీఐ) రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించే అవకాశాలపై ఇరువురు నేతలు తమ దృక్కోణాన్ని పునరుద్ఘాటించారు. శాస్త్ర, సాంకేతిక సహకారాల పెంపొందింపు కోసం సంయుక్త కమిషన్ సమావేశాన్ని నిర్వహించుకోవాలని అభిప్రాయపడ్డారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధస్సు, క్వాంటం సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో సహకారానికి ఈ చర్య దోహదపడగలదు. సత్ఫలితాలను అందించే ద్వైపాక్షిక భాగస్వామ్యాల కోసం పరిశోధకులు, ఆవిష్కరణ కేంద్రాలు, అంకుర పరిశ్రమల మధ్య ప్రత్యక్ష  సంబంధాలను మెరుగుపరచడం అవసరమని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.

(v) వ్యూహాత్మక రంగాల్లో పారిశ్రామిక భాగస్వామ్యాలు

రక్షణవాదంతో కూడిన సవాళ్లు అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక ఆర్ధిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తమ సంసిద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందేందుకు ఉన్న అపార సామర్థ్యాన్ని గుర్తించారు. పరస్పర వాణిజ్య, సాంకేతిక అవకాశాలను అన్వేషించడానికి, దిగువన పేర్కొన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సహా ఇతర భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు: (i) ఔషధ పరిశ్రమ (ii) రక్షణ పరికరాలు (iii) గనుల తవ్వకం- ఖనిజాలు (iv) పరిశోధన, అన్వేషణ, వెలికితీయడం, శుద్ధి చేయడం, పంపణీతో సహా చమురు - సహజవాయు రంగం.

రెండు దేశాల మధ్య ఔషధ రంగంలో పెరుగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. బ్రెజిల్లో కార్యకాలాపాలను నిర్వహిస్తున్న భారతీయ ఔషధ సంస్థల సంఖ్య పెరగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జనరిక్ ఔషధాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తో సహా అవసరమైన ఔషధాలను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో బ్రెజిలియన్ ఆరోగ్య, ఔషధ సంస్థలకు సహకరించేలా భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహించారు. అలాగే నిర్లక్ష్యం చేసిన, ఉష్ణమండల వ్యాధులతో సహా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడానికి సంయుక్త పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను అన్వేషించాలని సంబంధిత సంస్థలను ప్రోత్సహించారు. ఔషధ పరిశ్రమలో సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా రెండు దేశాల్లోనూ ఆరోగ్య రంగం బలోపేతమవుతుందని, గ్లోబల్ సౌత్ వ్యాప్తంగా నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

భారత్, బ్రెజిల్‌ మధ్య విమానయాన రంగంలో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనేందుకు ఉన్న అవకాశాలపై నాయకులు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ దిశగా సహకారాలను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించారు.

రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ రంగంలో భాగస్వామ్యానికి ఉన్న కొత్త అవకాశాలను అన్వేషించాలని, పారిశ్రామిక భాగస్వామ్యాలను కుదుర్చుకోవాలని రక్షణ రంగంలోని పరిశ్రమలను ప్రోత్సహించారు. ఈ రంగంలో భూతల వ్యవస్థలు, నావికా సదుపాయాలు, వైమానిక సామర్థ్యాల విభాగాల్లో మెరుగవుతున్న సహకారాన్ని ప్రశంసించారు.

ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, స్వచ్ఛ విద్యుత్ సాంకేతికతలైన సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు, విద్యుత్ వాహనాలు, విద్యుత్ నిల్వ చేసే వ్యవస్థల్లో కీలక ఖనిజాలు అవసరమని స్పష్టం చేశారు. కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకం, వ్యర్థపదార్థాలను తొలగించడం, శుద్ధి చేయడం, పునర్వినియోగంలో సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంపొందించాలని నాయకులు భావించారు. అలాగే నూతన, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రెండు దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య సంయుక్త భాగస్వామ్యాలను ఆహ్వానించారు.

తీర ప్రాంత క్షేత్రాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండు దేశాలకు సంబంధించిన చమురు, సహజవాయు సంస్థలను ప్రోత్సహించారు. అలాగే ముందస్తు ఉత్పత్తి, అధిక లాభాలను సాధించాలనే ఆసక్తిని వెలిబుచ్చారు. ఉపశమన, కర్భన ఉద్ఘారాలను తగ్గించే సాంకేతికతల సహకారంలో కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాల్లోని సంస్థలను ప్రోత్సహించారు.

రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాల్లో పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ద్వైపాక్షిక వాణిజ్యంలో నాన్-టారిఫ్ అవరోధాలను గుర్తించి పరిష్కరించాలని తమ అధికారులను రెండు దేశాల నాయకులు ఆదేశించారు.

రాకపోకలను సులభతరం చేయడానికి, పర్యాటకం, వ్యాపార ప్రయాణాలను పెంచడంతో పాటుగా వీసా విధానాలను క్రమబద్ధీకరించే సమన్వయ చర్యలు తీసుకోవడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.

ఇటీవలి కాలంలో రెండు దేశాల్లోని పెట్టుబడుల్లో కనిపించిన పెరుగుదల, బ్రెజిల్, భారతీయ వ్యాపారాల మధ్య విజయవంతమైన భాగస్వామ్యాలను ఇద్దరు నాయకులు అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో మంత్రి స్థాయిలో వాణిజ్య, వ్యాపార సమీక్ష యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో ప్రైవేట్ రంగం పాత్రను నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే పరస్పర వ్యాపారం, పెట్టుబడులకు అవకాశాల అన్వేషణను కొనసాగించాలని రెండు దేశాల వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక వ్యాపార భాగస్వామ్యాలు, సంయుక్త వ్యాపారాల్లో పాలుపంచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 2020, జనవరి 25న సంతకం చేసిన ద్వైపాక్షిక పెట్టుబడి సహకారం, సులభతర ఒప్పందం, 2022, ఆగస్టు 24న సంతకం చేసిన ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్ అమలును వేగవంతం చేయడానికి వారు అంగీకరించారు. బ్రెజిల్-ఇండియా వ్యాపార మండలి ద్వారా ఈ లక్ష్యం కోసం కలసి పనిచేయాలని రెండు దేశాల పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలను ఆహ్వానించారు.

భారత్‌లో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం, బ్రెజిల్ అభివృద్ధి, పరిశ్రమ, వాణిజ్యం, సేవల మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. పరస్పర ప్రయోజనాల నిమిత్తం ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంకేతికత పురోగతి, ఉత్తమ పద్ధతులను పరస్పరం అందించుకోవడం, ఐపీ అవగాహన పెంపొందించడానికి పటిష్టమైన చర్యలను ఈ ఒప్పందం అమలు చేస్తుంది. సావో పౌలోలో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఢిల్లీలో ఏఎన్వీఐఎస్ఏ (ఏజెన్సియా నేషనల్ డె విజిలెన్సియా సానిటేరియా - బ్రెజిలియన్ ఆరోగ్య నియంత్రణ సంస్థ) ప్రతినిధి కార్యాలయాల ప్రారంభాన్ని వారు స్వాగతించారు.

 

ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం..

సంస్కృతి, ఆరోగ్యం, క్రీడలు, సంప్రదాయ విజ్ఞానం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించే విషయంగా ద్వైపాక్షిక ఒప్పందాల పురోగతి పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర అవగాహనను బలోపేతం చేయడం.. ఇరు దేశాల గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో సాంస్కృతిక వినిమయం ప్రాముఖ్యాన్ని వారు గుర్తించారు. రెండు దేశాలూ ఔత్సాహిక ఆలోచనలు, కళలు, సంప్రదాయాలను పరస్పరం అర్థం చేసుకునేందుకు వీలుగా.. కొత్త సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునిచ్చేందుకు 2025-2029 సంవత్సరాలకు సాంస్కృతిక వినిమయ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి కొత్తగా వస్తున్న సృజనాత్మక పరిశ్రమల సమర్థ ఏకీకరణ కోసం సంబంధిత ప్రభుత్వ సంస్థల చర్చలతో వ్యూహాలను రూపొందించడానికి, తద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు ప్రపంచస్థాయిలో వాటి సాంస్కృతిక పరిధిని విస్తరించడానికి కూడా వారు అంగీకరించారు.

విద్యారంగంలో ద్వైపాక్షిక సహకార బలోపేతం విషయంలో ఇరువురు నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రెజిల్‌లోని ఎక్చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ అండర్‌గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ (పీఈసీ) కోసం భారతీయ విద్యార్థులు అర్హత కలిగి ఉండగా.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) అందించే ఉపకారవేతనాలకు బ్రెజిలియన్ విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారని వారు గుర్తు చేసుకున్నారు. రక్షణరంగ శిక్షణ సహా శిక్షణ, సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఇరుపక్షాలు సహకారాన్ని మరింత ముందుకు కొనసాగించాలని నిర్ణయించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ ఉన్నత విద్యా కార్యక్రమం.. ఆసియా-పసిఫిక్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఏపీఏఐఈ) 2025 వార్షిక సమావేశంలో బ్రెజిల్ పాల్గొనడం ప్రశంసనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ద్వైపాక్షిక సహకార బలోపేతం.. ప్రజల అనుసంధానత, వ్యాపార అనుసంధానతలను పెంపొందించే ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగా దేశ పర్యటన సమయంలో కింది ఒప్పందాలపై సంతకాలు చేయడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు:

• అంతర్జాతీయ ఉగ్రవాదం.. వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో పరస్పర సహకారం గురించి ఒప్పందం.

• సున్నిత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి సంబంధించిన ఒప్పందం.

• పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పర సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• ఈఎమ్‌బీఆర్ఏపీఏ-భారత వ్యవసాయ పరిశోధన మండలి మధ్య వ్యవసాయ పరిశోధనల గురించి అవగాహన ఒప్పందం.

• డిజిటల్ పరివర్తన కోసం గణనీయ ఫలితాలను సాధించిన డిజిటల్ పరిష్కారాలను పంచుకోవడంలో పరస్పర సహకార అవగాహన ఒప్పందం.

• భారత డీపీఐఐటీ, బ్రెజిల్‌కు చెందిన ఎమ్‌డీఐసీ మధ్య మేధో సంపత్తి రంగంలో పరస్పర సహకార అవగాహన ఒప్పందం.

కింది ద్వైపాక్షిక ఒప్పందాలను వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సహకరించాలని ఆయా దేశాల సంబంధిత ప్రభుత్వ సంస్థలను ఇరువురు నేతలు ఆదేశించారు:

•  పౌరుల సంబంధిత వ్యవహారాల్లో పరస్పర చట్టపరమైన సహకారం గురించి ఒప్పందం.

• రక్షణ రంగ సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• క్రీడారంగంలో సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• చారిత్రక రికార్డులు, పత్రాల విషయంలో సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ) 2025–2029.

శాంతి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధి.. బ్రెజిల్-భారత్ విదేశాంగ విధానాలకు మార్గనిర్దేశం చేసే ఉన్నత లక్ష్యాలని ఇరువురు నేతలు గుర్తుచేసుకున్నారు. బహుళ గుర్తింపులు, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగల ప్రజలు, శక్తిమంతమైన ప్రజాస్వామ్యం గల ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు.. అందరి కోసం న్యాయమైన, మరింత సమ్మిళితమైన, సుస్థిరమైన ప్రపంచ నిర్మాతలుగా అంతర్జాతీయ వ్యవహారాల్లో వారి ప్రత్యేక పాత్రకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల మార్గాలను మెరుగుపరచడానికి, రోజురోజుకీ పెరుగుతున్న, వివిధ రంగాలకు విస్తరిస్తున్న సహకారాన్ని ప్రోత్సహించడానికి అంగీకరించారు.

బ్రెజిల్ పర్యటన, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశ సందర్భాల్లో తమకు అపూర్వ ఆతిథ్యం అందించిన ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర అనుకూల సమయంలో భారత్‌ను సందర్శించాలని అధ్యక్షుడు లూలాను ఆహ్వానించారు. ప్రధానమంత్రి ఆహ్వానాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా సంతోషంగా అంగీకరించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The year of FTAs

Media Coverage

The year of FTAs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Subhashitam emphasising determination and will power
January 02, 2026

Prime Minister Shri Narendra Modi conveyed his heartfelt wishes for the New Year, expressing hope that every individual finds success in their endeavors in the times ahead.

Shri Modi emphasized that with determination and willpower, resolutions made in the New Year can be fulfilled.

The Prime Minister underlined that this timeless wisdom encourages us to rise, remain awake, and engage in actions that bring welfare, while keeping our minds steadfast and fearless in envisioning the future.

Sharing his message of inspiration through a Sanskrit verse in a post on X, Shri Modi said:

“मेरी कामना है कि आने वाले समय में आपको अपने हर प्रयास में सफलता मिले। दृढ़संकल्प और इच्छाशक्ति से नए साल में आपके संकल्प की सिद्धि हो।

उत्थातव्यं जागृतव्यं योक्तव्यं भूतिकर्मसु।

भविष्यतीत्येव मनः कृत्वा सततमव्यथैः।।”