10 కోట్లకుపైగా లబ్ధిదారు రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా బదిలీ; 351 ‘ఎఫ్‌పీవో'లకు రూ.14 కోట్లకుపైగా ‘ఈక్విటీ గ్రాంట్‌’ విడుదల చేసిన
ప్రధానమంత్రి; దేశవ్యాప్తంగా 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం;
“ఇనుమడించే మన చిన్న రైతుల బలానికి సమష్టిరూపం ఇవ్వడంలో ‘ఎఫ్‌పీవో’లు అద్భుత పాత్ర పోషిస్తున్నాయి”;
“దేశంలోని రైతుల ఆత్మవిశ్వాసమే దేశానికి ప్రధాన శక్తి”;
“2021 విజయాల స్ఫూర్తితో మనం సరికొత్త పయనం ప్రారంభించాలి”;
“దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జాతికి అంకితం కావడం నేడు ప్రతి భారతీయుడి మనోభావనగా మారుతోంది.. అందుకే ఈ రోజున మన ప్రయత్నాలు- సంకల్పాల్లోనూ ఐక్యత కనిపిస్తోంది.. అలాగే ఇవాళ మన విధానాల్లో స్థిరత్వం.. నిర్ణయాలలో దూరదృష్టి సుస్పష్టమవుతున్నాయి”;
“ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దేశంలోని రైతులకు గొప్ప అండ.. నేటి బదిలీతో రూ.1.80 లక్షల కోట్లకుపైగా సొమ్ము రైతు ఖాతాలకు నేరుగా చేరింది”

   దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్‌) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.

   ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ ‘ఎఫీపీవో’ సభ్యులతో మాట్లాడుతూ- సేంద్రియ వ్యవసాయం చేయడం, సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ మార్గాల గురించి ప్రధానమంత్రి వాకబు చేశారు. అలాగే ‘ఎఫీపీవో’ల సేంద్రియ ఉత్పత్తుల విక్రయ సదుపాయాల గురించి కూడా ఆయన ఆరాతీశారు. కాగా, రైతులకు సేంద్రియ ఎరువులు ఏ విధంగా సమకూర్చిందీ ‘ఎఫీపీవో’ ప్రతినిధులు ఆయనకు వివరించారు. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు రైతుల ఆదాయం మెరుగు దిశగా సహజ-సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు విస్తృత ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని వారికి తెలిపారు.

   వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా నిర్మూలించడానికి తాము అనుసరించే మార్గాల గురించి పంజాబ్‌ ‘ఎఫ్‌పీవో’ ప్రతినిధులు ప్రధానమంత్రికి వివరించారు. అలాగే విత్తుడు యంత్రం గురించి, ప్రభుత్వ సంస్థల నుంచి అందుతున్న సహాయం గురించి కూడా వారు ప్రధానికి తెలిపారు. కాగా, వ్యర్థాల నిర్మూలనలో వారి అనుభవాన్ని తెలుసుకుని, ప్రతి ఒక్కరూ అనుసరించాలని ప్రధానమంత్రి సూచించారు. ఇక రాజస్థాన్‌ ‘ఎఫ్‌పీవో’ ప్రతినిధులు తేనె ఉత్పాదన గురించి మాట్లాడారు. ‘నాఫెడ్‌’ సాయంతో చేపట్టిన ఈ విధానం తమకెంతో ప్రయోజనకరంగా ఉన్నదని రాజస్థాన్‌ ‘ఎఫ్‌పీవో’ ప్రతినిధులు తెలియజేశారు.

   రైతు సౌభాగ్యానికి పునాది వేస్తూ ‘ఎఫ్‌పీవో’లను సృష్టించడంపై ఉత్తరప్రదేశ్‌ ‘ఎఫ్‌పీవో’ ప్రతినిధులు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విత్తనాలు, సేంద్రియ ఎరువులు, వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి సభ్యులకు ‘ఎఫ్‌పీవో'ల తోడ్పాటు ప్రక్రియ గురించి వారు వివరించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చేయూత ఇవ్వడంపైనా వారు మాట్లాడారు. వారంతా ప్రస్తుతం దేశవ్యాప్త ఎలక్ట్రానిక్‌ విపణి ‘ఇ-నామ్’ సదుపాయం నుంచి లబ్ధి పొందుతున్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడంపై ప్రధాని దార్శనికతకు రూపమిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ- ‘దేశంలోని రైతుల ఆత్మవిశ్వాసమే దేశానికి ప్రధాన శక్తి’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   మిళనాడు ‘ఎఫ్‌పీవో’ ప్రతినిధులు మాట్లాడుతూ- తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందే దిశగా ‘నాబార్డ్‌’ మద్దతుతో మహిళలే ఈ ‘ఎఫ్‌పీవో’ను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితుల రీత్యా ఇక్కడ జొన్నలు బాగా పండుతాయని వారు ప్రధానికి తెలిపారు. దీనిపై స్పందిస్తూ- ‘నారీ శక్తి విజయం వారి అచంచల సంకల్పబలాన్ని చాటుతున్నది’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చిరుధాన్యాల సాగును రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌ ‘ఎఫ్‌పీవో'’ప్రతినిధులు మాట్లాడుతూ- ప్రకృతి వ్యవసాయం, గోవు ఆధారిత పంటల సాగువల్ల ఖర్చులతోపాటు భూసారంపై ఒత్తిడి కూడా తగ్గుతున్నట్లు తెలిపారు. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా  ఈ ప్రాంతంలోని గిరిజన తెగలు కూడా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.

    కార్యక్రమం చివరన ప్రధానమంత్రి మాట్లాడుతూ- మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దీనిపై జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ మనోజ్‌ సిన్హాతో మాట్లాడానని, గాయపడినవారికి చికిత్స గురించి సమీక్షించానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

   వాళ మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో గత సంవత్సరాల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో సరికొత్త పయనానికి నాంది పలకాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. మహమ్మారిపై పోరాటం, టీకాలు, కష్టకాలంలో దుర్బలవర్గాలకు చేయూత తదితరాలకు సంబంధించి దేశం చేసిన కృషిని ప్రధాని గుర్తుచేసుకున్నారు. దుర్బల వర్గాలకు నిత్యావసరాలు అందించడం కోసం దేశం దాదాపు రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆయన వెల్లడించారు. అలాగే దేశంలో మౌలిక వైద్య సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. ఈ మేరకు మౌలిక వైద్య వసతుల పునరుద్ధరణ దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, కొత్త వైద్య కళాశాలలు, శ్రేయో కేంద్రాల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కల్పన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం తదితరాల గురించి ఆయన విశదీకరించారు.

   దేశం “సబ్‌కా సాథ్‌-సబ్‌కా వికాస్-సబ్‌కా ప్రయాస్” తారకమంత్రంతో ముందడుగు వేస్తున్నదని ప్రధాని అన్నారు. దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేకమంది జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. వారు లోగడ కూడా ఇలా చేస్తూ వచ్చినా గుర్తింపు మాత్రం నేడు లభిస్తుదన్నదని పేర్కొన్నారు. “మనం స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతాయి. మన సంకల్పాలతో కూడిన కొత్త శక్తివంతమైన పయనానికి నాంది పలుకుతూ సరికొత్త శక్తితో ముందడుగు వేయడానికి ఇదే తగిన సమయం” అన్నారు. సమష్టి కృషికిగల శక్తిని వివరిస్తూ- “130 కోట్లమంది భారతీయులు ఒక అడుగు వేస్తే.. అది కేవలం ఒకటి కాదు… 130 కోట్ల అడుగులతో సమానం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   ర్థిక వ్యవస్థ గురించి ప్ర‌ధాని ప్ర‌స్తావిస్తూ- కోవిడ్‌ మునుపటి కాలంతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ అనేక కొలమానాల అంచనాలను మించి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. ఈ మేరకు “నేడు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి 8 శాతంకన్నా అధికంగా ఉంది. విదేశీ పెట్టుబడుల రాక రికార్డు స్థాయిలో నమోదైంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా రికార్డుస్థాయికి పెరిగాయి. జీఎస్టీ వసూళ్లలోనూ పాత రికార్డులు చెరిగిపోయాయి. ఎగుమతులకు సంబంధించి… ముఖ్యంగా వ్యవసాయం రంగంలోనూ మనం కొత్త రికార్డులు సృష్టించాం” అని ప్రధాని వివరించారు. ఇక 2021లో ‘యూపీఐ’ ద్వారా రూ.70 లక్షల కోట్లకుపైగా లావాదేవీలు సాగాయని, దేశంలో 50 వేలకుపైగా అంకుర సంస్థలు నడుస్తుండగా వీటిలో 10 వేలు గత ఆరు నెలల కాలంలో ఏర్పడినవేనని పేర్కొన్నారు. అలాగే 2021 భారత సాంస్కృతి వారసత్వం కూడా బలపడిన సంవత్సరమని ప్రధాని చెప్పారు. కాశీ విశ్వనాథ ఆలయం, కేదార్‌నాథ్‌ ఆలయాల అభివృద్ధి, అపహరణకు గురైన అన్నపూర్ణ మాత విగ్రహ పునరుద్ధరణ, అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రగతి, ఆది శంకరాచార్య సమాధి నవీకరణ వంటివి ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. అదేవిధంగా మన దేశంలోని ధోలావీరా, దుర్గాపూజ వేడుకలు వంటివాటికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడం భారత సాంస్కృతిక వారసత్వం బలం పుంజుకోవడం కూడా నిదర్శనాలని, దీనివల్ల పర్యాటక, యాత్రా సందర్శక సామర్థ్యం ఇనుమడిస్తుందని తెలిపారు.

   డచిన 2021 ‘స్త్రీ శక్తి’కి ఆశావాద సంవత్సరమని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మేరకు బాలికల కోసం సైనిక్‌ స్కూళ్లు ప్రారంభమయ్యాయని, యువతుల కోసం జాతీయ రక్షణ అకాడమీ (ఎన్‌డీఏ) ద్వారాలు తెరవబడ్డాయని పేర్కొన్నారు. గడచిన ఏడాదిలోనే యువకులతో సమానంగా యువతుల వివాహ వయోపరిమితిని 21 ఏళ్లకు పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయని గుర్తుచేశారు. భారత క్రీడారంగానికీ 2021 కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిందని చెప్పారు. ఎన్నడూ ఎరుగని రీతిలో దేశం నేడు క్రీడా మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెడుతున్నదని ప్రధాని వెల్లడించారు.

   వాతావరణ మార్పుపై చర్యల విషయంలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు 2070నాటికి ‘నికర శూన్య ఉద్గార స్థాయి’ సాధన లక్ష్యాన్ని ప్రపంచం ముందుంచిందని తెలిపారు. పునరుత్పాదక విద్యుదుత్పాదన సంబంధిత లక్ష్యాల్లో చాలావాటిని నిర్దేశిత గడువుకన్నా ముందే అందుకున్నామని ప్రధాని ప్రకటించారు. అలాగే భారత్‌ నేడు హైడ్రోజన్‌ మిషన్‌ దిశగా కృషి చేస్తున్నదని, విద్యుత్‌ వాహనాల ప్రవేశంలో ముందడుగు వేసిందని ఆయన తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణ వేగాన్ని ‘పీఎం గతిశక్తి జాతీయ సమగ్ర ప్రణాళిక’ కొంతపుంతలు తొక్కించనున్నదని ప్రధాని పేర్కొన్నారు. “చిప్‌లు, సెమీ కండక్టర్ల తయారీ వంటి సరికొత్త రంగాల అభివృద్ధికి ప్రతిష్టాత్మక ప్రణాళికలతో దేశానికి కొత్త కోణాలను జోడించే కృషి సాగుతోంది” అని ఆయన వెల్లడించారు.

   నేటి భారతం మనోభావాలను ప్రధానమంత్రి వివరిస్తూ- “దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జాతికి అంకితం కావడం నేడు ప్రతి భారతీయుడి మనోభావనగా మారుతోంది. అందుకే ఈ రోజున మన ప్రయత్నాలు-సంకల్పాల్లోనూ ఐక్యత కనిపిస్తోంది. సత్వర విజయసాధనపై గురి పెరుగుతోంది. అలాగే ఇవాళ మన విధానాల్లో స్థిరత్వం, నిర్ణయాలలో దూరదృష్టి సుస్పష్టమవుతున్నాయి” అని పేర్కొన్నారు. కాగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దేశంలోని రైతులకు గొప్ప అండగా నిలిచిందని ప్రధాని చెప్పారు. ఆ మేరకు నేటి నిధుల బదిలీతో రూ.1.80 లక్షల కోట్లకుపైగా సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చేరిందని వివరించారు. ‘ఎఫ్‌పీవో' ఏర్పాటుతో సామూహిక శక్తి ఎలాంటిదో చిన్న రైతులు స్వయంగా తెలుసుకుంటున్నారని ప్రధాని చెప్పారు. ఈ సంస్థల వల్ల చిన్న రైతులకు కలిగే ఐదు రకాల ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. ఈ మేరకు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే నైపుణ్యం, బేరమాడే శక్తి, స్థాయితోపాటు ఆవిష్కరణ, ముప్పు నిర్వహణ సామర్థ్యం ఇనుమడిస్తాయని పేర్కొన్నారు. ‘ఎఫ్‌పీవో'వల్ల ఇన్ని ప్రయోజనాలున్న కారణంగా ప్రతి స్థాయిలోనూ వీటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. ఈ సంస్థలు ప్రస్తుతం రూ.15 లక్షల వరకూ ఆర్థిక సహాయం పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సేంద్రియ, నూనెగింజల, వెదురు, తేనె ఉత్పత్తుల సంబంధిత ‘ఎఫ్‌పివో’లు  దేశవ్యాప్తంగా ఏర్పడుతున్నాయని తెలిపారు. “నేడు మన రైతులు ‘ఒక జిల్లా-ఒకే ఉత్పత్తి’ వంటి పథకాలద్వారా లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు వారికి అందుబాటులోకి వస్తున్నాయి” అని ప్రధాని వివరించారు. అదేవిధంగా రూ.11 వేల కోట్లతో ‘జాతీయ పామాయిల్ మిషన్’ వంటి పథకాల అమలుద్వారా దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గుతున్నదని తెలిపారు.

   టీవలి కాలంలో వ్యవసాయ రంగం సాధించిన మైలురాళ్ల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు ఆహార ధాన్యాల ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు చేరింది. అలాగే ఉద్యాన-పూల తోటల సాగులో ఉత్పత్తి 330 మిలియన్ టన్నులు నమోదవుతోంది. గడచిన 6-7 ఏళ్లలో పాల దిగుబడి కూడా దాదాపు 45 శాతం పెరిగింది. సుమారు 60 లక్షల హెక్టార్ల భూమి సూక్ష్మ వ్యవసాయం కిందకు వచ్చింది, ‘ప్రధానమంత్రి పంటల బీమా పథకం’ కింద రూ.1 లక్ష కోట్లకుపైగా పరిహారం చెల్లించబడగా ఇందుకు రైతులు చెల్లించిన రుసుము కేవలం రూ.21 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇథనాల్ ఉత్పత్తి కేవలం ఏడేళ్లలో 40 కోట్ల లీటర్ల నుంచి 340 కోట్ల లీటర్లకు దూసుకుపోయింది. బయో-గ్యాస్‌ను ప్రోత్సహించే ‘గోబర్‌ ధన్‌’ పథకం గురించి కూడా ప్రధాని వెల్లడించారు. ఆవు పేడకు విలువ లభించేట్లయితే పాలివ్వని పశువులు రైతుకు ఇక ఎంతమాత్రం భారం కాబోవని ఆయన చెప్పారు. ప్రభుత్వం ‘కామధేను కమిషన్‌’ ఏర్పాటు ద్వారా పాడి పరిశ్రమ రంగం మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోందని తెలిపారు.

   ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన ఆవశ్యకతను ప్రధాని మరోసారి ప్రస్తావించారు. భూసార పరిరక్షణకు రసాయనరహిత వ్యవసాయమే ప్రధాన మార్గమన్నారు. ఈ దిశగా ప్రకృతి వ్యవసాయం కీలక ముందడుగు కాగలదని చెప్పారు. ఈ విధాన ప్రక్రియలతోపాటు లభించే ప్రయోజనాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని సూచించారు. చివరగా వ్యవసాయంలో సరికొత్త ఆవిష్కరణలు నిరంతరం సాగుతూనే ఉండాలని, పరిశుభ్రత వంటి ఉద్యమానికి మద్దతివ్వాలని రైతులకు పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ఉపన్యాసం ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s medical education boom: Number of colleges doubles, MBBS seats surge by 130%

Media Coverage

India’s medical education boom: Number of colleges doubles, MBBS seats surge by 130%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 డిసెంబర్ 2024
December 08, 2024

Appreciation for Cultural Pride and Progress: PM Modi Celebrating Heritage to Inspire Future Generations.