Consistent efforts are being made to strengthen the NCC in our country: PM Modi
Viksit Bharat Young Leaders Dialogue is an effort to connect one lakh new youth to politics: PM
Heartening to see the youth help senior citizens become part of the digital revolution: PM Modi
Innovative efforts from Chennai, Hyderabad & Bihar to enhance children’s education: PM Modi
Indian diaspora has made their mark in different nations: PM Modi
A museum is being developed in Lothal, dedicated to showcasing India’s maritime heritage: PM Modi
#EkPedMaaKeNaam campaign has crossed the milestone of 100 crore trees planted in just 5 months: PM
Unique efforts are being made to revive the sparrows: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. దేశ సామూహిక కృషిపై సంభాషించే 'మన్ కీ బాత్' అంటే దేశం సాధించిన విజయాల సంభాషణ. ప్రజల సామర్థ్యాలపై సంభాషణ. 'మన్ కీ బాత్' అంటే దేశ యువత కలలు, దేశ ప్రజల ఆకాంక్షల సంభాషణ. నేను మీతో నేరుగా సంభాషించేందుకు నెలంతా 'మన్ కీ బాత్' కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఎన్నో సందేశాలు..ఎన్నో సూచనలు. నేను వీలైనన్ని ఎక్కువ సందేశాలను చదవడానికి, మీ సూచనల గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను.

మిత్రులారా! ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఎన్ సి సి డే. ఎన్‌సీసీ అనే పేరు స్ఫురించగానే  మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. నేను స్వయంగా ఎన్‌సిసి క్యాడెట్‌ ని. కాబట్టి దాని నుండి పొందిన అనుభవం వెలకట్టలేనిదని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను. యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని ఎన్‌సిసి పెంపొందిస్తుంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు… వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగినా సహాయం చేయడానికి ఎన్‌సిసి క్యాడెట్‌లు తప్పకుండా ముందుకు వస్తారు. దేశంలో ఎన్‌సిసిని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి జరుగుతోంది.  2014లో దాదాపు 14 లక్షల మంది యువత ఎన్‌సీసీలో ఉంటే ఇప్పుడు 2024లో 20 లక్షల మందికి పైగా యువత ఎన్ సి సి లో ఉంది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఐదు వేల కొత్త పాఠశాలలు, కళాశాలల్లో ఎన్ సి సి సౌకర్యం ఏర్పడింది. అతిపెద్ద విషయం ఏమిటంటే, అంతకుముందు ఎన్ సి సి క్యాడెట్లలో బాలికల సంఖ్య కేవలం 25% మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎన్‌సిసి క్యాడెట్లలో బాలికల సంఖ్య దాదాపు 40%కి పెరిగింది. సరిహద్దు వెంబడి నివసిస్తున్న మరింత మంది యువతను ఎన్‌సిసితో అనుసంధానం చేయాలనే ప్రచారం కూడా నిరంతరం కొనసాగుతోంది. అత్యధిక సంఖ్యలో ఎన్‌సిసిలో చేరాలని యువతను కోరుతున్నాను. మీరు ఏ వృత్తిని కొనసాగించినా, మీ వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఎన్‌సిసి గొప్ప సహాయం చేస్తుందన్న విషయం మీ అనుభవంలోకి వస్తుంది.

మిత్రులారా! వికసిత భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా అధికం. యువ మనస్సులు సంఘటితంగా మేధా మథనం చేసి, దేశ భవిష్యత్ ప్రయాణం గురించి ఆలోచిస్తే, అప్పుడు ఖచ్చితంగా దృఢమైన మార్గాలు లభిస్తాయి. స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12వ తేదీన దేశం 'యువజన దినోత్సవం' జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి. ఈసారి చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ సందర్భంగా జనవరి 11-12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళా  జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 'వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' అని పేరు పెట్టారు. భారతదేశం నలుమూలల నుండి కోట్లాది మంది యువత ఇందులో పాల్గొంటుంది. గ్రామం, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎంపికైన రెండు వేల మంది యువత భారత్ మండపంలో 'అభివృద్ధి చెందిన భారతదేశ యువ నాయకుల సంభాషణ' కోసం సమావేశమవుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది- రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని నేను ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చాను. అలాంటి లక్ష మంది యువతను రాజకీయాలలోకి తెచ్చేందుకు దేశంలో వివిధ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. 'వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' కూడా అలాంటి ప్రయత్నమే. ఇందులో భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా  నిపుణులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కూడా చాలామంది హాజరవుతారు. అందులో నేను కూడా వీలైనంత ఎక్కువ సమయం పాల్గొంటాను. యువత తమ ఆలోచనలను నేరుగా మా ముందుంచేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ఆలోచనలను దేశం ఎలా ముందుకు తీసుకెళ్లగలదు? ఒక దృఢమైన  రోడ్‌మ్యాప్‌ను ఎలా రూపొందించవచ్చు? దీని కోసం ఒక బ్లూప్రింట్ తయారవుతుంది.  కాబట్టి సిద్ధంగా ఉండండి. భారతదేశ భవిష్యత్తును నిర్మించబోతున్న దేశ భవిష్యత్తు తరానికి ఇది ఒక గొప్ప అవకాశం. అందరం కలిసి దేశాన్ని నిర్మిద్దాం. దేశాన్ని అభివృద్ధి చేద్దాం.

నా ప్రియమైన దేశప్రజలారా! నిస్వార్థంగా సమాజం కోసం పాటుపడే యువత గురించి ‘మన్ కీ బాత్’లో మనం తరచూ మాట్లాడుకుంటాం. ప్రజల చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు వెతికే పనిలో నిమగ్నమైన ఇలాంటి యువకులు  ఎందరో ఉన్నారు. మన చుట్టూ చూస్తే ఏదో ఒక సహాయం అవసరమయ్యేవారెందరో ఉంటారు. ఏదో ఒక సమాచారం అవసరమయ్యే వారెందరో ఉంటారు.  లక్నోలో నివసించే వీరేంద్ర లాంటి వారు కొందరు యువకులు సమూహాలుగా ఏర్పడి ఇలాంటి సమస్యలను పరిష్కరించుకున్నారని తెలిసి సంతోషిస్తున్నాను. వారు వృద్ధులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పనిలో సహాయ పడుతున్నారు. పెన్షనర్లందరూ  సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని మీకు తెలుసు. 2014 వరకు వృద్ధులు బ్యాంకులకు స్వయంగా వెళ్లి సమర్పించాల్సి వచ్చేది. మన పెద్దలకు ఇది ఎంత అసౌకర్యాన్ని కలిగించేదో మీరు ఊహించవచ్చు. ఇప్పుడు ఈ పద్ధతి మారింది. ఇప్పుడు డిజిటల్ సర్టిఫికెట్ సరళతరమైంది. వృద్ధులు బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇందులో సాంకేతికంగా వృద్ధులకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు వీరేంద్ర వంటి యువకులు సహాయపడుతున్నారు. వారు ఈ విషయంలో తమ ప్రాంతంలోని వృద్ధులకు అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు సాంకేతికంగా tech savvy అయ్యేలా కృషి చేస్తున్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలసిన వారి సంఖ్య 80 లక్షలు దాటింది. వీరిలో రెండు లక్షల మందికి పైగా 80 ఏళ్లు దాటిన వృద్ధులే.

మిత్రులారా! ఎన్నో నగరాల్లో యువత డిజిటల్ ఉద్యమం లో పెద్దలను కూడా భాగస్వాములను చేయడానికి ముందుకు వస్తున్నారు.  భోపాల్‌కు చెందిన మహేష్ ఇలాంటి పెద్దలకు మొబైల్ ద్వారా చెల్లింపులు చేయడం నేర్పించారు. ఈ వృద్ధుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా దాన్ని ఉపయోగించే పద్ధతి తెలియదు. చెప్పేవారు కూడా ఎవరూ లేరు. డిజిటల్ అరెస్ట్ ప్రమాదం నుండి వృద్ధులను రక్షించడానికి కూడా యువత ముందుకువస్తోంది. అహ్మదాబాద్ కు చెందిన రాజీవ్ డిజిటల్ అరెస్టు పై అవగాహన కల్పిస్తున్నారు. మన్ కీ బాత్ గత నెల ఎపిసోడ్ లో నేను డిజిటల్ అరెస్టుపై చర్చించాను. ఇందులో బాధితుల్లో ఎక్కువమంది వృద్ధులే. వారికి అవగాహన కల్పించి, సైబర్ మోసాలకు గురికాకుండా చేయూతనివ్వడం మన బాధ్యత.  ప్రభుత్వంలో డిజిటల్ అరెస్ట్ అనే నిబంధన లేదని మళ్లీ మళ్లీ వివరించాలి.  ఇది పూర్తిగా అబద్ధమని, ప్రజలను మోసపూరితంగా ఉచ్చులోకి లాగేందుకు చేసే ప్రయత్నమని చెప్పాలి.  మన యువ స్నేహితులు పూర్తి నిబద్ధతతో ఈ పనిలో పాల్గొంటున్నందుకు, ఇతరులకు కూడా స్ఫూర్తిని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజుల్లో పిల్లల చదువుకు సంబంధించి అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మన పిల్లల్లో సృజనాత్మకతను పెంచి, పుస్తకాలపై ప్రేమను పెంచడమే ఈ ప్రయత్నం.  పుస్తకాలు మనిషికి అత్యంత ప్రాణస్నేహితుడని అంటారు. ఈ స్నేహాన్ని బలోపేతం చేయడానికి లైబ్రరీ కంటే గొప్ప ప్రదేశం ఏముంటుంది? నేను చెన్నై నుండి ఒక ఉదాహరణను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ పిల్లల కోసం ఒక లైబ్రరీ సిద్ధమైంది.  ఇది సృజనాత్మకత, అభ్యాసాలకు కేంద్రంగా మారింది. దీనినే ప్రకృత అరివగం అంటారు. ఈ లైబ్రరీ ఆలోచన టెక్నాలజీ ప్రపంచంతో అనుబంధం ఉన్న శ్రీరామ్ గోపాలన్ గారిది. ఆయన విదేశాలలో పని చేస్తున్న సమయంలోతాజా సాంకేతిక ప్రపంచంతో అనుసంధానమయ్యారు. కానీ పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పెంపొందించడం గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన ప్రకృత అరివగం సిద్ధం చేశారు. ఇందులో మూడు వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. పిల్లలు వీటిని చదవడానికి పోటీ పడుతున్నారు. పుస్తకాలే కాకుండా ఈ లైబ్రరీలో జరిగే అనేక రకాల కార్యకలాపాలు కూడా పిల్లలను ఆకర్షిస్తున్నాయి. స్టోరీ టెల్లింగ్ సెషన్లు, ఆర్ట్ వర్క్‌షాప్‌లు, మెమరీ ట్రైనింగ్ క్లాసులు, రోబోటిక్స్ పాఠాలు, లేదా పబ్లిక్ స్పీకింగ్ ఏదైనా సరే... ప్రతి ఒక్కరూ ఆస్వాదించడానికి ఏదో ఒక విషయం ఉంది.

మిత్రులారా! ‘ఫుడ్ ఫర్ థాట్’ ఫౌండేషన్ కూడా హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన లైబ్రరీలను రూపొందించింది. వీలైనన్ని ఎక్కువ అంశాలకు సంబంధించిన దృఢమైన సమాచారంతో పిల్లలు పుస్తకాలను చదివేలా చేయడం కూడా వారి ప్రయత్నంలో భాగం. బీహార్‌ గోపాల్‌గంజ్‌లోని 'ప్రయోగ్ లైబ్రరీ' గురించి సమీపంలోని అనేక నగరాల్లో చర్చ మొదలైంది. ఈ గ్రంథాలయం నుంచి సుమారు 12 గ్రామాలకు చెందిన యువత పుస్తకాలు చదివే సౌకర్యాన్ని పొందడం ప్రారంభించారు. దీనితో పాటు చదువుకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా గ్రంథాలయం కల్పిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని లైబ్రరీలు ఉన్నాయి. ఈనాడు గ్రంథాలయాలు సమాజ సాధికారత కోసం బాగా ఉపయోగపడుతుండటం నిజంగా చాలా సంతోషకరం. మీరు కూడా పుస్తకాలతో మీ స్నేహాన్ని పెంచుకోండి. మీ జీవితం ఎలా పరివర్తన చెందుతుందో చూడండి.

నా ప్రియమైన దేశప్రజలారా! నేను మొన్న రాత్రి దక్షిణ అమెరికాలోని గయానా నుండి తిరిగి వచ్చాను. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న  గయానాలో కూడా 'మినీ భారతదేశం' ఉంది. సుమారు 180 సంవత్సరాల కిందట పొలాల్లో కూలీలుగా, ఇతర అవసరాల కోసం భారతదేశం నుండి ప్రజలను గయానాకు తీసుకెళ్లారు. నేడు గయానాలోని భారతీయ సంతతికి చెందిన ప్రజలు రాజకీయాలు, వ్యాపారం, విద్య, సంస్కృతి లాంటి ప్రతి రంగంలో గయానాకు నాయకత్వం వహిస్తున్నారు. గయానా అధ్యక్షులు డాక్టర్ ఇర్ఫాన్ అలీ కూడా భారతీయ సంతతికి చెందినవారు. ఆయన తన భారతీయ వారసత్వం గురించి గర్విస్తున్నారు. నేను గయానాలో ఉన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను నేను 'మన్ కీ బాత్'లో మీతో పంచుకుంటున్నాను. గయానా మాదిరిగా ప్రపంచంలోని డజన్ల కొద్దీ దేశాల్లో లక్షలాది భారతీయులు ఉన్నారు. వారి పూర్వికులు దశాబ్దాల కిందటి, 200-300 సంవత్సరాల కిందటి స్వీయ గాథలు వారివి. వివిధ దేశాల్లో ప్రవాస భారతీయులు తమదైన ముద్ర వేసిన గాథలను మీరు కనుగొనగలరా! అక్కడి స్వాతంత్ర్య పోరాటంలో ఎలా పాల్గొన్నారో,  వారు తమ భారతీయ వారసత్వాన్ని ఎలా సజీవంగా ఉంచుకున్నారో- ఇలాంటి విషయాలపై మీరు నిజమైన చరిత్రను కనుగొని వాటిని నాతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ కథనాలను నమో యాప్‌లో లేదా మై గవ్ లో #IndianDiasporaStories అనే హ్యాష్ ట్యాగ్తో కూడా పంచుకోవచ్చు.

మిత్రులారా! ఒమన్‌లో జరుగుతున్న ఒక అసాధారణమైన ప్రాజెక్ట్‌ కూడా మీకు ఆసక్తికరంగా ఉంటుంది. అనేక భారతీయ కుటుంబాలు శతాబ్దాలుగా ఒమన్‌లో నివసిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది గుజరాత్‌లోని కచ్‌లో స్థిరపడ్డారు. ఈ వ్యక్తులు వాణిజ్య రంగంలో ముఖ్యమైన అనుసంధానాలను ఏర్పరచారు. నేటికీ వారికి ఒమానీ పౌరసత్వం ఉంది. కానీ వారిలో నరనరానా  భారతీయత ఉంది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాల సహకారంతో ఒక బృందం ఈ కుటుంబాల చరిత్రను భద్రపరిచే పనిని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఆధారాలు సేకరించారు. వీటిలో డైరీలు, ఖాతా పుస్తకాలు, లెడ్జర్‌లు, ఉత్తరాలు , టెలిగ్రామ్‌లు ఉన్నాయి. ఈ పత్రాలలో కొన్ని 1838 సంవత్సరానికి చెందినవి కూడా ఉన్నాయి. ఈ పత్రాలు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఒమన్ చేరుకున్నప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపారు, ఎలాంటి సంతోషాలు, దుఃఖాలు ఎదుర్కొన్నారు, ఒమన్ ప్రజలతో వారి సంబంధాలు ఎలా సాగాయి - ఇవన్నీ ఈ పత్రాల్లో భాగమే. 'ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్' కూడా ఈ మిషన్‌కు ముఖ్యమైన ఆధారం. అక్కడి ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ మిషన్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. అక్కడి ప్రజలు తమ జీవన విధానాలకు సంబంధించిన విషయాలను వివరంగా అందించారు.

మిత్రులారా! భారతదేశంలో కూడా ఇలాంటి 'ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్' జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కింద దేశ విభజన సమయంలో బాధితుల అనుభవాలను చరిత్ర ప్రియులు సేకరిస్తున్నారు. దేశంలో విభజన బీభత్సం చూసిన వారు ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయత్నం మరింత ప్రాధాన్యత పొందింది.

మిత్రులారా! చరిత్రను భద్రపరుచుకునే దేశ స్థలాల భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ ఆలోచనతో గ్రామాల చరిత్రను భద్రపరిచేందుకు డైరెక్టరీని రూపొందించే ప్రయత్నం జరిగింది. భారతదేశ పురాతన సముద్ర ప్రయాణ సామర్థ్యానికి సంబంధించిన సాక్ష్యాలను భద్రపరిచే ప్రచారం కూడా దేశంలో జరుగుతోంది. దీనికి సంబంధించి లోథాల్‌లో భారీ మ్యూజియం కూడా తయారవుతోంది. మీ దగ్గర ఏదైనా లిఖిత ప్రతి, ఏదైనా చారిత్రక పత్రం ఉంటే మీరు దాన్ని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సహాయంతో భద్రపర్చవచ్చు.

మిత్రులారా! మన సంస్కృతిని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి సంబంధించి స్లోవేకియాలో జరిగిన మరొక ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. ఇక్కడ మొదటిసారిగా మన ఉపనిషత్తులు స్లోవాక్ భాషలోకి తర్జుమా అయ్యాయి. ఈ ప్రయత్నాలు భారతీయ సంస్కృతి ప్రపంచంపై ఏర్పరచిన ప్రభావాన్ని కూడా వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల హృదయాల్లో భారతదేశం ఉండడం మనందరికీ గర్వకారణం.

నా ప్రియమైన దేశప్రజలారా! మీకు వినడానికి సంతోషంగా, గర్వంగా ఉండే  దేశం సాధించిన ఒక విజయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పని మీరు చేయకపోతే బహుశా మీరు కూడా పశ్చాత్తాపపడవచ్చు. కొన్ని నెలల క్రితం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ ప్రచారంలో దేశం నలుమూలల నుండి ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రచారం వంద  కోట్ల మొక్కలు నాటడమనే ముఖ్యమైన మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. వందకోట్ల మొక్కలు... అది కూడా కేవలం ఐదు నెలల్లోనే. ఇది మన దేశ ప్రజల అవిశ్రాంత కృషి వల్లనే సాధ్యమైంది. దీనికి సంబంధించిన మరో విషయం తెలిస్తే మీరు గర్విస్తారు.  ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారం ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా విస్తరిస్తోంది. నేను గయానాలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ ప్రచారాన్ని చూశాను. అక్కడ గయానా అధ్యక్షులు డాక్టర్ ఇర్ఫాన్ అలీ గారు, ఆయన భార్య తల్లి గారు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో నాతో కలిసి పాల్గొన్నారు.

మిత్రులారా! ఈ ప్రచారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతోంది. 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మొక్కలు నాటడంలో రికార్డు సృష్టించింది. ఇక్కడ 24 గంటల్లో 12 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ ప్రచారం కారణంగా ఇండోర్‌ రేవతి హిల్స్‌లోని బంజరుభూములు  ఇప్పుడు గ్రీన్ జోన్‌గా మారతాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ఈ ప్రచారం ద్వారా ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించింది. ఇక్కడ మహిళల బృందం  గంటలో 25 వేల మొక్కలను నాటింది. తల్లులు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు.  ఇతరులకు కూడా స్ఫూర్తినిచ్చారు. ఇక్కడ ఐదు వేల మందికి పైగా ప్రజలు ఒకే చోట మొక్కలు నాటారు. ఇది కూడా ఒక రికార్డు. 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం కింద వివిధ సామాజిక సంస్థలు స్థానిక అవసరాల మేరకు మొక్కలు నాటుతున్నాయి. ఎక్కడైనా మొక్కలు నాటితే పర్యావరణానికి అనుకూలమైన రీతిలో పూర్తి పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నదే వారి ప్రయత్నం. అందుకే ఈ సంస్థలు కొన్ని చోట్ల ఔషధ మొక్కలు నాటుతున్నాయి. మరికొన్ని చోట్ల పక్షులకు గూళ్లు ఉండేలా మొక్కలు నాటుతున్నాయి. బిహార్‌లో 75 లక్షల మొక్కలు నాటేందుకు 'జీవిక స్వయం సహాయక సంఘం' మహిళలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మహిళల దృష్టి పండ్ల చెట్లపై ఉంది. వీటి ద్వారా వారు భవిష్యత్తులో ఆదాయాన్ని కూడా పొందుతారు.

మిత్రులారా! ఈ ప్రచారంలో పాల్గొనడం ద్వారా ఎవరైనా వారి తల్లి పేరు మీద ఒక మొక్కను నాటవచ్చు. మీ అమ్మ మీతో పాటు ఉంటే ఆమెను తీసుకెళ్లి ఒక మొక్కను నాటండి. లేకుంటే ఆమె ఫోటోతో మొక్కను నాటి, ఈ ప్రచారంలో భాగం అవ్వండి. మీరు మొక్కతో మీ సెల్ఫీని మై గవ్ డాట్ ఇన్ లో కూడా పోస్ట్ చేయవచ్చు. అమ్మ మన కోసం చేసేపనులకు మనం ఎప్పటికీ రుణం తీర్చుకోలేం. కానీ ఆమె పేరు మీద ఒక మొక్కను నాటడం ద్వారా మనం ఆమె ఉనికిని ఎప్పటికీ సజీవంగా ఉంచగలం.

నా ప్రియమైన దేశవాసులారా! మీరందరూ మీ చిన్నప్పుడు మీ ఇంటి పైకప్పు మీద లేదా చెట్ల మీద పిచ్చుకల కిలకిలారావాలు విని ఉంటారు. పిచ్చుకను తమిళం, మలయాళంలో కురువి అంటారు. తెలుగులో పిచ్చుక అని, కన్నడలో గుబ్బి అని అంటారు. ప్రతి భాషలో, సంస్కృతిలో పిచ్చుకలపై కథలున్నాయి. మన చుట్టూ ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో పిచ్చుకలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ నేడు నగరాల్లో పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల పిచ్చుక మనకు దూరమైంది. పిచ్చుకలను చిత్రాలలో లేదా వీడియోలలో మాత్రమే చూసిన నేటి తరం పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లల జీవితాల్లో ఈ సుందరమైన పక్షిని తిరిగి తీసుకురావడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెన్నైకి చెందిన కూడుగల్ ట్రస్ట్ పిచ్చుకల సంఖ్యను పెంచే ప్రచారంలో పాఠశాల విద్యార్థులను భాగస్వాములుగా చేసింది. ఈ సంస్థ సభ్యులు వివిధ పాఠశాలలకు వెళ్లి రోజువారీ జీవితంలో పిచ్చుక ఎంత ముఖ్యమైందో పిల్లలకు చెప్తారు. ఈ సంస్థ పిచ్చుక గూడు తయారు చేసేందుకు పిల్లలకు శిక్షణ ఇస్తుంది. దీని కోసం సంస్థ సభ్యులు చిన్న చెక్క గూడును తయారు చేయడం పిల్లలకు నేర్పించారు. ఇందులో పిచ్చుకలు బస చేసి తినేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి ఏదైనా భవనం బయటి గోడపై లేదా చెట్టుపై అమర్చగల గూళ్లు. ఈ ప్రచారంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పెద్ద సంఖ్యలో పిచ్చుకలకు గూళ్లు తయారు చేయడం ప్రారంభించారు. గత నాలుగేళ్లలో ఈ సంస్థ పిచ్చుకల కోసం పదివేల గూళ్లను సిద్ధం చేసింది. కూడుగల్‌ ట్రస్ట్‌ చొరవతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చుకల సంఖ్య పెరగడం మొదలైంది. మీరు కూడా మీ చుట్టూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పిచ్చుకలు మళ్లీ మన జీవితంలో భాగమవుతాయి.

మిత్రులారా! కర్ణాటకలోని మైసూరులో ఒక సంస్థ పిల్లల కోసం ‘ఎర్లీ బర్డ్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ పిల్లలకు పక్షుల గురించి చెప్పేందుకు ప్రత్యేక లైబ్రరీని నడుపుతోంది. ఇదొక్కటే కాదు-పిల్లల్లో ప్రకృతి పట్ల బాధ్యతాయుతతత్వాన్ని పెంపొందించేందుకు 'నేచర్ ఎడ్యుకేషన్ కిట్' సిద్ధం చేసింది. ఈ కిట్‌లో పిల్లల కోసం కథల పుస్తకాలు, గేమ్‌లు, యాక్టివిటీ షీట్లు, జిగ్-సా పజిళ్లు  ఉన్నాయి. ఈ సంస్థ నగరాల పిల్లలను గ్రామాలకు తీసుకెళ్లి పక్షుల గురించి చెప్తుంది. ఈ సంస్థ కృషి వల్ల పిల్లలు అనేక రకాల పక్షులను గుర్తించడం ప్రారంభించారు. 'మన్ కీ బాత్' శ్రోతలు కూడా అలాంటి ప్రయత్నాల ద్వారా పిల్లల్లో తమ పరిసరాలను చూసి, అర్థం చేసుకునే విభిన్న మార్గాలను అభివృద్ధి చేయవచ్చు.

నా ప్రియమైన దేశప్రజలారా! ఎవరైనా 'ప్రభుత్వ కార్యాలయం' అని చెప్పగానే మీ మనసులో ఫైళ్ల కుప్పల చిత్రం రావడం మీరు గమనించి ఉంటారు. మీరు సినిమాల్లో కూడా ఇలాంటివి చూసి ఉండవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైళ్ల కుప్పల మీద ఎన్నెన్నో జోకులు, ఎన్నో కథలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఆఫీస్‌లో పడి ఉండే ఈ ఫైళ్లు దుమ్ముతో నిండిపోయి, అక్కడ మురికిగా మారడం మొదలైంది. దశాబ్దాల నాటి ఫైళ్లు, చెత్త తొలగించేందుకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రచారం ప్రభుత్వ శాఖల్లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని తెలిస్తే మీరు సంతోషిస్తారు. పరిశుభ్రత కారణంగా కార్యాలయాల్లో చాలా స్థలం ఖాళీ అయింది. దీంతో ఆఫీస్‌లో పనిచేసే వారిలోనూ ఓనర్ షిప్ భావన వచ్చింది. తమ పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే భావనను కూడా పెంచుకున్నారు.

మిత్రులారా! ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ‘కచరా నుండి కాంచనం’ ఆలోచన ఇక్కడ చాలా పాతది. దేశంలోని అనేక ప్రాంతాల్లో యువతరం పనికిరాని వస్తువులను ఉపయోగించి వ్యర్థాలతో బంగారం తయారు చేస్తోంది. వారు రకరకాల ఆవిష్కరణలు చేస్తున్నారు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉపాధి మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ యువత తమ ప్రయత్నాల ద్వారా స్థిరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తోంది. ముంబాయికి చెందిన ఇద్దరు అమ్మాయిల ఈ ప్రయత్నం నిజంగా స్ఫూర్తిదాయకం. అక్షర, ప్రకృతి అనే ఈ ఇద్దరు అమ్మాయిలు వ్యర్థాలతో  ఫ్యాషన్ వస్తువులను తయారు చేస్తున్నారు. బట్టలు కత్తిరించేటప్పుడు, కుట్టేటప్పుడు బయటకు వచ్చే బట్ట ముక్కలను పనికిరానివిగా భావించి పడేయడం కూడా మీకు తెలుసు. అక్షర, ప్రకృతి బృందం ఆ దుస్తుల వ్యర్థాలను ఫ్యాషన్ ఉత్పత్తులుగా మారుస్తుంది. వాటితో తయారు చేసిన టోపీలను, బ్యాగులను కూడా విక్రయిస్తున్నారు.

మిత్రులారా! యూపీలోని కాన్పూర్‌లో కూడా పరిశుభ్రతకు సంబంధించి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొందరు వ్యక్తులు ప్రతిరోజూ ఉదయం మార్నింగ్ వాక్‌ వెళ్లి గంగానది ఘాట్‌లపై పడేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సేకరిస్తారు. ఈ బృందానికి ‘కాన్పూర్ ప్లాగర్స్ గ్రూప్’ అని పేరు పెట్టారు. ఈ ప్రచారాన్ని కొందరు మిత్రులు కలిసి ప్రారంభించారు. క్రమంగా ఇది ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ప్రచారంగా మారింది. నగరంలోని చాలా మంది ప్రజలు ఇందులో చేరారు. దీని సభ్యులు ఇప్పుడు దుకాణాలు, ఇళ్ల నుండి కూడా చెత్తను సేకరించడం ప్రారంభించారు. ఈ వ్యర్థాల నుండి రీసైకిల్ ప్లాంట్‌లో ట్రీ గార్డులను తయారు చేస్తారు. అంటే ఈ సమూహంలోని వ్యక్తులు వ్యర్థాలతో తయారు చేసిన ట్రీ గార్డులతో మొక్కలను కూడా సంరక్షిస్తారు.

మిత్రులారా! చిన్న ప్రయత్నాల ద్వారా ఎంత పెద్ద విజయం సాధించవచ్చో చెప్పడానికి అస్సాంకు చెందిన ఇతిషా ఒక ఉదాహరణ. ఇతిషా ఢిల్లీ, పూణేలలో చదువుకున్నారు. ఇతిషా కార్పొరేట్ ప్రపంచంలోని మెరుపులను, గ్లామర్‌ను విడిచిపెట్టి, అరుణాచల్‌లోని సాంగతీ లోయను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు.  పర్యాటకుల కారణంగా అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయేవి. ఒకప్పుడు శుభ్రంగా ఉన్న అక్కడి నది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలుషితమైంది. దీన్ని శుభ్రం చేసేందుకు స్థానిక ప్రజలతో కలిసి ఇతిషా కృషి చేస్తున్నారు. ఆ బృందంలోని సభ్యులు అక్కడికి వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడానికి మొత్తం లోయలో వెదురుతో చేసిన చెత్త బుట్టలను వారు ఏర్పాటు చేస్తున్నారు.

మిత్రులారా! ఇటువంటి ప్రయత్నాలు భారతదేశ పరిశుభ్రత ప్రచారానికి ఊపునిస్తాయి. ఇది నిరంతరం కొనసాగే ప్రచారం. ఇది మీ చుట్టూ కూడా జరుగుతూ ఉండవచ్చు. అలాంటి ప్రయత్నాల గురించి మీరు నాకు రాస్తూ ఉండండి.

మిత్రులారా! ఈ 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో ప్రస్తుతానికి ఇంతే! మీ స్పందనలు, ఉత్తరాలు, సూచనల కోసం నేను నెల మొత్తం ఎదురు చూస్తున్నాను. ప్రతి నెలా వచ్చే మీ సందేశాలు మరింత మెరుగ్గా చేయడానికి నన్ను ప్రేరేపిస్తాయి. వచ్చే నెలలో ‘మన్ కీ బాత్’ మరో సంచికలో దేశం, దేశప్రజల కొత్త విజయాలతో మనం మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు దేశవాసులందరికీ నా శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 జనవరి 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi