నేడు నియామక పత్రాలు అందుకున్న 51 వేలకు పైగా యువత
ఇటువంటి ఉద్యోగ మేళాల ద్వారా లక్షలాది మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు
వీరంతా ఇప్పుడు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు
అతిపెద్ద జనాభా, ప్రజాస్వామ్యం భారత్ బలంగా ప్రపంచం గుర్తించింది
అతిపెద్ద యువ జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ సొంతం
దేశంలో వృద్ధి చెందుతున్న అంకురసంస్థలు, ఆవిష్కరణలు, పరిశోధన రంగాలు
దేశ యువత సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నాయి
ప్రైవేట్ రంగంలోనూ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది
ఇటీవలే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికీ ఆమోదం
నేడు భారత్ ప్రధాన బలంగా మారిన తయారీరంగం
తయారీరంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం
తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ సంవత్సరం బడ్జెట్‌లో మిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రకటించాం
గత దశాబ్దంలో 90 కోట్లకు పైగా భారత పౌరులు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చారని తెలిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థ - ఐఎల్ఓ నివేదిక
ప్రపంచ బ్యాంకు వంటి ప్రధాన ప్రపంచస్థాయి సంస్థలు నేడు భారత్‌ను ప్రశంసిస్తున్నాయి
ప్రపంచంలోనే అత్యున్నత సమానత్వం

నమస్కారం!

కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ప్రజలు, ప్రజాస్వామ్యం.. ఈ రెండూ భారత్‌కు గల అపరిమిత శక్తులని ప్రపంచం నేడు గుర్తించింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన దేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. ఈ యువశక్తి దేశ ఉజ్వల భవితకు గొప్ప ఆస్తి, బలమైన భరోసా. ఈ శక్తినే సంక్షేమానికి సాధనంగా మలిచేలా మా ప్రభుత్వం రేయింబవళ్లూ కృషిచేస్తోంది. నేను ఇటీవలే అయిదు దేశాల్లో పర్యటించి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రతి దేశంలోనూ భారత యువశక్తిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ పర్యటనల సందర్భంగా కుదిరిన అన్ని ఒప్పందాలు దేశంలోనూ విదేశాల్లోనూ భారత యువతకు నిశ్చయంగా ప్రయోజనం చేకూరుస్తాయి. రక్షణ, ఔషధాలు, డిజిటల్ సాంకేతికత, ఇంధనం, అరుదైన భౌగోళిక ఖనిజాల వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాలు భారత్‌కు మున్ముందు విశేష ప్రయోజనాలను చేకూరుస్తాయి. అవి భారత తయారీ, సేవల రంగాలకు బలమైన ప్రోత్సాహాన్నిస్తాయి.

మిత్రులారా,

మారుతున్న కాలానికి అనుగుణంగా 21వ శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం కూడా మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త రంగాలు అనేకం వస్తున్నాయి. అందుకే గత దశాబ్ద కాలంగా యువతను ఈ మార్పులకు సన్నద్ధులను చేయడంపై భారత్ దృష్టి పెట్టింది. ఈ శకం అవసరాల దృష్ట్యా.. ప్రభుత్వం ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఆధునిక విధానాలనూ రూపొందించింది. అంకుర సంస్థల, ఆవిష్కరణలు, పరిశోధనలకు దేశంలో నేడు రూపొందుతున్న అనువైన వ్యవస్థ యువత సమర్థతను పెంచుతోంది. సొంతంగా అంకుర సంస్థలను ప్రారంభించాలనుకునే యువతను చూసినప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంకుర సంస్థలకు సంబంధించిన కొన్ని గణాంకాలను ఇప్పుడే డాక్టర్ జితేంద్ర సింగ్ మీ దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పంతో గొప్ప దార్శనికత, వేగం, శక్తియుక్తులతో ముందుకురుకుతున్న నా దేశ యువతను చూసి గర్విస్తున్నాను.

మిత్రులారా,

ప్రైవేటు రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై కూడా భారత ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇటీవలే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పేరిట ఓ కొత్త పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ప్రైవేటు రంగంలో మొదటి ఉద్యోగం పొందే యువతకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 15,000 అందిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే- మొదటి ఉద్యోగం మొదటి జీతానికి సంబంధించి ప్రభుత్వం చేయూతనిస్తోంది. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ. లక్ష కోట్ల బడ్జెటును కేటాయించింది. ఈ పథకం ద్వారా దాదాపు 3.5 కోట్ల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

మిత్రులారా,

నేడు తయారీ రంగం మన దేశానికిగల గొప్ప వరం. తయారీ రంగంలో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ రంగానికి ఊతమిచ్చేందుకు ‘మిషన్ మాన్యుఫాక్చరింగ్’ను ప్రారంభించినట్లు ఈ ఏడాది కేంద్ర బడ్జెటులో ప్రభుత్వం ప్రకటించింది. కొన్నేళ్లుగా ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని మేం బలోపేతం చేశాం. ఒక్క పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) పథకం ద్వారానే దేశంలో 11 లక్షలకు పైగా ఉద్యోగాలు లభించాయి. ఇటీవల మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ రంగాలు మునుపెన్నడూ లేనిరీతిలో వృద్ధిని సాధించాయి. గత 11 ఏళ్లలో ఇందులో అయిదు రెట్ల వృద్ధి నమోదైంది. నేడు భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ దాదాపు రూ. 11 లక్షల కోట్లు. అంతకుముందు భారత్‌లో 2 లేదా 4 మాత్రమే మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు ఉండేవి. నేడు మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన దాదాపు 300 యూనిట్లున్నాయి. లక్షలాది యువతకు అవి ఉద్యోగాలను అందిస్తున్నాయి. మరో ముఖ్యమైన రంగం రక్షణ తయారీ. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ రంగం ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది. రక్షణ ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం మన రక్షణ ఉత్పత్తులు రూ. 1.25 లక్షల కోట్లు దాటాయి. లోకోమోటివ్ రంగంలోనూ భారత్ ప్రధాన మైలురాయిని చేరింది. భారత్ నేడు ప్రపంచంలో అతిపెద్ద రైలింజన్ ఉత్పత్తిదారు. రైలింజన్లు, రైలు పెట్టెలు, మెట్రో కోచ్‌లు... ఏవైనా సరే, భారత్ వాటిని పెద్ద సంఖ్యలో అనేక దేశాలకు ఎగుమతి చేస్తోంది. మన ఆటోమొబైల్ రంగం కూడా మునుపెన్నడూ లేనివిధంగా వృద్ధిని సాధిస్తోంది.

గత 5 సంవత్సరాల్లోనే ఈ రంగంలో దాదాపు 40 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంటే, కొత్త కంపెనీలు వచ్చాయి. కొత్త కర్మాగారాలను నెలకొల్పడంతోపాటు, కొత్త ఉద్యోగావకాశాలు లభించాయి. అదే సమయంలో దేశంలో రికార్డు స్థాయిలో ఆటోమొబైల్స్ అమ్మకాలతో వాహన డిమాండు పెరిగింది. అనేక రంగాల్లో భారత్ పురోగతి, తయారీలో ఈ రికార్డులు ఊరికే వచ్చినవి కాదు. ఎక్కువ మంది యువత ఉద్యోగాలు పొందుతుండడం వల్లే అవి సాధ్యమవుతున్నాయి. వారి కృషి, తెలివితేటలు, అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది. దేశ యువత ఉద్యోగాలను పొందడమే కాకుండా, వాటిలో అత్యున్నతంగా రాణించారు. తయారీ రంగంలో ఇదే ఊపు కొనసాగేలా చూసుకోవడం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ కర్తవ్యం. మీరెక్కడ నియమితులైనా.. ఉత్తేజాన్ని నింపాలి... ప్రోత్సాహకులుగా ఉండాలి. అవరోధాలను అధిగమించి ప్రక్రియలను సులభతరం చేయాలి. మీరు వ్యవస్థను ఎంత తేలికగా నడపగలిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుంది.

మిత్రులారా,

నేడు మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే దిశగా వేగంగా పురోగమిస్తోంది. భారతీయుడెవరైనా ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలరు. ఈ ఘనత కూడా మన యువత చేసిన కృషి, వారు కష్టించడం వల్లనే సాధ్యం అయింది.

గత 11 సంవత్సరాల్లో దేశం అన్ని రంగాలలో పురోగతి సాధించింది. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన ఓ నివేదికలోని అంశాలు అత్యంత ప్రశంసనీయార్హమైనవి. గత దశాబ్ద కాలంలో దేశంలోని 90 కోట్లకు పైగా పౌరులు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చారనని ఈ నివేదిక పేర్కొన్నది. ముఖ్యంగా, ఇది సామాజిక భద్రతను విస్తృతపరచడమే. ఈ పథకాలు సంక్షేమానికే పరిమితం కాదు.. అవి భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను... ప్రధానమంత్రి ఆవాస యోజన: ఈ పథకం కింద, ఇప్పటికే 4 కోట్ల కొత్త పక్కా ఇళ్ళను నిర్మించాం. మరో 3 కోట్ల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తుంటే.. మేస్త్రీలు, కార్మికులు, ముడి పదార్థాల సరఫరాదారులు, రవాణా చేసేవారు, స్థానిక దుకాణదారులు, లారీ డ్రైవర్లు.. ఇలా అందరికీ పని దొరుకుతుంది. దీని ద్వారా ఎంత భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయో ఊహించండి! ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ఉపాధి అవకాశాల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రజలు నగరాలకు వలస పోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కొత్తగా 12 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. ఇది నిర్మాణ రంగంలోనే కాకుండా, మన విశ్వకర్మ సమాజానికి చెందిన ప్లంబర్లు, వడ్రంగులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా పని దొరికేలా చేసింది. ఇలా ఉద్యోగావకాశాలు విస్తరించి, క్రియాశీల ప్రభావాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా ఉజ్వల పథకం కింద 10 కోట్లకు పైగా కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లను అందించాం. దీనికోసం పెద్ద సంఖ్యలో ఎల్పీజీ బాటిలింగ్ యూనిట్లు నెలకొల్పారు. ఇది సిలిండర్ తయారీదారులు, పంపిణీ సంస్థలు, డెలివరీ సిబ్బందికి ఉపాధిని కల్పిస్తోంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే.. ప్రతీ కార్యక్రమం అనేక దశల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా లక్షలాది ప్రజలు కొత్త ఉద్యోగాలను పొందారు.

మిత్రులారా,

మరో పథకం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ‘ఇంకో లడ్డూ కావాలా’ అని మనం మాట్లాడుకుంటాం చూడండి- అలాంటిదే ఇది. అది పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద ప్రతి ఇంటికీ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి సగటున రూ. 75,000 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఇంటి పైకప్పును విద్యుత్ ప్లాంటుగా మారుస్తుంది. గృహ అవసరాల కోసం మాత్రమే కాదు.. మిగులు విద్యుత్ ఉంటే గ్రిడ్‌కు విక్రయించే అవకాశం కూడా ఉంది. ఇది కరెంటు బిల్లులు చెల్లించాల్సి అవసరం లేకుండా చేసి కుటుంబాలకు పెద్దమొత్తంలో డబ్బును ఆదా చేస్తుంది. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు అవసరం. సోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారాలు, ముడి పదార్థాల సరఫరాదారులు పెరుగుతున్నారు. సామగ్రిని తరలించడానికి రవాణా రంగంలో నిర్వాహకులను నియమించాలి. ఈ వ్యవస్థల నిర్వహణ, మరమ్మతుల కోసం ఒక సరికొత్త పరిశ్రమే ఆవిర్భవిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి – ఈ ప్రయోజనాలు పౌరులకు సహాయపడడమే కాకుండా, లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి.

మిత్రులారా,

‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం మన అక్కాచెల్లెళ్లు, బిడ్డల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. ఈ పథకం కింద లక్షలాది గ్రామీణ మహిళలు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందుతున్నారు. గ్రామాలకు చెందిన మన తల్లులు, అక్కాచెల్లెళ్లు.. డ్రోన్ దీదీలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలను అందిస్తూ, ఒకే వ్యవసాయ సీజన్‌లో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని అందుబాటులో ఉన్న పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, దేశంలో డ్రోన్ తయారీ రంగానికి కూడా ఈ పథకం ఊపునిస్తోంది. వ్యవసాయమైనా రక్షణ రంగమైనా.. డ్రోన్ తయారీ దేశ యువతకు కొత్త అవకాశాలను అందిస్తోంది.

మిత్రులారా,

మూడు కోట్ల మహిళలను లాఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోంది. వీరిలో 1.5 కోట్ల మహిళలు ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధించారు. మీకు తెలుసు.. లాఖ్‌పతి దీదీ కావడమంటే ఒక్కసారి మాత్రమే కాదు, స్థిరంగా ఏటా కనీసం లక్ష రూపాయలు సంపాదించడం. అదే దీనికి ప్రమాణం. 1.5 కోట్ల లాఖ్‌పతి దీదీలు! నేడు మీరు గ్రామాల్లోకి వెళ్తే.. బ్యాంక్ సఖి, బీమా సఖి, కృషి సఖి, పశు సఖి వంటి పదాలు మీకు వినిపిస్తాయి. గ్రామాల్లోని మన తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉపాధి అవకాశాలు పొందిన వివిధ పథకాలవి. అదేవిధంగా, ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా మొదటిసారిగా వీధి వ్యాపారులు, విక్రేతలకు చేయూత లభించింది. లక్షల మంది దీని ద్వారా ప్రయోజనం పొందారు. డిజిటల్ చెల్లింపుల కారణంగా, రోడ్డు పక్కన ఉండే విక్రేతలు కూడా ఇప్పుడు నగదు కన్నా యూపీఐ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇది వారికి బ్యాంకు నుంచి అప్పటికప్పుడే మరిన్ని రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. బ్యాంకులు వారిని మరింత విశ్వసిస్తాయి. కుప్పలకొద్దీ పత్రాలతో వారికి పనిలేదు. అంటే, ఓ చిన్న వీధి వ్యాపారి కూడా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా ముందుకు సాగుతున్నాడు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్నే ఉదాహరణగా తీసుకోండి. సాంప్రదాయక, పరంపరగా వస్తున్న, కుటుంబ ఆధారిత హస్తకళలు, వర్తకాలను ఆధునికీకరించడం, నవీకరించడంపై ఇది ప్రధానంగా దృష్టి సారించింది. ఆధునిక పరికరాలను అందించడం, కళాకారులకు శిక్షణ ఇవ్వడం, రుణ సౌలభ్యాన్ని అందించడం ద్వారా ఈ పథకం చేయూతనిస్తుంది. పేదల అభ్యున్నతికి, అలాగే యువతకు ఉపాధి లభించే పథకాలు అనేకం ఉన్నాయి. ఇవి ఎంతలా ప్రభావం చూపాయంటే- పదేళ్లలోనే 25 కోట్ల భారతీయులు పేదరికాన్ని అధిగమించారు. ఒక్కసారి ఆలోచించండి - ఉద్యోగం దొరకకపోతే, కుటుంబంలో ఆదాయం లేకపోతే, మూణ్నాలుగు తరాలుగా పేదరికంలో మగ్గిపోతున్న వ్యక్తి ఆ అంధకారం నుంచి బయటకు రావడాన్ని కనీసం ఊహించగలడా? వారికి, ప్రతిరోజూ మనుగడ కోసం పోరాటమే. జీవితం భారంగా అనిపిస్తుంది. కానీ నేడు, వారు తమ శక్తియుక్తులతో పేదరికాన్ని జయించారు. విజేతలుగా నిలిచిన ఈ 25 కోట్ల సోదరీసోదరుల దృఢ సంకల్పానికి నేను ప్రణమిల్లుతున్నాను. వారు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకున్నారు. ఫిర్యాదులు చేస్తూ కూర్చోలేదు. వారు పేదరికంతో పోరాడారు. దానిని సమూలంగా పెకలించి, విజయం సాధించారు. ఇప్పుడు ఈ 25 కోట్ల మందిలో ఎంతటి ఆత్మవిశ్వాసం ఉంటుందో ఊహించండి! ఓ వ్యక్తి సంక్షోభాన్ని అధిగమిస్తే, కొత్త హుషారు వస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఈ కొత్త శక్తి కనిపిస్తోంది. ఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇదేదో ప్రభుత్వం మాత్రమే చెబుతున్నది కాదు. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు నేడు ఈ విజయంపట్ల భారత్‌ను మెచ్చుకుంటున్నాయి. ప్రపంచం భారత్‌ను ఓ ఆదర్శంగా చూస్తోంది. సమానత్వం పరంగా, నేడు ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. అంటే, అసమానతలు వేగంగా తగ్గుతున్నాయి. గొప్ప సమానత్వం దిశగా మనం పయనిస్తున్నాం. ఈ పరివర్తనను ప్రపంచం గమనిస్తోంది.

మిత్రులారా,

పేదల సంక్షేమం, ఉపాధి కల్పన దిశగా గొప్ప అభివృద్ధి లక్ష్యంతో సాగుతున్న ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈరోజు నుంచి మీపైనా ఉంది. ప్రభుత్వం ఎప్పుడూ అడ్డంకిగా ఉండకూడదు. అది అభివృద్ధికి దోహదకారిగా ఉండాలి. అభివృద్ధి చెందేందుకు ప్రతి వ్యక్తికీ అవకాశాలుండాలి. చేయూతనిచ్చే పాత్ర మనది. మీరంతా యువకులు. మీ మీద నాకు చాలా నమ్మకముంది. మీ మీద నాకు ఎన్నో ఆశలున్నాయి. మిమ్మల్ని ఎక్కడ నియమించినా, మీరెప్పుడూ ప్రజలకే ప్రాధాన్యమివ్వాలి. వారికి సహాయం చేయడం.. వారి కష్టాలను తగ్గించడం... అదే దేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తుంది. భారత అమృత కాలంలో, ఈ సువర్ణావకాశాల యుగంలో మీరు క్రియాశీల భాగస్వాములు కావాలి. రాబోయే 20 - 25 సంవత్సరాలు మీ కెరియర్ కే కాదు, మొత్తం దేశ భవిష్యత్తుకు కూడా చాలా కీలకం. ‘వికసిత భారత్’ నిర్మాణానికి ఇవి నిర్ణయాత్మక సంవత్సరాలు. అందుకే మీ పని, మీ విధులు, మీ లక్ష్యాలు అన్నీ వికసిత భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉండాలి. ‘నాగరిక దేవో భవో (ప్రజల దేవుళ్లు)’- ఇదే మంత్రప్రదంగా మీ నరనరాల్లో ప్రవహించాలి. మీ మనస్సులో, ఆలోచనల్లో ఇదే ఉండాలి. మీ నడవడిలో, ప్రవర్తనలో ఆ స్ఫూర్తి ప్రతిబింబించాలి.

మిత్రులారా, గత పదేళ్లుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ యువశక్తి నాతో పాటు నిలిచిందన్న పూర్తి నమ్మకం నాకుంది. వారెక్కడున్నా నా ప్రతి మాటనూ మనస్ఫూర్తిగా విన్నారు. దేశం కోసం వారు చేయగలిగినదంతా చేశారు. ఇప్పుడు ఈ అవకాశం మీకు లభించింది. మీపై ఇంకా చాలా అంచనాలున్నాయి. మీ బాధ్యత చాలా పెద్దది. మీరు అవకాశాన్ని ఉపయోగించుకుని దాన్ని సాకారం చేస్తారన్న నమ్మకం నాకుంది. మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకెంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. మీరంతా జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఐగాట్ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ ఉండండి. ఇప్పుడు మీకో అవకాశం వచ్చింది... వెనక్కి తగ్గకండి. గొప్పగా కలలు కనండి.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోండి. నిరంతర కృషి, అభ్యాసం, కొత్త ఫలితాలతో ముందుకు సాగండి. మీ పురోగతి దేశానికి గర్వకారణం. మీ అభివృద్ధితోనే నాకు సంతృప్తి కలుగుతుంది. అందుకే.. నేడు మీరు జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ వేళ మీతో మాట్లాడటానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఎన్నో కలలను నెరవేర్చుకోవడంలో నా భాగస్వామిగా మిమ్మల్ని స్వాగతించడానికి నేనిక్కడికి వచ్చాను. ఓ సన్నిహితుడైన, నమ్మకమైన సహచరుడిగా మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi receives a telephone call from the US Vice President
August 08, 2026
PM and Vice President Vance review progress in the India-U.S. Strategic Partnership.
PM and Vice President Vance exchange views on regional and global developments.
PM warmly congratulates Vice President Vance and Ms. Usha Vance on the birth of their son.

Prime Minister Shri Narendra Modi received a telephone call today from the Vice President of the United States, Mr. J.D. Vance.

Prime Minister and Vice President Vance reviewed progress in the India-U.S. Comprehensive Global Strategic Partnership. They noted the sustained momentum in the high-level engagements and reaffirmed their commitment to further strengthening cooperation in trade, defence, critical and emerging technologies, energy security and critical minerals.

They also exchanged views on regional and global developments of mutual interest.

Prime Minister warmly congratulated Vice President Vance and Ms. Usha Vance on the birth of their son and conveyed best wishes to the family.