అధ్యక్షులకు,

ప్రముఖులకు,

ఈ రోజు సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విస్తరించిన బ్రిక్స్ కుటుంబంగా మనం ఈ రోజు మొదటిసారి కలుసుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో చేరిన కొత్త స్నేహితులందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను.

గత ఏడాది కాలంగా బ్రిక్స్ అధ్యక్ష పదవిని రష్యా విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ ను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,
యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో మన సమావేశం జరుగుతోంది. ప్రపంచం ఉత్తర-దక్షిణ దేశాలుగా విడిపోయిందని, తూర్పు-పడమర దేశాలుగా విడిపోయిందనీ చర్చించుకుంటున్నారు.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, నీటి భద్రత వంటి అంశాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రాధాన్యాంశాలు.

ఇంకా, ఈ సాంకేతిక యుగంలో సైబర్ డీప్ ఫేక్, తప్పుడు సమాచారం వంటి కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి.

ఇలాంటి సమయంలో బ్రిక్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన, సమ్మిళిత వేదికగా బ్రిక్స్ అన్ని రంగాల్లో సానుకూల పాత్ర పోషించగలదని నేను విశ్వసిస్తున్నాను.

ఈ సందర్భంలో మన విధానానికి ప్రజలే కేంద్ర బిందువుగా ఉండాలి. బ్రిక్స్ విచ్ఛిన్నకర సంస్థ కాదని, మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలి.

చర్చలకు, దౌత్యానికి మనం మద్దతు ఇస్తున్నాం కానీ, యుద్ధానికి కాదు. కోవిడ్ వంటి సవాలును మనం కలిసి అధిగమించగలిగినట్లే రాబోయే తరాలకు సురక్షితమైన, బలమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం కొత్త అవకాశాలను మనం ఖచ్చితంగా సృష్టించగలం.

ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక వనరుల్ని అడ్డుకోవడానికి మన అందరికి ఒకే సంకల్పం, దృఢమైన మద్దతు అవసరం. తీవ్రమైన ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు. మన దేశాల్లో యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా అరికట్టేందుకు క్రియాశీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం విషయంలో  ఐక్యరాజ్యసమితిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశంపై మనం కలిసి పనిచేయాలి.

అదేవిధంగా, సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ కోసం అంతర్జాతీయ నిబంధనలపై కూడా మనం పనిచేయాలి.

మిత్రులారా,

బ్రిక్స్ లో భాగస్వామ్య దేశాలుగా కొత్త దేశాలను ఆహ్వానించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

ఈ విషయంలో అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకోవాలి. బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యుల అభిప్రాయాలను గౌరవించాలి. జొహానెస్ బర్గ్ శిఖరాగ్ర సమావేశంలో అనుసరించిన మార్గదర్శక సూత్రాలు, ప్రమాణాలు, ప్రాధాన్యతలు, విధానాలకు అన్ని సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు కట్టుబడి ఉండాలి.

మిత్రులారా,

బ్రిక్స్... కాలంతో పాటు అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న సంస్థ. మనదైన ఉదాహరణను ప్రపంచానికి అందించడం ద్వారా మనం సమష్టిగా, ఐక్యంగా అంతర్జాతీయ సంస్థల సంస్కరణల కోసం గళం విప్పాలి.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులు, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికతో ముందుకు సాగాలి.

బ్రిక్స్ లో మన ప్రయత్నాలను మనం ముందుకు తీసుకువెళుతున్నప్పుడు, ఈ సంస్థ ప్రపంచ సంస్థలను సంస్కరించే ఉద్దేశంతో ఉంది తప్ప వాటిని మార్చి, వాటి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందనే అపఖ్యాతి పొందకుండా జాగ్రత్త పడాలి.

అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్స్, జి 20 ప్రెసిడెన్సీ సమయంలో, భారతదేశం ఈ దేశాల గొంతులను ప్రపంచ వేదికపై వినిపించింది. బ్రిక్స్ ద్వారా కూడా ఈ ప్రయత్నాలు బలపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గత ఏడాది ఆఫ్రికా దేశాలు బ్రిక్స్ లో విలీనం అయ్యాయి. 

ఈ ఏడాది కూడా, గ్లోబల్ సౌత్‌లోని అనేక దేశాలను రష్యా బ్రిక్స్ లోకి ఆహ్వానించింది.

మిత్రులారా,

విభిన్న దృక్పథాలు, సిద్ధాంతాల సమ్మేళనంతో ఏర్పడిన బ్రిక్స్ కూటమి ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. సానుకూల సహకారాన్ని పెంపొందిస్తోంది. 

మన భిన్నత్వం, పరస్పర గౌరవం, ఏకాభిప్రాయం ఆధారంగా ముందుకు సాగే మన సంప్రదాయమే మన సహకారానికి ఆధారం. మన ఈ లక్షణం, మన బ్రిక్స్ స్ఫూర్తి ఇతర దేశాలను కూడా ఈ వేదిక వైపు ఆకర్షిస్తున్నాయి. రాబోయే కాలంలో మనందరం కలిసి ఈ ప్రత్యేక వేదికను చర్చలు, సహకారం, సమన్వయానికి ఒక నమూనాగా మారుస్తామని నేను విశ్వసిస్తున్నాను.

ఈ విషయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశంగా భారత్ ఎల్లప్పుడూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటుంది.

మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 డిసెంబర్ 2025
December 07, 2025

National Resolve in Action: PM Modi's Policies Driving Economic Dynamism and Inclusivity