“మన సోదరీమణులు.. కుమార్తెల నుదుటి కుంకుమ చెరిపేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికీ తెలిసివచ్చింది”
“న్యాయం దిశగా భీషణ ప్రతిజ్ఞకు ప్రతీక- ఆపరేషన్‌ సిందూర్‌”
“ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుటి బొట్టు తుడిచేసేందుకు ఒడిగట్టారు...
అందుకే ఉగ్ర మూలాలను భారత్‌ ధ్వంసం చేసింది”
“పాకిస్థాన్‌ మన సరిహద్దులపై దాడికి యత్నిసే... వారి భూభాగం మీదనే వారిని భారత్‌ చావుదెబ్బ కొట్టింది”
“ఉగ్రవాదంపై పోరుకు పునర్నిర్వచనం ఆపరేషన్‌ సిందూర్‌.. ఇదొక కొత్త ప్రమాణం... సరికొత్త విధానం”
“ఇది యుద్ధాల శకం కాదు... అలాగని ఉగ్రవాద యుగం కూడా కాబోదు”
“ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపే విధానంపై ప్రపంచానికి ఇది భారత్‌ హామీ”

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారత్‌ సంయమనాన్నే కాకుండా దాని సామర్థ్యం ఎంత బలీయమైనదో కూడా జాతి యావత్తూ నేడు ప్రత్యక్షంగా చూసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు శక్తిసామర్థ్యాలు వెల్లువెత్తే భారత సాయుధ దళాలతోపాటు నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున ఆయన అభివందనం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ లక్ష్య సాధనలో మన వీర సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. వారి పరాక్రమం, ప్రతికూలతలను అధిగమించగల సామర్థ్యం, మొక్కవోని దీక్షను కొనియాడారు. దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు ఈ అసమాన ధైర్యసాహసాలు అంకితమని ఆయన ప్రకటించారు.

పహల్గామ్‌లో ఏప్రిల్ 22నాటి ఆటవిక ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది మన దేశాన్నే కాకుండా యావత్‌ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. కిరాతక ఉగ్రవాద దుశ్చర్యకు ఇదొక నిదర్శనమని శ్రీ మోదీ అభివర్ణించారు. సెలవు కాలాన్ని ఆహ్లాదంగా గడుపుతున్న అమాయక పౌరులను వారి భార్యాబిడ్డల ముందే... అందునా వారి మత విశ్వాసాలను ఆరాతీసి మరీ దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మారణకాండ క్రూరత్వానికి మాత్రమే ప్రతీక కాదని, దేశంలో సామరస్యపూరిత వాతావరణాన్ని భగ్నం చేసే కుట్ర కూడా ఇందులో భాగమని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనను తీవ్రంగా కలచివేసిన ఈ దురాగతానికి ప్రతీకారంగా ఉగ్రవాదంపై తిరుగులేని చర్యలకు దేశ ప్రజానీకం మొత్తం డిమాండ్‌ చేసిందని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం ప్రతి రాజకీయ పార్టీ- ముక్తకంఠంతో నినదించాయని ఆయన వివరించారు. ఉగ్రవాదుల నిర్మూలన దిశగా సాయుధ దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ప్రకటించారు. భారత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు తెగబడితే పరిణామాలు ఎంత భీకరంగా ఉంటాయో ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసివచ్చిందని పేర్కొంటూ అన్ని ఉగ్రవాద సంస్థలూ దీన్నొక హెచ్చరికగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

“ఆపరేషన్ సింధూర్ అన్నది కేవలం సంకేత నామం కాదు... లక్షలాది భారతీయుల భావోద్వేగ ప్రతిబింబం” అని ప్రధానమంత్రి విశదీకరించారు. న్యాయం దిశగా భీషణ ప్రతిజ్ఞకు దీన్నొక ప్రతీకగా అభివర్ణించారు. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మే 6-7 తేదీలలో ప్రపంచం ప్రత్యక్షంగా గమనించిందని చెప్పారు. ఈ మేరకు భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను అత్యంత కచ్చితత్వంతో నుగ్గునూచగా మార్చాయని గుర్తుచేశారు. తద్వారా ఉగ్రవాద స్వర్గధామమైన వారి భూభూగంపైనే వారిని చావుదెబ్బ కొట్టాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌ ఇంతటి సాహసోపేత చర్యకు దిగుతుందని ఉగ్రవాదులు కలలోనైనా ఊహించి ఉండరంటూ- కానీ, ‘దేశమే ప్రధానం’ నినాదంగా జాతియావత్తూ ఏకతాటిపై నిలిస్తే కఠిన నిర్ణయాలు, తద్వారా ప్రభావశీల ఫలితాలు తథ్యమని ఈ ఆపరేషన్‌ తేటతెల్లం చేసిందని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ క్షిపణి, డ్రోన్ దాడులు వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమేగాక, వారి మనోధైర్యాన్ని కూడా దెబ్బకొట్టాయని ఆయన పేర్కొన్నారు. బహావల్‌పూర్, మురిద్కే వంటి ప్రదేశాలు చిరకాలం నుంచీ ప్రపంచ ఉగ్రవాద కేంద్రాలుగా పనిచేస్తున్నాయని, అనేక ప్రధాన అంతర్జాతీయ ఉగ్రదాడులతో వాటికి సంబంధం ఉందని చెప్పారు. వీటిలో 9/11 అమెరికా దాడులు, లండన్ ట్యూబ్ బాంబు దాడులు సహా భారత్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రదాడులు అంతర్భాగంగా ఉన్నాయన్నారు. తాజా ఉదంతంలో ఉగ్రవాదులు భారత మహిళల ఆత్మగౌరవాన్ని నాశనం చేసేందుకు తెగబడ్డారని, అందుకే వారి మూలాలను భారత్‌ పెకలించివేసిందని ఆయన ప్రకటించారు. ఈ ఆపరేషన్లో 100 మందికిపైగా కరడుగట్టిన ఉగ్రవాదులు హతం కాగా, దశాబ్దాలుగా భారత్‌పై బహిరంగ కుట్రలు పన్నిన కీలక వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఆ మేరకు భారత్‌కు ముప్పు కలిగించే కుట్రలకు పాల్పడిన వారిని సత్వరం నిర్మూలించామని స్పష్టంగా ప్రకటించారు.

భారత్‌ అత్యంత కచ్చితత్వం, తిరుగులేని బలంతో దాడులు చేయడంతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ నైరాశ్యంతో దిక్కుతోచని స్థితిలో ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటంలో భాగస్వామి కావడానికి బదులు విచక్షణరహిత దాడులకు ఒడిగట్టిందన్నారు. ఇందులో భాగంగా భారత పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, దేవాలయాలు, పౌర ఆవాసాలపై భారీ ఆయుధాలతో దాడి చేసిందని చెప్పారు. అంతేకాకుండా మన సైనిక స్థావరాలు లక్ష్యంగానూ దాడికి తెగబడిందని తెలిపారు. పాకిస్థాన్‌ ఎంతటి దౌర్బల్యంలో మునిగిపోయిందో ఇవన్నీ ప్రపంచానికి స్పష్టం చేశాయని ఆయన అన్నారు. పాక్‌ డ్రోన్లు, క్షిపణులను భారత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు తుత్తునియలు చేశాయన్నారు. దీంతో వారు ప్రయోగించిన ఆయుధాలు గడ్డిపోచల్లా ఆకాశంలోనే మాడిపోయాయని తెలిపారు.

పాకిస్థాన్‌ అటు మన సరిహద్దులపై దాడికి సిద్ధమవుతుండగానే భారత్‌ ఇటునుంచి దాని కీలక స్థావరాలను చావుదెబ్బ కొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత డ్రోన్లు, క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని, దీంతో పాక్‌ ఎప్పటినుంచో గొప్పలు చెబుతున్న వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. భారత్‌ ప్రతిస్పందించిన తొలి మూడు రోజుల్లోనే పాకిస్థాన్‌ అంచనాలకు మించి విధ్వంసాన్ని చవిచూసిందన్నారు. భారత్‌ దూకుడుకు బెంబేలెత్తిన పాకిస్థాన్‌ ఆ తీవ్రతను తగ్గించే దారులు వెతకడం మొదలుపెట్టిందని చెప్పారు. పెచ్చుమీరే ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కోసం అంతర్జాతీయ సమాజానికి మొరపెట్టుకున్నదని తెలిపారు. తీవ్ర విధ్వంసంతో కలవరపాటుకు గురైన పాక్‌ సైన్యం మే 10 మధ్యాహ్నం భారత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో)ను సంప్రదించిందని ఆయన వెల్లడించారు. అప్పటికే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారత్‌ భారీ స్థాయిలో కూల్చివేయడమేగాక, కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టిందని పేర్కొన్నారు. దీంతోపాటు పాక్‌ భూభాగంపై ఉగ్రవాద స్థావరాలను శిథిలాల గుట్టగా మార్చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌పై అన్నిరకాల ఉగ్రవాద కార్యకలాపాలను, సైనిక దుందుడుకు చర్యలను నిలిపివేస్తామని పాక్‌ హామీ ఇచ్చినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రకటన దృష్ట్యా పరిస్థితిని సమీక్షించిన అనంతరం పాకిస్థాన్‌ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై తన ప్రతిచర్యలకు తాత్కాలిక విరామం ఇవ్వాలని భారత్‌ నిర్ణయించిందని వెల్లడించారు. అయితే, ఇది కాస్త ఉపశమనమే తప్ప ముగింపు కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఇకపై అనుక్షణం పాకిస్థాన్‌ ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటామని, భవిష్యత్తులో తన కట్టుబాటును తానే అతిక్రమించకుండా నిఘా పెడతామని స్పష్టం చేశారు.

భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పారామిలిటరీ బలగాలు సహా మన సాయుధ బలగాలు నిరంతరం అప్రత్తంగా ఉంటూ దేశ భద్రత కోసం పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. " ఇప్పుడు ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో ఆపరేషన్ సిందూర్ భారత సుస్థిర విధానంగా మారింది.. ఇది భారత వ్యూహాత్మక విధానంలో నిర్ణయాత్మక మార్పును సూచిస్తుంది" అని ఆయన ప్రకటించారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యల్లో సరికొత్త ప్రమాణాలను, కొత్త సాధారణ స్థితిని నిర్దేశించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత భద్రతా విధానం కోసం మూడు ప్రాథమిక ఆధారాలను ఆయన వివరించారు. మొదటిది.. భారత్‌పై జరిగే ఉగ్రదాడికి బలమైన, తీవ్రమైన ప్రతిస్పందనతో నిర్ణయాత్మక ప్రతీకారం తీర్చుకోవడం. అంటే భారత్ ఉగ్రవాదుల కేంద్రాలు, వాటి మూలాలు లక్ష్యంగా తన ఇష్టానుసారంగా ప్రతీకార దాడులు చేస్తుంది. రెండో ఆధారం.. అణ్వస్త్రాల పేరుతో భయపెట్టాలని చేసే ప్రయత్నాలను భారత్ ఏమాత్రం సహించదు. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడదు. ఈ సాకుతో పనిచేస్తున్న ఏ ఉగ్రవాద సురక్షిత స్వర్గధామమైనా కచ్చితత్వంతో కూడిన, నిర్ణయాత్మక దాడులను ఎదుర్కోక తప్పదు. మూడోది.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఉగ్రవాదులకు మధ్య తేడా లేదు.. భారత్ ఇకమీదట ఉగ్రవాదులను, వారికి ఆశ్రయం ఇస్తున్న ప్రభుత్వాలను వేర్వేరుగా చూడబోదని  ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ప్రపంచం మరోసారి చూసిందన్న ప్రధానమంత్రి.. నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారులు బహిరంగంగా పాల్గొనడం, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. తమ పౌరుల భద్రత కోసం భారత్ నిర్ణయాత్మక చర్యలు కొనసాగిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

యుద్ధభూమిలో ప్రతీసారి పాకిస్తాన్‌పై భారత్‌దే ఆధిపత్యం అన్న ప్రధానమంత్రి..  ఆపరేషన్ సిందూర్ మన దేశ సైనిక పరాక్రమాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిందన్నారు. ఎడారులు, పర్వతప్రాంతాల్లో జరిగే యుద్ధంలో భారత్ చూపిన అద్భుత సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ, ఆధునిక యుగంలోని యుద్ధంలో కూడా భారత్ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నదన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో, మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాల సామర్థ్యం నిరూపితమైందన్నారు. ఇరవై ఒకటో శతాబ్దపు యుద్ధంలో బలీయమైన శక్తిగా మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని నేడు ప్రపంచమంతా చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై పోరులో ఐక్యతే భారత ప్రధాన బలమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి... ఈ యుగం యుద్ధాలది కాదు.. ఉగ్రవాదానిది అంతకన్నా కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్ వెనకాడదని పేర్కొన్నారు. “ఉగ్రవాదాన్ని ఉపేక్షించని విధానమే మెరుగైన, సురక్షితమైన ప్రపంచానికి భరోసా” అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం నిరంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, అలాంటి చర్యలు చివరికి ఆ దేశ పతనానికి దారితీస్తాయని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ మనుగడ కోసం ప్రయత్నం చేయాలని భావిస్తే, తక్షణం వాళ్ల దేశంలో ఉగ్రవాదుల కోసం గల మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించాలనీ.. శాంతికి మరో మార్గం ఏదీ లేదని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదం, చర్చలు రెండూ ఏకకాలంలో జరగలేవు. ఉగ్రవాదం, వాణిజ్యం కూడా ఏకకాలంలో కొనసాగలేవు.. రక్తం, నీరు కలిసి ప్రవహించడం సాధ్యం కాదని పేర్కొంటూ ఈ విషయంలో భారత దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన... పాకిస్తాన్‌తో జరిగే చర్చలు ఉగ్రవాదం గురించి మాత్రమే జరుగుతాయనీ, పాకిస్తాన్‌తో జరిగే చర్చలన్నింటిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అంశం ప్రధాన కేంద్రంగా ఉంటుందనే భారత దీర్ఘకాలిక విధానాన్ని పునరుద్ఘాటించారు.

బుద్ధ పూర్ణిమ సందర్భంలో బుద్ధుని బోధనలను ప్రస్తావిస్తూ, బలం ద్వారానే శాంతి మార్గానికి మార్గనిర్దేశం జరగాలని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడు గౌరవంగా జీవిస్తూ, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తూ.. మానవత్వం, శాంతి, శ్రేయస్సుల దిశగా పురోగమించాలని ఆయన సూచించారు. శాంతిని పరిరక్షించడం కోసం భారత్ బలంగా ఉండాలి.. అవసరమైనప్పుడు ఆ బలాన్ని ఉపయోగించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ తన సూత్రాలకు కట్టుబడి ఉండడంలో చూపే దృఢ సంకల్పాన్ని ఇటీవలి సంఘటనలు ప్రదర్శించాయని ఆయన పేర్కొన్నారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ, భారత సాయుధ దళాల పరాక్రమానికి మరోసారి సెల్యూట్ చేసిన ప్రధానమంత్రి.. భారత ప్రజల ధైర్యం, ఐక్యత పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Government e-Marketplace Generates Rs 1.76 Lakh Crore In Net Social Savings Over Three Years: IIT Delhi Study

Media Coverage

Government e-Marketplace Generates Rs 1.76 Lakh Crore In Net Social Savings Over Three Years: IIT Delhi Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to brave participants of the Quit India Movement
August 09, 2026

Prime Minister Shri Narendra Modi has remembered all those who participated in the historic Quit India Movement and paid tribute to their courage and determination in India’s freedom struggle. Shri Modi said that inspired by the leadership of Mahatma Gandhi, the clarion call of the Quit India Movement infused new energy into the freedom struggle and reflected the unwavering resolve of the people of India to break free from colonial rule.

The Prime Minister posted on X:

Remembering all those who participated in the historic Quit India Movement. Their courage will always remain an inspiration for every Indian. Inspired by the leadership of Mahatma Gandhi Ji, the clarion call of Quit India infused new energy into our freedom struggle and reflected the unwavering determination of our people to break free from colonial rule.