* గడచిన 11 ఏళ్లలో అత్యంత వేగంగా ఆధునిక మౌలిక వసతుల కల్పన: పీఎం
* ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లకు అమృత్ భారత్ స్టేషన్లు అని పేరు పెట్టాం.. వీటిలో 100కి పైగా స్టేషన్లు పూర్తయ్యాయి: పీఎం
* ఏకకాలంలో నీటిపారుదల ప్రాజెక్టులను, నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తున్నాం: పీఎం
* మా ప్రభుత్వం త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చింది.. పాకిస్థాన్ మోకరిల్లేలా మన బలగాలు ‘చక్ర వ్యూహాన్ని’ సృష్టించాయి: పీఎం
* ‘సిందూరం’ ‘గన్ పౌడర్’గా మారితే ఎలా ఉంటుందో ప్రపంచం, శత్రువులు చూశారు: పీఎం
* ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆపరేషన్ సిందూర్ మూడు సూత్రాలను అనుసరించింది: పీఎం
* ప్రతి ఉగ్రదాడికి భారీ మూల్యాన్ని పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ దేశానికి తెలిసేలా భారత్ చేసింది: పీఎం
* భారతీయుల జీవితాలతో ఆడుకొన్నందుకు పాకిస్థాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది: పీఎం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారినీ, అలాగే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారినీ స్వాగతించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులకు, పౌరులకు అభినందనలు తెలియజేశారు.

కర్ణిమాత ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ ఆశీస్సులు అభివృద్ది చెందిన భారత్‌ను నిర్మించాలనే దేశ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ రోజు శంకుస్థాపన చేసిన, ప్రారభించిన రూ. 26,000 కోట్ల విలువైన అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడంలో వాటి ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ పరివర్తనాత్మక కార్యక్రమాలకు గాను ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

భారత మౌలిక వసతుల్లో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ.. ఆధునికీకరణ అంశంలో దేశం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు, రైల్వే స్టేషన్లలో వచ్చిన వేగవంతమైన పురోగతి గురించి వివరించారు. ‘‘గతంతో పోలిస్తే మౌలిక వసతుల అభివృద్ధికి ఇప్పుడు భారత్ ఆరు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రగతి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి వివరించారు. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా సొరంగం, అస్సాంలోని బోగీబీల్ వంతెన, పశ్చిమాన ముంబయిలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీ లిఫ్ట్ ను నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ఉదాహరణలుగా పేర్కొన్నారు.

రైల్వే వ్యవస్థను ఆధునికీకరించేందుకు భారత్ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల గురించి శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో ప్రారంభమైన వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు.. దేశ వేగానికి, అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. దాదాపుగా 70 మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, మారుమూల ప్రాంతాలకు సైతం ఆధునిక రైల్వే అనుసంధానాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. వందల సంఖ్యలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు, 34,000 కి.మీలకు పైగా కొత్త రైల్వే ట్రాకులను వేయడంతో సహా గత 11 ఏళ్లుగా మౌలిక వసతుల కల్పనలో సాధించిన గణనీయమైన పురోగతి గురించి ప్రధాని వివరించారు. బ్రాడ్ గేజ్ లైన్లపై మానవ రహిత లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడం వల్ల భద్రత పెరిగిందని ఆయన అన్నారు. దేశంలో కార్గో రవాణాను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేకంగా సరకు రవాణా కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రయత్నాలకు తోడుగా 1,300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లను ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునికీకరిస్తున్నామని తెలిపారు.

ఆధునికీకరించిన రైల్వేస్టేషన్లకు అమృత్ భారత్ స్టేషన్లుగా పేరు పెట్టామని, అలాంటి 100కి పైగా స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని తెలిపారు. స్థానిక కళలు, చరిత్రను ప్రతిబింబించేలా ఈ స్టేషన్లలో వచ్చిన అద్భుతమైన మార్పులను సామాజిక మాధ్యమ వినియోగదారులు చూశారని ఆయన పేర్కొన్నారు. దీనికి కొన్ని ఉదాహరణలను ఆయన చూపించారు. రాజస్థాన్‌లోని మందల్‌గఢ్ స్టేషన్ రాజపుత్ర సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. బీహార్లోని థావే స్టేషన్ థావేవాలీ మాత పవిత్ర ఉనికిని, మధుబని కళను ప్రదర్శిస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఊర్చా రైల్వే స్టేషన్ భగవాన్ రాముని దైవిక సారాన్ని తెలియజేస్తుందని, శ్రీరంగం రైల్వే స్టేషన్ నమూనాను శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుంచి స్వీకరించామన్నారు. గుజరాత్‌లోని డకోర్ స్టేషన్ రణ్‌ఛోడ్రాయ్ జీకి నివాళులు అర్పిస్తుంది. తిరువణ్ణామలై స్టేషన్ ద్రావిడ నిర్మాణ శైలిని అనుసరిస్తుంది. బేగంపేట రైల్వే స్టేషన్ కాకతీయ రాజవంశ నిర్మాణ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని వెల్లడించారు. వేల ఏళ్ల నాటి భారత దేశ వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా, రాష్ట్రాల్లో పర్యాటక రంగ వృద్ధికి ఉత్ప్రేరకంగా ఈ అమృత్ భారత్ స్టేషన్లు పనిచేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ స్టేషన్ల పరిశుభ్రతకు, భద్రతకు ప్రజలు సహకరించాలని, ఈ మౌలిక వసతులకు వారే యజమానులని అన్నారు.

 

మౌలిక వసతుల్లో ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడులు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కాకుండా.. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని శ్రీ మోదీ అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలు.. కార్మికులు, దుకాణదారులు, పరిశ్రమల్లో ఉద్యోగులతో పాటుగా ట్రక్కులు, టెంపో ఆపరేటర్లు లాంటి రవాణా రంగంతో ముడిపడిన వారికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. రైతులు తక్కువ ఖర్చుతో పంట దిగుబడులను సమీప మార్కెట్లకు తరలించి, వృథాను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. బాగా అభివృద్ధి చేసిన రోడ్లు, విస్తరించిన రైల్వే వ్యవస్థ కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తాయని, పర్యాటకాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం చేసే ఖర్చులు వల్ల ప్రతి ఇంటికీ ప్రయోజనం కలుగుతుంది. యువతకు నూతన ఆర్థిక అవకాశాల వల్ల ప్రయోజనం చేకూరుతుందని శ్రీ మోదీ తెలిపారు.

రాజస్థాన్‌లో కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆ రాష్ట్రం గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతోందని శ్రీ మోదీ అన్నారు. గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత నాణ్యత కలిగిన రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గడచిన పదకొండేళ్లలో ఒక్క రాజస్థాన్‌లోనే రోడ్ల నిర్మాణానికి దాదాపుగా రూ.70,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అలాగే ఈ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఈ ఏడాది రూ. 10,000 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఇది 2014కి ముందున్న కాలంతో పోలిస్తే.. ప్రస్తుతం 15 రెట్లు ఎక్కువగా పెరిగిందని తెలిపారు. బికనీర్ నుంచి ముంబయికి వెళ్లే కొత్త రైలుని ప్రారంభించడం ద్వారా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచినట్లు తెలిపారు. వీటికి అదనంగా, వివిధ ప్రాంతాల్లో ఆరోగ్యం, నీరు, విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించామని, భూమిపూజ చేశామన్నారు. రాజస్థాన్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల పురోగతిని వేగవంతం చేయడమే కాకుండా.. యువతకు తమ సొంత నగరాలు, పట్టణాల్లోనే అవకాశాలను పొందేలా చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యం అని తెలియజేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో పారిశ్రామిక అభివృద్ధి శీఘ్రతరం అయిన సంగతిని ప్రధాని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ పాలనయంత్రాంగం వివిధ రంగాల్లో కొత్త పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టిందనీ, ఇవి బికనేర్ వంటి ప్రాంతాలకు మేలు చేస్తాయన్నారు. బికనేర్ భుజియా, బికనేరీ రసగుల్లాలు ప్రపంచంలో వాటి గుర్తింపును విస్తరింప చేసుకొని, రాష్ట్ర ఆహార శుద్ధి పరిశ్రమను మరింత పటిష్ఠంగా మారుస్తాయని ఆయన ప్రధానంగా చెప్పారు.  రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టు చివరి దశలకు చేరుకొంటోందనీ, ఇది రాష్ట్రాన్ని పెట్రోలియం ఆధారిత పరిశ్రమలకు ఒక కీలక కూడలిగా నిలపనుందన్నారు. అమృత్‌సర్ నుంచి జామ్‌నగర్ వరకు ఆరు దారుల ఆర్థిక నడవా (ఎకనామిక్ కారిడార్)కు ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో కూడా ఆయన వివరించారు. ఈ నడవా శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్, బికనేర్, జోధ్‌పూర్, బాడ్‌మేర్‌లతో పాటు జలోర్ గుండా సాగుతోందన్నారు.  దీనికి తోడు, ఈ రాష్ట్రంలో ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని ఆయన చెబుతూ, ఈ సంధాన ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని కొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు.

 

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన’ రాజస్థాన్‌లో శరవేగంగా అమలవుతోందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. రాష్ట్రంలో 40,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికే ఈ పథకం ప్రయోజనాలను అందుకొన్నారనీ, దీంతో విద్యుత్తు బిల్లులు అంతరించి, సౌర విద్యుత్తు మాధ్యమం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే అవకాశాన్ని ప్రజలకు అందించిందన్నారు. విద్యుత్తుకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగిన సంగతిని ఆయన తెలియజేస్తూ, ఈ సంఘటనలు రాజస్థాన్‌లో విద్యుత్తు సరఫరాను మరింత పెంచుతాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పాదనను పెంచడంతో, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్రను ఇది పోషిస్తోందని ఆయన తెలిపారు.

రాజస్థాన్‌కున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ చెబుతూ, ఎడారి ప్రాంతాన్ని సారవంతమైన మైదానంగా మార్చడంలో మహారాజా గంగా సింగ్ దూరదృష్టితో చేపట్టిన ప్రయత్నాలను గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో నీళ్లకు ఉన్న అత్యంత ప్రాముఖ్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ…  బికనేర్, శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్‌లతో పాటు రాజస్థాన్ లోని పశ్చిమ ప్రాంతాల అభివృద్ధిని పెంపొందింపచేయడంలో జలం పోషించిన కీలక పాత్రను వివరించారు. నదుల అనుసంధాన కార్యక్రమాలను అమలుపరుస్తూ, ఏక కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని ఆయన చెప్పారు. పార్వతి-కాళీసింధ్-చంబల్ లింక్ ప్రాజెక్టులు అందించే ప్రభావాన్ని వివరిస్తూ, వీటి వల్ల రాజస్థాన్ అంతటా పలు జిల్లాలకు ప్రయోజనాలు కలుగుతాయనీ, రైతులకు మంచి పంటలు పండుతాయనీ, ఈ ప్రాంతం దీర్ఘకాలం పురోగమిస్తుందన్నారు. 

రాజస్థాన్ మొక్కవోని స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు.  దేశం కన్నా, దేశ ప్రజల కన్నా మరేదీ గొప్పది కాదన్నారు. ఆ ఉగ్ర దాడిలో నిర్దోషులైన ప్రజలను- వారు పాటిస్తున్న ధర్మం ఏదో అడిగి మరీ ముష్కరులు వారిని పొట్టన బెట్టుకొన్నారు. పహల్‌గామ్‌లో తుపాకిగుళ్లు పేలినప్పుడు, అవి 140 కోట్ల మంది భారతీయుల గుండెలను గాయపరచాయనీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని దేశ ప్రజలంతా  ఒక్కతాటి మీదకు వచ్చారని ప్రధాని అన్నారు. దేశ సాయుధ బలగాలు నిర్ణయాత్మక ప్రతిచర్యకు ముందుకు ఉరికాయని ఆయన ప్రధానంగా చెప్పారు. ఏ విధంగా జవాబివ్వాలనే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. అమిత దీక్షాతత్పరతలతో యుద్ధ నిర్వహణ కార్యకలాపాలకు రంగప్రవేశం చేసిన త్రివిధ దళాలు పరస్పరం ఏకోన్ముఖ అవగాహనతో  ముందుకు సాగి పాకిస్తాన్ రక్షణ వలయాలను కాకావికలు చేసి లొంగుబాటు తప్ప వేరే దారి లేని స్థితిని కల్పించాయని ఆయన తెలిపారు. ఏప్రిల్ 22 దాడికి ప్రతిగా ఇండియా ఎదురుదాడి చేసి 22 నిమిషాల లోపే 9 ప్రధాన ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టిందని ఆయన వెల్లడించారు. ‘‘ఈ చర్య దేశ బలాన్ని చాటిచెప్పింది.. పవిత్రమైన సిందూరం మందుగుండుగా మారినప్పుడు, పర్యవసానం నిశ్చయాత్మకంగా ఉంటుంద’’ని ప్రధాని స్పష్టం చేశారు. అయిదు సంవత్సరాల కిందట, బాలాకోట్ దాడి అనంతరం, తాను మొట్టమొదటి సారిగా ప్రజాసభలో పాల్గొన్నది కూడా రాజస్థాన్‌లోనే అనే విషయం ఒక ముఖ్యమైన యాదృచ్ఛిక ఘటనగా ప్రస్తావించారు. అదే మాదిరిగా, ఇటీవల ఆపరేషన్ సిందూర్ పూర్తి అయిన తరువాత, ప్రధాని మొదటి జన సభ కూడా మళ్లీ రాజస్థాన్‌లోనే- బికనేర్‌లో- జరుగుతోంది. ఇది ఈ నేల పరాక్రమాన్నీ, దేశ భక్తినీ పునరుద్ఘాటిస్తోంది.    

 

చురులో తాను దేశ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని శ్రీ మోదీ గుర్తుకుతెస్తూ... ‘‘ఈ గడ్డ మీద నిల్చొని ప్రమాణం చేస్తున్నాను.. దేశాన్ని తలొగ్గనివ్వను నేను. దేశాన్ని తల వంచుకోనివ్వను నేను’’ అని పునరుద్ధాటించారు. పవిత్రమైన సిందూరాన్ని చెరిపివేసేందుకు ప్రయత్నించిన వారిని మట్టికరిపించాం. మరి భారత్ నెత్తుటిని చిందించినవారు అందుకు ఇప్పుడు పూర్తి మూల్యాన్ని చెల్లించారని ఆయన రాజస్థాన్ నేల మీద నుంచి ప్రకటించారు. భారత్ నిశ్శబ్దంగా ఉంటుందని తలంచిన వారు ఇక ముఖం చూపలేక దాక్కున్నారు. మరో వైపు తమ అస్త్రాల గురించి గొప్పలు చెప్పుకున్న వారు ప్రస్తుతం మట్టి గుట్టలో కప్పబడిపోయారని ప్రధాని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీకార చర్య కాదనీ, ఒక కొత్త రకమైన న్యాయమనీ ఆయన ప్రధానంగా చెబుతూ... అది ఘోర అన్యాయ వ్యక్తీకరణ ఒక్కటే కాదు.. తడబాటనేదే ఎరగని మన దేశ బలానికీ, దృఢసంకల్పానికీ నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశం ఒక సాహసోపేత వైఖరిని అవలంబించిందనీ, శత్రువును నేరుగా, తిరుగులేని విధంగా దెబ్బతీసిందనీ ఆయన స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదాన్ని చితకగొట్టడం ఒక వ్యూహం మాత్రమే కాదు. అది ఒక సిద్ధాంతం.. ఇది భారత్.. ఇదే నవ భారత్’’ అని శ్రీ మోదీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.    

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా మూడు సిద్ధాంతాలను నెలకొల్పామని ప్రధాని వివరించారు. వాటిలో మొదటిది - భారత్‌పై ఏ ఉగ్రవాద దాడికి తెగబడ్డా అచ్చంగా ఇండియా సాయుధ దళాలే

నిర్ణయించిన కాలంలో, తాము అనుసరించే పద్ధతిలో, తమ షరతుల మేరకే నిర్ణయాత్మక ప్రతిస్పందనకు దిగుతాయి అనేది. ఇక రెండో సిద్దాంతం - పరమాణు బెదిరింపులకు దేశం జంకదు అనేదేనని ఆయన స్పష్టం చేశారు. మూడో సిద్ధాంతం - ఉగ్రవాదులకు తెర వెనుక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నవారికీ, ఉగ్రవాదులకు కొమ్ముకాసే ప్రభుత్వాలకూ మధ్య భారత్ ఇక

ఎంతమాత్రం వ్యత్యాసాన్నీ చూపబోదు... ఈ సిద్ధాంతం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల మధ్య తేడాను చూడాలన్న పాకిస్తాన్ వాదనను మన దేశం తోసిపుచ్చుతోంది. ఉగ్రవాదానికి పాలు పోసి పోషించడంలో పాకిస్తాన్ పాత్రను బట్టబయలు చేయడంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కృషిని ఆయన ప్రధానంగా చెబుతూ, పాకిస్తాన్ ముసుగును తొలగించి వాస్తవ స్వరూపాన్ని ప్రపంచానికి చూపడానికి వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, విదేశీ విధాన నిపుణులతో కూడిన ఏడు బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయన్నారు.

 

గతంలో ప్రతీ ఘర్షణలోనూ భారత్ చేతిలో పాకిస్థాన్ వైఫల్యాన్నే ఎదుర్కొన్నదని గుర్తు చేసిన ప్రధానమంత్రి.. మన దేశంతో ప్రత్యక్ష పోరులో ఆ దేశం ఎన్నటికీ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు. బహిరంగ యుద్ధాల్లో విజయం సాధించలేని పాకిస్థాన్.. చాలా కాలంగా భారత్‌పై ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగిస్తూ, హింసతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. భారత సంకల్పాన్ని పాక్ తక్కువగా అంచనా వేసిందన్న శ్రీ మోదీ.. తన నాయకత్వంలో దేశం బలంగా, స్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు. “భారత్‌పై ఏ ఉగ్రవాద దాడి జరిగినా తీవ్ర పరిణామాలుంటాయి.. సైనికపరంగా, ఆర్థికంగా పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

నాల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవాలని పాక్ ప్రయత్నించిందనీ, అయినా ఎలాంటి నష్టమూ చేయలేకపోయిందనీ.. తానిప్పుడు బికనీర్‌కు చేరుకోగానే అదే విమానాశ్రయంలో దిగానని ప్రధానమంత్రి చెప్పారు. కచ్చితత్వంతో భారత్ చేసిన సైనిక దాడుల వల్ల పాకిస్థాన్ తన రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరాన్ని చాలారోజులపాటు మూసేయాల్సి వచ్చిందని తెలిపారు. పాకిస్థాన్‌తో వాణిజ్యంగానీ చర్చలుగానీ ఉండబోవని స్పష్టం చేశారు. పాక్‌తో చర్చించాల్సి వస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆ చర్చల్లో ప్రధాన అంశంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎగదోయడం మానకపోతే ఆ దేశం ఆర్థికంగా చితికిపోవడం ఖాయమని హెచ్చరించారు. భారత్‌లో రక్తం పారిస్తున్నంత కాలం ఒక హక్కుగా పాకిస్థాన్‌కు రావాల్సిన నీటిని అందించే ప్రశ్నే లేదని, తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన కుండబద్దలుకొట్టారు. “ఇది భారత్ తీసుకున్న తిరుగులేని నిర్ణయం. ప్రపంచంలో ఏ శక్తీ దీనిని మార్చలేదు’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

“భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే భద్రత, అభివృద్ది రెండూ తప్పనిసరి” అని చెబుతూ, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలన్నీ కూడా పురోగతి సాధించినప్పుడే ఈ దార్శనికత సాకారమవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో సమతౌల్యంతోకూడిన వేగవంతమైన అభివృద్ధికి ఉదాహరణగా ఈనాటి కార్యక్రమం నిలుస్తుందన్నారు. రాజస్థాన్‌ను వీరులకు నిలయంగా అభివర్ణిస్తూ.. ఆహూతులకు అభినందనలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావ్ కిషన్‌రావు బగాడే, ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగుపరడమే లక్ష్యంగా.. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో రూ. 1,100 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసి, తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రాంతీయ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తూ, ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుస్తూ 1,300కు పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. కర్ణి మాత ఆలయాన్ని సందర్శించే యాత్రికులు, పర్యాటకుల కోసం దేశ్నోక్ రైల్వే స్టేషన్‌ను ఆలయ వాస్తుశిల్పం, తోరణం, స్తంభాలతో కూడిన ఇతివృత్తంతో తీర్చిదిద్దారు. కాకతీయ సామ్రాజ్య నిర్మాణ శైలి ప్రేరణగా తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌కు మెరుగులు దిద్దారు. 52 శక్తి పీఠాలలో ఒకటైన థావేవాళి మాత కుడ్యచిత్రాలు, కళాకృతులను బీహార్‌లోని థావే స్టేషన్‌లో పొందుపరిచారు. మధుబని చిత్రకళను కూడా ఇందులో ప్రదర్శించారు. గుజరాత్‌లోని డాకోర్ స్టేషన్‌కు రాంచోడ్రాయ్ జీ మహరాజ్ స్ఫూర్తితో మెరుగులద్దారు. దివ్యాంగులతో సహా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను కల్పిస్తూ.. దేశవ్యాప్తంగా పునరుద్ధరించిన అమృత్ స్టేషన్లు ఆధునిక మౌలిక సదుపాయాలనూ, సాంస్కృతిక వారసత్వాన్నీ కూడా మేళవిస్తున్నాయి.

 

రైల్వే కార్యకలాపాల నిర్వహణను మరింత సమర్థంగాను, పర్యావరణ హితంగాను మారుస్తూ.. రైల్వే మార్గాలను 100 శాతం విద్యుదీకరించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చురు-సాదుల్‌పూర్ రైల్వే లైన్ (58 కి.మీ) పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే విద్యుదీకరించిన సురాత్ గఢ్- ఫలోదీ (336 కి.మీ), ఫులెరా- డెగానా (109 కి.మీ), ఉదయ్‌పూర్ – హిమ్మత్‌నగర్ (210 కి.మీ), ఫలోదీ-జైసల్మార్ (157 కి.మీ), సందారి-బార్మెర్ (129 కి.మీ) రైల్వే లైన్లను కూడా జాతికి అంకితం చేశారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు మరింత ఊతమిస్తూ.. వాహనాల రాకపోకలకు వీలుగా జాతీయ రహదారుల కింద 3 అండర్ పాస్ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజస్థాన్‌లో 7 రహదారి ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రూ.4850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారుల వల్ల రవాణా సులభతరమవుతుంది. భారత్ - పాక్ సరిహద్దు వరకు విస్తరించిన ఈ రహదారుల వల్ల భద్రతా దళాల ప్రయాణం మరింత సుగమమవుతుంది. దీంతో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసినట్లవుతుంది.

అందరికీ విద్యుత్ సదుపాయాన్ని అందించడం, పర్యావరణ హిత విద్యుదుత్పాదన దిశగా బికనీర్, దిద్వానా కుచమాన్‌లోని నావా సోలార్‌తోసహా ఇతర పవర్ ప్రాజెక్టులైన... సిరోహి ట్రాన్స్మిషన్ లిమిటెడ్- పవర్ గ్రిడ్ పార్ట్- బి, మేవార్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్- పవర్ గ్రిడ్ పార్ట్- ఇ లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. బికనూరులో సోలార్ ప్రాజెక్టు, నీమచ్ పవర్ గ్రిడ్, బికనూర్ కాంప్లెక్స్ విద్యుత్ సరఫరా వ్యవస్థ తరలింపు, ఫతేగఢ్ – II విద్యుత్ కేంద్ర సరఫరా వ్యవస్థ సామర్థ్యాభివృద్ధి ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. వీటి వల్ల కాలుష్యం తగ్గడంతోపాటు పర్యావరణ హితమైన విద్యుదుత్పత్తికి వీలు కలుగుతుంది.

రాజస్థాన్‌లో మౌలిక సదుపాయాలు, రవాణా, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సేవలు, నీటి లభ్యతను పెంపొందించడం కోసం 25 ముఖ్యమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులను చేపట్టగా.. ప్రధానమంత్రి కొన్నింటికి శంకుస్థాపనలు చేయగా, మరికొన్నింటిని ప్రారంభించారు. రూ. 3,240 కోట్ల వ్యయంతో 750 కి.మీ పైగా విస్తరించి ఉన్న 12 రాష్ట్ర రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం చేపట్టిన జాతీయ ప్రాజెక్టులకు.. అలాగే, మరో 900 కి.మీ కొత్త హైవేల విస్తరణ కార్యక్రమాలకూ శంకుస్థాపన చేశారు. బికనీర్, ఉదయపూర్‌లలో విద్యుత్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. రాజ్‌సమంద్, ప్రతాప్‌గఢ్, భిల్వారా, ధోల్‌పూర్‌లలో నర్సింగ్ కళాశాలలను ఆయన ప్రారంభించారు. ఇవి రాష్ట్రంలో ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఝుంఝును జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా, ఫ్లోరోసిస్ నిర్మూలన ప్రాజెక్టు సహా ఈ ప్రాంతంలో వివిధ నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, అలాగే అమృత్ 2.0 కింద పాలి జిల్లాలోని 7 పట్టణ నీటి సరఫరా పథకాల పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Diplomatic Advisor to President of France meets the Prime Minister
January 13, 2026

Diplomatic Advisor to President of France, Mr. Emmanuel Bonne met the Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

In a post on X, Shri Modi wrote:

“Delighted to meet Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron.

Reaffirmed the strong and trusted India–France Strategic Partnership, marked by close cooperation across multiple domains. Encouraging to see our collaboration expanding into innovation, technology and education, especially as we mark the India–France Year of Innovation. Also exchanged perspectives on key regional and global issues. Look forward to welcoming President Macron to India soon.

@EmmanuelMacron”