ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన పీఎం
1153 అటల్ గ్రామ సుశాసన్ భవనాలకు భూమిపూజ చేసిన పీఎం
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా స్మారక తపాలాబిళ్ల, నాణేన్ని విడుదల చేసిన పీఎం
vఈ రోజు మనందరికీ స్ఫూర్తిదాయకమైనది, మాననీయుడు అటల్‌జీ జయంతి ఈ రోజు: పీఎం
కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టు బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సంపదకు, సంతోషాలకు కొత్త తలుపులు తెరుస్తుంది: పీఎం
నీటిభద్రత, నీటి సంరక్షణ దశాబ్ధంగా గడచిన దశాబ్దం భారతీయ చరిత్రలో నిలిచిపోతుంది: పీఎం
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సౌకర్యాలను పెంచేందుకు కేంద్రం నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది: పీఎం

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పథకాలను అమలు చేయడంతో పాటు, అభివృద్ధి కార్య్రమాలు వేగం పుంజుకున్నాయని  ఆయన అన్నారు. చరిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు, దౌధన్ డ్యామ్‌కు, మధ్యప్రదేశ్‌లో మొదటి సౌర విద్యుత్ ప్లాంట్ అయిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
 

భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి అయిన ఈ రోజు అత్యంత స్ఫూర్తిదాయకమైందని,  ఈ రోజు సుపరిపాలన దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నామని, మంచి సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. శ్రీ వాజపేయి స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేస్తూ, ఆయన తనలాంటి ఎంతో మంది పద సైనికులను ప్రోత్సహించి, మార్గనిర్దేశం చేశారని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధికై అటల్‌జీ చేసిన సేవలు మన స్మృతిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. 1100 కంటే ఎక్కువ గ్రామ సుశాసన్ సదన్ భవనాల పనులు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయని, వాటికి సంబంధించిన మొదటి విడత నిధులను విడుదల చేశామని శ్రీ మోదీ వెల్లడించారు. గ్రామాల అభివృద్ధిని అటల్ గ్రామ సేవా సదన్ వేగవంతం చేస్తుందని ఆయన చెప్పారు.  

సుపరిపాలన దినోత్సవం ఒక్కరోజుకే పరిమితం కాలేదన్న శ్రీ మోదీ, ‘‘సుపరిపాలన మన ప్రభుత్వాల గుర్తింపు’’ అని అన్నారు. కేంద్రంలో మూడోసారి, మధ్యప్రదేశ్‌లో నిరంతరాయంగా సేవ చేసే అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ప్రధాన కారణం సుపరిపాలనే అని ప్రధాని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, సుపరిపాలన అనే అంశాల ఆధారంగా దేశాన్ని విశ్లేషించాలని మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్తలను ప్రధానమంత్రి కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేశామని స్పష్టం చేశారు. ‘‘నిర్ధిష్ట పరామితులకు అనుగుణంగా విశ్లేషిస్తే, సామాన్య ప్రజల పట్ల ఎంత అంకితభావంతో ఉన్నామో దేశం తెలుసుకుంటుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. మనదేశం కోసం రక్తం చిందించిన స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నిజం చేయడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని ఆయన తెలిపారు. సుపరిపాలనకు మంచి పథకాలు మాత్రమే సరిపోవని, వాటి ప్రయోజనాలు ప్రజలకు అందేలా సమర్థంగా అమలు చేయడం కూడా అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రకటనలు చేసినప్పటికీ, అమలు చేయాలనే ఉద్దేశం సరిగ్గా లేకపోవడం వల్ల అవి ప్రజల వరకు చేరుకొనేవి కావని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మధ్యప్రదేశ్‌లోని రైతులు రూ.12,000 లబ్ధి పొందుతున్నారు, ఇది జన్ ధన్ బ్యాంకు ఖాతాల వల్లే సాధ్యమైంది. బ్యాంకు ఖాతాలను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేయకపోయి ఉంటే మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన పథకం సాధ్యమై ఉండేది కాదని పేర్కొన్నారు. గతంలో తక్కువ ధరలకు రేషన్ ఇచ్చే పథకాలు ఉన్నప్పటికీ దాని కోసం పేదలు చాలా కష్టపడాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుతం పారదర్శక విధానంలో ఉచిత రేషన్ పొందుతున్నారని, మోసాలకు సాంకేతికతతో అడ్డుకట్ట వేశామని, దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’ లాంటి సౌకర్యాలు తీసుకొచ్చామని ఆయన వివరించారు.
 

సుపరిపాలన అంటే ప్రజలు వారి హక్కుల కోసం అర్థించడమో, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడమో కాదని శ్రీ మోదీ అన్నారు. 100 శాతం లబ్ధిదారులకు నూరు శాతం ప్రయోజనాలను అందించడమే తమ విధానమని, అదే తమ ప్రభుత్వాన్ని ఇతరులకు భిన్నంగా నిలిపిందని ఆయన వెల్లడించారు. దేశమంతా దీన్ని గమనిస్తోందని అందుకే తమకు సేవ చేసే అవకాశాన్ని పదే పదే ఇస్తున్నారని అన్నారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను సుపరిపాలన పరిష్కరిస్తుందని, దురదృష్టవశాత్తూ గత ప్రభుత్వాలు సాగించిన దుష్పరిపాలన కారణంగా బుందేల్‌ఖండ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అసమర్థ పాలనతో  సరఫరా వ్యవస్థ ద్వారా నీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఆలోచన లేకపోవడం వల్ల తరతరాలుగా బుందేల్‌ఖండ్‌ రైతులు, మహిళలు నీటి చుక్క కోసం తహతహలాడారని అన్నారు.
 

భారత్‌లో నదుల అనుసంధాన ప్రాధాన్యాన్ని మొదటగా గుర్తించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, నదీలోయ ప్రాజెక్టులకు ఆయన ఆలోచనలే ఆధారమని, కేంద్ర జల  కమిషన్ కూడా ఆయన కృషి వల్లే ఏర్పడిందని శ్రీ మోదీ తెలిపారు. జల సంరక్షణ, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో డా.అంబేద్కర్‌ చేసిన కృషికి తగిన సముచిత గౌరవాన్ని గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇవ్వలేదని, వారెప్పుడూ ఈ ప్రయత్నాలను పట్టించుకోలేదని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాల తర్వాత కూడా దేశంలో చాలా రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉన్నాయని, గత ప్రభుత్వాల్లో సరైన ఉద్దేశం లేకపోవడం, పరిపాలనా లోపం నిర్ధిష్ట ప్రయత్నాలను అడ్డుకున్నాయని ప్రధానమంత్రి అన్నారు.

శ్రీ వాజపేయి ప్రభుత్వంలో జల సంబంధమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ 2004 తర్వాత వాటిని పక్కన పెట్టేశారని, ఇఫ్పుడు దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం వేగవంతం చేసిందని ప్రధానమంత్రి వివరించారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సంపద, సంతోషాలకు తలుపులు తెరిచేలా కెన్-బెత్వా నదుల అనుసంధాన పథకం వాస్తవరూపం దాల్చనుందని ఆయన అన్నారు. కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఛతర్‌పూర్, తికమ్‌గఢ్, నివారీ, పన్నా, దామోహ్, సాగర్ సహా మధ్యప్రదేశ్‌లోని పది జిల్లాల్లో సాగునీటి సౌకర్యాలు మెరుగువుతాయని శ్రీ మోదీ అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని బండా, మహోబా, లలిత్‌పూర్, ఝాన్సీ సహా బుందేల్‌‌ఖండ్ ప్రాంతానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.

‘‘నదుల అనుసంధానం అనే బృహత్ కార్యక్రమం ద్వారా దేశంలో రెండు ప్రాజెక్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇటీవల తాను రాజస్థాన్‌లో పర్యటించినప్పుడు పర్బతి-కాలీసింధ్-ఛంబల్, కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టుల ద్వారా వివిధ నదులను అనుసంధానం చేయాలని తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా మధ్యప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి అన్నారు.
 

‘‘21వ శతాబ్దపు అతిపెద్ద సవాళ్లలో జల సంరక్షణ కూడా ఒకటి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తగినంత జలవనరులు ఉన్న దేశాలు, ప్రాంతాలే అభివృద్ధి సాధిస్తాయని, పంటలు పండించేందుకు, పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు నీరు అవసరమని ఆయన అన్నారు. నీటి ఎద్దడితో అలమటించే ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గుజరాత్ నుంచి వచ్చిన తనకు నీటి విలువ తెలుసని, మధ్యప్రదేశ్ నుంచి ప్రవహించే నర్మదా నది ఆశీస్సులతో గుజరాత్ తలరాతే మారిపోయిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నీటి సంక్షోభం నుంచి మధ్యప్రదేశ్‌లోని కరవు పీడిత ప్రాంతాలను విముక్తం చేయడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. బుందేల్‌ఖండ్ ప్రజలకు ముఖ్యంగా రైతులు, మహిళలకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చానని ప్రధాని తెలిపారు. దాన్ని నెరవేర్చే క్రమంలోనే రూ.45,000 కోట్లతో బుందేల్‌ఖండ్‌లో జలసంబంధిత ప్రణాళికను రూపొందించామని ఆయన వివరించారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని తమ ప్రభుత్వాలకు నిరంతరం అందుతున్న ప్రోత్సాహమే కెన్-బెత్వా అనుసంధాన పథకం ద్వారా దౌధన్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చేసిందని అన్నారు. ఈ డ్యామ్‌కు అనుసంధానంగా వందల కిలోమీటర్ల మేర నిర్మించే కాలువ ద్వారా దాదాపుగా 11 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందుతుందని అన్నారు.

‘‘గడచిన దశాబ్దం, భారతదేశ చరిత్రలో నీటి భద్రత, జల సంరక్షణలో అపూర్వమైన దశకంగా నిలిచిపోతుంది’’ అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు నీటికి సంబంధించిన బాధ్యతలను వివిధ శాఖలకు విభజించాయని, తమ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలను పరిష్కరించేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన వెల్లడించారు. మొదటిసారిగా దేశంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం జాతీయ మిషన్‌ను ప్రారంభించిందని శ్రీ మోదీ తెలియజేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాల అనంతరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 3 కోట్ల మందికి మాత్రమే నల్లా కనెక్షన్లు ఉండేవని, గత ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు వెచ్చించి 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యాన్ని కల్పించామని శ్రీమోదీ వెల్లడించారు. జల జీవన్ మిషన్‌లో భాగమైన నీటి నాణ్యత పరీక్షలు అంతగా ప్రాచుర్యం పొందలేదని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా 2,100 నీటి నాణ్యతా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మంది మహిళలు తాగునీటిని పరీక్షించడంలో శిక్షణ పొందారని వివరించారు. ఈ కార్యక్రమం కలుషిత తాగు నీటి బారి నుంచి వేలాది గ్రామాలకు విముక్తి కలిగించిందని, చిన్నారులు, ప్రజలకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించిందని ఆయన అన్నారు.
 

2014కు ముందు దేశంలో దాదాపు 100 వరకు ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు దశాబ్దాలుగా అసంపూర్తిగా మిగిలిపోయాయని శ్రీ మోదీ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి ఈ పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని, ఆధునిక నీటి పారుదల పద్దతుల వినియోగాన్ని పెంచుతోందని తెలియజేశారు. గడచిన దశాబ్దంలోనే మధ్యప్రదేశ్‌లోని 5 లక్షల హెక్టార్లతో సహా సుమారుగా కోటి హెక్టార్ల భూమి సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలకు అనుసంధానమైందని ఆయన అన్నారు. ప్రతి నీటిబొట్టును సమర్థంగా వినియోగించుకొనేలా నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి జిల్లాలోనూ 75 అమృత సరస్సులను నిర్మించాలన్న కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఫలితంగా దేశవ్యాప్తంగా 60,000 అమృత సరస్సుల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. జల శక్తి అభియాన్, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాలను ప్రారంభించి దేశవ్యాప్తంగా మూడు లక్షల ఇంకుడు గుంతలు నిర్మించామని ప్రధానమంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలే నాయకత్వం వహించారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ చురుకైన పాత్ర పోషించారని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌తో సహా భూగర్భ జలాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అటల్ భూజల్ యోజన అమలు చేస్తున్నామని అన్నారు.

‘‘పర్యాటక రంగంలో మధ్యప్రదేశ్ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంది’ అన్న శ్రీ మోదీ, యువతకు ఉద్యోగాలను కల్పించి దేశ ఆర్థిక వ్యవస్థను పర్యాటక రంగం బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారాలని దేశం లక్ష్యంగా నిర్దేశించుకుందని, భారత్ గురించి తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని, అది మధ్యప్రదేశ్‌కు లబ్ధి చేకూరుస్తుందని వివరించారు. ప్రపంచంలోనే మొదటి పది ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాల్లో మధ్యప్రదేశ్‌ను ఒకటిగా పేర్కొన్న అమెరికా వార్తాపత్రిక నివేదికను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు సులభంగా ప్రయాణించేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, విదేశీ పర్యాటకుల కోసం ఈ-వీసా పథకాన్ని ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి తెలియజేశారు. అలాగే వారసత్వ, వన్యప్రాణి పర్యాటకాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మధ్యప్రదేశ్‌లో పర్యాటకానికి ఉన్న అసాధారణమైన అవకాశాల గురించి ప్రధానంగా వివరిస్తూ, కందారియా మహదేవ్, లక్ష్మణాలయం, చౌసాథ్ యోగిని తదితర ఆలయాలతో కూడిన ఖజురహో ప్రాంతం సుసంపన్నమైన చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వంతో నిండి ఉందని శ్రీ మోదీ అన్నారు. భారత్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే దేశ వ్యాప్తంగా జీ-20 సమావేశాలు నిర్వహించామని, అందులో ఒకటి ఖజురహోలో ఏర్పాటు చేశామని, దీనికోసం అధునాతనమైన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించామని వివరించారు.
 

పర్యాటక రంగం గురించి మరింత వివరిస్తూ.. కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశ్ దర్శన్ ద్వారా మధ్యప్రదేశ్‌లో ఎకో టూరిజంను మెరుగుపరచడానికి, పర్యాటకులకు సౌకర్యాలను కల్పించేందుకు వందల కోట్ల నిధులు కేటాయించామని శ్రీ మోదీ అన్నారు. సాంచీ, ఇతర బౌద్ధ క్షేత్రాలను బుద్ధ సర్క్యూట్ తో అనుసంధానించామని, గాందీ సాగర్, ఓంకారేశ్వర్ డ్యామ్, ఇందిరా సాగర్ డ్యామ్, భేడాఘాట్, బన్‌సాగర్ డ్యామ్ మొదలైనవి ఎకో సర్క్యూట్‌లో భాగంగా ఉన్నాయని తెలిపారు. ఖజురహో, గ్వాలియర్, ఓర్చా, చందేరీ, మండు ప్రాంతాలను హెరిటేజ్ సర్క్యూట్ ద్వారా అనుసంధానించామని వివరించారు. పన్నా జాతీయ పార్కును వన్యప్రాణి సర్క్యూట్‌లో చేర్చామన్నారు. పన్నా పులుల అభయారణ్యాన్ని గతేడాది 2.5 లక్షల మంది పర్యాటకులు సందర్శించారని తెలిపారు. పన్నా టైగర్ రిజర్వ్‌లోని వన్య ప్రాణులను దృష్టిలో పెట్టుకొని లింక్ కెనాల్ ‌ను నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రధానమంత్రి వివరించారు. పర్యాటకులు స్థానిక వస్తువులు కొనుగోలు చేస్తారని, ఆటో, ట్యాక్సీ సేవలు, హోటళ్లు, దాబాలు, హోం స్టేలు, అతిథి గృహాల సేవలను వినియోగించుకుంటారని అన్నారు. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలకు మంచి ధర లభించి రైతులకు ప్రయోజనం కలుగుతుందని కూడా చెప్పారు.
 

గడచిన రెండు దశాబ్దాల్లో వివిధ రంగాల్లో మధ్యప్రదేశ్ మంచి ప్రగతిని సాధించిందని, రాబోయే దశాబ్దాల్లో దేశంలోనే అగ్ర ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా మారుతుందని, ఈ విషయంలో బుందేల్ ఖండ్ కీలకపాత్ర పోషిస్తుందని శ్రీ మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ ను సాధించే దిశగా మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తాయని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.  

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ సి. పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సంగ్ చౌహాన్, సామాజిక న్యాయం, సాధికారత మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పటేల్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

నేపథ్యం

జాతీయ దృక్పథ పథకంలో భాగంగా దేశంలో మొట్టమొదటి నదీ అనుసంధాన ప్రాజెక్టు అయిన కెన్-బెత్వా నదుల అనుసంధానానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పథకం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించి లక్షలాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. దీనితో పాటుగా జలవిద్యుత్ ప్రాజెక్టులు 100 మెగావాట్లకు పైగా హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఈ ప్రాజెక్టు అనేక ఉద్యోగావకాశాలు కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవసస్థను బలోపేతం చేస్తుంది.
 

1153 అటల్ గ్రామ సుశాసన్ భవనాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు సుపరిపాలన అందించేలా విధులు, బాధ్యతలు నిర్వహించడంలో ఈ భవనాలు కీలకపాత్ర పోషిస్తాయి.

ఇంధన సమృద్ధి సాధించడంతో పాటు హరిత విద్యుత్తును ప్రోత్సహించాలనే తన ఉద్దేశానికి అనుగుణంగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఉన్న ఓంకారేశ్వర్‌లో ఏర్పాటుచేసిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కర్భన ఉద్ఘారాలను తగ్గించి 2070 నాటికి సున్నా కర్భన ఉద్ఘారాలను సాధించాలనే ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడుతుంది. అలాగే నీరు ఆవిరి కాకుండా చేసి జల సంరక్షణలోనూ సహాయపడుతుంది.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to inaugurate 28th Conference of Speakers and Presiding Officers of the Commonwealth on 15th January
January 14, 2026

Prime Minister Shri Narendra Modi will inaugurate the 28th Conference of Speakers and Presiding Officers of the Commonwealth (CSPOC) on 15th January 2026 at 10:30 AM at the Central Hall of Samvidhan Sadan, Parliament House Complex, New Delhi. Prime Minister will also address the gathering on the occasion.

The Conference will be chaired by the Speaker of the Lok Sabha, Shri Om Birla and will be attended by 61 Speakers and Presiding Officers of 42 Commonwealth countries and 4 semi-autonomous parliaments from different parts of the world.

The Conference will deliberate on a wide range of contemporary parliamentary issues, including the role of Speakers and Presiding Officers in maintaining strong democratic institutions, the use of artificial intelligence in parliamentary functioning, the impact of social media on Members of Parliament, innovative strategies to enhance public understanding of Parliament and citizen participation beyond voting, among others.