ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీహార్ లోని మోతీహారీలో రూ. 7,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. అనంతరం, ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం పశ్చిమ బెంగాల్ చేరుకుని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ. 5,000 కోట్ల విలువ గల అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమిస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధానమంత్రి బీహార్ పర్యటన విశేషాలు
రైల్వేలు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతకు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమిస్తారు.
అనుసంధానం, ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలన్న దార్శనికతకు అనుగుణంగా ప్రధాని పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. సమస్తిపూర్-బచ్ఛ్ వాడా మధ్య రైల్వే లైనులో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు – ఈ చర్య ఈ సెక్షన్ లో రైళ్ళను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుంది. దర్భంగా- సమస్తిపూర్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగమైన దర్భంగా-థల్ వాడా, సమస్తిపూర్-రామభద్రపూర్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు – రూ. 580 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల వల్ల రైళ్ళ నిర్వహణ మెరుగుపడటంతోపాటు అనవసరమైన జాప్యం తగ్గుతుంది.
ప్రధానమంత్రి పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. పాటలీపుత్రలో వందే భారత్ రైళ్ళ నిర్వహణకు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు, 114 కిలోమీటర్ల పొడవున్న భట్నీ-ఛాప్రా గ్రామీణ్ రైల్వే లైన్ లో రైలు నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు వంటివి ఉన్నాయి. ట్రాక్షన్ వ్యవస్థ బలోపేతం, ఇంధన సామర్థ్యం మెరుగుదల ద్వారా రైళ్ళను మరింత వేగంగా వెళ్లేందుకు వీలుగా చేపట్టిన భట్నీ-ఛాప్రా గ్రామీణ్ సెక్షన్ ట్రాక్షన్ వ్యవస్థ నవీకరణ పనులను ప్రధాని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉత్తర బీహార్ కు మిగతా దేశంతో అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు, మరిన్ని ప్యాసింజర్ రైళ్ళు, గూడ్సు బళ్ళు నడిపేందుకు అవసరమయ్యే సెక్షన్ సామర్థ్యం కోసం రూ. 4,080 కోట్ల వ్యయంతో దర్భంగా-నార్కటియాగంజ్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులను శ్రీ మోదీ ప్రారంభిస్తారు.
319 జాతీయ రహదారి ఆరా-మోహియానా, 922 జాతీయ రహదారి పాట్నా-బక్సర్ లకు మెరుగైన అనుసంధానం, మార్గాల మధ్య ప్రయాణ సమయం తగ్గించే లక్ష్యంగా నేషనల్ హైవే 319పై నాలుగు వరసల ఆరా బైపాస్ ఏర్పాటు పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ చర్య ఈ ప్రాంతంలో రహదారి రవాణాకు ఊతమిస్తుంది.
ప్రధానమంత్రి నేషనల్ హైవే 319లోని పరారియా-మోహానియా 4 వరసల సెక్షన్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 820 కోట్లు. 319 జాతీయ రహదారిలో భాగమైన ప్రాజెక్టు ఆరా పట్టణాన్ని ఎన్ హెచ్-02 (గోల్డెన్ క్వాడ్రిలేటరల్) తో అనుసంధానిస్తుంది. దాంతో సరుకు రవాణ, ప్రయాణికుల రాకపోకలు మెరుగవుతాయి. ఎన్ హెచ్-333సీ లోని సర్వాన్ నుండి చకయి వరకు సాగే నున్నని 2 వరసల రోడ్డు.. సరుకులు, ప్రజల రాకపోకల్ని సులభతరం చేయడమే కాక, బీహార్, జార్ఖండ్ ల మధ్య కీలక అనుసంధాన మార్గంగా పనిచేస్తుంది.
ఐటీ, ఐటీఇఎస్, ఇఎస్‌డీఎం పరిశ్రమలు, అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి దర్భంగాలో న్యూ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) సౌకర్యాన్నీ, పాట్నాలో ఎస్‌టిపిఐ అత్యాధునిక ఇంక్యుబేషన్ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు. ఈ సౌకర్యాలు ఐటి సాఫ్ట్ వేర్, సేవా ఎగుమతులకు ఊతమిస్తాయి. ఇది వర్ధమాన వ్యవస్థాపకులకు ఉపయోగపడే టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది. ఆవిష్కరణలు, ఐపిఆర్, నూతన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తుంది.
బీహార్‌లో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద మంజూరైన పలు మత్స్య అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఇది బీహార్‌లోని వివిధ జిల్లాల్లో కొత్త చేపల చెరువులు, బయోఫ్లాక్ యూనిట్లు, అక్వేరియం చేపల పెంపకం, సమీకృత ఆక్వాకల్చర్ యూనిట్లు, ఫిష్ ఫీడ్ మిల్లులు సహా అత్యాధునిక మత్స్య మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దోహదపడుతుంది. ఆక్వాకల్చర్ ప్రాజెక్టులు బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, చేపల ఉత్పత్తిని పెంచడంలో, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించడంలో, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడతాయి.
రైల్వే నెట్ వర్క్ ను భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మరీ తీర్చిదిద్దాలన్న తన విజన్‌కు అనుగుణంగా, నాలుగు ‘అమృత్ భారత్’ రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్- న్యూఢిల్లీ మధ్య, బాపూధామ్- ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్) మధ్య, దర్భంగా- లక్నో (గోమతీ నగర్) మధ్య, మాల్దా టౌన్ - భాగల్పూర్ మీదుగా లక్నో (గోమతీ నగర్) మధ్య ఈ కొత్త రైలు సర్వీసులు ప్రారంభం అవుతాయి.
ఈ నూతన రైలు సర్వీసులను ప్రారంభించనుండడంతో, ఆయా ప్రాంతాలకు సంధానం పెరుగుతుంది.
సుమారు 61,500 స్వయంసహాయ బృందాలకు (ఎస్‌హెచ్‌జీస్) రూ.400 కోట్లను ‘దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్’ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్)లో భాగంగా ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. అభివృద్ధి సాధనలో మహిళలకు ముఖ్య పాత్రను కల్పించడంపై దృష్టి కేంద్రీకరిస్తూ, 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఎస్‌హెచ్‌జీలలో సభ్యత్వాన్ని ఇచ్చారు.
పన్నెండు వేల మంది లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’లో భాగంగా, కొంతమంది లబ్ధిదారులకు ఇళ్ల తాళంచెవులను ప్రధానమంత్రి అందజేస్తారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్’ కింద 40,000 మంది లబ్దిదారులకు రూ.160 కోట్లకు పైగా నిధులను ప్రధానమంత్రి విడుదల చేస్తారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రధానమంత్రి
చమురు, గ్యాస్, విద్యుత్తు, రోడ్లు, రైల్వే రంగాల అవసరాలను తీర్చగల అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు ఆయా ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో చమురు, గ్యాస్ రంగ మౌలిక సదుపాయాలను పెంచే పనుల్లో భాగంగా బాంకుడా, పురులియా జిల్లాల్లో ఏర్పాటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)కు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.1,950 కోట్లతో నిర్మించనున్నారు. గృహాలకు, వాణిజ్య సంస్థలకు, పరిశ్రమలకు పీఎన్‌జీని సరఫరా చేయడంతో పాటు, చిల్లర విక్రయకేంద్రాలకు సీఎన్‌జీనీ కూడా ఈ ప్రాజెక్టు అందించనుంది. ఈ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ప్రధానమంత్రి 132 కి.మీ. పొడవైన దుర్గాపూర్ నుంచి కోల్‌కతా సెక్షన్ గొట్టపుమార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ గొట్టపుమార్గాన్ని ప్రతిష్ఠాత్మక జగ్‌దీశ్‌పూర్-హల్దియా, బొకారో-ధామ్‌రా పైప్‌లైనులో భాగంగా ఏర్పాటు చేశారు. దీనిని ‘ప్రధాన్ మంత్రీ ఊర్జా గంగా (పీఎంయూజీ) ప్రాజెక్టు’గా వ్యవహరిస్తున్నారు. దుర్గాపూర్ నుంచి కోల్‌కతా సెక్షనును రూ.1,190 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ బర్ధమాన్, హుగ్లీ, నదియా జిల్లాల గుండా సాగుతుంది. ఈ గొట్టపుమార్గాన్ని నిర్మించిన కాలంలో అనేకమందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ ప్రాంతంలో లక్షలాది ఇళ్లకు సహజవాయువును సరఫరా చేయడానికి ఈ పైప్‌లైను తోడ్పడనుంది.
ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి అందే దిశగా కార్యక్రమాలను అమలు చేస్తామనీ, అందరికీ ఆరోగ్య సంరక్షణకు పూచీపడతామన్న ప్రధానమంత్రి వాగ్దానాలకు అనుగుణంగానే, ఆయన దుర్గాపూర్ స్టీల్ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ఏర్పాటైన రెట్రోఫిటింగ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ అయిన ‘ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ)ని జాతికి అంకితమివ్వనున్నారు. దీంతో పాటుగా దామోదర్ వ్యాలీ కార్పొరేషనుకు చెందిన రఘునాథ్‌పూర్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి దేశ ప్రజలకు అంకితం చేస్తారు. వీటి నిర్మాణానికి రూ.1,457 కోట్లకు పైగా ఖర్చయింది. ఈ సదుపాయాలు స్వచ్ఛ ఇంధన ఉత్పాదకతకు తోడ్పడడంతో పాటు, ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయి.
పురులియాలో 36 కి.మీ. పొడవున ఏర్పాటు చేసిన పురులియా-కోట్‌శిల డబల్ లైనును ప్రధానమంత్రి దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. రూ.390 కోట్లకు పైగా ఖర్చుతో ఈ రైలుమార్గం డబ్లింగు పనులను పూర్తి చేశారు. ఇది జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్‌లలోని పరిశ్రమలకు రాంచీ, కోల్‌కతాలతో రైలు సంధానాన్ని మెరుగుపరుస్తుంది. సరకు రవాణా రైలుబండ్లు ఇదివరకటితో పోలిస్తే మరింత సమర్ధంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది.ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది.
‘సేతు భారతం కార్యక్రమం’లో భాగంగా పశ్చిమ బర్ధమాన్ లోని తోప్సీ, పందబేశ్వర్‌లలో నిర్మించిన రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జిలను (ఆరోఓబీస్) ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి రూ.380 కోట్లకు పైగా ఖర్చయింది. ఈ ఆర్ఓబీవల్ల... అనుసంధానం మెరుగుకావడంతోపాటు, రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
Will be in Motihari, Bihar, tomorrow, 18th July. Development works worth Rs. 7200 crore will be dedicated to the nation or their foundation stones would be laid. These works cover Software Technology Parks, four new Amrit Bharat trains, road projects and more.…
— Narendra Modi (@narendramodi) July 17, 2025
बिहार की विकास यात्रा में कल 18 जुलाई का दिन ऐतिहासिक होने वाला है। सुबह करीब 11.30 बजे मोतिहारी में कनेक्टिविटी, IT और स्टार्टअप से जुड़े राज्य के कई प्रोजेक्ट के उद्घाटन-शिलान्यास का सौभाग्य मिलेगा। इससे यहां के लोगों के लिए अवसरों के अनेक द्वार खुलेंगे।…
— Narendra Modi (@narendramodi) July 17, 2025
Looking forward to being among the people of West Bengal tomorrow, 18th July. At a programme in Durgapur, will lay the foundation stones for various works and also inaugurate projects worth over Rs. 5000 crore. The projects cover sectors like oil and gas, power, railways, roads.…
— Narendra Modi (@narendramodi) July 17, 2025
আগামীকাল,১৮ই জুলাই, পশ্চিমবঙ্গের মানুষের মাঝে যাবার জন্যে উদগ্রীব হয়ে আছি। দুর্গাপুরে,একটি অনুষ্ঠানে, তেল, গ্যাস, বিদ্যুৎ, রেল এবং সড়ক ক্ষেত্রের বেশ কয়েকটি প্রকল্পের শিলান্যাস করব এবং ৫০০০ কোটি টাকার বেশি বিনিয়োগের কয়েকটি প্রকল্পের উদবোধনও করব।https://t.co/P9QZsd6uRo
— Narendra Modi (@narendramodi) July 17, 2025


