10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 65 లక్షలకుపైగా ఆస్తి కార్డుల పంపిణీ
“మేము స్వామిత్వ యోజనను ప్రారంభించి దేశంలోని గ్రామాల్లో డ్రోన్లతో ఇళ్లు.. భూముల మ్యాపింగ్ ద్వారా ప్రజలకు నివాస ఆస్తి పత్రాలివ్వాలని నిర్ణయించాం”
“క్షేత్రస్థాయిలో గ్రామ స్వరాజ్యం అమలుకు మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోంది”
“స్వామిత్వ యోజనతో గ్రామీణాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన-అమలు నేడెంతో మెరుగవుతున్నాయి”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్వామిత్వ పథకం కింద 65 లక్షలకుపైగా ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 230కిపైగా జిల్లాల్లోని 50,000కుపైగా గ్రామాల ప్రజలు వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- అనేక గ్రామాలు-గ్రామీణ ప్రాంతాలకు ఇది చరిత్రాత్మక దినమని, ఇందుకుగాను లబ్ధిదారులతోపాటు పౌరులందరికీ అభినందనలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

   గ్రామీణ ప్రజానీకానికి తమ ఆస్తి హక్కును నిర్ధారించే కార్డుల జారీ లక్ష్యంగా ఐదేళ్ల కిందట స్వామిత్వ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధాని గుర్తు చేశారు. ఈ ఆస్తి యాజమాన్య హక్కు పత్రాలను ఆయా రాష్ట్రాల్లో “ఘరోని, అధికార్ అభిలేఖ్, ఆస్తి కార్డు, మల్మత్తా పత్రక్‌, ఆవాసియా భూమి పట్టా”గా వ్యవహరిస్తాయని ఆయన పేర్కొన్నారు. “ఈ పథకం కింద గత 5 సంవత్సరాల్లో 1.5 కోట్లకుపైగా స్వామిత్వ కార్డులు జారీ అయ్యాయి” అని శ్రీ మోదీ అన్నారు. తాజాగా నేటి కార్యక్రమంలో 65 లక్షలకుపైగా కుటుంబాలకు ఈ కార్డులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద స్వామిత్వ యోజన కింద  దాదాపు 2.25 కోట్ల గ్రామీణ ప్రజానీకం నివాసాలకు చట్టపరమైన హక్కును నిర్ధారించే పత్రాలు అందాయని ప్రధానమంత్రి చెప్పారు. దీనిపై లబ్ధిదారులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

   ప్రస్తుత 21వ శతాబ్దం వాతావరణ మార్పు సహా నీటి కొరత, ఆరోగ్య సంక్షోభాలు, మహమ్మారి విజృంభణ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని ప్రధాని గుర్తు చేశారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ఆస్తి హక్కులు, చట్టపరమైన ఆస్తి పత్రాలు లేకపోవడం కూడా నేడు మరో ముఖ్యమైన సవాలుగా పేర్కొన్నారు. ఈ మేరకు అనేక దేశాల్లో ఈ సమస్య ఉన్నదని ఐక్యరాజ్యసమితి అధ్యయనం వెల్లడించిందని ఉటంకించారు. పేదరిక నిర్మూలనలో ప్రజలకు ఆస్తి హక్కుల నిర్ధారణ అవసరమని ఈ అధ్యయనంలో భాగంగా ఐరాస స్పష్టం చేసినట్లు చెప్పారు. ఒక ప్రసిద్ధ ఆర్థికవేత్త గ్రామీణుల ఆస్తి హక్కుల సమస్యపై తన రచనలో వారి ఆస్తిని చట్టబద్ధ గుర్తింపులేని “నిర్జీవ మూలధనం”గా అభివర్ణించారని ప్రధాని ఉదాహరించారు. అటువంటి ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం ఉండదు కాబట్టి, కుటుంబ ఆదాయం మెరుగుకు ఎలాంటి అవకాశాలూ ఉండవన్నారు. ఈ ఆస్తి హక్కు సంబంధిత అంతర్జాతీయ సవాలుకు భారత్‌ అతీతం కాదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రజల సామూహిక ఆస్తి విలువ లక్షల కోట్లలో ఉన్నప్పటికీ, దానికి సంబంధించి చట్టపరమైన హక్కు పత్రాలు లేనందున వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అలాగే కొందరు బలమైన వ్యక్తులు బలహీనుల భూములను కబ్జా చేస్తుండటం కూడా మనకు తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా చట్టపరమైన హక్కు పత్రాలు లేనందువల్ల వాటి తాకట్టుకు బ్యాంకులు కూడా విముఖత వ్యక్తం చేస్తాయని ఆయన అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టలేదని ప్రధాని గుర్తుచేశారు. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా 2014లో స్వామిత్వ యోజన అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. అవగాహనగల  ఏ ప్రభుత్వమూ దేశంలోని గ్రామీణులను ఇంతటి కష్టాల్లోకి నెట్టదని ప్రధాని స్పష్టం చేశారు. స్వామిత్వ యోజన గురించి వివరిస్తూ- డ్రోన్లతో గ్రామాల్లోని ఇళ్లు, భూముల మ్యాపింగ్‌ ద్వారా ప్రజలకు ఆస్తి హక్కు నిర్ధారించే చట్టపరమైన పత్రాలు జారీ చేయడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమయ్యాక దాని ప్రయోజనాలేమిటో ఇప్పుడు ప్రస్ఫుటం అవుతున్నాయని చెప్పారు. ఈ పథకంతో తమ జీవితాల్లో వచ్చిన ప్రగతిశీల మార్పుపై లబ్ధిదారులతో గతంలో తన సంభాషణను ప్రధాని ప్రస్తావించారు. వారంతా నేడు తమ ఆస్తుల హామీతో బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందగలుగుతున్నారని చెప్పారు. ఈ పథకంతో వారి హృదయాల్లో నిండిన ఆనందం, వారి వదనాల్లో మెరిసే సంతృప్తి తనకు స్పష్టంగా గోచరిస్తున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇది తనకొక గొప్ప ఆశీర్వాదమని ఆయన అభివర్ణించారు.

 

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “దేశంలో 6 లక్షలకుపైగా గ్రామాలుంటే, వాటిలో దాదాపు సగం గ్రామీణ ప్రాంతాల్లోఓ డ్రోన్ సర్వే పూర్తయింది” అని వెల్లడించారు. హక్కు నిర్ధారణ పత్రాలు అందుకున్న లక్షలాది ప్రజలు వాటి ద్వారా బ్యాంకు రుణాలు పొంది చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ లబ్ధిదారులలో అధికశాతం చిన్న,  మధ్యతరహా రైతు కుటుంబాలేనని, ఆస్తి కార్డులు వారి ఆర్థిక భద్రతకు ఎంతో భరోసా ఇచ్చాయని అన్నారు. ఆస్తుల కబ్జా, సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాలతో దళిత, వెనుకబడిన, గిరిజన కుటుంబాల వారు ఎక్కువగా నష్టపోయారని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు వారి ఆస్తి యాజమాన్య హక్కుకు చట్టబద్ధత లభించడంతో ఈ సంక్షోభం నుంచి విముక్తులవుతారని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామాలన్నిటా ఆస్తి కార్డులు జారీ పూర్తయ్యాక రూ.100 లక్షల కోట్లకుపైగా ఆర్థిక కార్యకలాపాలు సాగే అవకాశం ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయ స్థాయిలో మూలధనం సమకూరుతుందని ప్రధానమంత్రి స్పష్టీకరించారు.

   “క్షేత్రస్థాయిలో గ్రామ స్వరాజ్యం అమలుకు మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. అలాగే స్వామిత్వ యోజనతో గ్రామీణాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. స్పష్టమైన మ్యాప్‌లు, జనావాస ప్రాంతాలపై పరిజ్ఞానంతో అభివృద్ధి పనుల ప్రణాళికలలో కచ్చితత్వం ఉంటుందన్నారు. తద్వారా ప్రణాళిక లోపంతో ఎదురయ్యే అడ్డంకులు, నిధుల వృథా తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తి హక్కు నిర్ధారణతో పంచాయతీ భూమి, మేత భూముల గుర్తింపు వంటి భూ యాజమాన్య వివాదాలు పరిష్కారం కాగలవన్నారు. తద్వారా పంచాయతీలు ఆర్థిక సాధికారత సాధించగలవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్తి కార్డుల వల్ల గ్రామాల్లో విపత్తు నిర్వహణ కూడా మెరుగవుతుందని తెలిపారు. అగ్నిప్రమాదాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి దుర్ఘటనల సమయంలో పరిహారం పొందడం సులభమవుతుందని చెప్పారు.

 

   రైతులకు భూ వివాదాలు సర్వసాధారణమని, దాంతోపాటు భూమి పత్రాలు పొందడం సమస్యాత్మకమన్నది వాస్తవమేనని చెప్పారు. తరచూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవని, ఈ పరిణామం అవినీతికి దారితీస్తుందని ప్రధానమంత్రి  పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులు తొలగించడానికే భూమి రికార్డుల డిజిటలీకరణ చేపట్టామని చెప్పారు. స్వామిత్వ, భూ-ఆధార్ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి తోడ్పడే ప్రాథమిక వ్యవస్థలని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటిదాకా 23 కోట్ల భూ-ఆధార్ నంబర్లు జారీచేశారని, దీంతో భూమికి ఒక విశిష్ట గుర్తింపు లభిస్తుంది కాబట్టి, వాటిని సులువుగా గుర్తించవచ్చునని తెలిపారు. “గత 7-8 సంవత్సరాల్లో దాదాపు 98 శాతం మేర భూమి రికార్డుల డిజిటలీకరణ పూర్తయింది. వాటి మ్యాపులు కూడా ఇప్పుడు డిజిటల్‌ రూపంలో లభిస్తాయి” అని శ్రీ మోదీ వెల్లడించారు.

   భారతదేశ ఆత్మ దాని గ్రామాల్లోనే ఉంటుందన్న మహాత్మా గాంధీ విశ్వాసాన్ని ఉటంకిస్తూ- ఈ దార్శనికత గత దశాబ్ద కాలంలో వాస్తవ రూపం దాల్చిందని  ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ మేరకు పదేళ్ల వ్యవధిలో 2.5 కోట్లకుపైగా కుటుంబాలు విద్యుత్తు సదుపాయం పొందాయని, వీరిలో అధికశాతం గ్రామీణులేనని చెప్పారు. అలాగే 10 కోట్లకుపైగా కుటుంబాలు మరుగుదొడ్డి సౌకర్యం పొందగా, 10 కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు లభించాయని చెబుతూ, వీరిలోనూ అత్యధికంగా గ్రామీణులేనని వివరించారు. ఇక గడచిన ఐదేళ్లలో 12 కోట్లకుపైగా కుటుంబాలు కొళాయి కనెక్షన్లు పొందగా, విశేషించి 50 కోట్ల మందికిపైగా గ్రామీణులు బ్యాంకు ఖాతాలు తెరిచారని పేర్కొన్నారు. మరోవైపు 1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కాగా, వీటిలో అత్యధికం గ్రామాల్లోనే ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణులు- ముఖ్యంగా దళిత, వెనుకబడిన, గిరిజన కుటుంబాల వారు దశాబ్దాలుగా కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదన్నారు. ఇప్పుడు వీరంతా ఇటువంటి సౌకర్యాలు పొందడంలో ప్రధాన లబ్ధిదారులని పేర్కొన్నారు.

   గత దశాబ్దంలో గ్రామాల్లో రహదారుల మెరుగు దిశగా అసాధారణ కృషి కొనసాగిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. తొలుత 2000 సంవత్సరంలో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. అప్పటినుంచి సుమారు 8.25 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తికాగా, అందులో దాదాపు సగం గత పదేళ్లలోనే నిర్మితమైనట్లు తెలిపారు. దీంతోపాటు మారుమూల సరిహద్దు గ్రామాల అనుసంధానం దిశగా ‘వైబ్రంట్ విలేజ్” కార్యక్రమం అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం విస్తరణకూ తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని పేర్కొన్నారు. దేశంలో 2014కు 100కన్నా తక్కువ పంచాయతీలకు మాత్రమే బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ కనెక్షన్లు ఉండేవని గుర్తుచేశారు. అయితే, గత 10 సంవత్సరాల్లోనే 2 లక్షలకుపైగా పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం విస్తరించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సార్వత్రిక సేవా కేంద్రాల సంఖ్య కూడా 1 లక్షకన్నా తక్కువ స్థాయి నుంచి 5 లక్షలకు పెరిగిందన్నారు. గ్రామాలకు ఆధునిక సదుపాయాల విస్తరణ, ప్రజలకు వివిధ సౌకర్యాల కల్పనకు ఈ గణాంకాలన్నీ సాక్ష్యమిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గతకాలంలో ఇవి నగరాలకు మాత్రమే పరిమితం కాగా, నేడు గ్రామాలకు విస్తరణతో జీవన సౌలభ్యం మెరుగు కావడమేగాక గ్రామీణ ఆర్థిక సాధికారతను బలోపేతం చేసిందని చెప్పారు.

 

   గ్రామీణ ప్రాంతాలు, రైతుల సంక్షేమం లక్ష్యంగా కీలక నిర్ణయాలతో కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కాగా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కొనసాగిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ పథకం కింద రైతులకు దాదాపు రూ.2.25 లక్షల కోట్లదాకా ప్రయోజనం లభించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డీఏపీ ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ- రైతులకు సరసమైన ధరకు ఎరువులు అందించేందుకు రూ.వేల కోట్లు కేటాయించిందని శ్రీ మోదీ వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో ఇందుకోసం దాదాపు రూ.12 లక్షల కోట్లదాకా వెచ్చించగా, 2014కు ముందు దశాబ్దంలో చేసిన ఖర్చుకు ఇది దాదాపు రెట్టింపు మొత్తమని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ.3.5 లక్షల కోట్లదాకా బదిలీ చేసినట్లు చెప్పారు. రైతుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   అలాగే “వికసిత భారత్‌ నిర్మాణంలో నారీశక్తి కీలకపాత్రను గుర్తిస్తూ గత దశాబ్దంలో ప్రతి ప్రధాన పథకంలోనూ మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం” అని శ్రీ మోదీ చెప్పారు. ఇందులో భాగంగా అమలులోకి తెచ్చిన ‘బ్యాంక్ సఖి’, ‘బీమా సఖి’ వంటి కార్యక్రమాలు గ్రామీణ మహిళలకు కొత్త అవకాశాలను సృష్టించాయని చెప్పారు. అంతేకాకుండా ‘లక్షాధికారి సోదరి’ యోజన కింద దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మందికిపైగా మహిళలు లక్షాధికారులు కాగలిగారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా స్వామిత్వ యోజన మహిళల ఆస్తి హక్కును బలోపేతం చేసిందని, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు భర్త పేరుతోపాటు భార్యపేరును కూడా చేర్చినట్లు శ్రీ మోదీ ఉటంకించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, పేదలకు మంజూరు చేసే ఇళ్లలో అధికశాతం మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు. మహిళల ఆస్తి హక్కు నిర్ధారణలో స్వామిత్వ యోజన డ్రోన్ల సర్వే కూడా యాదృచ్ఛికంగా తనవంతు సానుకూల పాత్ర పోషించిందని పేర్కొన్నారు. స్వామిత్వ యోజనలో భాగంగా ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం కింద మ్యాపింగ్ పని చేపడుతుండగా, ఈ డ్రోన్లకు గ్రామీణ మహిళలు పైలట్‌లుగా మారారని వివరించారు. దీంతోపాటు వ్యవసాయంలోనూ వీరు తమవంతు సహాయం అందిస్తూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారని ఆయన తెలిపారు.

   స్వామిత్వ యోజనతో గ్రామీణ జీవనంలో ప్రగతిశీల మార్పు రాగా, ప్రజానీకానికి సాధికారత లభించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గ్రామాలు, పేదలు బలోపేతం కావడంతో అభివృద్ధి చెందిన భారత్‌వైపు ప్రయాణం సులువు కాగలదని స్పష్టం చేశారు. ఈ దిశగా గత దశాబ్దంలో చేపట్టిన చర్యలతో 25 కోట్ల మంది పేదరిక విముక్తులయ్యారని గుర్తుచేశారు. చివరగా- స్వామిత్వ వంటి పథకాలు గ్రామాలను బలమైన ప్రగతి కూడళ్లుగా మార్చగలవని విశ్వాసం ప్రకటిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

 

   ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లతోపాటు జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు సహా ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు; కేంద్ర పంచాయతీరాజ్‌, మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, పలువురు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

నేపథ్యం

   గ్రామీణ ఆవాస ప్రాంత ప్రజానీకానికి ‘ఆస్తి హక్కు రికార్డు’ ప్రదానం ద్వారా గ్రామీణ భారత ఆర్థిక ప్రగతికి ఉత్తేజమిచ్చే లక్ష్యంతో దార్శనిక స్వామిత్వ యోజనకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. దీనికింద ఆధునిక డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గ్రామాల్లో భూముల, నివాసాలపై సర్వే నిర్వహించి మ్యాపింగ్‌ చేశారు.

   ఈ పథకంతో ఆస్తుల నగదీకరణకు, బ్యాంకు రుణాల రూపంలో వ్యవస్థాగత రుణ సౌలభ్యం పొందడానికి వీలు కలుగుతుంది. అలాగే ఆస్తి సంబంధిత వివాదాలు తగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, ఆస్తి పన్ను సజావుగా అంచనా వేసే వెసులుబాటు లభిస్తుంది. తద్వారా సమగ్ర గ్రామీణ ప్రణాళికల రూపకల్పన సాధ్యమవుతుంది.

   ఈ పథకం కింద ఇప్పటిదాకా 3.17 లక్షలకుపైగా గ్రామాల్లో- అంటే 92 డ్రోన్ సర్వే పూర్తయింది. వీటిలో 1.53 లక్షలకుపైగా గ్రామాల ప్రజానీకానికి దాదాపు 2.25 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధమయ్యాయి.

  ఈ పథకం ప్రస్తుతం పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, హర్యానాలలో సంతృప్త స్థాయిలో అమలు కాగా- మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సహా అనేక కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా డ్రోన్ సర్వే పూర్తయింది.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why industry loves the India–EU free trade deal

Media Coverage

Why industry loves the India–EU free trade deal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights Economic Survey as a comprehensive picture of India’s Reform Express
January 29, 2026

The Prime Minister, Shri Narendra Modi said that the Economic Survey tabled today presents a comprehensive picture of India’s Reform Express, reflecting steady progress in a challenging global environment. Shri Modi noted that the Economic Survey highlights strong macroeconomic fundamentals, sustained growth momentum and the expanding role of innovation, entrepreneurship and infrastructure in nation-building. "The Survey underscores the importance of inclusive development, with focused attention on farmers, MSMEs, youth employment and social welfare. It also outlines the roadmap for strengthening manufacturing, enhancing productivity and accelerating our march towards becoming a Viksit Bharat", Shri Modi stated.

Responding to a post by Union Minister, Smt. Nirmala Sitharaman on X, Shri Modi said:

"The Economic Survey tabled today presents a comprehensive picture of India’s Reform Express, reflecting steady progress in a challenging global environment.

It highlights strong macroeconomic fundamentals, sustained growth momentum and the expanding role of innovation, entrepreneurship and infrastructure in nation-building. The Survey underscores the importance of inclusive development, with focused attention on farmers, MSMEs, youth employment and social welfare. It also outlines the roadmap for strengthening manufacturing, enhancing productivity and accelerating our march towards becoming a Viksit Bharat.

The insights offered will guide informed policymaking and reinforce confidence in India’s economic future."