స్వయంసమృద్ధ కార్యక్రమం అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
పప్పు గింజల ఉత్పత్తిని 2030-31కల్లా 350 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యం
ఈ రంగంలో స్వావలంబన సాధన దిశగా రూ.11,440 కోట్ల మేర పెట్టుబడులకు ప్రోత్సాహం
విత్తనాలు, పంటకోత అనంతర మౌలిక సదుపాయాలు సహా కొనుగోలుకు భరోసా ఇచ్చే ఈ కార్యక్రమంతో దాదాపు 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
ఆధునిక రకాల కాయధాన్యాల విత్తన లభ్యత బలోపేతం దిశగా రైతులకు 88 లక్షల ఉచిత విత్తన కిట్ల పంపిణీ
పంటకోత అనంతర నష్టాల తగ్గింపు దిశగా 1,000 ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రణాళిక

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ కాయధాన్యాల స్వయంసమృద్ధ కార్యక్రమం అమలుకు ఆమోదం తెలిపింది. దేశంలో పప్పుగింజల ఉత్పత్తి పెంపు సహా స్వావలంబన సాధించడమే ఈ వినూత్న కార్యక్రమ లక్ష్యం. దీన్ని 2025-26 నుంచి 2030-31 వరకూ రూ.11,440 కోట్ల అంచనా వ్యయంతో ఆరేళ్లపాటు అమలు చేస్తారు.

భారతీయ పంట సాగు వ్యవస్థలు, ఆహార పదార్థాల్లో కాయధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అలాగే భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుగింజల ఉత్పత్తిదారు మాత్రమేగాక వినియోగదారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణాలతోపాటు ఆదాయాల పెరుగుదల కారణంగా దేశంలో వీటి వినియోగం కూడా పెరిగింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి ఈ డిమాండుకు తగినట్లు లేనందువల్ల  పప్పుగింజల దిగుమతి 15 నుంచి 20 శాతం దాకా పెరిగింది.

దేశీయ డిమాండ్‌ తీర్చే దిశగా ఉత్పత్తి పెంపు, దిగుమతి పరాధీనత తగ్గింపు సహా రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ఆరేళ్లపాటు “కాయధాన్యాల స్వయంసమృద్ధ కార్యక్రమం” అమలు చేస్తామని ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా పరిశోధన, విత్తన వ్యవస్థలు, సాగు విస్తీర్ణం పెంపు, పంట కొనుగోళ్లు, ధరల స్థిరీకరణ వగైరాలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తారు.

ఉత్పాదకత, తెగులు నిరోధం, వాతావరణ సహిష్ణుతగల ఆధునిక రకాల విత్తనాల అభివృద్ధి, విస్తరణకూ ప్రాధాన్యమిస్తారు. ప్రాంతీయ అనుకూలత నిర్ధారణ కోసం పప్పు గింజలు సాగుచేసే కీలక రాష్ట్రాల్లో బహుళ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

దీంతోపాటు అత్యుత్తమ నాణ్యతగల విత్తన లభ్యతకు భరోసా ఇస్తూ, రాష్ట్రాలు ఐదేళ్ల పాటు రోలింగ్ విత్తనోత్పత్తి ప్రణాళికలను రూపొందిస్తాయి. ఇందులో భాగంగా విత్తన సాగు ఉత్పత్తిని ‘ఐసీఏఆర్‌’ పర్యవేక్షిస్తే, ఫౌండేషన్-సర్టిఫైడ్ విత్తనోత్పత్తి బాధ్యతను కేంద్ర-రాష్ట్ర స్థాయి సంస్థలు నిర్వర్తిస్తాయి. అలాగే ‘సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ అండ్‌ హోలిస్టిక్ ఇన్వెంటరీ’ (సాథీ) పోర్టల్ ద్వారా పురోగతిపై నిశిత పర్యవేక్షణ ఉంటుంది.

మెరుగైన రకాల విస్తృత లభ్యత లక్ష్యంగా 2030-31 నాటికి 370 లక్షల హెక్టార్లలో పప్పుగింజల సాగు కోసం రైతులకు 126 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను పంపిణీ చేస్తారు.

అంతేగాక భూసార మెరుగుదల కార్యక్రమం, వ్యవసాయ యాంత్రీకరణపై ఉప-కార్యక్రమం, సమతుల ఎరువుల వినియోగం, మొక్కల రక్షణ, ఉత్తమ పద్ధతులకు ప్రోత్సాహం కోసం “ఐసీఏఆర్‌, కేవీకే”లతోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖలు విస్తృత ప్రదర్శనలు నిర్వహిస్తాయి.

వరి సాగు అనంతర తాత్కాలిక బీడు ప్రాంతాలు, ఇతర మార్పిడి హిత భూముల సద్వినియోగంతో కాయధాన్యాల విస్తీర్ణాన్ని మరో 35 లక్షల హెక్టార్ల మేర విస్తరించడం ఈ కార్యక్రమంలో ఒక భాగంగా ఉంది. అంతర పంటలు, పంటల మార్పిడిని ప్రోత్సహించడం ద్వారా దీనికి ప్రభుత్వం మద్దతిస్తుంది. ఈ దిశగా రైతులకు 88 లక్షల విత్తన కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తారు.

సుస్థిర పద్ధతులు, ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహిస్తూ నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాలతో రైతులు, విత్తన సాగుదారుల సామర్థ్య వికాసానికి కృషి చేస్తారు.

మార్కెట్లు, విత్తనోత్పత్తి వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా మిషన్-1000 ప్రాసెసింగ్ యూనిట్లు సహా పంటకోత అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది. తద్వారా పంట నష్టాల తగ్గింపు, విలువ జోడింపులో మెరుగుదల, రైతు ఆదాయం పెంపు లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. అలాగే ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు గరిష్ఠంగా రూ.25 లక్షల రాయితీ కూడా లభిస్తుంది.

మిషన్ క్లస్టర్ ఆధారిత విధానం ద్వారా ప్రతి క్లస్టర్ నిర్దిష్ట అవసరాల మేరకు కార్యక్రమాలను రూపొందిస్తారు. దీనికింద వనరుల సమర్థ కేటాయింపు, ఉత్పాదకత పెంపు, పప్పు గింజల ఉత్పత్తిలో భౌగోళిక వైవిధ్యానికి ప్రోత్సాహం వంటి చర్యలు చేపడతారు.

‘పీఎం-ఆశా’ కింద ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌) ప్రకారం ప్రధానంగా కంది, మినుము, సెనగ పంటలను గరిష్ఠ స్థాయిలో కొనుగోలు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే రాష్ట్రాల్లో తమతో ఒప్పందం కుదుర్చుకునే రైతుల నుంచి ‘నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌’ సంస్థలు నాలుగేళ్లపాటు 100 శాతం పంటను కొంటాయి.

అంతేగాక రైతులలో ఆత్మవిశ్వాసం ఇనుమడించే దిశగా ప్రపంచ పప్పుగింజల ధరల పర్యవేక్షణ కోసం ఈ కార్యక్రమం కింద ఒక యంత్రాంగం ఏర్పాటవుతుంది.

దేశవ్యాప్తంగా 2030-31 నాటికి పప్పుగింజల సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచడంతోపాటు ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు, దిగుబడి 1130 కిలోలకు పెంపు ఈ కార్యక్రమ లక్ష్యాలు. ఈ విధంగా ఉత్పాదకత ప్రయోజనాలతోపాటు ఈ కార్యక్రమం ద్వారా గణనీయ ఉపాధి కూడా లభిస్తుంది.

కాయధాన్యాల ఉత్పాదనలో స్వావలంబన సాధన, దిగుమతి పరాధీనత తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు సహా విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా చేయడం ఈ కార్యక్రమ లక్ష్యాలు. వాతావరణ సహిష్ణుత పద్ధతులు, భూసారం మెరుగుదల, పంట అనంతర తాత్కాలిక బీడు ప్రాంతాల ఉత్పాదకత సద్వినియోగం వంటి గణనీయ పర్యావరణ ప్రయోజనాలను కూడా సాధించాలన్నది దీని ధ్యేయం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential

Media Coverage

WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 జనవరి 2026
January 20, 2026

Viksit Bharat in Motion: PM Modi's Reforms Deliver Jobs, Growth & Global Respect