నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.
మిత్రులారా! INSPIRE-MANAK కార్యక్రమం పేరు మీరు విని ఉండవచ్చు. ఇది బాలల ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక జాతీయ ఉద్యమం. ప్రతి పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపిక అవుతారు. ప్రతి ఒక్కరు ఒక కొత్త ఆలోచనతో వస్తారు. ఇప్పటివరకు లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. చంద్రయాన్-3 తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయింది. మన దేశంలో అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఐదేళ్ళ క్రితం 50 కంటే తక్కువ స్టార్టప్‌లు ఉండగా, ఇప్పుడు కేవలం అంతరిక్ష రంగంలోనే 200 కంటే ఎక్కువగా స్టార్టప్‌లు ఉన్నాయి. మిత్రులారా! వచ్చే నెల ఆగస్టు 23వ తేదీన ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం- National Space Day’ జరుపుకుంటాం. మీరు దీన్ని ఎలా జరుపుకుంటారు? మీకు ఏదైనా ప్రత్యేక ఆలోచన ఉందా? అయితే నమో యాప్ ద్వారా తప్పకుండా సందేశం పంపించండి.
మిత్రులారా! 21వ శతాబ్ద భారతదేశంలో శాస్త్రవిజ్ఞానం ఓ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. కొన్ని రోజుల క్రితం మన విద్యార్థులు అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ లో పతకాలు గెలిచారు. దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్త ప్రియదర్శి, ఉజ్జ్వల్ కేసరి – ఈ నలుగురూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. గణితశాస్త్రంలో కూడా మనదేశం తన స్థానాన్ని మరింత పటిష్టంగా నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో మన విద్యార్థులు 3 బంగారు, 2 రజత, 1 కాంస్య పతకాలు సాధించారు.
మిత్రులారా! వచ్చే నెల ముంబాయిలో ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ ఒలింపియాడ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 60కి పైగా దేశాల నుండి విద్యార్థులు హాజరవుతారు. గణితశాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు హాజరవుతారు. ఇది ఇప్పటి వరకు జరిగిన వాటిలో అత్యంత భారీస్థాయి ఒలింపియాడ్ అవుతుంది. ఒక విధంగా చూస్తే భారతదేశం ఇప్పుడు ఒలింపిక్స్, ఒలింపియాడ్స్ రెండింటిలోనూ ముందుకు సాగుతోంది.
నా ప్రియమైన దేశప్రజలారా! మనందరికీ గర్వం కలిగించే మరొక గొప్ప వార్త యునెస్కో నుండి వచ్చింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా 12 మరాఠా కోటలకు గుర్తింపు లభించింది. వీటిలో పదకొండు మహారాష్ట్రలో, ఒక కోట తమిళనాడులో ఉన్నాయి. వీటిలో ప్రతి కోటకి ఒక చారిత్రక అధ్యాయం ఉంటుంది. వీటిలోని ప్రతి రాయి ఒక ఘట్టానికి సాక్షిగా నిలుస్తుంది. సల్హేర్ కోట మొగలులకు భారతదేశంలో ఓటమిని చవిచూపిన స్థలం. శివనేరి మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం. ఖాందేరి కోట సముద్ర మధ్య నిర్మితమైన అద్భుత నిర్మాణం. శత్రువులు శివాజీని నిలువరించేందుకు ప్రయత్నించినా అసంభవాన్ని సాధ్యం చేస్తూ శివాజీ ముందుకుసాగిన కోట ఇది. అఫ్జల్ ఖాన్ ఓడిపోయిన ప్రతాప్‌గఢ్ కోటలో ఆ కథ ప్రతిధ్వని ఇప్పటికీ కోట గోడలలో నిక్షిప్తమై ఉంది. రహస్య సొరంగాలు కలిగిన విజయదుర్గ కోట ఛత్రపతి శివాజీ మహారాజ్ దూరదృష్టికి నిదర్శనం. నేను కొన్ని సంవత్సరాల క్రితం రాయగఢ్ కి వెళ్లిన సందర్భం గుర్తు వస్తోంది. అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ప్రణామం చేశాను. ఈ అనుభవం జీవితాంతం మరిచిపోలేని మధురానుభూతి.
మిత్రులారా! దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అలాంటి అద్భుత కోటలున్నాయి. వాటి చరిత్ర దాడులను ఎదుర్కోవడంతో, వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కోవడంతో నిండి ఉంది. కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. రాజస్థాన్‌లో చిత్తోర్ గఢ్, కుంభల్ గఢ్, రణథంభోర్, ఆమేర్, జైసల్మేర్ కోటలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. కర్ణాటకలో గుల్బర్గా కోట కూడా పెద్దది. చిత్రదుర్గ కోట విస్తీర్ణం చూస్తే ఆ కాలంలో ఎలా నిర్మాణం జరిపారో అని ఆశ్చర్యం కలుగుతుంది.
మిత్రులారా! ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాందా అనే ప్రాంతంలో కాలింజర్ కోట ఉంది. గజనీ మహమ్మద్ ఈ కోటను ఎన్నో సార్లు ఆక్రమించేందుకు యత్నించాడు. ప్రతిసారీ విఫలమయ్యాడు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గ్వాలియర్, ఝాన్సీ, దతియా, అజయగఢ్, గఢ్‌కుండార్, చందేరి వంటి అనేక కోటలు ఉన్నాయి. ఈ కోటలు కేవలం ఇటుకలూ రాళ్లూ కాదు – ఇవి మన సంస్కృతికి ప్రతీకలు. మన సంస్కారాలూ, స్వాభిమానం ఈ కోటల గోడలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ కోటల పర్యటన చేయవలసిందిగా నేను ప్రతి దేశవాసినీ కోరుతున్నాను. మన చరిత్రను తెలుసుకోండి, గర్వానుభూతి పొందండి.
నా ప్రియమైన దేశవాసులారా! ఒక్కసారి ఈ సంఘటనను ఊహించండి. బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ నగరం. కాలం: 1908 ఆగస్టు 11వ తేదీ, తెల్లవారు ఝాము. ప్రతి వీధీ, ప్రతి చౌరస్తా, ప్రతి కదలికా ఆగిపోయినట్లు కనిపిస్తోంది.
ప్రజల కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. హృదయాలు జ్వలిస్తున్నాయి. వారంతా
జైలును చుట్టుముట్టారు. ఎందుకంటే అక్కడ ఒక 18 ఏళ్ల యువకుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినందుకు ఫలితాన్ని చెల్లించబోతున్నాడు. అతని ముఖంలో భయం లేదు – గర్వం ఉంది. దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు అనుభవించే గర్వమది. ఆ వీరుడు, ధైర్యవంతుడైన యువకుడు ఖుదీరామ్ బోస్. కేవలం 18 సంవత్సరాల వయస్సులో అతను చూపించిన ధైర్యసాహసాలు యావద్దేశాన్ని కదిలించాయి. అప్పుడు వార్తాపత్రికలు కూడా ఇలా రాశాయి- "ఖుదీరామ్ బోస్ ఉరి కంబం వైపు నడిచినప్పుడు అతని ముఖంలో చిరునవ్వు ఉంది". అలాంటి లెక్కలేనన్ని త్యాగాల తర్వాత, శతాబ్దాల తపస్సు తర్వాత, మనకు స్వాతంత్ర్యం వచ్చింది. దేశ ప్రేమికులు తమ రక్తంతో స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపారు.
మిత్రులారా! ఆగస్టు నెల విప్లవ మాసం. ఆగస్టు 1న లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి. అదే నెలలో ఆగస్టు 8న గాంధీజీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీన మన స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. మనం మన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుంచుకుంటాం. వారి నుండి ప్రేరణ పొందుతాం. కానీ, మిత్రులారా! మన స్వాతంత్ర్యం కూడా దేశ విభజన బాధతో ముడిపడి ఉంది. కాబట్టి మనం ఆగస్టు 14ను విభజన భయానక జ్ఞాపక దినంగా జరుపుకుంటాం.
నా ప్రియమైన దేశప్రజలారా! 1905 ఆగస్టు 7వ తేదీన మరో విప్లవం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం స్థానిక ఉత్పత్తులకు- ముఖ్యంగా చేనేతకు - కొత్త శక్తినిచ్చింది. దీనికి గుర్తుగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' జరుపుకుంటుంది. ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన, 'జాతీయ చేనేత దినోత్సవం' 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వాతంత్ర్య ఉద్యమానికి మన ఖాదీ కొత్త బలాన్ని ఇచ్చిన విధంగానే నేడు దేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా మారే దిశగా పయనిస్తుండగా, వస్త్ర రంగం దేశానికి బలం అవుతోంది. ఈ పదేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ రంగంతో సంబంధం ఉన్న లక్షలాది మంది అనేక విజయగాథలను రాశారు. మహారాష్ట్రలోని పైఠన్ గ్రామానికి చెందిన కవితా ధవలే గతంలో ఒక చిన్న గదిలో పనిచేసేవారు. స్థలం కానీ సౌకర్యాలు కానీ లేవు. ఆమెకు ఇప్పుడు ప్రభుత్వం నుండి సహాయం లభించింది. ఇప్పుడు ఆమె నైపుణ్యం పెరుగుతోంది. ఆమె మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆమె తాను స్వయంగా తయారు చేసిన పైఠనీ చీరలను విక్రయిస్తున్నారు.
ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో ఇలాంటి మరో విజయగాథ ఉంది. ఇక్కడ 650 మందికి పైగా గిరిజన మహిళలు సంథాలీ చీరను పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ మహిళలు ప్రతి నెలా వేల రూపాయలు సంపాదిస్తున్నారు. వారు బట్టలు తయారు చేయడమే కాదు- తమ స్వంత గుర్తింపును సృష్టిస్తున్నారు. బీహార్‌లోని నలందకు చెందిన నవీన్ కుమార్ సాధించిన విజయం కూడా స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబం కొన్ని తరాలుగా ఈ పనితో ముడిపడి ఉంది. కానీ గొప్ప విషయం ఏమిటంటే ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రంగంలో ఆధునికతను చేర్చింది. ఇప్పుడు వారి పిల్లలు హ్యాండ్లూమ్ టెక్నాలజీని చదువుతున్నారు. పెద్ద బ్రాండ్‌లలో పనిచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఒక కుటుంబానిది కాదు. ఇది చుట్టుపక్కల ఉన్న అనేక కుటుంబాలను ముందుకు తీసుకెళుతోంది.
మిత్రులారా! టెక్స్ టైల్ భారతదేశంలోని ఒక రంగం మాత్రమే కాదు. ఇది మన సాంస్కృతిక వైవిధ్యానికి ఒక ఉదాహరణ. నేడు టెక్స్ టైల్, వస్త్రాల మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధి గురించి అత్యంత ఆనందం కలిగించే విషయం ఏమిటంటే గ్రామాల నుండి మహిళలు, నగరాల నుండి డిజైనర్లు, పాత నేత కార్మికులు, మన యువత, స్టార్టప్‌లు అందరూ కలిసి దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. నేడు భారతదేశంలో 3000 కంటే ఎక్కువ వస్త్ర స్టార్టప్‌లు చురుకుగా ఉన్నాయి. అనేక స్టార్టప్‌లు భారతదేశ చేనేత రంగానికి ప్రపంచ స్థాయిని ఇచ్చాయి. మిత్రులారా! 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారా ఏర్పడుతుంది. స్వావలంబన కలిగిన భారతదేశానికి అతిపెద్ద ఆధారం స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించే వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం. భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనండి, అమ్మండి. వాటిలో భారతీయుల చెమట ఉంటుంది. ఇది మన సంకల్పం కావాలి.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశ వైవిధ్యానికి చెందిన అత్యంత అందమైన సంగ్రహావలోకనం మన జానపద గేయాలు, సంప్రదాయాలలో కనిపిస్తుంది. మన భజనలు, కీర్తనలు ఇందులో ఒక భాగం. కానీ కీర్తన ద్వారా ప్రజలకు అడవిలో ఏర్పడే కార్చిచ్చు గురించి అవగాహన కల్పిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు నమ్మకపోవచ్చు. కానీ ఒడిషాలోని క్యోంఝర్ జిల్లాలో ఒక అద్భుతమైన పని జరుగుతోంది. ఇక్కడ రాధాకృష్ణ సంకీర్తన మండలి అనే బృందం ఉంది. భక్తితో పాటు ఈ బృందం నేడు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. ఈ చొరవ వెనుక ప్రేరణ ప్రమీలా ప్రధాన్ గారు. అడవులను, పర్యావరణాన్ని రక్షించడానికి ఆమె సాంప్రదాయిక గేయాలకు కొత్త సాహిత్యాన్ని, సందేశాలను జోడించారు. ఆమె బృందం గ్రామ గ్రామాలకు వెళ్ళింది. పాటల ద్వారా వారు అడవిలో ఏర్పడే కార్చిచ్చు ఎంత నష్టాన్ని కలిగిస్తుందో ప్రజలకు వివరించారు. ఈ ఉదాహరణ మన జానపద సంప్రదాయాలు గత కాలానికి చెందినవి కాదని, అవి ఇప్పటికీ సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిని కలిగి ఉన్నాయని మనకు గుర్తు చేస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన పండుగలు, సంప్రదాయాలు భారతీయ సంస్కృతికి ప్రధాన ఆధారాలు. కానీ మన సంస్కృతి ఉత్సాహంలో మరొక కోణం కూడా ఉంది. ఈ కోణం మన వర్తమానాన్ని, మన చరిత్రను నమోదు చేస్తూ ఉండడం. శతాబ్దాలుగా లిఖిత ప్రతుల రూపంలో భద్రంగా ఉన్న జ్ఞానం మన నిజమైన బలం. ఈ మాన్యుస్క్రిప్ట్‌లలో సైన్స్, వైద్య పద్ధతులు, సంగీతం, తత్వశాస్త్రం ఉన్నాయి. ముఖ్యంగా మానవాళి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగల ఆలోచనలు ఉన్నాయి. మిత్రులారా! ఈ అసాధారణ జ్ఞానాన్ని, ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. మన దేశంలో ప్రతి కాలంలో దీన్ని తమ సాధనగా చేసుకున్న కొందరు వ్యక్తులు ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం తమిళనాడులోని తంజావూరుకు చెందిన మణి మారన్ గారిది. నేటి తరం తమిళ రాతప్రతులను చదవడం నేర్చుకోకపోతే, రాబోయే కాలంలో ఈ విలువైన వారసత్వం నశిస్తుందని ఆయన భావించారు. అందుకే ఆయన సాయంత్రం తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు, శ్రామిక యువత, పరిశోధకులు, అందరూ నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం ప్రారంభించారు. మణి మారన్ గారు ప్రజలకు "తమిళ సువదియియల్" అంటే తాటాకు లిఖిత ప్రతులను చదివి అర్థం చేసుకునే పద్ధతిని నేర్పించారు. ఆయన ప్రయత్నాల ద్వారా చాలా మంది విద్యార్థులు ఈ రంగంలో ప్రావీణ్యం సంపాదించారు. కొంతమంది విద్యార్థులు ఈ రాతప్రతుల ఆధారంగా సంప్రదాయ వైద్య వ్యవస్థపై పరిశోధన కూడా ప్రారంభించారు. మిత్రులారా! దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రయత్నాలు జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇలా జరిగితే మన ప్రాచీన జ్ఞానం నాలుగు గోడలకే పరిమితం కాకుండా కొత్త తరం చైతన్యంలో భాగమవుతుంది. ఈ ఆలోచన నుండి ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఒక చరిత్రాత్మక చొరవను ప్రకటించింది. అదే 'జ్ఞాన్ భారతం మిషన్'. ఈ మిషన్ కింద పురాతన రాతప్రతుల డిజిటలైజేషన్ జరుగుతుంది. తరువాత ఒక జాతీయ డిజిటల్ రిపోజిటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు భారతదేశ జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానమవుతారు. మీరు అలాంటి ఏదైనా ప్రయత్నంలో పాల్గొన్నట్లయితే లేదా భాగస్వామ్యం పొందాలనుకుంటే మై గవ్ లేదా సాంస్కృతిక మంత్రిత్వ శాఖను తప్పకుండా సంప్రదించండి. ఎందుకంటే ఇవి కేవలం రాతప్రతులు మాత్రమే కాదు. ఇవి భారతదేశ ఆత్మ ఉన్న అధ్యాయాలు. వీటిని మనం రాబోయే తరాలకు నేర్పించాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! మీ చుట్టూ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయని అడిగితే మీరేం చెప్తారు? బహుశా నేను ప్రతిరోజూ ఐదారు జాతుల పక్షులను చూస్తాను. వీటిలో కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. మన చుట్టూ ఏ జాతి పక్షులు నివసిస్తున్నాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అస్సాంలోని కజిరంగ జాతీయ ఉద్యానవనంలో ఇటీవల అలాంటి గొప్ప ప్రయత్నం జరిగింది. ఈ ప్రాంతం ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ ఈసారి చర్చనీయాంశం దాని గడ్డి భూములు, వాటిలో నివసించే పక్షులు. గడ్డి భూముల పక్షుల గణన ఇక్కడ మొదటిసారి జరిగింది. ఈ జనాభా గణన కారణంగా 40 కంటే ఎక్కువ జాతుల పక్షులను గుర్తించామని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. వీటిలో చాలా అరుదైన పక్షులు ఉన్నాయి. ఎన్ని పక్షులను గుర్తించారో మీరు ఆలోచిస్తూ ఉండాలి! ఇందులో టెక్నాలజీ అద్భుతాలు చేసింది. జనాభా గణన నిర్వహిస్తున్న బృందం శబ్దాలను రికార్డ్ చేసే పరికరాలను ఏర్పాటు చేసింది. కంప్యూటర్ల సహాయంతో కృత్రిమ మేధను ఉపయోగించి ఆ శబ్దాలను విశ్లేషించారు. పక్షులను వాటి శబ్దాల ద్వారానే గుర్తించారు- అది కూడా వాటిని ఇబ్బంది పెట్టకుండా. ఆలోచించండి. సాంకేతికత, సున్నితత్వం కలిసినప్పుడు ప్రకృతిని అర్థం చేసుకోవడం చాలా సులభంగా, గాఢంగా మారుతుంది. మన జీవవైవిధ్యాన్ని గుర్తించి, తరువాతి తరాన్ని దానికి అనుసంధానించగలిగేలా మనం అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! కొన్నిసార్లు చీకటి ఎక్కువగా వ్యాపించిన చోటి నుండే అతిపెద్ద వెలుగు ఉద్భవిస్తుంది. అలాంటి ఒక ఉదాహరణ జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు హింసకు ప్రసిద్ధి చెందింది. అప్పట్లో బాసియా బ్లాక్ గ్రామాలు నిర్జనమైపోయాయి. ప్రజలు భయం నీడలో నివసించారు. ఉపాధికి అవకాశం లేదు. భూములు సేద్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. యువత వలసపోతున్నారు. అప్పుడు చాలా ప్రశాంతంగా, ధైర్యంగా పరివర్తన ప్రారంభమైంది. యువకుడైన ఓం ప్రకాష్ సాహు గారు హింస మార్గాన్ని విడిచిపెట్టారు. ఆయన చేపల పెంపకం ప్రారంభించారు. అప్పుడు ఆయన తనలాంటి చాలా మంది స్నేహితులను కూడా అలాగే చేయమని ప్రేరేపించారు. ఆయన ప్రయత్నాలు చాలా ప్రభావం చూపాయి. గతంలో తుపాకులు పట్టుకున్న వారు ఇప్పుడు చేపల వలలు పట్టుకుంటున్నారు.
మిత్రులారా!ఓం ప్రకాష్ సాహు గారి ప్రారంభం అనుకున్నంత సులభం కాదు. నిరసనలు, బెదిరింపులు వచ్చాయి. కానీ ఆయన ధైర్యం విచ్ఛిన్నం కాలేదు. 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' వచ్చినప్పుడు ఆయనకు కొత్త బలం వచ్చింది. ప్రభుత్వం నుండి శిక్షణ పొందారు. చెరువులు నిర్మించడంలో సహాయం పొందారు. చూస్తూ ఉండగానే కొద్ది కాలంలోనే గుమ్లాలో మత్స్య విప్లవం ప్రారంభమైంది. నేడు బాసియా బ్లాక్‌లోని 150 కి పైగా కుటుంబాలు చేపల పెంపకంలో చేరాయి. ఒకప్పుడు నక్సలైట్ సంస్థలో ఉన్నవారు చాలా మంది ఇప్పుడు గ్రామంలోనే గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. మార్గం సరైనదై మనస్సులో విశ్వాసం ఉంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అభివృద్ధి దీపం వెలిగించవచ్చని గుమ్లా ప్రయాణం మనకు నేర్పుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా కార్యక్రమం ఏదో మీకు తెలుసా? దీనికి సమాధానం 'ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడలు'. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది మధ్య జరిగే క్రీడల టోర్నమెంట్ ఇది. ఈసారి ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. భారతదేశం ఈ టోర్నమెంటులో చరిత్ర సృష్టించింది. దాదాపు 600 పతకాలు గెలుచుకుంది. 71 దేశాలు పాల్గొన్న ఈ టోర్నమెంటులో టాప్-3 స్థాయికి చేరుకున్నాం. దేశం కోసం పగలు, రాత్రి నిలబడే ఆ యూనిఫాం ధరించిన ఆటగాళ్ల కృషి ఫలించింది. మన ఈ స్నేహితులు ఇప్పుడు క్రీడా మైదానంలో కూడా జెండాను ఎగురవేస్తున్నారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ బృందానికి నా అభినందనలు. 2029 లో ఈ ఆటలు భారతదేశంలో జరుగుతాయని తెలుసుకోవడం కూడా మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుండి ఆటగాళ్ళు మన దేశానికి వస్తారు. మనం వారికి భారతదేశ ఆతిథ్యాన్ని రుచి చూపిస్తాం. వారికి మన క్రీడా సంస్కృతిని పరిచయం చేస్తాం.
మిత్రులారా! గత కొన్ని రోజులుగా నాకు చాలా మంది యువ అథ్లెట్లు, వారి తల్లిదండ్రుల నుండి సందేశాలు వచ్చాయి. 'ఖేలో భారత్ పాలసీ 2025'ని వారు చాలా ప్రశంసించారు. ఈ విధానం లక్ష్యం స్పష్టంగా ఉంది. అది భారతదేశాన్ని క్రీడారంగంలో సూపర్ పవర్‌గా మార్చడం. గ్రామాలు, పేదలు, ఆడపిల్లలకు ఈ విధానం ప్రాధాన్యత ఇస్తుంది. పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడు క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేస్తాయి. క్రీడా నిర్వహణకు సంబంధించిన, క్రీడా సామగ్రి తయారీ రంగానికి సంబంధించిన క్రీడల స్టార్టప్‌లకు అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. దేశంలోని యువత స్వీయ-నిర్మిత రాకెట్, బ్యాట్, బంతులతో ఆడినప్పుడు స్వావలంబన లక్ష్యం ఎంత బలాన్ని పొందుతుందో ఊహించుకోండి. మిత్రులారా! క్రీడలు జట్టు స్ఫూర్తిని అభివృద్ధి చేస్తాయి. ఇది ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసాలతో కూడిన దృఢమైన భారతదేశాన్ని నిర్మించడానికి మార్గం. కాబట్టి కష్టపడి ఆడండి. బాగా ఆనందించండి.
నా ప్రియమైన దేశప్రజలారా! కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పనులు అసాధ్యంగా అనిపిస్తాయి. “ఇది సాధ్యమవుతుందా?” అని అనుకుంటారు. కానీ, దేశం ఒకే ఆలోచనపై కలిసి వచ్చినప్పుడు అసాధ్యమైన పని కూడా సుసాధ్యమవుతుంది. 'స్వచ్ఛ భారత్ మిషన్' దీనికి అతిపెద్ద ఉదాహరణ. త్వరలో ఈ మిషన్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కానీ, దాని బలం, దాని అవసరం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ 11 సంవత్సరాలలో 'స్వచ్ఛ భారత్ మిషన్' ఒక సామూహిక ఉద్యమంగా మారింది. ప్రజలు దీన్ని తమ కర్తవ్యంగా భావిస్తారు. ఇది నిజమైన ప్రజా భాగస్వామ్యం.
మిత్రులారా! ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ భావనను మరింత పెంచింది. ఈ సంవత్సరం దేశంలోని 4500 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలు ఇందులో చేరాయి. 15 కోట్లకు పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఇవి సాధారణ సంఖ్యలు కాదు. ఇది స్వచ్ఛ భారతదేశ స్వరం.
మిత్రులారా! మన నగరాలు, పట్టణాలు వాటి అవసరాలు, పర్యావరణానికి అనుగుణంగా పరిశుభ్రత విషయంలో వివిధ పద్ధతుల్లో పనిచేస్తున్నాయి. వాటి ప్రభావం ఈ నగరాలకే పరిమితం కాదు. యావద్దేశం ఈ పద్ధతులను అవలంబిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని కీర్తి నగర్ ప్రజలు పర్వతాలలో వ్యర్థాల నిర్వహణకు కొత్త ఉదాహరణను చూపుతున్నారు. అదేవిధంగా మంగళూరులో సాంకేతికత సహాయంతో సేంద్రియ వ్యర్థాల నిర్వహణ పనులు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో రోయింగ్ అనే చిన్న నగరం ఉంది. ఒకప్పుడు ఇక్కడి ప్రజల ఆరోగ్యానికి వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా ఉండేది. ఇక్కడి ప్రజలే దాని బాధ్యత తీసుకున్నారు. 'గ్రీన్ రోయింగ్ ఇనిషియేటివ్' ప్రారంభమైంది. తరువాత రీసైకిల్ చేసిన వ్యర్థాలతో పార్కును తయారు చేశారు. అదేవిధంగా కరాడ్, విజయవాడలలో నీటి నిర్వహణకు అనేక కొత్త ఉదాహరణలు వచ్చాయి. అహ్మదాబాద్‌లోని రివర్ ఫ్రంట్ వద్ద పరిశుభ్రత కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
మిత్రులారా! భోపాల్‌లోని ఒక బృందం పేరు ‘సకారాత్మక్ సోచ్’ – అంటే 'పాజిటివ్ ఆలోచన'. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. వారు కేవలం శుభ్రం చేయడమే కాదు, మనస్తత్వాన్ని కూడా మారుస్తారు. వారంతా కలిసి నగరంలోని 17 పార్కులను శుభ్రం చేస్తారు. గుడ్డ సంచులను పంపిణీ చేస్తారు. వారి ప్రతి అడుగు ఒక సందేశం. ఇటువంటి ప్రయత్నాల కారణంగా భోపాల్ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చాలా ముందంజ వేసింది. లక్నోలోని గోమతీ నది బృందాన్ని కూడా ప్రస్తావించడం తప్పనిసరి. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం అలసట లేకుండా, అవిశ్రాంతంగా ఈ బృంద సభ్యులు పరిశుభ్రత పనిలో నిమగ్నమై ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిల్హా ఉదాహరణ కూడా గొప్పది. అక్కడ మహిళలకు వ్యర్థాల నిర్వహణలో శిక్షణ ఇచ్చారు. వారంతా కలిసి నగర ముఖచిత్రాన్ని మార్చారు. గోవాలోని పనాజీ నగరం ఉదాహరణ కూడా స్ఫూర్తిదాయకం. అక్కడ వ్యర్థాలను 16 రకాలుగా విభజించారు. దాన్ని కూడా మహిళలే నడిపిస్తున్నారు. పనాజీకి రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది. మిత్రులారా! పరిశుభ్రత కేవలం ఒక సమయంలో, ఒక రోజు చేసే పని కాదు. మనం ప్రతిరోజూ, సంవత్సరంలో ప్రతి క్షణం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే దేశం పరిశుభ్రంగా ఉండగలుగుతుంది.
మిత్రులారా! శ్రావణ మాస వర్షపు జల్లుల మధ్య దేశం మళ్ళీ పండుగల ఆనందోత్సాహాలతో ముస్తాబు అవుతోంది. ఈ రోజు హరియాలి తీజ్ పండుగ. తరువాత నాగుల పంచమి,రక్షా బంధన్ వస్తున్నాయి. తరువాత జన్మాష్టమి మన కొంటె కృష్ణుని జన్మదిన వేడుక. ఈ పర్వదినాలన్నీ మన భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి. అవి ప్రకృతితో, సమతుల్యతతో అనుసంధాన సందేశాన్ని కూడా అందిస్తాయి. ఈ పవిత్ర పర్వదినాల సందర్భంగా మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. నా ప్రియమైన మిత్రులారా! మీ ఆలోచనలను, అనుభవాలను పంచుకుంటూ ఉండండి. వచ్చే నెలలో మరికొన్ని కొత్త విజయాలు, దేశవాసుల ప్రేరణలతో మనం మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.
A new wave of curiosity about space is sweeping across India. #MannKiBaat pic.twitter.com/bM4F3IYMaV
— PMO India (@PMOIndia) July 27, 2025
From Chemistry to Mathematics Olympiads, India's young minds are shining bright. #MannKiBaat pic.twitter.com/WiOk86Aqir
— PMO India (@PMOIndia) July 27, 2025
A proud moment for every Indian - 12 Maratha forts, symbols of valour and vision, have been declared UNESCO World Heritage Sites. #MannKiBaat pic.twitter.com/TaFTnNqP20
— PMO India (@PMOIndia) July 27, 2025
Every fort in India tells a tale of courage, resistance and heritage. #MannKiBaat pic.twitter.com/jRAl8maDLD
— PMO India (@PMOIndia) July 27, 2025
India remembers the sacrifice of Khudiram Bose. #MannKiBaat pic.twitter.com/E1tfBLiKVT
— PMO India (@PMOIndia) July 27, 2025
The month of August echoes with patriotism. #MannKiBaat pic.twitter.com/egJcp3S55o
— PMO India (@PMOIndia) July 27, 2025
India's handloom sector is weaving a new story of pride, progress and self-reliance. #MannKiBaat pic.twitter.com/Q1rJCiWAa6
— PMO India (@PMOIndia) July 27, 2025
As we aim for a developed India by 2047, let's pledge to be truly 'vocal for local': PM @narendramodi #MannKiBaat pic.twitter.com/M8IT2nbTaZ
— PMO India (@PMOIndia) July 27, 2025
In Odisha's villages, Lok Geets carry the messages of saving forests and protecting nature. #MannKiBaat pic.twitter.com/yB9UL7RDY4
— PMO India (@PMOIndia) July 27, 2025
Our manuscripts are not relics of the past; they are guides for the future. #MannKiBaat pic.twitter.com/92bYYEZneQ
— PMO India (@PMOIndia) July 27, 2025
A census like never before! Technology helps discover over 40 bird species in Kaziranga. #MannKiBaat pic.twitter.com/E7JHDyUqiB
— PMO India (@PMOIndia) July 27, 2025
A silent wave of change in Gumla, Jharkhand. #MannKiBaat pic.twitter.com/1JAihXwhWF
— PMO India (@PMOIndia) July 27, 2025
India's uniformed heroes are making headlines not just in service, but also in sports. #MannKiBaat pic.twitter.com/EmXpMK1VAt
— PMO India (@PMOIndia) July 27, 2025
Towards making India a sporting superpower! #MannKiBaat pic.twitter.com/9lqFdjpXM8
— PMO India (@PMOIndia) July 27, 2025
'Swachh Bharat Mission' has become a mass movement. #MannKiBaat pic.twitter.com/udZaR64gJd
— PMO India (@PMOIndia) July 27, 2025
India's cleanliness revolution is being led by communities and driven by innovation. #MannKiBaat pic.twitter.com/YnR0a1kHBc
— PMO India (@PMOIndia) July 27, 2025







