నమో బుద్ధాయ!

థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ సంవాద్ (SAMVAD) కార్యక్రమంలో మీ అందరితో భేటీ కావడం నాకు దక్కిన గౌరవం. థాయిలాండ్‌తోపాటు భారత్, జపాన్ కు చెందిన అనేక మంది ప్రముఖులు, ప్రధాన సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాలుపంచుకొంటున్నాయి. వారు చేస్తున్న ప్రయత్నాలకు గాను వారికి నా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ సందర్భంగా నేను నా స్నేహితుడు షింజో ఆబెను స్మరించుకొంటున్నాను. ఆయనతో నేను అనేకసార్లు మాట్లాడాను. ‘సంవాద్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన మాకు 2015లో వచ్చింది. అది మొదలు, చర్చలను, సంభాషణలను, విస్తృత అవగాహనను ప్రోత్సహిస్తూ అనేక దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మిత్రులారా,

సంవాద్ శ్రేణిలో భాగంగా ఈ సంచికను థాయిలాండ్‌లో నిర్వహిస్తుండడం చూసి నేను సంతోషిస్తున్నాను. థాయలాండ్‌కంటూ ఒక సంపన్న సంస్కృతి, చరిత్ర, వారసత్వం ఉన్నాయి. ఆసియా ఖండంలోని ఉమ్మడి తాత్విక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఇది ఒక సుందర తార్కాణంగా విరాజిల్లుతోంది.

మిత్రులారా,

భారత్, థాయిలాండ్‌లు రెండు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి ప్రగాఢమైన సాంస్కృతిక సంబంధాల్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. రామాయణం, రామకియన్ మన ప్రజల్ని కలుపుతున్నాయి. భగవాన్ బుద్ధుడంటే మనకున్న భక్తిభావం మనల్ని ఏకం చేస్తోంది. కిందటి సంవత్సరం మేం బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాల్ని థాయిలాండుకు పంపించిన సమయంలో, లక్షలాది మంది వాటిని సందర్శించారు. మన దేశాల మధ్య అనేక రంగాల్లో కూడా చైతన్య భరిత భాగస్వామ్యం ఉంది.  థాయిలాండ్ అనుసరిస్తున్న ‘యాక్ట్ వెస్ట్’ విధానం, భారత్ అవలంబిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానం.. ఇవి ఒకదానికి మరొకటి పరస్పర పూరకాలుగా ఉంటూ, మన రెండు దేశాల్లోనూ ప్రగతినీ, సమృద్ధినీ విస్తరించేటట్టు చేస్తున్నాయి. ఈ సమావేశం మన మైత్రీ గ్రంథంలో మరో ఫలప్రద అధ్యాయాన్ని లిఖిస్తోంది.

 

మిత్రులారా,

సంవాద్‌ కోసం ఎంచుకొన్న ఇతివృత్తం ఆసియా శతాబ్ది గురించి చెబుతోంది. ప్రజలు ఈ మాటను పలికినప్పుడల్లా వారు ఆసియా ఆర్థిక ఉన్నతిని గురించే ప్రస్తావిస్తుంటారు. ఏమైనా, ఈ సమావేశం ఆసియా శతాబ్ది అంటే అది ఒక్క ఆర్థిక రీత్యానే కాక సాంఘిక విలువల్ని గురించి కూడా ప్రధానంగా చెబుతుంది. భగవాన్ బుద్ధుని వచనాలు శాంతిపూర్వక, ప్రగతిశీల యుగాన్ని ఆవిష్కరించడంలో ప్రపంచానికి మార్గదర్శనం చేయగలుగుతాయి. ఆయన అందించిన జ్ఞానబోధ మానవుడికి పెద్దపీట వేసే భవిత దిశగా మనం సాగిపోవడానికి మనకు తగిన శక్తిని ప్రసాదిస్తుంది.

మిత్రులారా,

సంఘర్షణల్ని (లేదా వివాదాల్నీ) నివారించడం సంవాద్ ప్రధాన ఇతివ‌త్తాల్లో ఒకటిగా ఉంది. మనం నడిచే దారే సరైంది. ఇతరులు నడుస్తున్న బాట అక్రమమైందన్న భావనలో నుంచే తరచుగా సంఘర్షణ గానీ, వివాదం గానీ తలెత్తుతాయి. ఈ అంశంలో భగవాన్ బుద్ధుడు లోతైన అవగాహనను కలిగించాలని ఇలా చెప్పారు.. :

‘‘ఇమేసు కిర్ సజ్జన్తి, ఏకే సమణబ్రాహ్మణా.

విగ్గయ్హ నం వివదన్తి.

జనా ఏకంగదస్సినో.’’

ఈ మాటలకు.. కొంత మంది తమ అభిప్రాయాలనే బలంగా పట్టుకు వేలాడుతారు. వారు ఒక వైపును మాత్రమే సత్యం అనుకొని వాదిస్తూ ఉంటారు.  అయితే ఒకే విషయంలో అనేక దృష్టికోణాలు ఉండవచ్చు.. అని అర్థం. ఈ కారణంగానే రుగ్వేదం ఏమని చెబుతోందంటే..:

‘ఏకం సద్‌విప్రా బహుధా వదన్తి’ అని చెబుతోంది.

ఈ మాటలకు ..సత్యాన్ని వేరువేరు కటకాలలో నుంచి చూడవచ్చని మనం ఒప్పుకొన్నామంటే, అప్పుడు మనం సంఘర్షణ, లేదా వివాదం రేకెత్తకుండా చూసుకోవచ్చనేదే  భావం.

మిత్రులారా,

సంఘర్షణ లేదా వివాదం తలెత్తడానికి మరో కారణం ఇతరులను మన కన్నా మౌలికంగా భిన్నమైన వారుగా అవగతం చేసుకోవడం. భిన్నాభిప్రాయాలు దూరానికి చోటిస్తాయి. మరి దూరం వైమనస్యానికి గాని లేదా తగవుకు దారితీయవచ్చు. దీనిని పరిహరించడానికి, ధమ్మపదం ఇలా చెబుతోంది..:

సబ్బే తసన్తి దండస్స, సబ్బే భాయన్తి మచ్చునో.

అత్తానం ఉపమం కత్వా, న హనేయ్య న ఘాతయే.

దీనికి అర్థం - నొప్పి అన్నా మరణం అన్నా ప్రతి ఒక్కరికీ భయమే. మనలాగానే ఇతరులు కూడా అని తెలుసుకోవడం ద్వారా ఎలాంటి హాని గానీ, లేదా హింస గానీ జరగకుండా మనం జాగ్రత తీసుకోవచ్చు.. అని.

మిత్రులారా,

సంతులిత వైఖరికి బదులు తీవ్ర వైఖరులను అనుసరించడం వల్లనే ప్రపంచంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తీవ్ర స్థాయి ఆలోచనలు సంఘర్షణలకు, పర్యావరణ సంకటాలకు, చివరకు ఒత్తిడిని కలిగించే ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ తరహా సవాళ్లకు బుద్ధ భగవానుని ప్రబోధాల్లో పరిష్కారం లభిస్తుంది. తీవ్ర వైఖరుల జోలికి పోకుండా ఉండడానికి మధ్యే మార్గాన్ని అనుసరించండని ఆయన మనకు సూచించారు. మితవాద సిద్దాంతం ఈనాటికీ సందర్భోచితమైందే, అది ప్రపంచ సవాళ్లను పరిష్కారాల్ని కనుగొనడంలో మార్గదర్శనాన్ని అందిస్తుంది. 

 

మిత్రులారా,

ప్రస్తుతం, సంఘర్షణలు ప్రజాబాహుళ్యాన్నీ, దేశాలనీ దాటి పాకిపోతున్నాయి. ప్రకృతితో సంఘర్షించే స్వభావాన్ని మానవత అంతకంతకు పెంచేసుకొంటోంది. ఇది పర్యావరణ సంకట స్థితికి దారితీసింది. ఈ స్థితి మన భూగ్రహం మనుగడనే బెదరిస్తోంది. ధమ్మ సిద్ధాంతాల పునాదిపై నిలిచి ఉన్న ఆసియా ఉమ్మడి విలువల్లో ఈ సవాలుకు సమాధానం లభిస్తుంది. హిందుత్వం, బౌద్ధం, షింటోవాదం, ఇంకా ఆసియాలోని ఇతర సిద్ధాంతాలు ప్రకృతితో సామరస్యపూర్వకంగా జీవించాలని మనకు బోధిస్తున్నాయి. మనలను మనం ప్రకృతి కన్నా వేరుగా చూడం, అంతకన్నా ప్రకృతిలో మనం ఒక భాగమని భావిస్తున్నాం. మహాత్మా గాంధీ చెప్పిన ధర్మకర్తృత్వ భావనను మనం నమ్ముతాం. ఇవాళ ప్రగతి సాధన కోసం ప్రాకృతిక వనరుల్ని ఉపయోగించుకొనే ప్రక్రియలో, మనం భావి తరాల వారి విషయంలో మనకున్న బాధ్యతను గురించి కూడా తప్పక పరిశీలించాలి.  వనరులను వృద్ధి కోసం తప్ప అత్యాశకు ఉపయోగించుకోకుండా ఈ దృష్టికోణం దోహదపడుతుంది.

మిత్రులారా,

నేను వడ్‌నగర్‌లో పుట్టాను. భారతదేశ పశ్చిమ ప్రాంతంలో అదొక చిన్న పట్టణం. అది ఒకప్పుడు బౌద్ధ విజ్ఞానార్జనకో ప్రధాన కేంద్రం. భారత పార్లమెంటులో నేను వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. సారనాథ్ ఉన్నది కూడా వారణాసిలోనే. భగవాన్ బుద్ధుడు సారనాథ్‌లో తన మొదటి అభిభాషణను లేదా ప్రవచనాన్నిచ్చారు. బుద్ధ భగవానునితో అనుబంధం కలిగి ఉన్న స్థలాలు నా జీవనయానాన్ని తీర్చిదిద్దడం సుందర యాదృచ్ఛిక ఘటనలంటాను.

మిత్రులారా,

బుద్ధ భగవానుడంటే మాలో ఉన్న భక్తిభావం మా ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబిస్తోంది. బుద్ధిస్ట్ సర్క్యూట్‌లో భాగంగా ప్రధాన బౌద్ధ స్థలాలను కలుపుతూ పర్యటక మేం మౌలిక సదుపాయాల్ని తీర్చిదిద్దాం. ఈ సర్క్యూట్ పరిధిలో యాత్రలను సుగమం చేయడానికి ‘బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఒక ప్రత్యేక రైలును తీసుకువచ్చాం. కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభంచడం బౌద్ధ యాత్రికులకు మేలు చేసే చరిత్రాత్మక నిర్ణయం. ఈ మధ్యే, మేం బోధ్ గయలో మౌలిక సదుపాయాలను పెంచే దృష్టితో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుచేయనున్నట్లు ప్రకటించాం. భగవాన్ బుద్ధుని భూమి భారత్‌ను సందర్శించాల్సిందిగా ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికుల్ని, పండితుల్ని, సన్యాసుల్ని నేను స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

నలందా మహావిహార చరిత్రలోకెల్లా అత్యంత గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటి. దీనిని కొన్ని ఆక్రమణదారు శక్తులు వందల ఏళ్ల కిందట ధ్వంసం చేసేశాయి. అయితే మేం మా దృఢత్వాన్ని పరిచయం చేస్తూ దీనిని ఒక జ్ఞాన కేంద్రంగా పునరుద్ధరించాం. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో నలందా విశ్వవిద్యాలయం తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందుతుందని నేను విశ్వసిస్తున్నాను. బుద్ధ భగవానుడు తన బోధనలను అందించిన పాలీ భాషను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక ముఖ్య చర్యను తీసుకున్నాం. ఈ భాషలో ఉన్న సాహిత్యాన్ని సంరక్షించే విషయంలో జాగ్రతలు తీసుకొంటూ, మా ప్రభుత్వం పాలీని శాస్త్రీయ భాషగా ప్రకటించింది. దీనికి అదనంగా, ప్రాచీన చేతిరాత పుస్తకాల్ని వర్గీకరించి, క్రోడీకరించడానికి జ్ఞాన్ భారతమ్ మిషనును మేం ప్రారంభించాం. ఇది బౌద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకొనే పండితులకు మేలు చేయాలనే ఉద్దేశంతో డాక్యుమెంటేషనుతోపాటు డిజిటలీకరణను ప్రోత్సహించనుంది.

మిత్రులారా,

గత పది సంవత్సరాల్లో, మేం బుద్ధ భగవానుని బోధనలను వ్యాప్తి చేయడానికి అనేక దేశాలతో సమన్వయాన్ని ఏర్పరుచుకొన్నాం. ఇటీవలే, ‘ఆసియాను బలపరచడంలో బుద్ధ ధమ్మ పాత్ర’ ఇతివృత్తంతో తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సును భారత్‌లో నిర్వహించారు. అంతకన్నా ముందు, మొదటి ప్రపంచ స్థాయి బౌద్ధ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్నిచ్చింది. ‘ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్’కు నేపాల్‌లోని లుంబినిలో శంకుస్థాపన చేసే గౌరవం నాకు దక్కింది. లుంబిని మ్యూజియం నిర్మాణానికి కూడా భారత్ సాయాన్నందించింది. ఇంకా, భగవాన్ బుద్ధుని కన్ సైజ్ ఆర్డర్స్’, 108 సంపుటాల మంగోలియా కంజుర్ లను భారతదేశంలో పునర్ముద్రించారు. వీటిని మంగోలియాలోని మఠాలలో పంపిణీ చేశారు. చాలా దేశాల్లో కట్టడాల్ని సంరక్షించడానికి మేం చేస్తున్న ప్రయత్నాలు బుద్ధ భగవానుని వారసత్వాన్ని పరిరక్షించాలన్న మా నిబద్ధతకు మరింత బలాన్నిచ్చేవే.   

మిత్రులారా,

సంవాద్‌ తాజా సంచిక ధార్మిక రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆతిథ్యాన్నిస్తూ, వివిధ ధార్మిక ప్రముఖుల్ని ఒక చోటుకు తీసుకువస్తుండటం ఉత్తేజకరంగా ఉంది. ఈ వేదిక విలువైన లోతైన అవగాహనల్ని అందించి, మరింత సామరస్యపూర్వకంగా ఉండే ప్రపంచాన్ని సాకారం చేయగలదన్న నమ్మకం నాలో ఉంది. ఈ సమావేశాన్ని నిర్వహించినందుకుగాను థాయిలాండ్ ప్రజలకు, థాయిలాండ్ ప్రభుత్వానికి నేను మరోసారి నా కృత‌జ్ఞత‌ల్ని తెలియజేస్తున్నాను. ఈ ఉదాత్త మిషనును ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడకు తరలివచ్చిన వారందరికీ నేను నా శుభాకాంక్షలు వ్యక్తం చేస్తున్నాను.  మనమొక శాంతిభరిత, ప్రగతిశీల, సమృద్ధియుక్త యుగం దిశగా పయనించడంలో ధమ్మ కాంతి మనకు దారిని చూపుతూ ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Co, LLP registrations scale record in first seven months of FY26

Media Coverage

Co, LLP registrations scale record in first seven months of FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 నవంబర్ 2025
November 13, 2025

PM Modi’s Vision in Action: Empowering Growth, Innovation & Citizens