తమిళనాడులో రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభంతోపాటు జాతికి అంకితం.. శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి;
రైలు.. రోడ్డు.. చమురు-గ్యాస్.. షిప్పింగ్ రంగాల్లో పలు ప్రాజెక్టులు జాతికి అంకితం;
తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం ప్రారంభం;
కల్పక్కంలోని ‘ఐజిసిఎఆర్‌’లో దేశీయ ‘డిమోన్‌స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ (డిఎఫ్‌ఆర్‌పి)ని దేశానికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి;
భారతిదాసన్ విశ్వవిద్యాలయ 38వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్న ప్రధాని;
లక్షద్వీప్‌లో రూ.1150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం... శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి;
టెలికమ్యూనికేషన్స్.. తాగునీరు.. సౌర శక్తి.. ఆరోగ్య రంగాల అభివృద్ధి ప్రాజెక్టులతో లక్షద్వీప్ దీవులకు ప్రయోజనం;
స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి సబ్‌మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా లక్షద్వీప్‌ దీవుల అనుసంధానం

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 2, 3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ దీవులలో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 2వ తేదీన ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో నగరంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, ఉన్నత విద్యా రంగాలకు చెందిన రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.

   అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 3:15 గంటల ప్రాంతంలో లక్షద్వీప్‌లోని అగట్టి దీవికి వెళ్లి, అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరునాడు- 2024 జనవరి 4న మధ్యాహ్నం 12:00 గంటలకు కవరట్టి దీవికి చేరుకుంటారు. అటుపైన లక్షద్వీప్‌లో టెలికమ్యూనికేషన్లు, తాగునీరు, సౌరశక్తి, ఆరోగ్యం తదితర రంగాల సంబంధిత వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు.

తమిళనాడులో ప్రధానమంత్రి

   తిరుచిరాపల్లిలోని భారతిదాసన్ విశ్వవిద్యాలయ 38వ స్నాతకోత్సవంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధానమంత్రి పురస్కార ప్రదానం చేస్తారు. అనంతరం వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత నగరంలో నిర్వహించే కార్యక్రమంలో తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. రెండు అంచెలలో రూ.1100 కోట్లకుపైగా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఏటా 44 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగలదు. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ఒకేసారి దాదాపు 3500 మందికి సేవలందించగల సామర్థ్యంతో ఇది నిర్మితమైంది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు, విశిష్టతలతో ఈ టెర్మినల్ రూపుదిద్దబడింది.

   దీంతోపాటు రైల్వేలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటిలో... 41.4 కిలోమీటర్ల పొడవైన సేలం–మాగ్నసైట్ జంక్షన్–ఓమలూరు–మెట్టూర్ డ్యామ్ విభాగం డబ్లింగ్ ప్రాజెక్ట్; మదురై-టుటికోరిన్ నుంచి 160 కిలోమీటర్ల రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్ట్; వీటితోపాటు తిరుచిరాపల్లి-మనమదురై-విరుదునగర్; విరుదునగర్- తెన్‌కాశి జంక్షన్; సెంగోట్టై-తెన్‌కాశి జంక్షన్- తిరునల్వేలి-తిరుచెందూర్ మార్గాల్లో మూడు విద్యుదీకరణ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రయాణిక-సరకు రవాణాలో రైల్వేల సామర్థ్యం పెంచుతాయి. అంతేకాకుండా తమిళనాడు ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి.

   అలాగే రహదారుల రంగంలో ఐదు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటిలో- జాతీయ రహదారి-81లోని తిరుచ్చి-కల్లగం విభాగంలో 39 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు; ఇదే జాతీయ రహదారిలోని కల్లగం-మీన్సురుట్టి విభాగంలో 60 కిలోమీటర్ల 4/2 వరుసల రోడ్డు; ఎన్‌హెచ్‌-785 పరిధిలో 29 కిలోమీటర్ల చెట్టికుళం-నాథమ్ విభాగం 4 వరుసల రోడ్డు; ఎన్‌హెచ్‌-536 పరిధిలో కారైకుడి- రామనాథపురం విభాగంలో 80 కిలోమీటర్ల 2 వరుసల మార్గం; ఎన్‌హెచ్‌-179ఎ పరిధిలో సేలం-తిరుపత్తూరు-వానియంబాడి మార్గంలో 44 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంత ప్రజలకు సురక్షిత, వేగవంతమైన ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. అలాగే తిరుచ్చి, శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం, ధనుష్కోటి, ఉతిరకోసమంగై, దేవీపట్టణం, ఎర్వాడి, మదురై వంటి పారిశ్రామిక, వాణిజ్య కూడళ్లకు అనుసంధానం మెరుగవుతుంది.

   ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని కీలక రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో... ఎన్‌హెచ్‌-332ఎ ప‌రిధిలోని ముగాయ్యూర్-మరక్కనం మధ్య 31 కిలోమీటర్ల 4 వరుసల రహదారి నిర్మాణం కూడా ఉంది. ఈ రహదారి తమిళనాడు తూర్పు తీరంలోని ఓడరేవులను కలుపుతుంది. అలాగే ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మామల్లపురం (మహాబలిపురం) రహదారిని కలపడంతోపాటు కల్పక్కం అణువిద్యుత్ కేంద్రానికి అనుసంధానం మెరుగవుతుంది. మరోవైపు కామరాజర్ రేవులోని సార్వత్రిక సరకు రవాణా బెర్త్-2 (ఆటోమొబైల్ ఎగుమతి/దిగుమతి టెర్మినల్-II, క్యాపిటల్ డ్రెడ్జింగ్ ఫేజ్-4)ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దీంతో దేశ వాణిజ్యాన్ని బలోపేతం చేసేదిశగా ముందడుగు పడుతుంది. ఇది ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలోనూ ఇతోధికంగా తోడ్పడుతుంది.

   ఇదే కార్యక్రమంలో ప్ర‌ధానమంత్రి రూ.9000 కోట్లకుపైగా విలువైన పెట్రోలియం-సహజ వాయువు ప్రాజెక్టుల‌లో కొన్నిటికి శంకుస్థాప‌న చేయడంసహా మరికొన్నిటిని జాతికి అంకితం చేస్తారు. దేశానికి అంకితం చేయబడే 2 ప్రాజెక్టులలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) పరిధిలో  ఎన్నూర్-తిరువళ్లూరు-బెంగళూరు-పుదుచ్చేరి-నాగపట్నం-మధురై-టుటికోరిన్ మార్గంలోని ‘ఐపి101’ (చెంగల్పట్టు) నుంచి ‘ఐపి105’ (సాయల్‌కుడి) వరకు 488 కిలోమీటర్ల పొడవైన సహజ వాయువు పైప్‌లైన్ ఒకటి; అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్‌) పరిధిలో 697 కిలోమీటర్ల పొడవైన విజయవాడ-ధర్మపురి (విడిపిఎల్) బహుళ ఉత్పత్తుల (పిఒఎల్) పెట్రో పైప్‌లైన్ మరొకటిగా ఉంది.

   శంకుస్థాపన చేయనున్న రెండు ప్రాజెక్టులలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జిఎఐఎల్) చేపడుతున్న కొచ్చి-కూత్తనాడ్-బెంగళూరు-మంగళూరు గ్యాస్ పైప్‌లైన్-2 (కెకెబిఎంపిఎల్‌-II) ప్రాజెక్టు కింద కృష్ణగిరి-కోయంబత్తూరు విభాగంలో 323 కిలోమీటర్ల సహజవాయు పైప్‌లైన్ నిర్మాణం; చెన్నైలోని వల్లూర్ వద్ద ప్రతిపాదిత గ్రాస్ రూట్ టెర్మినల్ కోసం సార్వత్రిక కారిడార్‌లో ‘పిఒఎల్’ పైప్‌లైన్ల నిర్మాణం ఉన్నాయి. పెట్రోలు-సహజ వాయువు రంగంలోని ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంత పారిశ్రామిక, గృహ, వాణిజ్య ఇంధనం అవసరాలు తీరడమేగాక ఉపాధి అవకాశాల సృష్టికి మార్గం ఏర్పడుతుంది.

   తమిళనాడులోని కల్పక్కంలోగల ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ (ఐజిసిఎఆర్)లో డిమోన్‌స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంటును (డిఎఫ్ఆర్‌పి) ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. మొత్తం రూ.400 కోట్లతో నిర్మించిన ‘డిఎఫ్ఆర్‌పి’ ప్రత్యేక డిజైన్‌తో అమర్చబడింది. ఇది ప్రపంచంలో అరుదైనదే కాకుండా, దీనికి ఫాస్ట్ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే కార్బైడ్-ఆక్సైడ్ ఇంధనాలను తిరిగి ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. అంతేగాక పూర్తిగా భారతీయ శాస్త్రవేత్తల కృషితో రూపొందించబడింది. ఇది భారీ వాణిజ్య స్థాయి ఫాస్ట్ రియాక్టర్ ఇంధన రీప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణంలో భారత్ సామర్థ్యం కీలక దశకు చేరిందనడానికి ఒక సంకేతం.

   వీటితోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటొ)-తిరుచిరాపల్లి ప్రాంగణంలో 500 పడకల యువకుల హాస్టల్ ‘అమెథిస్ట్’ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

లక్షద్వీప్ దీవులలో ప్రధానమంత్రి

   లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి రూ.1,150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం అత్యంత బలహీనంగా ఉండటం ఇక్కడి ప్రధాన సమస్య. దీన్ని పరిష్కరించేందుకు చేపట్టిన పరివర్తనాత్మక చర్యల్లో భాగంగా కొచ్చి-లక్షద్వీప్ దీవుల మధ్య నిర్మించిన సముద్రాంతర ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (కెఎల్ఐ-ఎస్ఒఎఫ్‌సి) ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సమస్య పరిష్కారంపై ఆయన 2020లో ఎర్రకోట పైనుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిద్వారా ఇకపై ఇంటర్నెట్ వేగం 100 రెట్లు (1.7 జిబిపిఎస్ నుంచి 200 జిబిపిఎస్ వరకు) పెరుగుతుంది. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ‘ఎస్ఒఎఫ్‌సి’తో లక్షద్వీప్‌  అనుసంధానం కానుండటం విశేషం. దీనివల్ల లక్షద్వీప్ దీవుల కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల్లో వినూత్న మార్పు వస్తుంది. ఇంటర్నెట్ సేవలలో వేగం, విశ్వసనీయత పెరుగుతాయి. ఇ-పరిపాలన, విద్యా కార్యక్రమాలు, డిజిటల్ బ్యాంకింగ్, కరెన్సీ వినియోగం, అక్షరాస్యత తదితరాలకు మార్గం సుగమం కాగలదు.

   కద్మత్‌లో నిర్మించిన ‘లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ (ఎల్‌టిటిడి) ప్లాంటును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దీనిద్వారా రోజూ 1.5 లక్షల లీటర్ల స్వచ్ఛమైన తాగునీటి లభ్యత కలుగుతుంది. అగట్టి, మినికాయ్ ద్వీపాల్లోని అన్ని గృహాలకూ కొళాయి కనెక్షన్లను కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు. పగడపు దీవి అయిన లక్షద్వీప్ దీవులలో తాగునీటి లభ్యత నిరంతర సమస్యగా ఉంది. ఇక్కడ భూగర్భజల లభ్యత స్వల్పం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తాజా తాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఈ ద్వీపాల పర్యాటక సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

   దేశానికి అంకితం చేయబడే ఇతర ప్రాజెక్టులలో కవరత్తిలో నిర్మించిన సౌరశక్తి ప్లాంట్ కూడా ఒకటి. ఇది లక్షద్వీప్‌లోని తొలి బ్యాటరీ ఆధారిత సౌర విద్యుత్తు ప్రాజెక్ట్. దీనివల్ల డీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పాదనపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. దీంతోపాటు కవరట్టిలో ఇండియా రిజర్వ్ బెటాలియన్ ప్రాంగణంలో 80 మంది సిబ్బంది కోసం నిర్మించిన కొత్త అడ్మినిస్ట్రేటివ్ భవనాన్నికూడా ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే కల్పేనిలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ భవన పునర్నవీకరణ పనులతోపాటు ఆంద్రోత్, చెట్లత్, కద్మత్, అగట్టి, మినికాయ్ దీవులలో ఐదు ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
GNPA of PSBs declines to 3.12% in Sep from 14.58% in March 2018: FinMin

Media Coverage

GNPA of PSBs declines to 3.12% in Sep from 14.58% in March 2018: FinMin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister wishes good health and speedy recovery to Brazilian President after his surgery
December 12, 2024

The Prime Minister Shri Narendra Modi today wished good health and a speedy recovery to Brazilian President Lula da Silva after his surgery.

Responding to a post by Brazilian President on X, Shri Modi wrote:

“I am happy to know that President @LulaOficial’s surgery went well and that he is on the path to recovery. Wishing him continued strength and good health.”