ఇటలీ ప్రధాని గౌరవ జార్జియా మెలోనీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.
పెట్టుబడి, రక్షణ, అంతరిక్షం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలతో పాటు తీవ్రవాదాన్ని నిరోధించడం వంటి రంగాల్లో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో చోటుచేసుకొన్న అభివృద్ధిని ఇద్దరు నేతలు సమీక్షించారు.
ఇరు దేశాల ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై వారు తమ ఆలోచనలను ఒకరితో మరొకరు పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ.. సాధ్యమైనంత త్వరగాను, శాంతియుతంగా పరిష్కారమవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతును అందిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉండే భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరలో కొలిక్కి రావడంతో పాటు వచ్చే ఏడాదిలో భారత్ నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావడానికి కూడా ఇటలీ అండదండలు అందిస్తుందని ప్రధాని మెలోనీ పునరుద్ఘాటించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈఈఈసీ) కార్యక్రమంలో భాగంగా అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి కృషి చేద్దామని నేతలు అంగీకారం వ్యక్తం చేశారు.
తరచూ సంప్రదించుకోవాలని కూడా నేతలు సమ్మతించారు.


