2025, మార్చ్ 11, 12వ తేదీల్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన మారిషస్ అధికార పర్యటన సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీ మోదీల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని పార్శ్వాల గురించి సమగ్రమైన, ఫలవంతమైన చర్చలు జరిగాయి.   
మార్చి 11న జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. చరిత్ర, భాష, సంస్కృతి, వారసత్వం, బంధుత్వం, ఉమ్మడి విలువల పరంగా భారత్, మారిషస్ ల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని, సాటిలేనిదని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల ప్రజల మధ్య గల బలమైన సాంస్కృతిక బంధాలే భారత్-మారిషస్ ల ప్రత్యేక అనుబంధానికి మూలమని అన్నారు.  గత కొన్ని దశాబ్దాలుగా ఈ అనుబంధం  సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందిందని, ఇది వివిధ రంగాలకు విస్తరించి రెండు దేశాలకు, ప్రజలకు, విస్తృత హిందూ మహాసముద్ర ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తోందని వారు విశ్లేషించారు.
మారిషస్ స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచీ దేశ సాంఘిక-ఆర్థిక పురోగతికి... చిరకాల మిత్రదేశం, విశ్వసనీయ భాగస్వామి అయిన భారత్ దన్నుగా నిలిచిందని శ్రీ రాంగూలాం వ్యాఖ్యానించారు. భారత్ తమకు అన్నివేళలా అండగా నిలిచిందన్న ఆయన, భవిష్యత్తులో ఇరుదేశాలకూ ప్రయోజనం కలిగించే విధంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.   
2015 మార్చిలో తాను చేపట్టిన మారిషస్ పర్యటనను గుర్తు చేసుకున్న భారత ప్రధాని, విజన్ సాగర్ (ఆ ప్రాంతంలోని దేశాలన్నిటికీ భద్రత, అభివృద్ధి) పేరిట తాను చేసిన ప్రతిపాదన గురించి చెబుతూ, విజన్ సాగర్ విజయవంతం అయ్యేందుకు మారిషస్ కీలకమని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పట్ల మారిషస్ చూపుతున్న నిబద్ధత, సహకారాలని కొనియాడారు. విజన్ సాగర్.... పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం, గ్లోబల్ సౌత్ కు ప్రాముఖ్యం వంటి భారత కీలక విధానాల్లో మారిషస్ ముఖ్యమైనదని, పరస్పర ప్రయోజనం పొందేందుకూ ఈ విధానాల సాకారానికీ మారిషస్ కీలకమని శ్రీ మోదీ అన్నారు.   
విలక్షణమైన, దృఢమైన ద్వైపాక్షిక బంధాల గురించి ప్రస్తావించిన నేతలు, ఇరుదేశాల మధ్య నెలకొన్న  ప్రత్యేకమైన అనుబంధానికి నూతన దిశ కల్పించి బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరివర్తన చేయవలసిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.  

 

రాజకీయ స్థాయిలో...
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేక స్థాయుల్లో  పరస్పర విశ్వాసం, అవగాహనల ఆధారంగా కొనసాగుతున్నాయని, పరస్పర, ఉన్నతస్థాయి పర్యటనలు ఈ సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని నేతలిరువురూ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ జి-20 అధ్యక్షత సమయంలో మారిషస్ అతిథి దేశంగా పాల్గొనడం వల్ల, అనేకరంగాల్లో సంబంధాలు మరింత బలపడ్డాయని, వీటిని కొనసాగించవలసిన అవసరం ఉందని ఇరువురు నేతలూ అంగీకరించారు.  
ఇరుదేశాల పార్లమెంట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలను స్వాగతించిన నేతలు, సామర్థ్య పెంపు సహా పార్లమెంటు కార్యకలాపాల్లో అనుసరించదగ్గ ఉత్తమ పద్ధతులను గురించిన సమాచారం పంచుకోవాలని, ఇరుదేశాల పార్లమెంటు సభ్యుల మధ్య సంభాషణలని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించారు.  
అభివృద్ధి భాగస్వామ్యం
మారిషస్ కు స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచీ భారత్ ముఖ్య అభివృద్ధి భాగస్వామిగా ఉంటూ మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనుల్లో స్థిరమైన సహాయ సహకారాలను అందించిందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు. ఇండియా-మారిషస్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్, నూతన సుప్రీంకోర్టు భవంతి, కొత్త ఈఎన్ టీ ఆసుపత్రి, 956 గృహాల సముదాయం, ఎడ్యుకేషన్ టాబ్లెట్లకు సంబంధించిన ప్రాజెక్టుల వంటి అనేక ప్రాజెక్టులలో భారత్ సహాయం మరువలేనిదన్న శ్రీ రాంగూలాం, అనేక ఏళ్ళపాటుగా కొనసాగుతున్న భారత్ సహాయ సహకారాలు, అనేక రంగాలకు, దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చిందని కృతజ్ఞత వ్యక్తం చేశారు.  

భారత్ సహకారంతో అగలెగాలో నిర్మితమైన కొత్త రన్ వే, జెట్టీలు(రేవుకట్ట) ఎంతో ప్రయోజనకరమైనవని, ముఖ్యంగా ఇటీవల అగలెగాను అతలాకుతలం చేసిన చిడో తుఫాను నేపథ్యంలో, ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడంలో కొత్త సదుపాయాలు కీలకంగా మారాయని ఇద్దరు నేతలు విశ్లేషించారు. రవాణా విమానాలు, ఓడలు సహా, భారత ప్రభుత్వం అందించిన తక్షణ సహాయం, నిర్వాసితుల పునరావాస చర్యల్లో ఎంతో సహాయపడిందని మారిషస్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. మారిషస్ కు ఎటువంటి సహాయం అవసరమైనా, తొలిగా స్పందించే దేశంగా భారత్ మరోసారి తనను తాను నిరూపించుకుందని అన్నారు. అగలెగా అభివృద్ధిలో, అక్కడి ప్రజల సంక్షేమం కోసం చేపట్టే పనుల్లో ఈ సందర్భంగా ఆయన భారత్ సహాయాన్ని అర్థించారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రీనల్ ట్రాన్స్ ప్లాంట్ యూనిట్, ఫోరెన్సిక్ ప్రయోగశాల, జాతీయ ఆర్కైవ్స్, గ్రంథాలయం, సివిల్ సర్వీస్ కళాశాల, ముఖ్యమైన సామాజిక సంక్షేమ, అభివృద్ధి ప్రాజెక్టులు కీలకమైనవని, వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి కొనసాగిస్తామని నేతలు వెల్లడించారు.  

భారత్ సహాయ సహకారాలు అందించే పలు ప్రజోపయోగ ప్రాజెక్టులు స్నేహమయులైన ఆ దేశ ప్రజలకు కలిగించే ప్రయోజనాల దృష్ట్యా, నేతలిరువురూ: 

i. ఒక వంద ఎలక్ట్రిక్ బస్సులతోపాటు వాటికి సంబంధించిన ఛార్జింగ్ సదుపాయాలను కూడా అనుకున్న సమయానికే అందజేయడానికి కృషి చేయాలి.
ii. అధిక ప్రభావం చూపే సాముదాయిక అభివృద్ధి పథకాల రెండో దశను అమలుపరచాలి.
iii. ఇరు పక్షాల మధ్య కుదిరిన తొలి భారతీయ రూపాయి ఆధారిత రుణ ఒప్పందంలో భాగంగా మారిషస్‌లో 100 కి.మీ. మేర నీటి గొట్టపు మార్గాన్ని మార్చే పనిని మొదలుపెట్టాలి.
iv. మారిషస్ ప్రభుత్వం గుర్తించే ఒక స్థలంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే అంశంలో చర్చలకు తుదిరూపాన్ని ఇవ్వాలి. అంతేకాక గ్రాంటు రూపంలో భారత్ అందించే సాయంతో ఈ ప్రాజెక్టును అమలుచేయడానికి ఒక విధివిధానాలపై అంతిమ అవగాహనకు రావాలి.
v. గంగా సరస్సు ఆధ్యాత్మిక అభయారణ్యాన్ని సరికొత్తగా అభివృద్ధి పరిచే విషయంలో చర్చలను ముగించి, గ్రాంటు రూపంలో భారత్ అందించే సాయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఒక విధివిధానాలపై అంతిమ అవగాహనకు రావాలి.
vi. మారిషస్ ప్రభుత్వ అవసరాలు, ప్రాథమ్యాల ప్రకారం అభివృద్ధి ప్రధాన సహకారానికి కొత్త రంగాలను అన్వేషించాలి.

మానవ వనరులను అభివృద్ధిసామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు
12. భారత్ ఎల్లప్పుడూ మారిషస్‌కు సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాల్లో, శిక్షణ కార్యక్రమాలతోపాటు మానవ వనరుల అభివృద్ధి అవసరాలను తీర్చడంలో తన తోడ్పాటును అందిస్తూ వచ్చిన విషయాన్ని పరిశీలనలోకి తీసుకొని, నేతలిద్దరూ ఈ కింది అంశాల్లో తమ నిబద్ధతను వ్యక్తం చేశారు:

i. భారత ఐటీఈసీ ఫ్రేంవర్క్ కు సంబంధించిన కార్యక్రమాలు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు.. ఈ రెండిటిలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న ‘సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాల’ను కొనసాగించడం. మారిషస్‌కు చెందిన 500 మంది ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అయిదు సంవత్సరాల పాటు భారత్‌లో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) దన్నుతో నిర్వహించడం.  
ii. అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి, సహకారాన్ని ఇకమీదటా కొనసాగించడానికి సివిల్ సర్వీస్ కాలేజీ, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఆర్కైవ్స్, లైబ్రరీలకు మధ్య భారత్‌లోని సంబంధిత ప్రధాన సంస్థలతో సంస్థాగత సంబంధాలను ఏర్పరచడం.
iii. మారిషస్ ప్రభుత్వానికి నిర్వహణ సంబంధిత అవసరాలను తీర్చడానికి కన్సల్టెంట్లు, సాంకేతిక నిపుణులను ప్రతినిధులుగా పంపించడంలో సహకారాన్ని ఇకముందూ కొనసాగించడం.
iv. ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొని సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు సంస్థాగత రూపునిచ్చి మారిషస్ దౌత్యవేత్తలకు సుష్మా స్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో ఇప్పటికే అమలుచేస్తున్న శిక్షణ సంబంధిత సహకారాన్ని మరింత పెంచడంతోపాటు బలోపేతం చేయడం.
v. మారిషస్ అవసరాలు, ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకొని, సివిల్, పోలీసు, పారామిలటరీ, కస్టమ్స్, చట్ట వ్యవస్థ, ఆరోగ్య రంగం, తదితర రంగాల్లో మారిషస్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలను ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలించడం.  

అంతరిక్ష రంగంవాతావరణ మార్పు
అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారం ఎంతో ప్రయోజనకరంగా ఉందని, ఇది మారిషస్‌తో తనకున్న ప్రత్యేక సంబంధాలకు భారత్ కట్టబెడుతున్న ప్రాముఖ్యానికి అద్దంపడుతోందని నేతలు ఇరువురూ అంగీకరించారు. మారిషస్ కోసం ఒక ఉపగ్రహాన్ని సంయుక్తంగా రూపొందించే పనిలో భారత్ సహకారాన్ని అందిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి మారిషస్ ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సహకారం మారిషస్ అభివృద్ధి ప్రస్థానంలో భారత్ అందిస్తున్న దృఢమైన మద్దతుకు ఒక నిదర్శనంగా ఉందని కూడా ఆయన అన్నారు.

అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈ కింది అంశాలపై వారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు:
i. మారిషస్‌ శాస్త్రవేత్తలకు, నిపుణులకు అవసరమైన శిక్షణను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అందజేయడం సహా భారత్-మారిషస్ ఉపగ్రహానికి విజయవంతంగా రూపకల్పన చేయడంతోపాటు ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించే దిశగా కలిసి పనిచేయాలి.

ii. మారిషస్‌లో వివిధ కాలాల్లో వాతావరణ ముందస్తు సూచన ప్రణాళికలను, వేవ్ రైడర్ బాయస్, బహుళ ఆపదల వేళల్లో అనుసరించదగ్గ అత్యవసర ప్రణాళికలను అమలుపరచడంలో సాయం చేయాలి. దీనివల్ల విపత్తులను దీటుగా ఎదుర్కోవడానికి, ప్రతిస్పందన వ్యవస్థను రూపొందించుకోవడానికి మారిషస్‌కు అండదండలు లభిస్తాయి.
iii. మారిషస్‌లో ఏర్పాటు చేసిన ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ సెంటర్‌లో ఇస్రోకు, మారిషస్ రిసర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (ఎంఆర్ఐసీ)కి మధ్య ప్రస్తుతం అమలవుతున్న సహకారాన్ని పునరుద్ధరించుకోవాలి.
iv. మారిషస్ అవసరాలను తీర్చడానికి అంతరిక్ష రంగం, వాతావరణ మార్పు రంగం.. ఈ రెండు రంగాలలో సహకరించుకొనేందుకు కొత్త అవకాశాలను పరిశీలించాలి. దీనికి సంబంధించిన సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు మద్దతివ్వాలి.
v. ఎర్త్ అబ్జర్వేషన్ అప్లికేషన్‌తోపాటు ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ ఫ్రేంవర్క్‌.. వీటిని ఉపయోగించుకొనే లక్ష్యంతో ఒక అభివృద్ధి ప్రధాన భాగస్వామ్య ప్రాజెక్టును మొదలుపెట్టాలన్న భారత ప్రభుత్వ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవాలి. ఈ ప్రాజెక్టు ఉద్దేశం మారిషస్‌లో తీవ్ర వాతావరణ ఘటనలను పర్యవేక్షించడంతోపాటు వాతావరణ మార్పులు ప్రసరించే ప్రభావాలను కూడా సమర్థంగా అధ్యయనం చేయడం. ఈ ప్రాజెక్టును క్వాడ్ ఛత్రఛాయలో ఇస్రో, భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) నిర్వహిస్తాయి.   

ఆరోగ్యంవిద్యారంగాల్లో సహకారం
భారత ఆరోగ్యరంగ డీపీఐలు, ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మారిషస్ అభివృద్ధికి సహకరించడం సహా ఆరోగ్యం, విద్యారంగాల్లో మౌలికసదుపాయాల అభివృద్ధికి భారత్ అందించిన మద్దతును ప్రధానంగా ప్రస్తావిస్తూ, మారిషస్ ప్రజల కోసం నాణ్యమైన, సరసమైన, అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం పట్ల తమ నిబద్ధతను ఇరు దేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. భారత జన్ ఔషధీ కేంద్రాలను విదేశాల్లో తొలిసారిగా మారిషస్‌లో ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇరువురు నేతలు, దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ కేంద్రాలను విస్తరించనున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం, సంబంధిత సామాజిక సమస్యల సవాళ్ల నేపథ్యంలో పునరావాస కేంద్రాల ఏర్పాటు ద్వారా ఈ దురవాట్లను రూపుమాపేందుకు కలిసి పనిచేయనున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. అలాగే భారత మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ నైపుణ్యాలు, సహకారం అండగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమష్టిగా పనిచేస్తామని వారు తెలిపారు.  
మారిషస్‌లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటలైజ్ చేయుటలో సహాయం అందించడం కోసం భారత్ నుంచి ఒక నిపుణుడి సేవలను డిప్యుటేషన్ ద్వారా వినియోగించుకోవడంతో పాటు మారిషస్‌లో డిజిటల్ హెల్త్ కార్యాలయ వ్యవస్థను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఇరువురు ప్రధానులు తెలిపారు.
ఆయుష్ రంగంలో సహకారం ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. మారిషస్‌లో ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటులో మద్దతునిస్తున్న భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞలు తెలిపిన మారిషస్ ప్రధానమంత్రి, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో భారత్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆకాంక్షించారు. అలాగే భారత్‌లో చికిత్స పొందుతున్న మారిషస్ పౌరులకు భారత్ అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు.
పాఠశాల విద్య అభివృద్ధి కోసం మెరుగైన పాఠ్యప్రణాళిక రూపకల్పనలో పరస్పర సహకారానికై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎన్‌సీఈఆర్‌టీ), మారిషస్ ఉన్నత విద్యాశాఖ మధ్య కొనసాగుతున్న చర్చలను స్వాగతించిన ఇరువురు ప్రధానులు, ఈ సహకారం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పాఠశాల విద్యారంగంలో సంస్థాగత సంబంధాలనూ బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యూహం అమలు కోసం ప్రణాళికను సిద్ధం చేయడం, మారిషస్‌లో డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాపన సహా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ – మారిషస్ బంధాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు వారు తెలిపారు.

ఆర్థికవాణిజ్య సహకారం
ఆఫ్రికా ప్రాంతంలోని దేశంతో భారత్ చేసుకున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందమైన సమగ్ర ఆర్థిక సహకారంభాగస్వామ్య ఒప్పందం (సీఈసీపీఏ) ను ఇరుదేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో కీలక మైలురాయిగా అభివర్ణించిన ఇరువురు నేతలు, తమ ఉమ్మడి లక్ష్యమైన ఆర్థిక వృద్ధి, శ్రేయస్సు కోసం ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్య సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇతర అంశాలతో పాటు, మారిషస్‌కు గల ప్రాదేశిక ప్రయోజనం, సాంస్కృతిక సంబంధాలను గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆ దేశ ప్రధానమంత్రి, ఆఫ్రికా ఖండ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ)లో భాగంగా ఉన్న మారిషస్‌ను భారత కంపెనీలు, వ్యాపారులు ఆఫ్రికాతో భారత్ సంబంధాలకు వారధిగా ఉపయోగించుకుని, ఆఫ్రికా అందించే వాణిజ్య, వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను విస్తృతం చేయడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఇరువురు నేతలు కింది అంశాల్లో పరస్పర సహకారం కోసం ఏకాభిప్రాయానికి వచ్చారు:
i. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం సీఈసీపీఏ కింద ఉన్నత స్థాయి సంయుక్త వాణిజ్య కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించడం.
ii. ఇరు దేశాల భాగస్వామ్య సెంట్రల్ బ్యాంకులు స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ గురించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా భారత, మారిషస్ కరెన్సీలను మాత్రమే ఉపయోగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీల నిర్వహణను సులభతరం చేయడం.
iii. ప్రస్తుత చర్చల అనంతరం, ఒప్పంద దుర్వినియోగానికి సంబంధించి  అమలులో ఉన్న రెట్టింపు పన్ను విధానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించే ప్రోటోకాల్‌ను సాధ్యమైనంత త్వరగా ఆమోదించడం.
iv. దీర్ఘకాలిక, సుస్థిర ఆర్థిక వృద్ధి కోసం మారిషస్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సముద్ర ఆర్థిక వ్యవస్థ, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, ఫిన్‌టెక్ వంటి అబివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం.  
డిజిటల్ సహకారం
పెద్ద సంఖ్యలో జనాభాను దృష్టిలో ఉంచుకుని భారత్ రూపొందించిన డిజిటలైజేషన్ కార్యక్రమాలు సాధించిన విజయాలు, పరిపాలన, సేవారంగాల్లో వాటి సానుకూల ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించిన మారిషస్ ప్రధానమంత్రి, తమ దేశంలో వివిధ రంగాల డిజిటలైజేషన్ కోసం భారత్ సహకారాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు స్పందించిన భారత ప్రధానమంత్రి ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. దీనికి అనుగుణంగా ఇరువురు నేతలు కింది అంశాల్లో సహకారం కోసం ఏకాభిప్రాయానికి వచ్చారు:
i. మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌లో ఈ-జ్యుడీషియరీ వ్యవస్థ అమలు సహా ప్రాచీన పత్రాలు, రికార్డుల డిజిటలైజేషన్‌కు సహకారం అందించడం.
ii. సైబర్ భద్రత, డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు, సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలు సహా ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం.
iii. భారత్ రూపొందించిన పీఎమ్ గతి శక్తి డిజిటల్ ప్లాట్‌ఫామ్ వంటి విజయవంతమైన డిజిటల్ సాధనాలను మారిషస్ అవసరాలకు అనుగుణంగా అమలు చేయు మార్గాలను అన్వేషించడం.  

రక్షణసముద్ర భద్రతా సహకారం

రక్షణ, సముద్ర భద్రతా సహకారం ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఉందని, ఈ రంగంలో సన్నిహిత సహకారం వ్యూహాత్మక మార్పుతో రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఇరువురు నేతలు గుర్తించారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షితమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని నిర్ధారించడానికి భాగస్వామ్య నిబద్ధతను కలిగి ఉన్న మారిషస్, భారతదేశం ఈ ప్రాంతంలో సహజ భాగస్వాములుగా అభివర్ణించారు. సముద్ర సంబంధ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ, ఈ ప్రాంతంలో విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడంలోనూ కలిసి పనిచేయాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

తమ విస్తృత ప్రత్యేక ఆర్థిక మండలాన్ని (ఇఇజడ్ ) రక్షించడంలో అచంచలమైన మద్దతు అందిస్తున్నందుకు భారతదేశానికి మారిషస్ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ, సముద్ర ఆస్తులను సమకూర్చడం, నౌకలు, విమానాలను క్రమానుసార మోహరింపు, ఉమ్మడి సముద్ర పర్యవేక్షణ, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, పర్యవేక్షణ, ద్వైపాక్షికవిన్యాసాలు, సమాచారం పంచుకోవడం, శిక్షణపరంగా మద్దతు వంటి చర్యల ద్వారా మారిషస్‌కు భారత్ ప్రధాన భద్రతా ప్రదాతగా అవతరించింది.

తీర రక్షణ నౌకలు విక్టరీ, వాలియంట్ బారకుడా పునరుద్ధరణకు భారతదేశం అందిస్తున్న నిరంతర సహాయానికి కూడా మారిషస్ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ... మారిషస్ భారతదేశానికి ప్రత్యేక సముద్ర భాగస్వామి అని, భారతదేశ విజన్ సాగర్ (ప్రాంతంలో అందరికీ భద్రత, వృద్ధి) కింద ఒక ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. . ప్రాంతంలో ఉమ్మడి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, మారిషస్ రక్షణ, భద్రతా అవసరాలను పెంపొందించడంలో భారతదేశం తన నిరంతర మద్దతును, సహాయాన్ని కొనసాగిస్తుందని భారత ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ఈ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ఉమ్మడి ఆకాంక్షను పునరుద్ఘాటించిన నాయకులు ఈ విధంగా తీర్మానించారు:

i. మారిషస్ అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, రక్షణ, సముద్ర ఆస్తులు, సామగ్రిని అందించడంలో సహకారాన్ని కొనసాగిచడం.

ii. సంయుక్త సముద్ర నిఘా, హైడ్రోగ్రఫీ సర్వేల కోసం నౌకలు,విమానాల మోహరింపును పెంచడం ద్వారా సముద్ర సహకారాన్ని పెంపొందించడం.

iii. అగలేగా ద్వీపంలో కొత్తగా నిర్మించిన రన్ వే, జెట్టీని మరింత ఉపయోగించుకోవడంతో సహా మారిషస్ ఈఈజెడ్ ను సురక్షితంగా ఉంచే దిశగా సహకారాన్ని పెంపొందించుకోవడం.

iv. సముద్ర పరిధిపై అవగాహనను పెంపొందించేందుకు సముద్ర సమాచారాన్ని పంచుకునే జాతీయ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించడం.

v. మారిషస్ పోర్ట్ అథారిటీకి సముద్ర కార్యకలాపాలు, మెరైన్ ఇంజనీరింగ్, పోర్ట్ భద్రతా బాధ్యత , పోర్ట్ అత్యవసర పరిస్థితులు పోర్ట్ రక్షణ రంగాలలో నైపుణ్యాన్ని అందించడం ద్వారా సహకరించడం.

vi. మారిషస్ పోలీస్ బలగాల పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు, శిక్షణా కార్యక్రమాలు, సామర్థ్య పెంపు చర్యలను చేపట్టడం.

ప్రాంతీయబహుపాక్షిక సహకారం

చాగోస్ దీవులపై ప్రస్తుతం మారిషస్, బ్రిటన్ యునైటెడ్ మధ్య జరుగుతున్న చర్చలను ఇద్దరు నాయకులు స్వాగతించారు. చాగోస్ సమస్యపై మారిషస్‌కు భారత్ దృఢమైన మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత ప్రధాని వ్యక్తిగత మద్దతు ఇవ్వటమే కాకుండా ప్రపంచ నాయకులతో ఆయన నేరుగా చర్చించడం పట్ల మారిషస్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ), కొలంబో సెక్యూరిటీ కాన్ క్లేవ్ , గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కూటమి ద్వారా ప్రాంతీయ, బహుపాక్షిక యంత్రాంగం కింద సహకారాన్ని పెంపొందించడంలో కలిసి పనిచేయడానికి నాయకులు అంగీకరించారు. కొలంబో భద్రతా సదస్సు వ్యవస్థాపక పత్రాలపై ఇటీవల సంతకం చేయడాన్ని, 2025-26 కాలానికి ఐఓఆర్ఏ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టడాన్ని వారు స్వాగతించారు. సముద్ర భద్రతపై సహకారాన్ని పెంపొందించడానికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి ఈ ప్రాంతీయ యంత్రాంగాల ప్రాముఖ్యతను వారు గుర్తించారు.

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

సాంస్కృతిక వారసత్వం, చారిత్రక సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు రెండు దేశాల ప్రత్యేక సంబంధాలకు ఆధారంగా ఉన్నాయని గుర్తిస్తూ, వీటిని మరింత బలోపేతం చేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఈ దిశగా కింది చర్యలను చేపట్టాలని తీర్మానించారు.

i. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రత్యేక శిక్షణ, సంస్థాగత మద్దతుతో సహా భారతదేశానికి చెందిన ఒప్పంద కార్మికుల డాక్యుమెంట్ రికార్డులను భద్రపరచడంలో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ కు మద్దతు.

ii. భారత్ ను గురించి తెలుసుకునే కార్యక్రమం, కలిపే మార్గాలు, ప్రవాసీ భారతీయ దివస్, స్కాలర్ షిప్ ల ద్వారా ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేయడం, గిర్మిత్య వారసత్వానికి సంబంధించిన పరిశోధన, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో వారి వారి పాత్రను అక్షరబద్ధం చేయడం.

iii. చార్ ధామ్, రామాయణ మార్గాలతో పాటు భారతదేశంలోని పురాతన, మత ప్రార్థనా స్థలాల సందర్శనల ద్వారా పర్యాటక, సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించడం.

iv. మారిషస్, భారతదేశం మధ్య కార్మిక నియామక అవగాహన ఒప్పందం (ఎంఒయు) అమలును వేగవంతం చేయడం ద్వారా రెండు దేశాల మధ్య కార్మికుల రాకపోకల్ని సులభతరం చేయడం:

మొత్తం ద్వైపాక్షిక సంబంధాలపై తమ సమగ్ర చర్చల పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రత్యేక , సన్నిహిత ద్వైపాక్షిక భాగస్వామ్యం గణనీయమైన వ్యూహాత్మక స్థాయికి చేరిందని అంగీకరించారు. అభివృద్ధి భాగస్వామ్యం, రక్షణ, సముద్ర భద్రత, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారానికి మారిషస్-భారత్ ద్వైపాక్షిక భాగస్వామ్యం ప్రకాశవంతమైన ఉదాహరణ అని, ఈ ప్రాంతంలో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఒక ప్రామాణికాన్ని ఏర్పరుస్తుందని వారు పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా, మారిషస్ అభివృద్ధి అవసరాలను తీర్చేలా, ప్రాంత ఉమ్మడి లక్ష్యాలకు దోహదపడేలా మరింత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చడానికి మార్గదర్శకత్వం, మార్గనిర్దేశం అందించడానికి రెండు దేశాల నేతలు అంగీకరించారు.

మారిషస్ స్వాతంత్ర్యం 57వ వార్షికోత్సవం, మారిషస్ రిపబ్లిక్ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైనందుకు మారిషస్ ప్రధానమంత్రి భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

వీలైనంత త్వరగా భారత పర్యటనకు రావాలని మారిషస్ ప్రధానిని భారత ప్రధాని ఆహ్వానించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's commercial vehicle sales surge, manufacturers double growth projections to 10-15% this fiscal

Media Coverage

India's commercial vehicle sales surge, manufacturers double growth projections to 10-15% this fiscal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister remembers victims of 9/11 attacks, reiterates unwavering resolve to combat terrorism
September 11, 2026

The Prime Minister, Shri Narendra Modi has remembered and honoured the victims of the horrific 9/11 attacks on the 25th anniversary and expressed solidarity with the families whose lives were forever changed.

Shri Modi said that terrorism has claimed countless lives around the world and noted that, as a victim of cross-border terrorism, India has been at the forefront of the fight against terrorism for several decades.

He further added that while the threat of terrorism continues to evolve, India’s resolve and opposition to terrorism in all its forms and manifestations remain unwavering. He expressed solidarity with all efforts to combat this scourge.

The Prime Minister also shared glimpses from his visit to the 9/11 Memorial & Museum in 2014.

In a post on X, Shri Modi said;

“25 years on from the horrific 9/11 attacks, we remember and honour the victims and stand in solidarity with the families whose lives were forever changed.

Terrorism has claimed countless lives around the world. As a victim of cross-border terrorism, India has been at the forefront of this fight for several decades.

While the threat keeps evolving, our resolve and opposition to terrorism in all its forms and manifestations remain unwavering. We stand in solidarity with all efforts to combat this scourge.

Here are glimpses from my visit to the 9/11 Memorial & Museum in 2014.”