భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్. 2026 మే 30 నుంచి జూన్ 3 వరకు భారతదేశంలో తన మొదటి అధికారిక పర్యటనను చేపట్టారు. 

అధ్యక్షుడితో పాటు మయన్మార్ అధ్యక్ష కార్యాలయం, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక - రెవెన్యూ, వ్యవసాయం, పశుసంవర్ధక - నీటిపారుదల, పరిశ్రమలు - ఎంఎస్ఎంఈ వ్యాపార అభివృద్ధి శాఖల కేంద్ర మంత్రులు.. మయన్మార్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరితో వ్యవసాయం, ఔషధాలు, ఇంధనం, బ్యాంకింగ్, నిర్మాణం, ఐటీ, సమాచార ప్రసారాలు, వాణిజ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాలకు చెందిన వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఉంది. మయన్మార్-భారత్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ సభ్యులు కూడా మయన్మార్ ప్రతినిధి బృందంలో భాగస్వాములుగా ఉన్నారు.

భారత ప్రధానమంత్రి, మయన్మార్ అధ్యక్షుడు 2026 జూన్ 1న చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి ఆసక్తి గల ద్వైపాక్షిక, ప్రాంతీయ- అంతర్జాతీయ అంశాలను సమీక్షించడంతో పాటు ఇరు దేశాల సంబంధాల భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. విచ్చేసిన విశిష్ట అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి మధ్యాహ్న భోజన విందును ఏర్పాటు చేశారు. అదే రోజున మయన్మార్ అధ్యక్షుడికి భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గౌరవపూర్వక స్వాగతం పలికారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ విడివిడిగా మయన్మార్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు.

ఈ పర్యటన ప్రారంభంలో 2026 మే 30న అధ్యక్షుడు బోధ్‌గయను సందర్శించారు. అక్కడ ఆయన మహాబోధి ఆలయం, మహాబోధి ధ్యాన కేంద్రం, సుజాత ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అత్యంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రాల సందర్శన ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత ఆధ్యాత్మిక- బౌద్ధ సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలను మరింత స్పష్టం చేశాయి.

ఢిల్లీలో 2026 మే 31న యూఎంఎఫ్‌సీసీఐ, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన 'భారత్-మయన్మార్ బిజినెస్ కాన్‌క్లేవ్'లో అధ్యక్షుడు కీలకోపాన్యాసం చేశారు. ఈ సదస్సులో ఇరు దేశాల వ్యాపార ప్రముఖులు ద్వైపాక్షిక వాణిజ్యం, వాణిజ్య అవకాశాలను మరింత బలోపేతం చేయడం- విస్తరించడంపై చర్చించారు. స్వచ్ఛ ఇంధన ఆవిష్కరణలు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన అనుసంధానం, గ్రిడ్ దృఢత్వం వంటి రంగాల్లో జరుగుతున్న అధునాతన పరిశోధనలను పరిశీలించడానికి గ్రేటర్ నోయిడాలోని 'ఎన్‌టీపీసీ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ అలయన్స్' (నేత్రా) కాంప్లెక్స్‌ను అధ్యక్షుడు సందర్శించారు.

అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతదేశపు 'పొరుగు దేశాలకే మొదటి ప్రాధాన్యత, యాక్ట్ ఈస్ట్, మహాసాగర్ (ప్రాంతీయ భద్రత, సమగ్ర వృద్ధి) విధానాల సంగమ స్థానంలో మయన్మార్ ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం-ఆర్థిక సంబంధాలు, రక్షణ- భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ధి సహాయం- సాంస్కృతిక మార్పిడిలతో సహా ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయవలసిన ప్రాధాన్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి. వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన పత్రాలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రస్తావించిన ఇరుపక్షాలు.. అవి త్వరలోనే విజయవంతంగా ముగియాలని ఆకాంక్షించారు.

మెరుగైన అనుసంధానత (రవాణా, సమాచార అనుసంధానం) ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఆర్థిక బంధాలను పెంపొందిస్తుందని, ఈ ప్రాంతంలో ఉమ్మడి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. ఈ నేపథ్యంలో 'కలదాన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్' ప్రాజెక్ట్, 'భారత్-మయన్మార్-థాయిలాండ్' త్రైపాక్షిక రహదారి పనులను పూర్తి చేయడానికి ఇరు దేశాలు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని ఇరుపక్షాల వారు అంగీకరించారు.

మయన్మార్ విద్యార్థుల కోసం మెకాంగ్ గంగా ఐసీసీఆర్ ఉపకార వేతనాల సంఖ్యను 2026 సంవత్సరం నుంచి 36 నుంచి 100 కి పెంచనున్నట్లు భారత ప్రధానమంత్రి తెలియజేశారు.

రూపాయి-క్యాట్ చెల్లింపుల విధానంతో సహా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, పెంపొందించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అలాగే 2024 మేలో ఈ విధానం ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన లావాదేవీల స్థిరమైన వృద్ధి పట్ల ఇరు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇరు దేశాల సంబంధిత జాతీయ చట్టాలు, నిబంధనలకు లోబడి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పెట్రోలియం, ఇంధనం, మైనింగ్ వంటి ఉమ్మడి ఆసక్తి గల రంగాల్లో మరింత సన్నిహిత వాణిజ్య, పెట్టుబడి సహకారానికి ఇరుపక్షాలు తమ మద్దతును ప్రకటించాయి.

మయన్మార్ సార్వభౌమాధికారానికి, ప్రాంతీయ సమగ్రతకు భారతదేశం అందిస్తున్న మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరస్పర భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించేలా తమ సార్వభౌమ భూభాగాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడంలోని ప్రాధాన్యతను ఇరుపక్షాలు ప్రధానంగా చెప్పాయి. భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని మయన్మార్ ఇస్తున్న హామీని అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు. మయన్మార్‌కు అత్యంత విశ్వసనీయ, నమ్మకమైన భాగస్వామిగా ఉన్న భారతదేశం ఇరు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని మరింత పటిష్ఠం చేయడానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మయన్మార్‌లో శాంతి, స్థిరత్వం, జాతీయ పునరుద్దరణ, సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధన దిశగా మయన్మార్ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతునిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, స్నేహపూర్వక సంబంధాల ఆధారంగా నిరంతర సహాయ సహకారాలను అందించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. భారతదేశం అందిస్తున్న నిర్మాణాత్మక మద్దతు, సహకారాన్ని అధ్యక్షుడు అభినందించారు.

2026 జూన్ 02 - 03 తేదీలలో ముంబయిలో జరగనున్న పర్యటనలో భాగంగా మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో అధ్యక్షుడి సమావేశాలుతో పాటు ఆయన పాల్గొననున్న వ్యాపార కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని, ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్ అధికారిక పర్యటన మయన్మార్, భారతదేశం మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని, సన్నిహిత భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించింది. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది చాటిచెప్పింది. అన్ని స్థాయిలలోనూ ఈ సన్నిహిత సంబంధాలను ఇలాగే కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

భారతదేశ పర్యటనలో తనకు, తన ప్రతినిధి బృంద సభ్యులకు లభించిన ఘన స్వాగత సత్కారాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పరస్పరం అనుకూలమైన తేదీల్లో మయన్మార్‌లో పర్యటించవలసిందిగా భారత ప్రధానమంత్రికి అధ్యక్షుడు ఆహ్వానం పలికారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour