ఈ బడ్జెటు 2047కల్లా వికసిత్ భారత్ వైపు మనం చేస్తున్న ప్రయాణంలో అతి కీలకం అవుతుంది: ప్రధానమంత్రి
ఈ సంవత్సరపు బడ్జెటు భారత్ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త శక్తినీ, కొత్త వేగాన్నీ అందిస్తుంది: ప్రధానమంత్రి
అమిత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండటంతోనే భారత్ సంతోషించడం లేదు.. ప్రపంచంలో
మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ కోరుకుంటోంది: ప్రధాని
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు కొత్త జోరును అందించడానికి ఒక చక్కని బాటను వేస్తోంది ఈ సంవత్సరపు బడ్జెటు: ప్రధాని
ఈ సంవత్సర బడ్జెటులో ఎమ్ఎస్ఎమ్ఈలు అందుకున్న మద్దతు దేశ స్థాయి నుంచి విదేశీ స్థాయికి ఎదగడానికి వాటికి కొత్త బలాన్నిస్తుంది: ప్రధాని
ఈ బడ్జెటు, యువ శక్తిని దృష్టిలో పెట్టుకొన్న బడ్జెటు.. దీనిలోని ప్రతిపాదనలు వివిధ రంగాల్లో నాయకుల్నీ, నూతన ఆవిష్కర్తల్నీ, సృజనకారుల్నీ తయారు చేస్తాయి: ప్రధాని
మహిళలే ఏర్పాటు చేసి, నిర్వహించే స్వయంసహాయ బృందాల ఆధునిక అనుబంధ విస్తారిత వ్యవస్థకు బడ్జెటులో పెద్ద పీట.. సమృద్ధి ఇంటింటికి చేరాలనేదే దీని లక్ష్యం: ప్రధాని

నా ప్రియమైన దేశప్రజలారా.. నమస్కారం!

నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్‌ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.

 

మిత్రులారా,

భారత్‌ నేడు ప్రయాణిస్తున్న 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' ఈ బడ్జెట్ ద్వారా సరికొత్త శక్తి, వేగాన్ని పుంజుకుంటుంది. చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఆకాంక్షాత్మక భారతావనిలోని సాహసోపేతమైన, ప్రతిభావంతులైన యువతకు ఎగిరేందుకు అనంతమైన ఆకాశాన్ని అందిస్తాయి. ఈ బడ్జెట్ నమ్మకంతో కూడిన పాలన, మానవ కేంద్రిత ఆర్థిక వ్యవస్థ అనే దార్శనికతను సాకారం చేస్తుంది. ద్రవ్య లోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టటంపై దృష్టి సారించడంతో పాటు అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి మధ్య సమన్వయం ఉన్న ఒక విశిష్టమైన బడ్జెట్ ఇది.

 

మిత్రులారా,

ఈ బడ్జెట్ భారత్‌కు ఉన్న అంతర్జాతీయ పాత్రను పునరుద్ధరిస్తుంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడంతో మాత్రమే 140 కోట్ల మంది భారత ప్రజలు సంతృప్తి చెందరు. మనం వీలైనంత త్వరగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని కోరుకుంటున్నాం.. ఇది కోట్ల మంది దేశప్రజల సంకల్పం. ప్రపంచానికి ఒక ‘నమ్మకమైన ప్రజాస్వామ్య భాగస్వామి’గా, ‘నమ్మకమైన నాణ్యతతో కూడిన సరఫరాదారు’గా భారతదేశ పాత్ర నిరంతరం పెరుగుతోంది. భారత్‌ ఇటీవల చేసుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం.. అన్ని ఒప్పందాలకు తలమానికమైన ఒప్పందం అందించే గరిష్ఠ ప్రయోజనం భారత్ ‌యువత, చిన్న - మధ్యతరహా పరిశ్రమలకు చెందాలి. ఈ దిశగా బడ్జెట్‌లో కీలకమైన చర్యలు ఉన్నాయి.

 

మిత్రులారా,

 

భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ పథకం కొత్త ఊపును అందుకోవడానికి ఈ బడ్జెట్‌ ఒక ప్రతిష్ఠాత్మకమైన రోడ్‌మ్యాప్ అందిస్తోంది. ఈ బడ్జెట్‌లో కొత్త వర్ధమాన పరిశ్రమలకు అంటే సన్‌రైజ్ రంగాలకు అందించిన మద్దతు అపూర్వమైనది. బయో-ఫార్మా శక్తి మిషన్, సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం, అరుదైన భూ ఖనిజాల కారిడార్ నిర్మాణం, కీలక ఖనిజాలకు ప్రాధాన్యత, వస్త్ర రంగంలో కొత్త పథకం, అధునాతన సాంకేతిక సాధనాల తయారీకి ప్రోత్సాహం, ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను సృష్టించడం.. ఇవన్నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నవి. ఇవి దేశానికి ఉన్న ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీరుస్తాయి. ఎంఎస్ఎంఈలు, మన చిన్న - కుటీర పరిశ్రమలు పొందిన మద్దతు వల్ల అవి 'స్థానిక స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి’ఎదగడానికి ఈ బడ్జెట్‌లో కొత్త శక్తిని ఇస్తుంది.

 

మిత్రులారా,

మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో అనేక చర్యలు ఉన్నాయి:

* ప్రత్యేక సరకు రవాణా కారిడార్: సరకు రవాణా కోసం ప్రత్యేక రైల్వే మార్గాలను విస్తరించడం

* జలమార్గాల విస్తరణ: దేశవ్యాప్తంగా అంతర్గత జలమార్గాలను మరింతగా విస్తరించడం

* హై-స్పీడ్ రైల్వే కారిడార్: వేగవంతమైన ప్రయాణం కోసం హై-స్పీడ్ రైల్వే మార్గాల ఏర్పాటు

* ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అభివృద్ధి: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం.

* మున్సిపల్ బాండ్లు: నగరాలకు బలమైన ఆర్థిక ఆధారాన్ని ఇచ్చేందుకు మున్సిపల్ బాండ్లను ప్రోత్సహించడం

ఈ చర్యలన్నీ అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా మన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తాయి.

 

మిత్రులారా,

 

ఏ దేశానికైనా అతిపెద్ద మూలధనం ఆ దేశ ప్రజలే. గత కొన్ని ఏళ్లుగా మన ప్రభుత్వం దేశ పౌరుల సామర్థ్యాన్ని పెంచేందుకు గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. నైపుణ్యం, స్థాయి, సుస్థిరతకు నిరంతరం బలాన్ని అందించాలన్నదే మా ప్రయత్నం. నిర్మలా గారు నేడు పార్లమెంటులో చెప్పినట్లుగా.. ఇది 'యువ శక్తి బడ్జెట్'. ఇందులో యువత ఆలోచనలు, యువత కలలు, యువత సంకల్పం, యువత వేగం కూడా ఉన్నాయి. బడ్జెట్‌లోని నిబంధనలు వివిధ రంగాల్లో నాయకులు, ఆవిష్కర్తలు, సృష్టికర్తలను తయారు చేస్తాయి. మెడికల్ కేంద్రాల ఏర్పాటు ద్వారా, అనుబంధ ఆరోగ్య నిపుణులను ప్రోత్సహించటం ద్వారా, ఆరెంజ్ ఎకానమీని (అంటే ఆడియో-విజువల్స్, గేమింగ్) ప్రోత్సహించడం ద్వారా, పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా, ఖేలో ఇండియా మిషన్ ద్వారా యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి. భారత్‌ను ప్రపంచ డేటా సెంటర్ కేంద్రంగా మార్చడానికి ఒక ప్రధాన పన్ను మినహాయింపును కూడా బడ్జెట్ ప్రకటించింది. ఉపాధి కల్పనకు ఈ బడ్జెట్ పెద్ద ఊపునిస్తుంది కాబట్టి నేను ప్రత్యేకంగా భారతదేశ యువతను అభినందిస్తున్నాను. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి ఈ బడ్జెట్‌లో పటిష్ఠమైన చర్యలు తీసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలను శక్తిమంతం చేయటం ద్వారా సమతుల్య అభివృద్ధికి సంబంధించిన పునాది కూడా ఈ బడ్జెట్‌లో బలపడింది.

 

మిత్రులారా,

 

మన దేశంలో 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధమై ఉన్నారు. ఇది చాలా విజయవంతమైన ఉద్యమంగా నిలిచింది. మహిళలతో తయారైన, మహిళలే నిర్వహించే స్వయం సహాయక సంఘాల కోసం ఒక ఆధునిక వ్యవస్థను రూపొందించేందుకు బడ్జెట్ ప్రాధాన్యతనిచ్చింది. ప్రతి ఇంటికి లక్ష్మీదేవి రావాలన్నదే మా ప్రయత్నం. ప్రతి జిల్లాలో విద్యార్థినుల కోసం కొత్త హాస్టళ్లను నిర్మించే కార్యక్రమం విద్యను మరింత అందుబాటులోకి తెస్తుంది.

 

మిత్రులారా,

మన ప్రభుత్వం ఎల్లప్పుడూ భారతదేశ వ్యవసాయం, డైరీ రంగం, మత్స్య రంగానికి అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. కొబ్బరి, జీడిపప్పు, కోకో, గంధపు చెక్కల ఉత్పత్తితో సంబంధం ఉన్న రైతుల కోసం ఈ బడ్జెట్‌లో కూడా అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం. 'భారత్ విస్తార్ ఏఐ' సాధనం రైతులకు వారి సొంత భాషలోనే సమాచారాన్ని అందించడం ద్వారా ఎంతో సహాయపడుతుంది. మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా గ్రామాల్లోనే ఉపాధి, స్వయం ఉపాధికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.

 

మిత్రులారా,

ఈ బడ్జెట్ ప్రతిష్ఠాత్మకమైనది.. ఇది దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమాన్ని నిర్ధారించే ఈ సున్నితమైన బడ్జెట్‌ను రూపొందించినందుకు నిర్మలా గారు, ఆమె బృందాన్ని నేను మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India-Japan action plan targets exchange of 5 lakh people in five years, including 50,000 skilled Indians: Gov

Media Coverage

India-Japan action plan targets exchange of 5 lakh people in five years, including 50,000 skilled Indians: Gov
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 జూలై 2026
July 31, 2026

Building Trust & Capability Under PM Modi : Fair Exams, Homegrown Space Tech & India’s First Telecom Manufacturing Zone