వాణిజ్యమైనా, దౌత్యమైనా, ఏ ఇతర భాగస్వామ్యానికైనా పరస్పర విశ్వాసమే పునాది, భారత్-రష్యా సంబంధాల బలం ఈ నమ్మకంలోనే దాగుంది, ఇదే ఉమ్మడి ప్రయత్నాలకు దిశను, వేగాన్ని అందిస్తుంది, కొత్త కలలను, ఆకాంక్షలను సాకారం చేసుకొనేలా స్పూర్తినిస్తుంది: పీఎం
2030కి ముందే భారత్-రష్యా మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లను చేరుకోవాలన్నదే లక్ష్యం: పీఎం
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా సంస్కరణ, పని, పరివర్తన అనే సూత్రం మార్గదర్శకత్వంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది: పీఎం

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌ కూడా పాల్గొన్నారు. తన ప్రసంగంలో అధ్యక్షుడు పుతిన్‌కు, దేశవిదేశాలకు చెందిన నాయకులకు, విశిష్ట అతిథులకు ప్రధాని నమస్కరించారు. అతి పెద్ద ప్రతినిధి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవను ఈ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ.. వారి మధ్య ఉండటం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, విలువైన సూచనలను అందించిన తన స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వాణిజ్యానికి సరళమైన, విశ్వసనీయమైన వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, భారత్, యురేషియన్ ఆర్థిక సంఘంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు.

భవిష్యత్తు అవకాశాల గురించి కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, అధ్యక్షుడు పుతిన్ వివరించినట్టుగా.. భారత్, రష్యా తక్కువ సమయంలోనే గొప్ప లక్ష్యాలను సాధించగలవని శ్రీ మోదీ అన్నారు. వాణిజ్యమైనా, దౌత్యమైనా, ఏ ఇతర భాగస్వామ్యానికైనా.. పరస్పర విశ్వాసమే పునాది అని వివరించారు. భారత్-రష్యా సంబంధాల బలం ఈ నమ్మకంలోనే ఉందన్నారు. ఉమ్మడి ప్రయత్నాలకు దిశను, వేగాన్ని ఈ నమ్మకమే అందిస్తుందని, కొత్త కలలను, ఆకాంక్షలను సాకారం చేసుకొనేలా స్పూర్తినిస్తుందని వెల్లడించారు. గతేడాది, ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అధిగమించాలని అధ్యక్షుడు పుతిన్ సంకల్పించారని ప్రధాని గుర్తు చేశారు. అయితే అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన తాజా చర్చలు, కనిపిస్తున్న సామర్థ్యాలను బట్టి చూస్తే 2030 వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయం కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో భారత్, రష్యా ముందుకు సాగుతున్నాయనే తన నమ్మకం మరింత బలపడుతోందని తెలియజేశారు. సుంకాలు, సుంకేతర అడ్డంకులను తగ్గిస్తున్నామని శ్రీ మోదీ వివరించారు. ఈ ప్రయత్నాల అసలైన బలం వ్యాపారవేత్తల్లోనే ఉందన్నారు. వారి శక్తి, ఆవిష్కరణలు, లక్ష్యాలే భారత్, రష్యాల ఉమ్మడి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు.

 

గడచిన పదకొండేళ్లలో భారత్‌లో వచ్చిన మార్పుల వేగాన్ని, వాటి స్థాయిని వివరిస్తూ.. సంస్కరణ, పని, పరివర్తన అనే సూత్రాన్ని పాటిస్తూ.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ ప్రయాణిస్తోందని శ్రీ మోదీ వివరించారు. ఈ పదకొండేళ్ల సంస్కరణల ప్రయాణంలో భారత్ ఎప్పుడూ అలసిపోలేదని, ఆగిపోలేదని చెప్పారు. తన లక్ష్యాలను సాధించే దిశగా మునుపెన్నడూ లేని బలమైన సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో, వేగంతో ప్రయాణిస్తోందన్నారు. వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలను, నిబంధనల్లో సడలింపులు చేపడుతున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ప్రైవేటు రంగాన్ని రక్షణ, అంతరిక్ష రంగంలో అనుమతించామని, ఇది నూతన ఉద్యోగాలను సృష్టిస్తోందని, పౌర అణుశక్తి రంగంలో కూడా కొత్త అవకాశాలను కల్పిస్తోందని తెలియజేశారు. ఇవన్నీ పరిపాలనమైన సంస్కరణలు మాత్రమే కాదని, వికసిత్ భారత్ అనే ఏకైక సంకల్పం ద్వారా నడిచే ఆలోచనాపరమైన మార్పులు అని చెప్పారు.

గత రెండు రోజులుగా ఉపయోగకరమైన, అర్థవంతమైన చర్చలు జరిగాయని, అన్ని రంగాల్లోనూ భారత్-రష్యా మధ్య సహకారానికి ప్రాతినిధ్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ చర్చల్లో పాల్గొన్న వారు ఇచ్చిన సలహాలను, వారి ప్రయత్నాలను ఆయన మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక ఆలోచనలు అందించారన్నారు. సరకు రవాణా, అనుసంధానం విషయంలో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని అధ్యక్షుడు పుతిన్, తాను గుర్తించామని శ్రీ మోదీ వెల్లడించారు. చెన్నై-వ్లాడివోస్టోక్ కారిడార్‌తో సహా ఐఎన్‌సీటీసీ, ఉత్తర సముద్ర మార్గం లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇవి పూర్తయితే రవాణా సమయం, ఖర్చులు తగ్గుతాయని, వ్యాపారానికి కొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. వర్చువల్ వాణిజ్య కారిడార్ ద్వారా డిజిటల్ సాంకేతికత శక్తిని, ఎగుమతి లేదా దిగుమతి పన్నులను, రవాణాను, నియంత్రణా వ్యవస్థలను అనుసంధానించవచ్చని, తద్వారా వేగంగా కస్టమ్స్ అనుమతులు పొందవచ్చని, కాగితపు పని తగ్గించవచ్చని, సరకు రవాణా మరింత సజావుగా సాగుతుందని వివరించారు.

 

సముద్ర ఉత్పత్తుల గురించి శ్రీ మోదీ వివరిస్తూ.. పాలు, సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ఇటీవలే అర్హత కలిగిన భారతీయ సంస్థల జాబితాను రష్యా విస్తరించిందని, ఇది భారతీయ ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో తయారవుతున్న అధిక నాణ్యత కలిగిన సముద్ర ఉత్పత్తులు, విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారానికి అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. కోల్డ్ చెయిన్ లాజిస్టిక్స్, డీప్-సీ ఫిషింగ్, ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణకు ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థలు, సాంకేతిక భాగస్వామ్యాలు రష్యా అవసరాలను తీర్చగలవని, అదే సమయంలో భారతీయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.

ఆటోమొబైల్ రంగం గురించి ప్రధానమంత్రి వివరించారు. సరసమైన, సమర్థవంతమైన ఈవీ ద్విచక్ర వాహనాలను, సీఎన్జీ పరిష్కారాలను అందించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు. అదే సమయంలో రష్యా అధునాతన సామగ్రి ప్రధాన ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ రెండు దేశాలు ఈవీల తయారీ, ఆటోమోటివ్ విడిభాగాల తయారీ, సరఫరాలో సహకరించుకోవచ్చన్నారు. ఫలితంగా దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు.. గ్లోబల్‌ సౌత్‌లో, ముఖ్యంగా ఆఫ్రికా అభివృద్ధికి తోడ్పడవచ్చనిి ప్రధానమంత్రి అన్నారు.

అత్యంత నాణ్యమైన ఔషధాలను అంతర్జాతీయంగా తక్కువ ధరలకు అందిస్తూ ‘ప్రపంచానికి ఫార్మసీ’ అనే గుర్తింపును భారత్ సొంతం చేసుకుందని ప్రధానమంత్రి వివరించారు. ఉమ్మడిగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం, క్యాన్సర్ చికిత్సలు, రేడియో ఫార్మాసూటికల్స్, ఏపీఐ రవాణా వ్యవస్థలు, ఆరోగ్య సేవల భద్రత, కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడంలో రెండు దేశాలు సహకరించుకోవచ్చన్నారు.

వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. సహజమైన నూలు నుంచి సాంకేతిక వస్త్రాల వరకు విస్తృతమైన సామర్థ్యం భారత్‌కు ఉందని మోదీ తెలిపారు. డిజైన్, హస్తకళలు, కార్పెట్లలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, పాలిమర్స్‌, సింథటిక్ ముడి ఉత్పత్తులకు రష్యా ప్రధాన ఉత్పత్తిదారుగా ఉందన్నారు. ఇది స్థిరమైన జౌళి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో రెండు దేశాలకు వీలు కల్పిస్తోందని తెలిపారు. ఎరువులు, సిరామిక్స్, సిమెంట్ తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సహకారానికి సైతం ఇదే తరహా అవకాశాలు ఉన్నాయన్నారు.

 

అన్ని రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించడంలో మానవ వనరుల శక్తి కీలకపాత్ర పోషిస్తుందంటూ.. ‘ప్రపంచ నైపుణ్య కేంద్రం’గా భారత్ ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. సాంకేతికత, ఇంజినీరింగ్, ఆరోగ్య సేవలు, నిర్మాణ రంగం, సరకు రవాణాలో భారతీయ యువతకు ప్రపంచ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉందన్నారు. రష్యా ప్రజల, ఆర్థిక ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు అధిక ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రష్యన్ భాష, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో భారతీయ యువతకు శిక్షణ ఇస్తే.. రష్యాకు అవసరమైన మానవ వనరులను సంయుక్తంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఇది రెండు దేశాల ఉమ్మడి సంక్షేమాన్ని వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు.

రెండు దేశాల పౌరులకు పర్యాటక వీసాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నామని వివరించారు. ఇవి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయని, నూతన ఉపాధి అవకాశాలను అందిస్తాయన్నారు.

 

సహ ఆవిష్కరణలు, సహ ఉత్పత్తి, సహ రూపకల్పనల నూతన ప్రయాణాన్ని భారత్, రష్యా ప్రారంభిస్తున్నాయని శ్రీ మోదీ తెలియజేశారు. ఇవి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రపచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సుస్థిరమైన పరిష్కారాలు అందించడం ద్వారా మానవాళి సంక్షేమానికి కూడా దోహదపడతాయన్నారు. ఈ ప్రయాణంలో రష్యాతో కలసి నడిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలియజేశారు. అలాగే ‘‘రండి, భారత్‌లో తయారు చేయండి, భారత్‌తో భాగస్వామ్యులు కండి. ఈ ప్రపంచం కోసం మనం కలసి తయారుచేద్దాం’’ అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇతరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential

Media Coverage

WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 జనవరి 2026
January 20, 2026

Viksit Bharat in Motion: PM Modi's Reforms Deliver Jobs, Growth & Global Respect