· గత దశాబ్దంలో వేగం పుంజుకున్న వారణాసి అభివృద్ధి: ప్రధాని
· మహిళా సాధికారత, ఆత్మ విశ్వాస పెంపు, సమాజ సంక్షేమానికి మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలేల జీవితాలు అంకితం: ప్రధానమంత్రి
· కాశీలోని వేలాది మంది జీవితాల్లో, నగర ముఖచిత్రంలో పరివర్తనకు మూలం బనాస్ డైరీ: శ్రీ మోదీ
· ఆరోగ్య రాజధానిగా కాశీ: ప్రధాని
· నగర మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలపై కాశీ సందర్శకుల ప్రశంసల జల్లు: ప్రధానమంత్రి
· వారసత్వం, అభివృద్ధి అనే రెండు చక్రాలకు సమాన ప్రాధాన్యంతో ప్రగతిపథంపై పరుగులు పెడుతున్న భారత రథం - ఈ దృక్పథానికి కాశీ అత్యద్భుత నమూనా: శ్రీ మోదీ
· అవకాశాలు సహా సామర్థ్యానికి, విజయాలకు ఉత్తరప్రదేశ్ ప్రతీక: ప్రధాని

ఈ రోజు ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కాశీ నగరంతో తనకు గల గాఢానుబంధాన్ని గురించిన అనుభూతులను పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులు, ప్రాంత ప్రజలు తనకు అందించిన ఆశీస్సులకు, తనపై కురిపించే ఆదరాభిమానాలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందించే ప్రేమ తనను రుణగ్రస్తుడిని చేసిందని, తాను కాశీకి, కాశీ తనకు చెందుతుందన్నారు. రేపు హనుమాన్ జన్మోత్సవమని గుర్తు చేస్తూ, కాశీలోని సంకట మోచన మహారాజ్ ను సందర్శించే గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ జన్మోత్సవ పావన సందర్భాన్ని జరుపుకోవడానికి ముందస్తుగా అభివృద్ధిని వేడుక చేసుకునేందుకు కాశీ ప్రజానీకం తరలి రావడం హర్షదాయకమన్నారు.

“గత దశాబ్ద కాలంలో వారణాసి అభివృద్ధి వేగం పుంజుకుంది” అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నగరం ఆధునికతను అలవర్చుకుంటూనే వారసత్వాన్ని కాపాడుకుంటూ వెలుగులీనే భవిష్యత్తుకు సంసిద్ధమవుతోందన్నారు. పూర్వాంచల్ ఆర్థిక చిత్రంలో కేంద్రస్థానం దక్కించుకున్న కాశీని ఇక పురాతన నగరంగా కాక, ప్రగతిశీల నగరంగా గుర్తించవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. కాశీ విశ్వేశ్వరుడు పూన్చిన అభివృద్ధి రథాన్ని అధిరోహిస్తున్న కాశీ, పూర్వాంచల్ ను ఆ బాటపై ముందుకు తీసుకువెళుతోందని వ్యాఖ్యానించారు.    

 

కాశీ, పూర్వాంచల్ లోని ప్రాంతాలకు సంబంధించి నేడు ప్రారంభించిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల గురించి ప్రస్తావిస్తూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా రహదారి అనుసంధానం బలపడుతుందని, ప్రతి ఇంటికీ నీటి వసతి కల్పించాలన్న ఆశయం నెరవేరగలదని, విద్య, ఆరోగ్యం, క్రీడా సదుపాయాలు మెరుగవుతాయని చెప్పారు. పూర్వాంచల్ ను అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా యువతకు, ప్రతి ప్రాంతానికి, కుటుంబానికి మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తాము ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా ప్రతి కాశీ పౌరుడూ లబ్ధి పొందగలడంటూ వారణాసి, పూర్వాంచల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

నేడు జ్యోతిబా ఫూలే జయంతి సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని... మహిళా సాధికారత, ఆత్మ విశ్వాస పెంపు, సమాజ సంక్షేమానికి మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలేలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు తాము చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వివరించారు. తమ ప్రభుత్వం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే సూత్రాన్ని నమ్మి ఆచరిస్తోందని స్పష్టం చేశారు. పూర్వాంచల్ లో పశువులను పెంచుతున్న కుటుంబాలను అభినందించిన శ్రీ మోదీ, ఈ పనిలో ఎంతో శ్రమిస్తున్న మహిళలు ఈ ప్రాంతానికే స్ఫూర్తిదాతలుగా ఉన్నారని కొనియాడారు. ఈ మహిళలపై ఉంచిన విశ్వాసం అద్భుతమైన ఫలాలను ఇచ్చి, చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ బనాస్ పాల ఉత్పత్తి కేంద్రంతో అనుబంధమున్న పశువుల పెంపకందారులకు బోనస్ సొమ్మును బదిలీ చేసే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. రూ. 100 కోట్లకు పైగా బోనస్ రూపంలో పంపిణీ చేసిన సొమ్ముని బహుమతిగా అందించలేదని,  వారి నిబద్ధతకు, శ్రమకి గుర్తింపుగా అందజేశామని అన్నారు. శ్రమ, పట్టుదల వెలకట్టలేనివని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  

 

పూర్వాంచల్ లో నివసించే మహిళలు ఒకప్పుడు ఉపాధి గురించి చింతిస్తే, నేడు వారే “లఖ్ పతీ దీదీలు’ గా మారి ప్రగతి మార్గంలో పయనిస్తున్నారన్నారు. బనాస్ డైరీ... కాశీలో నివసించే వేలాది మంది కుటుంబాల్లో, నగర ముఖచిత్రంలో పరివర్తనకు మూలమని శ్రీ మోదీ అన్నారు. శ్రమకు తగిన గుర్తింపునిచ్చిన బనాస్ డైరీ, కాశీవాసుల ఆశలకు, ఆశయాలకు రెక్కలు తొడిగిందన్నారు. ఇటువంటి ప్రగతి ఈ ప్రాంతానికే పరిమితమవలేదని, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మార్పుని స్పష్టంగా గమనించవచ్చని చెప్పారు. “పాల ఉత్పత్తిలో నేడు భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. గత దశాబ్దంలోనే పాల ఉత్పత్తిలో 65 శాతం వృద్ధి నమోదైంది” అని చెప్పారు. లక్షలాది మంది రైతులు, పశు పోషకులు గత పదేళ్ళుగా చేసిన కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని కితాబిచ్చారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటి అమలుని వేగవంతం చేసిందని చెబుతూ, పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను అందించి,  రుణ మొత్తాన్నీ పెంచామని,  సదుపాయాలను మెరుగుపరిచామని, పలు రాయితీలు కల్పించామని వివరించారు. పశువుల్లో తీవ్ర ఇబ్బందులను కలిగించే ఫుట్ అండ్ మౌత్ వ్యాధి కట్టడికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పాల సేకరణ క్రమ పద్ధతిలో సాగేందుకు 20,000 పాడి సహకార సమాఖ్యల పునరుద్ధరణ పనులు చేపట్టిన ప్రభుత్వం, లక్షలాది మంది కొత్త సభ్యులతో సమాఖ్యల పరిపుష్టికి కృషి చేసిందని చెప్పారు. దేశవాళీ పశుజాతుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్న ప్రధాని, రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలిమి జాతుల పెంపకం కోసం శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించాలని సూచించారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు పశుపోషకులకు మెరుగైన అవకాశాలు, కొత్త మార్కెట్లు, కొత్త అభివృద్ధి అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించినవని శ్రీ మోదీ వివరించారు. పూర్వాంచల్ ప్రాంతంలో అభివృద్ధి ఆశయాన్ని వ్యాప్తి చేసినందుకు బనాస్ డైరీ కాంప్లెక్సుకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. డైరీ ఈ ప్రాంతంలో మేలు జాతి గిర్ ఆవులను పాడి రైతులకు అందించిందని, వాటి సంఖ్య  క్రమంగా పెరుగుతుండడంతో అవసరమైన గ్రాసాన్ని అందించేందుకు వారణాసిలో ఏర్పాట్లు ప్రారంభించిందని అభినందనలు తెలియజేశారు.  పూర్వాంచల్ లోని లక్షమందికి పైగా పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తున్న బనాస్ డైరీని ప్రశంసించిన శ్రీ మోదీ, పాడి రైతుల సాధికారతకు, వారి జీవనోపాధి మెరుగుదలకు ఈ చర్య దోహదపడుతోందన్నారు.

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ వయో వందన కార్డులను పంపిణీ చేయడం తనకు దక్కిన విశిష్ట అవకాశమని ప్రధానమంత్రి అన్నారు. వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతృప్తి.. ఈ పథకం విజయవంతం అయిందనడానికి నిదర్శనమని తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులకున్న ఆందోళనల గురించి తెలియజేస్తూ.. 10-11 ఏళ్ల క్రితం పూర్వాంచల్‌లో వైద్య సేవలు పొందడానికి ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. ‘‘ప్రస్తుతం కాశీ ఆరోగ్య రాజధానిగా మారింది’’ అంటూ ఈ ప్రాంతంలో సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. అధునాతన సౌకర్యాలున్న ఆసుపత్రులు ఒకప్పుడు ఢిల్లీ, ముంబయి లాంటి నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేవని, ఇప్పుడు ప్రజల ఇళ్లకు చేరువలో ఉన్నాయని పేర్కొన్నారు. పౌరులకు అవసరమైన సదుపాయాలను వారికి అందుబాటులోకి తీసుకురావడమే అభివృద్ధి సారాంశమని చెప్పారు.

గడచిన దశాబ్దంలో ఆరోగ్యరంగంలో సాధించిన గణనీయమైన పురోగతి గురించి మాట్లాడుతూ ఆసుపత్రుల సంఖ్యను పెంచడమే కాకుండా.. రోగుల గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు వరం లాంటిదని, ఇది రోగులకు అవసరమైన చికిత్సను అందించడమే కాకుండా.. వారిలో విశ్వాసాన్ని నింపుతోందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా వారణాసికి చెందిన వేల మంది, ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారు. దీని ద్వారా అందే వైద్యసహాయం, శస్త్ర చికిత్స, ఉపశమనంతో వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్షలాది కుటుంబాలకు కోట్ల రూపాయలు ఆదా అయినట్లు వెల్లడించారు. వృద్ధులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని తాను ఇచ్చిన హామీ ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకానికి దారి తీసిందని చెప్పారు. ఇది 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత చికిత్స అందిస్తుందని తెలిపారు. వారణాసిలో అత్యధికంగా 50,000 వయో వందన కార్డులు పంపిణీ అయ్యాయని తెలిపారు. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదని, ఆరోగ్య సేవలను అందించడంలో అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. చికిత్స కోసం భూమిని అమ్మడం, రుణాలు తీసుకోవడం లేదా నిస్సహాయ స్థితిలో మిగిలిపోకుండా సహాయపడుతోందని తెలియజేశారు. ఆయుష్మాన్ కార్డుల ద్వారా వారి వైద్య సేవలకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

 

మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనతో కాశీలో సాధించిన గణనీయమైన మార్పుల గురించి ప్రధాని ప్రముఖంగా వివరించారు. ఇది సందర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోందని తెలిపారు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో వారణాసిని సందర్శిస్తారని, పవిత్ర గంగానదిలో స్నానమాచరించి, బాబా విశ్వనాథుడిని ప్రార్థిస్తారన్నారు. వారిలో చాలా మంది కాశీలో వచ్చిన మార్పులను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారని తెలిపారు. కాశీలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయం పదేళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడూ ఉంటే.. ఈ నగరం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. చిన్న పండగలకు సైతం ట్రాఫిక్ జామ్ అయ్యేదని, వేడి, దుమ్మును భరిస్తూనే సందర్శకులు మొత్తం నగరం చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ఫూల్వారియా ఫ్లైఓవర్ నిర్మాణం దూరాన్ని తగ్గించి, సమయం ఆదా చేస్తోందని, రోజువారీ ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనాన్ని తీసుకొచ్చిందని అన్నారు. రింగ్ రోడ్డు ప్రయోజనాలను సైతం ప్రధానమంత్రి తెలిపారు. జౌన్‌పూర్, ఘాజీపూర్ గ్రామీణ ప్రాంత వాసులకు, బల్లియా, మవు, ఘాజీపూర్‌ జిల్లాల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకొనేందుకు ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీని తగ్గించిందని తెలిపారు.

ఘాజీపూర్, జౌన్‌పూర్, మీర్జాపూర్, ఆజాంఘడ్ తదితర నగరాలకు త్వరగా, సౌకర్యవంతంగా చేరుకొనేలా ఈ ప్రాంతంలో మెరుగైన రవాణా సదుపాయాలు, విస్తరించిన రహదారుల గురించి శ్రీ మోదీ వివరించారు. గతంలో ట్రాఫిక్ రద్దీతో సతమతమైన ఈ ప్రాంతాలు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గడచిన దశాబ్దంలో వారణాసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.45,000 కోట్లు పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఈ పెట్టుబడులు.. మౌలిక సదుపాయాలతో పాటు నమ్మకాన్ని కూడా పెంచాయని, కాశీతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు లబ్ధి చేకూర్చాయని ఆయన పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల విస్తరణను ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయ విస్తరణ పనులు, ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేలా చేపడుతున్న ఆరు లైన్ల సొరంగ మార్గ నిర్మాణం పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భదోహి, ఘజియాపూర్, జౌన్‌పూర్‌లను అనుసంధానించే వివిధ ప్రాజెక్టులతో పాటు బిఖారీపూర్, మందౌడియాలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రారంభాన్ని కూడా గుర్తు చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారణాసి నగరాన్ని సారనాథ్‌తో కలిపేలా కొత్త వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు సారనాథ్ చేరుకోవాలంటే నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే రానున్న నెలల్లో కాశీకి చేరుకోవడం మరింత సులభమవుతుందని, అభివృద్ధి ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలను పెంచుతుందని అన్నారు. జీవనాధారం, ఆరోగ్యసేవల నిమిత్తం వారణానికి వచ్చే వారికి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతుందన్నారు. కాశీలో రోప్‌వే ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సౌకర్యం ఉన్న నగరాల్లో కాశీ కూడా ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.

 

వారణాసిలో చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్వాంచల్ యువతకు లబ్ధి చేకూరుస్తాయని శ్రీ మోదీ అన్నారు. కాశీ యువత క్రీడల్లో రాణించేలా నిరంతర అవకాశాలను కల్పిచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. యువ అథ్లెట్ల కోసం కాశీలో నిర్మిస్తున్న వివిధ స్టేడియాలు, ఎక్స్ లెన్స్ కేంద్రాల గురించి తెలియజేశారు. వారణాసికి చెందిన వందల మంది క్రీడాకారుులు శిక్షణ పొందుతున్న కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి ప్రధాని గుర్తు చేశారు. ఎంపీ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ మైదానాలపై తమ ప్రతిభను చూపించే అవకాశం దొరికిందని అన్నారు.

అభివృద్ధి, వారసత్వాన్ని సమతౌల్యం చేస్తూ సాగిస్తున్న భారత్ ప్రయాణం గురించి తెలియజేస్తూ.. దీనికి కాశీని అత్యుత్తమ ఉదాహరణగా పేర్కొన్నారు. గంగా ప్రవాహం, భారతీయ చైతన్యం గురించి వివరిస్తూ ‘‘దేశ ఆత్మను, వైవిధ్యాన్ని అందంగా చూపించే చిత్తరువు కాశీ’’ అని వర్ణించారు. కాశీలోని ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన సంస్కృతి, భారతీయతలోని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని అన్నారు. కాశీ-తమిళ సంగమం లాంటి కార్యక్రమాలు దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. దేశ వైవిధ్యాన్నంతా ఒకే చోట ప్రదర్శించేలా కాశీలో నిర్మించనున్న ఏక్తామాల్ గురించి వివరించారు. ఇది వివిధ జిల్లాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది.

ఇటీవల కొన్నేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకొన్న ప్రగతిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ రాష్ట్రం తన ఆర్థిక ముఖచిత్రంతో పాటు తన దృష్టికోణాన్ని కూడా మార్చుకొందన్నారు. ఉత్తరప్రదేశ్ ఇక అవకాశాల నేల మాత్రమే కాదని, సామర్థ్యాలు, విజయాల నిలయంగా కూడా ఈ రాష్ట్రం మారిపోయిందని ఆయన అన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’కు ప్రపంచమంతటా ఆదరణ లభిస్తోందని ఆయన చెబుతూ.. భారత్‌లో రూపొందుతున్న ఉత్పాదనలు ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్లుగా పేరుతెచ్చుకొంటున్నాయని తెలిపారు. అనేక ఉత్పాదనలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగులను సంపాదించుకొన్న సంగతిని ఉదాహరిస్తూ, ఈ ట్యాగులు ఉత్త లేబుళ్లే కాదు.. ఇవి అంతకు మించినవనీ, ఇవి ఈ నేలకు గుర్తింపు లభించినట్లు సూచించే ధ్రువపత్రాలుగా ప్రధాని అభివర్ణించారు. ఏదైనా ఒక ఉత్పాదన ఫలానా ప్రాంతంలో ప్రత్యేకంగా తయారైందని జీఐ ట్యాగ్‌లు చెబుతుంటాయని, జీఐ ట్యాగ్ చేరుకొన్న ప్రాంతంలో ఈ ట్యాగులు మరింత ఎక్కువ వాణిజ్యాత్మక విజయానికి బాటలువేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

దేశవ్యాప్తంగా జీఐ ట్యాగింగులో ఉత్తరప్రదేశ్ నాయకత్వ స్థితిని చేజిక్కించుకుందని శ్రీ మోదీ స్పష్టం చేస్తూ, రాష్ట్ర కళలకు, చేతివృత్తి ఉత్పాదనలకు, నైపుణ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. వారణాసి, వారణాసి చుట్టుపక్కల ప్రాంతాల్లో తయారవుతున్న 30కి పైగా ఉత్పాదనలకు జీఐ ట్యాగులు లభించాయని, జీఐ ట్యాగులు ఈ ఉత్పాదనలకు పాస్‌పోర్టు లాంటివంటూ చమత్కరించారు. వారణాసి తబలా, షెహనాయి, గోడలకు అలంకరించే పెయింటింగులు, ఠండాయీ (చల్లని పానీయాలు), భర్వాన్ లాల్ మిర్చ్, లాల్ పేడా, తిరంగా బర్ఫీ వంటి జీఐ గుర్తింపు పొందిన ఈ ప్రాంత ఉత్పాదనలను కొన్నింటిని ఆయన ఉదాహరించారు. ఈమధ్యే జీఐ ట్యాగులను సంపాదించిన జౌన్‌పుర్ ఇమార్‌తీ, మథుర సాంఝీ కళ, బుందేల్‌ఖండ్ కఠియా గోధుమ, పీలీభీత్ వేణువు, ప్రయాగ్‌రాజ్ మూంజ్ గడ్డిని ఉపయోగించి అల్లే బుట్టలు, గోడకు వేలాడదీసే అలంకరణ వస్తువులు, ఇతరత్రా ఉత్పాదనలు, బరేలీ జర్‌దోజీ, చిత్రకూట్ కలప ఉత్పాదనలు, లఖీంపుర్ ఖీరీకి చెందిన థారూ జర్‌దోజీ వగైరా ఉత్పాదనలను కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఉత్తరప్రదేశ్ మట్టి పరిమళం ఇప్పుడు సరిహద్దులను దాటిపోయి, తన వారసత్వాన్ని బహు దూర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తోంద’’ని ఆయన అన్నారు.
కాశీని పరిరక్షించుకోవడం అంటే భారత్ ఆత్మను రక్షించడమే అని ప్రధాని వ్యాఖ్యానించారు. కాశీని నిరంతరం శక్తిమంతంగా నిలపడం, దీని శోభను చెక్కుచెదరనీయకపోవడం, దీని ప్రాచీన భావనను ఆధునిక గుర్తింపుతో పెనవేయాలనే సామూహిక నిబద్ధతను కనబరచాలని ప్రధానంగా చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నరు శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సహా ఇతరులు పాల్గొన్నారు.
నేపథ్యం
వారణాసిలో రూ.3,880 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వారణాసిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ముఖ్యంగా రహదారి సంధానాన్ని పెంచుతానన్న తన వాగ్దానానికి అనుగుణంగానే ఈ ప్రాంతంలో వివిధ రహదారి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు... మరికొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశారు. వీటికి అదనంగా, వారణాసి రింగ్ రోడ్డు, సార్‌నాథ్‌ల మధ్య ఒక రోడ్డు బ్రిడ్జి, నగరంలోని భిఖారీపుర్, మండువాడీహ్ క్రాసింగ్‌పై ఒక ఫ్లయ్ ఓవర్‌లతోపాటు వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్‌హెచ్-31లో రూ. 980 కోట్లకు పైచిలుకు వ్యయమయ్యే ఒక హైవే అండర్‌పాస్ రోడ్ టన్నెల్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
విద్యుత్తు రంగ మౌలికసదుపాయాల కల్పనకు దన్నుగా నిలిచేలా వారణాసి డివిజన్‌లోని జౌన్‌పుర్, చందౌలీ, గాజీపుర్ ‌జిల్లాలలో రూ.1,045 కోట్లకు పైగా ఖర్చయ్యే రెండు 400 కేవీ, ఒక 220 కేవీ ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్‌లతో పాటు సంబంధిత విద్యుత్తు సరఫరా లైన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. వారణాసిలో చౌకాఘాట్‌లో 220 కేవీ ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్, గాజీపుర్‌లో 132 కేవీ ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్‌లతోపాటు వారణాసి నగరంలో రూ.775 కోట్లకు పైచిలుకు వ్యయంతో  విద్యుత్తు పంపిణీ వ్యవస్థ విస్తరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
 

భద్రతాసిబ్బందికి మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి పోలీస్ లైన్‌లో ట్రాన్సిట్ హాస్టల్, పీఏసీ రాంనగర్ క్యాంపస్‌లో బ్యారక్స్‌ను ప్రధాని ప్రారంభించారు. అనేక పోలీస్ ఠాణాలలో కొత్త పరిపాన భవనాలకు, పోలీస్ లైన్‌లో రెసిడెన్షియల్ హాస్టల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
విద్యా ఫలాలు అందరికీ అందేటట్లు చూడాలన్న తన దృష్టికోణానికి అనుగుణంగా ప్రధానమంత్రి పిండ్‌రాలో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బర్‌కీ గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ కళాశాల, 356 గ్రామీణ గ్రంథాలయాలు, 100 ఆంగన్‌వాడీ కేంద్రాలు సహా అనేక పథకాలను ప్రారంభించారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా 77 ప్రాథమిక పాఠశాల భవనాల నవీకరణ పనులతోపాటు వారణాసిలోని చోలాపుర్‌లో కస్తూర్బా గాంధీ పాఠశాలకు కొత్త భవనం నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలో క్రీడా మౌలికసదుపాయాలను పెంచే క్రమంలో, ఉదయ ప్రతాప్ కళాశాలలో ఫ్లడ్‌లైట్లు, సందర్శకుల గ్యాలరీతో సింథటిక్ హాకీ టర్ఫ్ నిర్మాణానికీ, శివ్‌పుర్‌లో  మినీ స్టేడియం నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేశారు.
గంగానది వద్ద సామ్‌నే ఘాట్, శాస్త్రి ఘాట్‌ల పునరభివృద్ధి, జల్ జీవన్ మిషన్‌లో భాగంగా రూ.345 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చయ్యే 130 గ్రామీణ తాగునీటి పథకాలు, వారణాసిలో 6 నగరపాలక వార్డుల్లో మెరుగుదల పనులు, వారణాసిలోనే వివిధ ప్రాంతాల్లో నేలను చదునుచేసే పనులతోపాటు ప్రతిమల ఏర్పాటు పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.
 

చేతివృత్తుల వారి కోసం ఎమ్ఎస్ఎమ్ఈ యూనిటీ మాల్, మోహన్‌సరాయ్‌లో ట్రాన్స్‌పోర్ట్ నగర్ పథకంలో భాగంగా చేపట్టే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, డబ్ల్యూటీపీ భేల్‌పుర్‌లో ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉండే సౌర విద్యుత్తు ప్లాంటు, 40 గ్రామ పంచాయతీలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులతోపాటు వారణాసి లో వివిధ పార్కుల సుందరీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేశారు.
తబలా, పెయింటింగ్, శీతల పానీయాలు, తిరంగా బర్ఫీ సహా అనేక ఇతర స్థానిక వస్తువులతోపాటు ఉత్పాదనలకు జీఐ ధ్రువపత్రాలను ప్రధానమంత్రి ప్రదానం చేశారు. బనాస్ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న వారికి రూ.105 కోట్లకు పైగా బోనస్‌ను కూడా ప్రధాని బదిలీ చేశారు.‌

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's chip dreams get a Rs 1.25 lakh crore push with Semiconductor Mission 2.0

Media Coverage

India's chip dreams get a Rs 1.25 lakh crore push with Semiconductor Mission 2.0
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets CA fraternity on Chartered Accountants' Day
July 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, today extended his greetings to the Chartered Accountant fraternity on the occasion of Chartered Accountants' Day. Shri Modi said that Chartered Accountants have long been trusted partners in India's economic journey. He noted that through their commitment to transparency and professional excellence, they have strengthened the country's financial systems, supported businesses, encouraged entrepreneurship and inspired confidence among investors.

The Prime Minister posted on X:

Greetings on Chartered Accountants' Day to the entire CA fraternity. They have long been trusted partners in India's economic journey. Through their commitment to transparency and professional excellence, they strengthen our financial systems, support businesses, encourage entrepreneurship and inspire confidence among investors. Their expertise contributes significantly to economic growth and nation-building. As we move towards becoming a Viksit Bharat, their efforts help create an environment where enterprise can flourish and opportunities can expand for all.