India's achievements and successes have sparked a new wave of hope across the globe: PM
India is driving global growth today: PM
Today's India thinks big, sets ambitious targets and delivers remarkable results: PM
We launched the SVAMITVA Scheme to grant property rights to rural households in India: PM
Youth is the X-Factor of today's India, where X stands for Experimentation, Excellence, and Expansion: PM
In the past decade, we have transformed impact-less administration into impactful governance: PM
Earlier, construction of houses was government-driven, but we have transformed it into an owner-driven approach: PM

నమస్కారం!

మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయి. కూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదు. ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలు. ఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుంది. అది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుంది. దాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలం, హద్దులకు అతీతంగా విస్తరించ గలం. దానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదు. చేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదు. ఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలు. మీకు నా శుభాకాంక్షలు. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఒకటి- నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలి. కాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయి. రెండు- వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముంది. అదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదు. పదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదు. ఆ పరీక్షలో నేను పాసవ్వాలి. ఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.

మిత్రులారా,

ఇప్పుడు ప్రపంచమంతా ఈ శతాబ్ధం భారతదేశానిదే అని స్పష్టంగా చెప్తోంది. గతంలో మీరిలాంటివి వినలేదు. భారత్ సాధించిన విజయాలు ప్రపంచంలో కొత్త ఆశలు రేకెత్తించాయి. తాను మునగడమే కాకుండా తనతోపాటు మనల్నీ ముంచేస్తుందంటూ ఒకప్పుడు భారత్ గురించి చెప్పుకునేవారు. కానీ నేడు మన దేశం ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోంది. నేడు మనం చేసే కృషి, సాధించే విజయాలే భారత్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని మనకు తెలుసు. స్వాతంత్ర్యం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా భారత్ ప్రపంచంలో పదకొండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికే పరిమితమైంది. అయితే, గత దశాబ్ద కాలంలో మనం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అదే వేగంతో ఇప్పుడు మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం.

 

మిత్రులారా,

18 సంవత్సరాల కిందట ఏం జరిగిందో కూడా నేను మీకు గుర్తు చేస్తాను. సరిగ్గా 18 సంవత్సరాలనే నేను ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణముంది. 18 ఏళ్లు నిండి, మొదటిసారి ఓటు వేయబోతున్న వారికి 18 ఏళ్ల ముందు నాటి కాలం గురించి తెలియదు. అందుకే నేను ఆ సంఖ్యను ఎంచుకున్నాను. 18 సంవత్సరాల కిందట, అంటే 2007లో భారత వార్షిక జీడీపీ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇంకా సులభంగా చెప్పాలంటే.. భారత్ లో ఆర్థిక కార్యకలాపాలు ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉన్న సమయమది. ఇప్పుడు నేడు ఏం జరుగుతున్నదో చూశారా? ఇప్పుడు ఒక్క త్రైమాసికంలోనే దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అంటే ఏమిటి? 18 సంవత్సరాల కిందట, దేశంలో ఒక సంవత్సరంలో జరిగిన ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడు మూడు నెలల్లోనే జరుగుతున్నాయి. నేటి భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనం. గత దశాబ్ద కాలంలో ఎంత పెద్ద మార్పులు వచ్చాయో, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించే కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. గత పది సంవత్సరాలలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించడం మనం సాధించిన విజయం. చాలా దేశాల మొత్తం జనాభా కన్నా కూడా ఈ సంఖ్య పెద్దది. పేదలకు ఒక రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే వారికి చేరుతున్నాయని నేరుగా ప్రధానమంత్రే చెప్పిన విషయం, స్వయంగా ప్రభుత్వమే దానిని అంగీకరించిన కాలం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ 85 పైసలను వారే తినేసేవారు. ఇక ఇప్పటి రోజులను చూడండి- గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా రూ. 42 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశాం. రూపాయికి 15 పైసలు లెక్కిస్తే, రూ. 42 లక్షల కోట్లకు ఎంత లెక్కవుతుంది? మిత్రులారా, ఈరోజు ఢిల్లీ నుంచి వెళ్లిన ఒక్కో రూపాయిలో మొత్తం 100 పైసలూ లబ్ధిదారులకు అందుతున్నాయి.

మిత్రులారా,

పదేళ్ల కిందటి వరకు సౌర శక్తి విషయంలో భారత్  ప్రస్తావనే ఉండేది కాదు. కానీ నేడు సౌరశక్తి సామర్థ్యం పరంగా ప్రపంచంలోని అయిదు అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటి. మన సౌరశక్తి సామర్థ్యాన్ని 30 రెట్లు పెంచుకున్నాం. సౌర మాడ్యూళ్ల తయారీ కూడా 30 రెట్లు పెరిగింది. పదేళ్ల క్రితం హోళీ పిచికారీలు, పిల్లల బొమ్మలను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. నేడు మన బొమ్మల ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. పదేళ్ల కిందటి వరకు మన సైన్యానికి అవసరమైన రైఫిళ్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ, గత పదేళ్లలో మన రక్షణ ఎగుమతులు 20 రెట్లు పెరిగాయి.

 

మిత్రులారా,

ఈ పది సంవత్సరాల కాలంలో మనం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా, రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా, మూడో అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా ఎదిగాం. ఈ పది సంవత్సరాలలో, మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయాన్ని ఐదు రెట్లు పెంచాం. దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపయ్యింది. ఈ పదేళ్లలో దేశంలో ఏఐఐఎంఎస్ ల సంఖ్య మూడింతలైంది. ఈ పదేళ్లలో వైద్య కళాశాలలు, వైద్య సీట్ల సంఖ్య కూడా దాదాపు రెట్టింపైంది.

మిత్రులరా,

నేటి భారత్ భిన్నమైనది. నేటి భారత్ ఆలోచనలు పెద్దవి, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది, గొప్ప ఫలితాలను సాధిస్తుంది. దేశం ఆలోచన తీరులో మార్పు వల్లే ఇది సాధ్యమవుతోంది. భారతదేశం గొప్ప ఆశయాలతో ముందుకు సాగుతోంది. గతంలో మన ఆలోచన ఎలా ఉండేదంటే - పర్వాలేదు, అది జరుగుతూంటుంది, జరగనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, ఎవరేం చేయాలో అది చేస్తారు, మీ పని మీరు చేసుకోండి.  గతంలో ఆలోచనా విధానం సంకుచితంగా మారింది. నేను మీకో ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. ఎక్కడైనా కరువు ఉన్నా, అది కరువు ప్రభావిత ప్రాంతమైనా ప్రజలు వినతిపత్రాలు ఇచ్చేవారు. మరి వారు ఏమి డిమాండ్ చేసేవారు - సర్, కరువులు వస్తూంటాయి. ఈ కరువు సమయంలో సహాయక చర్యలు మొదలుపెట్టండి. మేం గుంతలు తవ్వి మట్టిని తీస్తాం, దాన్ని వేరే గుంతల్లో నింపుతాం- ప్రజలు ఇదే డిమాండ్ చేసేవారు. ఎవరో ఒకరు ఇలా అడిగేవారు- సర్, దయచేసి మా ప్రాంతంలో చేతి పంపులు ఏర్పాటు చేయించండి అని డిమాండ్ చేసేవారు. పంపు నీళ్ల కోసమే వాళ్ళు డిమాండ్ చేసేవారు. ఒక్కోసారి ఎంపీల ఏమిటంటే - కాస్త ముందుగానే ఆయనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వండి అని. ఆ పని ఎంపీలు చేశారు. వారికి 25 కూపన్లు వచ్చేవి. పార్లమెంటు సభ్యుడు తన మొత్తం ప్రాంతంలోనూ గ్యాస్ సిలిండర్లను అందించడం కోసం ఆ 25 కూపన్లనే వినియోగించేవారు. ఏడాదిలో ఒక ఎంపీకి 25 సిలిండర్లు.. 2014 వరకు ఇది కొనసాగింది. అటుగా వెళ్తున్న రైలును తమ ప్రాంతంలోనూ ఆపాలని ఎంపీలు డిమాండ్ చేసేవారు. రైలు ఆపేలా ఓ స్టాపేజీ కోసం వారు డిమాండ్ చేశారు.

నేను చెబుతున్న ఈ విషయాలన్నీ 2014కు ముందు దాకా జరిగినవే, చాలా పాతవేం కాదు. కాంగ్రెస్ దేశ ప్రజల ఆకాంక్షలను తుడిచిపెట్టింది. అందుకే దేశ ప్రజలు ఆశలు పెట్టుకోవడం కూడా మానేశారు. వారి నుంచి, వారు చేస్తున్న పనుల నుంచి ఏ ప్రయోజనమూ కలగదని నిర్ణయానికి వచ్చేశారు. ‘‘సరే సోదరా, నువ్వు ఈ మాత్రమే చేయగలిగితే, ఇదే చెయ్యి చాలు’’ అని ప్రజలూ అనేవారు. మరి నేడు పరిస్థితులు, ఆలోచనా తీరు ఎంత వేగంగా మారుతున్నాయో మీరు చూడవచ్చు. ఎవరు పని చేయగలరో, ఎవరు ఫలితాలను రాబట్టగలరో ఇప్పుడు ప్రజలకు తెలుసు. సాధారణ పౌరుల మాటలు మాత్రమే కాదు.. పార్లమెంటులో ప్రసంగాలను విన్నా మీరో విషయాన్ని గమనించవచ్చు. మోదీ గారు ఇదెందుకు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు కూడా అదే ఉపాన్యాసాన్నిస్తాయి. అంటే, మేం ఆ పని చేస్తామని వారికి తెలుసు.

మిత్రులారా,

నేటి మన ఆకాంక్షలను వారి మాటలు ప్రతిబింబిస్తాయి. మాట్లాడే విధానం మారింది. ప్రజలిప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు?- గతంలో తమ దగ్గర రైలును ఆపమని అడిగేవారు. మరిప్పుడు.. మా ప్రాంతంలో కూడా వందే భారత్ రైలు ప్రారంభించడండంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట నేను కువైట్ వెళ్లినప్పుడు మామూలుగానే లేబర్ క్యాంపు దగ్గరికి వెళ్లాను. నా దేశ ప్రజలు ఎక్కడ పనిచేస్తున్నా వారిని కలవడానికే ప్రయత్నిస్తాను. నేనక్కడ కార్మికులుండే కాలనీకి వెళ్లి కువైట్ లో పనిచేసే కార్మిక సోదరీ సోదరులతో మాట్లాడుతున్నాను. అక్కడ కొందరు పదేళ్ల నుంచి, కొందరు 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడండీ - బీహార్‌లోని ఒక గ్రామానికి చెందిన ఓ కార్మికుడు 9 సంవత్సరాలుగా కువైట్‌లో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. నేను ఆయనతో మాట్లాడుతుండగా.. ‘‘సార్, నాదో ప్రశ్న’’ అంటే అడగమన్నాను. వాళ్ల ఊరి దగ్గర జిల్లా కేంద్రంలో ఓ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ఆయన అడిగారు. నేనెంతో ఆనందించాను. బిహార్ లోని ఓ ఊరి నుంచి వెళ్లి 9 సంవత్సరాలుగా కువైట్ లో పనిచేస్తున్న ఓ కార్మికుడు కూడా తన జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తారన్న ఆలోచన చేయడం సంతోషాన్నిచ్చింది. ఇదీ నేటి సగటు భారతీయ పౌరుడి ఆకాంక్ష. ఈ ఆకాంక్షే అభివృద్ధి చెందిన భారత్ గా ఎదిగే లక్ష్యం దిశగా దేశాన్ని నడిపిస్తోంది.  

 

మిత్రులారా,
పౌరులపై ఆంక్షలను, వారికి ఉన్న అడ్డంకులను తొలగించినప్పుడు, ఆటంకాల గోడలను కూల్చినప్పుడే సమాజం, దేశం బలం పెరుగుతుంది. అప్పుడే ఆ దేశ పౌరుల బలం కూడా పెరుగుతుంది. ఆకాశం కూడా ఎత్తులో చిన్నదిగా అవుతుంది. అందుకే గత ప్రభుత్వాలు ప్రజల ముందు ఉంచిన అడ్డంకులను నిరంతరం తొలగిస్తున్నాం. ఇప్పుడు నేను అంతరిక్ష రంగానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తున్నాను. గతంలో అంతరిక్ష రంగంలో ప్రతిదానికి ఇస్రో బాధ్యత వహించేది. ఇస్రో ఖచ్చితంగా గొప్ప పని చేసింది.. కానీ అంతరిక్ష విజ్ఞానం, వ్యవస్థాపకతకు సంబంధించి దేశంలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేదు. ఈ సామర్థ్యం అంతా ఇస్రోకే పరిమితమైంది. అంతరిక్ష రంగ ద్వారాలను యువ ఆవిష్కర్తల కోసం తెరిచాం. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏ వార్తాపత్రికలో శీర్షికగా రాలేదు, ఎందుకంటే దీనిపై అవగాహన కూడా లేదు. ఈ రోజు దేశంలో 250కి పైగా అంతరిక్ష రంగ అంకురాలు ఏర్పాటయ్యాయని తెలిస్తే రిపబ్లిక్ టీవీ వీక్షకులు సంతోషిస్తారు. ఇది నా దేశ యువత సాధించిన అద్భుతం. ఈ అంకురాలు నేడు విక్రమ్-ఎస్, అగ్నిబాన్ వంటి రాకెట్లను తయారు చేస్తున్నాయి. మ్యాపింగ్ రంగంలోనూ అదే జరిగింది. చాలా ఆంక్షలు ఉండేవి. అట్లాస్ కూడా తయారు చేయలేకపోయేవారు. టెక్నాలజీ మారింది. ఇంతకుముందు భారత్‌లో మ్యాప్ తయారు చేయాలంటే ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ నియంత్రణను కూడా తొలగించాం. ప్రస్తుతం జియో స్పేషియల్ మ్యాపింగ్‌కు సంబంధించిన డేటా కొత్త అంకురాలకు మార్గం సుగమం చేస్తోంది.

మిత్రులారా,
అణుశక్తి, దానికి సంబంధించిన రంగాలు కూడా గతంలో ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. ఆంక్షలు, అడ్డంకులు, గోడలు నిర్మించారు. ఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ రంగంలో ప్రైవేటుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని అదనంగా సాధించాలన్న లక్ష్యాన్ని ఇది బలోపేతం చేసింది. 

మిత్రులారా,
రూ. 100 లక్షల కోట్ల, అంతకంటే ఎక్కువ ఊపయోగించుకొని ఆర్థిక సామర్థ్యం మన పల్లెల్లోనే ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని మీ ముందు మళ్లీ చెబుతున్నాను - రూ.100 లక్షల కోట్లు. ఇది చిన్న సంఖ్య కాదు. ఈ ఆర్థిక సామర్థ్యం గ్రామాల్లో ఇళ్ల రూపంలో ఉంది. మరింత సరళంగా మీకు వివరిస్తాను. ఇప్పుడు దిల్లీ వంటి నగరంలో మీ ఇంటి విలువ రూ.50 లక్షలు, కోటి, రూ.2 కోట్లు ఉంటే.. ఆ విలువపై బ్యాంకు రుణం కూడా లభిస్తుంది. మీకు దిల్లీ నగరంలో ఇల్లు ఉంటే బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఇళ్లు దిల్లీలోనే కాదు, పల్లెల్లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఇళ్ల యజమానులు ఉన్నారు. ఇక్కడ జరిగింది అక్కడ ఎందుకు జరగడం లేదు? గ్రామాల్లో ఇళ్లపై రుణాలు అందడం లేదు ఎందుకంటే దేశంలో గ్రామాల్లో ఇళ్లకు చట్టబద్ధమైన పత్రాలు లేవు. మ్యాపింగ్ కూడా సరిగ్గా లేదు. దీనివల్ల గ్రామాల్లో ఉన్న ఈ ఆర్థిక సామర్థ్య ప్రయోజనాన్ని దేశం, దేశ ప్రజలు సరిగ్గా పొందలేకపోయారు. ఇది కేవలం భారత్‌ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోని పెద్ద దేశాలలోని ప్రజలకు కూడా ఆస్తి హక్కులు లేవు. ప్రజలకు ఆస్తి హక్కులు కల్పించే దేశ జీడీపీ పెరుగుతుందని పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. 

 

మిత్రులారా,
భారతదేశంలోని గ్రామాల్లో ఇళ్లకు ఆస్తి హక్కులు కల్పించడానికి మేం స్వామిత్వ పథకాన్ని తీసుకొచ్చాం. ఇందులో ప్రతి గ్రామంలో డ్రోన్ సర్వే నిర్వహించి ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా ఇళ్లకు సంబంధించిన యాజమాన్య కార్డులు అందుతున్నాయి. ప్రభుత్వం రెండు కోట్లకు పైగా యాజమాన్య హక్కులకు సంబంధించిన కార్డులను పంపిణీ చేసింది. ఈ పని నిరంతరాయంగా జరుగుతోంది. గతంలో యాజమాన్య హక్కుల కార్డులు లేకపోవడంతో గ్రామాల్లో అనేక వివాదాలు ఉండేవి, ప్రజలు కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది. ఇవన్నీ ఇప్పుడు ముగిశాయి. ఇప్పుడు ఈ యాజమాన్య కార్డులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందుతుండటంతో గ్రామస్థులు సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. మొన్న నేను ఈ స్వామిత్వ పథకం  లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ఈ సందర్భంగా రాజస్థాన్‌కు చెందిన ఓ సోదరితో సంభాషించాను. ఆమె యాజమాన్య కార్డు వచ్చాక రూ.9 లక్షలు రుణం తీసుకొని, వ్యాపారం ప్రారంభించి, సగం రుణం తిరిగి చెల్లించారు. మిగతా రుణం తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం పట్టదని, ఇంకా మరిన్ని రుణాల వచ్చే అవకాశం కూడా ఉందని ఎంతో అత్మధైర్యంతో చెప్పారు.
మిత్రులారా,
నేను ఇచ్చిన అన్ని ఉదాహరణల్లో అత్యంత ఎక్కువ లబ్దిపొందింది దేశ యువతే. అభివృద్ధి చెందిన భారత్‌లో అతిపెద్ద భాగస్వాములుగా ఉన్న యువత నేటి భారత్‌కు ఎక్స్-ఫ్యాక్టర్‌గా ఉన్నారు. ఈ ఎక్స్ అంటే ఎక్స్‌పెరిమెంటేషన్, ఎక్సలెన్స్, ఎక్స్‌టెన్షన్. ఎక్స్‌పెరిమెంటేషన్‌ అంటే మన యువత పాత మార్గాలను దాటి కొత్త మార్గాలను సృష్టించారు. ఎక్సలెన్స్ అంటే యువత ప్రపంచ స్థాయి మైలురాళ్లను నిర్ణయించింది. ఎక్స్‌టెన్షన్‌ అంటే 140 కోట్ల మంది దేశప్రజల సృజనాత్మకతను మన యువత పెంచింది. మన యువత దేశంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారాలను అందించగలదు. కానీ ఈ సామర్థ్యాన్ని ఇంతకు ముందు సరిగ్గా ఉపయోగించుకోలేదు. యువత కూడా హ్యాకథాన్ల ద్వారా దేశ సమస్యలకు పరిష్కారం చూపగలరని గత ప్రభుత్వాలు భావించలేదు. ఈ రోజు మేం ప్రతి సంవత్సరం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 10 లక్షల మంది యువత ఇందులో భాగస్వాములయ్యారు. పాలనకు సంబంధించిన అనేక సమస్యలను అనేక మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు యువతు ముందు ఉంచి, పరిష్కారం ఏమిటో చెప్పాలని కోరాయి. హ్యాకథాన్‌లో మన యువత రెండున్నర వేల పరిష్కారాలను అభివృద్ధి చేసి దేశానికి అందించారు. మీరు కూడా ఈ హ్యాకథాన్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. వీటిలో విజేతలుగా నిలిచిన యువతను అభినందిస్తున్నాను. ఆ యువజనులను కలిసే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను.
 

మిత్రులారా,
గత పదేళ్లలో దేశం పాలనలో కొత్త యుగాన్ని చవిచూసింది. ప్రభావం లేని పాలనను గడచిన దశాబ్దంలో  ప్రభావవంతమైన పాలనగా మార్చాం. క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఫలానా ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని తొలిసారిగా పొందామని ప్రజలు చెబుతున్నారు. అంతకు ముందు ఆ ప్రభుత్వ పథకాలు లేవని కాదు. గతంలో కూడా పథకాలు ఉండేవి కానీ ఈ స్థాయిలో చిట్టచివరి వ్యక్తి వరకు అవి అందేలా చూడటం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల ముఖాముఖిలను మీరు తరచుగా నిర్వహిస్తారు. గతంలో పేదలకు ఇళ్లు కాగితాలకే వరకే మంజూరయ్యాయి. నేడు క్షేత్రస్థాయిలో నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం. గతంలో ఇంటి నిర్మాణ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఏ రకం ఇల్లు నిర్మించాలి, ఎలాంటి సామగ్రిని ఉపయోగించాలనేది ప్రభుత్వం నిర్ణయించేది. ఈ విషయంలో ఇంటి యజమానే నిర్ణయం తీసుకునేలా చేశాం. ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు వేస్తుంది.. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో లబ్ధిదారుడే నిర్ణయిస్తాడు. అలాగే ఇంటి డిజైన్ కోసం దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించి, ఇళ్ల నమూనాలను ప్రజల ముందుకు తీసుకురావడం, డిజైనింగ్ కోసం ప్రజలను భాగస్వామ్యం చేయడం, ప్రజా భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేశాం. దీంతో ఇళ్ల నాణ్యత కూడా మెరుగై ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా పూర్తౌతోంది. ఇటుకలు, రాళ్లతో సగం నిర్మించిన ఇళ్లే పేదలకు దిక్కుగా ఉండేవి. మేం వారి కళల ఇంటిని నిర్మిస్తున్నాం. ఈ ఇళ్లకు కుళాయి నీరు, ఉజ్వల పథకం కింద గ్యాస్ సదుపాయం, సౌభాగ్య పథకం కింద విద్యుత్ సౌకర్యం ఉన్నాయి. నాలుగు గోడలతో నిర్మించటమే కాదు ఆ ఇళ్లకు జీవం పోశాం.
మిత్రులారా,
ఏ దేశ అభివృద్ధికైనా జాతీయ భద్రత చాలా ముఖ్యమైన అంశం. గత దశాబ్ద కాలంలో భద్రత విషయంలో ఎంతో కృషి చేశాం. గతంలో వరుస బాంబు పేలుళ్ల బ్రేకింగ్ న్యూస్ టీవీల్లో ప్రసారమయ్యేవి. స్లీపర్ సెల్స్ నెట్‌వర్క్‌ గురించి ప్రత్యేక కార్యక్రమాలు ఉండేవి. ఇవన్నీ నేడు టీవీ తెరపై, భారత్ నుంచి మాయమయ్యాయి. గతంలో మీరు రైలులో ప్రయాణించినప్పుడు లేదా విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఎవరు ఉపయోగించని బ్యాగ్‌ ఎక్కడైన పడి ఉండే  దానిని తాకొద్దు అనే హెచ్చరికలు వినిపించేవి. నేడు ఈ 18-20 సంవత్సరాల యువకులు ఇది విని ఉండరు. నేడు దేశంలో నక్సలిజం తన చివరి గడియలను లెక్కిస్తోంది. గతంలో వందకు పైగా జిల్లాలు నక్సలిజం గుప్పిట్లో ఉంటే నేడు రెండు డజను జిల్లాలకే అది పరిమితమైంది. అన్నింటికంటే ముందు దేశం అనే స్ఫూర్తితో పనిచేసినప్పుడే ఇది సాధ్యమైంది. ఈ ప్రాంతాల్లో పరిపాలనను చిట్టచివరి స్థాయి వరకు తీసుకెళ్లాం. అనతికాలంలోనే ఈ జిల్లాల్లో వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాం. 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాం. దేశం నేడు ఈ ఫలితాలను చూస్తోంది.
 

మిత్రులారా,
ప్రభుత్వ నిర్ణయాత్మక నిర్ణయాల వల్ల నేడు నక్సలిజం అడవుల నుంచి తుడిచిపెట్టుకుపోతోంది కానీ పట్టణ కేంద్రాల్లో తన మూలాలను విస్తరిస్తోంది. అర్బన్ నక్సల్స్ ఎంత వేగంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరింపజేశారంటే.. ఒకప్పుడు గాంధీజీ స్ఫూర్తితో, అర్బన్ నక్సల్స్‌ను వ్యతిరేకించిన భారత మూలాలతో ముడిపడి ఉన్న రాజకీయ పార్టీల్లోకి ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ప్రవేశించారు. నేడు ఆయా పార్టీల్లో అర్బన్ నక్సల్స్ గొంతు, వారి భాష వినిపిస్తోంది. దీన్ని బట్టి వాటి మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దేశాభివృద్ధికి, మన వారసత్వానికి అర్బన్ నక్సల్స్ గట్టి వ్యతిరేకులని మనం గుర్తుంచుకోవాలి. అర్బన్ నక్సల్స్‌ను బట్టబయలు చేసే బాధ్యతను కూడా అర్నబ్ తీసుకున్నారు. అభివృద్ధి చెందిన భారత్‌కు అభివృద్ధి అవసరం. దీనితో పాటు వారసత్వాన్ని బలోపేతం చేయడం కూడా అవసరం. అందుకే అర్బన్ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మిత్రులారా,
ప్రతి సవాలును ఎదుర్కొంటూనే నేటి భారతదేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. రిపబ్లిక్ టీవీ నెట్వర్క్‌లోని మీరంతా దేశం ప్రథమం అనే స్ఫూర్తితో జర్నలిజానికి కొత్త కోణాన్ని అందిస్తారని నేను విశ్వసిస్తున్నాను. మీ జర్నలిజం ద్వారా అభివృద్ధి చెందిన భారత్‌ ఆకాంక్షను మీరు ఉత్తేజపరచడం కొనసాగిస్తారని నమ్ముతూ.. మీకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology