నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్‌ జెటెన్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో  పర్యటించడం ఇది రెండోసారి.

ఈ సందర్భంగా 16వ తేదీన ఉదయం నెదర్లాండ్స్ రాజు మాననీయ విల్లెం అలెగ్జాండర్, రాణి శ్రీమతి మాక్జిమా ద హేగ్‌లోని ‘హుయిస్ టెన్ బాష్’ రాజప్రాసాదంలో భారత ప్రధానమంత్రి మోదీకి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అటుపైన శ్రీ మోదీ గౌరవార్థం రాచ దంపతులు మధ్యాహ్న విందు కూడా ఏర్పాటు చేశారు.

రెండు దేశాల ప్రధానమంత్రులు శ్రీ జెటెన్‌, శ్రీ మోదీ 16వ తేదీ సాయంత్రం ముఖాముఖి, ప్రతినిధుల స్థాయి చర్చలు నిర్వహించడంతోపాటు ఆ రాత్రి విందులో పాల్గొన్నారు. భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్యగల సుదీర్ఘ చారిత్రక, వాణిజ్య సంబంధాలతోపాటు ప్రజల మధ్యగల బలమైన అనుబంధాన్ని, ద్వైపాక్షిక స్నేహాన్ని ప్రధానమంత్రులు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఈ బహుముఖ అనుబంధాన్ని మరింత విస్తరించడంతోపాటు పటిష్ఠం చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి అత్యున్నత రాజకీయ స్థాయిలోనూ, అధికార యంత్రాంగాల మధ్య నిరంతర చర్చల ద్వారా వివిధ సహకార కార్యక్రమాలలో సాధించిన ప్రగతిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2023లో భారత్‌ జి20కి అధ్యక్షత వహించిన సందర్భంలోనే కాకుండా 2026 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో “ఏఐ ఇంపాక్ట్ సమిట్” సమయంలోనూ రెండు దేశాల మధ్య సహకారంపై చర్చలు ఫలప్రదం కావడాన్ని వారు మరొకసారి స్మరించుకున్నారు.

రెండు దేశాల మధ్య సంబంధాలు వేగంగా విస్తరించడంతోపాటు పరస్పర అవగాహన ఇనుమడించడాన్ని వారు ప్రశంసించారు. ఈ బంధాన్ని భారత్-నెదర్లాండ్స్ ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మలచాలని నిర్ణయించారు. తదనుగుణంగా ‘వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళిక’ రూపకల్పనపై హర్షం వెలిబుచ్చారు. ఈ మేరకు రాజకీయాలు, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత రంగాల్లో సన్నిహిత సహకారానికి అంగీకరించారు. ఇవే కాకుండా సైబర్ భద్రత, సెమీకండక్టర్లు సహా కీలక-అత్యాధునిక సాంకేతికతలు, అంతరిక్షం, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ వ్యవస్థలు, శాస్త్రవిజ్ఞానం-ఆవిష్కరణలు ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. ఆరోగ్యం సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థలు, జల నిర్వహణ, వాతావరణ మార్పు, ఇంధన మార్పిడి, సుస్థిర రవాణా, సముద్రయాన అభివృద్ధి, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా అన్ని రంగాల్లోనూ సహకార విస్తరణకు ఉభయ పక్షాలూ నిర్ణయించాయి. విధానాల రూపకల్పనలోనూ (అభిప్రాయాల/అనుభవాల) ఆదానప్రదానంపై పరిశీలనకు నిర్ణయించారు.

ఇక వివిధ ప్రాధాన్య రంగాలకు సంబంధించి 2025 డిసెంబరు నాటి ఒప్పందాలపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ, సెమీకండక్టర్లు, వాటికి సంబంధించిన అత్యాధునిక సాంకేతిక రంగాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. దీంతోపాటు డిజిటల్, సైబర్ స్పేస్ రంగాలలో సహకార విస్తరణ, ఔషధ, వైద్య పరికరాల రంగంలో భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. అంతేకాకుండా సంయుక్త వాణిజ్య-పెట్టుబడుల కమిటీ ఏర్పాటు సహా లోథాల్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌లలోని సముద్రయాన మ్యూజియంల మధ్య సహకారంపై ఆనందం వ్యక్తం చేశారు.

రెండు దేశాల ప్రధానమంత్రులు ‘భవిష్యత్తు కోసం ఒప్పందం’ (పాక్ట్ ఫర్ ద ఫ్యూచర్) అంశాన్ని తమ చర్చల్లో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ శాంతి భద్రతలతో పాటు ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సూత్రబద్ధ అంతర్జాతీయ నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. నేటి సమకాలీన పరిస్థితులను  ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాల విభాగాలను విస్తరించాలని కోరారు. దీనికి సంబంధించి నిర్దిష్ట వ్యవధిలోగా విస్పష్ట చర్చలు చేపట్టాలని సూచించారు. సంస్కరించిన ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం డిమాండుకు నెదర్లాండ్స్ మద్దతుకుగాను ప్రధానమంత్రి శ్రీ మోదీ…. శ్రీ రాబ్‌ జెటెన్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

భారత్-ఐరోపా సమాఖ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా భారత్-ఐరోపా సమాఖ్య ఉభయతారక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది జనవరిలో చర్చలు ముగియడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ప్రపంచ ఆర్థిక సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని రెండో, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారు. మరోవైపు నియమాధారిత వాణిజ్యంపై ఉమ్మడి నిబద్ధత ఆర్థిక స్వేచ్ఛను స్పష్టం చేస్తుందని అంగీకరించారు. భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై ఏకకాలంలో సంతకాలు పూర్తి కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. భద్రత, రక్షణ రంగాలలో ఐరోపా సమాఖ్య-భారత్‌ మధ్య చర్చలు, సహకారాన్ని కూడా ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారు. అంతేకాకుండా సముద్ర భద్రత, సైబర్ నేరాల నిరోధం, ఉగ్రవాదం అణచివేత, రక్షణ పారిశ్రామిక సహకారం వంటి రంగాలలో నిర్దిష్ట ఫలితాలను అందిస్తుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ చట్టం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, నౌకాయాన స్వేచ్ఛ, బలప్రయోగం, సంఘర్షణలకు తావివ్వకపోవడం వంటివాటిపై గౌరవం ప్రాతిపదికన స్వేచ్ఛా-బహిరంగ, సురక్షిత-శాంతియుత ఇండో-పసిఫిక్ ప్రాధాన్యంపై నాయకులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. ఇండో-పసిఫిక్‌పై ఐరోపా సమాఖ్య వ్యూహాన్ని గుర్తుచేసుకుంటూ ‘ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్’లో చేరే దిశగా జర్మనీ, ఐరోపా సమాఖ్యలతో కలిసి సామర్థ్య వికాసం వనరుల భాగస్వామ్యానికి సహ నాయకత్వంపై నెదర్లాండ్స్ నిర్ణయించుకున్నదని రాబ్‌ జెటెన్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతుండటంపై భారత్‌-నెదర్లాండ్స్‌ రెండూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది మానవాళికి వేదనను మిగిల్చిందని, ప్రపంచ పరిణామాలను వేగంగా మార్చేస్తోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నియమాలు, అంతర్జాతీయ చట్ట సూత్రాల ఆధారంగా చర్చలు, దౌత్యంతో ఉక్రెయిన్‌లో సమగ్ర, సముచిత, శాశ్వత శాంతి సాధన కృషికి మద్దతు కొనసాగించాలని నాయకులిద్దరూ అంగీకరించారు.

పశ్చిమాసియాలో పరిస్థితులపై నాయకులిద్దరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యావత్‌ మానవాళి ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌అంతరాయాలు వంటివి సహా ఈ ప్రాంతంతోపాటు విస్తృత ప్రపంచంపై తీవ్ర పరిణామాల భారాన్ని వారు గుర్తుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8నాటి కాల్పులు విరమణను స్వాగతిస్తూ-  ఉద్రిక్తతల ఉపశమనంలో సంప్రదింపులు, దౌత్యం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులు ఇద్దరూ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి త్వరలోనే నెలకొనగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధి మీదుగా నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు, అదే సమయంలో నిర్బంధ కాండకు ఎంతమాత్రం పాల్పడరాదని పేర్కొంటూ- ఉద్రిక్తతల ఉపశమనం దిశగా కృషికి, కార్యక్రమాలకు పూర్తి మద్దతును పునరుద్ఘాటించారు.

ఆర్థిక సహకారం.. వాణిజ్యం-పెట్టుబడులు

సుస్థిరత, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక వృద్ధి వంటి ఉమ్మడి ప్రాథమ్యాల ప్రాతిపదికగా సాగే నెదర్లాండ్స్-భారత ఆర్థిక భాగస్వామ్యం ఉభయదేశాల పరస్పర సౌభాగ్యానికి తోడ్పడుతూ  సహకారానికి ఆదర్శంగా నిలుస్తున్నదని నాయకులిద్దరూ పేర్కొన్నారు. సమర్థ సరఫరా వ్యవస్థలు, స్వేచ్ఛా విపణులపై సంయుక్త నిబద్ధతతో ద్వైపాక్షిక వాణిజ్యంలో వృద్ధిని వారు స్వాగతించారు. నెదర్లాండ్స్ తన అంతర్జాతీయ స్థాయి సదుపాయాల నెట్‌వర్క్‌... ముఖ్యంగా రోటర్‌డామ్ ఓడరేవు ద్వారా భారత ఎగుమతిదారులకు ఐరోపాను ఒక వ్యూహాత్మక ముఖద్వారంగా నిలిపిందని పేర్కొన్నారు. మరోవైపు డచ్ కంపెనీలకు సువిశాల, చైతన్యవంతమైన మార్కెట్‌ను భారత్‌ సమకూరుస్తున్నదని తెలిపారు. నెదర్లాండ్స్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు, వాణిజ్య సౌలభ్యం సహా భారత్‌లో విస్తృత, నిపుణ, ప్రతిభావంతులైన యువ సమూహం ద్వారా గణనీయ ప్రయోజనం పొందగలవని భారత ప్రధానమంత్రి తెలిపారు. అలాగే, భారతీయ వ్యాపారాలు... ముఖ్యంగా జల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, స్మార్ట్ సిటీల రంగాల్లో డచ్ సహచారుల ఉన్నత నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చున్నారు.

రెండు దేశాల మధ్య ప్రస్తుత ఆర్థిక సహకారంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ- భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల లభించగల అవకాశాల దృష్ట్యా మరింత వృద్ధికి అంతులేని అవకాశాలు ఉన్నాయని నాయకులు స్పష్టం చేశారు. భారత్‌కు ప్రధాన వాణిజ్య, పెట్టుబడి భాగస్వాములలో ఒకటిగా నెదర్లాండ్స్ కొనసాగుతుండటం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల గాఢత, పునరుత్థాన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

వాణిజ్యం-పెట్టుబడులను మరింత సరళం చేసే దిశగా రెండు దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచార ఆదానప్రదానానికి వీలు కల్పిస్తూ, కస్టమ్స్ వ్యవహారాలలో పరస్పర పాలన తోడ్పాటు ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు. తద్వారా ఇది కస్టమ్స్ లావాదేవీల అమలును మెరుగుపరస్తూ భారత్‌-నెదర్లాండ్స్ మధ్య చట్టబద్ధ వాణిజ్య సౌలభ్యం కల్పిస్తుందని తెలిపారు.

భారత్-నెదర్లాండ్స్ సంయుక్త వాణిజ్య-పెట్టుబడుల కమిటీ, ఫాస్ట్ ట్రాక్ మెకానిజం వంటి వాటి ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడులను మరింత విస్తరించడంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. సుస్థిర వృద్ధి, ఉద్యోగ కల్పన, పునరుత్థాన విలువ వ్యవస్థలకు మద్దతుగా పెట్టుబడి సదుపాయాల మెరుగుదల, ఆవిష్కరణావరణ వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వారిద్దరూ అంగీకరించారు.

అంకుర సంస్థలు, ఆవిష్కరణల రంగంలో సహకారానికి బలమైన అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. రెండు దేశాల్లో రూపొందించిన వివిధ మార్గాలు భారత, ఐరోపా సమాఖ్య విపణులు సహా ప్రపంచమంతటా విస్తరించగలవని పేర్కొన్నారు. రెండు దేశాల అంకుర వ్యవస్థల పటిష్ఠ అనుసంధానానికి, ఆదానప్రదానాల సౌలభ్య కల్పనకు డిజిటల్ సాఫ్ట్-ల్యాండింగ్ కార్యక్రమాల అన్వేషణకు, అలాగే వాణిజ్య, ఆవిష్కరణల కార్యక్రమాలు, సాంకేతిక సదస్సులలో భాగస్వామ్యం పెంచుకోవడానికి వారు అంగీకరించారు.

రక్షణ-భద్రత రంగాల్లో సహకారం

రక్షణ సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు పూర్తికావడాన్ని వారు స్వాగతించారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత విస్తరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య నిరంతర సంప్రదింపులు, సిబ్బంది స్థాయి చర్చలతోపాటు సమాచార ఆదానప్రదానం, పర్యటనలు, పరిశోధన, ఆవిష్కరణలు, శిక్షణ కార్యక్రమాల సమన్వయం చేపట్టడంపై అంగీకరించారు. పరస్పర రక్షణ పారిశ్రామిక సహకారం పరిధి విస్తృతి దిశగానూ ముందుకు సాగాల్సి ఉందని వారు అంగీకరించారు.

రక్షణ రంగంలో ఐరోపా సమాఖ్య యంత్రాంగాల పరిధిలోనూ, ఇతర భాగస్వాములతో సంయుక్తంగా సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉభయ దేశాల సాయుధ దళాలు అవసరాలు తీర్చే దిశగ రక్షణ పరికరాలు, వ్యవస్థలు, విడిభాగాలు, ఇతర కీలక సామర్థ్యాల రూపకల్పనకు అవసరమైన రక్షణ పారిశ్రామిక సహకారాన్ని నిర్దేశించే ప్రణాళిక రూపకల్పన అవకాశాలను అన్వేషించాలని నిశ్చయించారు. సంయుక్త రూపకల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉత్పదాన కోసం ఉమ్మడి సంస్థల ఏర్పాటు వంటివి ఇందులో భాంగా ఉంటాయి.

రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక భద్రత, కీలక-ఆధునిక సాంకేతికతలు, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, పరస్పరం అంగీకరించిన ఇతర అంతర్జాతీయ భద్రతాంశాలు సహా సంప్రదాయ, సంప్రదాయేతర భద్రత సమస్యలపై జాతీయ భద్రత యంత్రాంగాల మధ్య క్రమం తప్పని ఆదానప్రదానం ద్వారా భద్రత సహకారం పెంచుకోవడానికి నాయకులు అంగీకరించారు.

సార్వత్రిక, స్వేచ్ఛాయుత, సురక్షిత సైబర్‌ రంగం దిశగా సహకార బలోపేతం దిశగా వార్షిక ద్వైపాక్షిక సైబర్ సంప్రదింపులపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆన్‌లైన్ సైబర్ స్కూల్ 8వ సమావేశం నిర్వహణను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో బహుపాక్షిక వేదికలపై మరింత సన్నిహిత సమన్వయం, సామర్థ్య వికాసం, జ్ఞాన ఆదానప్రదానం ద్వారా సైబర్ ముప్పులు, నేరాల నిరోధానికి సంయుక్త కృషి సహా సైబర్‌ రంగంలో సహకారం పెంపు దిశగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనపై సంతకం చేయడాన్ని నాయకులు స్వాగతించారు.

సార్వత్రిక, స్వేచ్ఛాయుత, సురక్షిత, సుస్థిర, సౌలభ్య, శాంతియుత ఐసీటీ వాతావరణం ఏర్పడాల్సిన ఆవశ్యకతను వారిద్దరూ స్పష్టం చేశారు. పరిశోధనలకు, నవ్యావిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి ఇదొక ఉపకరణం కాగలదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2026 ఫిబ్రవరి 19న న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌’లో పాల్గొనడంపై ప్రధానమంత్రి మోదీ నెదర్లాండ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లోగల పహల్గామ్‌లో 2025 ఏప్రిల్‌ నాటి ఉగ్రవాదుల మారణకాండను అమానుష, హేయమైన దాడిగా ప్రధానమంత్రి రాబ్‌ జెటెన్‌ ఖండించారు. సరిహద్దు ఉగ్రవాదంసహా ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్‌ చేస్తున్న కృషికి నెదర్లాండ్స్ సంఘీభావం, ప్రగాఢ మద్దతును తెలిపింది. ఈ ఊచకోతకు సూత్రధారులను ఇందుకు బాధ్యులను చేయాలని నాయకులిద్దరూ పిలుపునిచ్చారు. అన్ని రూపాలు, వ్యక్తీకరణలలోగల ఉగ్రవాదాన్ని ప్రధానమంత్రులు నిస్సంశయంగా ఖండించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే వైఖరిని అనుసరించాలని, ఉగ్రవాద నిరోధంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి, ఎఫ్‌ఏటీఎఫ్‌ సహా ద్వైపాక్షిక, బహుపాక్షిక యంత్రాంగాల ద్వారా ఉగ్రవాదాన్ని నిరంతరం, సమగ్రంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానం-1267లో ఆంక్షల కమిటీ నిషేధించిన సమూహాలతోపాటు ఉగ్రవాదులు, వాటి బృందాలన్నిటిపైనే కాకుండా వారి ప్రతినిధులు, అనుబంధ సంస్థలు, ప్రాయోజితులు, మద్దతుదారులు, ఆర్థిక చేయూతనిచ్చే శక్తులపై సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు వారు పిలుపునిచ్చారు. ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, మౌలిక సదుపాయాల నిర్మూలనతోపాటు ఉగ్రవాద నెట్‌వర్కులను, వాటి ఆర్థిక వనరులను నిరోధిస్తూ, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాద సూత్రధారులను సత్వరం న్యాయస్థానం ఎదుట నిలబెట్టడంలో అన్ని దేశాలు తమ వంతు కృషి చేయాలని కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి సమగ్ర ఒడంబడిక దిశగా భారత్‌ కృషికి ప్రధానమంత్రి రాబ్‌ జెటెన్‌ మద్దతు ప్రకటించారు.

మానవరహిత విమాన వ్యవస్థల వంటి వినూత్న, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉగ్రవాద దుశ్చర్యల కోసం ఉపయోగించడం, ఉగ్రవాదులు-ఉగ్రవాద సంస్థలు వర్చువల్ ఉపకరణాలను వినియోగిస్తుండటం, ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సమాచార-ప్రసార సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగం తదితరాలతో ముప్పు పెరుగుతుండటంపై నాయకులిద్దరూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఉగ్రవాదంపై పోరాటం సహా ఈ అంశాల్లో ప్రపంచ సహకారం దిశగా సంబంధిత చట్రాన్ని బలోపేతం చేయడంపై ఉమ్మడి నిబద్ధతను వారిద్దరూ అంగీకరించారు. ఇందులో భాగంగా మనీలాండరింగ్ నిరోధం సహా ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడాన్ని నిలువరించడంలోనూ అన్ని దేశాలూ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతికతలు.. ఆవిష్కరణలు.. విజ్ఞానం.. విద్య

సెమీకండక్టర్లు, సంబంధిత ఆధునిక సాంకేతికతపై భాగస్వామ్యం దిశగా అవగాహన ఒప్పందంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, పరిశోధన, ప్రతిభ ఆదానప్రదానం వంటివి సహా సెమీకండక్టర్ల రంగంలో సహకారాన్ని మరింత పెంచేందుకు ఈ ఒప్పందం ఒక చట్రాన్ని సమకూరుస్తుంది.

విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలపై సంయుక్త కార్యాచరణ బృందం ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తుండటంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిద్వారా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ఏర్పాటు, ప్రభుత్వాలు-వ్యాపారాలు-విజ్ఞాన సంస్థ నైపుణ్యానుసంధానంపై దృష్టి సారించడాన్ని ప్రశంసించారు. అలాగే, విజ్ఞానం-సాంకేతికత-ఆవిష్కరణల రంగంలో కొనసాగుతున్న సహకారంపై హర్షం వెలిబుచ్చారు. సంయుక్త పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రతిభ-సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి క్రమం తప్పని ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ బృందం మార్గం సుగమం చేస్తుంది. ఈ మేరకు కొన్నేళ్ల నుంచీ సంయుక్తంగా ప్రారంభించిన దాదాపు 50 పెద్ద పరిశోధన-ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రధానమంత్రులు ఇద్దరూ గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి సామాజిక సవాళ్లను భాగస్వామ్య పరిష్కారాలతో ఎదుర్కోవడమే లక్ష్యంగా కీలక సహాయక సాంకేతికతల రంగంలో నిరంతర సహకారానికి ప్రాధాన్యం పెరుగుతున్నదని వారు అంగీకరించారు.

సహకారం, సాంకేతికత, ప్రతిభా వికాసం ద్వారా సెమీకండక్టర్ రంగానికి.. ముఖ్యంగా పరిశ్రమలు, అంకుర సంస్థలు, ఉన్నతీకరణలు, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, వాటి సరఫరాదారులకు మద్దతునిస్తూ- వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్-డచ్ సెమీకండక్టర్ కాంపిటెన్స్ సెంటర్‌ల అనుసంధాన చొరవను వారిద్దరూ స్వాగతించారు. దీంతోపాటు ఇండో-డచ్ సెమీకండక్టర్ ఆన్‌లైన్ స్కూల్‌ను, దాని తదుపరి దశ కొనసాగింపును అభినందించారు.

సెమీకండక్టర్లు, సంబంధిత సాంకేతికతలలో ‘ఎన్‌ఎక్స్‌పీ, ఏఎల్‌ఎంఎల్‌, టాటా, సీజీ సెమియా వంటి పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో మేధా మథన వారధి రూపకల్పనను వారు ప్రశంసించారు. ఈ దిశగా ఐండ్‌హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటే సహా 6 ప్రముఖ భారతీయ సాంకేతిక సంస్థల (ఐఐఎస్‌సీ-బెంగళూరు సహా బాంబే, ఢిల్లీ, గాంధీనగర్, గువహటి, మద్రాస్ ఐఐటీల) మధ్య సహకార ఒప్పందం కుదరడాన్ని స్వాగతించారు. రెండువైపులా విద్యా-పారిశ్రామిక రంగాల భాగస్వామ్యంతో పరిశోధన-అభివృద్ధితోపాటు ప్రతిభా వికాసానికి ఇది ఉత్తేజమిస్తుందని పేర్కొన్నారు.

నిరంతర ఆవిష్కరణలలో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాధాన్యంతోపాటు పటిష్ఠ, సుస్థిర  సరఫరా వ్యవస్థల రూపకల్పనలో ప్రపంచ సహకారం అవసరాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. అన్వేషణ, పరిశోధన, ఆవిష్కరణ, విలువ వ్యవస్థల ఏకీకరణ, సరఫరా వ్యవస్థ పటిష్టీకరణ, వర్తుల ఆర్థిక వ్యవస్థ, ఈఎస్‌జీ ప్రమాణాలు, సంబంధిత అంచనాలు సహా కీలక ఖనిజాల విలువ వ్యవస్థలన్నిటా సహకార బలోపేతంపై వారిద్దరూ ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం కుదరడంపై హర్షం ప్రకటించారు.

రెండు దేశాల ఉన్నత విద్యా సంస్థల విద్యా-బోధన ప్రాధాన్యాలు, అవసరాలకు అనుగుణంగా సహకారాన్ని ప్రోత్సహించేందుకు, భారత-నెదర్లాండ్స్‌ విద్యా మంత్రిత్వ శాఖ, విద్యా-సంస్కృతి-శాస్త్రవిజ్ఞాన మంత్రిత్వ శాఖల మధ్య ఉన్నత విద్యపై అవగాహన ఒప్పందం కుదరడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.

డచ్, భారత విశ్వవిద్యాలయాల మధ్య కొనసాగుతున్న సంస్థాగత సహకారంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రోనింగన్-నలంద విశ్వవిద్యాలయాలు, డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-ముంబై మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ, సర్వే ఆఫ్ ఇండియా-ఐటీసీ, ట్వెంటే విశ్వవిద్యాలయం; వ్రిజే యూనివర్సిటీ ఆమ్‌స్టర్డామ్- ఐఐటీ రూర్కీ తదితర మరెన్నో సంస్థల మధ్య ఇటీవలి సహకార ఒప్పందాలను వారు ఉదాహరించారు. విద్యా-శాస్త్రవిజ్ఞాన సహకార బలోపేతంలో ఇండో-డచ్ ఎడ్యుకేషన్ అండ్‌ అకడమిక్ నెట్‌వర్క్ వంటి వేదికలు కీలక పాత్ర పోషించగలవని వారు పేర్కొన్నారు.

భారత్‌-నెదర్లాండ్స్ మధ్య అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై వారిద్దరూ సమాలోచన చేశారు. ముఖ్యంగా వాతావరణ మార్పు, జలవనరుల సమస్యలు, ఆహార భద్రత, వాయు నాణ్యత వంటి సామాజిక సమస్యల పరిష్కారంలో అంతరిక్ష ఆధారిత అనువర్తనాల వినియోగం ఆవశ్యతను వారు స్పష్టం చేశారు.

ఇంధన భద్రత.. మార్పిడి.. వర్తుల ఆర్థిక వ్యవస్థ

జీవ ఇంధనాలు, రసాయనాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రస్తావిస్తూ- జి20కి భారత్‌ అధ్యక్షత సమయంలో ప్రారంభించిన ‘గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌’లో నెదర్లాండ్స్ చేరడంపై ప్రధానమంత్రి మోదీ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా జీవ-ఆర్థిక వ్యవస్థపై కృషి చేసేందుకు ప్రధానమంత్రులు ఇద్దరూ నిబద్ధతను పునరుద్ఘాటించారు. మరోవైపు ‘మిషన్ ఇన్నోవేషన్ ఆన్‌ బయోరిఫైనరీస్‌’ కార్యక్రమం రెండు దేశాలు సంయుక్త అధ్యక్షతన విజయవంతం కావడంపై సమీక్షించారు.

‘వ్యర్థం నుంచి అర్థం’పై ద్వైపాక్షిక సహకారాన్ని గుర్తిస్తూ, డచ్ జాతీయ వర్తుల ఆర్థిక వ్యవస్థ కార్యక్రమం 2023-2030కి సంబంధించి 2025నాటి నవీకరణ, వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్-2026కు భారత్‌ అధ్యక్షత వహించడం వంటివి మరిన్ని కొత్త రంగాల్లో భాగస్వామ్య విస్తరణకు అవకాశాన్నిస్తాయని నాయకులు పేర్కొన్నారు. పారిశ్రామిక వర్తుల ఆర్థిక వ్యవస్థ, ప్రయోగాత్మక-విస్తరణానుకూల ప్రాజెక్టులలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, నవ్యావిష్కరణలు తేవడం, వాణిజ్య-పెట్టుబడుల రంగంలో అవకాశాల కల్పన అవసరాన్ని స్పష్టం చేశారు. సుస్థిర, వాతావరణ మార్పులను తట్టుకోగల పట్టణ వ్యవస్థల కోసం ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఉదాహరణకు... ‘రిసోర్స్ ఎఫిషియెన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ కోయలిషన్’లో చేరడానికి డచ్ కంపెనీలను ఆహ్వానించిన బీ2బీ భాగస్వామ్యాలతో ఇది సాధ్యం కాగలదు. సుస్థిర రవాణా రంగంలో అత్యాధునిక, పరస్పర పూరక ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ సాంకేతికత-వ్యవస్థల ఏకీకరణ, ప్రామాణీకరణ, సార్వత్రిక విధివిధానాలు, భారీ-మధ్యస్థ-భారీ శూన్య ఉద్గార వాహనాలు, ఆధునిక పట్టణ రవాణా వ్యవస్థలు, బహుళ-రవాణా మార్గాల ఏకీకరణ, ప్రత్యామ్నాయ ఇంధనాలు, క్రియాశీల రవాణా వంటి రంగాల్లోనూ సహకారాన్ని మరింతగా విస్తరించవచ్చునని పేర్కొన్నారు.

పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌- నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ పునరుత్పాదక ఇంధనంపై అవగాహన ఒప్పందం కింద ఒక సంయుక్త కార్యవర్గం ఏర్పాటును రెండు దేశాల నాయకులూ స్వాగతించారు. ఇంధన మార్పడిని సరళం చేయడంలో వినూత్న సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్, నిల్వ-పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు సహా పునరుత్పాదక ఇంధన సహకారంపై విస్తృత కార్యక్రమానికి ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తుంది.

పునరుత్పాదక ఇంధనంపై సహకారంతోపాటు ఉభయపక్షాల పెట్టుబడుల బలోపేతం సహా గ్రీన్‌ హైడ్రోజన్ రూపకల్పనపై ప్రతిష్టాత్మక భారత్-నెదర్లాండ్స్ భవిష్యత్‌ ప్రణాళికను రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్తంగా ఆవిష్కరించారు. గ్రీన్‌ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతికి సంబంధించి భారత్‌ ఆకాంక్షలు, అపార సామర్థ్యంతోపాటు పోటీతత్వ ప్రయోజనాల పరంగా ఈ ప్రణాళిక ఎనలేని మద్దతిస్తుందని వారు పేర్కొన్నారు. దీంతోపాటు రెండు దేశాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఒక సుస్థిర ఇంధన వనరుగా ప్రజానీకం సత్వరం అంగీకరించడంలో ఇది దోహదం చేస్తుందని తెలిపారు.

మరోవైపు ఇంధన మార్పిడి సామర్థ్య వికాసంపై నీతి ఆయోగ్-నెదర్లాండ్స్ మధ్య ఉమ్మడి లక్ష్యం ప్రకటన పునరుద్ధరణతో ఇంధన భద్రత, మార్పిడి రంగాల్లో నిరంతర సహకారానికి భరోసా లభిస్తుంది.

విద్యారంగంలో సహకార బలోపేతం లక్ష్యంగా గ్రోనింగన్ విశ్వవిద్యాలయం, భారత్‌లోని 19 ఐఐటీల మధ్య అవగాహన ఒప్పందం కుదరడంపై ప్రధానమంత్రులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రోజన్‌పై పీహెచ్‌డీ ఫెలోషిప్ కోర్సు ప్రారంభం దిశగా భారత శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, గ్రోనింగన్‌ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందాన్ని కూడా వారు స్వాగతించారు.

నీటి నిర్వహణ
భారత నీటి సంబంధిత అవసరాలు... నెదర్లాండ్స్ నైపుణ్యాలు, అనుభవం మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా నీటి విషయంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కింద సాధించిన పురోగతిని ఇరువురు నేతలు గుర్తించారు. నమామి గంగే మిషన్‌లో భాగస్వామ్యం... 'నీటిని ఒక సాధనంగా' ఉపయోగించడం సహా పట్టణ నదీ నిర్వహణ ప్రణాళికల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునేందుకు పట్టణ నీటి నిర్వహణ, డెల్టా నిర్వహణ, నీటి నాణ్యత నిర్వహణ, మురుగునీటి పునర్వినియోగం, నూతన నీటి సాంకేతిక పరిజ్ఞానాల పరిచయం వంటి రంగాల్లో జరుగుతున్న ఉమ్మడి ప్రయత్నాలను ఇరువురు ప్రధానమంత్రులు అభినందించారు. సురక్షిత పారిశుధ్య నిర్వహణ, అందరికీ స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచడం వంటి లక్ష్యాల ప్రాముఖ్యతను ఇరువురు నేతలూ ప్రధానంగా ప్రస్తావించారు. భారత స్వచ్ఛ్ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా.... అంతర్జాతీయంగా వాష్ (డబ్ల్యూఏఎస్‌హెచ్) సంబంధిత అభివృద్ధి ప్రాజెక్టులకు సుస్థిర ఆర్థిక సాయం అందించడంలో నెదర్లాండ్స్ కృషిని వారు గుర్తించారు.
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో... నెదర్లాండ్స్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, జల నిర్వహణ మంత్రిత్వ శాఖ సహకారంతో... ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ (ఐఐటీ)లో జల రంగం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ఇరువురు నేతలు స్వాగతించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ ఉమ్మడి కార్యక్రమాల కింద సాధించిన పురోగతినీ వారు గుర్తించారు.
గుజరాత్‌లోని కల్పసర్ ప్రాజెక్టుపై సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ ప్రాజెక్టులో డచ్ ప్రజల నైపుణ్యం, సాంకేతిక సహాయం... నీటి విషయంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలవని వారు అభిప్రాయపడ్డారు.

భారత్ నేతృత్వంలోని గ్లోబల్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఈఆర్ఐ) కింద పట్టణ నీటి మౌలిక సదుపాయాల సామర్థ్యాల కార్యక్రమంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఇరువురు దేశాధినేతలు చర్చించారు. ఈ కార్యక్రమ సభ్యత్వంలో భాగంగా నెదర్లాండ్స్ తన నైపుణ్యాన్ని పంచుకుంటోంది. అభివృద్ధి చేసిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్ఏ)తో కలిసి భారత నగరాల్లో... ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా ఇతర సీడీఆర్ఐ సభ్య దేశాల్లోనూ అమలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇరువురు నాయకులు తెలిపారు.
నౌకా వాణిజ్య అభివృద్ధి
ఇటీవల పునరుద్ధరించిన నౌకా వాణిజ్య సహకారంపై అవగాహన ఒప్పందాన్ని ఇద్దరు ప్రధానమంత్రులు అధికారికంగా ధ్రువీకరించారు. అక్టోబర్ 2025లో సంతకం చేసిన ఉద్దేశ పత్రంలో పేర్కొన్న విధంగా... భారత్-నెదర్లాండ్స్ మధ్య వ్యూహాత్మక 'హరిత, డిజిటల్ సముద్ర కారిడార్' అభివృద్ధికి మద్దతునిస్తూ, సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన నౌకా వాణిజ్య రంగం కోసం నిరంతర సహకారం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఓడరేవులు, అంతర్గత జలమార్గాల స్మార్ట్, సుస్థిర అభివృద్ధి... సరుకు రవాణా వ్యయాలను తగ్గిస్తూనే వినియోగదారులకు వేగవంతమైన, విశ్వసనీయ సేవలనందించడం... హరిత ఓడరేవులు, నౌకాయానం రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడం, విస్తరించడానికి వారు అంగీకరించారు. తదుపరి దశగా, భారత్-నెదర్లాండ్స్ మధ్య పర్యావరణపరంగా సుస్థిరమైన, డిజిటల్‌ అనుసంధానితమైన, ఆర్థికంగా సమర్థమైన, భవిష్యత్ కోసం సిద్ధమైన సముద్ర కారిడార్ దిశగా పనిచేయడం లక్ష్యంగా 'హరిత, డిజిటల్ సముద్ర కారిడార్‌పై సమగ్ర వ్యూహాత్మక రోడ్‌మ్యాప్'ను అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించడానికి ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు.

ప్రపంచ, ప్రాంతీయ నౌకా వాణిజ్య భద్రతలో... ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఓడరేవులు, అంతర్గత జలమార్గాల్లో సైబర్ సామర్థ్యాలు సహా కీలక మౌలిక సదుపాయాలను పరిరక్షించడం... విభిన్న, సమర్థమైన సరుకు రవాణా వ్యవస్థలను (కీలక ముడి పదార్థాలు, మందులు, ఆహారంతో సహా) ప్రోత్సహించడం వంటి రంగాల్లో సంబంధిత ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు, విజ్ఞాన సంస్థల మధ్య అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడానికి ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు.
ఆరోగ్య రంగం
ఆరోగ్య రంగంలో... ముఖ్యంగా అంటువ్యాధులు, యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదాలను, పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల ప్రభావాన్ని పరిష్కరించడంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. డిజిటల్ హెల్త్ (ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ సహా), సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో మరింత సహకారాన్ని ప్రోత్సహించడానికీ వారు అంగీకరించారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యంపై అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడాన్ని... మహిళల ఆరోగ్యం, వాతావరణ-పరిరక్షణ సంసిద్ధత కోసం సామర్థ్యాలను పెంపొందించడం... ఇరు దేశాల్లో సుస్థిర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై జ్ఞానాన్ని పంచుకోవడం వంటి రంగాల్లో కొత్త సహకార కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారు. ఈ పునరుద్ధరించిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో... అంటువ్యాధులు, వెక్టర్-జనిత వ్యాధులు, వన్ హెల్త్, వ్యాధిపై నిఘా వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ డచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ఆర్ఐవీఎమ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) మధ్య ఇటీవల సంతకం చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌నూ ఇరువురు నాయకులు స్వాగతించారు.
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన, అందుబాటులో ఉండే, సురక్షితమైన, సుస్థిరమైన ఆరోగ్య సంరక్షణను అందించడం కోసం ఔషధాలు, వైద్య పరికరాల రంగాల్లో సహకారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఇద్దరు ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. 2026లో, కొత్తగా కుదిరిన అవగాహన ఒప్పందం కింద మొదటి సంయుక్త కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అవగాహన ఒప్పందం, దాని కార్యాచరణ ప్రణాళిక అమలు, మరింత అభివృద్ధిపై చర్చించడంతో పాటుగా విద్యా సంబంధ సహకారం, నియంత్రణ సంబంధ సహకారం, వ్యాపార భాగస్వామ్యం, మార్కెట్ అనుమతులకు గల అవకాశాలపై సమాచారాన్ని పంచుకోవడం వంటి కీలక సహకార అవకాశాలను గుర్తిస్తారు.
వ్యవసాయంఆహార వ్యవస్థలు
వ్యవసాయం, ఆహార వ్యవస్థలు, బాధ్యతాయుతమైన వ్యాపార నిర్వహణ రంగాల్లో... ముఖ్యంగా వ్యవసాయంపై సంయుక్త కార్యవర్గం ద్వారా సమాచారాన్ని, అనుభవాలను పంచుకోవడంతో పాటు భారత్-నెదర్లాండ్స్ సహకారం కొనసాగుతున్న తీరు పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో రక్షిత సాగు, ఆహార శుద్ధి, పాడి పశువులు-కోళ్ల పెంపకం రంగాల్లో పెరుగుతున్న డచ్ కంపెనీల ఉనికిని నాయకులు స్వాగతించారు. అగ్రి-టెక్ సహా వ్యవసాయ రంగానికి సంబంధించి భారత్-డచ్ కంపెనీల మధ్య సహకారానికి గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.
డచ్ నిపుణుల నైపుణ్యంతో భారత్‌లోని వ్యవసాయ సంబంధిత రంగాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు విషయంలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ కేంద్రాలు అత్యాధునిక గ్రీన్‌హౌస్ వ్యవసాయ ఉత్పత్తిలో సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటు, చిన్న కమతాల రైతులకు మెరుగైన వ్యవసాయ దిగుబడులను, సామర్థ్యాలను అందిస్తున్నాయి. ఈ కేంద్రాలు మరింత సుస్థిరమైన, అధిక నాణ్యమైన, అధిక దిగుబడిని పొందడంలో సహాయపడుటతో పాటుగా వ్యవసాయంలో నీటి వినియోగాన్ని, రసాయనాల వాడకాన్నీ తగ్గిస్తున్నాయి.
నిరంతర సహకారం, సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఈ కేంద్రాల ప్రభావాన్ని, సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచడం పట్ల ఇరువురు ప్రధానమంత్రులు తమ నిబద్ధతను స్పష్టం చేశారు. ఆహార వ్యవస్థలకు సంబంధించిన వివిధ అంశాల్లో, వృత్తి విద్యా రంగంలో విస్తృత సహకారాన్ని అన్వేషించడానికీ వారు అంగీకరించారు.
భారత మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ... నెదర్లాండ్స్ వ్యవసాయ, మత్స్య, ఆహార భద్రత, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేయడాన్నీ, పాడి పరిశ్రమలో శిక్షణ కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమల్ హస్బెండ్రీ (సీఈఏహెచ్)లో ఒక ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటునూ ఇరువురు నేతలు స్వాగతించారు. ఆహార శుద్ధి సహా పాడి, ఇతర అనుబంధ వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలూ అంగీకరించాయి.

ప్రపంచంతో పోటీపడుతున్న భారత ఉద్యానవన రంగం కోసం... అధిక విలువ కలిగిన ఉద్యానవన, పండ్ల పంటలకు సంబంధించి తెగులు రహితమైన, నాణ్యమైన నారు లభ్యతను ప్రోత్సహించేందుకు... కొనసాగుతున్న భారత 'క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్' కింద 'క్లీన్ ప్లాంట్ సెంటర్స్' (సీపీసీల) ఏర్పాటు కోసం ఉద్యానవన రంగంలో భారత-డచ్ సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న కృషిని ఇరువురు ప్రధానమంత్రులు ప్రశంసించారు. ఈ విషయంగా సామర్థ్యాలను పెంపొందించడం, మద్దతునందించండం లక్ష్యంగా నక్తుయిన్‌బౌ... భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఉద్యానవన బోర్డు మధ్య కుదిరిన  అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు.

ఆహార భద్రత, రక్షణల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తూ... నెదర్లాండ్స్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌వీడబ్ల్యూఏ), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు.

ప్రజా సంబంధాలుసంస్కృతి

భారత్-నెదర్లాండ్స్ సంబంధాలకు మూలస్తంభంగా ఉన్న బలమైన ప్రజా సంబంధాలను ఇద్దరు ప్రధానమంత్రులు గుర్తించారు. డచ్ సమాజానికి నెదర్లాండ్స్‌లోని భారతీయ సమాజం చేసిన సేవలకు ప్రధానమంత్రి జెట్టెన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, క్రీడలు, సాంస్కృతిక మార్పిడుల ద్వారా ఇరు దేశాల మధ్య ప్రజల సంబంధాలను మరింత సులభతరం చేయాలనే తమ సంకల్పాన్ని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.

ఇరు దేశాల మధ్య చట్టబద్ధమైన వలసలు, రాకపోకలను సులభతరం చేయాల్సిన ప్రాముఖ్యతను గుర్తించి, ఈ విషయంగా అవగాహన ఒప్పందంపై సంతకం చేయడాన్ని ఇరు దేశాల నేతలు స్వాగతించారు.

అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను నివారించడం, ఎదుర్కోవడం... అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల చట్టబద్ధమైన రాకపోకలను ప్రోత్సహించడం లక్ష్యంగా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికీ ఇరు దేశాలు అంగీకరించాయి. వలస కార్మికులను గౌరవ మర్యాదలతో చూసేలా నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ విధానం మార్గనిర్దేశం పొందుతుంది. చట్టబద్ధమైన రాకపోకలు, పారదర్శక వీసా ప్రక్రియలు, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.

రూపకల్పన, ప్రదర్శన కళలు, దృశ్య కళలు, మ్యూజియం, వారసత్వ సహకారం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం సహా... మెరుగైన సాంస్కృతిక సహకారం ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశంపైనా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇరు దేశాల సంస్కృతిని పరస్పరం గౌరవించుకోవాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... డ్రెంట్స్ మ్యూజియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా, డ్రెంట్స్ మ్యూజియంలో అమృత షేర్-గిల్ కళాకృతుల ప్రదర్శన ఏర్పాటు ప్రయత్నాలను ఇరు దేశాల ప్రధానమంత్రులు అభినందించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో వాన్ గో, ఇతర డచ్ కళాకృతుల ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.

సాంస్కృతిక కళాఖండాల అప్పగింత, పునరుద్ధరణ విషయంలో పరస్పర సహకారం ప్రాముఖ్యతనూ ఇద్దరు ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఆ విషయంలో లైడెన్ విశ్వవిద్యాలయం నుంచి చోళుల కాలం నాటి తామ్ర పత్రాలను భారత అధికారులకు అప్పగించడాన్ని వారు స్వాగతించారు.

భారత్-నెదర్లాండ్స్ మధ్య శతాబ్దాల నాటి ద్వైపాక్షిక నౌకా వాణిజ్య చరిత్రను గుర్తుచేసుకుంటూ... లోథాల్ (గుజరాత్)లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎమ్‌హెచ్‌సీ) అభివృద్ధిలో సహకారం కోసం భారత ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఆమ్‌స్టర్‌డామ్‌లోని నేషనల్ మారిటైమ్ మ్యూజియం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు.

స్నేహపూర్వకమైన, ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ చర్చల సందర్భంగా... ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి, భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్‌మ్యాప్‌లోని వివిధ రంగాల్లో బహుముఖ సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఇరువురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు ఆత్మీయ ఆతిథ్యం అందించిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవ రాబ్‌ జెటెన్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ రాబ్‌ జెటెన్‌ను వీలైనంత త్వరగా భారత్‌ను సందర్శించాలని శ్రీ మోదీ ఆహ్వానించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How India, Australia clinched Uranium deal

Media Coverage

How India, Australia clinched Uranium deal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives due to boat capsizing in South 24 Parganas district of West Bengal
July 13, 2026
Prime Minister announces ex-gratia

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal.

The Prime Minister conveyed his thoughts to the bereaved families in this hour of grief and prayed for the speedy recovery of the injured.

The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.

The Prime Minister’s Office posted on X;

“The loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal is deeply painful. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”