ప్రధానమంత్రి కార్నీ,

గౌరవనీయులారా,

నమస్కారం!
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ-7 కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతను నిర్ధారించడం మన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. దీనిని మేం ప్రాధాన్యంగా మాత్రమే కాకుండా మా పౌరుల పట్ల బాధ్యతగా కూడా భావిస్తున్నాం. లభ్యత, అందుబాటులో ఉండడం, చౌక ధర, ఆమోదయోగ్యత అనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా ముందుకు సాగుతూ, భారత్ సమ్మిళిత అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంది.

నేడు, భారత్‌లో దాదాపుగా అన్ని ఇళ్లకూ విద్యుత్ కనెక్షన్ ఉంది. దేశంలో యూనిట్ విద్యుత్ ధర అత్యంత తక్కువగా ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, భారత్ తన పారిస్ నిబద్ధతలను ముందుగానే పూర్తి చేసింది. 2070 నాటికి నికరంగా సున్నా ఉద్గారాలను సాధించే లక్ష్యం దిశగా వేగంగా పురోగమిస్తోంది. ఇప్పటికే కలిగి ఉన్న మొత్తం సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వాటా దాదాపు 50 శాతంగా ఉంది.

2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించే దిశగా మేం దృఢంగా ముందుకు సాగుతున్నాం. పరిశుద్ధ ఇంధనం కోసం గ్రీన్ హైడ్రోజన్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇథనాల్ మిశ్రమం వంటి వాటిపై మేం ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు హరిత, సుస్థిర భవిత దిశగా పయనించేందుకు మేం స్ఫూర్తినిస్తున్నాం.

మేం దీనికోసం అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, మిషన్ లైఫ్, ప్రపంచ జీవఇంధనాల కూటమి, వన్ సన్ - వన్ వరల్డ్ - వన్ గ్రిడ్ వంటి ప్రపంచస్థాయి కార్యక్రమాలను ప్రారంభించాం.

మిత్రులారా,
ఇంధన పరివర్తన దిశగా అన్ని దేశాలు కలిసి ముందుకు సాగడం చాలా అవసరం. "నేను కాదు, మనం" అనే స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నా.. ఆహారం, ఇంధనం, ఎరువుల విషయంలోనే కాకుండా, ఆర్థిక సంక్షోభాలతో ముందుగా దెబ్బతినేది వారే.

ప్రజలు, వస్తువులు, తయారీ, రవాణా రంగాలు కూడా ప్రభావితమవుతాయి. గ్లోబల్ సౌత్‌లో నెలకొన్న ఆందోళనలు, ప్రాధాన్యతలను ప్రపంచ వేదికపై లేవనెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుంది. ఏ రూపంలోనైనా ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంత వరకు.. మానవాళికి సుస్థిరమైన, సమగ్ర అభివృద్ధి అందుబాటులో ఉండదని మేం విశ్వసిస్తున్నాం.

మిత్రులారా,
నేను మీ ముందు ఉగ్రవాదం గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఇటీవలే హేయమైన, పిరికితనంతో కూడిన ఉగ్రవాద దాడిని భారత్ ఎదుర్కొంది.

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కేవలం పహల్గామ్‌పై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడి. ఇది మొత్తం మానవాళిపై జరిగిన దాడి. ఈ దాడిని తీవ్రంగా ఖండించి, ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
ఉగ్రవాదం మానవాళికి శత్రువు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు దీనిని వ్యతిరేకించాలి. ఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యత తప్పనిసరి. దురదృష్టవశాత్తూ మా పొరుగు దేశం ఉగ్రవాదానికి నిలయంగా మారింది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

అయితే వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఒకవైపు.. మన సొంత ప్రాధాన్యతలు, ఆసక్తుల ఆధారంగా మనం వివిధ దేశాలపై ఆంక్షలు విధించడానికి తొందరపడుతున్నాం. మరోవైపు.. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్ధించే దేశాలకు ప్రతిఫలం లభిస్తూనే ఉంది. ఇక్కడ ఉన్నవారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను.

ఉగ్రవాదాన్ని మనం సీరియస్ గా తీసుకుంటున్నామా? ఉగ్రవాదం సొంత తలుపులు తట్టినప్పుడు మాత్రమే దాని గురించి సరిగ్గా అర్థం చేసుకుంటామా? ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారినీ, దానితో బాధపడేవారినీ ఒకే విధంగా పరిగణించవచ్చా? మన ప్రపంచ సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే స్థితిలో ఉన్నాయా?

మానవాళికి వ్యతిరేకంగా నిలిచే ఈ ఉగ్రవాదంపై నేడు మనం నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే, చరిత్ర మనల్ని ఎప్పటికీ క్షమించదు. స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పట్టించుకోకపోవడం, ఉగ్రవాదానికి.. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం.. మొత్తం మానవాళికి ద్రోహం చేయడమే అవుతుంది.

మిత్రులారా,
భారత్ ఎల్లప్పుడూ తన సొంత ప్రయోజనాల కంటే ముందు మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. భవిష్యత్తులోనూ మేం అన్ని విషయాల్లో జీ-7తో చర్చలు, సహకారం కొనసాగిస్తూనే ఉంటాం.

ధన్యవాదాలు.

మిత్రులారా,
సాంకేతికత, ఏఐ, ఇంధనం వంటి అంశాలపై నేను కొన్ని విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నిస్సందేహంగా, అన్ని రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ ఒక శక్తిమంతమైన సాధనంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ అత్యంత శక్తిమంతమైన సాంకేతిత. ఏఐ డేటా సెంటర్ల ద్వారా పెరుగుతున్న ఇంధన వినియోగం కోసం, నేటి సాంకేతికత-ఆధారిత సమాజాల నుంచి పెరుగుతున్న ఇంధన డిమాండ్ల కోసం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా మాత్రమే సుస్థిర పరిష్కారం లభిస్తుంది.

సరసమైన, విశ్వసనీయమైన, సుస్థిర ఇంధనం భారతదేశానికి అత్యంత ప్రాధాన్యంగా ఉంది. దీనిని సాధించడానికి, మేం సౌరశక్తి, చిన్న మాడ్యులర్ రియాక్టర్లపై దృష్టి సారిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని డిమాండ్ కేంద్రాలతో అనుసంధానించడానికి స్మార్ట్ గ్రిడ్‌లు, ఇంధన నిల్వ వ్యవస్థలు, హరిత ఇంధన కారిడార్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నాం.

మిత్రులారా,
భారత్‌లో మా ప్రయత్నాలన్నీ మానవ-కేంద్రిత విధానంపైనే ఆధారపడి ఉన్నాయి. ఏదైనా సాంకేతికత నిజమైన విలువ అందరికీ ప్రయోజనం చేకూర్చడం దాని సామర్థ్యంలోనే ఉంటుందని మేం నమ్ముతున్నాం. గ్లోబల్ సౌత్‌లో ఎవరూ వెనుకబడి ఉండకూడదు. ఉదాహరణకు, మేం ఏఐ ఆధారిత వాతావరణ అంచనా యాప్‌ను అభివృద్ధి చేస్తే, అది మా దేశంలోని ఒక చిన్న గ్రామంలో నివసించే రైతులకు, మత్స్యకారులకు కూడా ప్రయోజనం చేకూర్చినప్పుడు మాత్రమే అది నిజంగా విజయం సాధించినట్లు అవుతుంది.

భారత్‌లోని మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ప్రపంచ భాషలతో అనుసంధానమయ్యేలా.. ప్రపంచ సంభాషణల్లో పాలుపంచుకునేలా చేసేందుకు మేం 'భాషిణి' అనే ఏఐ-ఆధారిత భాషా యాప్‌ను అభివృద్ధి చేశాం. మేం సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాం. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా మా ఆర్థిక వ్యవస్థనూ, సామాన్యులను శక్తిమంతం చేశాం.

అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం మానవ-కేంద్రిత విధానాన్ని అవలంబించాలి. ఏఐ సామర్థ్యాన్ని, ఉపయోగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. అయితే నిజమైన సవాలు ఏఐ శక్తి, సామర్థ్యం కాదు.. ఏఐ సాధనాలు మానవాళి గౌరవాన్నీ, సాధికారతనీ పెంపొందించేలా చూసుకోవడం.

మిత్రులారా,
సమగ్రమైన, సమర్థమైన, బాధ్యతాయుతమైన ఏఐ కోసం సమగ్రమైన డేటా ఒక పునాది వంటిది. భారత వైవిధ్యం దాని శక్తిమంతమైన జీవనశైలి, బహుళ భాషలు, విస్తారమైన భూభాగంలో ప్రతిబింబిస్తుంది. ఇదే సమగ్ర డేటా కోసం అత్యంత విలువైన, శక్తిమంతమైన వనరుల్లో ఒకటిగా దీనిని నిలుపుతుంది. భారత వైవిధ్య ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన, పరీక్షించిన ఏఐ నమూనాలు యావత్ ప్రపంచం కోసం అత్యంత ఔచిత్యాన్ని, ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.

భారత్‌లో, బలమైన డేటా సాధికారత, భద్రతా వ్యవస్థను రూపొందించడంపై మేం ప్రధానంగా దృష్టి సారించాం. దీనితో పాటు, భారత్ తన స్థాయి, నైపుణ్యం, వైవిధ్యం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత ద్వారా ఏఐ రంగంలో ప్రపంచ ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడే విస్తారమైన ప్రతిభను కలిగి ఉంది.

మిత్రులారా,
ఏఐ విషయంగా నేను కొన్ని సూచనలను అందించాలనుకుంటున్నాను. మొదట.. ఏఐ సంబంధిత సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించే అంతర్జాతీయ స్థాయి పాలన కోసం మనం కృషి చేయాలి. అప్పుడే మనం ప్రపంచానికి మేలు చేసే ఒక శక్తిగా ఏఐని మార్చగలం. రెండోది.. ఏఐ యుగంలో క్రిటికల్ మినరల్స్, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం చాలా ముఖ్యం.

వాటి సరఫరా వ్యవస్థల భద్రత, అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా ఆ వ్యవస్థను బలోపేతం చేయడంపై మనం దృష్టి సారించాలి. ఏ దేశమూ వాటిని తమ సొంత ప్రయోజనాల కోసం గానీ, ఆయుధంగా గానీ ఉపయోగించకుండా చూసుకోవాలి. మూడోది.. డీప్ ఫేక్ చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇది సమాజంలో అశాంతిని సృష్టించగలదు. అందువల్ల, ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై వాటర్‌మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలి.

మిత్రులారా,
గత శతాబ్దంలో, మనం ఇంధనం విషయంలో పోటీని చూశాం. ఈ శతాబ్దంలో, మనం సాంకేతిక రంగంలో సహకారాన్ని స్వీకరించాలి. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఔర్ సబ్ కా ప్రయాస్' మార్గదర్శక సూత్రంతో మనం ముందుకు సాగాలి... అంటే ప్రజలు, ప్రపంచం, పురోగతి కోసం భారత్ ఇస్తున్న పిలుపు ఇది. ఇదే స్ఫూర్తితో.. వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

ధన్యవాదాలు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Over 100 border villages of Punjab to be developed under central scheme

Media Coverage

Over 100 border villages of Punjab to be developed under central scheme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Narendra Modi receives a telephone call from President Macron
August 21, 2025
QuoteLeaders exchange views on efforts for peaceful resolution of the conflicts in Ukraine and the West Asia Region
QuotePrime Minister Modi reiterates India’s consistent support for early restoration of peace and stability
QuoteThe leaders discuss ways to further strengthen India-France strategic partnership

Today, Prime Minister Shri Narendra Modi received a phone call from the President of the French Republic H.E. Emmanuel Macron.

The leaders exchanged views on the ongoing efforts for peaceful resolution of conflicts in Ukraine and the West Asia region.

President Macron shared assessment on the recent meetings held between the leaders of the Europe, US and Ukraine in Washington. He also shared his perspectives on the situation in Gaza.

Prime Minister Modi reiterated India’s consistent support for peaceful resolution of the conflicts and early restoration of peace and stability.

The leaders also reviewed progress in the bilateral cooperation agenda, including in the areas of trade, defence, civil nuclear cooperation, technology and energy. They reaffirmed joint commitment to strengthen India-France Strategic Partnership and mark 2026 as ‘Year of Innovation’ in a befitting manner.

President Macron also conveyed support for early conclusion of Free Trade Agreement between India and the EU.

The leaders agreed to remain in touch on all issues.