షేర్ చేయండి
 
Comments
Accord priority to local products when you go shopping: PM Modi
During Mann Ki Baat, PM Modi shares an interesting anecdote of how Khadi reached Oaxaca in Mexico
Always keep on challenging yourselves: PM Modi during Mann Ki Baat
Learning is growing: PM Modi
Sardar Patel devoted his entire life for the unity of the country: PM Modi during Mann Ki Baat
Unity is Power, unity is strength: PM Modi
Maharishi Valmiki's thoughts are a guiding force for our resolve for a New India: PM

నా ప్రియమైన దేశ వాసులారా! విజయదశమి పండుగ అంటే దసరా పర్వదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అసత్యంపై సత్యం గెలుపుకు సూచన దసరా పండుగ.  కష్టాలపై ధైర్యం విజయానికి కూడా ఒక సూచిక ఇది. ఈ రోజు మీరందరూ ఎంతో సంయమనంతో జీవిస్తున్నారు. పండుగలను హుందాగా జరుపుకుంటున్నారు. అందువల్ల ఈ యుద్ధంలో మన విజయం ఖాయం. ఇంతకుముందు దుర్గాదేవి  మంటపాల్లో  తల్లి దర్శనం కోసం భారీగా జనం వచ్చేవారు. అక్కడ జాతర లాంటి  వాతావరణం ఉండేది.  కానీ ఈసారి అలాంటి వాతావరణం లేదు. ఇంతకుముందు దసరా సందర్భంగా పెద్ద ఉత్సవాలు కూడా జరిగేవి. కానీ ఈసారి ఈ పండుగ భిన్నంగా ఉంటుంది. రామ్‌లీలా పండుగ కూడా పెద్ద ఆకర్షణ. కానీ ఈసారి అందులో కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇంతకుముందు నవరాత్రులలో గుజరాత్  గార్బా  సందడి ప్రతిచోటా ఉండేది.  ఈసారి పెద్ద ఉత్సవాలెవీ జరగడం లేదు.  ఇంకా మరెన్నో పండుగలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈద్, శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి పండుగలున్నాయి. తర్వాత ధంతేరస్, దీపావళి, భాయి-దూజ్, ఆరవ మాత ఆరాధన, గురు నానక్ దేవ్ జీ జన్మదినం ఇవన్నీ ఉన్నాయి. ఈ కరోనా సంక్షోభంలో మనం సంయమనంతో ఉండాలి. గౌరవంగా ఉండాలి. 

మిత్రులారా! మనం పండుగ గురించి మాట్లాడేటప్పుడు, పండుగకు సన్నాహాలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుకు వస్తుంది.  మార్కెట్‌కు ఎప్పుడు వెళ్ళాలి? ఏమేం  కొనాలి  అనే విషయం గుర్తుకొస్తుంది.  ముఖ్యంగా పిల్లలకు షాపింగ్ అంటే ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఈసారి పండుగ సందర్భంగా కొత్త వస్తువులేం  దొరుకుతాయి మార్కెట్లో? ఈ పండుగ ఉత్సవాలు, మార్కెట్ చైతన్యం ఒకదానితో మరొక దానికి సంబంధం ఉన్న అంశాలు. ఈ సమయంలో మీరు షాపింగ్‌కు వెళ్ళినప్పుడు 'వోకల్ ఫర్ లోకల్' అన్న మన సంకల్పం గుర్తుంచుకోండి. మార్కెట్ లో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మనం  స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

మిత్రులారా! ఈ పండుగ వేడుకల మధ్యలో లాక్డౌన్ సమయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. లాక్డౌన్లో సమాజానికి సన్నిహితులైనవారిని మరింత దగ్గరగా చూశాం.  వారు లేకుండా మన జీవితం చాలా కష్టంగా ఉంటుంది. స్వీపర్లు, ఇంట్లో పనిచేసే సోదర సోదరీమణులు, స్థానికంగా కూరగాయలు అమ్మేవారు, పాలమ్మే వాళ్లు,  సెక్యూరిటీ గార్డులు మొదలైనవారి పాత్ర మన జీవితంలో ఎంతగా ఉందో ఇప్పుడు బాగా తెలుసుకున్నాం. కష్ట సమయాల్లో వీరంతా మనతో ఉన్నారు. మనందరితో ఉన్నారు.  ఇప్పుడు మన పండుగలనూ మన ఆనందాలను కూడా వారితో పంచుకోవాలి.  వీలైనప్పుడల్లా వాటిని మీ ఆనందంలో చేర్చమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారిని మన కుటుంబ సభ్యుడిలా భావించండి.  అప్పుడు మీ ఆనందం ఎంత పెరుగుతుందో మీరు చూస్తారు. 

మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన  సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు.  వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని  నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం స్థానిక వస్తువులను ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రపంచం కూడా మన స్థానిక ఉత్పత్తులపై అభిమానం ప్రదర్శిస్తోంది. మన స్థానిక ఉత్పత్తులలో అధిక శాతం వస్తువులకు ప్రపంచవ్యాప్తమయ్యేందుకు తగినంత భారీ శక్తి ఉంది. దీనికి  ఒక ఉదాహరణ ఖాదీ. ఖాదీ చాలా కాలంగా సాధారణ జీవితానికి ప్రతీక. కానీ, ఈ రోజుల్లో మన ఖాదీ పర్యావరణ అనుకూల వస్త్రంగా పేరుపొందింది. ఆరోగ్య పరంగా ఇది శరీరానికి అనుకూలంగా ఉండే ఫాబ్రిక్.  అన్ని కాలాల్లో ఉపయోగపడే వస్త్రం ఇది. ఈరోజుల్లో  ఖాదీ ఫ్యాషన్ కు గుర్తుగా మారింది. ఖాదీకి ఆదరణ పెరుగుతోంది.  అదే సమయంలో ఖాదీ ప్రపంచంలో చాలా చోట్ల తయారవుతోంది. మెక్సికోలో 'ఓహాకా' అనే స్థలం ఉంది. అక్కడ చాలా గ్రామాల్లో స్థానికులు ఖాదీ నేస్తున్నారు.  ఇప్పుడు అక్కడి ఖాదీ 'ఓహాకా ఖాదీ' గా ప్రసిద్ది చెందింది. ఖాదీ ఓహాకాకు ఎలా చేరుకుండానే విషయం కూడా చాలా ఆసక్తి కలిగిస్తుంది. వాస్తవానికి మెక్సికోకు చెందిన మార్క్ బ్రౌన్ అనే యువకుడు ఒకసారి మహాత్మా గాంధీపై తయారైన చిత్రం చూశాడు. ఆ సినిమా చూసిన తర్వాత బ్రౌన్ ను బాపు ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాపు జీవితంతో ఆయన  ప్రభావితుడయ్యాడు. భారతదేశంలోని బాపు ఆశ్రమానికి వచ్చాడు.   బాపు గురించి మరింత లోతుగా అర్థం చేసుకున్నాడు. ఖాదీ ఒక వస్త్రం మాత్రమే కాదని అది ఒక జీవన విధానం అని బ్రౌన్ గ్రహించాడు. దానితో  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన అనుసంధానమైన విధానం  బ్రౌన్ ను ప్రభావితం చేసింది.   ఇక్కడి నుండి మెక్సికో వెళ్లిన తర్వాత ఖాదీ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. మెక్సికోలోని ఓహాకాలోని గ్రామస్తులకు ఖాదీ పనిని నేర్పించాడు.  వారికి శిక్షణ ఇచ్చాడు. 'ఓహాకా ఖాదీ' ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్  వెబ్‌సైట్ లో  'చలనంలో ఉన్న ధర్మ చిహ్నం' అని ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న మార్క్ బ్రౌన్  ఇంటర్వ్యూ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో ప్రజలు ఖాదీపై సందేహాలు కలిగి ఉండేవారని,  అయితే, ప్రజలకు దానిపై ఆసక్తి పెరిగిందని, ఆ విధంగా ఖాదీ మార్కెట్ లోకి వచ్చిందని  ఆయన అంటారు. ఇవి రామ రాజ్యానికి సంబంధించిన విషయాలని, ప్రజల అవసరాలను తీర్చినప్పుడు, ప్రజలు కూడా మీతో వస్తారని బ్రౌన్ చెప్తారు. 

మిత్రులారా! ఈసారి గాంధీ జయంతి నాడు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లోని ఖాదీ దుకాణంలో ఒకే రోజులో కోటి రూపాయలకు పైగా కొనుగోళ్లు  జరిగాయి. అదేవిధంగా కరోనా కాలంలో ఖాదీ మాస్కులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. స్వయం సహాయక బృందాలు, ఇతర సంస్థలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఖాదీ మాస్కులు తయారు చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకిలో సుమన్ దేవి గారు  స్వయం సహాయక బృందంలోని తన తోటి మహిళలతో కలిసి ఖాదీ మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. క్రమంగా ఇతర మహిళలు కూడా వారితో చేరారు.  ఇప్పుడు వారంతా వేలాది ఖాదీ మాస్కులు తయారు చేస్తున్నారు. మన స్థానిక ఉత్పత్తుల ప్రత్యేకత ఏమిటంటే తరచుగా వాటితో తత్త్వశాస్త్రం అనుసంధానమై  ఉంటుంది.

నా ప్రియమైన దేశవాసులారా! మన వస్తువులు మనకు గర్వం కలిగించేవిగా ఉన్నప్పుడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వాటిపై ఆసక్తి  పెరుగుతుంది. మన ఆధ్యాత్మికత, యోగా, ఆయుర్వేదం మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించాయి. మన క్రీడలు కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. మల్ ఖంబ్  గా పేర్కొనే మన దేశీయ క్రీడ మల్ల స్తంభం ఈ రోజుల్లో చాలా ఇతర దేశాలలో కూడా ప్రాచుర్యంలో ఉంది. చిన్మయ పతంకర్, ప్రజ్ఞా  పతంకర్ అమెరికాలోని తమ ఇంటి నుండి మల్ ఖంబ్  నేర్పడం ప్రారంభించినప్పుడు, అది ఇంత విజయవంతం అవుతుందని వారికి తెలియదు. ఈ రోజు అమెరికాలో మల్ ఖంబ్ శిక్షణా కేంద్రాలు చాలా చోట్ల నడుస్తున్నాయి. మల్ ఖంబ్ నేర్చుకోవడం కోసం పెద్ద సంఖ్యలో అమెరికన్ యువకులు వాటిలో చేరుతున్నారు. జర్మనీ, పోలాండ్, మలేషియా మొదలైన సుమారు 20 ఇతర దేశాలలో మల్ ఖంబ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ  క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కూడా ప్రారంమైంది. ఇందులో అనేక దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటారు. భారతదేశంలో పురాతన కాలం నుండి ఇలాంటి ఆటలు చాలా ఉన్నాయి. ఇవి మనలో అసాధారణమైన వికాసం కలుగుతుంది. మన మనస్సుకు, శరీరానికి సమతుల్యత కలిగిస్తాయి. కానీ బహుశా మన యువ తరం  కొత్త సహచరులకు మల్ ఖంబ్ తో  అంతగా పరిచయం లేకపోవచ్చు. మీరు దీన్ని ఇంటర్నెట్‌లో శోధించి చూడాలి. మిత్రులారా! మన దేశంలో చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. మన యువ స్నేహితులు వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని నేర్చుకోవాలని, సమయానికి అనుగుణంగా కొత్తదనం పొందాలని నేను కోరుకుంటున్నాను. జీవితంలో పెద్దగా సవాళ్లు లేనప్పుడు ఉత్తమమైన వ్యక్తిత్వం కూడా బయటకు రాదు. కాబట్టి ఎప్పుడూ మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి.

నా ప్రియమైన దేశవాసులారా! అభ్యసనం వికాసానికి దారి తీస్తుంది. ఈ రోజు 'మన్ కి బాత్' లో ప్రత్యేకమైన అభిరుచి ఉన్న వ్యక్తిని మీకు  పరిచయం చేస్తాను. చదవడం, నేర్చుకోవడంలోని ఆనందాలను ఇతరులతో పంచుకోవాలనే అభిరుచి ఇది. పొన్ మరియప్పన్ గారు తమిళనాడులోని తుత్తుకుడిలో ఉంటారు. తుత్తుకుడిని పెర్ల్ సిటీ అని కూడా అంటారు. అంటే ముత్యాల నగరం అన్నమాట. ఇది ఒకప్పుడు పాండ్య సామ్రాజ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ నివసించే నా స్నేహితుడు పొన్ మరియప్పన్ గారు జుట్టు కత్తిరించే వృత్తిని నిర్వహిస్తున్నారు. సెలూన్ నడుపుతున్నారు. చాలా చిన్న సెలూన్ అది. ఆయన ఒక ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన పని చేశారు. తన సెలూన్లో కొంత భాగాన్ని లైబ్రరీగా మార్చారు. సెలూన్లో తన వంతు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక పుస్తకాన్ని  చదివి, తాను చదివిన దాని గురించి కొంచెం రాస్తే పొన్ మరియప్పన్ గారు ఆ కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తారు. ఇది సరదాగా ఉంది కదా! 

రండి..  తుత్తుకుడికి వెళ్దాం. పొన్ మరియప్పన్ గారితో మాట్లాడదాం. 

ప్రధానమంత్రి: పొన్ మరియప్పన్ గారూ! వణక్కం … నల్లా ఇర్ కింగ్డా?

(ప్రధానమంత్రి: పొన్ మరియప్పన్ గారూ! నమస్కారం.. మీరు ఎలా ఉన్నారు?)

పొన్ మరియప్పన్: గౌరవనీయ ప్రధానమంత్రి గారూ! వణక్కం  (తమిళంలో సమాధానం)

ప్రధానమంత్రి: వణక్కం, వణక్కం .. ఉంగలక్కే ఇంద లైబ్రరీ ఐడియా యప్పాడి వందదా 

(ప్రధానమంత్రి: వణక్కం, వణక్కం. మీకు లైబ్రరీ ఆలోచన ఎలా వచ్చింది? )

పొన్ మరియప్పన్: నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాను. నా కుటుంబ పరిస్థితుల కారణంగా నేను నా చదువును కొనసాగించలేకపోయాను. చదువుకున్నవారిని చూస్తుంటే నాలో ఏదో లోటు ఉన్నట్టు ఆనిపించేది. అందుకే మనం లైబ్రరీని ఎందుకు ఏర్పాటు చేయకూడదని నాకు ఆలోచన వచ్చింది.  లైబ్రరీ చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తుందని నాకు అనిపించింది. ఇది నాకు ప్రేరణగా మారింది. (తమిళంలో సమాధానం)

ప్రధానమంత్రి: ఉంగ్లక్కే యెంద పుత్తహం  పిడిక్కుం?

(ప్రధానమంత్రి: మీకు ఏ పుస్తకం ఎక్కువ ఇష్టం?)

పొన్ మరియప్పన్: నాకు 'తిరుక్కురళ్' అంటే చాలా ఇష్టం. (తమిళంలో సమాధానం) 

ప్రధానమంత్రి: ఉంగ కిట్ట పెసియదిల యెనక్క. రొంబ మగిలచి. నల వాడ తుక్కల్

(ప్రధానమంత్రి: మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీకు శుభాకాంక్షలు )

పొన్ మరియప్పన్: గౌరవనీయ ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నందుకు   నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. (తమిళంలో సమాధానం) 

ప్రధానమంత్రి: నల వాడ తుక్కల్

(ప్రధానమంత్రి: మీకు అనేక శుభాకాంక్షలు)

పొన్ మరియప్పన్: ధన్యవాదాలు, ప్రధానమంత్రి గారూ..  (తమిళంలో సమాధానం) 

ప్రధానమంత్రి: ధన్యవాదాలు.

 

మనం ఇప్పుడు పొన్ మరియప్పన్‌తో మాట్లాడాం. చూడండి..  వారు ప్రజల జుట్టును ఎలా అలంకరిస్తారో, తమ జీవితాలను అలంకరించడానికి కూడా అంతే  ప్రాధాన్యత  ఇస్తారు. తిరుక్కురళ్ ప్రజాదరణ గురించి వినడానికి చాలా బాగుంది. తిరుక్కురళ్ ప్రజాదరణ గురించి మీరు కూడా విన్నారు. ఈ రోజు భారతదేశంలోని అన్ని భాషల్లో తిరుక్కురళ్ లభిస్తుంది. మీకు అవకాశం వస్తే తప్పకుండా చదవాలి.  జీవితానికి ఆ గ్రంథం మార్గదర్శిగా ఉంటుంది. 

మిత్రులారా! జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అపారమైన ఆనందాన్ని పొందేవారు భారతదేశం అంతటా చాలా మంది ఉన్నారని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ చదువుకోవడానికి ప్రేరణ లభించేలా  చూడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న వ్యక్తులు వీరు. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి ఉపాధ్యాయురాలు ఉషా దుబే గారు  స్కూటీని మొబైల్ లైబ్రరీగా మార్చారు. ప్రతిరోజూ ఆమె తన కదిలే లైబ్రరీతో ఏదైనా వేరే గ్రామానికి చేరుకుని అక్కడి పిల్లలకు బోధిస్తారు. పిల్లలు ప్రేమతో ఆమెను పుస్తకాల అక్కయ్య అని పిలుస్తారు. 

ఈ ఏడాది ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్‌లోని నిర్జులిలో రేయో గ్రామంలో స్వయం సహాయక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో లైబ్రరీ లేదని మీనా గురుంగ్ గారు, దివాంగ్ హోసాయ్ గారు  తెలుసుకున్నప్పుడు నిధుల సమీకరణకు సిద్ధమయ్యారు. ఈ లైబ్రరీకి సభ్యత్వం అవసరం లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైనా రెండు వారాల పాటు పుస్తకం తీసుకోవచ్చు. చదివిన తరువాత తిరిగి ఇవ్వాలి. ఈ లైబ్రరీ రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులు తెరిచి ఉంటుంది. చుట్టుపక్కల తల్లిదండ్రులు తమ పిల్లలు పుస్తకం చదవడంలో బిజీగా ఉండటం చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను కూడా ప్రారంభించిన సమయంలో వారు తమ పిల్లలు చదువుతుండడం చూసి సంతోషించారు.  అదే సమయంలో, చండీగఢ్ లో  ఎన్జీఓ నడుపుతున్న సందీప్ కుమార్ గారు  ఒక మినీ వ్యాన్‌లో మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు.  దీని ద్వారా పేద పిల్లలకు ఉచిత పఠనం కోసం పుస్తకాలు ఇస్తారు.

   గుజరాత్‌లోని భావ్‌నగర్ లో ఉన్న ఇలాంటి రెండు సంస్థల గురించి కూడా నాకు తెలుసు. వాటిలో ఒకటి 'వికాస్ వర్తుల్ ట్రస్ట్'. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సంస్థ చాలా సహాయపడుతుంది. ఈ ట్రస్ట్ 1975 నుండి పని చేస్తోంది. ఈ ట్రస్ట్  5,000 పుస్తకాలతో పాటు 140 కి పైగా పత్రికలను అందిస్తుంది. అలాంటి మరో సంస్థ 'పుస్తక్ పరబ్’ .  సాహిత్య గ్రంథాలతో పాటు ఇతర పుస్తకాలను కూడా ఉచితంగా అందించే వినూత్న ప్రాజెక్ట్ ఇది. ఈ లైబ్రరీలో ఆధ్యాత్మికత, ఆయుర్వేద వైద్యం మొదలైన అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇలాంటి ఇతర ప్రయత్నాల గురించి మీకు ఏమైనా తెలిస్తే వాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ఉదాహరణలు పుస్తకాన్ని చదవడానికి లేదా లైబ్రరీని తెరవడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి రంగానికి, ప్రతి విభాగానికి చెందిన ప్రజలు సమాజ అభివృద్ధికి వినూత్న మార్గాలను సొంతం చేసుకుంటున్న నవీన భారతదేశ  స్ఫూర్తిని సూచిస్తాయి. 

గీత పేర్కొంది –

నహి జ్ఞానేన సద్దశం పవిత్ర్ మిహ్ విద్యతే 

అంటే జ్ఞానంలా  ప్రపంచంలో ఏదీ స్వచ్ఛమైనది కాదు. జ్ఞానాన్ని వ్యాప్తి చేసే గొప్ప ప్రయత్నాలు చేసిన మహానుభావులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశ వాసులారా!  కొద్దిరోజుల తర్వాత అక్టోబర్ 31 న మనమందరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని 'జాతీయ ఐక్యత దినోత్సవం'గా జరుపుకుంటాం. 'మన్ కి బాత్' లో ఇంతకుముందు మనం సర్దార్ పటేల్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం. ఆయన గొప్ప వ్యక్తిత్వం లోని అనేక కోణాలను మనం చర్చించుకున్నాం. సైద్ధాంతిక లోతు, నైతిక స్థైర్యం, రాజకీయ విలక్షణత, వ్యవసాయ రంగంపై లోతైన జ్ఞానం, జాతీయ ఐక్యత పట్ల అంకితభావం – ఇవన్నీ ఒకే సమయంలో ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. సర్దార్ పటేల్ లో హాస్య ధోరణి గురించి  ఒక విషయం మీకు తెలుసా? ఒకవైపు రాచరికం ఉన్నస్వతంత్ర రాజ్యాలతో  చర్చలు, పూజ్య బాపు  సామూహిక ఉద్యమ నిర్వహణ ఏర్పాట్లు; మరోవైపు  బ్రిటిష్ వారితో పోరాటం – వీటన్నిటి మధ్యలో ఉన్న ఉక్కు  మనిషి  చిత్రాన్ని ఊహించుకోండి. ఆయన హాస్యం వర్ణ భరితంగా ఉండేది. సర్దార్ పటేల్ హాస్య ధోరణి తనను బాగా నవ్వించేదని  బాపు చెప్పేవారు. నవ్వీ నవ్వీ ఒక్కోసారి పొట్ట చెక్కలయ్యేదని బాపు అనేవారు. ఇది రోజుకు ఒకసారి కాకుండా చాలా సార్లు జరిగేదని ఆయన చెప్పేవారు.  ఇందులో మనకు కూడా ఒక పాఠం ఉంది. పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా మనలో హాస్య భావనను సజీవంగా ఉంచాలి.  అది మనను సహజంగా  ఉంచటమే కాకుండా మన సమస్యను కూడా పరిష్కరించేలా చేస్తుంది. సర్దార్ సాహెబ్ చేసిన పని ఇదే! 

నా ప్రియమైన దేశవాసులారా! సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితం చేసేందుకే  తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంతో భారత ప్రజలను అనుసంధానించారు. రైతుల సమస్యలను స్వాతంత్ర్యంతో అనుసంధానించడానికి కృషి చేశారు. స్వతంత్ర రాజ్యాలను మన దేశంలో కలిపేందుకు కృషి చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వ’ మంత్రాన్ని ప్రతి భారతీయుడి మనస్సులో ఉండేలా చేశారు. మిత్రులారా! ఈ రోజు మన ప్రసంగం, మన కార్యక్రమాలు, మన చర్యలు, ప్రతి క్షణం మనల్ని సంఘటితం చేసే అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్లాలి.  దేశంలోని ఒక మూలలో నివసిస్తున్న పౌరుడు తన వాడేనన్న భావన మరో భాగంలో నివసిస్తున్న పౌరుడి మనస్సులో కలిగేలా చేయాలి.  మన పూర్వికులు శతాబ్దాలుగా ఈ ప్రయత్నాలను నిరంతరం చేస్తున్నారు. కేరళలో జన్మించిన పూజ్య ఆది శంకరాచార్యులు భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు ముఖ్యమైన మఠాలను స్థాపించారు.  ఉత్తరాన బద్రికాశ్రమం,  తూర్పున పూరీ, దక్షిణాన శృంగేరి , పశ్చిమాన ద్వారక- ఇలా నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలను నెలకొల్పారు. శంకరాచార్య  శ్రీనగర్ కూడా వెళ్ళారు. అందుకే అక్కడ 'శంకరాచార్య కొండ' ఉంది. తీర్థయాత్ర భారతదేశాన్నిఏక సూత్రంతో అనుసంధానిస్తుంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాల శ్రేణి భారతదేశాన్ని ఒకే సూత్రంతో బంధిస్తుంది. త్రిపుర నుండి గుజరాత్ వరకు, జమ్మూ కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు స్థాపించిన మన 'విశ్వాస కేంద్రాలు' మనల్ని ఏకం చేస్తాయి. భక్తి ఉద్యమం భారతదేశమంతటా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది.  ఇది భక్తి ద్వారా మనలను ఏకం చేసింది. ఐక్యత శక్తిని కలిగి ఉన్న ఈ విషయాలు మన దైనందిన జీవితంలో ఎలా జీర్ణమైపోయాయి! ప్రతి ధార్మిక క్రియలో అనుష్ఠానానికి ముందు  వేర్వేరు నదులను ఆహ్వానించడం ఉంటుంది.  ఇందులో ఉత్తరాన ఉన్న సింధూ నది నుండి దక్షిణ భారతదేశ జీవనాధారమైన కావేరి నది వరకు ప్రతి నదీ ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు  ఐక్యత  మంత్రాన్ని పవిత్ర భావంతో పఠిస్తామని తరచుగా ఇక్కడి ప్రజలు చెప్తారు.

గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతీ I

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు II

 అదేవిధంగా సిక్కుల పవిత్ర స్థలాలలో 'నాందేడ్ సాహిబ్' , 'పాట్నా సాహిబ్' గురుద్వారాలు ఉన్నాయి. మన సిక్కు గురువులు కూడా తమ జీవితాల ద్వారా, మంచి పనుల ద్వారా ఐక్యత స్ఫూర్తిని పెంచారు. గత శతాబ్దంలో, మన దేశంలో, రాజ్యాంగం ద్వారా మనందరినీ ఏకం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. 

మిత్రులారా! 

ఐక్యతే శక్తి, ఐక్యతే బలం,

ఐక్యతే పురోగతి, ఐక్యతే సాధికారత,

ఐక్యంగా ఉంటే ఉన్నత శిఖరాలను చేరగలుగుతాం 

మన మనస్సులో సందేహాల బీజాలను నాటేందుకు, దేశాన్ని విభజించడానికి నిరంతరం ప్రయత్నించే శక్తులు కూడా ఉన్నాయి. ఈ దుర్మార్గపు ఉద్దేశ్యాలకు దేశం ప్రతిసారీ సమర్థవంతమైన సమాధానం ఇచ్చింది. మన సృజనాత్మకతతో, ప్రేమతో, మన అతి చిన్న పనుల్లో కూడా ప్రతి నిమిషం ప్రయత్నంతో 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్'లోని వర్ణమయ  కోణాన్ని ప్రదర్శించాలి.  ఐక్యతా   భావనలోని సౌందర్యాన్ని నిరంతరం ముందుకు తీసుకురావాలి. ప్రతి పౌరుడిలో ఏకత్వ భావన నింపాలి. ఒక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా మీ  అందరినీ నేను కోరుతున్నాను. ఆ వెబ్ సైట్ ekbharat.gov.in (ఏక్ భారత్ డాట్ గవ్ డాట్ ఇన్). జాతీయ సమైక్యత ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు ఇందులో కనిపిస్తాయి. ఈ వెబ్ సైట్ లో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అదే నేటి వాక్యం- ఆజ్ కా వాక్య్. వివిధ భాషలలో ఒక వాక్యాన్ని ఎలా మాట్లాడాలో ఈ విభాగంలో ప్రతిరోజూ నేర్చుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ కోసం మీరు కూడా వాక్యాలను పంపవచ్చు. ప్రతి రాష్ట్రం, సంస్కృతి ప్రకారం భిన్నమైన ఆహారపానీయాది  అంశాలుంటాయి. ఈ వంటకాలను స్థానిక ప్రత్యేక పదార్థాలు- అంటే ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' వెబ్‌సైట్‌లో ఈ స్థానిక ఆహార తయారీ స్థానిక పదార్ధాల పేర్లతో పంచుకోవచ్చా? ఐక్యతను, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది!

మిత్రులారా! ఈ నెల 31 న  కేవాడియాలోని చారిత్రక ఐక్యతా విగ్రహం దగ్గర జరిగే అనేక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం నాకు లభిస్తుంది. మీరు కూడా తప్పకుండా మాతో చేరండి.

నా ప్రియమైన దేశవాసులారా! అక్టోబర్ 31 న మనం 'వాల్మీకి జయంతి' కూడా జరుపుకుంటాం. నేను మహర్షి వాల్మీకికి నమస్కరిస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంగా దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహర్షి వాల్మీకి గొప్ప ఆలోచనలు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయి. బలాన్ని ఇస్తాయి. లక్షలాది, కోట్లాది పేదలు, దళితులకు వారు  గొప్ప ఆశా భావాన్ని కలిగిస్తారు. “మనిషిలో  సంకల్పం దృఢంగా  ఉంటే అతను ఏ పని అయినా చాలా తేలికగా చేయగలడు” అనేది మహర్షి వాల్మీకి సందేశం.  ఈ సంకల్ప శక్తి యువతకు అసాధారణమైన పనులు చేయడానికి బలాన్ని ఇస్తుంది. మహర్షి వాల్మీకి సానుకూల ఆలోచనా ధోరణికి బలాన్నిచ్చారు.  సేవ, హుందాతనం వాల్మీకి దృష్టి లో అత్యంత ముఖ్యమైనవి.  మహర్షి వాల్మీకి ఆచరణ, ఆలోచనలు, ఆదర్శాలు ఈ రోజు మన నవీన భారతదేశ సంకల్పానికి ప్రేరణగా, దిక్సూచిగా నిలుస్తాయి. రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేసేందుకు రామాయణం లాంటి ఇతిహాసాన్ని రూపొందించినందుకు మహర్షి వాల్మీకికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులం.  

అక్టోబర్ 31 న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీగారిని కోల్పోయాం. నేను సగౌరవంగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! కాశ్మీర్ లోని పుల్వామా ఈ రోజు దేశం మొత్తాన్ని చదివించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా పిల్లలు తమ హోం వర్క్ చేస్తారు.  నోట్స్ తయారు చేస్తారు.  పుల్వామా ప్రజల కృషి దాని వెనుక ఉంది. మొత్తం దేశంలోని పెన్సిల్ స్లేట్‌లో 90% అవసరాలను కాశ్మీర్ తీరుస్తోంది. అందులో ఎక్కువ భాగం పుల్వామా నుండి వచ్చిందే. గతంలో మనం  పెన్సిల్ కోసం కలపను విదేశాల నుండి దిగుమతి చేసుకునేవాళ్ళం. కాని ఇప్పుడు మన పుల్వామా దేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తోంది. వాస్తవానికి పుల్వామా నుండి వచ్చే ఈ పెన్సిల్ స్లేట్లు రాష్ట్రాల మధ్య అంతరాలను తగ్గిస్తున్నాయి. లోయలో ఉండే చినార్ వృక్షం నుండి వచ్చే కలపలో అధిక తేమ శాతం, మృదుత్వం ఉంటాయి. ఇది పెన్సిల్స్ తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది. పుల్వామాలోని ఉక్ఖును ‘పెన్సిల్ విలేజ్’ అని పిలుస్తారు. ఇక్కడ పెన్సిల్ స్లేట్  ఉత్పాదక యూనిట్లు చాలా ఉన్నాయి. ఇవి ఉపాధిని అందిస్తాయి. వాటిలో పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు. 

మిత్రులారా!ఇక్కడి ప్రజలు ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుని, పని విషయంలో శ్రమ తీసుకున్నప్పుడు, దానికి తమను తాము అంకితం చేసుకున్నప్పుడు పుల్వామాకు ఈ గుర్తింపు వచ్చింది.  అటువంటి కష్టపడి పనిచేసే వారిలో మంజూర్ అహ్మద్ అలాయ్ గారు ఒకరు. మొదట్లో ఆయన చెక్కను నరికే ఒక సాధారణ కట్టర్ గా పనిచేసేవారు. తమ భవిష్యత్ తరాలు పేదరికంలో జీవించకుండా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆయన తన పూర్వికుల  నుండి వచ్చిన  భూమిని అమ్మి, ఆపిల్ వుడెన్ బాక్స్‌ – అంటే యాపిళ్లను ఉంచే చెక్క పెట్టెల  తయారీ యూనిట్ ను ప్రారంభించారు. అతను తన చిన్న వ్యాపారంలో నిమగ్నమైనప్పుడు  పెన్సిళ్ల తయారీలో పోప్లర్ కలప- అంటే చినార్ వృక్షం నుండి వచ్చే కలప-ను వాడడాన్ని ప్రారంభించారని తెల్సింది. ఈ సమాచారం వచ్చిన తరువాత మంజూర్ గారు  కొన్ని ప్రసిద్ధ పెన్సిల్ తయారీ యూనిట్లకు పోప్లర్ వుడెన్ బాక్స్‌ను సరఫరా చేయడం ప్రారంభించారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉందని మంజూర్ భావించారు. ఆయన ఆదాయం కూడా గణనీయంగా పెరగడం ప్రారంభించింది. కాలక్రమేణా ఆయన పెన్సిల్ స్లేట్ తయారీ యంత్రాలను తీసుకున్నారు. ఆ తరువాత దేశంలోని పెద్ద కంపెనీలకు పెన్సిల్ స్లేట్ సరఫరా చేయడం ప్రారంభించారు. నేడు, మంజూర్ భాయ్ గారి వ్యాపారం టర్నోవర్ కోట్లలో ఉంది. ఆయన సుమారు రెండు వందల మందికి జీవనోపాధి మార్గాన్ని కూడా అందజేస్తున్నారు. మంజూర్ భాయ్ తో  సహా పుల్వామాలో పని చేసే సోదర సోదరీమణులను, వారి కుటుంబ సభ్యులను దేశ ప్రజలందరి తరపున ఈ రోజు 'మన్ కి బాత్' ద్వారా ప్రశంసిస్తున్నాను. దేశంలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు  విలువైన సహకారాన్నిఇస్తున్నపుల్వామా సోదర సోదరీమణులను నేను అభినందిస్తున్నాను. 

నా ప్రియమైన దేశవాసులారా! లాక్ డౌన్ సమయంలో సాంకేతిక ఆధారిత సేవల విషయంలో అనేక ప్రయోగాలు  మన దేశంలో జరిగాయి. పెద్ద టెక్నాలజీ, లాజిస్టిక్స్ కంపెనీలు మాత్రమే ఈ సేవలను అందించగలవనే విషయం తప్పని ఇప్పుడు నిరూపితమైంది. జార్ఖండ్‌లో ఈ పనిని మహిళల స్వయం సహాయక బృందం చేసింది. ఈ మహిళలు రైతుల పొలాల నుండి కూరగాయలు, పండ్లను తీసుకొని నేరుగా ఇళ్లకు అందజేశారు. ఈ మహిళలు 'ఆజీవికా ఫామ్ ఫ్రెష్' అనే యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా ప్రజలు కూరగాయలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ మొత్తం ప్రయత్నం ద్వారా రైతులు తమ కూరగాయలు, పండ్లకు మంచి ధరలను పొందారు. ప్రజలు తాజా కూరగాయలను కూడా పొందారు. అక్కడ 'ఆజీవికా ఫామ్ ఫ్రెష్' తాజా అనువర్తన  ఆలోచన బాగా ప్రాచుర్యం పొందింది. లాక్ డౌన్‌లో 50 లక్షల రూపాయల కంటే అధిక విలువ కలిగిన పండ్లు, కూరగాయలను దీనిద్వారా ప్రజల దగ్గరికి చేర్చారు. మిత్రులారా! వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను చూసి, మన యువత కూడా పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బడ్వానీలో అతుల్ పాటిదార్ గారు  తన ప్రాంతంలోని 4 వేల మంది రైతులను డిజిటల్‌గా అనుసంధానించారు. ఈ రైతులు అతుల్ పాటిదార్ గారి  ఇ-ప్లాట్ ఫామ్ కార్డు ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, శిలీంధ్ర  సంహారిణులు మొదలైన వ్యవసాయ సంబంధిత వస్తువులను హోం డెలివరీ ద్వారా పొందగలుతున్నారు. అంటే రైతులు తమ అవసరాలకు పనికి వచ్చే వస్తువులను ఇంటివద్దే  పొందగలుగుతున్నారు.  ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆధునిక వ్యవసాయ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో కూడా ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా రైతులకు వేలాది వస్తువుల సరఫరా జరిగింది. వాటిలో పత్తి, కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయి. అతుల్ గారు, ఆయన బృంద సభ్యులు రైతులకు సాంకేతికంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆన్‌లైన్ చెల్లింపు, షాపింగ్ విషయాలను  నేర్పిస్తున్నారు. 

మిత్రులారా! ఈ రోజుల్లో మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన నా దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఒక రైతు ఉత్పత్తి సంస్థ మొక్కజొన్న రైతుల నుండి మొక్కజొన్నను కొనుగోలు చేసింది. కంపెనీ ఈసారి రైతులకు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చింది. రైతులు ఆనందపడడంతో పాటు ఆశ్చర్యపోయారు. ఆ సంస్థ ప్రతినిధులను ఇదే విషయం అడిగారు. భారత ప్రభుత్వం తయారుచేసిన కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం ఇప్పుడు రైతులు భారతదేశంలో ఎక్కడైనా పంటలను అమ్మగలుగుతున్నారని, వారికి మంచి ధరలు లభిస్తున్నాయని, కాబట్టి ఈ అదనపు లాభాలను రైతులతో కూడా పంచుకోవాలని వారు భావించారని రైతులకు తెలిసింది. దానిపై వారికి కూడా హక్కు ఉంది కాబట్టి రైతులకు బోనస్ ఇచ్చారు. మిత్రులారా! బోనస్ మొత్తం చిన్నదే కావచ్చు.  కానీ ఇది చాలా గొప్ప ప్రారంభం. కొత్త వ్యవసాయ చట్టంతో అట్టడుగు స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉండే అవకాశాలతో ఎలాంటి మార్పులు ఏర్పడుతున్నాయో ఇది మనకు నిరూపిస్తుంది. 

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో దేశవాసుల అసాధారణ విజయాల గురించి, మన దేశంలోని వివిధ అంశాలపై, మన సంస్కృతిపై  మీతో మాట్లాడే అవకాశం లభించింది. మన దేశం ప్రతిభావంతులైన వ్యక్తులతో నిండి ఉంది. మీకు కూడా అలాంటి వ్యక్తులు కూడా తెలిస్తే వారి గురించి మాట్లాడండి. రాయండి. వారి విజయాలను పంచుకోండి. రాబోయే పండుగల సందర్భంగా  మీకు, మీ కుటుంబ సభ్యులకు అనేక శుభాకాంక్షలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా పండుగ సందర్భాల్లో గుర్తుంచుకోండి.  మాస్క్ ధరించండి.  సబ్బుతో చేతులు కడుక్కోండి. రెండు గజాల దూరం పాటించండి.  

మిత్రులారా! వచ్చే నెలలో 'మన్ కీ బాత్'లో మళ్ళీ కలుద్దాం. అందరికీ అనేకానేక  ధన్యవాదాలు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
A day in the Parliament and PMO

Media Coverage

A day in the Parliament and PMO
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Naval Pilots carries out landing of LCA(Navy) on INS Vikrant
February 08, 2023
షేర్ చేయండి
 
Comments
PM lauds the efforts towards Aatmanirbharta

The Prime Minister, Shri Narendra Modi expressed happiness as Naval Pilots carried out landing of LCA(Navy) on INS Vikrant.

In response to a tweet by Spokesperson Navy, the Prime Minister said;

“Excellent! The efforts towards Aatmanirbharta are on with full vigour.”