నా ప్రియ మిత్రులైన గౌరవనీయ అధ్యక్షులు మాక్రాన్‌ గారు, రెండు దేశాల ఆవిష్కర్తలకు స్వాగతం... బోంజూర్! (శుభోదయం)

ప్రపంచంలోని రెండు అద్భుత ఆవిష్కరణ కూడళ్ల సంగమం ఇవాళ ఇక్కడ ఆవిష్కృతమైంది. భారత్‌, ఫ్రాన్స్ దేశాల ప్రస్తావన వచ్చినపుడు మన బంధం ఆవిష్కరణలకు మాత్రమేగాక.. పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలకు సంబంధించినదిగా ఉంటుంది. ఈ స్ఫూర్తితోనే 2026ను భారత్‌-ఫ్రాన్స్  ఆవిష్కరణల ఏడాదిగా నిర్వహించాలని అధ్యక్షుడు మాక్రాన్, నేను సంకల్పించాం. ఇదొక వేడుకకు  కాదు... ఇది మా సంయుక్త కట్టుబాటు- ఆవిష్కరణలకు కర్తవ్య సహిత నాయకత్వ నిబద్ధత!

 

 

మిత్రులారా!

అనేక వ్యూహాత్మక సాంకేతిక రంగాలలో భారత్‌, ఫ్రాన్స్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ సహకారపూరిత నమ్మకమే రెండు దేశాల స్నేహ సంబంధాలను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంగా సమున్నత స్థాయికి చేర్చింది. రాబోయే కాలంలోనూ ప్రతి రంగంలో మన సమష్టి సృజనాత్మకత యావత్‌ ప్రపంచానికీ ఉజల్వ భవిష్యత్తునిస్తుంది.

మిత్రులారా!

భారత్‌ తన వేల ఏళ్ల ప్రస్థానంలో గణితం, వైద్యం, లోహశాస్త్రం, వాస్తుశిల్పం సహా పలు రంగాలలో మానవాళి సంక్షేమమే పరమార్థంగా వినూత్న ఆవిష్కరణలకు రూపమిచ్చింది. ప్రస్తుత 21వ శతాబ్దంలోనూ “ప్రపంచ శ్రేయస్సు కోసం ఆవిష్కరణలు” ఇతివృత్తంగా ఈ సంప్రదాయాన్ని భారత యువత కొనసాగిస్తోంది. శక్తిమంతమైన మన అంకురావరణ వ్యవస్థ నుంచి అంతర్జాతీయ స్థాయి పరిశోధన ప్రయోగశాలల దాకా ‘ఏదైనా సాధ్యమే’నన్న ఆశావాదం అంకురిస్తోంది. కేవలం దశాబ్దం వ్యవధిలోనే ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థగా రూపుదిద్దుకుంది. దేశంలో 2014 నాటికి కేవలం నాలుగంటే నాలుగే యూనికార్న్‌ సంస్థలు ఉండగా, నేడు వాటి సంఖ్య 120 దాటింది. వీటి సంచిత విలువ 350 బిలియన్ డాలర్లు లేదా దాదాపు 300 బిలియన్ యూరోల స్థాయిని అధిగమించింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి కీలక సాంకేతిక సంస్థ ఇప్పుడు భారతీయ అంకుర సంస్థలు, ఆవిష్కరణలతో ఏదో ఒక రూపంలో ముడిపడి ఉందనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

అదే విధంగా పాఠశాలల నుంచి పరిశ్రమల దాకా- ఆవిష్కరణ అనుకూల వ్యవస్థను మేం సృష్టించాం. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల నుంచి మెంటర్‌షిప్, స్కాలర్‌షిప్‌, అంకుర మూలధనం వరకూ నేడు బలమైన నెట్‌వర్క్ ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాకథాన్ వ్యవస్థలలో ఒకదానికి భారత్‌ నేడు ఆతిథ్యమిస్తోంది. ప్రైవేట్ రంగ పరిశోధన-ఆవిష్కరణ పథకాలు ప్రత్యక్ష మద్దతునిస్తుండగా, అంకుర భారతం 2.0 (స్టార్టప్ ఇండియా) కార్యక్రమం డీప్-టెక్ ఆవిష్కరణల కోసం మూలధన సమీకరణకు కృషి చేస్తోంది.

మిత్రులారా!

మేమిప్పుడు అమలు చేస్తున్న అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఈ నెల 24 నాటికి దశాబ్దం పూర్తి చేసుకుంటుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే ప్రపంచంలోని అతిపెద్ద ప్రాథమిక ఆవిష్కరణల కార్యక్రమంలో ఇదొకటిగా ఎదిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా టింకరింగ్ ల్యాబ్‌లు కోటి మందికిపైగా విద్యార్థులతోపాటు ఆవిష్కర్తలను వివిధ పరిశోధనల్లో నిమగ్నం చేస్తున్నాయి. అలాగే 100కు పైగా ఇంక్యుబేటర్లతోపాటు అనేక డీప్-టెక్ అంకుర సంస్థలను ఈ కార్యక్రమం ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్‌తో చురుగ్గా సంయుక్త కృషిలో పాలు పంచుకోవాలని ఇక్కడి పారిశ్రామిక దిగ్గజాలను అభ్యర్థిస్తున్నాను.

 

మిత్రులారా!

ప్రగతిశీల- వికసిత భారత్‌ ప్రస్థానానికి ఆవిష్కరణల సారథ్యం అత్యావశ్యకం. అందుకే, ఆవిష్కరణల వ్యవస్థ బలోపేతానికి ఈ ఏడాది బడ్జెట్‌ అత్యంత ప్రాధాన్యమిచ్చింది. కంటెంట్ సృష్టిని ప్రోత్సహించడం ధ్యేయంగా 15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటవుతాయి. కృత్రిమ మేధ, క్వాంటం-జీవ సాంకేతికతలు, సెమీకండక్టర్లు సహా కాలుష్యరహిత ఇంధనం తదితర రంగాల్లో మేమివాళ ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నాం. అంతేగాక వస్త్ర, రసాయన, క్రీడా రంగాలు సహా కచ్చితత్వ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాలు వంటి అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలకు చేయూతనిస్తున్నాం.

మిత్రులారా!

మహిళల సారథ్యాన పరిశోధన-ఆవిష్కరణలకు భారత్‌ ఉజ్వల ఉదాహరణగా మారుతోందని మేమిప్పుడు సగర్వంగా చెప్పగలం. దేశంలోని మొత్తం అంకుర సంస్థలలో దాదాపు 50 శాతానికి నేడు కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు. ఇక ‘స్టెమ్‌’ రంగాల్లో యువతులు పెద్ద సంఖ్యలో పట్టభద్రులవుతున్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ లేదా అంతరిక్ష కార్యకలాపాలు సహా అనేక రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.

మిత్రులారా!

భారత్‌ వేగం, స్థాయికి ఫ్రాన్స్ సామర్థ్యం తోడైతే ప్రపంచానికి కొత్త అవకాశాల బాటలు పడతాయి. రెండు దేశాల నుంచి ఇవాళ అత్యుత్తమ మేధాశక్తి ఇక్కడ మమేకమైంది. నిష్కల్మష హృదయంతో మన ప్రతిభను పరస్పరం స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో 2030 నాటికి 30,000 మంది భారత విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని ఫ్రాన్స్ లక్ష్యనిర్దేశం చేసుకుంది. యువ శక్తి, యువతరం మేధస్సు  సమన్వయ సద్వినియోగం దిశగా కృషికి ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండదు.

 

మిత్రులారా!

భారత్‌-ఫ్రాన్స్ సంబంధాల్లో ఈ సంవత్సరం (2026) ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాదిలో ప్రజల మధ్య ఆదానప్రదానాలు ఇనుమడిస్తాయి.. పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. ఇక ఈ రోజున  మనమిక్కడ సమావేశమైన తరహాలోనే జూన్ నెలలో “భారత్ ఇన్నొవేట్స్-2026” ఫ్రాన్స్‌లో అత్యుత్తమ భారత సాంకేతిక అంకుర సంస్థల ప్రతిభను ప్రదర్శిస్తాం. ఇవి ప్రస్తుతం ఆరోగ్యం, వాతావరణం, భద్రత వంటి అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలను రూపొందిస్తున్నాయి.

మిత్రులారా!

ఫ్రాన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా గల పరిశ్రమ అగ్రగాములు, సీఈవోలు పెట్టుబడిదారులు, విశ్వవిద్యాలయాలు అన్నిటికీ ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. రండి... సాంకేతికతలు మానవాళికి సేవలందించే, సార్వజనీన ప్రగతి సహిత భవిష్యత్తు రూపకల్పన చేసే భారత్‌తో చేయి కలపండి. ఇదే స్ఫూర్తితో మీకందరికీ మనఃపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదే సమయంలో మా కోసం తన సమయం కేటాయించి, భావస్ఫోరకంగా ప్రసంగించిన, భారత్‌-ఫ్రాన్స్ సంబంధాలపై విశ్వాసం వెలిబుచ్చిన, రెండు దేశాల మధ్య పటిష్ఠ బంధానికి ప్రతీకగా నిలిచిన నా నిజమైన మిత్రులు మాక్రాన్‌కు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అనేకానేక ధన్యవాదాలు...

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Strategic partnership' to 'Cooperation in AI': Six major outcomes of PM Modi's historic Sweden visit - Check

Media Coverage

'Strategic partnership' to 'Cooperation in AI': Six major outcomes of PM Modi's historic Sweden visit - Check
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Shri VD Satheesan Ji on taking oath as the Chief Minister of Keralam
May 18, 2026

The Prime Minister, Shri Narendra Modi, congratulated Shri VD Satheesan Ji on taking oath as the Chief Minister of Keralam.

Shri Modi remarked that the Central Government assures all possible support for the newly formed Keralam Government in fulfilling the aspirations of the people.

Shri Modi posted on X:

“Congratulations to Shri VD Satheesan Ji on taking oath as the Chief Minister of Keralam. My best wishes for his tenure. The Central Government assures all possible support for the newly formed Keralam Government in fulfilling the aspirations of the people.”

“കേരളത്തിന്റെ മുഖ്യമന്ത്രിയായി സത്യപ്രതിജ്ഞ ചെയ്ത വി ഡി സതീശൻ ജി ക്ക് ഹൃദയം നിറഞ്ഞ അഭിനന്ദനങ്ങൾ. അദ്ദേഹത്തിന്റെ ഭരണകാലത്തിന് എൻ്റെ എല്ലാ ആശംസകളും നേരുന്നു. ജനങ്ങളുടെ ആഗ്രഹങ്ങൾ സഫലീകരിക്കുന്നതിനായി, പുതുതായി രൂപീകൃതമായ കേരള ഗവൺമെൻ്റിന് കേന്ദ്ര ഗവൺമെൻറ് എല്ലാ വിധ പിന്തുണയും ഉറപ്പുനൽകുന്നു.”

@vdsatheesan