గౌరవనీయులైన ప్రధానమంత్రి క్రిస్టెర్సన్ గారికి,

గౌరవనీయులైన ఉర్సులా గారికి,
ఇరు దేశాల ప్రతినిధులకు,
మీడియా మిత్రులకు,

నమస్కారం!

అన్నింటికంటే ముందుగా నాకు లభించిన ఆత్మీయ స్వాగతానికి ప్రధానమంత్రి క్రిస్టెర్సన్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

స్వీడన్, ఐరోపా దేశాల పారిశ్రామిక గుండె లాంటి నగరమైన గోథెన్‌బర్గ్‌లో నా పర్యటనకు సరికొత్త ప్రాముఖ్యతను చేకూరుస్తూ నేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉర్సులా గారికి నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, 

భారత్, స్వీడన్ మధ్య ఉన్న బంధం ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన, మానవ కేంద్రిత అభివృద్ధి అనే బలమైన పునాదులపై నిర్మితమైంది. మన ఇరు దేశాలు ఆవిష్కరణలను వృద్ధికి చోదకశక్తిగా, స్థిరత్వాన్ని ఒక ఉమ్మడి బాధ్యతగా, ప్రజాస్వామ్యాన్ని మన బలంగా భావిస్తాయి. 

నేటి సమావేశంలో ఈ ఉమ్మడి విలువలు, పరస్పర ప్రయోజనాల ఆధారంగా మన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై మేం చర్చించాం. అన్ని రంగాల్లో మన భాగస్వామ్యం విస్తరిస్తున్న నేపథ్యంలో మన సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని మేం నిర్ణయించాం. ఈ భాగస్వామ్యం కింద హరిత పరివర్తన, రక్షణ రంగం, కొత్తగా వస్తోన్న సాంకేతికతలు, ప్రజల మధ్య సంబంధాల వంటి కీలక రంగాల్లో మనం కలిసి ముందుకు సాగుతాం.

మిత్రులారా, 

ఏఐ, ఆరోగ్య సాంకేతికత, హరిత రవాణా వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన రంగాల్లో మన మధ్య సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్‌లో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో స్వీడన్‌కు చెందిన ఒక పెద్ద వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొంది. ‘స్వీడన్-ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడార్’ను మరింత బలోపేతం చేయడానికి మేం నిర్దిష్టమైన కార్యక్రమాలపై కలిసి పనిచేస్తాం. 

ఇరు దేశాల అంకురాలు, పరిశోధనా వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం 'భారత్ - స్వీడన్ శాస్త్ర విజ్ఞాన కేంద్రం'ను స్థాపించబోతున్నాం. 

వాతావరణ మార్పు, సుస్థిరత విషయాల్లో భారత్, స్వీడన్ ఆలోచనల మధ్య బలమైన సారూప్యత ఉంది. మన ఉమ్మడి అంతర్జాతీయ కార్యక్రమం అయిన 'లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్' లేదా లీడ్-ఐటీ కింద మనం తక్కువ కార్బన్ ఉద్గారాల పారిశ్రామిక పరివర్తనపై దృష్టి సారిస్తున్నాం. నేడు మేం దీని మూడో దశపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. 

హరిత హైడ్రోజన్, చక్రీయ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో భారతదేశం భారీ ఎత్తున పనులు చేపడుతోంది. స్వీడన్ అత్యాధునిక సాంకేతికతను భారతదేశపు విస్తృత సామర్థ్యాన్ని ఒకచోట చేర్చడం ద్వారా మనం యావత్ ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే పర్యావరణ పరిష్కారాలను సృష్టించగలం. ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్, స్వీడన్ల సహకారం కూడా వాతావరణ మార్పులపై ప్రపంచ అవగాహనను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

మిత్రులారా, 

రక్షణ రంగంలో మన మధ్య సహకారం నిరంతరం వృద్ధి చెందుతోంది. స్వీడన్ కంపెనీలు భారత్‌లో తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయటం అనేది మన భాగస్వామ్యం కేవలం ఒక కొనుగోలుదారు-విక్రేత బంధాన్ని దాటి దీర్ఘకాలిక పారిశ్రామిక సహకారంగా మారుతోందని స్పష్టం చేస్తోంది.

మిత్రులారా, 

ఉర్సులా గారు పాల్గొనటం వల్ల ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏడాది జనవరిలో ఆమె భారత్ పర్యటనకు వచ్చినప్పుడు భారత్-ఈయూ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మేం కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల తాలూకు ఫలితాలలో మంచి పురోగతి కనిపిస్తుండడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 

భారత్-ఈయూ ఎఫ్‌టీఏ పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు, కొత్త ఆవిష్కర్తలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఉర్సులా గారు చెప్పినట్లుగా ఇది అన్ని ఒప్పందాలలోకెల్లా అత్యంత కీలకమైనది.

‘రక్షణ - భద్రతా భాగస్వామ్యం, రవాణా ఒప్పందం’.. మన వ్యూహాత్మక, ప్రజా-కేంద్రిత భాగస్వామ్యానికి సరికొత్త బలాన్ని చేకూర్చాయి. 'భారత్-ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి'.. మన పరస్పర సహకారాన్ని మరింత పటిష్ఠం చేసింది. మనం ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, దృఢమైన సరఫరా వ్యవస్థలు, ఆవిష్కరణల వంటి రంగాల్లో కలిసి పనిచేస్తున్నాం.

యావత్ ప్రపంచంలో శాంతి, స్థిరత్వానికి భారత్, ఐరోపా మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సారూప్యత ఎంతో అవసరం.

మిత్రులారా, 

నేటి ఉద్రిక్త ప్రపంచంలో భారత్, స్వీడన్ వంటి ప్రజాస్వామ్య దేశాల మధ్య సన్నిహిత సహకారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివిధ ఉద్రిక్తతలు, సవాళ్లను పరిష్కరించడానికి మేం ఎల్లప్పుడూ చర్చలు, దౌత్య విధానాలకే ప్రాధాన్యతనిచ్చాం. 

ఉగ్రవాదం అనేది మానవాళి మొత్తానికి ఒక తీవ్రమైన సవాలు అనే అంశంపై భారత్, స్వీడన్ దేశాలు ఏకీభవిస్తున్నాయి. గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత స్వీడన్ నుంచి లభించిన మద్దతుకు గాను నేను ప్రధానమంత్రి క్రిస్టెర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదానికి, దానికి మద్దతు ఇచ్చే శక్తులకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని మేం ఇలాగే కొనసాగిస్తాం. 

గౌరవనీయులారా, 

అర్థవంతంగా జరిగిన నేటి చర్చల విషయంలో నేను మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా భారత్- స్వీడన్, భారత్-ఐరోపా భాగస్వామ్యాలు నిరంతరం ముందుకు సాగుతాయని.. అలాగే ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు కలిసికట్టుగా మన సహకారాన్ని అందిస్తూనే ఉంటామని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.

ధన్యవాదాలు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
103 Cr Internet Connections, 66 Cr Daily UPI Transactions: PM Modi Highlights Digital India Impact At 11

Media Coverage

103 Cr Internet Connections, 66 Cr Daily UPI Transactions: PM Modi Highlights Digital India Impact At 11
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 జూలై 2026
July 01, 2026

PM Modi's Vision: Driving Digital Empowerment, Inclusive Development and India's Global Rise