· అజేయమైన ధైర్యానికీ, అత్యున్నత సాహసానికీ ప్రతీకలైన వీర సాహిబ్‌జాదాలను నేడు స్మరించుకుందాం.. వారు దేశానికి గర్వకారణం
· మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్ సింగ్, నలుగురు సాహిబ్జాదాల ధైర్యమూ, ఆదర్శాలూ ప్రతి భారతీయుడికీ తరగని స్ఫూర్తి
· వలసవాద మనస్తత్వం నుంచి శాశ్వత విముక్తి దిశగా భారత్ సంకల్పం
· వలసవాద మనస్తత్వం నుంచి భారత్ విముక్తమవుతున్న నేటి తరుణంలో దేశానికి బలంగా నిలుస్తున్న భాషా వైవిధ్యం
· వికసిత భారత్ లక్ష్యం దిశగా భారత్‌ను నడపబోతున్న జెన్ జీ, జెన్ ఆల్ఫా: ప్రధాని

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వీరబాల దివస్’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి, అక్కడున్న పిల్లలనుద్దేశించి మాట్లాడారు. వీరబాల దివస్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల వందేమాతర ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. వారి అంకితభావం, కృషి ఆ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయన్నారు.

భారతదేశానికి గర్వకారణమైన, అజేయ ధైర్య సాహసాలకు ప్రతీకలైన వీర సాహిబ్‌జాదాలను దేశం నేడు స్మరించుకుంటోందని శ్రీ మోదీ చెప్పారు. వయస్సు, అనుభవాల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్‌జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారన్నారు. మతోన్మాదాన్నీ, ఉగ్ర మూలాలనూ పెకలించారని కొనియాడారు. ఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న ఈ దేశ యువత.. స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువతరం ఏదయినా సాధించగలదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

డిసెంబర్ 26వ తేదీ వస్తే చాలు.. సాహిబ్‌జాదాల అసమాన పరాక్రమ స్ఫూర్తితో ‘వీరబాల దివస్’ వేడుకలను ప్రభుత్వం ప్రారంభించిందన్న తృప్తి, భరోసా కలుగుతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ఈ కొత్త సంప్రదాయంతో సాహిబ్‌జాదాల స్ఫూర్తిని యువత అందిపుచ్చుకుంటోందన్నారు. యువతను ధీరులుగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే దిశగా ఇది ఓ వేదికగా నిలిచిందన్నారు. ఏటా వివిధ రంగాల్లో దేశం కోసం విశేష విజయాలు సాధించిన బాలలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని (పీఎంఆర్‌బీపీ) స్వీకరిస్తారని, ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా 20 మంది పిల్లలు ఈ పురస్కారాన్ని అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. వారితో తన సంభాషణను వివరిస్తూ... చాలా మంది పిల్లలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారనీ.. కొందరు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయ సేవలందించారనీ.. ఇంకొందరు శాస్త్ర, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేశారనీ.. మరికొందరు క్రీడలు, కళ, సంస్కృతీ రంగంలో విశేష కృషి చేశారనీ శ్రీ మోదీ తెలిపారు. ఈ పురస్కారం ఆ పిల్లలది మాత్రమే కాదనీ.. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకుల కృషికీ ఇది గుర్తింపు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పురస్కార విజేతలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించిన ఆయన, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

వీరబాల దివస్‌ను భావోద్వేగానికీ, భక్తిభావానికీ ప్రతీకగా వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. అత్యంత చిన్న వయస్సులోనే నాడు అత్యంత శక్తిమంతమైన మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన వీర సాహిబ్‌జాదాలు అజిత్ సింగ్, జుఝార్ సింగ్, జొరావర్ సింగ్, ఫతే సింగ్‌లను స్మరించుకున్నారు. ప్రాథమిక భారతీయ ఆదర్శాలకూ, మత మౌఢ్యానికీ నడుమ.. సత్యానికీ, అసత్యానికీ నడుమ.. ఆ పోరాటం సాగిందన్నారు. ఒక పక్షానికి పదో గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ నాయకత్వం వహించగా, మరోవైపు ఔరంగజేబు క్రూర పాలన సాగిందన్నారు. భారతీయుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి బలవంతంగా మతమార్పిడులు చేయాలని ఔరంగజేబు నిశ్చయించుకున్నాడని, అందుకే సాహిబ్‌జాదాలు చాలా చిన్నవారే అయినప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకున్నాడని ప్రధానమంత్రి చెప్పారు. గురు గోవింద్ సింగ్ సామాన్యుడు కాదనీ.. తపస్సుకూ, త్యాగానికీ ప్రతీక అయిన ఆయన వారసత్వాన్ని సాహిబ్‌జాదాలు అందిపుచ్చుకున్నారనీ... ఔరంగజేబు, అతని సేనానులు ఈ విషయాన్ని విస్మరించారని ప్రధానమంత్రి అన్నారు. మొఘలు సామ్రాజ్యం అంత బలమైనదే అయినప్పటికీ, నలుగురు సాహిబ్‌జాదాలలో ఒక్కరు కూడా చలించలేదని శ్రీ మోదీ కొనియాడారు. వారి శౌర్యం ఇప్పటికీ ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తుందంటూ...సాహిబ్‌జాదా అజిత్ సింగ్ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

కొన్ని రోజుల కిందటే కురుక్షేత్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ గురు తేగ్ బహదూర్ జీని ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా దేశం స్మరించుకుందని ప్రధానమంత్రి మోదీ గుర్తుచేశారు. ఆయన త్యాగం నుంచి స్ఫూర్తి పొందిన సాహిబ్‌జాదాలు మొఘలుల అకృత్యాలకు భయపడతారనుకోవడం పొరపాటన్నారు. మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్ సింగ్, నలుగురు సాహిబ్‌జాదాల ధైర్యమూ, ఆదర్శాలూ ప్రతి భారతీయుడికీ బలాన్నిస్తాయనీ, తరగని స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. సాహిబ్‌జాదాల త్యాగనిరతి ప్రతి పౌరుడికీ ఎంతగానో తెలిసి ఉండాల్సిందన్న శ్రీ మోదీ.. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద మనస్తత్వమే బలంగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1835లో బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే ఈ మనస్తత్వానికి బీజం వేశారనీ, స్వాతంత్య్రానంతరం కూడా దీన్ని నిర్మూలించలేకపోయామనీ అన్నారు. దీంతో ఇలాంటి సత్యాలు దశాబ్దాల పాటు అణచివేతకు గురయ్యాయన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తిని నేడు భారత్ సంకల్పించిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారతీయ త్యాగాలకూ, శౌర్యానికీ సంబంధించిన జ్ఞాపకాలు ఇకపై అణచివేతకు లోనుకాబోవని, దేశ నాయికా నాయకులను ఇకపై పక్కనపెట్టబోమని ప్రకటించారు. అందుకే వీరబాల్ దివస్‌ను పూర్తి భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అక్కడితోనే ఆగలేదన్నారు. 2035 నాటికి మెకాలే కుట్రకు 200 ఏళ్లు పూర్తవుతుందని, మరో పదేళ్లు మిగిలి ఉండగానే వలసవాద మనస్తత్వం నుంచి భారత్ సంపూర్ణ విముక్తిని సాధించి చూపుతుందని స్పష్టం చేశారు. ఈ మనస్తత్వం నుంచి విముక్తి పొందితే.. స్వదేశీ సంప్రదాయాల పట్ల మరింత గౌరవాదరాలు పెరుగుతాయని, స్వావలంబన పథంలో దేశం పురోగమిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

వలసవాద మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తం చేసే ప్రచారానికి సంబంధించిన ఛాయలు ఇటీవల పార్లమెంటులో కనిపించాయని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు హిందీ, ఇంగ్లిషుతోపాటు ఇతర భారతీయ భాషల్లో దాదాపు 160 ప్రసంగాలు చేశారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సుమారు 50 ప్రసంగాలు తమిళంలో, 40కి పైగా ప్రసంగాలు మరాఠీలో, దాదాపు 25 ప్రసంగాలు బెంగాలీలో చేశారని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ఏ పార్లమెంటులో అయినా ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుందని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో భాషా వైవిధ్యాన్ని అణచివేసేందుకు మెకాలే ప్రయత్నించాడని, కానీ వలసవాద మనస్తత్వం నుంచి భారత్ నేడు విముక్తి పొందుతున్న తరుణంలో.. ఆ భాషా వైవిధ్యమే మనకు గొప్ప శక్తిగా నిలుస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  

 

యువ భారత్ సంస్థ సభ్యులైన యువతనుద్దేశించి ప్రసంగిస్తూ- వారు ‘జెన్ జీ, ఆల్ఫా’ తరాలకు ప్రతినిధులని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని వికసిత భారత్‌గా రూపుదిద్దేది వారేనని స్పష్టం చేశారు. ఈ తరం సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తాను చూస్తున్నానని, అవగతం చేసుకున్నానని, అందువల్లనే వారిపై తనకెంతో విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. ఒక సామెతను ఉటంకిస్తూ- ఒక పసివాడు వివేచనతో మాట్లాడినపుడు దాన్ని అంగీకరించాలని, మన గొప్పతనాన్ని నిర్వచించేది ఆలోచనలు, విజయాలే తప్ప వయసు కాదని స్పష్టం చేశారు. యువతరం అందరికీ స్ఫూర్తినిచ్చేలా పని చేయగలదని, ఈ వాస్తవాన్ని చాలామంది ఇప్పటికే రుజువు చేశారని ఆయన వివరించారు. అయితే, మన చేరాల్సిన గమ్యం ఎంతో దూరంలో ఉన్నందున ఆ విజయాలను కేవలం శుభారంభంగా మాత్రమే పరిగణించాలని చెప్పారు. ఆకాశమే హద్దుగా మన స్వప్నాలను సాకారం చేసుకోవాలని ఉద్బోధించారు. లోగడ అంతటా అలముకున్న నిరాశాపూరిత వాతావరణం ఫలితంగా కలలు కనడమంటే భయంగా ఉండేదని, నేడు అటువంటి పరిస్థితులు లేవుగనుక ఈ తరం ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు. దేశం వారి ప్రతిభకు చేయూతనివ్వడమే ఇందుకు కారణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు దేశం నలుమూలలా ప్రతిభను అన్వేషించి, దానికి పదును పెట్టే వేదికలను సమకూరుస్తున్నదని తెలిపారు. తద్వారా 140 కోట్ల మంది పౌరుల బలాన్ని వారి ఆకాంక్షలకు జోడిస్తున్నదని చెప్పారు. డిజిటల్ ఇండియా విజయం ఫలితంగా యువతరానికి ఇంటర్నెట్ సాధికారత కల్పించడంతోపాటు అభ్యసన వనరులు అందుబాటులోకి వచ్చాయన్నారు. శాస్త్ర, సాంకేతిక, వ్యవస్థాపన రంగాల్లో విద్యాభ్యాసం చేసిన వారికి ‘అంకుర భారత్‌’ (స్టార్టప్ ఇండియా), క్రీడలలో రాణించే వారికి ‘క్రీడా భారత్‌’ (ఖేలో ఇండియా) వంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఓ రెండు రోజుల కిందటే తాను పార్లమెంటు క్రీడా మహోత్సవాల్లో పాల్గొన్నానని, యువత పురోగమనానికి మద్దతిచ్చే అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనమని శ్రీ మోదీ చెప్పారు. స్వల్పకాలిక ప్రాచుర్యం మోజులో పడకుండా అప్రమత్తత వహించాలని యువతకు సూచించారు. జీవన సూత్రాలు, ఆలోచనలలో పరిపక్వత అత్యావశ్యకమని స్పష్టం చేశారు. దేశంలోని మహనీయుల ఆదర్శాలు, వ్యక్తిత్వాల నుంచి స్ఫూర్తి పొందాలని, తమ విజయం వ్యక్తిగతంగా కాకుండా దేశానికి సంబంధించినదిగా ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

 

యువత సాధికారతపై దృష్టితో కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నామని, యువత కేంద్రకంగా దేశ ప్రగతికి ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మేరా యువ భారత్ వంటి వేదికల ద్వారా యువత అనుసంధానానికి, అవకాశాలతోపాటు నాయకత్వ నైపుణ్య కల్పనకు కృషి కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రగతి, క్రీడలకు ప్రోత్సాహం, ఫిన్‌టెక్, ఉత్పాదక రంగాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌ దిశగా అవకాశాల సృష్టి తదితర ప్రతి  కార్యక్రమంలో యువతకు పెద్దపీట వేస్తున్నామని శ్రీ మోదీ వివరించారు. ప్రతి రంగంలోనూ యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, ప్రపంచంలో యువ జనాభాగల దేశాలలో భారత్‌ ఒకటిగా ఉందని తెలిపారు. యువతరానికి ఇది కలిసివచ్చే కాలం కాబట్టి, రాబోయే 25 ఏళ్లు దేశ భవిష్యత్తకు దిశానిర్దేశం చేస్తాయని శ్రీ మోదీ అన్నారు. స్వాతంత్ర్యానంతరం తొలిసారి దేశ సామర్థ్యాలు, ఆకాంక్షలు ప్రపంచ అంచనాలను అందుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మునుపెన్నడూ లేనిరీతిలో గొప్ప అవకాశాలున్న నేటి పరిస్థితులలో యువతరం నేడు ఎదుగుతున్నదని చెప్పారు. దీనికి అనుగుణంగా వారి ప్రతిభ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన అవకాశాల కల్పనకు ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నదని వెల్లడించారు.

విద్యా విధానంలో గణనీయ సంస్కరణలతో వికసిత భారత్‌కు బలమైన పునాదులు వేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు 21వ శతాబ్దపు ఆధునిక అభ్యసన పద్ధతులపై కొత్త జాతీయ విద్యా విధానం దృష్టి సారిస్తుందని తెలిపారు. ఆచరణాత్మక అభ్యాసానికి ప్రాధాన్యమిస్తూ, బాలలు బట్టీపట్టే బదులు ఆలోచించేలా ఇది ప్రోత్సహిస్తుందని, ప్రశ్నించే మనోధైర్యాన్నిస్తుందని, పరిష్కార నైపుణ్యాన్ని పెంచుతుందని ఆయన వివరించారు. బహుళ కోర్సుల అధ్యయనం, నైపుణ్యాధారిత అభ్యాసం, క్రీడలకు ప్రోత్సాహం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో విద్యార్థులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని శ్రీ మోదీ చెప్పారు. ఈ దిశగా దేశంలో తొలిసారి అర్థవంతమైన కృషి కొనసాగుతున్నదని, దేశవ్యాప్తంగా లక్షలాది బాలలు అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా ఆవిష్కరణలు, పరిశోధనలలో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. పాఠశాల స్థాయిలోనే రోబోటిక్స్, ఏఐ, సుస్థిరత, డిజైన్ థింకింగ్‌ వంటి ఆధునిక అంశాలను పరిచయం చేస్తున్నారని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేగాక, జాతీయ విద్యా విధానం వల్ల మాతృభాషలో చదువుకునే అవకాశం కూడా లభించిందని, దీంతో అభ్యసనం సరళమై బాలలు పాఠ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు.

 

సాహసులైన ‘సాహిబ్‌జాదా’లు మార్గం ఎంత కష్టమైనదని కాకుండా సముచితమైనదా... కాదా? అని మాత్రమే చూశారని, అదే స్ఫూర్తి నేడు కూడా అవసరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పెద్ద కలలు కనాలని, దీక్షతో కృషి చేయాలని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదని చెబుతూ- భారత యువత నుంచి తాను ఆశిస్తున్నది ఇదేనన్నారు. దేశ భవిష్యత్తు బాలలు, యువత భవిష్యత్తుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వారి ధైర్యం, ప్రతిభ, అంకితభావమే దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ విశ్వాసం, కర్తవ్య దీక్ష, నిరంతర వేగంతో భారత్‌ ఉజ్వల భవిష్యత్‌ పథంలో సాగుతుందని ప్రధానమంత్రి వివరించారు. పురస్కార విజేతలకు అభినందనలతోపాటు, అందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా, ‘సాహిబ్‌జాదా’లకు మరోసారి నివాళి అర్పిస్తూ తన ప్రసంగం ముగించారు.

కేంద్ర మంత్రులు శ్రీమతి అన్నపూర్ణా దేవి, శ్రీమతి సావిత్రి ఠాకూర్, శ్రీ రవ్‌నీత్‌ సింగ్, శ్రీ హర్ష్ మల్హోత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం

వీర బాలల దినోత్సవం సందర్భంగా ‘సాహిబ్‌జాదా’ల అసాధారణ ధైర్యసాహసాలు, అత్యున్నత త్యాగం గురించి పౌరులకు అవగాహన కల్పనతోపాటు దేశ చరిత్రలోని ఈ యువ వీరుల అకుంఠిత దీక్షను సంస్మరించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ భాగస్వాములతో సంయుక్తంగా దేశమంతటా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కథా శ్రవణం, పద్య పఠనం, పోస్టర్ల తయారీ, వ్యాస రచన వంటి అంశాల్లో పోటీలు కూడా నిర్వహిస్తోంది. ఈ మేరకు పాఠశాలలు, శిశు సంరక్షణ సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు సహా విద్యా-‘మైగవ్’, ‘మైభారత్’ పోర్టళ్ల ద్వారా ఆన్‌లైన్‌ మార్గంలో వీటిని నిర్వహిస్తోంది.

శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రకాష్ పర్వ్‌ సందర్భంగా 2022 జనవరి 9న ఆయన కుమారులైన సాహిబ్‌జాదా ‘బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్’ అమరత్వ సంస్మరణార్థం డిసెంబరు 26వ తేదీని ‘వీర్ బాలల దినోత్సవం’గా నిర్వహిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ ఇద్దరు ‘సాహిబ్‌జాదా’ల సాటిలేని త్యాగం తరతరాలుగా యువతరానికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ (పీఎంఆర్‌బీపీ) గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”