మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన

Published By : Admin | March 30, 2026 | 11:05 IST
మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న పీఎం
జైనమతం సుసంపన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శించే మ్యూజియం.. జైనమత పరిణామ క్రమాన్ని, లోతైన సాంస్కృతిక ప్రభావాన్ని తెలియజేసే మ్యూజియం
భారతదేశ సెమీ కండక్టర్ రంగ ప్రయాణంలో కీలక ఘట్టం.. సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంటును ప్రారంభించనున్న పీఎం
భారత్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్న రెండో సెమీ కండక్టర్ తయారీ కేంద్రం
చిప్ వ్యవస్థలో భారత్ స్వావలంబన లక్ష్యానికి ఊతమిచ్చేలా స్వదేశీ కండక్టర్ ప్యాకేజింగ్ సామర్థ్యాన్ని పెంచే కేంద్రం
వావ్-థరాడ్‌లో రూ.20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితమివ్వనున్న పీఎం
విద్యుత్, రైల్వేలు, రోడ్డు రవాణా, రహదారులు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల కోసం ఈ ప్రాజెక్టులు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు 4 గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

గాంధీనగర్‌లో పీఎం

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అశోక చక్రవర్తి మనవడు, జైన సంప్రదాయంలో అత్యంత గౌరవనీయుడైన సామ్రాట్ సంప్రతి పేరు మీదుగా ఈ మ్యూజియానికి నామకరణం చేశారు. అహింసా మార్గాన్ని అనుసరిస్తూ జైన మత వ్యాప్తికి ఆయన కృషి చేశారు. జైన మత గొప్ప చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ మ్యూజియం ప్రపంచానికి చాటి చెబుతుంది.

మహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలోని ఈ మ్యూజియం.. భారత నాగరికత, సంప్రదాయాల్లోని విశిష్ట అంశాలకు అంకితం చేసిన ఏడు ప్రత్యేక విభాగాలతో ఉంది. ఇది సందర్శకులకు శతాబ్దాల కాలం నాటి జ్ఞానం, వారసత్వాల సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఇక్కడి సంప్రదాయ ప్రదర్శనలతో పాటు ఆధునిక డిజిటల్, ఆడియో-విజువల్ సౌకర్యాలు సందర్శకులకు, పరిశోధకులకు, పండితులకు తన్మయత్వంతో కూడిన, ఆకర్షణీయమైన అనుభూతిని కలిగిస్తాయి.

అత్యంత నైపుణ్యంతో చెక్కిన రాతి, లోహ విగ్రహాలు, భారీ తీర్థ పట్టా, యంత్ర పట్టా, సూక్ష్మ చిత్రలేఖనాలు, వెండి రథాలు, నాణేలు, పురాతన రాతప్రతుల వంటివి ఏడు భారీ గ్యాలరీల్లో కొలువుదీరాయి. రెండు వేలకుపైగా అరుదైన నిధులను విశాలమైన హాలులో ప్రదర్శించటం ద్వారా జైనమత పరిణామ క్రమాన్ని, దాని లోతైన సాంస్కృతిక ప్రభావాన్ని కాలక్రమానుసారంగా అర్థం చేసుకునేందుకు సందర్శకులకు ఈ మ్యూజియం తోడ్పడుతుంది.

సనంద్‌లో పీఎం

అహ్మదాబాద్‌లోని సనంద్ జీఐడీసీలో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది ఈ యూనిట్‌లో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించటమే కాక, భారత సెమీ కండక్టర్ రంగ ప్రయాణంలో కీలక ఘట్టంగా నిలవనుంది. 

అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ (ఐపీఎంఎస్) తయారీతో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆటోమోటివ్, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన చిన్న, సమర్థవంతమైన, విశ్వసనీయ పవర్ స్విచ్చింగ్ సిస్టమ్స్‌లో ఇవి అత్యంత కీలకమైన భాగాలు. ఒక్కో మాడ్యూల్‌లో ఉండే 17 చిప్స్‌ను కాలిఫోర్నియాకు చెందిన ఆల్ఫా అండ్ ఒమేగా సెమీ కండక్టర్ (ఏఓఎస్) సంస్థకు సరఫరా చేస్తారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యాక రోజుకు 6.33 మిలియన్ల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది.

ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో భాగంగా కేన్స్ సెమీకాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం కీలక ముందడుగు. ఈ పథకం ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో, మైక్రాన్ టెక్నాలజీ తర్వాత వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించనున్న రెండో సెమీ కండక్టర్ కేంద్రం ఇదే అవుతుంది.

భారతదేశంలో ఉత్పత్తి దశలోకి అడుగుపెడుతున్న రెండో ఓఎస్ఏటీ/ఏటీఎంపీ (అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ / అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్) యూనిట్‌గా నిలవటమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. భారత సంతతికి చెందిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) సంస్థ సెమీ కండక్టర్ తయారీ రంగంలోకి రావటాన్ని ఇది సూచిస్తుంది. తద్వారా దేశీయ ఉత్పాదక సామర్థ్యం బలోపేతం అవుతుంది

భారత సెమీ కండక్టర్ తయారీ రంగంలో లోటును భర్తీ చేస్తూ, దేశీయంగా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ సామర్థ్యాన్ని పెంపొందించటానికి ఈ కేంద్రం దోహదపడుతుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక తయారీ రంగంలో స్వావలంబన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.

వావ్-థరాడ్‌లో పీఎం

రూ. 20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలను నిర్వహించి, జాతికి అంకితం చేయనున్నారు. ఇవి విద్యుత్, రైల్వే, రహదారి రవాణా, జాతీయ రహదారులు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు.

రూ. 5,100 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన, ప్రవేశ నియంత్రణ గల అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరచటంతో పాటు ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం (డీఎస్‌ఐఆర్‌)లో పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తూ, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది.

రహదారికి ఇరువైపులా పార్శ్వ మార్గాలతో కూడిన 4-లైన్ల ఇదార్-బదోలి బైపాస్ సెక్షన్ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఎన్‌హెచ్‌-754కే లోని ధోలవీర-మౌవాన-వావువ-సంతల్పూర్ సెక్షన్ (ప్యాకేజీ-II)ను రెండు-లైన్ల రహదారికి ఇరువైపులా పార్శ్వ మార్గాలతో అభివృద్ధి చేసే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు హైవే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాక, ధోలవీర వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. రవాణా సామర్థ్యాన్ని పెంచి, ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థికాభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

కీలకమైన రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో గాంధీనగర్-కోబా-ఎయిర్‌పోర్టు రోడ్డులోని భైజీపురా జంక్షన్ వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ ఒకటి. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించటమే కాక, ఫ్లైఓవర్ కింద సరైన పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. గాంధీనగర్-కోబా-అరోడ్రామ్ రోడ్డులోని పీడీపీయూ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గాంధీనగర్ నుంచి విమానాశ్రయాన్ని కలిపే ఈ రహదారి గుండా రోజూ 1,40,000కుపైగా వాహన రాకపోకలు సాగుతుంటాయి. ఈ నూతన ఫ్లైఓవర్ నిర్మాణంతో అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య సీహెచ్-0 జంక్షన్ నుంచి విమానాశ్రయం వరకు ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

సుమారు రూ.3,650 కోట్ల వ్యయంతో నిర్మించిన కీలక విద్యుత్ సరఫరా ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. వీటిలో ఖావ్డా పూలింగ్ స్టేషన్-2, 4.5 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన తరలింపునకు అనుబంధ సరఫరా వ్యవస్థలు ప్రధానమైనవి. ఈ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధన అనుసంధానాన్ని పటిష్టం చేయటమే కాక, విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.

రైల్వే రంగానికి సంబంధించి కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారు. వీటిలో రాజ్‌కోట్-కనాలుస్ డబ్లింగ్ ప్రాజెక్టు (111.20 కి.మీ.)లో భాగంగా పూర్తి చేసిన కనాలుస్-జామ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు (28 కి.మీ.), గాంధీధామ్-ఆదిపూర్ సెక్షన్ (10.69 కి.మీ.) నాలుగు లైన్ల విస్తరణ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల రైల్వే సామర్థ్యం పెరుగుతుంది. రద్దీ తగ్గుతుంది. కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడుతుంది. ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణాను మరింత వేగవంతం చేసేందుకు ఇవి సహకరిస్తాయి.

హిమ్మత్‌నగర్-ఖేద్‌బ్రహ్మ మధ్య పూర్తయిన గేజ్ మార్పిడి ప్రాజెక్టును (54.83 కి.మీ) కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతంలో రైలు అనుసంధానాన్ని మెరుగుపరచటంతో పాటు ప్రయాణికుల రాకపోకలను ఇది సులభతరం చేస్తుంది. ఖేద్‌బ్రహ్మ-హిమ్మత్‌నగర్-అసర్వా రైలు సర్వీసును కూడా ఆయన ప్రారంభిస్తారు.

నగర మౌలిక సదుపాయాలను పెంపొందించటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా గుజరాత్ వ్యాప్తంగా సుమారు రూ.5,300 కోట్ల విలువైన 44 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అహ్మదాబాద్‌లోని అసర్వా సివిల్ ఆస్పత్రిలో 858 పడకల రైన్ బసేరా, గాంధీనగర్ సివిల్ ఆస్పత్రి, జీఎంఈఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలోనూ ఈ తరహా సదుపాయాన్ని ప్రారంభించడంతో పాటు వివిధ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

పర్యాటక అనుభూతిని మెరుగుపరచటం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించటమే లక్ష్యంగా పటాన్‌లోని రాణి కీ వావ్ వద్ద లైట్ అండ్ సౌండ్ షో, వడ్ నగర్‌లోని శర్మిష్ట సరసు వద్ద వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ షో సహా పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. బనస్కాంతలోని బలరామ్ మహాదేవ్, విశ్వేశ్వర మహాదేవ్ ఆలయాల వద్ద పర్యాటక మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన చేస్తారు.

సుమారు రూ.1,780 కోట్ల విలువైన రెండు భారీ నీటి పైప్‌లైన్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారు. వీటిలో బనస్కాంతలోని కసారా-దంతివాడ పైప్‌లైన్‌.. పటాన్, బనస్కాంత జిల్లాల ద్వారా వెళ్లే దింద్రోల్-ముక్తేశఅవర్ పైప్‌లైన్‌ ప్రాజెక్టులున్నాయి. అంబాజీ, దాని పరిసర గ్రామీణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పథకానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం ద్వారా బనస్కాంత జిల్లాలోని దాంతా, అమీర్‌గఢ్‌ తాలూకాల్లోని సుమారు 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇది అంబాజీ పట్టణంతో పాటు 34 గ్రామాలకు తాగునీటిని అందిస్తుంది. సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడి వ్యయంతో గాంధీనగర్‌లో చేపట్టనున్న మూడు సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ విస్తరణ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్‌లో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల సౌకర్యార్థం దీన్ని నిర్మించారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఆగష్టు 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision