సమూల మార్పులు, శాశ్వత ఫలితాల కోసం సమాజం, ప్రభుత్వం సమష్టిగా పనిచేయడం అవసరం... క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా విద్యారంగంలోని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి... జాతీయ విద్యావిధానం దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ: ప్రధాని
చిన్న పట్టణాల్లోనే ఆవిర్భవిస్తున్న ప్రధాన అంకుర సంస్థలు... స్టార్టప్‌ల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం... ఒకప్పుడు ప్రమాదకరమైనవిగా భావించిన రంగాలను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తున్న యువత: పీఎం
కొవిడ్-19 ఈ శతాబ్దంలో అతి పెద్ద సంక్షోభమైతే.. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభం, మహమ్మారిని సమష్టిగా ఎలా ఎదుర్కొన్నామో, ఈ అనిశ్చితిని కూడా అలాగే అధిగమిస్తాం: పీఎం
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ ప్రభావం మన పౌరులపై అతి తక్కువగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: పీఎం
భారతీయ పౌరులుగా మన విధులకు మనం ప్రాధాన్యమివ్వాలి, గడచిన దశాబ్దాల్లో యుద్ధాలు లేదా ఇతర సంక్షోభాలను దేశం ఎదుర్కొన్నప్పుడు.. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి పౌరుడూ తమ బాధ్యతలను నెరవేర్చడానికి ముందుకొచ్చారు, ఇప్పుడు మరోసారి మన బాధ్యతలు సమష్టిగా నిర్వర్తించి, దేశ వనరులపై పడిన భారాన్ని తగ్గించాల్సిన అవసరం మరోసారి ఏర్పడింది: ప్రధాని
మన ప్రయత్నాల ద్వారా దిగుమతుల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి, విదేశీ మారక నిల్వలను తగ్గించే వ్యక్తిగత కార్యకలాపాలను కూడా నివారించాలి:పీఎం
‘ఓకల్ ఫర్ లోకల్’ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది, విదేశీ వస్తువులకు బదులుగా స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలి, మన గ్రామాలు, నగరాలు, దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయాలి: పీఎం
ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు
ఈ రోజు శంకుస్థాపన చేసిన వసతి గృహం కూడా దేశంలో బాలికలకు విద్యను అందిచడంలో సర్దార్ ధామ్ కనబరుస్తున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది‌‌’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు
అప్రెంటిస్ షిప్ అవకాశాలతో యువత డిగ్రీలను పూర్తి చేయాలి. ఫలితంగా పట్టభద్రులైన అనంతరం గందరగోళానికి గురి కాకుండా ఉంటారు’’ అని శ్రీ మోదీ తెలిపారు
ఈ రాష్ట్ర యువతకు సహజసిద్ధంగా ఉన్న వ్యాపార నైపుణ్యాన్ని స్టార్టప్ ఇండియా మిషన్ విధానాల ద్వారా మరింత ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు

భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

ప్రజాదరణ పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి, వ్యవస్థాపక ట్రస్టీ మన్‌సుఖ్ మాండవీయ, సర్దార్‌ధామ్ అధ్యక్షుడు గగ్జీ భాయ్ సుతారియా, దుష్యంత్ భాయ్ పటేల్, పంకజ్ భాయ్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ, వేదికపైనున్న గుజరాత్ మంత్రులు, దాతలు, ట్రస్టీలు, విశిష్ట అతిథులు, గుజరాత్ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదరీసోదరులందరికీ నమస్కారం.

పవిత్రమైన పండగ లాంటి రోజు ఇది. ఇక్కడికి రావటానికి ముందుగా నేను సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాను. సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ట జరిగి ఇవాళ్టికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం వల్లే సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత్ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ రోజునే వడోదరాలో సర్దార్‌ధామ్‌కు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగటం విశేషం. డాక్టర్ దుష్యంత్, దక్షా పటేల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, విద్యా సహాయక పథకం ప్రారంభం, నూతన ప్రాజెక్టుల భూమిపూజ వంటి కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో దేశ నిర్మాణానికి శక్తిమంతమైన సాధనాలుగా మారతాయి. ఈ సంస్థలు యువత భవిష్యత్తుకు కీలక మార్గాలుగా నిలుస్తాయి. ఇలాంటి గొప్ప కార్యానికి పూనుకున్న మీ అందరికీ, సమాజంలోని ప్రతి సభ్యునికి అభినందనలు.

మిత్రులారా,

ఇవాళ మీ అందరి మధ్యకు రావటం చాలా ఆనందంగా ఉంది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నెలకొల్పాయి. దానితో పాటు మీరంతా కలిసి సరికొత్త చరిత్రను సృష్టించారు. గుజరాత్‌లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రత్యేకమైనవి. దేశవ్యాప్తంగా అందరూ ఈ ఫలితాల గురించి చర్చించుకుంటున్నారు.

 

మిత్రులారా,

రాజకీయ స్థిరత్వానికి గుజరాత్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తారు. రాజకీయాల్లో దూరదృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. రాజకీయ స్థిరత్వాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే రాజకీయ స్థిరత్వం నెలకొంటుందో అప్పుడే ఆర్థిక వృద్ధి వేగాన్ని పుంజుకుంటుంది. ఈ సూత్రాన్ని గుజరాత్ ఎప్పుడో అర్థం చేసుకుంది. గుజరాత్ వృద్ధిలోనూ, వరుస ఎన్నికల విజయాల్లోనూ ఇది స్పష్టమవుతోంది.

మిత్రులారా,

మీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, మీ అందరి మధ్యకు రావటం నాకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. సొంతింటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే మీ మధ్యలో ఉన్నప్పుడు సమాజంలోని శక్తిని నేను అనుభూతి చెందుతాను. మనందరికీ తెలుసు.. సమాజ సమష్టి శక్తి వల్లే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. ప్రత్యేకించి ఏ సమాజాలైతే విద్యకు ప్రాధాన్యతనిచ్చి, విద్యా రంగంలో సమాన అవకాశాలు కల్పిస్తాయో.. అవి పురోగతి సాధిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాయి.

సోదరీసోదరులారా,

సర్దార్‌ధామ్ ప్రతి ప్రయత్నంలోనూ, అవకాశం దొరికిన ప్రతీసారి మీకు అండగా ఉండేందుకు నేను ప్రయత్నిస్తాను. గగ్జీభాయ్ ఇందాక చెప్పినట్లుగా 2021లో అహ్మదాబాద్‌లో జరిగిన సర్దార్‌ధామ్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అక్కడ బాలికల హాస్టల్‌కు శంకుస్థాపన జరిగింది. దాన్ని గతేడాది ప్రారంభించారు. నేడు వేలాదిమంది ఆడబిడ్డలు అక్కడ విద్యనభ్యసిస్తూ, తమ కలలకు దిశానిర్దేశం చేసుకుంటున్నారు. సూరత్, రాజ్‌కోట్, భుజ్, మెహసానా, ఢిల్లీలో సర్దార్‌ధామ్‌కు చెందిన ఎన్నో సంస్థలు యువత భవిష్యత్తునుల తీర్చిదిద్దుతున్నాయి. ఇవాళ కూడా అహ్మదాబాద్‌లోని నికోల్‌లో వెయ్యిమంది బాలికలకు వసతి కల్పించేలా నూతన హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

 

మిత్రులారా,

మార్పు విస్తృతంగా, దాని ఫలితాలు శాశ్వతంగా ఉండాలంటే ప్రజలు, ప్రభుత్వం కలిసి పని చేయాలి. ప్రస్తుతం విద్యా రంగంలో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. జాతీయ విద్యా విధానమే ఇందుకు ప్రధాన ఉదాహరణ. నేడు యువతకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. భాషా ప్రాతిపాదికన ఉన్న వివక్ష అంతమవుతోంది. ఇప్పుడు విద్య కేవలం పుస్తకాలు, డిగ్రీలకే పరిమితం కావటం లేదు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలను కూడా విద్యలో అంతర్భాగం చేశారు. పరిశోధనలపై ఆసక్తి గల యువతకు సరైన వాతావరణం ఉంటుంది. డిగ్రీలు పూర్తయిన తర్వాత అనుభవం లేకపోవటం వల్ల యువత అయోమయంలో పడకుండా ఉండేందుకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందుతున్నాయి. భవిష్యత్తులో దేశంలో ఎంతటి నైపుణ్యం గల సిబ్బంది ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. దీనివల్ల భారత తయారీ రంగానికి పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

సహజంగానే గుజరాత్ యువతకు పారిశ్రామికవేత్తలుగా రాణించగల సత్తా ఉంది. వారి కలల సాకారానికి స్టార్టప్ ఇండియా మిషన్ దోహదపడుతుంది. చిన్న పట్టణాల్లోని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. చిన్న నగరాల నుంచి పెద్ద అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంకుర సంస్థల్లో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. ఒకప్పుడు సాహసోపేతమని భావించిన రంగాలు ఇప్పుడు యువతకు ప్రాధాన్యతగా మారుతున్నాయి. క్రీడల నుంచి అంతరిక్ష సాంకేతికత వరకు గత 10 నుంచి 12 ఏళ్లుగా దేశం సాధించిన విజయాలే ఇందుకు అతిపెద్ద నిదర్శనం. దీనివల్ల మన గుజరాత్ బిడ్డలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారు.

మిత్రులారా,

సమాజంలో సగ భాగమైన మహిళల భాగస్వామ్యమే.. సమాజ పురోగతికి అత్యంత కీలకం. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల కిందటే గ్రహించిన గుజరాత్.. ఆ దిశగా పటిష్ఠమైన చర్యలు తీసుకుంది.

మిత్రులారా,

విజయవంతమైన గుజరాత్ నమూనానే దేశవ్యాప్తంగా పునరావృతమవుతోంది. నేడు కోట్లాది మంది మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయి. మరుగుదొడ్లు, నీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లను పొందారు. ముద్ర యోజన ద్వారా మహిళలు స్వావలంబన సాధిస్తున్నారు. కుటుంబ పరిధిలో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, మాతృవందన్ వంటి పథకాలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.

 

మిత్రులారా,

గతంలో అనేక రంగాల్లో ఆడపిల్లలకు అవకాశాలుండేవి కాదు. కానీ నేడు చాలా రంగాల్లో మహిళలు నాయకత్వ స్థాయిలో ఎదుగుతున్నారు. ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలు శిక్షణ పొందుతున్నారు. మన కుమార్తెలు ఫైటర్ పైలట్లుగా మారుతున్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాల వల్ల దానికి ఆమోదం లభించలేదు. కానీ.. మీకు, దేశంలోని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఈ దిశగా మా పోరాటం కొనసాగుతుంది.

మిత్రులారా,

ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశాలు కల్పించటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. సమాజ బాధ్యత కూడా. సర్దార్‌ధామ్ ఈ బాధ్యతను పూర్తి అంకితభావంతో నెరవేరుస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. ఈ ప్రయత్నాలకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

మారుతున్న కాలానికనుగుణంగా సమాజం అడుగులు వేయటం గుజరాత్‌కున్న అతిపెద్ద బలం. మార్పును అవకాశంగా మలచుకోవటం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటం, భవిష్యత్తుకు సిద్ధమవటం ఎల్లప్పుడూ గుజరాత్ పని సంస్కృతిలో భాగంగా ఉంటుంది. నేడు ప్రపంచం అత్యాధునిక సాంకేతికత వైపు పయనిస్తుంటే, గుజరాత్ కూడా నూతనోత్సాహంతో దూసుకుపోతోంది. సెమీకండక్టర్ తయారీ, ఏరోస్పేస్, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఆర్థిక సేవల్లో గుజరాత్ కొత్త గుర్తింపును ఏర్పరచుకుంటోంది. సనంద్‌లో మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ల ఉత్పత్తి జరుగుతోంది. కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. ధోలేరా, సూరత్‌లోనూ కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

 

మిత్రులారా,

ప్రపంచ సరఫరా వ్యవస్థలో ప్రధాన కేంద్రాలుగా భారతదేశాన్ని, గుజరాత్‌ను మార్చేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. రాబోయే ఏళ్లలో వడోదరా కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ తయారైన మెట్రో కోచ్‌లు ఇతర దేశాలకు ఎగుమతవుతున్నాయి. సావ్లీలో ఆధునిక రైలు వ్యవస్థలు, కోచ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇంజనీరింగ్, భారీ యంత్రాలు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, విద్యుత్ పరికరాలు, ఎంఎస్ఎంఈ రంగాల్లో బలమైన తయారీ కేంద్రంగా వడోదరా ఎదిగింది. ఇక్కడి గతి శక్తి విశ్వవిద్యాలయం రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఇప్పుడు ఏరోస్పేస్ రంగంలోనూ కొత్త గుర్తింపు దిశగా వడోదరా అడుగులు వేస్తోంది. ఇక్కడి విమానాల తయారీ ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది.

మిత్రులారా,

గుజరాత్‌లో, దేశంలోనూ జరుగుతున్న ఈ అభివృద్ధి ప్రయత్నాల మధ్య మరో అంశం రోజురోజుకీ సున్నితంగా మారుతోంది. కొన్నేళ్లుగా ప్రపంచం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొదట కరోనా సంక్షోభం, తర్వాత ఆర్థిక సవాళ్లు, ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఈ పరిస్థితులు నిరంతరం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. భారత్ పైనా వాటి ప్రభావం పడుతోంది. ఈ శతాబ్దపు అతిపెద్ద సంక్షోభం కరోనా అయితే.. పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటి. మనమంతా కలిసి మహమ్మారిని జయించినట్లే.. ఈ సంక్షోభాన్ని కూడా అధిగమిద్దాం.

ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి సమయంలో దేశానికి ప్రజా భాగస్వామ్య శక్తి అవసరం. భారత పౌరులుగా బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. గతంలోనూ దేశం యుద్ధాలను, పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ పిలుపు మేరకు పౌరుల బాధ్యతలను నెరవేర్చారు. దేశ వనరులపై భారాన్ని తగ్గించేందుకు ఇప్పుడు కూడా మనమంతా కలిసి పనిచేయాలి. పలు ఉత్పత్తుల దిగుమతికి లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ ఖర్చు చేస్తోంది. అదే సమయంలో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ప్రస్తుతం దేశం రెండు రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఒక్కో నీటి బొట్టుతో కుండ నిండినట్లుగా.. చిన్న చిన్న ప్రయత్నాలతో దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి. విదేశీ మారక ద్రవ్య ఖర్చుకు దారితీసే వ్యక్తిగత పనులకు దూరంగా ఉండాలి.

 

మిత్రులారా,

భారతదేశ దిగుమతుల్లో ముడి చమురు ప్రధానమైనది. ప్రపంచానికి చమురును సరఫరా చేసే ప్రాంతం, దురదృష్టవశాత్తు యుద్ధం, ఘర్షణలతో అట్టుడుకుతోంది. కాబట్టి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు మనమంతా చిన్న ప్రతిజ్ఞలు చేయాలి. నిన్న కర్ణాటక, తెలంగాణలోనూ ఇదే విషయం గురించి మాట్లాడాను. ఇవాళ గుజరాత్ లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. మీపై నాకున్న హక్కుతో ఎంతో ఆప్యాయంగా చెబుతున్నాను. వీలైనంతగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి. మెట్రో సర్వీసులు, ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను వినియోగించండి. కార్ పూలింగ్‌ను ప్రోత్సహించండి. కార్లు ఉన్నవారు ఇతరులతో కలిసి ప్రయాణించండి. ఎలక్ట్రిక్ వాహనాలున్నవారు ఇతరులకు సహాయం చేయటానికి ముందుకు రావాలి.

మిత్రులారా,

డిజిటల్ సాంకేతికత జీవితాలను సులభతరం చేసింది. దీనివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వర్చువల్ సమావేశాలకు, ఇంటి నుంచి పనిచేసే విధానాలకు ప్రాధాన్యతనివ్వటం చాలా ముఖ్యం. పాఠశాలలు కొంతకాలం పాటు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా.

మిత్రులారా,

కేవలం ఇంధనం మాత్రమే కాదు.. వంట నూనెల దిగుమతులకు కూడా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. వంట నూనెల వినియోగాన్ని తగ్గిస్తే.. దేశానికి, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా సూరత్ ప్రజలకు నేను ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతున్నాను.

మీ కుటుంబసభ్యుడిలా సోదరీసోదరులుకు ఒక విన్నపం చేస్తున్నాను. బంగారం దిగుమతి వల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా దేశం దాటి పోతుంది. పరిస్థితులు చక్కబడే వరకు దేశ ప్రజలంతా బంగారం కొనుగోలును వాయిదా వేయాలని కోరుతున్నా. ప్రస్తుతానికి బంగారం అవసరం అంతగా లేదు.

మిత్రులారా,

"ఓకల్ ఫర్ లోకల్" నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. విదేశీ వస్తువులకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులను వాడండి. మీ గ్రామాలు, పట్టణాలు, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయండి. ఇక్కడున్న వారిలో చాలామంది అద్భుతమైన, ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు.

 

మిత్రులారా,

మనలో చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. వ్యవసాయంలో స్వదేశీ ఎరువులను, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. డీజిల్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపులను తీసుకురావాలి. మనం రైతు బిడ్డలం. మన పొలాలను, భూమిని కాపాడుకోవటం ప్రథమ కర్తవ్యం. రసాయనిక ఎరువులతో నేలను మనం నాశనం చేసుకోకూడదు. మీ గ్రామంలోని ప్రతి రైతును రసాయనిక ఎరువుల నుంచి విముక్తి చేసి, ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించాలని మిమ్మల్ని కోరుతున్నా.

మిత్రులారా,

మీలో చాలా మందికి వర్తించే మరో ముఖ్యమైన విషయం... దయచేసి తప్పుగా భావించవద్దు. ఈ రోజుల్లో సెలవులు రాగానే పిల్లలను విదేశీ పర్యటనలకు పంపటం ఫ్యాషన్ గా మారింది. సెలవులను గడిపేందుకు ప్రజలు విదేశాలకు వెళ్తున్నారు. వేసవి సెలవులు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ధోరణి పెరుగుతుంది. గతంలో ప్రజలు నాకు ఆహ్వాన పత్రికలు పంపేవారు. ఇప్పుడు రావటం లేదు. ఎందుకంటే వివాహాలన్నీ విదేశాల్లోనే జరుగుతున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది.

మిత్రులారా,

ఒకసారి ఆలోచించండి. సెలవులను గడిపేందుకు భారతదేశంలో అందమైన ప్రదేశాలు లేవా? మన పిల్లలకు చరిత్రను నేర్పిద్దాం. మన ప్రాంతాల పట్ల గర్వపడేలా చేద్దాం. దేశవ్యాప్తంగానే విహారయాత్రలు చేయటం ఎంతో ముఖ్యం. వివాహాలకు భారత్ కంటే పవిత్రమైన ప్రదేశం మరొకటి ఉండదని నా విశ్వాసం. ఇక్కడ వివాహాలు జరిగితే.. మాతృభూమి మనల్ని ఆశీర్వదిస్తుంది.

వివాహ వేడుకల కోసం భారత్ లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. మనం వాటినే ఎంచుకోవాలి. గుజరాత్‌లోనే లెక్కలేనన్ని అందమైన ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా నా పాటిదార్ సోదరులకు నేను చెప్పేదేమిటంటే.. ఇకపై మీరు ఐక్యతా విగ్రహం వద్ద వివాహ వేడుకలను నిర్వహించాలి. అక్కడ ప్రతి జంటను స్వయంగా సర్దార్ పటేల్ ఆశీర్వదిస్తారు. శాంతి, ఆధ్యాత్మికత కోసం హరిద్వార్, రిషికేశ్‌లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో.. అదేవిధంగా ఐక్యతా విగ్రహం వద్ద కూడా వివాహాల కోసం అన్ని వసతులను అభివృద్ధి చేయాలి.

ఇటీవల కాలంలో ఐక్యతా విగ్రహం, ఏక్తా నగర్ ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మారాయి. వీలైనంత ఎక్కువ మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శించేలా ప్రోత్సహించాలని మనం సంకల్పించుకుందాం. విదేశాల్లో నివసించే భారతీయులందరికీ నేనొక విషయం చెబుతున్నా. భారతదేశాన్ని చూపించేందుకు విదేశీ కుటుంబాలను ప్రోత్సహించటం వారి బాధ్యత. భారత్, విదేశాల్లోనూ మీకు తెలిసిన, ఐక్యతా విగ్రహాన్ని సందర్శించని ప్రతి కుటుంబాన్ని కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లేలా ప్రోత్సహించండి. వివాహాలకు అద్భుతమైన గమ్యస్థానంగా ఏక్తా నగర్ మారగలదు. ఐక్యతా విగ్రహం వద్ద సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది కావటం మనకు గర్వకారణం. దీన్ని చూసిన ఏ భారతీయుడైనా గర్వంతో ఉప్పొంగిపోతాడు.

మిత్రులారా,

నేను చెప్పినవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలే. కష్టమైన పనులు చేయమని నేను మిమ్మల్ని కోరలేదు. కానీ గుర్తుంచుకోండి. 140 కోట్ల మంది భారతీయులు సంకల్పంతో కలిసి చేసే ఈ చిన్న ప్రయత్నాలే దేశానికి మహాశక్తిగా మారతాయి. 140 కోట్ల మంది ప్రజలు ఒక అడుగు ముందుకు వేస్తే.. దేశం 140 కోట్ల అడుగులు ముందుకు సాగుతుంది.

ఏ సంక్షోభం కూడా మన అభివృద్ధిని, పురోగతిని అడ్డుకోకుండా మనం మరోసారి ఏకమవ్వాలి. మనమంతా కలిసి ఈ తీర్మానాలను నెరవేర్చి, దేశాన్ని బలోపేతం చేస్తామనే నమ్మకం నాకుంది.

నేను గగ్జీ భాయ్‌కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు నన్ను సర్దార్ గౌరవ్ రత్న అవార్డుతో గౌరవించారు. సర్దార్ పటేల్ పేరుతో ఉన్న సత్కారం బాధ్యతను పెంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే.. గగ్జీ భాయ్ తెలివిగా నాకు ఈ బాధ్యతను ముడిపెట్టి, వెనకడుగు వేయవద్దని చెప్పారు. బహుశా సర్దార్ సాహెబ్ కలలను, ఆయన వదిలిన అసంపూర్ణ పనులను పూర్తి చేయాలని నా నుదుటి రాతలో ఉందేమో.

ఈ రోజు ఈ గౌరవాన్ని, అవార్డును అందుకున్న తర్వాత మీ అందరి ఆశీస్సులతో నేనొక హామీ ఇస్తున్నా. గుజరాత్ నేల నాకు ప్రసాదించిన శక్తి, విలువలతో సర్దార్ సాహెబ్ కలలను సాకారం చేసే విషయంలో నేనెప్పుడూ వెనకడుగు వేయను. నా గురించి గుజరాత్‌కు బాగా తెలుసు. వెనకడుగు వేయటం నా నిఘంటువులోనే లేదు.

ఈ గౌరవం నాకు ఎంతో విలువైనది. జనరల్ కరియప్ప గురించి నేనొక చిన్న కథ చదివాను. ఒకానొక సందర్భంలో సొంత గ్రామంలో ఆయన్ని సన్మానించేందుకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ఆయన ఎంతో సంతోషించారు. ఎందుకంత సంతోషంగా ఉన్నారని ప్రజలు ఆయన్ని అడిగినప్పుడు.. "సైనిక సంప్రదాయాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నాకు ఎన్నో గౌరవ వందనాలు, మర్యాదలు లభించాయి. కానీ సొంత గడ్డపై, మన వారి మధ్య లభించే గౌరవం వల్ల కలిగే అనుభూతే వేరు" అని ఆయన సమాధానమిచ్చారు.

భారతదేశం శక్తిమంతంగా మారుతున్న తరుణంలో నేడు భారత ప్రధానమంత్రికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కుతుంది. అయితే ఒక వ్యక్తికి సొంత ప్రజల నుంచి, సొంత కుటుంబం నుంచి ఆశీర్వాదాలు లభించినప్పుడు.. పని చేసే శక్తి రెట్టింపవుతుంది.

మీరందరూ ఈ సర్దార్ రత్న అవార్డు రూపంలో నాకు అందించిన ఆశీర్వాదాలకు ఎంతో కృతజ్ఞుడిని. ఈ గౌరవాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నాను.

మీరు ఏ ఆశయాలతో, సంకల్పాలతో ముందుకు సాగుతున్నారో.. వాటిని నెరవేర్చుకునేందుకు ఆ దేవుడు తగిన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. సర్దార్ పటేల్ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, పంకజ్ భాయ్ వంటి సహచరుల తోడ్పాటు మీకు నిరంతరం లభించాలని ఆకాంక్షిస్తున్నా. ఇక్కడున్న మన ముగ్గురి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పంకజ్ భాయ్, నరహరి అమీన్, నేను- మేమంతా నవనిర్మాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలమే. ఇవాళ పంకజ్ భాయ్ ఒక గొప్ప బాధ్యతను స్వీకరించటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

సర్దార్ వర్ధిల్లాలి! సర్దార్ వర్ధిల్లాలి! ధన్యవాదాలు. ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister hosts Commonwealth Games 2026 medal winners
August 09, 2026

The Prime Minister, Shri Narendra Modi today hosted India’s outstanding medal winners from the Commonwealth Games 2026 at 7 Lok Kalyan Marg. Shri Modi interacted with the athletes and heard about their experiences from the Games.

The Prime Minister said that the athletes’ achievements are a source of immense pride for the entire country and will inspire many youngsters to take up sports.

Shri Modi posted on X:

Delighted to host our outstanding medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg. Heard about their experiences from the Games.

Each one of them has made our nation proud through their exceptional performances. Their success will motivate many youngsters.