* సమాజ సంక్షేమం కోసం గొప్ప ఉద్దేశాలు, పవిత్రతతో ప్రయత్నాలు చేపట్టినప్పడు దైవం తోడ్పాటు లభిస్తుంది - సమాజమే దైవిక శక్తిగా మారుతుంది: పీఎం
* నైపుణ్యాభివృద్ధికి నూతన జాతీయ విద్యావిధానం అధిక ప్రాధాన్యమిస్తుంది: పీఎం
* దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి రికార్డు వేగంతో కొనసాగుతోంది: పీఎం
* ప్రస్తుత ప్రపంచం భారత శ్రమ, ప్రతిభ విలువను గుర్తించి, గౌరవిస్తోంది. ఫలితంగా వివిధ దేశాల్లో అనేక అవకాశాలు లభిస్తున్నాయి: పీఎం
* భారత్ స్వయం సమృద్ధమవ్వాలి, స్వదేశీ ఉత్పత్తులను సమాజం నమ్మకంతో స్వీకరించాలి: పీఎం
* స్వదేశీ ఉద్యమం శతాబ్దాల నాటి స్మారకం కాదు.. ఇది భవిష్యత్తును బలోపేతం చేస్తుంది.. ఆ నాయకత్వం సమాజం నుంచే ముఖ్యంగా యువత నుంచే రావాలి: పీఎం

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సర్దార్‌ధామ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్, ట్రస్టీ వి.కె. పటేల్, దిలీప్ భాయ్, ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..

సర్దార్‌ధామ్ పేరు ఎంత పవిత్రమైనదో.. అది చేసే పని కూడా అంతే పవిత్రమైనది. ఆడబిడ్డలకు సేవ చేసేందుకు, వారి చదువుల కోసం నేడు ఒక హాస్టల్ ప్రారంభమవుతోంది. ఈ హాస్టల్‌లో ఉండే అమ్మాయిలకు ఆకాంక్షలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి వారికి అనేక అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా, ఈ అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడి సమర్థులుగా మారినప్పుడు.. వారు సహజంగానే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. దీనితో పాటు వారి కుటుంబాలు కూడా సమర్థవంతంగా మారుతాయి. అందుకే అన్నింటికంటే ముందు.. ఈ హాస్టల్‌లో ఉండే అవకాశం లభించే అందరు అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను.

మిత్రులారా,

బాలికల హాస్టల్ 2వ దశకు పునాదిరాయి వేసే అవకాశం మీరు నాకు ఇవ్వడం నా అదృష్టం. సమాజ కృషి వల్ల 3 వేల మంది బాలికలు.. అద్భుతమైన ఏర్పాట్లు, సౌకర్యాలతో కూడిన ఒక గొప్ప భవనాన్ని పొందుతున్నారు. బరోడాలో కూడా 2 వేల మంది విద్యార్థుల కోసం హాస్టల్ రాబోతుందని, దాని నిర్మాణం పూర్తి కాబోతోందని నాకు తెలిసింది. ఈ రకమైన విద్య, అభ్యాసం, శిక్షణ కోసం సూరత్, రాజ్‌కోట్, మెహ్సానాలో కూడా చాలా కేంద్రాలు వస్తున్నాయి. వీటన్నింటికి సహాయం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దేశం.. సమాజ బలంతో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా నేను సర్దార్ సాహెబ్ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధి దేశాభివృద్ధికి చాలా అవసరమని నేను ఎప్పుడూ చెప్పేవాడిని. గుజరాత్ నాకు నేర్పించినది, గుజరాత్ నుంచి నేను నేర్చుకున్నది నేడు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుండటం యాదృచ్చికం. 25-30 సంవత్సరాల కిందట గుజరాత్‌లో అనేక రకాల ఆందోళనకర పరిస్థితులు ఉండేవని మీ అందరికీ తెలుసు. అభివృద్ధితో పాటు సామాజిక అంశాలకు సంబంధించిన అనేక సంక్షోభాలలో కూడా గుజరాత్ రాష్ట్రం పనిచేయాల్సి వచ్చింది. ఆయా రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే విద్యా రంగంలో ఆడపిల్లలు చాలా వెనుకబడి ఉన్నారని మొదటిసారి నా దృష్టికి వచ్చింది. ఇది నన్ను బాగా కలిచివేసింది. చాలా కుటుంబాలు ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. పాఠశాలలో చేరిన వారు కూడా తక్కువ సమయంలోనే మానేసేవారు. 25 ఏండ్ల కిందట మీరంతా నాకు అండగా నిలిచారు. దీనితో పరిస్థితి మొత్తం మారిపోయింది. మేం బాలికా విద్య (కన్యా శిక్ష) కోసం రథయాత్ర చేసే వాళ్లమని మీరందరికి గుర్తుండే ఉంటుంది. జూన్ 13, 14, 15 తేదీలలో ఉష్ణోగ్రత 40-42 డిగ్రీలు ఉండేది. గ్రామ గ్రామానికి, ఇంటింటికీ వెళ్తూ మేం అమ్మాయిల బతిమాలి మరీ పాఠశాలలకు తీసుకొచ్చేవాళ్లం. పాఠశాల ప్రవేశాలకు సంబంధించిన ఉత్సవాల కోసం మేం పెద్ద కార్యక్రమాలను నిర్వహించాం. ఈ పని గొప్ప ప్రయోజనాలను అందించడం నా అదృష్టం. దాని కారణంగానే నేడు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చెందాయి. పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు లభించాయి. కావాల్సిన అన్ని రకాల వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఉపాధ్యాయులను నియమించారు. సమాజం కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని తన బాధ్యతను నిర్వర్తించింది. ఫలితంగా ఆ పాఠశాలల్లో నాడు చేర్చుకున్న అమ్మాయిలు, అబ్బాయిలూ నేడు వైద్యులు, ఇంజనీర్లు అయ్యారు. మధ్యలో చదువులకు స్వస్తి చెప్పే వారి శాతం తగ్గింది. ఇది మాత్రమే కాదు.. గుజరాత్‌ వ్యాప్తంగా విద్య పట్ల అవగాహన పెరిగింది.

 

అప్పట్లో ఉన్న రెండో ప్రధాన ఆందోళన భ్రూణహత్యలు. ఇది ఆ కాలంలో మనకు ఉన్న చాలా పెద్ద కళంకం. చాలాసార్లు మన సమాజం దీని గురించి ఆందోళన వెలిబుచ్చేది. పౌర సమాజం నన్ను సమర్థించింది. దీంతో ఒక ఉద్యమం ప్రారంభమైంది. మేం సూరత్ నుంచి ఉమియా మాత వరకు ఊరేగింపు చేపట్టాం. కొడుకులు, కూతుర్లు సమానమే అనే భావన బలపడింది. మన గుజరాత్ శక్తిని పూజించే ప్రాంతం. ఇక్కడ మనకు ఉమియా మాత, ఖోడల్ మాత, కాళి మాత, అంబా మాత, బహుచర్ మాత ఉన్నారు. వారి ఆశీర్వాదాలు కూడా మనకు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో భ్రూణహత్య ఒక పాపం. ఈ ఆలోచన వచ్చిన సమయంలో నాకు అందరి మద్దతు లభించటంతో గుజరాత్‌లో కుమారులు, కుమార్తెల సంఖ్యలో ఉన్న భారీ అంతరాన్ని క్రమంగా తగ్గించడంలో నేడు మనం విజయం సాధించాం.

మిత్రులారా,

సమాజ శ్రేయస్సు కోసం గొప్ప లక్ష్యాలతో కృషి చేసినప్పుడు, స్వచ్ఛతతో పనిచేసినప్పుడు దేవుడు కూడా తోడ్పడతాడు. దేవుని రూపంలో ఉన్న సమాజం కూడా మద్దతునిస్తుంది. ఫలితాలు కూడా సాధించవచ్చు. నేడు సమాజంలో కొత్త అవగాహన వచ్చింది. మన ఆడ పిల్లలకు విద్యను అందించేందుకు, వారి గౌరవాన్ని పెంచటానికి, వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు.. గొప్ప హాస్టళ్లను నిర్మించడానికి మనం స్వయంగా ముందుకు వస్తున్నాం. గుజరాత్‌లో మనం నాటిన విత్తనం నేడు దేశవ్యాప్తంగా బేటీ బచావో-బేటీ పఢావో రూపంలో ఒక సామూహిక ఉద్యమంగా మారింది. మహిళల భద్రత, సాధికారత కోసం దేశంలో చారిత్రక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడేటప్పుడు.. మన ఆడపిల్లల గొంతు వినిపిస్తుంది. వారి సామర్థ్యం మనకు తెలుస్తుంది. గ్రామాల్లో చేపట్టిన లక్‌పతి దీదీ కార్యక్రమం లక్ష్యం 3 కోట్ల మహిళలు కాగా.. ఇప్పటికే మనం 2 కోట్లకు చేరుకున్నాం. దీనితో పాటు డ్రోన్ దీదీ మొదలైన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలోని మన స్త్రీల పట్ల దృక్పథాన్ని మార్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తున్న బ్యాంక్ సఖీ, ఇన్సూరెన్స్ సఖీలను మహిళలే నిర్వహిస్తున్నారు.

మిత్రులారా,

సమాజానికి సానుకూల తోడ్పాటు అందించే వ్యక్తులను తయారు చేయడం, వారి సామర్థ్యాలను పెంపొందించడమే చదువుకు ఉన్న అతి పెద్ద లక్ష్యం. ప్రస్తుతం ఈ పనిని మనం వేగంగా చేస్తున్న నేపథ్యంలో.. ఇది సముచితం అనిపిస్తుంది. ఇప్పుడు మన మధ్య నైపుణ్యాల్లో పోటీ పెరగాలి. ప్రతిభలో పోటీ పడాలి. ఏ సందర్భంలోనైనా నైపుణ్యమే సమాజానికి బలం. ఈ రోజు, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామిక శక్తికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. గతంలో దశబ్దాల తరబడి పాలించిన ప్రభుత్వం విద్యావ్యవస్థ పట్ల అనాలోచిత ధోరణితో వ్యవహరించింది. మేం దీనిలో మార్పులు తీసుకువచ్చాం. పాత వ్యవస్థ నుంచి బయటకి వచ్చి.. పరిస్థితులను మారుస్తున్నాం. మేం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం.. నైపుణ్యాలకు, ప్రతిభకు అధిక ప్రాధాన్యమిస్తుంది. మేం స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీని ద్వారా వివిధ రంగాల్లో నిపుణులుగా కోట్లాది మంది యువతను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయంగా వృద్ధాప్య సమస్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఈనాటి ఈ ప్రపంచానికి యువత అవసరం ఉంది. యువశక్తిని ప్రపంచానికి అందించగలిగిన సామర్థ్యం భారత్‌కు ఉంది. మన యువతలో నైపుణ్యం పెరిగితే.. వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారి ఆత్మవిశ్వాసం, స్వావలంబన, సామర్థ్యం దాని నుంచే వస్తుంది. యువతకు ఉపాధి కల్పించడం, గరిష్ఠంగా ఉద్యోగ అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. 11 ఏళ్ల క్రితం, దేశంలో స్వల్ప సంఖ్యలో మాత్రమే అంకుర సంస్థలు ఉండేవి. ఇప్పడు భారత్‌లో ఉన్న అంకుర సంస్థల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. అందులోనూ.. ఈ అంకుర సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. ముద్ర యోజన ద్వారా బ్యాంకుల నుంచి రుణాలను అందిస్తున్నాం. అది కూడా ఎలాంటి హామీ అవసరం లేకుండా. ఆలోచించండి... స్వయం ఉపాధి కోసం యువతకు రూ. 33 లక్షల కోట్లు అందించాం. ఫలితంగా లక్షలాది యువత స్వయం సమృద్ది సాధించడమే కాకుండా.. తమతో పాటు ఒకరిద్దరికి ఉపాధిని కూడా అందించగలుగుతున్నారు. ఆగస్టు 15న నేను ఓ పథకాన్ని ప్రకటించాను. ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. అది ఒక లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం. దీని ద్వారా ప్రైవేటు రంగంలో మీరు ఎవరికైనా ఉద్యోగం ఇస్తే.. ఆ వ్యక్తికి ప్రభుత్వం మొదటి నెల జీతంగా 15 వేల రూపాయలు అందిస్తుంది.

 

మిత్రులారా,

ప్రసుతం దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి రికార్డు స్థాయి వేగంతో ముందుకు సాగుతోంది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్తు పథకం ద్వారా పెద్ద ఎత్తున సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. డ్రోన్, రక్షణ వ్యవస్థలు భారత్‌లో నిరంతరాయంగా వృద్ధి చెందుతున్నాయి. అలాగే తయారీ రంగంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలన్నీ గుజరాత్‌లో నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.

మిత్రులారా,

ప్రస్తుత ప్రపంచం భారతీయ శ్రామిక శక్తిని, ప్రతిభకున్న ప్రాధాన్యం గురించి అర్థం చేసుకుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా విభిన్న దేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఆరోగ్య సేవలు, విద్య, అంతరిక్షం, తదితర రంగాల్లో తన ప్రతిభతో మన యువత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

మిత్రులారా,

ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు... ఎర్ర కోట నుంచి, స్వదేశీ ప్రాధాన్యతను వివరించాను. భారత్ స్వయం సమృద్ధంగా మారాలని అభ్యర్థించాను. ఇప్పుడు సమాజంలోని ప్రజలంతా నా ముందే కూర్చున్నారు. గతంలో మీ అందరికీ పని గురించి చెప్పి ఆశీస్సులు పొందాను. కానీ ఇప్పుడు అప్పగించిన పనులు మీరు కూడా పూర్తి చేశారని నేను చెప్పాలి. 25 ఏళ్ల నా అనుభవంలో నా అంచనాలను మీరు అందుకోలేని సందర్భం ఎప్పుడూ లేదు. కాబట్టి నా ఆశ ఇంకొంచెం పెరిగింది. ప్రతిసారి కొన్ని పనులను మీకు అప్పగించాలనే కోరిక పెరగుతూ ఉంటుంది. ఈ రోజు నేను ఓ విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత ప్రపంచంలో స్వయం సమృద్ధి సాధించడమే భారత్‌కు ఉత్తమమైన మార్గం. మనం స్వయం సమృద్ధం కావాలంటే.. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యమివ్వాలి. మేక్ ఇన్ ఇండియా పట్ల మన ఆసక్తి పెరగాలి.

 

స్వదేశీ ఉద్యమం 100 ఏళ్ల నాటిది కాదు.. అది మన భవిష్యత్తును బలోపేతం చేసే ఉద్యమం. దానికి మీరు నాయకత్వం వహించాలి. మన యువతీయువకులు దానిని చేపట్టాలి. ఒక్క విదేశీ వస్తువు కూడా మన కుటుంబంలోకి, మన ఇంట్లోకి రాకుండా మనం చూసుకోవాలి. అలాగే.. నేను భారత్‌లో వివాహం చేసుకోవడం గురించి చెప్పాను. చాలా మంది విదేశాల్లో తమ వివాహాలను రద్దు చేసుకొని భారత్‌కు వచ్చారు. ఇక్కడ హాళ్లను బుక్ చేసుకొని వివాహం చేసుకున్నారు. మీరు ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే.. దేశం పట్ల ప్రేమ దానికదే పెరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారతే మ విజయం, బలం. మన భావితరాల భవిష్యత్తు దాని మీదే ఆధారపడి ఉంది. కాబట్టి స్నేహితులారా, ఎల్లప్పుడూ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయండి. ఉత్పత్తుల నాణ్యత దానికదే మెరుగుపడుతుంది. మార్కెట్లో కొనసాగాలి అంటే.. అందరూ మంచి ఉత్పత్తులు తయారు చేయాలి. మంచి ప్యాకింగ్ చేయాలి. తక్కువ ధరలకు అమ్మాలి. మన డబ్బు విదేశాలకు తరలిపోతే అది మంచిది కాదు. ఈ విషయంలో సమాజంలో అవగాహన పెంపొందించి నేను అప్పగించిన ఈ చిన్న పనిని మీరు పూర్తి చేస్తారని, దేశానికి కొత్త శక్తిని ఇస్తారని ఆశిస్తున్నాను.

అలాగే వ్యాపారులకు కూడా నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మన సమాజం ఇప్పుడు రైతులదే కాదు.. వ్యాపారులది కూడా. కాబట్టి వ్యాపారిగా.. నా దుకాణంలో దేశీయ ఉత్పత్తులు మాత్రమే లభిస్తాయని అని మీరు బోర్డు పెట్టాలి. దేశీయ ఉత్పత్తులు కొనాలనుకొనేవారు కచ్చితంగా మన దగ్గరకు వస్తారు. మనం కూడా వారికి దేశీయ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ఇది కూడా దేశభక్తే. ఆపరేషన్ సిందూర్ ఒక్కటే దేశభక్తి కాదు. ఇది కూడా దేశభక్తే. నా భావనను మీతో పంచుకుంటున్నాను. దానికి మీ సహకారం అందించి పూర్తి చేస్తారని మాట ఇచ్చారు. మీ అందరి మధ్య ఉండే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. అమ్మాయిలందరికీ నా ఆశీస్సులు, నమస్కారం.

సూచన: ఇది ప్రధానమంత్రి గుజరాతీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India poised to be global hub for small satellites, in-orbit manufacturing

Media Coverage

India poised to be global hub for small satellites, in-orbit manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Dr. Bhupen Hazarika on his 100th birth anniversary
September 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tribute to legendary Dr. Bhupen Hazarika on his 100th birth anniversary.

The Prime Minister said that Dr. Bhupen Hazarika’s voice carried the soul of Assam and the spirit of the Northeast to the entire nation. He noted that through his music, Dr. Hazarika beautifully gave expression to the thoughts and spirit of countless people and brought people closer.

Shri Modi warmly recalled attending the beginning of Dr. Hazarika’s birth centenary celebrations in Guwahati last year.

The Prime Minister said that Bhupen Da’s life and work will continue to inspire generations.

The Prime Minister wrote on X;

“On his 100th birth anniversary, remembering the legendary Dr. Bhupen Hazarika Ji.

His voice carried the soul of Assam and the spirit of the Northeast to the entire nation.

Through his music he beautifully gave expression to the thoughts and spirit of countless people. His songs brought people closer.

I warmly recall attending the start of his birth centenary celebrations in Guwahati last year. Bhupen Da’s life and work will continue to inspire generations.”