ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎగుమతిదారుల కోసం రుణ భరోసా పథకం (సీజీఎస్ఈ)ను ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలు సహా అర్హులైన ఎగుమతిదారులకు రూ. 20,000 కోట్ల వరకు అదనపు రుణ సౌకర్యాలను అందించడం కోసం.. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీజీటీసీ) ఈ పథకం ద్వారా సభ్యత్వమున్న రుణ సంస్థలకు (ఎంఎల్ఐ) 100% క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని అందిస్తుంది.
అమలు వ్యూహం, లక్ష్యాలు:
ఈ పథకాన్ని జాతీయ రుణ భరోసా ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) అమలు చేస్తుంది. ఎంఎస్ఎంఈలు సహా అర్హత కలిగిన ఎగుమతిదారులకు ఈ పథకం కింద ఎంఎల్ఐల ద్వారా అదనపు రుణ చేయూతను అందిస్తుంది. డీఎఫ్ఎస్ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పడిన నిర్వహణ కమిటీ ఈ పథకం పురోగతి, అమలు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.
ప్రధాన ప్రభావం:
ఈ పథకం ద్వారా భారతీయ ఎగుమతిదారులు అంతర్జాతీయంగా మరింత సమర్థంగా పోటీపడగలరని, అలాగే నూతన మార్కెట్లలోకి విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. సీజీఎస్ఈ పథకం ద్వారా పూచీకత్తు అవసరం లేని రుణాలు లభించడం వల్ల... వ్యాపార సంస్థల వద్ద నిధుల లభ్యత పెరుగుతుంది. తద్వారా కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. దీంతో 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ మరింత వేగంగా పురోగమిస్తుంది. ఆత్మనిర్భర భారత్ దిశగా దేశ ప్రస్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
నేపథ్యం:
భారత ఆర్థిక వ్యవస్థకు ఎగుమతులు కీలక మూలాధారం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ఎగుమతుల వాటా దాదాపు 21 శాతంగా ఉంది. విదేశీ మారక నిల్వలకూ గణనీయంగా దోహదపడుతున్నాయి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.5 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా దాదాపు 45 శాతంగా ఉంది. దేశ కరెంటు ఖాతా నిల్వ, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎగుమతుల్లో నిరంతర వృద్ధి దోహదపడింది.
ఎగుమతిదారులు తమ మార్కెట్లను విస్తరించుకోవడానికి, అలాగే ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి.. వారికి మెరుగైన ఆర్థిక చేయూతతో పాటు, తగిన సమయాన్ని ఇవ్వడం అత్యవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అదనపు నిధుల లభ్యత కోసం చేయూతనివ్వడం ద్వారా వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి కూడా అవకాశం లభిస్తుంది.
The Credit Guarantee Scheme for Exporters which has been approved by the Cabinet will boost global competitiveness, ensure smooth business operations and help realise our dream of an Aatmanirbhar Bharat.https://t.co/CCUeE1e1Ux
— Narendra Modi (@narendramodi) November 13, 2025


