ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17వ జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకు గాను ప్రధానమంత్రి అవార్డులను ఆయన ప్రదానం చేయనున్నారు.
భారతదేశం అంతటా ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులు తమను తాము ప్రజా ప్రయోజనాలకు అంకితం చేసుకోవాలని, ప్రజా సేవకు కట్టుబడి ఉండాలని, చేస్తున్న పనిలో ఔన్నత్యానికి కృషి చేయాలని ప్రధాన మంత్రి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జిల్లాల సమగ్ర అభివృద్ధి, ఆశావహ బ్లాక్‌ల కార్యక్రమం, ఆవిష్కరణలు తదితర విభాగాల్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు 16 అవార్డులను మోదీ ప్రదానం చేయనున్నారు. సామాన్యుల సంక్షేమం కోసం చేసిన కృషికి ఈ అవార్డుల ద్వారా గుర్తింపు లభిస్తుంది.


