ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
భారత ఫిన్‌టెక్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును ఇందుకు ఉదాహరణగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. సమ్మిళిత అభివృద్ధికి దోహదపడడం ఇందులో అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. అందరికీ సమాన అవకాశాలను అందించేలా.. యూపీఐ, ఆధార్, డిజిలాకర్, ఓఎన్‌డీసీ వంటి సమ్మిళిత, సార్వత్రిక వేదికలను భారత్ రూపొందించిందని శ్రీ మోదీ చెప్పారు. ‘అందరికీ అవకాశాలు, అందరి పురోగతి’ అన్నది తమ సూత్రమని స్పష్టం చేశారు. వీటి ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందని, షాపింగ్ మాల్స్ దుకాణదారులతోపాటు రోడ్డు పక్కనే టీ విక్రయించే చిరు వర్తకులూ యూపీఐని ఉపయోగిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బ్యాంకు రుణాలు ఒకప్పుడు పెద్ద కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉండేవని, అయితే ఇప్పుడు ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు కూడా రుణాలు అందుతున్నాయన్నారు.

ఈ మార్పుల దిశగా ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (జీఈఎమ్)ను మరో ముఖ్య ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు ప్రభుత్వానికి పెద్ద సంస్థలు మాత్రమే వస్తువుల్ని విక్రయించగలిగేవనీ, నేడు దాదాపు 25 లక్షల విక్రేతలు, సంస్థలు జీఈఎం పోర్టల్‌లో అనుసంధానమయ్యాయని తెలిపారు. నేడు చిరు వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, దుకాణదారులు నేరుగా భారత ప్రభుత్వానికే విక్రయించగలుగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు జీఈఎం ద్వారా రూ.15 లక్షల కోట్ల విలువైన వస్తువుల్నీ, సేవలనీ కొనుగోలు చేసిందని ప్రధానమంత్రి వివరించారు. వీటిలో ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమల నుంచే దాదాపు రూ. 7 లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఏర్పాట్లను ఊహించి కూడా ఉండమని వ్యాఖ్యానించారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్న దుకాణదారు కూడా ఇప్పుడు జీఈఎం పోర్టల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్నారు. ఇదే అంత్యోదయ స్ఫూర్తి అని, భారత అభివృద్ధి నమూనాకు ఇదే ప్రాతిపదిక అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే లక్ష్యం దిశగా భారత్ దూసుకుపోతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా అంతరాయాలు, అనిశ్చితి ఉన్నప్పటికీ.. భారత్ ఆకర్షణీయమైన వృద్ధిని సాధించిందన్నారు. అంతరాయాలు భారత్ గమనాన్ని దారి మళ్లించబోవని, అవి కొత్త దిశలను నిర్దేశిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ సవాళ్ల నడుమ.. రాబోయే దశాబ్దాలకు భారత్ బలమైన పునాది వేస్తోందనీ, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పమని, అదే మనకు తారక మంత్రమని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. పరాధీనతను మించిన నిస్సహాయత మరొకటి లేదని స్పష్టం చేశారు. మారుతున్న ఈ ప్రపంచంలో.. ఒక దేశం ఇతరులపై ఎంత ఎక్కువగా ఆధారపడితే, అభివృద్ధిలో అంతగా రాజీ పడాల్సి వస్తుందన్నారు. ‘‘భారత్ స్వావలంబన సాధించాలి. భారత్‌లో తయారు చేయగల ప్రతి వస్తువునూ భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలి’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో సమావేశమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఆవిష్కర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారోద్యమంలో వారు కీలకమైన భాగస్వాములని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత స్వావలంబనను బలోపేతం చేసే వ్యాపార నమూనాలను రూపొందించాల్సిందిగా వారిని కోరారు.
మేకిన్ ఇండియా, దేశీయ తయారీకి ఊతమివ్వడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చిప్పుల నుంచి షిప్పుల వరకు ప్రతిదీ దేశంలోనే ఉత్పత్తి చేయడమే లక్ష్యమన్నారు. సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడం ద్వారా ఈ దిశగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. 40,000కు పైగా నిబంధనల్ని తొలగించామని, వాణిజ్యపరమైన చిన్నచిన్న లోపాలకే చట్టపరంగా కేసులకు దారితీసేలా గతంలో ఉన్న వందలాది నిబంధనలను ఇప్పుడు నేరంగా చూడడం లేదని శ్రీ మోదీ వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం భుజం భుజం కలిపి నడుస్తోందని స్పష్టం చేశారు. అయితే, తయారు చేసే ఉత్పత్తులన్నీ అత్యున్నత నాణ్యతతో ఉండాలనీ, దీనిపై తనకు చాలా అంచనాలున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తుల నాణ్యత ఎప్పటికప్పుడు మెరుగుపడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతీ భారతీయుడు ఇప్పుడు ‘స్వదేశీ’ని ఆదరిస్తున్నాడని, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తున్నారని ఆయన చెప్పారు. ‘ఇది స్వదేశీ’ అని గర్వంగా చెప్పుకొనే ఉద్వేగం ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. దీన్ని మంత్రప్రదంగా భావించి వ్యాపారులు అందిపుచ్చుకోవాలని, భారత్‌లో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

పరిశోధన అత్యంత కీలకమని, దానికి మరింత ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు అనేక రెట్లు పెరగాలన్నారు. దీని విస్తరణకు దోహదపడేలా ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు తీసుకుందని తెలిపారు. పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులు ఇప్పుడు అత్యవసరమని, దాన్ని క్రియాశీలంగా కొనసాగించాలని, ఇది ఈ సమయానికి తక్షణావసరమని స్పష్టం చేశారు. దేశీయ పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి కోసం సమగ్ర వ్యవస్థాగత ఏర్పాటుకు పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో అసాధారణ పెట్టుబడి అవకాశాలున్నాయని స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. ఇటీవలి రవాణా విప్లవంతో లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గాయన్నారు. ‘‘ఇప్పుడు దేశంలో అత్యధిక ఎక్స్‌ప్రెస్ రహదారులు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్యలోనూ యూపీ ముందుంది. ప్రధానమైన రెండు ప్రత్యేక ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకూ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉంది. సాంస్కృతిక వారసత్వ పర్యాటకంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ‘నమామి గంగే’ వంటి కార్యక్రమాలు రాష్ట్రాన్ని సాగరయాన పర్యాటకంలో ప్రముఖ స్థానంలో నిలిపి ఉంచినట్లు’’ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ పథకంతో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే అవకాశం కలిగిందన్నారు. తయారీ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఉత్పత్తిలో యూపీ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోందని, దేశంలో తయారవుతున్న మొబైల్ ఫోన్లలో దాదాపు 55 శాతం ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. సెమీకండక్టర్ రంగంలోనూ భారత్ స్వావలంబనను యూపీ బలోపేతం చేస్తోందని, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఓ ప్రధాన సెమీకండక్టర్ కేంద్రం కార్యకలాపాలను ప్రారంభించబోతోందని చెప్పారు.
మరో ముఖ్యమైన ఉదాహరణగా రక్షణ రంగం గురించి ప్రస్తావిస్తూ... భారత సాయుధ దళాలు స్వదేశీ పరిజ్ఞానాన్ని కోరుకుంటున్నాయని, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. "భారత్ లో రక్షణ రంగాన్ని మరింత శక్తిమంతంగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి వస్తువుపైనా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉండేలా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నాం" అని ప్రధానమంత్రి చెబుతూ.. ఈ మార్పులో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రష్యా సహకారంతో ఏర్పాటు చేసిన కర్మాగారంలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందన్నారు. యూపీలో డిఫెన్స్ కారిడార్ ను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే అక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారీ జరుగుతుందన్నారు. యూపీలో వేగంగా విస్తరిస్తున్న ఎంఎస్ఎంఈలకు బలం చేకూర్చేలా, వాటాదారులు పెట్టుబడులు పెట్టి, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే పూర్తి ఉత్పత్తులు తయారయ్యేలా సామర్థాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని తెలిపారు.

సంస్కరణలు చేయటం, వాటిని అమలు చేయటం, పరివర్తన చెందేలా ప్రోత్సహించటం వంటి నిబద్ధతతో పరిశ్రమలు, వ్యాపారులు, పౌరులకు భారత్ అండగా నిలుస్తుందని, తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను మూడు రోజుల కిందట అమలు చేశామని, అవి 'భారత వృద్ధిని నడిపించే నిర్మాణాత్మక మార్పులు' అని శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ సంస్కరణల ద్వారా జీఎస్టీ నమోదు ప్రక్రియ సులభవవటమే కాక, పన్ను వివాదాలు తగ్గుతాయి. ఎంఎస్ఎంఈలకు రీఫండ్స్ త్వరగా అందటం వల్ల అన్ని రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. మూడు విభిన్న దశలు.. జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత, ఇప్పుడు కొత్త జీఎస్టీ సంస్కరణలను వాటాదారులు చూశారని, ఈ మార్పులు గణనీయమైన వ్యత్యాసాన్ని తీసుకువచ్చాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీన్ని ఉదాహరణలతో వివరిస్తూ, 2014కు ముందున్న పన్ను విధానం వల్ల వ్యాపార, ఇంటి ఖర్చుల నిర్వహణ కష్టంగా ఉండేదన్నారు. 2014కు ముందు రూ.1,000 ధర ఉన్న చొక్కాపై రూ.170 పన్ను వసూలు చేసేవారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను రూ.50కి తగ్గిపోయింది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన సంస్కరణల వల్ల అదే రూ.1,000 చొక్కాపై రూ.35 పన్ను విధిస్తున్నారని చెప్పారు.
జీఎస్టీ సంస్కరణలను మరింత స్పష్టంగా మరో ఉదాహరణతో ప్రధానమంత్రి వివరించారు. 2014లో నిత్యావసర వస్తువులైన టూత్ పేస్ట్, షాంపూ, జుట్టుకు వాడే నూనె, షేవింగ్ క్రీమ్ వంటి వస్తువులను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే రూ.31 పన్నుతో కలిపి మొత్తం రూ.131 అయ్యేది. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అదే రూ.100 వస్తువు పన్నుతో కలిపి రూ.118 అయింది. దీంతో రూ.13 మిగిలాయి. అదే వస్తువు ధర 2014తో పోల్చితే కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలయ్యాక రూ.26 తగ్గి రూ.105కు చేరింది. 2014లో ఒక ఇంటికి కావాల్సిన కనీస అవసరాలపై ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేస్తే, దానిపై రూ.20,000 - 25,000 పన్ను చెల్లించేవారు. ఇవాళ, తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో ఆ కుటుంబం కేవలం రూ.5,000 – 6,000 పన్నును చెల్లిస్తోంది. దాదాపు చాలా నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంది.

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ట్రాక్టర్ల పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. 2014కి ముందు ట్రాక్టర్ కొనుగోలు చేస్తే రూ.70,000 పైగా పన్ను కట్టాల్సి వచ్చేది. అదే ట్రాక్టర్ కు ఇప్పుడు రూ.30,000 మాత్రమే పన్ను విధిస్తున్నారు. దీనివల్ల రైతుకు రూ.40,000 పొదుపు అవుతుంది. పేద ప్రజలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే మూడు చక్రాల వాహనాలపై గతంలో రూ.55,000 పన్ను ఉండగా, ప్రస్తుతం అది రూ.35,000కు తగ్గింది. దీంతో రూ.20,000 ఆదా అవుతున్నాయి. అదేవిధంగా జీఎస్టీ రేట్లు తగ్గటంతో 2014తో పోల్చితే ఇప్పుడు స్కూటర్లపై రూ.8,000, మోటార్ సైకిళ్లపై రూ.9,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆదా అయిన మొత్తం పేద, నూతన-మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనకరమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయని, వారి పదవీకాలంలో విధించిన అధిక పన్నులు, సామాన్యులకు భారంగా మారాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పన్నులు తగ్గించామని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించామని, ప్రజల ఆదాయం, సేవింగ్స్ రెండూ పెరిగేలా చేశామని ప్రధానమంత్రి తెలిపారు. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వటం, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలు ఈ ఒక్క ఏడాదిలోనే రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేసుకోగలిగారన్నారు. దేశం జీఎస్టీ పొదుపు పండగ జరుపుకుంటుందని, ప్రజల సహకారంతో జీఎస్టీ సంస్కరణల్లో వేగం కొనసాగుతుందన్నారు.

ప్రజాస్వామ్య, రాజకీయ స్థిరత్వం, విధానపరమైన అంచనాలతో పాటు సంస్కరణల పట్ల భారత్ దృఢమైన సంకల్పంతో ఉందని ప్రధానమంత్రి తెలిపారు. భారతదేశంలో నైపుణ్యం గల శ్రామిక శక్తి, చైతన్యవంతమైన యువ వినియోగదారులు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి కలయిక ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఏ పెట్టుబడిదారుడికైనా, కంపెనీకైనా వారి అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టేందుకు భారత్ ఆకర్షణీయమైన అవకాశాలను అందిస్తుందని శ్రీ మోదీ అన్నారు. భారత్ లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడి పెట్టటం వల్ల ఇరువర్గాలకు లాభదాయకమని తెలిపారు. అందరం కలిసి ప్రయత్నిస్తేనే అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తూ ఉత్తరప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన – 2025 (యూపీఐటీఎస్-2025)ను ప్రధానమంత్రి ప్రారంభించారు.

'సర్వం ఇక్కడే లభ్యం' అనే ఇతివృత్తంతో ఈ వాణిజ్య ప్రదర్శన ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మూడు ప్రధాన లక్ష్యాలున్నాయి. ఆవిష్కరణ, అనుసంధానం, అంతర్జాతీయీకరణ. అంతర్జాతీయ కొనుగోలుదారులు, దేశీయ బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) కొనుగోలుదారులు, దేశీయ బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) కొనుగోలుదారులే లక్ష్యంగా ఉండే కొనుగోలుదారుల వ్యూహం.. ఎగుమతిదారులు, చిన్న వ్యాపారాలు, వినియోగదారులకు ఒకే రకమైన అవకాశాలను కల్పిస్తుంది.
యూపీఐటీఎస్-2025 రాష్ట్రంలోని వివిధ చేతి వృత్తుల వారిని, ఆధునిక పరిశ్రమలను, ఎంఎస్ఎంఈలను, నూతన పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి చేర్చుతుంది. ఈ కార్యక్రమంలో హస్తకళలు, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమ, వ్యవసాయం, ఆహార శుద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆయుష్ వంటి కీలక రంగాలు ప్రాతినిథ్యం వహించాయి. ఇది ఉత్తరప్రదేశ్ లోని కళలు, సంస్కృతి, వంటకాలను ఒకే వేదికపై ప్రదర్శిస్తుంది.
ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతిక మార్పిడి, దీర్ఘకాలిక సహకారం అందించేందుకు భాగస్వామి దేశంగా రష్యా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నది. ఈ వాణిజ్య ప్రదర్శనలో 2,400 కంటే ఎక్కువ మంది ప్రదర్శనకారులు, 1,25,000 మంది బీ2బీ సందర్శకులు, 4,50,000 మంది బీ2సీ సందర్శకులు ఈ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొంటారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Platforms for All, Progress for All. pic.twitter.com/DuZe3M2vyL
— PMO India (@PMOIndia) September 25, 2025
Despite global disruptions and uncertainty, India's growth remains remarkable. pic.twitter.com/O8jgovHPzi
— PMO India (@PMOIndia) September 25, 2025
India must become self-reliant. Every product that can be made in India should be made in India. pic.twitter.com/1eDK1mPQB2
— PMO India (@PMOIndia) September 25, 2025
In India, we are developing a vibrant defence sector, creating an ecosystem where every component bears the mark of 'Made in India.' pic.twitter.com/G1dDTA2OrO
— PMO India (@PMOIndia) September 25, 2025
The structural reforms in GST are set to give new wings to India's growth story. pic.twitter.com/ZRBZ7rNjsi
— PMO India (@PMOIndia) September 25, 2025


