The spirit of standing with courage and truth is as relevant today as it was in the time of Sri Guru Teg Bahadur Sahib Ji: PM

జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకాల్! నేడు 'హింద్ ది చాదర్' శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ 350వ వర్థంతి సందర్బంగా భక్తితో ఆయన్ని స్మరించుకుందాం. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న వారందరికీ నా వందనాలు. ఈ చారిత్రాత్మక, పవిత్రమైన కార్యక్రమంలో భాగమవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మిత్రులారా,

భారతదేశానిది ధైర్యసాహసాలు, సమన్వయం, సహకారాల చరిత్ర. మహారాష్ట్రలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆ గొప్ప వారసత్వానికి సాక్షులుగా మనం నిలుస్తున్నాం. మన గురువులు త్యాగానికి చిహ్నాలుగా నిలిచిన ఆ రోజుల్లో సామాజిక ఐక్యత అత్యంత కీలక పాత్ర పోషించింది. ప్రతి వర్గం, ప్రతి సమాజం మన గురువుల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యానికి, సంస్కృతికి కట్టుబడి ఉండటాన్ని సమాజం నేర్చుకుంది. సామాజిక ఐక్యతకు చేసిన త్యాగంలో శ్రీ గురు గోవింద్ సింగ్ స్థాపించిన గురునానక్ నామ్లేవా సంగత్ వంటి ఆచారాలు కీలక పాత్ర పోషించాయి. నేడు దేశానికి సామాజిక ఐక్యత అవసరమైన తరుణంలో సంగత్ వ్యవస్థ.. గురువులు, సాధువుల ఆశీస్సులు మనపై ఉన్నాయనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది.

 

మిత్రులారా,

ఈ సమాగమ్ నిరంతర యజ్ఞంలా కొనసాగుతోంది. ఈ ప్రయాణం గతేడాది నాగ్‌పూర్ పవిత్ర భూమి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్, నాందేడ్ చారిత్రక భూమిపై ఆ భక్తిభావం మరింత పెంపొందటం మనం చూశాం. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం కీలక ఘట్టాన్ని చేరుకుంది. ఈ ప్రయాణ సందేశం కేవలం మూడు నగరాలకే పరిమితం కాలేదు. శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ సాహసోపేత చరిత్ర మహారాష్ట్రలోని ప్రతిమూల, వేలాది గ్రామాలు, చిన్న పల్లెలకు కూడా చేరింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా.

మిత్రులారా,

శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ చేసిన మహోన్నత త్యాగ సంస్మరణార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కాసేపటి కిందట హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు దక్కింది. మన గురువులకు సంబంధించిన ప్రతి చారిత్రక సందర్భాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తుంది. మీ అందరికీ తెలుసు, శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ 400వ ప్రకాశ్ పర్వం, ఆయనకు అంకితమిచ్చిన స్మారక తపాలా బిళ్ల, ప్రత్యేక నాణెం విడుదల చేయటం, గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వం వంటివి - మన గురువులకు సంబంధించిన ప్రతి పండుగను, సందర్భాన్ని పూర్తి భక్తిశ్రద్ధలతో జరుపుకున్నాం. అంతేకాక సాహిద్ జాదాల గౌరవార్థం ఏటా వీర్ బాల్ దివస్‌ను జరుపుకునే జాతీయ సంప్రదాయాన్ని కూడా మనం ప్రారంభించాం.

మిత్రులారా,

కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయటం, శ్రీ హేమకుండ్ సాహిబ్ యాత్రకు నూతన సౌకర్యాల కల్పన.. సిక్కు సంస్థలు, గురుద్వారాలతో ముడిపడున్న అనేక సంస్థలకు ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల్లో మినహాయింపు ఇవ్వటం, పాఠ్యాంశాల్లో, సాంస్కృతిక చర్చల్లో సిక్కు చరిత్రకు సముచిత స్థానం కల్పించటం వంటివి - దశాబ్దాలుగా సిక్కు సోదరీసోదరులు ఎదురుచూస్తున్న ఎన్నో పనులను పూర్తి చేసే భాగ్యం మనకు దక్కింది.

 

సోదరీసోదరులారా,

సిక్కులకు గౌరవం కల్పించటం, వారికి న్యాయం చేకూర్చటానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది. ఈ నిబద్ధత కారణంగానే 1984 అల్లర్లపై విచారణకు సిట్‌ని ఏర్పాటు చేశాం. గతంలో మూసివేసిన 1984 అల్లర్ల కేసును తిరిగి విచారణ జరిపించాం. ఎన్నో కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేశాం. 1984 అల్లర్ల కేసులో బాధిత కుటుంబాలకు అదనపు పరిహారాన్ని అందించాం. జాతీయ మైనారిటీ కమిషన్‌కు క్రియాశీల పాత్రను కల్పించాం. అదేవిధంగా ఆప్ఘానిస్తాన్‌లోని సిక్కు సోదరుల భద్రత, గురుగ్రంథ్ సాహిబ్ గౌరవం వంటి అంశాలపై మా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది. గురుగ్రంథ్ సాహిబ్ స్వరూపాలను భద్రంగా, సగౌరవంగా తిరిగి తీసుకువచ్చాం. ఆప్ఘాన్ సిక్కులకు, హిందువులకు పౌరసత్వం కల్పించే మార్గాన్ని సుగమం చేశాం. సీఏఏ ద్వారా వేధింపులకు గురైన సిక్కు శరణార్థులకు మేం ఉపశమనం కలిగించాం. జమ్మూకాశ్మీర్‌లోని సిక్కు కుటుంబాలకు పునరావాస ప్యాకేజీలను అందించాం. ఓసీఐ, వీసా నిబంధనలను సరళీకరించాం. గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వేలాది మంది సిక్కుల పేర్లను జాబితా నుంచి తొలగించాం. విదేశీ సిక్కులు భారతదేశానికి రాకపోకలు సాగించే ప్రక్రియను సులభతరం చేశాం.

 

మిత్రులారా,

సిక్కు సమాజం విశ్వాసాల పట్ల గౌరవం, వారి పురోగతికి నూతన అవకాశాలను కల్పించటం వంటి వాటిని మా బాధ్యతగానే కాకుండా, ఈ సేవను మా అదృష్టంగా భావిస్తున్నాం.

మిత్రులారా,

శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ కాలంలో సత్యం, ధైర్యం కోసం నిలబడాలన్న స్ఫూర్తికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో నేటికీ అలాగే ఉంది. ఈ సమాగమ్ ప్రధాన ఉద్దేశం.. ఎప్పుడైతే నవతరం ఈ విలువలను అందిపుచ్చుకుంటుందో అప్పుడు సంప్రదాయం కేవలం జ్ఞాపకంగా మిగిలిపోదు, భవిష్యత్తు వైపు నడిపించే మార్గంగా మారుతుంది. మనం చరిత్రను కేవలం గుర్తుంచుకోవటమే కాక, జీవితాచరణలో భాగం చేసుకోవాలి. ఈ భావనతో ఈ ప్రవిత్ర సమాగమ్‌తో ముడిపడున్న నిర్వాహకులందరికీ సంగత్‌కు నేను మరోసారి భక్తిపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఈ చారిత్రాత్మక ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాహేగురు జీ కా ఖల్సా, వాహేగురు జీ కీ ఫతే.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi