* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే నాయకులను స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) తయారు చేస్తుంది: పీఎం
* ప్రస్తుతం అంతర్జాతీయ శక్తిగా భారత్ ఎదుగుతోంది: పీఎం
* వికసిత్ భారత్‌ దిశగా సాగేందుకు అన్ని రంగాలకు చెందిన భవిష్యత్తు నాయకుల్లో ఉక్కు సంకల్పాన్ని నింపడమే సోల్ ధ్యేయం: పీఎం
* ప్రపంచ స్థాయిలో రాణించగల సంస్థలను అభివృద్ధి చేసే నాయకులు భారత్‌కు కావాలి: పీఎం
ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏర్పడిన బంధం రక్తసంబంధం కంటే బలమైనది: పీఎం
ఇది ఆరంభం మాత్రమే అన్న ప్రధాని, నాయకత్వ అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా ఎదగడమే లక్ష్యంగా సోల్ నిర్దేశించుకోవాలని సూచించారు.

గౌరవనీయులు,

భూటాన్ ప్రధానమంత్రి, నా సోదరుడు దషో షెరింగ్ టోబ్‌గే, సోల్ (స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌) బోర్డు చైర్మన్ సుధీర్ మెహతా, వైస్ చైర్మన్ హన్స్ముఖ్ అధియా, జీవితాల్లో, ఆయా రంగాల్లో నాయకత్వాన్ని అందించడంలో విజయం సాధించిన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, ఇంకా ఇక్కడ నేను చూస్తున్న అలాంటి గొప్ప వ్యక్తులు, అలాగే భవిష్యత్తు ఎదురుచూస్తున్న నా ఇతర యువ సహచరులారా…

మిత్రులారా,

కొన్ని సంఘటనలు మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటాయి. నేటి కార్యక్రమం అలాంటిదే. ఒక దేశ నిర్మాణంలో ఉత్తమ పౌరులను తయారు చేసుకోవడం ఎంతో అవసరం. దేశ నిర్మాణం వ్యక్తి వికాసం నుంచి, ప్రపంచం ప్రజల నుంచి రూపుదిద్దుకుంటుంది. ఎవరైనా ఉన్నత శిఖరాలను చేరాలనుకున్నా, గొప్పతనాన్ని సాధించాలనుకున్నా ప్రారంభం మాత్రం ప్రజల నుంచే  మొదలవుతుంది. ప్రతి రంగంలోనూ ఉత్తమ నాయకులు  చాలా అవసరం. ఇది అలాంటి నాయకులు ముందుకు రావలసిన అత్యవసర సమయం.  ఈ దిశగా స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్ షిప్ ఏర్పాటు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో చాలా ముఖ్యమైన, ఇంకా గొప్ప ముందడుగు. ఈ సంస్థ పేరులో ఆత్మ (సోల్) ఉండటమే కాదు, అది భారతదేశ సామాజిక జీవితానికి ఆత్మగా మారబోతోంది. దానితో మనకు బాగా పరిచయం ఉంది. మనం మళ్లీ మళ్లీ వింటూ ఉంటాం - ఆత్మ. ఈ ‘సోల్‘ ను ఆ కోణంలో చూస్తే, అది మనకు తప్పక ఆత్మానుభూతిని కలిగిస్తుంది. ఈ మిషన్ తో సంబంధం ఉన్న సహోద్యోగులందరినీ,  అలాగే ఈ సంస్థతో సంబంధం ఉన్న మహానుభావులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. త్వరలో గిఫ్ట్ సిటీ సమీపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్ షిప్ భారీ క్యాంపస్ సిద్ధం కానుంది. ఇప్పుడే నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, చైర్మన్ నాకు దాని పూర్తి నమూనాను, ప్లాన్ ను నాకు చూపించారు. ఇది వాస్తుశిల్ప పరంగా కూడా నాయకత్వాన్ని ప్రదర్శిస్తుందని నాకు నిజంగా అనిపిస్తోంది.  

మిత్రులారా,

నేడు, స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్ షిప్ - సోల్ తన ప్రయాణంలో మొదటి పెద్ద అడుగు వేస్తున్నప్పుడు, మీరు మీ దిశ ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి అని ఆలోచించాలి. స్వామి వివేకానంద ఇలా అన్నారు- "నాకు వంద మంది శక్తివంతమైన యువతీయువకులను ఇవ్వండి, నేను భారతదేశాన్ని మారుస్తాను.” స్వామి వివేకానంద భారతదేశాన్ని బానిసత్వం నుండి బయటకు తీసుకురావడం ద్వారా మార్చాలనుకున్నారు. తనకు 100 మంది నాయకులు ఉంటే భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చడమే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే దేశంగా తీర్చిదిద్దగలనని ఆయన విశ్వసించారు. ఈ సంకల్ప శక్తితో, ఈ మంత్రంతో మనమందరం, ముఖ్యంగా మీరు ముందుకు సాగాలి. నేడు ప్రతి భారతీయుడు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 140 కోట్లు జనాభా గల దేశంలో ప్రతి రంగంలో, ప్రతి స్థాయిలో, జీవితంలోని ప్రతి అంశంలో ఉత్తమ నాయకత్వం అవసరం. కేవలం రాజకీయ నాయకత్వమే కాదు, జీవితంలోని ప్రతి రంగంలోనూ 21వ శతాబ్దపు నాయకత్వాన్ని తయారు చేయడానికి స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్ షిప్ విస్తృతమైన అవకాశం కలిగి ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ నుండి ఎందరో నాయకులు బయటకు వస్తారు. వారు కేవలం దేశంలోనే కాదు, ప్రపంచ సంస్థల్లోను, ప్రతి రంగంలోను తమ విజయ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. ఇక్కడి నుంచి శిక్షణ పొందిన యువకుడు రాజకీయ రంగంలో కొత్త స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది.

మిత్రులారా,

ఒక దేశం పురోగతి సాధించినప్పుడు, సహజ వనరులు ముఖ్య పాత్ర పోషిస్తాయి, కానీ మానవ వనరులు ఇంకా పెద్ద పాత్ర పోషిస్తాయి. మహారాష్ట్ర, గుజరాత్ విభజన ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఆ సమయంలో మేము చిన్నపిల్లలం. కానీ ఆ సమయంలో విడిపోవడం ద్వారా గుజరాత్ ఏమి చేస్తుందనే చర్చ జరిగింది. దానికి సహజ వనరులు లేవు, గనులు లేవు, బొగ్గు లేదు, ఏమీ లేదు, అది ఏమి చేస్తుంది? నీరు లేదు, అది ఒక ఎడారి, మరో వైపు పాకిస్తాన్ ఉంది—అప్పుడు వారు ఏమి చేస్తారు? గుజరాతీలు దగ్గర ఎక్కువలో ఎక్కువ ఉప్పు మాత్రమే ఉంది, ఇంకేం ఉంది? కానీ నాయకత్వ శక్తిని చూడండి, ఈరోజు ఆ గుజరాత్ సర్వం సాధించింది. అక్కడి సాధారణ ప్రజల దగ్గర ఈ శక్తి ఉండేది. వారు కూర్చొని ఏది లేదని, ఇది లేదని, అది లేదని ఏడవలేదు. ఏది ఉన్నదో అదే ఉంది అని భావించి ముందుకు సాగారు. గుజరాత్ లో ఒక్క వజ్రాల గని కూడా లేదు. కానీ ప్రపంచంలోని 10 వజ్రాల్లో 9 వజ్రాలు కొందరు గుజరాతీలు తాకినవే. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, కేవలం వనరులు కాకుండా, అసలైన మహాశక్తి మానవ వనరుల్లో, మానవ సామర్థ్యంలో, మానవ శక్తిలో ఉంది. మీ భాషలో చెప్పాలంటే అదే నాయకత్వం.

21 వ శతాబ్దంలో, నూతన ఆవిష్కరణలకు దారి చూపే నైపుణ్యాలను సక్రమంగా ఉపయోగించగల వనరులు మనకు అవసరం. ఈరోజు ప్రతి రంగంలోనూ నైపుణ్యాలు ఎంత ముఖ్యమో  మనం చూస్తున్నాం. అందువల్ల నాయకత్వ అభివృద్ధి రంగానికి కూడా కొత్త నైపుణ్యాలు అవసరం. నాయకత్వ అభివృద్ధికి  సంబంధించిన ఈ పనిని చాలా శాస్త్రీయంగా,  చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ దిశలో మీ సంస్థ, సోల్ చాలా ముఖ్యమైన పాత్రను కలిగివుంది. మీరు కూడా దీనిపై పనిచేయడం ప్రారంభించారని తెలిసి నేను సంతోషిస్తున్నాను. లాంఛనంగా ఇది మీ మొదటి కార్యక్రమంగా అనిపించినప్పటికీ, జాతీయ విద్యా విధానాన్ని సమర్థంగా అమలు చేయడానికి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్లు,  ఇతర అధికారులకు వర్క్ షాప్ లు నిర్వహించినట్లు నాకు తెలిసింది. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో నాయకత్వ వికాసం కోసం చింతన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని చెప్పగలను. సోల్ ప్రపంచంలోనే ఉత్తమ నాయకత్వ అభివృద్ధి సంస్థగా మారాలి.  అలా చూడాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. దీనికోసం మనం కఠినంగా శ్రమించాలి కూడా.

మిత్రులారా,

నేడు భారత్ ప్రపంచ శక్తిసామర్థ్యాల కేంద్రంగా ఎదుగుతోంది. ఈ వేగం ప్రతి రంగంలో పెరిగేలా చూడాలంటే, ప్రపంచ స్థాయి నాయకులు, అంతర్జాతీయ నాయకత్వం మనకు అవసరం. సోల్ వంటి నాయకత్వ సంస్థలు ఇందులో ఆటను మార్చేవిగా నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు మన ఎంపిక మాత్రమే కాదు, మన అవసరం కూడా. ఈరోజు భారతదేశానికి ప్రతి రంగంలోనూ శక్తివంతమైన నాయకులు అవసరం. వారు ప్రపంచ సమస్యలకు, ప్రపంచ అవసరాలకు పరిష్కారాలను కనుగొనగలగాలి. వారు సమస్యలను పరిష్కరిస్తూనే ప్రపంచ వేదికపై దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేయగలగాలి. వారి దృష్టి అంతర్జాతీయం అయినప్పటికీ వారి ఆలోచనలో స్థానిక మూలాలు ముఖ్యమైన భాగం కావాలి. అంతర్జాతీయ దృక్పథాన్ని అర్థం  చేసుకుంటూ భారతీయ ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తులను మనం సిద్ధం చేయాలి. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, , సంక్షోభ నిర్వహణలోనూ, భవిష్యత్ గురించి ఆలోచించడంలోనూ వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లలో, అంతర్జాతీయ సంస్థల్లో పోటీ పడాలంటే అంతర్జాతీయ వ్యాపార ధోరణులపై అవగాహన ఉన్న నాయకులు కావాలి. ఇది సోల్ ప్రధాన బాధ్యత. మీ పని పెద్దది. మీ పరిధి పెద్దది, మీ పై అంచనాలు కూడా ఎక్కువే.
 

మిత్రులారా,

మీ అందరికీ ఒక విషయం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో, నాయకత్వం కేవలం అధికారానికి మాత్రమే పరిమితం కాదు. సృజనాత్మకత, ప్రభావ సామర్థ్యాలు ఉన్నవారు మాత్రమే నాయకత్వ పాత్రల్లో ఉంటారు. ఈ అవసరానికి అనుగుణంగా దేశంలోని వ్యక్తులు ఎదగాల్సి ఉంటుంది. సోల్ అనేది క్లిష్టమైన ఆలోచనలను పెంపొందించే సంస్థ. ఈ వ్యక్తులలో రిస్క్ తీసుకుని సమస్యను పరిష్కరించే మనస్తత్వం, ఉంటుంది. విఘాతం సృష్టించే మార్పుల మధ్య పనిచేయడానికి రాబోయే కాలంలో, సంస్థ నుంచి వచ్చే ఇలాంటి నాయకులు సిద్ధంగా ఉంటారు.

మిత్రులారా!
   ఒక శైలికి రూపమివ్వడం కాకుండా సరికొత్త శైలిని సృష్టించగల నాయకులను మనం తయారు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో దౌత్యం నుంచి సాంకేతిక ఆవిష్కరణల వరకూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే వేళ ఈ రంగాలన్నిటా భారత్‌ ప్రాబల్యం, ప్రభావం అనేక రెట్లు ఇనుమడిస్తుంది. అంటే- ఒక విధంగా భారత్‌ దృక్పథం, భవిష్యత్తు మొత్తం బలమైన నాయకత్వ సృష్టిమీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ప్రపంచ దృక్పథం, స్థానిక శిక్షణతో ముందడుగు వేయాలి. మన పాలనను, విధాన రూపకల్పనను ప్రపంచ స్థాయికి చేర్చాలి. మన విధాన నిర్ణేతలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు తమతమ విధానాలను ప్రపంచ ఉత్తమ పద్ధతులతో అనుసంధానిస్తేనే ఇది సాధ్యం. ఈ క్రమంలో ‘సోల్‌’ వంటి సంస్థలు ఇందులో అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి.
మిత్రులారా!
   భారత్‌ను అభివృద్ధి చేయాలన్నదే మన ధ్యేయమైతే ప్రతి రంగంలోనూ మనం శరవేగంగా ముందడుగు వేయాలని నేను ఇంతకుముందే స్పష్టం చేశాను. మన ఇతిహాసాలు కూడా ఇదే చెబుతున్నాయి-  
यत् यत् आचरति श्रेष्ठः, तत् तत् एव इतरः जनः।। (యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః, తత్ త‌త్ ఏవ ఇత‌రః జ‌నః) అంటే- సాధారణ ప్రజలు ఒక గొప్ప వ్యక్తి ప్రవర్తనను అనుసరిస్తారు. కాబట్టి, అలాంటి నాయకత్వం మనకు అవసరం. అది ప్రతి అంశంలోనూ భారత జాతీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ తదనుగుణంగా వ్యవహరిస్తుంది. వికసిత భారత్‌ రూపకల్పన కోసం ఉక్కు సంకల్పం, స్ఫూర్తి రెండింటినీ భవిష్యత్ నాయకత్వంలో మూర్తిమంతం చేయాలి. ‘సోల్‌’ ఏకైక లక్ష్యం ఇదే కావాలి... అటుపైన అవసరమైన మార్పులు, సంస్కరణలు వాటంతటవే చోటుచేసుకుంటాయి.
 

మిత్రులారా!
   ప్రభుత్వ విధానాలు, సామాజిక రంగాల్లోనూ ఈ ఉక్కు సంకల్పం, స్ఫూర్తిని సృష్టించడం అవసరం. అలాగే డీప్-టెక్, స్పేస్, బయోటెక్, పునరుత్పాదక ఇంధనం వంటి అనేక వర్ధమాన రంగాలకు తగిన నాయకత్వాన్ని రూపొందించాలి. క్రీడలు, వ్యవసాయం, తయారీ, సామాజిక సేవ వంటి సంప్రదాయ రంగాలకూ అనువైన నాయకత్వాన్ని సృష్టించాలి. ప్రతి రంగంలోనూ నైపుణ్యాకాంక్ష ఉంటే చాలదు.. అన్నిటిలోనూ మనం రాణించగలగాలి. ఆ మేరకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నవ్య సంస్థలను సృష్టించగల నాయకులు భారత్‌కు అవసరం. మన చరిత్రలో అటువంటి సంస్థల ఉజ్వల గాథలెన్నో కనిపిస్తాయి. మనం ఆ స్ఫూర్తిని పునరుద్ధరించాలి.. అదేమీ కష్టమైన కార్యం కూడా కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు దీన్ని రుజువుచేశాయి. ఈ మందిరంలో అటువంటి లక్షలాది మిత్రులున్నారని, మన మాటలు వింటున్న, బయటి ప్రపంచంలో మనల్ని చూస్తున్న వారంతా కూడా సమర్థులని నేను అర్థం చేసుకున్నాను. ఈ సంస్థ మీ కలలకు, దృక్పథానికి ప్రయోగశాలగా కూడా మారాలి. తద్వారా నేటి నుంచి 25-50 సంవత్సరాల తర్వాతి తరం మిమ్మల్ని సగర్వంగా గుర్తుచేసుకుంటుంది. ఈ రోజున మీరు వేసే పునాదిని రేపు వారంతా గర్వకారణంగా పరిగణిస్తారు.
మిత్రులారా!
   కోట్లాది భారతీయుల సంకల్పం, కలలపై ఒక సంస్థగా మీకు అత్యంత స్పష్టమైన అవగాహన  ఉండాలి. అదేవిధంగా మనకు సవాలు విసిరే, అవకాశాలు కల్పించే రంగాలు-అంశాలు కూడా మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఒక ఉమ్మడి లక్ష్యంతో మనమంతా సమష్టిగా కృషి చేస్తూ ముందుకు సాగితే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి. ఉమ్మడి లక్ష్యంతో ముడిపడే బంధం రక్తసంబంధంకన్నా బలమైనదిగా రూపొందుతుంది. అది మనసులను ఏకం చేసి, మనలో అభిరుచిని పెంచడమేగాక కాల పరీక్షకు ఎదురొడ్డి నిలవగలదు. ఉమ్మడి లక్ష్యం భారీగా ఉన్నపుడు, మీ సంకల్పం బలమైనదైతే నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి కూడా ఇనుమడిస్తాయి. ప్రతిఒక్కరూ తమనుతాము స్వీయ లక్ష్యాలకు అంకితం చేసుకుంటారు. అలాగే ఉమ్మడి లక్ష్యం, సంకల్పాలుంటే ప్రతి వ్యక్తిలోనూ అత్యుత్తమ సామర్థ్యం వెల్లడవుతుంది. అంతేకాదు... వారు ఎంతో దృఢ సంకల్పంతో తమ సామర్థ్యాలను కూడా పెంచుకుంటారు. ఈ ప్రక్రియలో ఒక నాయకుడు ఎదుగుతాడు.. తనకు అప్పటిదాకా లేని సామర్థ్య సముపార్జనకు యత్నిస్తాడు.. తద్వారా సమున్నత స్థాయికి చేరగలడు.
మిత్రులారా!
   ఉమ్మడి లక్ష్యం ఉన్నప్పుడు ఎన్నడూ ఎరుగని జట్టు స్ఫూర్తి మనను ముందుకు నడిపిస్తుంది. ఉమ్మడి లక్ష్యంలో భాగస్వాములైన సహ ప్రయాణికులంతా సమష్టిగా సాగితే ఒక బంధం బలపడుతుంది. జట్టుగా రూపొందే ఈ ప్రక్రియ కూడా నాయకత్వ లక్షణాల సృష్టికి దోహదం చేస్తుంది. ఉమ్మడి లక్ష్యం విషయానికొస్తే- మన స్వాతంత్ర్య పోరాటాన్ని మించి మెరుగైన ఉదాహరణ మరేముంటుంది? నాటి మన పోరు రాజకీయాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ నాయకులు ఉద్భవించేందుకు తోడ్పడింది. నాటి స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నేడు మనను ఆవాహన చేసుకుంటూ ఆ ప్రేరణతో ముందడుగు వేయాలి.
మిత్రులారా!
   సంస్కృతంలో ఎంతో అందమైన సామెత ఒకటి ఉంది:
अमन्त्रं अक्षरं नास्ति, नास्ति मूलं अनौषधम्। अयोग्यः पुरुषो नास्ति, योजकाः तत्र दुर्लभः।।
(అమంత్రం అక్ష‌రాం నాస్తి, నాస్తి మూలం అనౌష‌ధ‌మ్‌: అయోగ్య: పురుషో నాస్తి, యోజ‌కా: త‌త్ర దుర్ల‌భః) అంటే- “మంత్రానికి రూపునివ్వలేని అక్షరమంటూ ఏదీ లేదు... ఔషధ తయారీకి పనికిరాని మూలికంటూ ఏదీ లేదు. అసమర్థుడైన వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ, ప్రతిదీ ప్రయోజనకరం కావాలంటే ప్రణాళిక కర్త అవసరం” అని అర్థం.  అసమర్థులంటూ ఎవరూ ఉండరు కాబట్టి, ప్రతి ఒక్కరినీ సముచిత స్థానంలో ఉపయోగించుకోగల, సరైన మార్గంలో నడిపించే ప్రణాళిక కర్త ఉండాలి. ఆ మేరకు ‘సోల్‌’ సంస్థ ప్రణాళిక కర్త పాత్ర పోషించాలి. మీరు అక్షరాలను మంత్రంగా, మూలికలను ఔషధంగా మార్చాలి. ఇప్పుడిక్కడున్న చాలామంది నాయకులు నాయకత్వ నైపుణ్యాలను అభ్యసించారు... మెరుగుపరుచుకున్నారు. నేనెక్కడో చదివాను- మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే మీకు వ్యక్తిగత విజయం మాత్రమే సాధ్యం. కానీ, మీరొక జట్టును రూపొందించుకుంటే మీ సంస్థ విజయాన్ని మీరు చవిచూడవచ్చు. మీరు నాయకులను తయారు చేసుకుంటే మీ సంస్థ బ్రహ్మాండమైన వృద్ధిని సాధించగలదు. మనం ఎప్పుడు, ఏంచేయాలో గుర్తుంచుకోవడంలో ఈ మూడు వాక్యాలు సదా మనకు తోడ్పడతాయి. మనం చేయాల్సిందల్లా మనవంతు పాత్ర పోషించడమే!
 

మిత్రులారా!
   దేశంలో నేడొక కొత్త సామాజిక వ్యవస్థ ఏర్పడుతుండగా, ప్రస్తుత 21వ శతాబ్దంలోని గత దశాబ్దంలో జన్మించిన యువతరం దానికి రూపమిస్తోంది. ఇది వాస్తవానికి వికసిత భారత్‌ తొలి తరం.. అంటే- అమృత తరం అవుతుంది. ఇటువంటి తరం నుంచి నాయకత్వాన్ని రూపొందించడంలో ఈ కొత్త సంస్థ చాలా కీలక పాత్ర పోషించగలదని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి, మీకందరికీ నా శుభాకాంక్షలు.
  ఈ రోజు భూటాన్ రాజు జన్మదినం కావడం, ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం అత్యంత ముదావహ యాదృచ్చిక సందర్భం. ఇంతటి ముఖ్యమైన రోజున భూటాన్ ప్రధానమంత్రి ఇక్కడకు రావడం, ఆయనను ఇక్కడికి పంపడంలో రాజు ముఖ్య పాత్ర పోషించడం గమనార్హం. కాబట్టి, ఆయనకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 

మిత్రులారా!
   నాకు సమయం ఉండి ఉంటే మరో రెండు రోజులు ఇక్కడే ఉండేవాణ్ని. ఎందుకంటే-  కొంతకాలం కిందట నేనిక్కడ వికసిత భారత్ కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ రోజున మీలో చాలామంది యువకులు కూడా ఇక్కడున్నారు. కాబట్టి, దాదాపు రోజంతా ఇక్కడే ఉండి, అందరినీ కలుసుకుని, ఎంతోసేపు ముచ్చటించాను. వారినుంచి చాలా నేర్చుకున్నాను... తెలుసుకున్నాను. ఇక జీవితంలో సరికొత్త విజయాలు సాధించిన వాళ్లందర్నీ ఇవాళ ఇక్కడ ముందువరుసలో చూడగలగడం నా అదృష్టం. వారందరినీ కలిసి, కూర్చుని, చర్చించడానికి మీకిదో పెద్ద అవకాశం. నాకైతే ఈ అదృష్టం ఉండదు... ఎందుకంటే- నేను వారిని కలిసేందుకు వచ్చినపుడల్లా ఏదో ఒక పనితో వస్తుంటాను. కానీ, మీరు వారి అనుభవాల నుంచి ఎంతో తెలుసుకోగలరు... మరెంతో నేర్చుకోగలరు. తమతమ రంగాల్లో గొప్ప విజేతలైన వీరంతా మీ కోసం చాలా సమయమిస్తున్నారు. కాబట్టి, ‘సోల్‌’ అనే ఈ సంస్థకు అత్యంత ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను విశ్వసిస్తున్నాను. విజయానికి ప్రతీకలైన అటువంటి వ్యక్తులు నాటే బీజాంకురాలు మహా వటవృక్షమై సరికొత్త, సమున్నత విజయ శిఖరాలు అందుకోగల నాయకులను రూపొందిస్తుంది. మీ అందరిమీద సంపూర్ణ విశ్వాసంతో నాకీ సమయమిచ్చిన, సామర్థ్య వికాసానికి తోడ్పడిన, కొత్త శక్తినిచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మరోసారి నా కృతజ్ఞతలు. నా యువతరం కోసం నాకెన్నో కలలు, ఆకాంక్షలు ఉన్నాయి. నా దేశ యువతకు అనుక్షణం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలన్న భావన నాలో సదా మెదలుతూంటుంది. అందుకే ప్రతి క్షణం అవకాశం కోసం ఎదురుచూసే నాకు ఈ రోజు అలాంటి మరో అవకాశం దక్కింది. యువతరానికి నా శుభాకాంక్షలు.
 
అనేకానేక ధన్యవాదాలు!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”