Chandigarh is witnessing a significant boost in healthcare, education and connectivity today; Delighted to launch projects that will benefit people here: PM
Cleanliness is not a one-day activity;it is a way of life:PM
When the COVID-19 pandemic struck, India was not a nation seeking help; it was a nation extending help to the world: PM
In India, healthcare is no longer a privilege; it is becoming a right: PM

చండీగఢ్‌ గవర్నర్‌ శ్రీ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్ గారు, నా తోటి పార్లమెంటు సభ్యుడు మనీష్ తివారీ గారు, ఇక్కడ విచ్చేసిన ఎందరో శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, నా పాత మిత్రులు అందరికీ నమస్కారం.

 

సోదరీ,సోదరులారా...

 

ఈ రోజు మీ మధ్య ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది.

 

చండీగఢ్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అది దేశ ప్రగతికి ఒక అద్భుతమైన నమూనా. క్రమబద్ధమైన అభివృద్ధి, మెరుగైన జీవన విధానం, సులభతర జీవనానికి ఈ నగరం పేరుగాంచింది. ఇక్కడి అత్యుత్తమ వైద్య సదుపాయాలు, అన్నింటికంటే ముఖ్యంగా చండీ మాత ఆశీస్సులు ఈ నగరానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అందుకే చండీగఢ్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు ఏడాదిన్నర క్రితం మన దేశ న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణను తీసుకువచ్చాం. కేవలం శిక్షించడమే లక్ష్యంగా ఉన్న పాత శిక్షాస్మృతి స్థానంలో, న్యాయం అందించడమే పరమావధిగా ఉండే భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టాం. ఈ చారిత్రక చట్టాల అమలు ప్రక్రియను మన చండీగఢ్ నుంచే ప్రారంభించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది.

 

 మిత్రులారా,

 

ఇటీవలి కాలంలో చండీగఢ్‌ను పూర్తి హైటెక్ నగరంగా తీర్చిదిద్దడానికి అనేక ప్రాజెక్టులను చేపట్టాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ పార్కింగ్, డిజిటల్ పరిపాలన వంటి వినూత్న విధానాలను అమల్లోకి తెచ్చాం. ఈ గొప్ప కార్యక్రమం కోసం రూ. 2,500 కోట్లకు పైగా నిధులు వెచ్చించాం. ఈ రోజు కూడా ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగాలకు చెందిన పలు సరికొత్త ప్రాజెక్టులను ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములైన చండీగఢ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

 

 మిత్రులారా,

 

ఈ సభకు రాకముందు నేను హర్యానాలోని జింద్‌లో పర్యటించాను. ఇక్కడి కార్యక్రమం ముగిసిన వెంటనే పంజాబ్ అభివృద్ధి కార్యక్రమాల కోసం జలంధర్ వెళ్లనున్నాను. ఈ రెండు ప్రదేశాల మధ్యలోనే మన చండీగఢ్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే చండీగఢ్ కేవలం ఒక నగరం కాదు, అది హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు యావత్ ఉత్తర భారత ప్రాంతాన్ని అనుసంధానించే అత్యంత కీలకమైన కేంద్రం. చండీగఢ్ సాధించే ప్రగతి కేవలం ఇక్కడి ప్రజల జీవితాలనే కాకుండా పొరుగున ఉన్న హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వైద్య సేవల పరంగా ఈ నగరం సమస్త ఉత్తర భారత ప్రాంతానికి ఒక ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

 

మిత్రులారా,

 

నేను చండీగఢ్‌లో నివసించిన రోజుల్లో తరచూ పీజీఐ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లేదా హర్యానా ప్రాంతాల నుంచి మా సహచరులు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. వారిని పరామర్శించడానికి నేను వెళ్లడం సహజంగా జరిగేది. అందుకే ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో పీజీఐ ఎంతటి కీలక పాత్ర పోషిస్తోందో నాకు బాగా తెలుసు.

 

మిత్రులారా,

 

ఈ రోజు చండీగఢ్ పీజీఐలో అత్యాధునిక వైద్య సదుపాయాలను మరింత విస్తరిస్తున్నాం. ఇక్కడ కొత్తగా అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక నాడీ వైద్య పరిశోధనా కేంద్రం, అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం, క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ వంటివి లక్షలాది మంది రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తాయి. 2015లో నేను పీజీఐ స్నాతకోత్సవానికి హాజరవ్వడం నాకు గుర్తుంది. ఈ రోజు వర్చువల్ విధానంలో అక్కడి నా పాత సహచరులను మళ్లీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దశాబ్ద కాలంలో పీజీఐ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఇందుకోసం అంకితభావంతో పనిచేస్తున్న పీజీఐ చండీగఢ్ యాజమాన్యం, ప్రొఫెసర్లు, యువ వైద్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 

 మిత్రులారా,

 

ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు పరిశుభ్రత ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించాం. కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి, దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాం. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత కోసం ప్రత్యేక ప్రచారాలు నిర్వహించి, శుభ్రతను మన జీవనశైలిలో ఒక భాగంగా మార్చేందుకు కృషి చేశాం. నగరాల మధ్య నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లు ఈ ప్రయత్నంలో భాగమే. చండీగఢ్ నగరం ఈ ర్యాంకింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంది.

 

మిత్రులారా,

 

ఈ సందర్భంగా చండీగఢ్‌కు చెందిన విరమణ పొందిన ఐపీఎస్ అధికారి ఇందర్‌జీత్ సింగ్ సిద్ధూ గారిని నేను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నాను. ఆయనను అందరూ ఎంతో గౌరవంగా ‘బ్రూమ్ వారియర్’ (చేతుల్లో చీపురు పట్టిన యోధుడు) అని పిలుస్తారు. చండీగఢ్ ప్రజల్లో పరిశుభ్రత పట్ల సరికొత్త చైతన్యాన్ని రగిలిస్తూ ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవలను గుర్తిస్తూ మన ప్రభుత్వం ఈ ఏడాది ఆయన్ను పద్మ అవార్డుతో సత్కరించింది.

స్నేహితులు,

 

మిత్రులారా,

 

పరిశుభ్రత అనేది ఒక్క రోజుతో ముగిసిపోయే పని కాదు, అది ఒక నిరంతర జీవన విధానం. నేడు మనం నిర్వహించుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలతో పరిశుభ్రతను జోడించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. స్వచ్ఛత సే స్వాగత్ కార్యక్రమం కింద ఇక్కడ ఒక ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు అంతా కలిసికట్టుగా వీధులు శుభ్రం చేయడాన్ని నేను సోషల్ మీడియాలో చూశాను. ఇది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించింది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చండీగఢ్ ప్రజలందరికీ నా అభినందనలు.

 

మిత్రులారా,

 

ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు దేశంలో అనేక వ్యాధులను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.

 

మిత్రులారా,

 

ఒకానొక సమయంలో ప్రపంచమంతా భారతదేశ ఆరోగ్య రంగం పట్ల ఆందోళన వ్యక్తం చేసేది. ఏదైనా పెద్ద విపత్తు వస్తుందనే అంచనా ఉన్నప్పుడల్లా, ఇక భారత్‌ పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నించేవారు. కరోనా మహమ్మారి సమయంలో యావత్ ప్రపంచ దేశాల ఆందోళనకు భారత్ కేంద్రబిందువుగా నిలిచింది. అయితే మన ప్రభుత్వం దేశ సామర్థ్యాన్ని మార్చడంతో పాటు దేశం పట్ల ప్రపంచ దేశాలకున్న ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేసింది. ఆ మహమ్మారి సంభవించినప్పుడు భారత్ ఇతరుల సహాయం కోసం అర్థించే దేశంగా మిగిలిపోలేదు. ప్రపంచ దేశాలకే సహాయం పంపే స్థాయికి ఎదిగింది. ఈ రోజు తీవ్రమైన వ్యాధులకు చికిత్స చేయించుకోవడానికి వివిధ దేశాల ప్రజలు మన దేశానికి వస్తున్నారు. వైద్య పర్యాటక రంగంలో భారత్‌ ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది.

 

 మిత్రులారా,

 

ఈ అద్భుతమైన మార్పు 12 సంవత్సరాల నిజాయితీతో కూడిన కృషి, పటిష్టమైన విధానాల ఫలితమే. మన దేశ ప్రజలు వైద్య సేవలు అందక ఇబ్బంది పడకూడదని, వారికి తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ చికిత్స సౌకర్యాలు లభించాలని మేం సంకల్పించుకున్నాం. గత 12 ఏళ్ల ఘన విజయం ఆ సంకల్ప బలమే. ఇటీవలి కాలంలో భారత్‌ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను శరవేగంగా విస్తరించింది. 2014 సంవత్సరం నుంచి దేశంలో కొత్తగా 15 ఎయిమ్స్ ఆసుపత్రులకు ఆమోదం లభించింది. నేడు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించే ప్రత్యేక ఆసుపత్రుల సంఖ్య కూడా పెరిగింది. మన చండీగఢ్‌కు సమీపంలోనే హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాం. 2022లో దానిని ప్రారంభించే భాగ్యం నాకు దక్కింది. ఈ రోజు ఆ ఆసుపత్రి వేలాది మంది రోగులకు అండగా నిలుస్తోంది.

 

మిత్రులారా, 

 

దేశంలోని పల్లెపల్లెనా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నాం. వైద్య వ్యవస్థ ప్రతి స్థాయిలోనూ పటిష్టంగా ఉండాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించాం. దీని కింద దేశవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు, ప్రజారోగ్య యూనిట్లు  వంటి సదుపాయాల వ్యవస్తను సృష్టించాం. ఈ రోజు నగరాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాలలో దాదాపు 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రాథమిక చికిత్స సౌకర్యాలతో పాటు 12 రకాల విభిన్న ఆరోగ్య ప్యాకేజీల సేవలను అందిస్తున్నాయి. ఇక్కడే కోట్లాది మంది ప్రజలు రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి వ్యాధుల పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు.

 

మిత్రులారా,

 

మన ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైద్య చికిత్సను మరింత సులభతరం చేస్తోంది. ఈ-సంజీవని మిషన్ ద్వారా టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. దీని కింద ఇప్పటికే 48 కోట్లకు పైగా ఉచిత వైద్య సంప్రదింపులు జరిగాయి. దీనివల్ల మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద ఆసుపత్రుల వైద్యుల సలహాలు, సూచనలు పొందగలుగుతున్నారు.

 

మిత్రులారా,

 

మన ఆరోగ్య సేవల విస్తరణ వల్ల నేడు దేశంలో ప్రసవాల్లో 90 శాతానికి పైగా ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. దీని ఫలితంగా మాతృ మరణాల రేటు ఏకంగా 86 శాతం తగ్గింది. శిశు మరణాల రేటు కూడా భారీగా క్షీణించింది.

 

మిత్రులారా,

 

కేవలం జబ్బులకు చికిత్స అందించడమే కాకుండా.. వ్యాధులు రాకుండా ముందే అడ్డుకునే నివారణ ఆరోగ్య సంరక్షణపై అంతే సమానంగా దృష్టి పెడుతున్నాం. పోషణ్ అభియాన్, మిషన్ ఇంద్రధనుష్, యోగా, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, యు విన్ వేదిక వంటి అనేక వినూత్న కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తున్నాయి.

 

 మిత్రులారా,

 

భారత్‌ను క్షయ రహిత దేశంగా మార్చాలని మేం గట్టిగా సంకల్పించాం. ఇందుకోసం టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిరంతరం కొనసాగుతోంది. ప్రజల భాగస్వామ్యం వల్ల అవగాహన పెరుగుతోంది. సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ రోగులకు సరైన చికిత్స అందిస్తున్నాం. దీనివల్ల టీబీ చికిత్స కవరేజీ 90 శాతం దాటింది. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో టీబీ సంక్రమణ రేటు 21 శాతం తగ్గింది. ఈ ప్రయత్నాల వల్ల అత్యధికంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా మన తల్లులు, సోదరీలు లబ్ధి పొందుతున్నారు. మన సంప్రదాయ కుటుంబాలలో మహిళలు ఇంటి పనులకే ప్రాధాన్యత ఇస్తూ అనారోగ్యాన్ని సైతం నిశ్శబ్దంగా భరిస్తుంటారు. అయితే మేం తీసుకున్న ప్రయత్నాల వల్ల వారికి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు, మెరుగైన సంరక్షణ అందుతున్నాయి. ఈ రోజు పెద్ద సంఖ్యలో మహిళలు క్షయ వ్యాధి నుంచి విముక్తి పొందుతున్నారు.దేశంలో ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం కొందరికే పరిమితమైన ప్రత్యేక సౌకర్యం కాదు, అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా మారుతోంది.

 

 మిత్రులారా,

 

ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల దేశ యువతకు కూడా ఎంతో మేలు జరుగుతోంది. వైద్య వృత్తిని ఎంచుకోవడం గతంలో ఎంత కష్టంగా ఉండేదో మన యువ వైద్యులకు బాగా తెలుసు. వైద్య సీట్లు, వైద్య కళాశాలలు చాలా పరిమితంగా ఉండటం వల్ల అవకాశాలు లభించేవి కావు. మేం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశాం. ఈ రోజు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ఇప్పుడు మన చండీగఢ్ పీజీఐకి కూడా ఎంబీబీఎస్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. త్వరలోనే ఇక్కడ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల ప్రతిభావంతులైన యువతకు ఇటువంటి అత్యుత్తమ సంస్థలో చదువుకునే అవకాశం లభిస్తుంది. దేశానికి పెద్ద సంఖ్యలో అద్భుతమైన వైద్యులు అందుబాటులోకి వస్తారు.

 

మిత్రులారా,

 

విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, వైద్య విజ్ఞానం, పరిశోధనలకు చెందిన పెద్ద పెద్ద సంస్థలన్నీ ఒకే చోట ఉన్న నగరం చండీగఢ్. ఇలాంటి అపారమైన శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ నగరాలకు మాత్రమే ఉంటాయి. రాబోయే కాలంలో ఈ సంస్థలు సరికొత్త సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రాలుగా మారగలవు. ఈ రోజు విద్యారంగానికి చెందిన పలు కీలక ప్రాజెక్టులు కూడా ఈ ప్రయాణానికి సరికొత్త వేగాన్ని ఇస్తున్నాయి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో కురుక్షేత్ర బాయ్స్ హాస్టల్, మెస్ భవనాన్ని ప్రారంభించుకున్నాం. సెక్టార్-46లోని ప్రభుత్వ కళాశాల కోసం సరికొత్త హాస్టల్ సిద్ధమైంది. రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్‌కు శంకుస్థాపన కూడా జరిగింది. పరిశోధనల కోసం అత్యుత్తమ ప్రయోగశాలలు, నిపుణులైన అధ్యాపకులను అందించడమే మా ప్రయత్నం. పరిశోధనా వాతావరణం బలంగా ఉన్నప్పుడే సరికొత్త ఆవిష్కరణలు వేగవంతం అవుతాయి. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అత్యాధునిక తయారీ, డీప్-టెక్ వంటి రంగాల్లో భారత్‌ మరింత ముందుకు సాగాలి. చండీగఢ్‌లోని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, యువత ఈ దిశగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారనే నమ్మకం నాకుంది. 

 

మిత్రులారా,

 

మౌలిక సదుపాయాల అభివృద్ధే ఏ దేశ ఆర్థిక ప్రగతికైనా ఒక దిక్సూచి లాంటిది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక సమగ్ర విధానంతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ఈ రోజు చండీగఢ్‌లో కూడా అనుసంధానతను పెంచే పలు ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. ఐటీ సిటీ నుంచి కురాలీ వరకు నిర్మించిన ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వచ్చింది. ఇది విమానాశ్రయం రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మొహాలీ, ఖరార్ నివాసితుల రాకపోకలను సులభతరం చేస్తుంది. అంబాలా-చండీగఢ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి పీఆర్-7 స్పుర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా పూర్తయింది. ఇటువంటి ప్రాజెక్టులు పరిశ్రమలను, వ్యాపారాలను ప్రోత్సహిస్తూ చండీగఢ్‌లో సులభతర జీవనాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

 

మిత్రులారా,

 

ప్రాంతీయ అనుసంధానతను పెంపొందించే లక్ష్యంతో జలంధర్‌లో పలు రైల్వే ప్రాజెక్టులు కూడా నేడు ప్రారంభమవుతున్నాయి. వీటివల్ల పంజాబ్‌తో పాటు పొరుగు ప్రాంతాల ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది. అదే సమయంలో జింద్ నుంచి సోనిపట్ వరకు దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు తీయడం ప్రారంభించింది. పర్యావరణహిత ఇంధనంతో నడిచే ఈ రైలు మన రవాణా రంగంలో ఒక గొప్ప విప్లవాత్మక ఆరంభం. ఈ విజయానికి గాను మీ అందరికీ, యావత్ దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

 

వికసిత్ భారత్ దిశగా సాగుతున్న మన ప్రయాణంలో నూతన ఆలోచనా విధానంతో ముందుకు సాగాలి. భవిష్యత్తు సాంకేతికతలు, భవిష్యత్తు రవాణా రంగాలు, అత్యాధునిక వైద్య సేవలపై మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత తరం ప్రజలకే కాకుండా రాబోయే తరాల వారికి కూడా లబ్ధి చేకూర్చే వినూత్న నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంది. కాలంతో పాటు మరింత బలోపేతం అయ్యే అద్భుతమైన సంస్థలను మనం నిర్మించాలి. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ సరికొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల శుభసందర్భంగా చండీగఢ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు యావత్ ఉత్తర భారత ప్రాంత ప్రజలందరికీ మరోసారి నా అభినందనలు. మీ అందరికీ ధన్యవాదాలు. నాతో కలిసి గట్టిగా చెప్పండి.

 

భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.

 

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 సెప్టెంబర్ 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership